తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

అంగన

తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
© Telugu Society of America

నేను ఏం తప్పు చేసానని అమ్మకి నా మీద కోపం. చిన్నప్పుడు తనకి ఆడ పిల్లలు లేరని నా జుట్టు దువ్వి జడవేసి, పూలు పెట్టి బుల్లి పట్టుపరికిణీ- జాకెట్టు దానికి మ్యాచ్ అయ్యే జరీ అంచు వున్న ఓణి వేసి ఫోటో తీయించి మురిసి పోయిన అమ్మేనా? ఇలా ప్రవర్తిస్తుంది. అమ్మ నాపట్ల చూపిన ఏహ్యతకి నాకు దుఃఖం వస్తుంది.

చిన్నప్పటి నుండి నేను మహా సిగ్గరిని. నలుగురు వున్నచోటుకు రావాలంటే చాల సిగ్గుపడేవాణ్ణి. నా సిగ్గు చూసి అమ్మ ముచ్చట పడేది. ఓసారి అమ్మకు వరసకు అన్నయ్య అయిన మాధవరావు మామయ్య, వాళ్ళ అబ్బాయి సందీప్ ని తీసుకుని ఇంటికి వచ్చాడు. నేను అమ్మ కొంగుచాటున నక్కుని చూస్తున్నా. సందీప్‌కి ఈ ఊర్లో మెడికల్ కాలేజిలో సీటు వచ్చిందని, ఇక్కడ హాస్టల్‌లో వుంచి చదివించేందుకు మామయ్య తెచ్చాడని వారి మాటల్లో అర్ధం అయింది. నేను అదేపనిగా కళ్ళు పెద్దవి చేసుకుని సందీప్‌ని చూస్తున్నానని మావయ్య గ్రహించి “రారా! ఏంటి అలా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు, నేను మామయ్యను” అన్నాడు. అలా అన్నప్పుడు సందీప్ నన్ను చూసేసాడని నేను మరికాస్త సిగ్గుపడి తుర్రున లోనికి పరుగెట్టాను.

“వాడంతే అన్నయ్యా! చచ్చే సిగ్గు వాడికి” అని అమ్మ మురిపంగా అనటం వినిపించింది.

అప్పుటికే నేను తొమ్మిదో క్లాసు నుండి పదిలోకి వచ్చాను. మామయ్య అన్న మాటలతో నాకు క్లాసులో అందరూ ఇచ్చిన “ఆడంగీ” బిరుదు గుర్తొచ్చింది. అందరూ అలా అంటుంటే నాకు చాలా కొపం వచ్చేది. నా పేరు క్రాంతి కుమార్ అని ఏడ్చుకుంటూ చెప్పేవాణ్ణి. అన్నయ్యకు ఇదంతా తెల్సినా ఏం అనేవాడు కాదు. వాళ్ళ పాపాన వాళ్ళేపోతారు నీవు ఏడవకు అని మాత్రం చెప్పేవాడు. మా క్లాసులో సుభద్ర అనే అమ్మాయికి నేనంటే జాలి. పైగా వాళ్ళ ఇల్లు మా ఇంటి సందులోనే. ఆ ప్రాంతీయభావమేమో “వాణ్ణి అలా పిలవకండి” అని నా తరపున గొడవపడేది. బాధ పడొద్దని నన్ను ఓదార్చేది. “అసలు ఆడంగీ అంటే ఏంటి?” అని రోజు అడిగా.

తను నవ్వి ‘దా’ చూపిస్తా అంటూ నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళి నా ముఖానికి పౌడరు అద్ది, తన పంజాబీడ్రస్ నాకు వేసి అచ్చం మా అమ్మ చిన్నప్పుడు నాకు అలంకరించినట్లుగా చేసి నన్ను అద్దం దగ్గరకి తీసికెళ్ళి చూపించింది.

“హబ్బ ఎంత అందంగా వున్నానో!” అన్నాను.

“అవును నా కంటే కూడా!” అంది.

“నా ఈ రూపు నాకు నచ్చింది ఇదేనా ఆడంగి అంటే” అన్నాను. కిలకిలా నవ్వింది.

ఇలా డ్రస్ చేసుకునే వాళ్ళను నేను పెళ్ళిళ్ళలో చూసా. అది గుర్తొచ్చి నేను సిగ్గుతో చప్పున ఆ డ్రస్ విప్పదీసి ముఖం కడుక్కుని బైటకి పరుగెత్తుకుని వచ్చేసా.

ఆరోజు నుండి నాకు చదువు మీద శ్రద్ధ తగ్గింది. సుభద్ర నాకు డ్రస్ చేసినట్లుగా చేసుకోవాలనిపిస్తుంది. కానీ అమ్మానాన్నా ఏమంటారో అని భయం. అయినా, నాకు అలాంటి డ్రస్ ఎవరిస్తారు? ఎక్కడ సంపాదించాలి అని ఆలోచిస్తుంటే ఓ రోజు సందీప్ మా ఇంటికి వచ్చాడు. ఆరోజు ఇంట్లో నాన్నలేరు. అమ్మ లోపల ఎక్కడో పనిచేసుకుంటుంది. నేను అమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి సందీప్ వచ్చాడని చెప్పాను. అమ్మ నవ్వుతూ “ఎరా! మీ బావని చూసి సిగ్గు పడుతున్నావా? నిజంగా ఆడ పిల్లవైతే బావుండు నిన్ను వాడికి కట్టబెట్టేదాన్ని” అని నవ్వుకుంటూ వచ్చి సందీప్‌ని కుశల ప్రశ్నలడిగింది.

కాలేజిలో విధ్యార్ధుల స్ట్రయిక్ మూలంగా సెలవులిచ్చారని అందుకే రెండు రోజులు వుందామని వచ్చానని చెప్పాడు.

అమ్మ సంతోషంగా మొహంపెట్టి “రెండు రోజులేం? కావలసినన్ని రోజులు వుండు” అంటూ తనని మా బెడ్‌రూంలోకి తీసుకెళ్ళమని చెప్పింది.

నేను తనని మారూంలోకి తీసుకెళ్ళి మంచంపై కూర్చోబెట్టా. నేను ఎప్పటిలా సిగ్గుపడటం చూసి మా బావ చిరునవ్వుతో “నీవు ఈ సంవత్సరం టెన్త్ కదా! బాగా చదువుతున్నావా?” అన్నాడు. ‘ఓ బాగా చదువుతున్నా’ అన్నట్లు తలవూపా.

“నీకు ఏ సబ్జక్ట్ అంటే ఇష్టం?” అంటూ సంభాషణ మొదలు పెట్టాడు. కొద్ది సేపటికి ఆశ్చర్యంగా నా బెరుకు అంతా పోయింది. అలా అలా ఇద్దరం చాల సేపు మాట్లాడుకున్నాం, అమ్మ భోజనానికి పిలచే వరకూ.

ఈ రెండు రోజులూ అన్నయ్యకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో డౌట్లు చెప్పాడు. కానీ మిగిలిన సంభాషణ గానీ కాలక్షేపంగానీ నాతోనే చేసేవాడు. ఇద్దరం సరదాగా బైటకి వెళ్ళేవారం. అలా సరదాగా తిరిగేప్పుడు నాకు చాలా సంతోషంగా వుండేది. బావ వెళ్ళే ముందు ఇలా సెలవలు వచ్చిన ప్రతిసారీ రమ్మని కోరాను. అలాగే అన్నాడు. కానీ మాట తప్పాడు. మొదటి సంవత్సరం పూర్తయ్యేలోపు అతను వచ్చిందే లేదు. నాకు చాలా కోపం వచ్చేది అతని మీద.

ఈలోపు నా టెన్త్ పూర్తయింది. చదువు మీద శ్రద్ద తగ్గిందని ముందే చెప్పాను కదా అందుకే ఇంటరులో సియిసి గ్రూపు అయితే తేలికగా వుంటదని నాన్న చెప్పటంతో అందులో జాయిన్ అయ్యాను. సుభద్ర బైపిసి తీసుకుంది తను డాక్టరు అవ్వాలనుకుంటుంది.

సుభద్ర లేని లోటు నాకు బాగ తెలుస్తోంది. కాలేజీలో మగ పిల్లలతో మాట్లాడాలంటేనే భయంగా వుంటోంది. నా వాలకం చూసి ఇక్కడ కూడ నా నిక్ నేం ఎక్కడ కంటిన్యూ చేస్తారో అని భయపడేవాడిని. కానీ ఎవరన్నా అమ్మాయిలు మంచి డ్రస్‌తో, తలలో పూలు పెట్టుకుని కనిపించినప్పుడు నాకు మనసు ఎలాగో వుండేది. ఈ మానసిక రుగ్మత ఏంటో అర్ధం అయ్యేది కాదు. చాలా అసహనంగా వుండేది.

చాలా రోజుల తర్వాత సందీప్ బావ నన్ను కలవాలని వచ్చాడు. నేను చాలా కోపంగా ముఖం పెట్టుకోవటం చూసి సారీ చెప్తున్నట్లుగా నా దగ్గరకు వచ్చి “ఇక్కడ నుండి వెళ్ళాక స్ట్రైక్ కంటిన్యూ అవ్వటం మూలంగా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కాలేజీ తీసాక చాలా రోజులు సెలవులు రావటం మూలంగా సిలబస్ కవర్ చేయటానికి ఒక్కరోజు కూడ ఖాళీ లేకుండా క్లాసులు జరిపారు. అందువల్ల రాలేక పోయాను” అని చేతులు పట్టుకుని బ్రతిమాలాడు.

ఎంతో నిగ్రహంగా వుందామనుకున్నా, ఎందుకనో నేను మంచులా కరిగిపోయాను. “సరే మరెప్పుడూ అలా చేయవుగా?” అన్నాను. “చేయను” అంటూ నా భుజం మీద చేయివేసి పద బైటకు వెళ్దాం అన్నాడు. అన్నయ్య ఎప్పటిలాగే మాతో కలవకుండా “మీరు వెళ్ళండి నేను నా ఫ్రండు కోసం ఎదురు చూస్తున్నా” అన్నాడు.

సరే అని మేం ఇద్దరం అలా నడుచుకుంటూ పార్కు దగ్గరకు వచ్చాం. అలా నడుచుకుంటూ వచ్చేప్పుడు నాకెందుకో చెప్పలేని ఆనందం వేసింది. కానీ బైట పడకుండా మెల్లగా అతన్ని అనుసరించాను.

అక్కడ పార్కులో మా ముందు సుభద్ర ప్రత్యక్షమైంది. హాయ్ చెప్తూ పలకరించింది “ఏంటి అస్సలు బైటకి రావటమే మానేసావు?” అంది. పెద్ద విశేషం ఏం లేదని చెప్తూ మా బావని పరిచయం చేసాను. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక కొద్ది నిమిషాలు మాట్లాడి సెలవు తీసుకుంది సుభద్ర.

సుభద్ర వెళ్ళినాక “సుభద్ర ఎన్నాళ్ళుగా నీకు పరిచయం?”అని సందీప్ అడిగాడు. తను నాకు స్కూలు బెస్ట్ ఫ్రండ్ అని చెప్పినప్పుడు సందీప్ ఆసక్తిగా నా అభిరుచులు, అలవాట్లు గురించి తరచి తరచి అడిగాడు. ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఒకవేళ సుభద్రకీ నాకూ ఏమైనా సంబంధం వుందనుకుంటున్నాడా? అని అనుమానం వచ్చింది. అటువంటిదేం లేదని చెప్పటానికి నేను అన్ని విషయాలు విపులంగా చెప్పాను. అన్నీ విని, చాల ఆశ్చర్యంగా నావైపు చూసాడు. అన్నీ చెప్పేసాక నాకు కొంచం భయం వేసింది. ఎక్కడా చెప్పవు కదా అని చేయి చాచాను ఒట్టు వేయమన్నట్లు.

అతను చేతిలో చేయివేసి “దీనికో పరిష్కారం వుంది. కానీ అది అమలు కావాలంటే నిన్ను ఓ చోటకి తీసుకు వెళతా వస్తావా?” అన్నాడు. సరే అన్నాను. అయితే నేను కాలేజీకి వెళ్ళాక నీకు కబురు చేస్తా అని చెప్పాడు. తర్వాత అతను కాలేజీకి వెళ్ళిపోయాడు.

పది రోజుల తర్వాత నన్ను వాళ్ళ హాస్పిటల్ దగ్గరకు రమ్మన్నాడు. నేను వెళ్ళాను. లోనికి తీసుకెళ్ళి వాళ్ళ డీన్‌కి పరిచయం చేసాడు. మొదట ఆయన నన్ను నా డ్రస్ లూజ్ చేసుకుని బెడ్ మీద పడుకోమన్నారు. నన్ను పరీక్ష చేసాక చాల ప్రశ్నలు వేసి, “రేపు మీ నాన్నగారిని తీసుకురా మిగిలిన విషయాలు మాట్లాడదాం” అన్నారు.

నాకు అంతా అయోమయంగా వుంది. బయటకు వచ్చాక సందీప్‌ని చూసి “ఏంటి విషయం? ఈ పరీక్షలు ఎందుకు? నీమీద నమ్మకంతో అన్నింటికి తలాండించాను. కానీ నాకెందుకు ఈ పరీక్షలు?” అడిగాను సందీప్‌ని.

“నీవు విని తట్టుకోగలనంటే చెప్తా. కానీ ఈ విషయం నీ తల్లిదండ్రలకంటే నీకే ముందు తెలియాలి. పైగా నీవు కోరుకున్న విధంగా జీవించాలంటే తప్పదుమరి అన్నాడు భుజం మీద చేయి వేసి నిమురుతూ.

“చెప్పు పర్వాలేదు. ఇంకా నీమీద నాకు నమ్మకముంది” అన్నాను.

“నీవు చెప్పిన దాన్ని బట్టి, నీ నడవడికను బట్టి నేను ఊహించినది నిజమైంది. నీవు జన్యుపరమైన హార్మోన్ల్ లోపంతో పుట్టావు. పైకి అబ్బాయిలా వున్నా నీకు అన్నీ అమ్మాయిలకు వుండే లక్షణాలు వుంటాయి” అన్నాడు.

అతను చెప్తున్నదేమిటో మొదట అర్ధం కాలేదు. కొద్దిగా జీర్ణించుకున్నాక మొదటగా నా మిత్రులు పిలిచే పదం గుర్తొచ్చి ఎందుకో బాధ అనిపించింది. ఏడ్వటానికి సిద్దంగా వున్న నా కళ్ళను చూసి బావ చప్పున నన్ను పొదివి పట్టుకుని “దా! అలా పోయి కూర్చుని టీ తాగుదాం!” అంటూ క్యాంటీన్‌కు తీసుకు వెళ్ళాడు.

నా కళ్ళు వర్షిస్తూనే వున్నాయి. ఏడుపు పైకి రాకుండా దిగమింగుకోటానికి ప్రయత్నం చేస్తున్నా. క్యాంటిన్లో ఎవరూ లేని చోటకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి టీ ఆర్డర్ ఇచ్చాడు. టీ వచ్చే వరకూ ఏం మాట్లాడుకోలా ఇద్దరం. కొంచం టీ గొంతులో పడ్డాక చెప్పటం మొదలు పెట్టాడు.

“ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇష్టమేకదా అమ్మాయిలా డ్రస్ చేసుకోవటం” అన్నాడు.

నాకు సుభద్ర డ్రస్ వేసినప్పుడు గుర్తొచ్చిన మొహం గుర్తొచ్చి అయితే నేను “కొజ్జానా?..”అన్నాను.

“ఛ ఛ..అదేంకాదు. అది సైన్స్ తెలియక ముందు సమాజం పెట్టుకున్న పేరు. నీలాంటి వారు ప్రతి లక్ష మందిలో ఇద్దరున్నారు. కానీ అది హార్మోన్ లోపమని తెలియక వారి దైనందిన జీవితం సరిదిద్దుకునే మార్గాలులేక సమాజం పట్ల చిన్నచూపుకు గురయ్యారు. దివ్యాంగుల మాదిరిగా. ఒకప్పుడు వారిని కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అంటూ హేళనగా మాట్లాడేవారు ఇప్పుడు వారిని దివ్యాంగులు, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటూ గౌరవించి వారు గౌరవంగా బతకటానికి తగిన చేయూత ఇస్తున్నారు. మానసిక ఎదుగుదల లేని వారిని మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు.

అంగలోపాల్ని సరిదిద్దే ఫ్లాస్టిక్ సర్జరీలు, కృత్రిమ అవయవాలు, ఆపరేషన్లులాంటి అధునాతన పరిణామాలు చోటుచేసుకున్నట్లే ఈ పుట్టుకతో వచ్చిన లోపాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేసుకోవచ్చు. అలా చేసుకున్న వారిని ట్రాన్స్ జండర్ అంటున్నాం. పుట్టుకతో హార్మోను లోపంగా ఒక అమ్మాయిగా వుండాల్సిన ఆమె అబ్బాయి లక్షణాలు వున్నా, లేదా అబ్బాయి అమ్మాయిగా వున్నా వారు కోరుకున్న విధంగా జండర్ మార్చుకునే హక్కు వారికి వుందని ఇటీవలే కోర్టులు నిర్ణయించాయి.

కాబట్టి అదేదో అవహేళన అని నీవు అనుకోకూడదు. అంటే నీవు పుట్టుకతో అమ్మాయివే. నీలో వున్న లక్షణాలు, ఆలోచనా విధానం అన్నీ ఆడపిల్లలవే. కానీ నీ శరీరం మీద పెరిగిన అంగం బట్టి నీవు పుట్టినప్పుడు అబ్బాయి అనుకున్నారు. అలాగే పెంచారు. అది నీ తప్పు ఎలా అవుతుంది? అందుకే నీకు ఆపరేషను చేసి నిన్ను పూర్తి అమ్మాయిగా మార్చటానికి డాక్టరుగారు నిన్ను పరీక్షించారు. నీవు మైనరు అయినందున ఆ విషయం మీ తల్లిదండ్రుకి తెలియజేయటానికి రమ్మంటున్నారు” అన్నాడు.

నా విషయం సందీప్‌కి పూర్తిగా అర్ధం అయింది. నాకు అప్పుడప్పుడూ మగవారిపట్ల కలిగే మానసిక పరిస్ధితి గుర్తొచ్చింది. “అయితే అమ్మాయిగా మారితే ఏం కాదా?” అన్నాను.

“ఇలా వుంటేనే అవుతుంది. అమ్మాయిగా మారితే నీవు, నీవు కోరుకున్న విధంగా వుండవచ్చు. ఈ మధ్య ప్రభుత్వం ట్రాన్స్‌జండర్ల రక్షణ చట్టం తీసుకు రావటం జరిగింది. కోర్టు ద్వారా ఈ చట్టానికి మరిన్ని మెరుగులు దిద్దారు. కాబట్టి జండర్ని నిర్ణయించుకునే హక్కు నీకు వుంది” అంటూ ఇందాక చెప్పిన విషయాన్ని మరల నొక్కి చెప్పాడు.

సందీప్, “మరి నా చదువు? నా పేరు రికార్డుల్లో మారుతుందా?” లాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆపరేషన్ ద్వారా మారిన తర్వాత కూడా నేను చదివిన చదువు నాతోనే వుంటుందనీ, కొన్ని చట్టపరమైన ఫార్మాలిటీస్ పూర్తిచేస్తే నన్ను అమ్మాయిగా గుర్తిస్తారనీ, అన్ని రకాలుగా ఆదుకునేలా చట్టం వచ్చిందనీ, భయపడాల్సిందేం లేదనీ, ఇటువంటి వెసులుబాటు లేకే చాలా మంది తల్లిదండ్రులు ఆవమానంగా భావించి, సమాజానికి భయపడి తమ పిల్లలని దూరం చేసుకున్నారనీ, ఏ దిక్కూలేక ఆ పిల్లలు రోడ్లమీద అడుక్కుతినేవారుగా, సెక్స్ వర్కర్లుగా తయారయ్యారనీ చెప్పాడు.

కొజ్జాలు ఎవరింట్లోనైనా శుభకార్యాలకి వచ్చినప్పుడు వాళ్ళ ఆటలు పాటలు చూసి జనం నవ్వుకోటం తప్ప నిజానికి కొజ్జాల గురించి నా కస్సలేం తెలియదు. అదేదో వినోదం అనుకునేవాణ్ణి కానీ అందులో కొంత హేళన వుందని ఇప్పుడే అర్ధమైంది.

“అయితే ఈ విషయం నీవే వచ్చి ఇంట్లోవారితో మాట్లాడు” అన్నాను. అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అంచనా వేస్తూ.

“ఓ తప్పకుండా” అన్నాడు.

సందీప్ ఇంటికి వచ్చి ఈ విషయం ప్రస్తావించి నప్పుడు ఇంట్లో పెద్ద రణమే జరిగింది “నువ్వేదో మంచి వాడవి అనుకున్నాను! నా కొడుకుని పట్టుకుని ఎంత మాట అన్నావ్?” అంటూ అమ్మ గయ్యని అపరకాళిలా లేచింది.

నాన్న కూడ కోపంతో ఊగిపోతున్నాడు. ఆకోపంలో నా వైపుకి తిరిగి “అసలు నువ్వు అలా వయ్యారంగా నడవబట్టే అతను అంత మాట అనగలిగా”డంటూ నేను ఏదో తప్పు చేసినట్లు నామీదకి వచ్చాడు కొట్టేందుకు.

నేను భయపడి అమ్మచాటుకి దాక్కున్నాను. అప్పుడే బయటి నుండి లోనికి వచ్చిన అన్నయ్య ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి అమ్మనీ, నాన్నిని సముదాయించి కూర్చోబెట్టాడు.

సందీప్‌ని విషయం ఏంటని అడిగి తెలుసుకున్నాక “అమ్మా! ఎందుకంత కోపం వస్తుంది? మనకి ఇష్టం లేనంత మాత్రాన ఓ నిజం మరుగున పడుతుందా? సందీప్‌కి ఏమైనా పగా మనమంటే? అతను చదువుతుంది డాక్టరు కాబట్టి విషయం త్వరగా గ్రహించి మనకి పరిష్కారం చెబుతున్నాడు.

మీకు తెలియదేమో నేను వాణ్ణి చిన్నప్పటి నుండి అబ్జర్వుచేస్తున్నాను. వాడి నడవడిక, ఆలోచనలు, కోరికలు అన్నీ ఆడపిల్లలివే. నా కప్పుడు తెలియలేదు వీడెందుకు ఇలా తేడాగా వున్నాడని. ఇప్పుడు సందీప్ చెబుతుంటే అర్ధం అయింది. వాడి లైఫ్ బాగుండాలంటే ఆపరేషనుకు ఒప్పుకుంటే మంచిది. లేదంటే ఎలాగో మరో రెండేళ్ళు గడిచాక వాడు మేజరు అయినాక చేయించు కుంటాడు. అప్పుడు మీరు చేయగలిగింది ఏవుంది?” అన్నాడు.

అమ్మ భోరున ఏడుస్తూ “అది కాదురా ఇప్పటి వరకూ మన బంధువులంతా మాకు ఇద్దరూ అబ్బాయిలే అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు, వీడు తేడాగా పుట్టాడు అంటే నవ్వరా? చులకనైపోమా? పైగా నీకు పెళ్ళి సంబంధాలు వస్తాయా?” అంది.

“ఎప్పుడో ఐదేళ్ళ తర్వాత చేసుకునే పెళ్ళికి వీడినెందుకమ్మా ఇబ్బంది పెట్టటం. ఒకవేళ పెళ్ళయ్యాక అయినా అమ్మాయికి విషయం తెలియదా? ఇప్పటికే వీడు స్కూల్లో ఎన్నో అవమానాలు పొందాడు. ఎన్నో రాత్రళ్ళు కుళ్ళికుళ్ళి ఏడ్వటం నేను చూసాను. ఇప్పటికైనా వాడికి విముక్తి ఇస్తే మంచిది” అని సందీప్ దగ్గరకు వెళ్ళి భుజంపై చేయి వేసి ఆలోచించుకుంటార్లే మనం అలా బయటకుకెళదాం అన్నట్లుగా సైగ చేసి బయటకు వెళ్ళిపోయారు.

ఆ తర్వాతి నుండి రోజులు భారంగా గడిస్తున్నాయి. అమ్మ ముభావంగా వుంటుంది.

అంతం క్రితం వరకూ నన్ను దగ్గరకి తీసుకుని ముచ్చట్లు అడిగే నాన్న, నన్ను తాకటం ఇష్టం లేనట్లుగా నా పక్క నుండి వెళ్ళుతూ కూడ పట్టించుకోవడం లేదు. అమ్మయితే “నేనేం పాపం చేసాను ఇటువంటి సంత నాకే పుట్టాలా?” అంటూ గొణగటం మొదలు పెట్టింది. నేను పుట్టుకతో హార్మోన్ లోపంతో పుట్టటం నా తప్పా? హార్మోన్ తేడా ఎందువల్ల వస్తుంది. నేను అమ్మపొట్టలో వున్నప్పుడు అమ్మ పాటించని ఆహారనియమాల వల్లనా లేక వంశపరంగా అమ్మ తరపువో, నాన్నతరపునో జన్యుపరమైన లోపాల వల్లనా? ఏదైతేనేం నా తప్పయితే కాదు కదా! మరి వీరికి ఆ సంగతి చెప్పేదెవరు? తలచుకుంటే గుండెల్లో ఏదో గుచ్చుకుంటున్న బాధ.

ఇప్పుడు ఇదే నా దుఃఖానికి కారణం. అమ్మ అర్ధం చేసుకుంటుందనుకున్నాను. ఇద్దరూ మొగపిల్లలే, నాకు ఆడ పిల్ల వుంటే ఎంత బావుండు అని చెప్పే అమ్మేనా ఇలా అంటుంది. నాకేం చేయాలో అర్ధం కావడం లేదు. నేను వంటరిని అనే ఫీలింగు వస్తుంది. అన్నయ్య మంచి వాడు కానీ నా మూలంగా అన్నయ్యకి పెళ్ళికాదంటుంది అమ్మ. పోనీ చచ్చిపోనా? నా మూలంగా అమ్మ కెందుకు కష్టం. అవును అదే కరెక్టేమో, సందీప్ చెప్పాడుకదా! నా బోటి వారికి ఆదరణ లేకపోతే రోడ్లంట అడుక్కు తినటమో, లేదా వేశ్యలుగా బతాకాల్సి రావటమో జరుగుతుందని. అలా వుండలేను దాని కన్నా ఇలా చనిపోవటం నయంకదా. ఆలోచిస్తూ పైకి చూస్తున్న నాకు ఫ్యాను కనబడింది. నా మదిలో స్కెచ్ రడీ అయింది.

రాత్రి అంతా నిద్రపోయిక నిదానంగా లేచి హాల్లోకి వచ్చాను. రడీగా పెట్టుకున్న ఎత్తుపీట జరిపి ఫ్యాను కింద వుంచి, అమ్మచీర ఫానుపై వేసి ముడి బిగించి రెండో వైపున ఉచ్చు బిగించి మెడకి తగిలించు కున్నాను. కింద టేబుల్ ని కాళ్ళతో తోసేసాను. రెండు కాళ్ళని ఏదో మెత్తగా తగలటం తెలుస్తూనే వుంది.

కళ్ళు తెరచి చూసిన నాకు ఎదురుగా అమ్మ నాన్న ఆదుర్ధా నిండిన కళ్ళతో, “లేచావా కన్నా! ఎందుకురా అలాంటి పని చేద్దామనుకున్నావు. బుద్ది తక్కువై నిన్ను కష్ట పెట్టాను. రెండేళ్ళు పెంచుకున్న కుక్క పిల్ల చనిపోతేనే తట్టుకోలేకపోయా, కాదా! అలాంటిది పదహారేళ్ళు అపురూపంగా పెంచిన నిన్నెలా దూరం చేసుకుంటారా? సమయానికి నాన్న నిన్ను చూసాడు కాబట్టి సరిపోయింది” ఇంకా ఏదో చెబుతోంది

నేను అమ్మని మాట్లాడనివ్వకుండా శక్తంతా కూడదీసుకుని గట్టిగా అరచాను “బతికి ఇప్పుడు నేనేం చేయాలి?”

తప్పయిందిరా కన్నా! ఎంతో మంది పిల్లలు అరుదైన వ్యాధితో మంచాన పడితే తల్లులు తమ సాయశక్తులా ప్రయత్నం చేసి కాపాడి పెంచుతున్నారు. అలాంటప్పుడు ఎవరైనా “మీకెంత మంది పిల్లలు అని అడిగితే ఒకబ్బాయి, ఒక ట్రాన్స్‌జండర్ అమ్మాయి అని నోరు తెరచి చెప్పకోలేనా? ధైర్యంగా చెబుతా. నీవేం దిగులు పడకు” అంటూ నా బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంది.

ఇంతలో అన్నయ్య, సందీప్‌లతో డాక్టరు గారు లోనికి రావడం చూసి నేను పైకి లేవబోయాను “హలో, కాంతీ! ఎలా వుంది నీకు ఇప్పుడు?” నవ్వుతూ డాక్టరుగారు నా పేరు ఫిక్స్ చేసేసారు.

అమ్మానాన్నలకి అర్ధం అయ్యేలా డాక్టరుగారే చెప్పివుంటారని అప్పుడర్ధమై రెండు చేతులు ఎత్తి నమస్కరించాను.

రచయిత పరిచయం

ఉయ్యూరు అనసూయ

ఉయ్యూరు అనసూయ

ఉయ్యూరు అనసూయ గారి నివాసం, పుట్టి పెరిగిన ఊరు విజయవాడ దగ్గర ఉన్న తిరువూరు. కొంతకాలం ఆ ఊరికి సర్పంచ్‌గా, న్యాయవాదిగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా పని చేసారు. 2015 నుండీ రచనలు చేస్తూ 60 వరకూ కథలు, ఒక నవల రాసారు. అందులో కొన్ని కథలు బహుమతులు గెలుచుకున్నాయి.

4 Responses to “అంగన”

  1. Purnima

    ఎంత అధ్బుతంగా రాసారు అమ్మ.చిన్నారులు వారి మనోగతం చెప్పుకోలేక పడే వేదనని వారి అంతరంగాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు.అధ్బుతంగా ఉంది అమ్మ.

    Reply
  2. రాధా రాణి

    చాలా బాగా రాసారు. సున్నితమైన విషయాన్ని చక్కగా కథలో ఇమిడ్చారు

    Reply
  3. సి. కె. శామ్యూల్

    నేను చదివిన రచనల్లో ఇది ఒక ఉత్తమ రచన. సున్నితమైన విషయాన్ని ఎంతో చక్కగా, ఆసక్తికరంగా చెప్పారు. రచన కోసం పడిన శ్రమ తెలుస్తోంది. బహుశా చాలాసార్లు తిరగ రాసుకుని ఉంటారు. అందుకే ఇంత బాగా వచ్చింది. రచయిత్రికి అభినందనలు, సామాజికపరమైన ఒక సమస్య గురించి అవగాహన కలిగించినందుకు కృతజ్ఞతలు. 🙏

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.