తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

విశ్వాసం

బాడిశ హన్మంతరావు
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
© Telugu Society of America

“ఏరా ! రేపు ఏదైనా పని ఉందా?” హైదారాబాద్ నుండి మా అన్న ఫోన్‌లో.

“ఈ క్షణానికైతే, ఏమీ లేనట్లే!” కొంచెం సేపు ఆలోచించి అన్నాను.

“మరైతే, రేప్పోద్దున్నే బయలుదేరి వచ్చేయ్”

“ఇప్పుడూ ఖాళీనే, బయలుదేరనా?” సరదాగా అన్నాను.

“మరీ మంచిది, అలాగే కానీ!”

“ఓ, ఓ, గుర్రాన్ని కట్టేయ్, ఏమిటీ సంగతి”

” మర్చిపోయావా? రేపే కదా!”

రేపటి రోజున మా వాళ్లెవరివయినా పుట్టిన రోజులు గానీ, పెళ్లి రోజులు గానీ వగైరా ఆలోచించి, చించి, ఊహూ, లాభం లేదు అనుకొని, “వదిన ఉందా? ఏం చేస్తోంది? ఒక సారి ఫోన్ వదినకివ్వు” అస్త్రం ప్రయోగించాను. వదిన లైన్లోకి రాగానే, “రేపు అమ్ములు వస్తోంది కదా! ఫ్లైట్ టైమ్ మధ్యాహ్నం రెండున్నర. మీ అన్నయ్య చెప్పలేదా?” అంది.

అప్పుడు వెలిగింది ట్యూబ్ లైట్. “చెప్పాడు వదినా, నేనే మర్చిపోయాను”

“రేపు మీ అన్నయ్యకి ఆఫీసులో ఇన్‌స్పెక్షన్ ఉంది, అనుకోకుండా. అందుకే దాన్ని ఏర్పోర్ట్ నుండి తీసుకురమ్మనడానికి ముందే రమ్మంటున్నాడు”

“మరి చిన్నా లేడా!”

“వాడికీ ఉస్మానియా కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏదో మీటింగ్ ఉంది. ఒక వేళ అదీ లేటయితే ఎలాగా? నాకేమో తను వచ్చేసరికల్లా ఏమేమి వండి ఉంచాలో పెద్దజాబితానే చెప్పింది. ఎవరూ వెళ్లకుండా టాక్సీలో రమ్మంటే, ఇక్కడ ఉన్నన్ని రోజులూ అలుగుతుంది. వచ్చిన మురిపెం ఆవిరే!”

“నిజమే. అయినా మనకలాంటి అర్జెంట్ పనులేమీ లేవు, రేపు ఉదయం వచ్చేస్తున్నానని అన్నయ్యతో చెప్పు” ఫోన్ పెట్టేశాను.

అమ్ములు అంటే మా అన్న కూతురి ముద్దుపేరు. అసలు పేరు బిందుప్రియ. ఎమ్మెస్ చేయడానికి యూఎస్ వెళ్లి, పూర్తి చేసుకొని, అక్కడే జాబ్ చేస్తోంది. క్రిస్మస్ సెలవులకి కొన్ని సెలవులు కలుపుకొని ఇండియా వస్తోంది. ఈ ప్రోగ్రాం రెండు నెలల కిందనే ప్లాన్ చేసుకుంది. కొత్త సంవత్సరం ఇక్కడే జరుపుకోవాలని తన ఆలోచన. చిన్నా అంటే తన తమ్ముడు హరి.


ఉదయం 10.30 వరకల్లా సిటీలో ఉన్నాను. ఇంటికెళ్లాను. అప్పటికే మా వదిన అమ్ములుకి ఇష్టమైన వంటలు చేసే పనిలో తలమునకలుగా ఉంది. ఫ్రెషప్ అయి పదకొండున్నరకే ఎందుకైనా మంచిదని బయలుదేరి, శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను. కారు పార్క్ చేసి, అరైవల్స్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను.

వాచ్ చూశాను. ఒంటిగంట. ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చినా, ఇంకా గంటన్నర ఉంది. పగలే అయినా, లైట్లతో మెరిసిపోతున్నాయి అక్కడున్న అడ్వర్టైజింగ్ హోర్డింగ్‌లు. ఆ కాంప్లెక్స్ లో ఉన్న షాపులలో తిరగడం మొదలెట్టాను. కాసేపటికే అన్నీ కలియదిరగడం అయిపోయింది. తినే ఉద్దేశ్యం, కొనే ఉద్దేశ్యం ఉంటే గదా! చివరికి ఫ్లైట్ దిగిన వాళ్ళు వచ్చే మార్గం కనపడేలా చూసుకొని ఒక చోట సెటిలయ్యాను.

నేను కూచున్న చోటికి ఎదురుగా కొద్ది దూరంలో ఇద్దరు పిల్లలు. వారిలో చిన్న వయసున్న పిల్లవాడు, షూ వేసుకుని ఉన్నాడు. నున్నగా మెరుస్తున్న ఫ్లోర్ మీద, సినిమాల్లో హీరోను అనుకరిస్తూ జర్రున జారుతున్నాడు. పక్కనే మొబైల్ లో ఆడుకుంటున్న పాప, వాడి వైపు చూస్తూ, ‘ఒరేయ్, పడితే పండ్లు రాలతాయ్’ అంది. బెదిరిస్తోందో, హెచ్చరిస్తోందో అర్థం కాక నవ్వొచ్చింది.

“నీల గగనా, ఘన విచలనా, ధరణిజా శ్రీ రమణా,
మధుర వదనా, నళిన నయనా, మనవి వినరా రామా,
రామచక్కని సీతకు” వేటూరి సాహిత్యం. ఎవరిదో ఫోన్ లో రింగ్ టోన్.

ఈ పాటంటే అమ్ములికిష్టం. బాగా పాడుతుంది. సంగీతం కూడా నేర్చుకుంది. ఎవరూ తెల్సిన వాళ్ళు లేకుండానే, తనే యూఎస్ వెళ్ళింది. మా ఇంటి మొత్తంలో తనే మొదట విదేశాలకెళ్లింది. చదువు పూర్తికాగానే, అక్కడే జాబ్ కూడా సంపాదించుకుంది. ఇప్పటి తరం ఆడ పిల్లలు చాలా ధైర్యవంతులు.

ఏమైందో ఉన్నట్టుండి ఎదురుగా ఉన్న పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు. కొద్దిసేపటికి వాడు ఏడుపు మొదలెట్టాడు. పాప తర్జని చూపిస్తూ, పెద్దరికం చెలాయిస్తోంది. వాడు ఏడుపు దిగమింగుకుంటూ, కౌంటర్ దగ్గరున్న వాళ్ళ మమ్మీని పిలుస్తున్నాడు.

ఆ పాట, చిన్న పిల్లలను చూస్తుంటే అమ్ములు చిన్నతనం గుర్తుకు వస్తోంది. తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తు.


బిందుప్రియకి రెండేళ్లు నిండి మూడు పడ్డాయి. అప్పుడే హరి పుట్టాడు. వాడు పుట్టిన రెండు రోజులకు అంత ఆరోగ్యంగా కనిపించక పోవడం, పైగా విపరీతంగా ఏడుస్తుండటంతో పిల్లల డాక్టరుకు చూపించాం. ఆమె పరిశీలించి, అనుమానంతో కార్డియాలజిస్ట్ వద్దకు పంపింది. ఆయన రక రకాల పరీక్షలు చేసి, గుండె సంబంధిత సమస్య (VSD) ఉన్నట్టు తేల్చాడు.

“గుండెలో నాలుగు గదులుంటాయి. పైవి రెండూ అరియల్స్, కిందివి రెండూ వెంట్రికల్స్. సాధారణంగా ఎడమ వెంట్రికల్ పెద్దగా ఉండి మంచి రక్తాన్ని అవయవభాగాలకు సరఫరా చేస్తుంది. ఎడమ , కుడి వెంట్రికల్స్ మధ్య ఉండే కండర గోడకు ఒక రంధ్రం ఉండటం ఒక సమస్య అయితే, ఎడమ వెంట్రికల్ చిన్నగా ఉండటం మరో సమస్య. మరీ ముఖ్యంగా బ్లడ్ పంప్ చేసే వాల్వ్‌ల్లో ఒకటి సరిగాలేదు. దీని కారణంగా శ్వాస గట్టిగా తీసుకోవడం, కాస్త ఎక్కువగా పనిచేస్తే ఆయాసపడటం, శరీరం నీలి రంగులోకి మారడం జరుగుతుంది. గుండెలో రంధ్రం విషయమైతే ఇప్పుడైనా సర్జరీ చేయొచ్చు. కానీ వాల్వ్ సమస్యకు కాస్త పెద్దవాడయ్యాక ఆపరేట్ చేయాల్సి ఉంటుంది”. కార్డియాలజిస్ట్ చెప్పిన విషయం పూర్తిగా అర్థం కాకున్నా, మొత్తం మీద సమస్య జటిలమైనదే అన్నది స్పష్టమైంది.

ఒక్కసారిగా నిస్తేజంగా అనిపించింది. తెల్లగా, ముద్దుగా మెరిసిపోతున్న పిల్లవాడు. ఇంత పెద్ద సమస్యా? వాడ్ని చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. మా అన్న వాడివైపే చేష్టలుడిగిపోయి చూస్తుండి పోయాడు.


ఇరుగూ, పొరుగూ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవద్దని సలహా యిచ్చారు. పిల్లవాడికి ఏమైనా అయితే మళ్ళీ పిల్లలు పుట్టడం కష్టం అని. కానీ, మావదిన మరో ఆలోచనే లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది.

“ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం? వెయిట్ చేయొచ్చుకదా?” ఎవరో అడిగితే, “నిజానికి రెండవ కాన్పు కాగానే, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలనుకున్నాము. ఇప్పుడు అలా చేయకపోతే, వాడు నాకు ఉండడని నమ్మినదానిని అవుతాను కదా” లోతైన జవాబు.

ఆరోగ్య సమస్య మూలాన, వాడి మీద కొంచెం ఎక్కువ శ్రద్ద పెట్టడం, జాగ్రత్తలు తీసుకోవడం, అడిగినవల్లా వెంటనే ఇవ్వడం లాంటివి ఆటోమేటిగ్గానే అమ్ములు మీద తక్కువ దృష్టి పెట్టేలా చేశాయి.

ఈ పరిణామాలతోనే అది చిన్నప్పుడు కొంచెం ఎక్కువ పెంకిగా, మొండిగా అయింది. లేదా తన నిక్కచ్చితనం అలా అనిపిస్తుందేమో? అన్నింటిపట్లా కుతూహలం, నిరసననూ స్పష్టంగా తెలియచేసే గుణం. వస్తువులూ ఎదుటి వారివి తీసుకోదు, తనదైన దాన్ని వదిలిపెట్టదు.

హరికి ఆరవ యేట, మద్రాసులోని ట్రిపుల్ ఎమ్ హాస్పిటల్లో ఒక సర్జరీ జరిగింది. మూడు నాలుగేళ్ల తర్వాత, మరో సర్జరీ చేయాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు.

ఈ సమస్య కారణంగా వాడు బలహీనంగా ఉండేవాడు. స్కూలుకి సరిగా వెళ్ళకున్నా పట్టించుకునే వాళ్ళం కాదు. ఇంట్లోనే కాదు, స్కూలులోనూ వాడికి ప్రత్యేక మినహాయింపు ఉండేది. ఆ మినహాయింపును అమ్ములు వ్యతిరేకించడం కూడా తరచుగానే జరుగుతుండేది.

అనుకున్నట్టుగానే వాడికి పదోయేడు తగిలాక, పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు,మా అన్నా వాళ్ళు ముందే అనుకొని, ఢిల్లీ వెళ్ళి వాడికి పరీక్షలు చేయించుకొని, ఆపరేషన్ తేదీని నిర్ణయం చేసుకొని వచ్చారు.

వచ్చిన దగ్గర్నుండి వాళ్ళిద్దరూ డల్ అయిపోయారు. ఆ సర్జరీ సక్సెస్ రేటు ఇరవై శాతం లోపే అని డాక్టర్లు చెప్పడం కారణం. కానీ ప్రత్యామ్నాయం లేదు.

రకరకాల ఆలోచనలు. అందరి మనసులు తల్లడిల్లి పోతున్నాయి. అనుకున్నట్టుగానే, డాక్టరు అపాయింట్మెంట్‌కు అనుగుణంగా ఢిల్లీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. మరునాడు పొద్దున్నే ఆరున్నరకు ఏపీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్. ఆ రోజు రాత్రంతా కలవర పెడుతూ, రకరకాల ఆలోచనలు.


తెలవారుఝామున్నే మూడున్నర గంటలకల్లా అందరం పూజగదిలో చేరాం. అందరి మనసుల్లోనూ ఒక విధమైన అలజడి. ఎవరికి వారు తోచిన రీతిలో దేవుడ్ని మొక్కుకున్నాం. చివరిగా పిల్లలిద్దరినీ దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి, ప్రార్థన చేయించింది మా వదిన.

అన్నీ అయి ఆటో ఎక్కాం. దారిలో పిల్లలిద్దరికీ కూచునే సీట్ కోసం గొడవ. అమ్ములిని సముదాయించి, చిన్నాకి కావలసిన సీట్ ఇప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. రైల్వే స్టేషన్ చేరే సరికి పావు తక్కువ ఆరు. అప్పటికే అక్కడే ఆగి ఉన్న ట్రైన్లో సీట్లు వెదుక్కొని కూచున్నాం. స్లీపర్‌క్లాస్.

మావి ఒకవైపు ఉండే మూడు బెర్త్‌లతో పాటు పక్కనే ఉన్న మిడిల్, అప్పర్ బెర్త్‌లు.

అక్కడా కిటికీ నాకే అంటూ అక్కను నెడుతూ కిటికీ వైపు వెళ్లబోయాడు చిన్నా. ఆ వెళ్లడంలో అమ్ములు కాలు తొక్కాడు. కోపంగా కుడి చేత్తో ముందుకు నెట్టింది. వాడు సీటుపై బోర్లా పడి కయ్యిమన్నాడు. అది చూస్తూనే మా వదిన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కోపంగా అమ్ములుపై చేయి లేపింది. నేను వెంటనే అమ్ముల్ని తీసుకొని బోగీ చివరికి వెళ్ళాను.

“అమ్ములూ! తమ్ముడిని అలా నెట్టొచ్చా?” అన్నాను.

“వాడు నన్ను కాలు మీద గట్టిగా తొక్కొచ్చా?” కండ్లు చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ అంది.

“ఇంతమాత్రానికే అంత గట్టిగానా?”

“నన్ను అంతకంటే ఎక్కువ గట్టిగా తొక్కాడు బాబాయ్! అయినా కావాలని నెట్టలేదు,నా కాలు లాక్కున్నా అంతే!” నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

నిజానికి అమ్ములికి కదులుతున్న ప్రకృతిని చూడటం ఇష్టం. అది మాకూ తెలిసినా ప్రస్తుతం ఆ వైపు ఆలోచించే స్థితిలో లేము.

తిరుగు ప్రయాణంలో అందరమూ కలిసి సంతోషంగా వచ్చే అవకాశం ఉంటుందో, ఉండదో అనే మీమాంసలో మా మనసులు అల్లకల్లోలంగా ఊన్నాయి. అది తనకు అర్థం గావడం లేదు.

చూస్తుండగానే ట్రైన్ కదిలింది.

ఓ గంట తర్వాత, సీట్ల దగ్గరికి చేరుకున్నాం. ట్రైన్ కాజీపేట్ దాటింది. తెచ్చిన అల్పాహారాల పొట్లం బయటికి తీసింది మా వదిన. ఇబ్బంది లేకుండా, ఏ పూటకు ఆ పూట విడి విడిగా ప్యాక్ చేసి పెట్టింది.

చిన్నాకి వడలు బాగా నచ్చినట్టున్నాయ్, “మమ్మీ, ఇంకో వడ కావాలి” వాళ్ళ అక్క ప్లేట్ వైపు వేలు చూపిస్తూ అడిగాడు. మా వైపు చూసింది. ఎవరి ప్లేట్ లోనూ లేవు.

“నీ వంతు తినేశావుగా! ఇవి నావి!” అంటూనే ఉంచితే ఇమ్మంటారనేమో అన్నట్టు అమ్ములు గబగబా వడ తినడం పూర్తిచేసింది.

వాడు ముఖం మాడ్చుకుని, చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టేశాడు. మా అన్న కూడా అమ్ములుని కసిరాడు.

చేయని తప్పుకు, దండనకు గురైనట్లు, మొఖం ఇబ్బందిగా పెట్టింది.

ఇంతలో రామగుండం స్టేషన్ వచ్చింది. ఇక్కడ ట్రైన్ రెండు నిమిషాలకంటే ఎక్కువ ఆగదు.

ఆ కొద్ది సేపటిలోనే, మా అన్న ట్రైన్ దిగాడు. చూస్తుండగానే ట్రైన్ కదిలింది.

నేను తలుపు దగ్గరికి వెళ్ళాను. మా అన్న కనపడలేదు.

“మీ అన్నయ్య” వదిన కంగారుగా అంది.

“కనపడలేదు వదినా, పక్క బోగీలోకి ఎక్కుంటాడులే” అన్నాను గానీ, ఏమో, ఒకవేళ ఎక్కకపోతే? అన్న భయం ఉంది.

కొద్ది సేపటిలోనే, చేతిలో వడల ప్యాకెట్‌తో పక్క బోగీలో నుండి మా అన్న వచ్చాడు. ‘అమ్మయ్య’ అనుకున్నాం. ఆ ప్యాకింగ్ చూస్తే, ప్యాంట్రీ నుండి తెచ్చినట్టున్నాడు.

“ఇది తమ్ముడికే. నీకు లేదు” అంటూ అమ్ములు వైపు చూస్తూ, చిన్నా చేతికి ప్యాకెట్ అందించాడు.

“నాకూ అక్కర్లేదు” అని కోపంగా చూస్తూ, అప్పర్ బెర్త్ మీది కెళ్ళి పడుకుంది.

టైమ్ చూస్తే పదకొండు. ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ దాటుతోంది.

నేనూ, చిన్నా ఇద్దరం అప్పర్ బెర్త్ మీదికి చేరాం. ల్యూడో గేమ్ తీశాం. అమ్ములూ మాతో కలిసింది. కొద్దిసేపటిలోనే మళ్ళీ ఇద్దరికీ గొడవ మొదలు.

అమ్ములుని చూస్తుంటే, తమ్ముడికి ఒక క్లిష్టమైన సర్జరీ జరగబోతుందన్న స్పృహ లేనట్టుగా అనిపిస్తోంది. మా పెద్దవాళ్ళకి ఆ ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తోంది.

కీచుమంటూ చప్పుడుతో ట్రైన్ ఆగింది. కిటికీ లోనుండి చూస్తూనే అడిగాను.

“అన్నా, ఏ స్టేషన్?”

“బళ్లార్షా అనుకుంటాను, ఈ ట్రైన్ కాస్త ఎక్కువసేపు అగేది నాలుగు చోట్లనే”

“మిగిలిన మూడు ఏవి?”

“వచ్చేది నాగ్‌పూర్, రాత్రి పది గంటలప్పుడు భోపాల్, తెల్లవారుఝామున ఝాన్సీ!”

పిల్లలతో కలిసి నేనూ, అన్నా కిందికి దిగాం. ఫ్లాట్ ఫాం మీద జామపండ్లు, పల్లీలు కొని ట్రైన్ ఎక్కాం.

బళ్లార్షాలో టాయ్‌లెట్స్ క్లీనింగ్, వాటర్ ఫిల్లింగ్ అయింతరువాత ట్రైన్ మళ్ళీ బయలుదేరింది. చూస్తుండగానే మధ్యాహ్న భోజనాల సంగతీ ముగిసింది. అమ్ములు చిన్నాతో ఏ విషయంలోనూ అడ్జస్ట్ అవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదనిపిస్తోంది.


మసకగా తెల్లారుతోంది. సమయం అయిదున్నర.

ప్రయాణీకుల ఉద్వేగాలతో నిమిత్తం లేకుండా మనసుల్లో ఆలోచనల మాదిరి, ట్రైన్ వేగంగా దూసుకుపోతోంది. ఆ మసకవెలుతురులోనే ఆగ్రా కాంట్, మధుర పట్టణాలు అంతే వేగంగా, నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. కిటికీ లోనుండి అక్కడక్కడా కోసినట్టున్న గోధుమ పొలాలు. పిల్లలు ఇంకా నిద్రలోనే ఉన్నారు.

మా అన్న వదిన, అప్పటికే లేచి ఉన్నారు. అసలు పడుకుంటే కదా! ఇద్దరి కళ్ళూ ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ల ఎరుపులో ఏం జరగబోతోందో అర్థం కాని భయం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు వాళ్ళని చూస్తే…

ప్రమాదానికి తల్లడిల్లి పోతూ, చేతుల్లో లేని ఫలితాన్ని ఊహించడానికి కూడా భయపడుతూ, ఉప్పెనలను దాచుకున్న సంద్రంలా. దిగి మా అన్న భుజం మీద చేయి వేస్తూ, “ఏం కాదన్నా!” అంటుండగానే నా గొంతూ వణికింది. మా వదిన కళ్లలోనుండి, ధారగా అశ్రువులు. చుట్టూ ఉన్నవారు విచిత్రంగా కొందరు, మరికొందరు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ మహానగరం, అందులో ఒక చోట ఉన్న ఫోర్టీస్ హాస్పిటల్, చిన్నా భవిష్యత్తుని, ఇంకా చెప్పాలంటే వాడు బతకాలా, వద్దా అని నిర్ణయించబోతోంది. హాస్పిటలా? విధా?

హజ్రత్ నిజాముద్దీన్, దక్షిణ డిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్ రాగానే ట్రైనంతా హడావిడిగా అయింది.

మరో అరగంటలో మేం దిగాల్సిన స్టేషన్. పిల్లలను లేపి, లగేజ్ సర్దుకున్నాం.

“హజ్రత్ నిజాముద్దీన్ ఎవరు బాబాయ్?” స్టేషన్ లో గట్టిగా వినిపిస్తున్న అనౌన్స్‌మెంట్ వింటూ అమ్ములు ప్రశ్న. “ప్రఖ్యాత సూఫీ మతగురువు. ఆయన పేరునే ఈ స్టేషన్‌కు పెట్టారు” అన్నాను. అర్థమయినట్టు, తలపంకిస్తూ ఆవులించింది. తమ్ముడి చేయి గట్టిగా పట్టుకుంది.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చినట్టు, పెద్దగా అనౌన్స్ మెంట్ వినపడుతోంది. లగేజ్ అంతా జాగ్రత్తగా చూసుకొని దిగాం. ఆటో స్టాండ్ కు వెళ్ళి, అక్కడనుండి ఓ పావు గంటలో ఏపీ భవన్‌కు చేరాం.

అప్పటికే బుక్ చేసుకున్న రూములలో లగేజ్ దించుకొన్నాం. త్వరత్వరగా ఫ్రెషప్ అయి,

హాస్పిటల్‌కు వెళ్ళాం.


ఫోర్టీస్ ఎస్కార్ట్ హాస్పిటల్, ఒఖ్లా రోడ్ ఎటు చూసినా హడావుడిగా ఉంది. రిసెప్షన్ వద్దకు వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ చూపి, డాక్టరు వద్దకు వెళ్ళాం. ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. రేపు ఇన్ పేషెంట్‌గా చేరితే, ఎల్లుండి ప్రొద్దున్నే సర్జరీ. లంచ్‌కు మళ్ళీ ఏపీ భవన్‌కి వచ్చాం. ఢిల్లీలో తెలుగు వాళ్ళు కడుపునిండా తినగలిగే భోజనం దొరికేది ఇక్కడే మరి.

లంచ్ అయ్యీ కాగానే ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ అని పాట మొదలు పెట్టింది అమ్ములు. సాయంత్రం వెళ్దామని సర్ది చెప్పి అప్పటికి రూముల్లో చేరాం. అలారం మోగినట్టే, సాయంత్రం అయిదు కాగానే అమ్ములు మాట గుర్తు చేసింది.

నేనూ, తనూ కలిసి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఇండియా గేట్, అవీ చూసి, తిరిగి వచ్చేసరికి బాగా చీకటి అయింది. మిరుమిట్లు గొలుపుతూ రోడ్లు వెలుగులు చిమ్ముతున్నాయ్.

ఏపీ భవన్‌లో, గ్రౌండ్ ఫ్లోర్‌లో, నల్లగా మెరుస్తూ చుట్టూ అలంకరణ దీపాలతో వెంకటేశ్వర స్వామి విగ్రహం జీవం ఉట్టి పడుతూ కనపడుతోంది. ఎదురుగా కొద్ది దూరంలో కూచోడానికి వీలుగా అరుగులు మాదిరి ఏర్పాట్లు. వాటి మీద కాసేపు కూచోని రూముల్లోకి వెళ్ళాం.

మళ్ళీ రాత్రి భోజనానికి కిందికి వచ్చాం ఆ రాత్రి ఎవరికీ సరిగా నిద్ర పట్టలేదు.

పక్క బెడ్ పై నిద్రపోతున్న అమ్ములు ఆందోళనరహితంమైన మొహం.


మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు. అవసరమైనవన్నీ సర్దుకొని, హాస్పిటల్‌కు బయల్దేరాము. హాస్పిటల్‌లో మూడో ఫ్లోర్‌లో ఉన్న గదిలో, చిన్నాని ఇన్ పేషెంట్ గా అడ్మిట్ చేసుకున్నారు. వాడితోపాటు ఒక్కరికే అటెండెంట్‌గా అనుమతి. రాత్రి ఎనిమిది వరకూ అక్కడే ఉండి బయలుదేరాము. మా అన్న మాత్రం చిన్నాతో పాటు ఉన్నాడు.

మా వదిన, అమ్ములుతో కలిసి ఆటోలో కూచున్నాను. మా ఇద్దరిలో ఎవరి గొంతులో నుండీ మాట రావడం లేదు. మా వదినను పలకరిస్తే ఏడ్చేటట్లుగా ఉంది. మొహం అంతా ఏడ్చి, ఏడ్చి ఎర్రగా కంది పోయింది.

అమ్ములు మాత్రం దారివెంట శివహనుమాన్ మందిర్, చక్కర్వాలి మసీద్, లాల్ బంగ్లా, క్రాంతి మైదాన్ వంటి సందర్శనా స్థలాలను చూస్తూ, వాటి పేర్లను తాను పాడే కూని రాగం మధ్యలోనే కలిపి పాడేస్తోంది.

తన వైపు చూశాను. అసలేమీ బాధ లేనట్టు, నా కెందుకో అసహజంగా అనిపిస్తోంది.

వెళ్ళగానే ఏదో కాస్త తిన్నామనిపించి, రూముల్లోకి వెళ్ళాం. అమ్ములు వాళ్ళ అమ్మతో పాటు వెళ్లింది. కొద్ది సేపటికి అమ్ములు నా గదిలోకి వచ్చింది.

“బాబాయ్, పొద్దున్న చూశామే అలాంటి బ్రెడ్ ఆమ్లెట్ తినొద్దామా?”

“ఇప్పుడా? ఇందాకే కదా తిన్నాం?” గొంతులో చిరాకు కనిపించనీయకుండా అన్నాను.

“బాగుంటుందంట. ఫ్రెండ్స్ అన్నారు. ఇందాక వచ్చేప్పుడు చూశాను. అశోకా రోడ్ అనే బోర్డు ఉందే, దానికి దగ్గరలోనే. ఇక్కడికి దగ్గరే. వాకబుల్”

“సరే పద!” అని బట్టలు వేసుకొని, ఇద్దరమూ బయటికి వచ్చాము.

తిరిగి వచ్చేటప్పుడు, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, వేంకటేశ్వర స్వామి విగ్రహం ముందున్న అరుగుల మీద కూచున్నాం.

మనసులో ఏదో ఆలోచన వచ్చి, “అమ్మా, తెల్లారితే తమ్ముడికి సర్జరీ. నీకేం అనిపించడం లేదా? నిన్ను చూస్తూంటే, ఏదో విహారయాత్రకు వచ్చినట్లుగా ఉన్నావు గానీ, ఏ మాత్రం ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు?” అని అడిగాను. నేను మొన్నటి నుండి చూసిన సంఘటనలన్నీ, నేనడిగిన ప్రశ్నలో ధ్వనించాయి. అమ్ములు నా వైపు చూసింది.

“తమ్ముడికేం కాదు బాబాయ్, దేవుడికి దణ్ణం పెట్టుకున్నాంగా!” స్పష్టత నిండిన గొంతు. నమ్మకాన్ని నిర్వచిస్తున్నట్టు నమ్మడమంటే ఏంటో నేర్పుతున్నట్టు.

“మళ్ళీ అందరం కలిసే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళింతర్వాత, అందరం కలిసి అనంతగిరి ట్రెక్కింగ్‌కు వెళ్ళాలి. మాట తప్పొద్దు బాబాయ్. సరేనా?”

అలా అనడంలో విశ్వాసం జాలువారుతోంది. అది కళ్ళలో ప్రతిఫలిస్తుండగా, చేయిలో చేయి వేస్తూ, భుజానికి తల ఆన్చింది.

మా నమ్మకంలోని ‘అపనమ్మకం’ చెళ్లున తగిలింది. నిజమే, నమ్మకం మనసుకి, అపనమ్మకం వాస్తవికతకు సంబంధించినది కదా! అప్పటి వరకూ ఒక కోణంలో చూసినవి అమ్ములు వైపు నుండి, మరో కోణంలో కన్పిస్తున్నాయ్.

తన పరంగా మా ప్రవర్తనే అసహజం. మనం ఉన్న స్థితిని బట్టి చూసే దృష్టి మారుతుంది. అమ్ములు తల నిమురుతూ చూశాను స్వామి వైపు. దివ్య మంగళ రూపం దక్షిణ హస్తంతో అభయం అనుగ్రహిస్తున్నట్టు

“బలంగా నమ్మితే, ప్రకృతి శక్తులన్నీ దానిని నెరవేర్చడానికి కుట్ర చేస్తాయి” ఎక్కడిదో గుర్తుకు వాక్యం వచ్చింది. ‘కుట్ర’ పదం వాడటంలో ఔచిత్యం ఏమిటో!

సహకరించడం కంటే కుట్ర అంటే ఇంకా బలంగా సహకరించడమనేమో!


“బాబాయ్!” ఉలిక్కి పడి చూశాను. చిన్నా.

“అక్క ఇంకా రాలేదే? టైమ్ అయిందిగా” అంటూ పక్కనే వచ్చి కూచున్నాడు.

వాడు సిఎ పూర్తి చేసి, సొంతంగా ఒక ఫర్మ్ స్థాపించాడు. తన కింద ఆరుగురు పని చేస్తున్నారు.

“మీటింగ్ అయిపోయిందా?” అడిగాను.

“ఆ!, అక్కడి నుండే వస్తున్నా. అదిగో, అక్క వస్తోంది. ఐ ఫోన్ ఎక్సెస్ తెమ్మన్నా, తెచ్చిందో లేదో? తేకపోవాలీ, సంగతి చెబ్తా” అంటూ లేచి గబగబా అడుగులేశాడు.

అటు మెటల్ డిటెక్టర్ ఉన్న ఎంట్రన్స్ లోనుండి, కుడి చేయిని వేగంగా ఊపుతూ, స్వచ్ఛంగా మెరుస్తున్న నవ్వుతో వస్తోంది.

ఇంతలోనే పక్కకి చేరిన చిన్నా ఏదో అన్నాడు

అమ్ములు ఏదో అన్నది వాడూ ఏదో అన్నాడు. మళ్ళీ, “గొడవ” మొదలైంది.

2 Responses to “విశ్వాసం”

  1. ‌సుబ్బారావు.

    గుండె పైన గదులను ఏట్రియా, కుడి,ఎడమ, అని.మొదటి సారి 3యమ్ లో చేసిన తరువాత రెండవసారి ఫోర్టిస్ కు ఎందుకు వెళ్ళారు.కధ నడక బాగుంది.సందేశం ఏమిటి.చక్కని బాంధవ్యాలున్న కుటుంబం.

    Reply
  2. తమ్మనబోయిన వీరబాబు

    ఒకరిపైన సానుభూతి చూపే క్రమములో మరొకరి హక్కులను హరించిన విదమును చక్కగా వివరించారు.అక్కా తమ్ముడి మధ్య అనురాగాల కీచులాటను చక్కగా వివరించారు.

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.