తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

నువ్వే ఒక పాలపుంత

తెల్సా కవితల పోటీలో ₹10,000 పారితోషికం పొందిన కవిత
© Telugu Society of America

ఏముందిక్కడ అనుకోకు
వానలా వంగి చూడాలే గానీ
చెట్టుంది నది ఉంది సముద్రముంది
ఇంటి ముందు అమ్మ వేసిన ముగ్గుంది
అదిగో దూరంగా
నిన్ను చూస్తూ కూర్చున్న కొండ ఉంది
అన్నింటినీ పలకరిస్తూ పోయే గాలుంది

గుండెని గుండెతో పట్టుకుని చూడు
చేతిలో చేయ్యేసి హత్తుకుని చూడు
జీవితం రుచి తెలుస్తుంది
దారి తప్పిన పడవల్లాంటి మనుషులకు
తెడ్డొకటి దొరుకుతుంది
చీకటిలో మిణుగురొకటి వెలుగౌతుంది
ఏమీ లేదని ఎందుకనుకుంటావ్

మా ముత్తాత నాటిన చెట్టు బతికే ఉంది
నీటిని కోల్పోయిన చెరువు లోకి
మేఘం చినుకుల్ని పంపింది
ఎదిగే మొక్కల్ని చూడు
పొదిగే పక్షుల్ని చూడు
పడి దోగాడి లేచి తిరుగుతున్న పాపని చూడు

బిడ్డ ఆకలి తీరాక అమ్మ గుండె పొందే సంతోషం
ఏపుగా ఎదిగే పైరు ను చూసే రైతు కళ్ళ సంబరం
రెక్కలు తొడిగి తొలిసారి ఎగురుతున్న పిట్ట ఉల్లాసం
చినుకుల్లో తడిచి
బొట్టు బొట్టును అనుభూతించే మట్టి ఆస్వాదన

భిన్న దృశ్యాల సమ్మేళనంలో
జీవితం ఉత్సవం కావాలి
కళ్ళు కనే కలల్ని రాజేసుకోవాలి గానీ
నువ్వో పాలపుంతలా వెలిగిపోతావ్

రచయిత పరిచయం

డాక్టర్ సుంకర గోపాలయ్య

డాక్టర్ సుంకర గోపాలయ్య

డాక్టర్ సుంకర గోపాలయ్య గారు తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పని చేస్తున్నారు. “మా నాయినపాట” అనే కవితా సంకలనం ప్రచురించారు. అనేక సాహితీ పురస్కారాలు పొందారు. నెల్లూరు జిల్లా ఓజిలి రాచపాలెం వీరి సొంత ఊరు.

7 Responses to “నువ్వే ఒక పాలపుంత”

  1. K శివప్రసాద్

    మనిషి అనుబందాలు.. గురించి గొప్పగా వున్న కవిత…
    తేలిక తనం… కావాల్సింది మనసుకు…
    అది ఈ కవిత చదివిన వారికి కచ్చితంగా వస్తుంది..
    పాలపుంత ఎక్కడ ఆకాశ అనంతo లో కాదు..
    సరళ మైన బతుకు జీవితం లో వుంది..
    అని ఈ కవిత చెప్పిన గోపాల్ కి అభినందనలు..
    Tesla వారి గుర్తింపు కి ధన్యవాదములు

    Reply
  2. మద్దెల నాగరాజు

    అన్న మీ అభివ్యక్తి..పామరులను సైతం చదివిస్తుంది…బాగుంది అన్న…కవిత్వ వాక్యంలో..పాలపుంతనైతా….

    Reply
  3. అన్నం శివకృష్ణ ప్రసాద్

    ఎప్పుడు ఓ కొత్త అభివ్యక్తి తో స్వేచ్చా కవిత్వం రాస్తారు గోపాల్ సార్

    Reply
  4. srikanthaspurthi

    గుండెకు హత్తుకోగలిగినంత అర్థవంతమైన కవిత.

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.