తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

షష్ఠముడు

తెల్సా కవితల పోటీలో ₹10,000 పారితోషికం పొందిన కవిత
© Telugu Society of America

నువ్వెవరని అడుగుతున్నావు కదూ.. నువ్వు నన్ను!?
విషం నింపుకుని ఊగుతున్న పేరు చివరి తోకల్ని..
నిర్దయగా కత్తిరించి, నిర్వాలం అయిపోయిన వాణ్ని!
మోహం నింపుకుని రేగుతున్న సమూహాల్ని..
నిష్క్రియగా పరిత్యజించి, నిర్మూలం అవుతున్న వాణ్ని!
కోతల్ని అతికించ ఊరేగుతున్న జిగురుల్ని..
నిర్వీర్యం చేసేసి, నిర్వ్యాపకం చేయగలిగిన వాణ్ని!
ఎలా తెలుసుకుంటావు నువ్వు నన్ను!?

నువ్వెవరని అడుగుతున్నావు కదూ.. నువ్వు నన్ను!?
రాముడో అల్లానో జీససో నానక్కో ఇంకో ఆదిమదేవుడో..
ఏ పేరూ పలకనొల్లని స్వీయ నియంత్రిత జిహ్వుణ్ని!
గుడీ మసీదూ చర్చీ దేవుడిదని ప్రకటించిన చోటేదైనా..
యథాలాపంగా దర్శించేసి.. మొరలు వినిపించే ఆశావహుణ్ని!
ఏ పుట్టలో ఏ పామైనా ఉండొచ్చుననే చిరు ఆశల స్థానే..
ఏ పుట్టలోనూ ఏ పామూ ఉండకపోవచ్చనే నిత్య శంకితుణ్ని!
ఎలా వర్గీకరిస్తావు నువ్వు నన్ను?

నువ్వెవరని అడుగుతున్నావు కదూ.. నువ్వు నన్ను!?
మనసుల్లో పునాదులు తవ్వి.. ఇనుపకుడ్యాలను నిర్మించి..
ప్రాంతాలకు కంచెలు వేస్తే.. ఆ ఎగువన పైవారధులకు మయుణ్ని!
భాష యాస భేషజాలూ భూషణాలూ స్కాన్ చేసేసి..
నా వడి, ఒరవడి పట్టే వేగుల్ని పెడితే.. మీరిపోయే ధీరుణ్ని!
ఆహార్యం ఔచిత్యం సంస్కారం నేపథ్యం పుటం వేసి
నా మూలాలను జల్లెడ పట్టాలనుకుంటే, జారిపోయే చోరుణ్ని!
ఏమని కనిపెడతావు నువ్వు నన్ను?

అంతిమంగా, నీ ఎదట ఉన్నాను గనుక నేను
నీ మనువు గీతల ఇరుకుల్లో నన్ను తెలుసుకోవాలనుకుంటావు నువ్వు!
వాడెవ్వడో నిర్వచిస్తే.. ఆ వచనాల్లోకి
నేను ఒదిగి ఒదిగి కూర్చుంటాననుకున్నావా యేం?
జ్ఞానమూ వీరమూ వర్తకమూ శ్రామికమూ అంటూ
నువ్వు రంగరించిన వర్ణాల్ని నేను పులుముకుంటాననుకున్నావా యేం..?
నాలుగింటిని ధిక్కరిస్తే పంచముడని ఒక ముద్రవేసి..
భయమో ఏహ్యమో పెంచుకుందామని అనుకున్నావా యేం..?
నీ వ్యూహం పండనివ్వను.. నీ కూహకం సాగనివ్వను..
నీ దగ్గరున్న తూకం రాళ్లకు నా బరువు తెలియనివ్వను..
నీ దగ్గరున్న కొలబద్ధలను నా ఎత్తు ఎరగనివ్వను..
నీ దగ్గరున్న శతాధిక యుక్తులకూ నా లోతు బోధపడనివ్వను..

నీ సంకుచిత సూత్రీకరణలలో, మహా అయితే
నేను షష్ఠముడిని!
నర్తించే వర్తమానంలో అంగుష్ఠ మాత్రుడిని!
స్వప్నించే భావిలోకంలో విరాట్ రూపుడిని!

రచయిత పరిచయం

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె.ఎ. మునిసురేష్ పిళ్లె: శ్రీకాళహస్తిలో పుట్టి హైదరాబాదులో స్థిరపడ్డారు. రాయడం ఆసక్తి, ఆదరవు. పాత్రికేయం ప్రధాన వ్యాసంగం. అందులో ఇమడలేకపోయిన సంగతులు మెలిపెట్టినప్పుడు రచనా వ్యాసంగానికి పూనుకుంటారు. కవిత, నవల, వ్యంగరచన, కార్టూన్లలో కూడా ప్రవేశం ఉంది. మధురాంతకం రాజారాం కథ “పొద్దుచాలని మనిషి” వీరికి స్ఫూర్తి నిస్తుంది. రెండవ బహుమతి పొందిన వీరి కథ గేణమ్మ.

5 Responses to “షష్ఠముడు”

 1. Rohini Vanjari

  అద్భుతమైన కవిత. అందరిని నిలదీసి ప్రశ్నించిన కవిత. ప్రతిఒక్కరు ఆత్మావలోకనం, ఆత్మ శుద్ధి చేసుకుని, మనుషులంతా ఒకటే అని గుండెలమీద చేయి వేసుకుని చెప్పుకోవాల్సిన కవిత. హృదయపూర్వక అభినందనలు అండి.

  Reply
 2. chaganti prasad

  షష్ఠముడు అన్న ఊహే గొప్పగా ఉంది. మనిషిగానే పుట్డిన వాడు కులమతాల్ని పులుముకుని జాతి విడదీసిన మనుషల మధ్య జంతువులా బ్రతుకుతున్న వాడ్ని నిలదీసిన షష్ఠముడ్ని సృష్టించిన మీకవితా విరాట స్వరూపానికి నేను నిలబడి చప్పట్లు కొడుతున్నాను.
  చాగంటి ప్రసాద్

  Reply
 3. Esikela Udaya Kumar Teacher

  షష్ఠముడి అదిరింపు, బెదిరింపు పేరుకు తగ్గట్టే ఉంది. కవిత, శీర్షికకు ప్రాణం పోసింది. You just rock, పిళ్ళై జీ!

  Reply
 4. మార్క్స్ బాబు

  సార్ చాలా అద్భుతం… అనేక రంగాల్లో అంత ఎత్తు కి ఎది గాము అంటూనే… మీరేమిట్లు అన్నది ఇంకా కొనసాగుతున్న వేళ.
  పాలికలు, ఏలికలు స్వార్ధం కోసం అనేక కులాల, వర్గాల వారీ సమాజాన్ని చీలికలు, పేలికలు చేస్తున్న వేళ మంచి కవిత.. చురక.. ఆవేదన.. అక్షేపణ.. పేరు కూడా… అయోని వంటివి గుర్తుకొస్తున్నాయి.. మార్క్స్ బాబు

  Reply
  • తిరుపతిరావు పట్టపురాజు

   మనిషి ఔన్నత్యానికి ఔచిత్యానికి పుట్టుకే కొలమానమైన నేటి వర్తమానంలో మీ షష్ఠముడి సృష్టి మనిషిని సాటి మనిషిగా గౌరవించడం లో నూతన ఒరవడి కి శ్రీకారం సృష్టిస్తుంది అని ఆశిస్తూ….

   Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.