తెల్సా (తెలుగు సొసైటీ అఫ్ అమెరికా) సాహితీ లక్ష్యాలలో తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, చేతనైనంత అభివృద్ధి చెయ్యడం ముఖ్యమైనవి. ఈ సాహితీ లక్ష్యాలలో భాగమే విశ్వమారి విరామం తర్వాత పెట్టిన కథ, కవితల పోటీ. తెల్సాకి ముఖ్యమైన యితర లక్ష్యాలున్నాయి, వాటిని గురించి The Telsa Story లో చదవండి.
తెల్సా బృందానికి 1997 నుంచీ నవలల, కథల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా విస్తారమైన అనుభవం ఉంది. ఈ సారి కూడా పోటీప్రకటన ముద్రించడం వరకు మాత్రమే సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఈనాడు, సారంగ వెబ్‌పత్రిక వారి సహకారం కోరాం. వచ్చిన రచనలను శ్రద్ధగా చదవడం, వడపోత పోయడం, సమీక్షించడం, ఆన్లైనులో వెబ్ పత్రిక చేయడం వంటివి మా బృందమే చేసింది.
తెల్సా కవితల పోటీకి దాదాపు 150 కవితలు వచ్చాయి. మాకు వచ్చిన కవితలన్నిటినీ శ్రద్ధగా పరిశీలించాము. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పత్రికల పరిస్థితి గురించి చెప్పుకోవాలి – కరోనా విశ్వమారి వల్లనో, చాలా కాలం నుంచి సర్క్యులేషన్ క్షీణిస్తున్న కారణాలవల్లనో చాలా పత్రికలు మూతపడ్డాయి. కవులకి సినిమా పాటలు వ్రాయడం తప్పితే మంచి జీవనోపాధి లేదు, ఒక కవిత ప్రచురింపబడితే అందే పారితోషికం చాలా తక్కువ. ఇటువంటి నేపథ్యంలో పెద్ద బహుమతులు ప్రకటించిన మా కవితల పోటీకి వాసి ఎక్కువగా ఉండి దీర్ఘకాలం మన్నే కవితలు వస్తాయని ఆశించేము.
ఇది కూడా చదవండి 2019 తెల్సా కథల పోటీలో బహుమతి పొందిన రచనల ప్రత్యేక సంచిక సంగతి – 2019
కానీ, వచ్చిన కవితల్లో మేము ప్రకటించిన బహుమతులు అందుకొనే కవితలు దొరకలేదు. అయినా, కవులను ప్రోత్సాహపరిచే ఉద్దేశంతో, కవితల పోటీకి వచ్చిన కవితల్లో కొన్ని విశిష్టమైన కవితల్ని ఎంపిక చేసి నాలుగు కవితలకు ₹10,000 చొప్పున, మరొక మూడు కవితలకు ₹8,000 చొప్పున పారితోషికం ఇద్దామని నిర్ణయించాము. మేము ముందు అనుకొన్న బహుమతి మొత్తం కంటే దాదాపు రెట్టింపు పారితోషికం అందించాము.
“ఆగిపోయిన చోటునుండే”: భూత, వర్తమానాల కొనసాగింపు భవిష్యత్తు. ఆగి చూసుకుని, నెమరు వేసుకొని, ముందుకు నడవడమే కర్తవ్యం అని చెప్పే నర్మగర్భమైన కవిత. కవితలో ఉన్న తలపోత గాఢంగా, నిజాయితీగా అనిపిస్తోంది. ఎక్కడా వాచ్యం చెయ్యకుండా, అందీ అందనట్టుగా కవిత మొత్తం నిర్వహించటం బాగుంది. ఆలోచనలు “బొట్లుబొట్లుగా రాలటం”, “గుండెల్లో బిగించిన లంగరు నుండి విముక్తి కోసం తెప్ప ఊగిసలాడటం” వంటి పదచిత్రాలు కొత్తగా, ప్రభావవంతంగా ఉన్నాయి. పాఠకుడికి తన అవగాహన మేరకు ఆలోచించుకునే వెసులుబాటు ఈ కవిత ఇస్తుంది.
“ఒకానొక సార్థక సవారీ”: రిక్షా లాగే తండ్రిని, ఆయన శ్రమని, అధిగమించిన కష్టాలని గుర్తు చేసుకుంటూ రాసిన కవిత. “రిక్షాకి కాలం చెల్లచ్చు కానీ, తోడై నడిపిన క్షణాలకి కాదు”, “ఆకుపచ్చటి సార్థక సవారీ” అనడం, “ఎప్పటికీ గుర్తుండే ప్రయాణం” అని ప్రయోగించడం బావుంది.
“నువ్వే ఒక పాలపుంత”: జీవితం ఉత్సవం కావాలి అనే భావనతో ప్రపంచాన్ని చూడడం మంచి ఆలోచన. కవిత క్లుప్తంగా, ఆశావహంగా ఉంది. చిన్నచిన్న వస్తువుల్లో, సామాన్యమైన అనుభవాలలో ఉన్న అందాన్ని, ఆనందాన్ని చక్కగా చూపించటం బాగుంది.
“షష్ఠముడు”: సమాజంలోని అసమానతలను, నిచ్చెన మెట్ల కులవ్యవస్థను, ఆస్తికత్వాన్ని, ఎదిరించే శక్తిగా, విభజన రేఖల ఆవల నిల్చున్న భవిష్యత్ విరాట స్వరూపాన్ని నిలబెట్టిన కవిత. మంచి వ్యక్తీకరణ, క్లుప్తత, గాఢత, చాలా ఆవేదన, ఆక్రోశం ఉన్న కవిత ఇది.
“ఏదో ఒకటి మాట్లాడు” మాట మనిషికి మనిషికి మధ్య సంబంధానికి అవసరమని చెప్పే కవిత.
“నాలోకి నదిని ప్రవహించనీయండి”: ప్రకృతితో మమేకమైన కవి ఆశతో భవిష్యత్తు కేసి చూస్తూన్న కవిత. మనుషుల మధ్య కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలూ ఆశించే కవిత. కవిత ఉత్తమ పురుషలో ఉండడం వల్ల సంధాయకత ఏర్పడింది. చెప్పే అనుభవం పట్ల సొంతదనం, సానుభూతి కలుగుతాయి. ఈ కవితలో దానిని సాధించారు. “తడిసి వణుకుతున్న చంద్రబింబం”, “ఆకాశానికి ఆరేసిన సింధూరం చీర” వంటి పదచిత్రాలు బాగా కుదిరాయి.
“మరణానికి మరో చూపు”: “అందంగా మురిపిస్తే గాలి బుగ్గలు పుణుకుతుంది” వంటి వాక్యాలతో హృద్యంగా ఈ కవిత నిర్మాణం సాగింది. సమ్యక్దృష్టికి బయటా, లోపలా పరిశీలన అవసరం అని ఎత్తి చెప్పే లోతైన కవిత ఇది.
తెలుగు గడ్డకి దూరంగా అమెరికాలో ఓ చిరు సంస్థగా తెలుగు కథల పోటీ నిర్వహిస్తున్నామంటే, దాని వెనకాల ‘ప్రస్తుతకాలంలో తెలుగువారు తమగురించి తాము ఏవిధంగా, ఎంతవరకూ ఆలోచిస్తున్నారు, ఆ అలోచనలని కథ అనే ప్రక్రియ పరిధుల్లో సుందరంగా, హృదయంగమంగా ఎలా వ్యక్తపరుస్తున్నారు?’ అని తెలుసుకునే ప్రయత్నంలో పాలుపంచుకోవాలన్న అభిలాష ఒకటి మాకు ఉంది.
పోటీకి వచ్చిన కథలని సమగ్రంగా చూస్తే, తెలుగువారు తెలుగు జనాలూ, వారి పరిసరాలూ, వీటి పరస్పర సంబంధాలూ, ప్రభావాలూ అనే విషయాలని సున్నితంగా, నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారనీ, ఆ శోధనలని గురించి చక్కటి, సందర్భానుగుణమైన తెలుగులో రాస్తున్నారనీ తేల్చి చెప్పచ్చు. ఇది తెలుగువారిగా మనం సంతోషించదగ్గ విశేషం.
పోటీ అనగానే, వచ్చిన రచనలని కొన్ని నిర్దుష్టమైన కొలబద్దలతో వెలకట్టడం తప్పనిసరి. సార్వజనీనమైన కథాలక్షణాలు కొన్ని ఉంటాయి. కథావిషయం మనసుని తాకే ఓ జీవనసమస్య అయి ఉండాలి. కథని ఎత్తుగడనించి కంచిదాకా దారితప్పకుండా, ఒడిదుడుకులు లేకుండా నడిపించి, పాఠకులని అంతరంగమనే ఇంట్లో దిగబెట్టాలి. అక్కడ పాఠకుడు తీరుబడిగా కూచుని, ‘తాను చదివిన కథ అర్థం ఏమిటి?’ అని ఆలోచించేలా చెయ్యాలి. ఇదంతా కళాత్మకంగా నిర్మించిన మాటల చిత్రపటంలా ఉండాలి.
ఈ లక్షణాలని బట్టి, నిర్ణేతలు పాఠకులుగా, కొండొకచో రచయితలుగా, తమకున్న అనుభవాన్ని పురస్కరించుకుని, కథలని బేరీజు వెయ్యాలి. ఇందులో ఎంత వద్దనునకున్నా, బహుళాభిప్రాయాలని ఎంత సేకరించినా, నిర్ణేతల యొక్క, వారివారి వ్యక్తిగత సంస్కారాల ప్రభావం ఉండక తప్పదు. ఈ ప్రక్రియకి అనుభవజ్ఞుల నిర్ణయం ఒక పార్శ్వం అయితే, వారు (గాడిన నడిచే యంత్రాలు కాక) వివిధసంస్కారాలకి లోనయ్యే మానవులు కావడం మరో పార్శ్వం.
ఈ రెండు పార్శ్వాలూ పోటీలో ఏదోరూపంలో బహుమతి పొందినవారికన్నా, ఎటువంటి గుర్తింపు పొందలేకపోయినవారు ముఖ్యంగా గుర్తించవలసిన అంశాలు. నెగ్గిన రచనల్లో అగుపడే లక్షణవిశేషాలని పరిశీలించి తెలుసుకోవడంతోపాటు, మున్ముందు తమ కృషికి మరో తరుణంలో గుర్తింపు రాకపోదన్న ఆశని నిలబెట్టుకోగలరన్నదే నిర్వాహకులుగా మా మనోరథం.
మానుంచి గుర్తింపు పొందిన కథల్లో అగ్రగణ్యాలు కె. వి వి. సత్యనారాయణ గారి “కర్రెద్దు”, డా. జడా సుబ్బారావుగారి “దాహం.”
“కర్రెద్దు” కథ సుపరిచితమైన పంచతంత్రం కథల పంథాలో “సీను” అనే కర్రెద్దు ముఖతః చెప్పబడినా, చిన్నపిల్లల కథ కాదు. గొడ్డు చాకిరీ, బానిసత్వమూ వ్యక్తి పుంసత్వాన్ని ఎలా హరించి అన్యాయానికి లోబరుస్తాయో ఈ కథ చిత్రీకరిస్తుంది. వీటికి ఎర అయిన వ్యక్తిచేతిలోకే ఒకవేళ ప్రతీకారానికి అవకాశం వస్తే అతడు ఏం చేస్తాడు? ఏం చెయ్యడం ఉచితం? ఈ ప్రశ్నలు ఈ కథకి కీలకాంశాలు.
ఆంగ్లంలో 1940లో ఆఫ్రికన్-అమెరికన్ రచయిత రిచర్డ్ రైట్ రచించిన “నేటివ్ సన్” అనే నవల అపూర్వమైన తీరులో పీడితావస్థ అనేది సంబంధిత పీడితుడి పుంసత్వాన్ని వెర్రితలలు వేయించి, అతణ్ణి పశుప్రాయుడిగా చేసి కిందకీడుస్తుందన్న ఊహని చిత్రీకరిస్తుంది. ఆ కథతో పరిచయంగలవారికి కర్రెద్దు శీను పాత్రలో రిచర్డ్ రైట్ సృష్టించిన బిగర్ థామస్ పాత్ర గోచరిస్తుంది.
బిగర్ థామస్ గమ్యం ఆశావిహీనం, తన స్థితి అర్థం చేసుకునీ అతడు తన గతిని తప్పించుకునే అవకాశం లేదని నిర్ణయించుకుని సహాయం అందించదలచిన సంస్కర్తలని వద్దంటాడు. కర్రెద్దు శీను అందుకు భిన్నంగా తను భౌతికంగా పుంసత్వాన్ని బలవంతంగా కోల్పోయినా, ఏదోఒక మూల తన వ్యక్తిత్వాన్నీ, అస్తిత్వాన్నీ నిలబెట్టుకుంటాడు. కథ చివర్లో ప్రతీకారానికి అవకాశం వచ్చినా, ఆ వ్యక్తిత్వమూ అస్తిత్వమూ ముందుకొచ్చి, అతడు తీసుకున్న నిర్ణయాన్ని నడిపిస్తాయి. వ్యవస్థ వ్యక్తిచేత గొడ్డు చాకిరీ చేయించుకుని, ఉన్నదంతా హరించిన పరిస్థితిలో కూడా ఎలాగోలాగ జీవలేశాన్ని మిగుల్చుకుంటే, అనుకూల పరిస్థితి తటస్థించినప్పుడు అదే వ్యక్తి హుందాతనాన్ని నిలబెట్టగలదన్న ఆశాజనకమైన సందేశాన్ని ఈ కథ పొల్లుపోని గోదావరి మాండలీకంలో, చక్కటి కథనంతో అందిస్తుంది.
వాస్తవ ప్రపంచంలో పరిస్థితులు అనుకూలించడం అనేది అరుదుగా జరిగే విశేషం. సాధారణ వ్యక్తుల జీవితంలో వారిని కూలదోసి విధ్వంసం చేసే పరిసరాలూ, వ్యవస్థా—వీటి పర్యవసనాలు అనివార్యాలై సాగిపోతోంటాయి. ఆ అనివార్యత బిగర్ థామస్ విషయంలో వ్యక్తి లక్షణాలనీ, ప్రవర్తననీ నిర్దేశిస్తే, “దాహం” కథలో , తప్పించుకోలేని పరిస్థితులు ఒక అమాయక వ్యక్తి మనుగడనే దారుణంగా, నిర్దాక్షిణ్యంగా, అడుగడుగూ భయంకరంగా, తప్పనిసరి గమ్యానికి లాక్కెళ్ళడం చూస్తాము. మనుషులు కల్పించిన నీటి ఎద్దడి పరిస్థితిలో మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవాలన్న ఆలోచన ఉండీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గ్రామం ఈ రచన కథాస్థలం. ఆ గ్రామంలో మరీ అసహాయ స్థితిలో నీళ్ళకోసం బయలుదేరిన పంగిడమ్మ ప్రయాణానికి పర్యవసానం ఏమిటి, ఆ పర్యవసానం ఆ గ్రామానికంతా శిక్ష ఎందుకయింది?
కథావిషయానికి తగ్గట్టుగా అపరిమితమైన శ్రధ్ధతో, నేర్పుతో శిల్పాన్ని మలచిన రచయిత ఈ కథలో పరిపూర్ణతని సాధించారంటే అతిశయోక్తి కాదు. పాఠకుడిని కథలోకి దింపి, పదాలకీ, వాక్యాలకీ, అర్థానికీ, అనుభూతికీ, తుదకి పాఠకుడికీ రచయితకీ నడుమ ఆంతర్యాలని అంతం చెయ్యగలిగారు రచయిత. మరీ మరీ చదివి అనుభవించి, వేదనపడి తెలుసుకోవాల్సిన కథ “దాహం.”
జీవితపు వేదనని పరస్పరవ్యతిరేకం అనదగ్గ దృక్పథాలతో ఆలోచనాజనకంగా పరిశీలించిన “కర్రెద్దు”, “దాహం” కథలు రెండూ ప్రథమ స్థానానికి అర్హతని సంపాదించుకున్నాయి.
“దాహం” మాదిరి చిక్కటి భీతావహమైన అనుభూతి కాకపోయినా, కష్టజీవులైన పేదల జీవనపయనంలో శక్తులుడిగిన వార్ధక్యం భయంకరమైనదే. ఇదే మునిసురేష్ పిళ్లె గారి “గేణమ్మ” కథ ఇతివృత్తం. వంట్లో ఓపిక ఉన్నప్పుడు నిలబెట్టుకొచ్చిన నీతినియమాలు — స్వశక్తిమీదే నిలబడాలి, ఒకరిని అర్థించకూడదు — వంటివి బలం పోయి, అన్నం పుట్టడమే సందేహాస్పదమైన ముసలితనంలో గేణమ్మవంటివారికి అక్కరకిరావు. చట్టప్రకారం కాకపోయినా, నైతికపరంగా తనకు చెందవలసిన దానికోసం గేణమ్మ ప్రయాణాన్నీ, పరిణామాన్నీ అందమైన రాయలసీమ మాండలీకంలో కథనా సౌష్టవం అమరేలా చిత్రించారు రచయిత.
పేద గ్రామీణ కుటుంబాల జీవితపయనంలో సౌందర్యం లేకపోలేదు. ఎండపల్లి భారతి గారి “జాలారిపూలు” కథ అటువంటి ఓ కుటుంబం ఒకనాడు అపురూపంగా పూసిన జాలారిచెట్టు పూలు కోసుకుని అమ్ముకున్న ఘట్టాన్ని, “ఇంటికాడ బిడువు ఎత్తుకుని బిడువులేని పనులు చేస్తా ఉండి”పోయిన ఆడకూతురి నోట చెప్పిస్తారు. కలిగినకళ్ళతో లేనివారిజీవితాల సొగసూ సౌందర్యమూ చిత్రించే యత్నాలు చాలామటుకు అబధ్ధపుతోవ పట్టి బూటకాలుగా తయారవుతాయి. ఆ ప్రమాదాన్ని నేర్పరితనంతో తప్పించుకుని నిజాయితీగా చదువరులకి జాలారిచెట్టు పైకొమ్మమీది పూలని చూపించిన ఈ కథ “గేణమ్మ” కథ తో ద్వితీయ స్థానం పంచుకుంది.
మూడవ స్థానంలో కె. వి. మేఘనాథ్ రెడ్డిగారి “వాన మబ్బులు”, పెద్దింటి అశోక్ కుమార్ గారి “ఉల్లిపూసలు” కథలు జతగా నిలిచాయి. ఈ రెండూ గ్రామీణ ప్రాంతపు కథలే, రెండూ ఇల్లాళ్ళ బరువు బాధ్యతల చిత్రాలే. “వాన మబ్బులు” కథలో సామాన్య రైతుకుటుంబపు ఇల్లాలు, పనికిమాలిన భర్త ఉండీ ఒంటరి దానికిమల్లేనే భర్తా, పిల్లలా, అత్తగార్ల పోషణతోబాటు, వ్యవసాయం పనులు కూడా చూసుకుంటుంది. గతంలో ఆమె తండ్రి తీసుకొన్న నిర్ణయం నేపధ్యంలో, ఎట్టిపరిస్థితిలోనూ తన కూతురికి తనమాదిరి గతి పట్టనియ్యరాదని వర్తమానంలో, అనుమానాస్పదంగా ఉన్న వానమబ్బులు చూసి ఆమె తీర్మానించుకుంటుంది.
కన్నకూతురి మేలుకోసం దేన్నైనా ఎదిరించే తల్లి సంకల్పబలమే “ఉల్లిపూసలు” కథకి కూడా మూల సూత్రం. ప్రమాదంలో అల్లుడు చనిపోయిన తరుణంలో తంతులూ, సమాజపు కట్టుబాట్లూ అని పేరు పెట్టి బిడ్డ పడుతున్న బాధని నిష్కారణంగా మరింత పెంచుతున్న మగాళ్ళనెదిరించి నిలబడి, వాళ్ళ నోళ్ళు మూయించిన తల్లి ధైర్యం కథకి ఆయువు పోస్తుంది.
అశుభకార్యాలూ అపరకర్మలతోబాటు వివాహాలూ, వేడుకలూ కూడా అత్తెసరు గ్రామీణ రైతు కుటుంబాల జీవన యాత్రల్లో ఘట్టాలే. విశిష్టరచనగా ఎంపికైన ఎండపల్లి భారతి గారి “ఆరంజ్యోతి మాకు కనపడే, ఆర్నెల్ల అప్పుతో” అనే కథలో, కూతురి పెళ్ళప్పుడు ఆమె ముచ్చట్లు తీర్చడానికని అత్తెసరు రైతు దంపతులు, అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చడానికిగాను ఆ దంపతులు అదనపు రాబడి కోసం ఏం చేస్తారు? ఆ నిర్ణయం వాళ్ళ జీవితాల్లో ఎలా టెన్షన్ పెంచుతుంది? కనపడీ కనపడని అరుంధతీ నక్షత్రంలా ఆశాకిరణమొకటి దంపతుల జీవితంలో ఎలా మెరుస్తుంది?
ఆశ మృగ్యమై, ఆత్మన్యూనతలో చిక్కుబడిపోయి, తనెందుకూ పనికిరాని, విలువలేని “వేస్ట్ బాడీ” అన్న సందేశమే సమాజం నుంచి వినబడితే, ఆ వ్యక్తి గతి ఏమవుతుంది? మరో విశిష్టరచనగా ఎంపికయిన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిగారి “వేస్ట్ బాడీ” కథ మనల్ని అటువంటి వ్యక్తి అంతరంగంలోకి తీసుకెళ్ళి, నిరాశా నిస్పృహల తత్వాన్ని పాఠకులచేత తాత్విక రీతిలో అధ్యయనం చేయిస్తుంది. తన స్వీయ జీవితావస్థ అసలెంతమాత్రం మానవుడి స్వాధీనంలోఉంది? అన్న ప్రశ్నని పుట్టిస్తుంది.
ఈ కథలు కాక, ఈ క్రింది కథలని కూడా సత్కరించి, సాధారణ ప్రచురణకి తీసుకొన్నాము.
బహుమతులకు ఎంపిక అయిన రచయితలందరికీ మా అభినందనలు. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా ధన్యవాదాలు. కథలకూ, కవితలకూ తనదైన శైలిలో అందమైన బొమ్మలు సమకూర్చిన అన్వర్ గారికి మా కృతజ్ఞతలు.
ఈ కథలు, కవితలతో పాటు 2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన ఏడు కథలను కూడా ప్రచురిస్తున్నాము. ఈ కథలకు పారితోషికం పంపినా, అనివార్య కారణాలవల్ల ఈ కథలను అప్పుడు ప్రచురించలేకపోయాము. ఆ కథలకు ప్రత్యేకంగా చిత్రాలు వేయించి ఇప్పుడు ప్రచురిస్తున్నాము. ఈ కథలకు చిత్రాలు సమకూర్చిన “ఉత్తయ్య”కు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
–మల్లిక్ కేశవరాజు
Leave a Reply