ఋణం
“బాపూ! ఈ దీపావలి పండక్కైనా నాకు మీ అందర్నీ చూసే బాగ్గెం ఉందా, లేదానె. పుట్టినూరును, కన్నవాల్లను సూడాలని కండ్లు కాయలు గాత్తన్నయి. రెండేండ్లాయె ఇంటికిరాక. ఇంట్లో మా ఇద్దరు యారాండ్లే కాదు, సుట్టాలల్ల పెండ్లైన ఆడివిల్లలందరూ, ఆల్ల ఆల్ల తల్లిగారిండ్లల్లకు పండక్కిపోయి, నాలుగు రోజులు సంబురంగా గడిపి, అచ్చినంక తల్లిగారింటి ముచ్చట్లు చెప్పుతాంటే, నా పానమంతా తల్లడం మల్లడం అయితాన్నదే. అందరూ ఉన్నా గూడా, ఎవల్లు దిక్కులేని అనాదలాగ అందరి ముందే నాదాన్గ బత్కవడ్తి. అచ్చే దీపావలి కన్నా ఇత్తానన్న కట్నం ఇచ్చి, అల్లున్ని, నన్ను, పిల్లగాండ్లను ఇంటికి తోల్కపోతవా? లేకపోతే తల్కాయ దించుకొని ఈన్నే పడిసావుమంటవా?”
ఫోన్లో బిడ్డ మాటలు ఇన్నంక హన్మంతు కార్జాలు పల్గినంత పనైంది. ఒక్కగానొక్క బిడ్డ లగ్గమైతే చేసి పంపిండు కానీ, ఇత్తానన్న రెండు లక్షల కట్నం ఈ నాటికీ ఇవ్వలేకపోతుండు. లగ్గం చేసినేడు వానసుక్క కండ్లజూడక, పండీపండని పంట మొత్తం గద్దచ్చి కోడిపిల్లను తన్నుక పోయినట్టే అయి కంటికి కనిపించనేలేదు. ఆ తరువాతేడు కూడా వానలు మొకం తిప్పేసుకున్నయి.
“గట్లగాదు బిడ్డా, ఈ ఏటికి దీపావలి పండుక్కి మిమ్ముల్నందర్నీ ఇంటికి పిల్త బిడ్డా. మీకిచ్చే కట్నం మీకిత్త. ఇత్తానన్న దానికంటే, ఇంకగొన్ని ఎక్కువనె ఇత్త బిడ్డా, నా మాట నమ్ము. మీ అందరికీ బట్టలు వెట్టి, బంగారం బెట్టి అల్లున్ని గూడ ఖుషీ జేత్త బిడ్డా”
“నిజంగానానె బాపు? నేను మనింటి కత్తనా? మీ అందర్నీ కలుత్తనా? ఎంత మాట జెప్పినవే బాపూ, ఐతవానెగనీ, ఏడికెల్లి జేత్తవు బాపూ పైసలు? మల్ల మీ అల్లుని తాన నా మాట వోదు గదా?”
“ఏం బోదు బిడ్డా! ఎట్ల జేత్తె నీకెందుకు. ఇప్పటికే ఇన్నొద్దులుగా నిన్ను బాదవెట్టినందుకు సిగ్గువడుతున్నా”
ఫోన్లో, బిడ్డతో మాట్లాడిన మాటలన్నీ, హన్మంతు భార్య లచ్చుమమ్మ విని ఆశ్చర్య పోసాగింది. అడుగుదామని భర్తను కదిలియ్యబోతే, హన్మంతు సమాధానం చెప్పకుండా బైటవడ్డడు.
సాయంత్రం హన్మంతు, లచ్చుమమ్మ, హన్మంతు తల్లి కూర్చొని చాయ్ తాగుతున్న సమయంలో, హైదరాబాద్‌లో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు రాజేష్ నుండి ఫోన్‌కాల్ వచ్చింది.
“ఎట్లున్నవ్ బిడ్డా! బాగా సదువుకుంటున్నవా? మంచిగ సదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించాలె. నా కట్టం నీకు రావద్దు బిడ్డా! నీకు పెద్ద ఉద్యోగమత్తే మనందరి బతుకు మంచిగుంటది. ఈ దీపావలి పండుగకు నాలుగు దినాల ముందుగల్లనే రా! అక్క, బావ, పిల్లలు వత్తండ్రు”
“నేను మంచిగనే చదువుకుంటున్న బాపు. కానీ, కట్నం డబ్బులు ఇవ్వందే, ఇంట్ల అడుగుపెట్టనన్న బావ పండుగకు ఎట్ల వస్తడు బాపు?”
“ఇచ్చేత్త బిడ్డ! ఆల్ల పైసలు ఆల్లకిచ్చి నా ఋణం దీర్చుకుంట”
“ఎట్ల బాపు? ఎప్పటి నుండో అన్నీ అప్పులే అని బాధపడుతున్నవు. బ్యాంకుల, బయట ఎన్ని అప్పులున్నయో నాకు తెలుసు. ఇప్పుడెట్ల ఇస్తవు. నా దోస్తులందరికీ బండ్లు ఉన్నయ్. నాకు కూడా ఒక మోటార్ సైకిల్ కొనియ్యమని ఏడాది నుండి అడుగుతున్నా, ఎప్పుడూ అప్పుల్లల్ల ఉన్న అనే చెప్పుకుంట రావడితివి. నేను కూడా నీ బాధను చూడలేక నా కోరికను మనసుల్నే చంపుకుంటి. మరిప్పుడు నాక్కూడా బండి కొనిత్తవా బాపు”.
“తప్పకుండా బిడ్డా, నీకు నచ్చిన బండి కొనుక్కో. ఎంతైనా సరే. నువు నీ దోస్తుల్లల్ల ఇగ ఎవ్వల్లకు తక్కువ గాకుండా సంబురంగా ఉండు. మంచిగ సదువుకో” అనుకుంటూ హన్మంతు ఫోన్ కట్ చేశాడు.
“ఏందిరా అన్మంతు! అందరికీ అన్నీ జేత్తనంటున్నవు. ఈసారన్నా నన్ను కాశీయాత్రకు పంపుతవా లేదా? ఉళ్లో నా ఈడోల్లందరూ పోయచ్చిరి. ఆల్లు ఆ యాత్ర ముచ్చట్లు జెప్పినప్పుడల్లా నాకు ఆ అదృట్టం లేకపాయెనని పానం అయిషిపోవట్టె. పైసలకు నువ్వు పడుతున్న బాద జూసి, గట్టిగ అననీకి నోరు రాకపాయె. కానీ, ఈ కట్టె కాలే లోపల ఆ బాగ్గెం కలిగించు బిడ్డా. తుర్తిగ జీవునం ఇడుత్త” అంటూ తల్లి మాట్లాడగానే,
“అవ్వా, ఈ సారికి తప్పక పంపుతనే. యాత్రకు సర్వీసెప్పుడు దీత్తరో అడుగుత. కాశీ యాత్రనే గాదే. ఇంకా ఎటైనా పోబుద్దైనా పోదువుతియ్యి” అంటూ లేచి బయటకు వెళ్ళాడు.
రాత్రి భోజనాలు అయినంక, మంచం మీద పడుకున్న హన్మంతు పక్కకు వచ్చి కూర్చుంది లచ్చుమమ్మ.
“ఏందయ్యా? పొద్దుగాల్లటి నుంచి అందరికీ అన్నీ వరాలిత్తున్నవు. లాట్రి గిట్ల ఏమన్న తలిగిందా ఏంది? పుట్టెడు అప్పుల్లల్ల ఉన్న సంగతి నాకు ఎర్కనే. కానీ, అందరికీ అన్నీ ఇత్తనని పక్కాగా చెప్పవడ్తివి. ఏంజేద్దామనుకుంటున్నవ్?” అంది లచ్చుమమ్మ.
“చేత్తనే! అందరికీ అన్నీ చేత్త. ఇన్ని రోజులకెల్లి ఒకటే పట్టువట్టిన. ఊల్లె భూములన్నీ ప్లాట్లు జేసి అమ్ముతుంటే ఉన్న మన మూడెకరాలకు లచ్చల్లల్ల పైసలచ్చేదున్నా, తాతలు ` తండ్రుల నుంచి అచ్చిన భూమిని, ఎన్ని కట్టాలచ్చినా అమ్మకుండా, నా కొడుక్కు అప్పజెప్పాల్నని సూసిన. నాతోనైతె గిట్ల, ఇంకొంచెం భూమిని పెంచాల్ననే అనుకున్నా. కానీ, నాతోని కాకపాయె. ఉన్నదాన్నన్నా కాపాడాల్నని ఇన్ని రోజులు తండ్లాడిన. ఇగ నాతో అయితలేదే. ఏటికేడు పెట్టిన పెట్టువడన్నా ఎల్తలేదాయె. అప్పులు కుప్పగావట్టె. ఇత్తామన్న కట్నమియ్యక బిడ్డ ఇంటి మొకం సూడక రెండేండ్లు గావట్టె. పట్నంల సదువుకొనే కొడుకు ఒక బండి కొనియ్యమన్నా నాతోని గాకపాయె. అమ్మ ఎప్పటిసందో అడుగుతున్న సిన్న కోరిక. గా యాత్రగ్గూడా పంపకపోతి. నోరిడిసి ఎన్నడూ నువ్వు అడగలేదు గానీ, మన కాపుదానపోల్లల్ల ఆడోల్లు ఎంతో గింత నగలేసుకొనే ఉంటరు. కానీ పసుపు తాడు తప్ప, నీ పెయిమీదికి పిసరంత బంగారంతోని ఏదీ చేపియ్యకపోతి. గందుకే ఇగ కాయం జేసుకున్న. భూమి అమ్మ జెప్పిన్నే లచ్చిమీ! కొడుకు మంచిగ సదువుకొని మంచి కొలువుదెచ్చుకొని సల్లంగుంటే మల్ల భూమి జాగలు ఆడే కొనుక్కుంటడు”
“అయ్యో ఎంత పని జేత్తున్నవయ్యా! భూమి లేకుంటే పతార యాడుంటది. అమ్మంగ అమ్ముతవుగని, అటెన్క నీ మనసేం గావాలె. కాలం ఎప్పటికీ ఒక్కతీర్గనే ఉంటదా? భూమి అమ్మితే దిక్కులేని పచ్చులమైతము. మల్లొకపాలి ఇషారం జెయ్యయ్యా”
“బగ్గ ఆలోశనజేసినంకనే గీ పని జేత్తున్ననే, లచ్చరూపాలు బయాన గూడ దీసుకున్న. ఇగ మన బతుకంటవా? ఎట్లైనా మా భాగ్యమే. బగమంతుని మీద బారమేసి బతుకుదాం”
“ఏందయ్యో నాకైతే మత్తు బుగులైతంది. ఉన్న గొంత ఆదారం బోతే, దిక్కు లేనోల్లమైతమేమోనని దిగులైతందయ్యా”
“ఏం బయపడకే, అప్పులన్నీ కట్టేత్తే అందరి రునం తీర్సినోల్లమైతం. కొడుకు సదువైపోయి కొలువుదెచ్చుకొనే దాకా, నేను ఏ కౌలో, కూలో చేసుకుంట. ఎట్లనన్న ఎల్లదీయాల”.
పండుగ దగ్గరికొస్తుందని, రెండో వాయిదా డబ్బులు పది లక్షలు అడగడానికి భూమి కొన్నోళ్ళ దగ్గరికెళ్ళిండు హన్మంతు.
హన్మంతును చూడగానే భూమి కొన్నాయన గరంగరంగా మాట్లాడుడు మొదలుపెట్టిండు.
“ఏంది హన్మంతు బావా? మర్యాదస్తుని వనుకున్నగని, గిట్ల మోసం జేత్తవనుకోలేదు. రెండో వాయిదా డబ్బులిచ్చే ముందు భూమిది ఈ.సి. దీపిత్తే అసలు భూమే నీ పేరు మీద లేదు గాదు. మన ఎమ్మెల్యే రాఘవరెడ్డి పేరు చూపిస్తుంది. గిట్ల ఒకల్లకమ్మి వేరేటోల్ల దగ్గర బయాన తీసుకునుడు ఏమైన మర్యాదగున్నదా బావా?” అని ఈ.సి. పేపర్లు జిరాక్స్ చేతిలపెట్టిండు.
హన్మంతు పై ప్రాణం పైననే పోయినంతపనైంది. కండ్లు తిరిగినట్లై కూలవడ్డడు.
“నా భూమి నేనమ్మకున్నా, గా ఎమ్మెల్యే పేరెట్ల వత్తది బావా” బగవంతుని మీద పమానం జేత్తున్న. నా భూమి ఎవల్లకు అమ్మలే” పోయి గా ఎమ్మెల్యేనే అడుగుత” అంటూ దడదడలాడుతున్న గుండెలతో బయటకు నడిచిండు.
హన్మంతును చూడగానే ముసిముసినవ్వులు నవ్వుకుంటుండు ఎమ్మెల్యే రాఘవరెడ్డి. రియల్ ఎస్టేట్‌లో కోట్లు సంపాదించిన రాఘవరెడ్డి, గతంలో హన్మంతు చుట్టుపక్కల భూములన్నీ కొని ప్లాట్లు చేసి అమ్మినప్పుడు, ఎంతడిగినా హన్మంతు తన భూమిని ససేమిరా అమ్మలేదు. భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామకార్యదర్శి ఉప్పందించాడు.
ఆ భూమి తాతలు, తండ్రి ద్వారా పొంది అనుభవిస్తున్నాడే కానీ, హన్మంతు పేరున ఎలాంటి డాక్యుమెంట్లు లేవు అన్న విషయం తెలుసుకొని, వివరాలన్నీ సేకరించాడు ఎమ్మెల్యే.
నిజానికి రాఘవరెడ్డి తాత పెద్ద భూస్వామి. అయినా కొంత నిజాయితీపరుడే. తన వద్ద పనిచేసిన పాలేర్లు, కౌలుదార్లకు భూమిని చెందేలా చేయాలని, నామమాత్రపు సొమ్ము తీసుకొని తలా రెండు, మూడు ఎకరాలు కాగితం రాసి ఇచ్చాడు. కానీ, వాల్లెవరూ చదువుకోకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ, చట్టబద్ధంగా రికార్డుల్లోకెక్కించుకోవడం కానీ చేసుకోలేదు. ఆ విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి రెవెన్యూ రికార్డుల్లో వారసుడిగా హన్మంతు భూమిని తన పేరు మీదకు మార్పించుకున్నాడు.
విషయం తెలుసుకున్న హన్మంతు భోరుభోరున విలపించాడు. రాఘవరెడ్డి కాల్ళావేళ్ళా పడ్డాడు. “భూమి మీకమ్మలేదని గింత పగ తీర్చుకోవద్దు. పెండ్లం పిల్లలున్నోన్ని ఎంతో ఇంత ఇచ్చి మీరు భూమి తీసుకోండయ్యా” అంటూ గొడగొడ ఏడ్చిండు. భూమి నీది కానే కాదు పొమ్మని మెడలు పట్టి గెంటేశాడు రాఘవరెడ్డి.
ఎన్నెన్నో శాపనార్థాలు పెట్టాడు హన్మంతు. పోలీస్‌స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేకు ఎదురునిలవద్దని ఉచిత సలహాలిచ్చారు పోలీసులు. ఊల్లో గడపగడపకూ వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అందరికీ భూమి హన్మంతుదే అని తెలిసినా ఎవరూ మాట్లాడలేని స్థితి.
రోజులు గడుస్తున్నాయి. పండుగ రెండు రోజులనగా బిడ్డ, అల్లుడు, పిల్లలతో కలిసి వచ్చారు. హన్మంతు భార్య కళ్ళల్లో కోటి సూర్యులకాంతి. కొడుకు పట్నం నుండి వచ్చాడు. తన బైక్ కోరిక తీరబోతుందని అక్కతో సంబురంగా చెప్పుకుంటుంటే హన్మంతు విని, లోలోన పొంగుతున్న దుఃఖనదులు బయటకు కనపించకుండా అదుముకుంటున్నాడు.
“పండుగ తెల్లారి ఊల్లె నుంచి బస్సు తీత్తుండ్రు బిడ్డా. ఈసారి నేనూ మీతో వత్తున్ననని అందరికీ చెప్పిన” అని అంటున్న తల్లి మాటలు హన్మంతు చెవుల్లో డైనమెట్లలా పేలుతున్నాయి.
అల్లుడు మామ పట్ల ఎనలేని గౌరవాన్ని చూపిస్తున్నాడు. బయటకు ఎటుపోయినా తన బైక్ మీద మామను తీసుకుపోతున్నడు. ఇంటి నిండా ఏండ్ల కొద్దీ తాండవించిన చీకటి తొలగిపోయి పున్నమివెన్నెల పరచుకున్నట్లు ఇల్లు ఇల్లంతా కళకళలాడుతున్నది.
హన్మంతు మనసు మాత్రం తెగిపోయిన గాలిపటం, ముళ్ళకంచెలో చిక్కుకొని, వీస్తున్న గాలికి పరపరా చిరిగిపోయినట్లుంది.
తెల్లవారితే పండుగ. లోకమంతా వెలుగులు చిమ్ముతాయి. తన ఇంట్లో మాత్రం కొత్త చీకట్లు కమ్ముకుంటాయని హన్మంతు కుమిలిపోతూ, తాకితే కూలిపోయే మొదలు నరికిన చెట్టులా ఉన్నాడు.
హన్మంతు తల్లి, భార్య, కొడుకు, బిడ్డ, అల్లుడు, మనుమడు, మనుమరాలు ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకొని, నవ్వుకొని, తుళ్ళుకొని రేపటి పండుగ సంబురాల గురించే మాట్లాడుకొని నిద్రపోయారు.
హన్మంతు అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా, అగులుబుగులవుతుండు. తనవాళ్ళందరినీ ఒక్కసారి చూసుకున్నాడు. రెండు రోజుల నుండి కనిపించకుండా, కాపుగాసి కట్టడి చేసిన ఆనకట్టలేవో తెగిపోయి, కన్నీటి కాల్వలు బయటకు దుంకుతున్నాయి.
అదేమిటో రైతులకు చేతికందేంత దూరంలోనే, పురుగు మందు డబ్బాలు మృత్యువు రూపంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. డబ్బాను తీసుకొని పొలం వైపు నడిచాడు. పొలం మధ్యలో కూచొని, మట్టంతా ఎత్తిదోసిల్లతో నెత్తి నిండా పోసుకున్నాడు. ఆ పొలం తనది కాదన్న భావన రాగానే, పొదుగు నుండి బలవంతంగా దూరం గుంజుకుపోతున్న లేగదూడలా గింజుకున్నాడు. భోరున ఏడుస్తూ, తెచ్చుకున్న మందంతా తాగాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు.
దేవుని మీదా దుమ్మెత్తిపోస్తున్నాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వానదేవుడు తప్పు చేస్తున్నాననుకున్నాడేమో, అతని ఒంట్లో రేగుతున్న మంటల్ని ఆర్పేందుకా అన్నట్లు జోరుగా కురుస్తున్నాడు. వరదలో తడిసి బురద బురదైన మట్టిలో కూరుకుపోయింది హన్మంతు దేహం.
అనాదిగా, అనేకసార్లుగా చట్టం చేతిలో ధర్మం ఓడిపోతున్న చరిత్రను పునరావృతం చేస్తూ, అనతికాలంలోనే ఆ పంట పొలం ప్లాట్లుగా మారిపోయింది. కన్నవారి ఋణం తీరలేదు కానీ, ఆ మట్టితో హన్మంతు ఋణం శాశ్వతంగా తీరిపోయింది.
One Response to “ఋణం”
గాజోజు నాగభూషణం రచించిన ఋణం కథ చదివాను.తెలంగాణలో పల్లెల్లో రైతు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు. ఈ అసమ సమాజంలో దోపిడీలు, భూకబ్జాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, న్యాయమూర్తులు, లంచాలకు పాల్పడుతున్నారు. ఇదేమని ఎవరు ప్రశ్నించరు. సామాన్యుడికి చివరికి చావే శరణ్యమవుతుంది. అన్ని వ్యవస్థలు భ్ర ష్టుపట్టాయి.ఈ వ్యవస్థ బాగు కోసం పోరాడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు.మరో మహాత్ముడు రావాలని ఆశావహ దృక్పథంతో ఎదురు చూడాలి.