తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

నాలోకి నదిని ప్రవహించనీయండి

తెల్సా కవితల పోటీలో ₹8,000 పారితోషికం పొందిన కవిత
© Telugu Society of America

నాలోకి నదిని ప్రవహించనీయండి
గదిలో గోడ మీద పారుతున్న జలపాతం బొమ్మ
చేయెత్తితే చాలు అందుతుంది
జలజలమని నాలోకి తడితడి జ్ఞాపకాలు
నాలో ఎంతకీ వాడని పూల తాజాతనం.

గుండె గడియారపు లోలక శబ్దం
జీవించే క్షణాల్ని లెక్కించుకుంటున్నాను
గడుస్తున్న కాలం
కరిగిపోయిన కాలంతో పోటీ పడుతోంది
వెలిసిపోయిన రంగులు
చేదు మరకలుగా తలపోస్తున్నాను.

సాయం సంధ్యవేళ
ఆకాశానికి ఆరేసిన సింధూరం చీర
నాకెలా అందుతుందో నేనెలా పట్టుకోగలనో
ఎడతెగని సుడుల గోదారి చెంత
వలకు చిక్కని చేపల ఈదులాట.

నిదురించే నదిలోకి పడవెళ్లిపోతున్న దృశ్యం
నీటిదారిలో వెండి జలతారు ముక్కలు
నేనే నురగైపోతాను చేపపిల్లై చిందులేస్తాను.
జలకాలాటల సయ్యాటలు.

అలల నదిలో కలల ఒడి
తడిసి వణుకుతున్న చంద్రబింబం
నేనూ తడవకుండా మునకలేస్తాను
ఆరని చెమ్మ ఊరిస్తుంటే
నదీ ఆకాశం కలిసేచోటును కనుగొన్నాను

ప్రాకృతిక సంలీనం, మనిషితనం
నది కెరటాల చిరు సవ్వడులు
కరచాలనాలు, ఆత్మీయ ఆలింగానాలు.

లోలోపలి వెలుగుల్ని తీరానికి చేరుస్తున్నపుడు
బతుకు చెమ్మల హృదయం విశాలమౌతుంది
నాలోకి నదిని ప్రవహించనీయండి
కాలం తీరాన అలలుగా ఊరేగుతూ ఊగుతూ
విలువల జగత్తులో భాగమౌతాను.

రచయిత పరిచయం

దాట్ల దేవదానం రాజు

దాట్ల దేవదానం రాజు

దాట్ల దేవదానం రాజు గారు కథ, కవిత, నవల, చరిత్ర గ్రంథం వంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేసారు. అనేక పురస్కారాలు అందుకొన్నారు. “వానరాని కాలం”, “గుండె తెరచాప”, “మట్టికాళ్ళు”, “లోపలి దీపం” తోపాటు మొత్తం ఏడు కవితా సంపుటాలు ప్రచురించారు. “దాట్ల దేవదానం రాజు కథలు”, “యానాం కథలు”, “కల్యాణపురం”, “కథల గోదారి” మరికొన్ని కథాసంపుటాలు కూడా ప్రచురించారు. “యానాం చరిత్ర” అనే చరిత్ర గ్రంథం కూడా రచించారు. కోడి పందాల నేపథ్యంతో “బరిలో” అనే నవల రాసారు. వీరి నివాసం యానాంలో.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.