నువ్వే ఒక పాలపుంత
ఏముందిక్కడ అనుకోకు
వానలా వంగి చూడాలే గానీ
చెట్టుంది నది ఉంది సముద్రముంది
ఇంటి ముందు అమ్మ వేసిన ముగ్గుంది
అదిగో దూరంగా
నిన్ను చూస్తూ కూర్చున్న కొండ ఉంది
అన్నింటినీ పలకరిస్తూ పోయే గాలుంది
గుండెని గుండెతో పట్టుకుని చూడు
చేతిలో చేయ్యేసి హత్తుకుని చూడు
జీవితం రుచి తెలుస్తుంది
దారి తప్పిన పడవల్లాంటి మనుషులకు
తెడ్డొకటి దొరుకుతుంది
చీకటిలో మిణుగురొకటి వెలుగౌతుంది
ఏమీ లేదని ఎందుకనుకుంటావ్
మా ముత్తాత నాటిన చెట్టు బతికే ఉంది
నీటిని కోల్పోయిన చెరువు లోకి
మేఘం చినుకుల్ని పంపింది
ఎదిగే మొక్కల్ని చూడు
పొదిగే పక్షుల్ని చూడు
పడి దోగాడి లేచి తిరుగుతున్న పాపని చూడు
బిడ్డ ఆకలి తీరాక అమ్మ గుండె పొందే సంతోషం
ఏపుగా ఎదిగే పైరు ను చూసే రైతు కళ్ళ సంబరం
రెక్కలు తొడిగి తొలిసారి ఎగురుతున్న పిట్ట ఉల్లాసం
చినుకుల్లో తడిచి
బొట్టు బొట్టును అనుభూతించే మట్టి ఆస్వాదన
భిన్న దృశ్యాల సమ్మేళనంలో
జీవితం ఉత్సవం కావాలి
కళ్ళు కనే కలల్ని రాజేసుకోవాలి గానీ
నువ్వో పాలపుంతలా వెలిగిపోతావ్
7 Responses to “నువ్వే ఒక పాలపుంత”
చాలా బాగుంది సార్ మీ కవిత
మనిషి అనుబందాలు.. గురించి గొప్పగా వున్న కవిత…
తేలిక తనం… కావాల్సింది మనసుకు…
అది ఈ కవిత చదివిన వారికి కచ్చితంగా వస్తుంది..
పాలపుంత ఎక్కడ ఆకాశ అనంతo లో కాదు..
సరళ మైన బతుకు జీవితం లో వుంది..
అని ఈ కవిత చెప్పిన గోపాల్ కి అభినందనలు..
Tesla వారి గుర్తింపు కి ధన్యవాదములు
అన్న మీ అభివ్యక్తి..పామరులను సైతం చదివిస్తుంది…బాగుంది అన్న…కవిత్వ వాక్యంలో..పాలపుంతనైతా….
ఎప్పుడు ఓ కొత్త అభివ్యక్తి తో స్వేచ్చా కవిత్వం రాస్తారు గోపాల్ సార్
చక్కని కవిత అండి. అభినందనలు
చాలా బాగుంది
అభినందనలు
గుండెకు హత్తుకోగలిగినంత అర్థవంతమైన కవిత.