తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

రచయితల పరిచయం

కెవివి సత్యనారాయణ

కెవివి సత్యనారాయణ

కెవివి సత్యనారాయణ గారు ఆంధ్రాబ్యాంకులో మేనేజరుగా పనిచేసి రిటైర్ అయ్యారు.వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. “ఋతం” అనే నవల చతుర మాస పత్రికలో ప్రచురింపబడింది. వీరు “అర్థనారీశ్వరం” అన్న నాటకానికి 2001 లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ రచన పురస్కారాన్ని అందుకున్నారు. వీరు వ్రాసిన “అద్వితీయం”, “నారీ నారాయణమ్”, “యవనిక”, “హంసలదీవి” నాటకాలు ప్రాచుర్యం పొందాయి. “అంతరాపత్య”, “రాలిన పారిజాతాలు” అనే కవితా సంపుటాలను వెలువరించారు. “యవనిక”, “అర్మిలి”, “గతి” ఈయన ఇతర నవలలు. మొదటి బహుమతి పొందిన వీరి కథ కర్రెద్దు.

డా. జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు గారు నూజివీడులోని ఐ.ఐ.ఐ.టీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. 2012 నుండి ఇప్పటివరకూ డెబ్భై ఐదుకు పైగా కథలు, డెబ్భైకి పైగా కవితలు, పాతికపైగా పాటలు రాశారు. ఎన్నో కథలకు, కవితలకు బహుమతులు అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సుమారు డెబ్భై వ్యాసాలు సమర్పించారు. “తలరాతలు”, “ఆకుపచ్చని కన్నీళ్లు” అనే కథాసంపుటాలను, “గడియారం బతుకులు” అనే కవితాసంపుటం, “వ్యాసలోహిత” అనే వ్యాససంపుటి, “విజయవిలాసం” అనే చిన్న సమీక్షా గ్రంథం వెలువరించారు. ప్రస్తుతం “మంచుకింద ఉక్కపోత” అనే పేరుతో మూడవ కథాసంపుటి వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు. మొదటి బహుమతి పొందిన వీరి కథ దాహం.

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె.ఎ. మునిసురేష్ పిళ్లె: శ్రీకాళహస్తిలో పుట్టి హైదరాబాదులో స్థిరపడ్డారు. రాయడం ఆసక్తి, ఆదరవు. పాత్రికేయం ప్రధాన వ్యాసంగం. అందులో ఇమడలేకపోయిన సంగతులు మెలిపెట్టినప్పుడు రచనా వ్యాసంగానికి పూనుకుంటారు. కవిత, నవల, వ్యంగరచన, కార్టూన్లలో కూడా ప్రవేశం ఉంది. మధురాంతకం రాజారాం కథ “పొద్దుచాలని మనిషి” వీరికి స్ఫూర్తి నిస్తుంది. రెండవ బహుమతి పొందిన వీరి కథ గేణమ్మ. బహుమతి పొందిన వీరి కవిత షష్ఠముడు.

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి: సొంత ఊరు చిత్తూరు జిల్లా మదనపల్లె పక్కన దిగువబురుజు అనే పల్లె. చిత్తూరు జిల్లా మాండలికంలో కథలు రాస్తుంటారు.  వీరి కథలతో “ఎదారి బతుకులు”,  “బతుకీత” అనే కథా సంపుటులు వెలువరించారు. ఇంకా అనేక కథలు   వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.  అనేక  కథలకు పురస్కారాలు, బహుమతులు అందుకొన్నారు. రెండవ బహుమతి పొందిన వీరి కథ జాలారి పూలు. విశిష్టరచనగా ఎంపిక అయిన వీరి కథ ఆరంజ్యోతి మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో.

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్ గారి నివాసం సిరిసిల్ల. వీరు వృత్తిరీత్యా గణితశాస్త్ర ఉపాధ్యాయులు. సినిమాలకు పాటలు కూడా రాస్తుంటారు. రచయితగా ఇప్పటివరకూ ఏడు నవలలు, 250 కథలు, నాలుగు నాటకాలు, అనేక వ్యాసాలు రచించారు. ఎనిమిది కథా సంకలనాలు ప్రచురించారు. వీరి కథలు కన్నడ, మరాఠీ, హిందీ భాషలలోకి అనువాదం అయ్యాయి. వీరి నవల “జిగిరీ” 2006 లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తరఫున మా బృందం నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది. (జిగిరీ నవల ఆన్‌లైనులో చదవవచ్చు) ఈ నవల తొమ్మిది భారతీయ భాషలలోనికి అనువాదం అయింది. అరుదైన కథా వస్తువులు తీసుకొని, ఆగకుండా చదివించే శైలిలో రాయడం తన ప్రత్యేకత అని వీరు భావిస్తారు. మూడవ బహుమతి పొందిన వీరి కథ ఉల్లిపూసలు

కె.వి. మేఘనాథ్ రెడ్డి

కె.వి. మేఘనాథ్ రెడ్డి

కె.వి. మేఘనాథ్ రెడ్డి గారిది తమిళనాడు సరిహద్దులోని కాలువపల్లి అనే చిన్న గ్రామం. ఆ ప్రాంతపు మాండలికంలో రచనలు చేస్తుంటారు. ఇప్పటివరకూ 31 కథలు, 600 కు పైగా కవితలు, 60కి పైగా సాహితీ విమర్శనాత్మక వ్యాసాలు రాసారు. “కన్నీటి కలువ”, “అగజాత” అనే నవలలు కూడా రచించారు. అనేక రచనలకు పురస్కారాలు పొందారు. సాహితీసేవలో భాగంగా “సృజన సాహిత్య సంగమం” అనే సంస్థ ద్వారా ప్రతి ఏడాదీ సాహితీ కార్యక్రమాలు, రచనల పోటీలు నడుపుతూ ఉంటారు. వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనింగ్, వెడ్డింగ్ ఈవెంట్ మానేజ్మెంట్ చేస్తుంటారు. మూడవ బహుమతి పొందిన వీరి కథ వాన మబ్బులు.

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి: స్టార్ మా తెలుగు చానెల్‌లో రచయితగా పనిచేస్తున్నారు. ఈటీవీ కన్నడవాహినిలో పనిచేసినప్పుడు కన్నడంలో కూడా రచనలు చేశారు. ముప్ఫై కథలకి వివిధ పోటీల్లో బహుమతులు పొందారు. వలసదేవర నవలకి గాను అమెరికన్ తెలుగు అసోసియేషన్‌వారి తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందారు.రచయిత కాకముందూ, తరవాతా కూడా జీవితాన్నే తప్ప సాహిత్యాన్ని చదవకపోవడమే తన బలమూ, బలహీనత అని నమ్ముతారు. విశిష్టరచనగా ఎంపిక అయిన వీరి కథ వేస్ట్ బాడీ.


బండ్ల మాధవరావు

బండ్ల మాధవరావు

బండ్ల మాధవరావు గారు తెలుగు, ఇంగ్లీషులలో ఎం.ఏ. పట్టాలు పొందారు. శిఖర స్కూల్, రిజోనెన్స్ జూనియర్ కాలేజ్‌కి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. “చెమట చిత్తడినేల”, “స్పర్శ” “అనుపమ”, “ఊరి కల” (దీర్ఘకవిత), “మాఊరు మాఇల్లు”, “దృశ్య రహస్యాల వెనుక” వీరి కవితాసంపుటులు. కొన్ని అభినందన సంచికలకూ, వార్షిక సంచికలకూ సంపాదకత్వం వహించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ తెలుగు సాహితీ సభలలో పాల్గొన్నారు. బహుమతి పొందిన వీరి కవిత ఆగిపోయిన చోటునుండే.

దొండపాటి నాగజ్యోతి శేఖర్

దొండపాటి నాగజ్యోతి శేఖర్

దొండపాటి నాగజ్యోతి శేఖర్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వీరి కథలు, కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. సామాజిక హితం కోరే, మానవ సంబంధాలను పెంపొందించే రచనలు చేయడం వీరికి ఇష్టం. మనిషి ఒక పద్యమని, అక్షరాలు అభ్యుదయాన్ని పుట్టిస్తాయని వీరి ప్రగాఢ నమ్మకం. “రెప్పవాల్చని స్వప్నం” అనే కవితా సంపుటిని ప్రచురించారు. బహుమతి పొందిన వీరి కవిత ఒకానొక సార్ధక సవారీ.

డాక్టర్ సుంకర గోపాలయ్య

డాక్టర్ సుంకర గోపాలయ్య

డాక్టర్ సుంకర గోపాలయ్య గారు తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పని చేస్తున్నారు. “మా నాయినపాట” అనే కవితా సంకలనం ప్రచురించారు. అనేక సాహితీ పురస్కారాలు పొందారు. నెల్లూరు జిల్లా ఓజిలి రాచపాలెం వీరి సొంత ఊరు. బహుమతి పొందిన వీరి కవిత నువ్వే ఒక పాలపుంత.


ఉయ్యూరు అనసూయ

ఉయ్యూరు అనసూయ

ఉయ్యూరు అనసూయ గారి నివాసం, పుట్టి పెరిగిన ఊరు విజయవాడ దగ్గర ఉన్న తిరువూరు. కొంతకాలం ఆ ఊరికి సర్పంచ్‌గా, న్యాయవాదిగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా పని చేసారు. 2015 నుండీ రచనలు చేస్తూ 60 వరకూ కథలు, ఒక నవల రాసారు. అందులో కొన్ని కథలు బహుమతులు గెలుచుకున్నాయి. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ అంగన.

బద్రి నర్సన్

బద్రి నర్సన్

బద్రి నర్సన్ గారు పుట్టి పెరిగిన ఊరు జగిత్యాల. ప్రస్తుత నివాసం హైదరాబాద్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుండి 2015 లో పదవీ విరమణ చేసారు. పదేళ్ళుగా కథలు రాస్తున్నారు. వీరివి సుమారు 50 కథలు పలు పత్రికల్లో వచ్చాయి. కొన్ని బహుమతి పొందాయి. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ ఈ శిక్ష మాకొద్దు.

గాజోజు నాగభూషణం

గాజోజు నాగభూషణం

గాజోజు నాగభూషణం గారి సొంత ఊరు జగిత్యాల. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. కవిత్వం, కథలు రాస్తారు. పాటలు స్వయంగా రాసి, పాడుతారు. “మట్టి సరిగమలు”, “ప్రాణ దీపం” అనే కవిత్వ సంపుటాలు వెలువరించారు. వీరి రచన “నెత్తుటి గాయాలు” లోని పాటలు స్వయంగా పాడి సి.డి. విడుదల చేశారు. 2009 నంది టి.వి.అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. వీరి కవితలకు అనేక పురస్కారాలు లభించాయి. ఇప్పటివరకూ పది కథలు రచించారు. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ ఋణం.

ఉమా మహేష్ ఆచాళ్ళ

ఉమా మహేష్ ఆచాళ్ళ

ఉమా మహేష్ ఆచాళ్ళ గారు 27 ఏళ్ళుగా విశాఖపట్నం కస్టమ్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. 2016 డిసెంబరునుండి ఇప్పటివరకూ అన్ని ప్రముఖ పత్రికల్లో దాదాపు 40 కథలు ప్రచురించారు. వీటిలో 21 కథలతో “సంఘే శక్తి కలియుగే” అనే కథా సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ఇటీవలే విడుదలైంది. అనేక కథలకు బహుమతులు లభించాయి. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ పులి వన్నె మేక.

“వసుంధర” కలంపేరుతో సంయుక్తంగా రచనలు చేసే వీరు దంపతులైన డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు(శాస్త్రవేత్త), రామలక్ష్మి (గృహిణి). దాదాపు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసి, అన్ని వయసుల తెలుగు పాఠకులకీ చిరపరిచితులు అయినవారు. వేలాది కథలు, నవలలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు రచించారు. కొన్ని రచనలు సినిమాలుగా వచ్చాయి. టీవీ, ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు విలువైన సలహాలు ఇస్తూ “సాహితీవైద్యం” అనే వినూత్నమైన శీర్షిక 1992 నించీ రచన మాసపత్రికలో నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ బృందావనమది.

పొత్తూరి సీతారామరాజు

పొత్తూరి సీతారామరాజు

పొత్తూరి సీతారామరాజు గారి నివాసం కాకినాడ. వృత్తి భవన నిర్మాణరంగంలో. కవిత్వం, కథా రచన, విమర్శ, సమీక్ష వీరి ప్రవృత్తులు. ఇప్పటి వరకు 50 కవితలు రాసారు. “మా భూమి నవ్వదా”, “ఆకలిపూవు”, “ధరణి ఘోష”, “అమ్మలేని సముద్రం”, “ప్రతిభా నీ కలం ఏమిటి” మొదలైన రచనలు బహుమతులు పొందాయి. డా. అద్దేపల్లి రామమోహన రావు వీరి గురువు. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ రాజవ్వ.

శ్రీసుధామయి

శ్రీసుధామయి

శ్రీసుధామయి (కలంపేరు) గారి పుట్టిన ఊరు అనంతపురం జిల్లాలోని గంజికుంట. ఎంబీఏ చదివిన వీరికి రచనే వృత్తి, ప్రవృత్తి. ఐదేళ్ళుగా రచనలు చేస్తూ ఎనభైకి పైగా కథలు, పన్నెండు నవలలు రాసారు. హారర్, రొమాన్స్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, జానపద లాంటి అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ రచనలు ప్రచురించారు. పాఠకాభిమానుల ఆదరణ, కొత్తదనాన్ని స్వాగతించే పత్రికాధిపతుల ప్రోత్సాహం ఏ రచయితకైనా సక్సెస్ మంత్రం అని వీరు నమ్ముతారు. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ వజ్రం.

డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు

డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు

డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు గారు భారత ప్రభుత్వరంగ బీమా సంస్థ నుండి సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ స్థాయి అధికారిగా పదవీ విరమణ చేసారు. విశాఖపట్నం నివాసి. ముప్ఫయ్యేళ్ళుగా రచనలు చేస్తూ 225 కథలు రాసారు. అనేక కథలు బహుమతులు పొందాయి. “జాబిలి మీద సంతకం”, “నేలకు దిగిన నక్షత్రం” అనే కథాసంపుటాల్ని వెలువరించారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. “ఆకాశంలో ఒక నక్షత్రం” అనే కథ ఇంగ్లీషు నాటకంగా రూపుదిద్దుకొంది. జీవిత స్పర్శ కలిగిన కథలు చదవడం, రాయడం వీరి అభిరుచి. సాధారణ ప్రచురణకి ఎంపికైన వెయిటింగ్ ఫర్ వీసా వీరి కథ.

నస్రీన్ ఖాన్

నస్రీన్ ఖాన్

నస్రీన్ ఖాన్ గారు వృత్తిరీత్యా పాత్రికేయులు. నివాసం హైదరాబాదు. “తెలంగాణ సాహితి” అనే సంస్థలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నారు. అందులో భాగంగా కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు లాంటి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. “ౙఖ్మీ” పేరిట కవితా సంపుటి వెలువరించారు. త్వరలో “దాస్తాన్” అనే కథల సంపుటి ప్రచురించబోతున్నారు. వీరికి సామాజిక అధ్యయనం ఇష్టమైన వ్యాసంగం. సాధారణ ప్రచురణకి ఎంపికైన వీరి కథ హద్దులకు ఆవల.


చొక్కర తాతారావు

చొక్కర తాతారావు

చొక్కర తాతారావు గారు విశాఖపట్నం కేంద్ర సముద్ర మత్స్య పరిశోథనా సంస్థలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. వెయ్యికి పైగా కవితలు, వందకు పైగా కథలు, 40 వ్యాసాలు, 30 గేయాలు, 7 నాటికలు, 3 నాటకాలు రాశారు. వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికలలో రచనలు ప్రచురించారు. వీరి రచనలు కొన్ని ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. అనేక రచనలకు బహుమతులు అందుకున్నారు. కొన్ని సినిమాలకు వివిధ శాఖలలో రచనలు చేసారు. మంచి రచనకు ఆత్మ, ఆర్తి, తడి, తాత్విక చింతన ఉండాలని నమ్మే వీరి రచనలు మానవత్వం చుట్టు తిరుగుతుంటాయి. బహుమతి పొందిన వీరి కవిత ఏదో ఒకటి మాట్లాడు.

దాట్ల దేవదానం రాజు

దాట్ల దేవదానం రాజు

దాట్ల దేవదానం రాజు గారు కథ, కవిత, నవల, చరిత్ర గ్రంథం వంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేసారు. అనేక పురస్కారాలు అందుకొన్నారు. “వానరాని కాలం”, “గుండె తెరచాప”, “మట్టికాళ్ళు”, “లోపలి దీపం” తోపాటు మొత్తం ఏడు కవితా సంపుటాలు ప్రచురించారు. “దాట్ల దేవదానం రాజు కథలు”, “యానాం కథలు”, “కల్యాణపురం”, “కథల గోదారి” మరికొన్ని కథాసంపుటాలు కూడా ప్రచురించారు. “యానాం చరిత్ర” అనే చరిత్ర గ్రంథం కూడా రచించారు. కోడి పందాల నేపథ్యంతో “బరిలో” అనే నవల రాసారు. వీరి నివాసం యానాంలో. బహుమతి పొందిన వీరి కవిత నా లోకి నదిని ప్రవహించనీయండి

దేశరాజు

దేశరాజు

దేశరాజు అన్న పేరుతో రచనలు చేసే వీరి పూర్తి పేరు దేశరాజు రవికుమార్. పాత్రికేయులుగా హైదరాబాదులో స్థిరపడ్డారు. కవిలు, కథలతోపాటు ఇంటర్వ్యూలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఇప్పటివరకూ “ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ”, “దుర్గాపురం రోడ్” అనే కవితా సంపుటాలు, “బ్రేకింగ్ న్యూస్” అనే కథా సంపుటి వెలువరించారు. త్వరలో రెండో కథా సంపుటి “షేమ్..షేమ్.. పప్పీ షేమ్” ప్రచురించబోతున్నారు. బహుమతి పొందిన వీరి కవిత   మరణానికి మరో చూపు.