తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

ఏదో ఒకటి మాట్లాడు

తెల్సా కవితల పోటీలో ₹8,000 పారితోషికం పొందిన కవిత
© Telugu Society of America

మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు

మట్టి గురించి మాట్లాడు
విత్తు గురించి మాట్లాడు
విత్తు లోంచి మొలకెత్తే
చెట్టు గురించి మాట్లాడు
మట్టికి చెట్టుకీ ఉన్న
బంధం గురించి మాట్లాడు

మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు

మనిషి గురించి మాట్లాడు
మనసు గురించి మాట్లాడు
మనిషిలో చిగురించే
ప్రేమ గురించి మాట్లాడు
మనిషికి మనసుకీ మధ్యనున్న
అనుబంధం గురించి మాట్లాడు

మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు

అమ్మ గురించి మాట్లాడు
ఆత్మ గురించి మాట్లాడు
పేగు కదిలినప్పుడల్లా
అమ్మ ప్రేమ గురించి మాట్లాడు
అమ్మేకద సర్వస్వం
అమ్మే మన ప్రపంచం

మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు

మంచి గురించి మాట్లాడు
మానవత్వం గురించి మాట్లాడు
మంచికి మానవత్వానికీ మధ్యనున్న
మనిషితనం గురించి మాట్లాడు

ఎండిన పెదాలపై
ఎడారి దారులు వేసుకుని
ఎండమావి కోసం
ఎంతకాలం ఎదురుచూస్తావు

మాటలే కద మనుషుల్ని కలిపేది
కలిసిన ప్రతిసారి కాకపోయినా
మనసులు కలిసినప్పుడైనా
ఆత్మీయంగా మాట్లాడు

మాటలు కరువైనప్పుడు
మౌనాన్ని ఆశ్రయించు
మౌనమే కద
మనిషిని మనసునీ కలిపేది

మాట్లాడుకోవడమంటే
రెండు మనసుల కలయికే కాదు
రెండు హృదయాల స్పందన

రచయిత పరిచయం

చొక్కర తాతారావు

చొక్కర తాతారావు

చొక్కర తాతారావు గారు విశాఖపట్నం కేంద్ర సముద్ర మత్స్య పరిశోథనా సంస్థలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. వెయ్యికి పైగా కవితలు, వందకు పైగా కథలు, 40 వ్యాసాలు, 30 గేయాలు, 7 నాటికలు, 3 నాటకాలు రాశారు. వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికలలో రచనలు ప్రచురించారు. వీరి రచనలు కొన్ని ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. అనేక రచనలకు బహుమతులు అందుకున్నారు. కొన్ని సినిమాలకు వివిధ శాఖలలో రచనలు చేసారు. మంచి రచనకు ఆత్మ, ఆర్తి, తడి, తాత్విక చింతన ఉండాలని నమ్మే వీరి రచనలు మానవత్వం చుట్టు తిరుగుతుంటాయి.

3 Responses to “ఏదో ఒకటి మాట్లాడు”

  1. చొక్కరతాతారావు

    నా కవితకు బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన తెల్సా నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.
    – చొక్కరతాతారావు
    కవి, కథారచయిత
    విశాఖపట్నం

    Reply
  2. డా॥బండారి సుజాత

    చాలా బాగుందండి కవిత

    Reply
  3. Amarajyothi

    కవిత చాలా అర్థవంతం గా వుంది
    బహుమతి కి అర్హమైన రచన
    అభినందనలు తాతారావు గారు

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.