తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

ఉల్లి పూసలు

తెల్సా కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ
ఉల్లిపూసలు
© Telugu Society of America

“ఎవలమైనా పద్దతిగ బతుకాలె. నా యిష్టమంటె నడుత్తదా. లోకమేమంటరు” సర్ది చెప్పాలని చూసిండు సారయ్య.

పూలమ్మ ఒక్కసారి ఇరుగ జూసింది. తరువాత లెక్కలేనట్టే చూసి “ఎవలేమంటే నాకేంది. బరాబర్ జేత్త. అవును, నాయిష్టమే. నువ్వేంది నడుమ ” గట్టిగా అంది.

సారయ్య ఒక్కసారిగా గజ్జుమన్నడు. నోటి నుంచి మారు మాటనే రాలేదు. ఆమెను ఎన్నడూ అట్ల చూడలేదు. ఇంత దాక అటు ఊర్లె ఇటు కులంల తను గీచిందే గీత అనుకున్నడు. కాని ఇప్పుడు తన మాటకు గడ్డిపోసంత విలువ కూడా లేదని తెలిసినంక అక్కడ ఉండ బుద్దిగాలేదు. లేచి గోసి సదురుకుంట కాండ్రిచ్చి ఊంచి ‘యాడన్నవోండ్రి, మీరు యాడవోతె నాకేంది. చెప్పితె ఇననోళ్ళను చెడంగ చూడాలె’ అనుకుంట కడుప దాటిండు. అతనితో పాటే ఆ వార్త కూడా కడుప దాటింది. క్షణాల మీద బాయికాడి పూలమ్మ పేరు ఊరంత ఎలిసి పారింది.

“ఎవలూ, తెల్లగ ఎత్తుగ ఓరగొమ్ములెక్కుంటది సూడూ. ముద్ద మొఖం,గామెనే గదా” గాందీ బొమ్మ దగ్గెర జాడ జాడలు వట్టి ఆరా తీస్తూ ఒకలు.

“వామ్మో, సూత్తే గట్ల కనవడది మరి. గట్ల జేత్తదంటవా. చేసినా చేత్తదనుకో. జెర కదర్నాకేనట” కూర గాయల మార్కెట్ల ఎక్కసంగా ఇంకొకలు.

“ఆమెకు మొగడున్నడు గదా, ఇదేం పని. వాడెట్ల ఒప్పుకుంటుండు?” కల్లు దుకాణంల అనుమానంగా ఒకలు.

“మొగడు ఉత్త పోషిగాడే. ఉటో అంటే ఉటో, బైటో అంటే బైటో. ఈమెదే ఆడుకున్నంత ఆట” వడ్ల కల్లంకాడ ఎక్కిరిస్తూ ఇంకొకలు.

“వాళ్ళ కులంల ఊకుంటరా ఏంది. ఇది తెలిసినంక ఏం జేత్తరో సూడు. పట్టవగలు ఊరు దాటిత్తరు” బస్సులో ఒకరి ధీమా.

“మరి బిడ్డెంత బుద్దిమంతురాలు, వద్దని చెప్పుతలేదా?” కుల సంగంలో ఒకరి విమర్శ.

బొడ్రాయి కాడి యాప చెట్టుకింద ఒకలిద్దరు ఆమెకు సపోటుగా మాట్లాడిన వాళ్లు కూడా ఉన్నరు.

“అవునయా,చేత్తె జేత్తది. దునియా అంత సక్కగుందా తియ్యి.” బీడి తాగుతూ ఒకరి సపోటు.

“పోచవ్వ జేత్తె తప్పులేదు. పూలమ్మ జేత్తేనే తప్పా?” చాయి తాగుతూ ఒకరి తర్కం.

“పోచవ్వకు మొగడు లేడు.పూలమ్మకేం బుట్టింది. మొద్దోలె మొగన్ని వెట్టుకుని” బీడీల కార్కానల ఒకరి ఇమరస.

అప్పుడప్పుడే కర కర పొద్దు పొడుస్తుంది. ఊరు మాత్రం పూలమ్మ వార్త తోనే కుత కుత ఉడుకుతుంది. జనాన్ని ఇంతగా కదిలించిన పూలమ్మ మాత్రం తన ఇంట్లో నిమ్మలంగా “భాగ్యా, లెవ్వు బిడ్డా, మొఖం కడుక్కో” అని కూతురును నిద్ర లేపుతుంది. కూతురు ఏదీ పట్టనట్టు గోడ గోడోలె లేచి కూసుంది.

ఊర్లె అటూ ఇటూ తిరిగి తిండియాల్లకు ఇంటికి చేరుకున్న సారయ్యకు నీళ్ళబిందెతో ఎదురయింది భార్య. ఆగమాగాన ఆమెను ఇంట్లకు రమ్మన్నడు. సాటుకు కూసుండవెట్టి గుస గుసగా ఈ ముచ్చట చెప్పవోతుంటే ఆమె నవ్వింది.

‘‘ తలుపు వెట్టి చెప్పవోతె కొలుపువెట్టి ఇన్నరట. ఎలిసిపారిన ముచ్చట ఏం జెప్పుతవు తియ్యి” అన్నది.

“అదేందే,అట్ల తీసిపారేత్తవు. ఏమైందో ఎరికేనా వదినె” సారయ్య అంటుండంగనే పక్కింటి బాలవ్వ వచ్చింది. ముక్కు మీద వేలేసుకుని ‘ ఒషినీ పాపం పాడుగాను, మీ యారాలు గట్లనటగదా గంగవ్వా,’ అని సారయ్య దిక్కు చూసి ‘అగో,మరిది గూడ ఉన్నట్టున్నడు. ఇది నువ్వద్దెనేనావోయి’ అంటూ పూస గుచ్చినట్టు తను విన్న ముచ్చట మొదలు వెట్టింది.


అప్పుడే బలబల తెల్లారుతుంది. ఎక్కడనో కోడి కుయ్యనే కూసింది. మల్లె శాలలో తుంగసాప మీద కొంగు పరుచుకుని పన్న పూలమ్మ కోడి కూతకు ఒక్కసారిగా ఉల్కిపడి కళ్లు తెరిచింది. రాత్రంత నిద్రలేదు. ఈ ఒక్క రాత్రే కాదు. వరుసగా వారం రోజులుగా నిద్రలేదు. పక్కకు తిరిగి చూసింది. పడుకుందో మెలకువతో ఉందో కాని పక్కనే కూతురు భాగ్య కదలకుండా ఉంది. వీపు తడిమి చూసింది. జరం కొద్దిగా గుంజినట్టుంది. దిగపార చెమ్టలు పెట్టి పెయ్యి చల్లగా ఉంది.

ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ వాన మబ్బులు

లేచి మోకాళ్ళ మీద కూర్చుంది పూలమ్మ . తలుపు సందులోంచి చీలికగా వస్తున్న మసక వెలుతురు తప్ప చుట్టూ ఇంకా చీకటిగానే ఉంది. తలాపున చిన్న పీట, పీట మీద పరిచిన కొత్త బట్ట, బట్టమీద పరిచిన బియ్యం, బియ్యం మీద ఆరిపోతుందా అన్నట్టు వెలుగుతున్న గుడ్డిదీపం. దీపం ముందు ఫొటో, ఫొటోకు వాడి పోయిన ఓ బంతి పూల దండ, పక్కనే స్టీలు గ్లాసు, గ్లాసునిండా బియ్యం, బియ్యంలో సంగకాలి ఆరిపోయిన ఊదు బత్తీలు, బూడిద.

మరోసారి ఫోటో వైపు చూసింది పూలమ్మ. ఎరుపు పసుపు రంగును కుమ్మరించినట్టు దీపం వెలుగులో అస్పష్టంగా కదులుతున్న అల్లుని ఫొటో. కడుపుల పుట్టెడు దుఃఖముంది. ఏడుద్దామంటే వచ్చే కన్నీళ్లు లెవ్వు. మనుసుల పుట్టెడు ఎత ఉంది. చెప్పుకుందామంటే వినే మనిషి లేడు. తెల్లారుతుందంటే భయమయితుంది. ఆ రాత్రి అట్లనే ఉంటే బాగుండుననిపించింది. కాని కోడి గొంతులో పొద్దు పురుడు పోసుకుంది. గదిలో చీకటంతా తనలో ఇంకినట్టుగానే అనిపిస్తుంది పూలమ్మకు.

అప్పుడే బయట తలుపు కొట్టిన చప్పుడు. పూలమ్మకు మరింత బయమయింది. ఇంట్లో ఇంకా ఎవలూ లేవనట్టుంది. తలుపు రెండు మూడు సార్లు కొట్టినంక ‘లచ్చన్నా’, అన్న పిలుపు. మాటను బట్టి వచ్చింది మరిది సారయ్య అని గుర్తు పట్టింది. ‘వీనికి నిద్ర పట్టిందో లేదో, మామీదనే తెల్లారినట్టుంది’ అనుకుంది. భర్త లచ్చయ్య తలుపు తెరిచినట్టున్నడు. కొడుకు సాయి కూడా అప్పుడే లేచినట్టున్నడు. ఇద్దరి మాటలు వినిపిస్తున్నయి. తలుపుకు దగ్గరగా వచ్చి బయట మాటలను వింటుంది పూలమ్మ

“అన్నా! ఎట్లనే, ఏం జేద్దాం? మంగలి పోషవ్వను మల్ల బతిలాడిన. బిడ్డ దగ్గరుందట. వారం దాక రాదట.” సారయ్య.

“ఎట్లరా,ఎట్ల గతీ,ఏం జేద్దాం మరి..” లచ్చయ్య.

కోడలు పాలు పిండుతున్నట్టుంది. బర్రె పాకలోంచి పాలసప్పుడు సుయ్యి సుయ్యిమని వినిపిస్తుంది. పూలమ్మ అదే అనుకున్నది. వాళ్ళు అదే మాట్లాడుతున్నరు. అలాగనే కూసుండి తలుపు సాటునుంచి మాటలు వింటుంది.

“మీ పెద్దత్తను అడుగుతనంటివి గదరా సాయి,అడిగినవా మరి ” కొడుకు సాయిని అడుగుతున్నడు సారయ్య.

“అడిగిన్నే, నిన్ననే నోరిడిసి అడిగిన. రానన్నది. కొడుకులు గా పని జేత్తవా వద్దు అన్నరట.” చెప్పిండు సాయి

“మరి ఇంక ఎవలనన్న అడుగక పోయినవన్నా,” సారయ్య లచ్చయ్యను అడుగుతుండు.

లచ్చయ్య నెత్తికి చేతులు వెట్టి “ఎవలనడుగాలెరా,నేను ఇంట్లనే ఉంటి. నువ్వే ఎవలనో సూడు. కత నడువాలె గదా,” అన్నడు.

ఇద్దరి మాటలు వింటుంటే పూలమ్మకు కోపమత్తంది.

‘ఈయిన అసలు తండ్రేనా. ఎంత సేపూ మనిశి దొరుకుతలేడనే అలోచిస్తండు తప్ప అది చేసుడు అవసరమా అని ఒక్క మాట అంటలేడు. అయినా నా పిస్సగనీ ఎంత తండ్రయినా మొగోడే గదా. వద్దని ఎట్లంటడు’ అనుకుంటూ మరిది ఇంక ఏమంటడో అని వింటుంది. అతడైనా వద్దంటడేమో అని చిన్న ఆశ.

“ఊరంత వడవోసిన. ఎవలు రామంటండ్రు. అందరు పోచవ్వ పేరే చెప్పుతండ్రు. అదెమో చింత కొమ్మలెక్కి కూసుండె. వదినను పిలువు. ఏదన్నా ఆలోచన జేద్దాం,” అన్నడు సారయ్య.

“వదినేం జేత్తదిరా. బిడ్డనే అంటే బిడ్డెకంటే ఎక్కువేడుత్తంది. భూమి వట్టిందంటే లేత్తలేదు, ” లచ్చయ్య అన్నడు.

“ఏం జేద్దాం,పిల్లలను కంటంగనీ రాతలను కంటమా. గుండె రాయి జేసుకోవాలె. ఏడిత్తె మాత్రం పొయినోళ్ళు వత్తరా. సావే ఎక్కిరిచ్చినట్టయింది. ఇప్పుడు దిన వారాలు గూడా ఎక్కిరిచ్చినట్టు జేత్తె ఎట్ల,” సారయ్య అన్నడు.

పూలమ్మకు అగ్గి సెగ తలిగినట్టయింది. ఎక్కడలేని కోపమచ్చింది. ‘పుట్టెడు దుఖ్ఖంల మేముంటే ఎక్కిరిచ్చినట్టు అంటడేంది పాడు మొఖపోడు’ అనుకుంది. నెత్తెంటికలు ముడుసుకుని వెంటనే తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఏదో అనబోతూ భార్యను చూసి మాటను ఆపేసిండు లచ్చయ్య. సారయ్య కొద్దిగా వెనక్కి జరిగి అరుగంచుకు సర్దుకుని కూర్చున్నడు. కోడలు పిలవడంతో దుడ్డెను ఇడవడానికి కొడుకు బర్రె పాకలకు పోయిండు.

తనెంత ప్రయత్నం చేస్తున్నడో చెప్పాలని సారయ్య “అదే వదినె,రేపు తొమ్మిదొద్దులు గదా,కర్మ కాండ జెయ్యాలె. అటో ఇటో మాకు నెత్తి గొరుగుడుకు మంగలోల్లను మాట్లాడిన. బట్టలుతుకుడుకు సాకలోల్లను ఒప్పిచ్చిన. పొల్లకు జేసే కార్యాలుంటయి గదా,అదే,బొట్టూ గాజులు,పోషవ్వను రమ్మని పోతె ఊరికి పోయిందట. వారందాక రాదట. అబ్బ మనుసులు ఎవలున్నరా అని జాడ జాడలు దీసిన. ఎవలను బతిలాడినా ఎవలు రామంటరు. సరే పోచవ్వ వచ్చేదాక ఆగుదామంటే అమాస రావట్టే. కాడు మీది నుంచి అమాస పోవద్దు గదా,” అన్నడు

అతడి మాటలు పూర్తి కాకముందే ఆగుమని సైగ చేస్తూ “ఎవ్వలద్దు. నువ్వు ఎవ్వలను బతిలాడుడద్దు. రేపు నాబిడ్డకు గాజులు నేనే పలుగ్గొడుత,’’ ఏడుపు ఆగుతలేదు. దుఖం ఎత్తేసుకత్తంది. మాటలను మద్యలోనే మింగింది పూలమ్మ.

సారయ్య నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయిండు. పూలమ్మ వినలేదు. దుఖాన్ని దిగమింగుకుని రేషంగా

“, అవును. నేనే పుస్తె మట్టెలు తీత్త. నేనే బొట్టు తుడుత్త,నేనే గాజులు పలగ్గొడుత. నేనే తెల్ల బట్ట కడుత, నేనే పసుపు రాత్త. ఇంటికి తెచ్చి అర్రల కూసోవెట్టి నెత్తిమీద పసుపు బియ్యం పోత్త,పెండ్లి కూతురును చేసిన చేతులతోనే ముండరాలును గూడా జేత్త. సరేనా” అన్నది ఒత్తి పలుకుతూ.

కుడిది కుండతో కడుప దాటబోతూ కొడుకు, పాల సరువతో ఇంట్లోకి అడుగు పెట్టబోతూ కోడలు, బర్రె పెండ కోసం వచ్చిన పక్కింటి సులోచన, మాట్లాదిద్దామని వచ్చిన ఉప సర్పంచ్ శేరెల్లి, పాలకోసం వచ్చిన కోమల, అటు భర్త ఇటు మరిది అందరు ఒక్కసారిగా ఉల్కి పడ్డరు. తాను అన్నది వాళ్ళు విన్నది నిజమే అన్నట్టు మరోసారి అదే ముచ్చటను నొక్కి చెప్పి ‘మీ కండ్లు సల్లవడ్డయి గదా’ అన్నది పూలమ్మ.

ఎక్కడోళ్ళక్కడ మమ్ముల గాదన్నట్టే ఉన్నరు గనీ లచ్చయ్యనే కోపానికచ్చిండు.

“ఎవల కండ్లే సల్లవడేది,ఆ,అయినా నువ్వెట్ల జేత్తవు. అట్ల జెయ్యగూడుతదా. నేనింక బతికే ఉన్న గదా,” అరిచినట్టు అన్నడు.

బెదరలేదు పూలమ్మ. ‘బతుకుడంటే పెయ్యి మీద బట్టలేసుకుని పాణంతో మందిల తిరుగుడు గాదు. తననా అనుకున్నోళ్ళకోసం ఎంత మంది ఏమన్నా పాణమిచ్చి నిలవడుడు.’ అందామనుకుంది. ఎందుకో అనలేక “నీ బతుక్కు నాబిడ్డ బొట్టు గాజులకు ఏమన్న సంబందముందా. అది వుట్టిన తొమ్మిదొద్దులకు ఉల్లి పూసల పండుగునాడే నా బొడ్డు పేగును కాల్చి నేను వెట్టిన బొట్టు,నా ఎంటికలతోని శెలి పగ్గం అల్లి లింగాలకు వెట్టిన్నాడు నేను తొడిగిన గాజులు,అవ్వి నేనే తీత్త. ఇంక మీరు చేసే పనులేమన్నా ఉంటే చేసుకోండ్రి.” అన్నది విరక్తిగా.

“అదేంది వదినే, ఎవలనో దేవులాడుదాం. లేదంటే పంతులును అడిగి ఓ వారం తరువాత పోచవ్వ వచ్చినంకనే బొట్టు గాజులు తీద్దాం, అంతేగనీ నిండు ముత్తైదువువు నువ్వెట్ల తీత్తవు చెప్పు. అందరు మంచిగుండాలె గదా.” సారయ్య సముదాయిస్తూ అన్నడు.

“ఏం మంచిగ,ఇప్పుడు మంచిగున్నమా. దాని బతుకే చంద్ర చంద్ర అయింది. బిడ్డెలేడువంగ అయ్యవ్వలు మంచిగెట్లుంటరు చెప్పు..”

“అది నిజమే గనీ,ఇది మనం బెట్టుకున్నది గాదు గదా. తాతలు తండ్రులనుంచి వత్తుంది. ఎవలమైనా పద్దతిగ బతుకాలె. నా యిష్టమంటె నడుత్తదా. లోకమేమంటరు,” సర్ది చెప్పాలని చూసిండు సారయ్య.

పూలమ్మ ఒక్కసారి ఇరుగ జూసింది. తరువాత లెక్కలేనట్టే చూసి “ఎవలేమంటే నాకేంది. బరాబర్ జేత్త. అవును నాయిష్టమే. నువ్వేంది నడుమ” గట్టిగా అంది.

భర్త కోపంగా ఏదో అనబోయిండు. సారయ్యనే అన్నను ఆగుమని సైగ చేసిండు. ఆగిపోయిన లచ్చయ్య ‘మరి నువ్వే చెప్పు’ అన్నట్టు చూసిండు. ఇగ ఎవలం చెప్పేదేం లేదన్నట్టు సారయ్య కడుప దాటిండు. ఆగమాగాన లచ్చయ్య ‘ఇదేదో కతకే ఉంది. ఎట్లరా,’ అనుకుంట తమ్మునితో బయటకచ్చిండు.

“ఏట్లేంది,ఆమె అనంగనే అయిపాయెనా. నలుగురికి చెప్పెటోళ్ళము. నలుగురిల తిరిగెటోల్లం. రేపు మనను ఎందరేంమంటరు. దర్మాన్ని మనం గాపాడితే మనను ధర్మం కాపాడుతది. మనం జేసేది మనం జేద్దాం,” అంటూ తొవ్వ నడిచిండు సారయ్య.


“ఇది నువ్వద్దెనేనావోయి. ఊరు ఊరంత కోడై కూత్తండ్రు. రేపు పెండ్లీలకు పేరంటాలకు ఎట్ల పిలుత్తరు,ఎట్లత్తది. పాపం పాడుగాను. నాకు జూడ అవి తియ్యనే తియ్యది సూడు. ఎవలను పిలువకుంట ఓ ఐడియ జేసింది. చిలుకలేని బిడ్డ దానికే ఉన్నట్టు” ముచ్చెటను ఆపి అడిగింది బాలవ్వ.

అవి తియ్యనే తియ్యదన్న మాటకు నిజమేనా అనుకుని సారయ్య నోరు తెరిచిండు. ఆరోజు పొద్దు గూకింది తెల్లారింది.

ఊరుకంటే ముందే లేచింది పూలమ్మ. “భాగ్యా,లెవ్వు బిడ్డా.లేచి మొఖం కడుక్కో,పోదాం,” అని కూతురును లేపింది. భాగ్య లేచి కూసుంది. ఓదిక్కు మేకలు గోత్తండ్రు.ఓ దిక్కు వంటలు వండుతంద్రు. సారయ్య వచ్చి వాకిట్ల నిలబడ్డడు. అన్న తమ్ములు ఏదో బదులుకున్నరు. కోడలు సావు సామాన్లను గంపలో సదిరింది. కొడుకు గంపను ఎత్తుకున్నడు. అందరు కడుప దాటిండ్రు.

భాగ్యను చెయ్యి పట్టుకుని కడుప దాటింది పూలమ్మ. నిన్నటి తొక్కులాట లేదు. మొన్నటి ఆగం లేదు. నిన్నటి భయం కూడా లేదు. తలమీద కొంగు కప్పుకుని దించిన తల ఎత్తకుండా పతుకులాడినట్టు భాగ్య నడుత్తుంటే, ఆమె పక్కన ధీమాగా ఒక తిరుగు లేని నిర్ణయానికి వచ్చినట్టు పూలమ్మ తలెత్తుకుని నడుత్తుంది. ఊరు ఊరంతా పూలమ్మను చూస్తుంది. గుసగుసలు పెడుతుంది. అన్నంత పని చేస్తదని ఒకలు, వాళ్ళు చెయ్యనియ్యరు సూడూ అని ఒకలు, అట్ల జేత్తే దీన్ని గూడ ముండమోపుడే అని ఒకలు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నరు. అందరి మనసుల్లోని బావాలను చదువుతూ ముందుకు నడుస్తుంది పూలమ్మ. దారిలో వాళ్ళతో కొందరు పాలివాళ్ళు, కులపోళ్ళు కలిసిండ్రు. సుట్టి ముట్టుడున్న మరికొంత మంది పాలివాళ్ళు కులపోళ్ళు వాగులకు అంద బోయిండ్రు.

పూలమ్మ ముందు వాళ్ళు వెనుక అందరు వాగులకు దిగిండ్రు. కాడును చూడంగనే భాగ్య సోకం బెట్టింది. బిడ్డను తీసుకుని దూరంగా ఉన్న చెట్టుకిందికి నడిచింది పూలమ్మ. కొడుకు కోడలు బందువులు భర్త కాడు వద్దకు నడిచిండ్రు. సారయ్య కోసం చూసింది. అతను కనిపించలేదు. బోడయ్యగారు కాడులో బూడిది పక్కకు జరిపి నీళ్ళతో అలికి పట్టు పరుస్తున్నడు. పాలోల్లు గుంద్లు తీసుకుంటున్నరు. ఆడోళ్ళు పట్టు చుట్టు కూసుండి అడిగిన వస్తువులు అయ్యగారికి అందిస్తున్నరు. ఉతికిన బట్టలు తెచ్చిన సాకలోళ్లు చెట్టుకింద కూసుండి ఎవల బట్టలు వాళ్ళకు ఏరి కుప్ప వెడుతండ్రు. ఎవలు ఏపని జేత్తున్నా అందరు ఓ కన్నేసి చెట్టుకింద కూసున్న పూలమ్మనే సూత్తండ్రు. అప్పుడప్పుడు తలెత్తి చూసుకుంట ఏడుస్తూ నేల గీతలు గీత్తుంది భాగ్య.

పూలమ్మ కొడుకుకు సమానంగా బిడ్డను పెంచింది. ఆడిపిల్లకు సదువెందుకన్నరు. అయినా వినలేదు. సదువు కోసం కొడుకు తో పాటు బిడ్డను కూడా పక్కూరుకు పంపింది. ఈత, సైకిల్, బండి, ఇట్ల వాళ్లు వీళ్ళు వద్దన్నా కొడుకుతో పాటు బిడ్డకు నేర్పింది.

‘పూలమ్మ బిడ్డను పద్దతిగ పెంచుతలేదు. మొగరాయున్ని జేత్తంది’ అని అన్న ప్రతివాళ్ళకు ‘మనం బిడ్డలను కాదు, కొడుకులను పద్దతిగా పెంచాలె’ అని చెప్పింది. కూతురుకు పెళ్ళి చేసినంక అల్లుడిని తనే చేర దీసింది. వాళ్ళు వీళ్ళు వద్దన్నా వినకుండా అల్లుడిని ఇలిటం తెచ్చుకుంది. ఆడివిల్లను అవుతలికి ఇయ్యాలెగనీ ఇంట్ల పెట్టుకునుడేందని కోడలు, కొడుకు కయ్యానికి దిగిండ్రు. ఊరు ఊరంతా అది నిజమే అన్నరు. అవును ఆడపిల్ల ఆడిపిల్లనే గనీ ఈడి పిల్ల గాదు గదా. ఏదన్న ఇచ్చేదుంటే ఇచ్చి పంపియ్యాలన్నరు. పూలమ్మ వినలేదు.

‘ఆడేంది మొగేంది, ఇద్దరు వుట్టిండ్రు ఇద్దరికి సమానం. ఇల్లు చెరిసగం చేను చెరి సగ’ అని నిలవడి గెట్లు వెట్టింది. నాలుగేండ్లు దాటనే లేదు. కాలం కలిసిరాక బైక్ మీద పోతూ బస్సు గుద్ది అల్లుడు కాలం జేసిండు. పీనుగును గుర్తువట్టి తెచ్చుడుకే మూడు రోజులయింది.

అక్కడ కాడు దగ్గర పనులన్ని అయితున్నయి. ఇక్కడనే పూలమ్మ నాలె గీతలు గీసుకుంట గతాన్ని తవ్వుకుంటుంది. చూసి చూసి భాగ్యనే నోరు విప్పింది.

“అవ్వా, గా పని నువ్వు జేసుడేందే. రేపు ఊరోళ్ళు కులపోళ్ళు తప్పు దీత్తరు. సూటి పోటి మాటలంటరు. ఎవ్వలద్దు. నాది నేనే చేసుకుంట. నా కర్మ గిట్లుంది. ఎవలేం జేత్తరు” ఏడుస్తూ అన్నది.

ఆమాటలకు ఆలోచనల్లోంచి తేరుకుంది పూలమ్మ. కూతురు వైపు చూసింది.

“ఏం,అవి తీసుడెందుకు,తియ్యకపోతే ఎమన్నయితదా.” కూతురును అడిగింది.

కూతురు చిత్రంగా చూసింది. “అదేందమ్మా,నిన్ననేమో నువ్వే తీత్తాంటివి.యిప్పుడేమో తీసుడెందుకంటివి. ఊరోళ్ళు ఉంచుతారే. కాకుల లెక్క పొడుత్తరు. అంతెందుకు,నీకొడుకు కోడలే ఊకుంటరా. దొరుకవట్టి తీపిత్తరు.” అన్నది ఏడుపు ఆపి.

“వాళ్ళెవలే తీపిచ్చుడుకు. నీబతుకు నీయిష్టం. అవి నీ తల్లి గట్టిన ఉల్లిపూసలు. మొగడు దెచ్చినయి గావు.” ధైర్యంగా అన్నది.

“వద్దమ్మా,నాకు లేంది వెట్టకు. బోరెమోలే మొగడే పోయిండు. ఈ బొంతశింపులు నాకెందుకు. లోకమోలె నేను. ఇవి తియ్యకుంటె మాత్రం నా మొగడత్తడా” మరోసారి ఏడుపు అందుకుంది.

“భాగ్యా, భర్త పోంగనే బతుకు వోదు. భర్త ఒక్కడే బతుకు గాదు. నీకింక మస్తు జీవితముంది. ఎందరు ఏమో అంటరు. ఎవల మాటలు పట్టుకోవద్దు. మనకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యాలె. ఇదొక్కటని కాదు. ఏదన్న కొత్త పని చెయ్యాలంటే మొదలు వెట్టంగ ఒక్కలే ఉంటరు. కాని వెనుక వెయిల మంది నడుత్తరు. రేపకల్ల గంతే. నిన్ను ఇప్పుడు జూసి కాదన్నోల్లే రేపు నీ తొవ్వల నడుత్తరు.” కూతురుకు ధైర్యం చెబుతుంటే చప్పుడు వినిపించి తలెత్తి చూసింది పూలమ్మ.

ఎదురుగా మరిది సారయ్య. అప్పుడే బండి దిగిండు. అతనితో పాటు పోషవ్వ దిగింది.

‘వీని కండ్లు మండ. ఎంత నమ్మిచ్చినా నమ్మలేదు సూడు. దాన్ని తేనే తెచ్చె. అవి తీసేదాక ఇడిసేతట్టు లేడు’ అనుకుంది.

సారయ్య అదేదో పెద్ద పని జేసినట్టు “బతిలాడి తోలుకచ్చిన. కార్యమెల్లాలె గదా. జెట్టన గాని. అందరు మీకోసమే సూత్తండ్రు. అక్కడ వంటలు గూడా అయినయట” అనుకుంట బండిని మలుపుకుని వెళ్ళిపోయిండు.

పూలమ్మ బిడ్డను ముందరాలును చేత్తదా లేదా అని ఎదురు సూత్తున్నోళ్ళందరు పోషవ్వ రావడంతో ఏదో పెద్ద ప్రమాదం తప్పినట్టు ఊపిరి తీసుకున్నరు.

పోచవ్వ నోట్లె నోట్లెనే ఏదో సదువుకుని చెట్టు చాటుకు వెళ్ళి దొరికిన రాయిని పట్టుకుని ‘భాగ్యవ్వా,దా. నేను జెట్టన పోవాలె,’ అని పిలిచింది.

ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకుంది పూలమ్మ. ఎడమ చేతిలో రాయిపట్టుకుని శివశివా అని గాజులు పగలగొట్టడం,హరిహరి అని బొట్టు తుడువడం,గోవింద గోవింద అని జడ విప్పి ఎంటికలు ముడి వేయడం,హా రామా అని పుస్తె మట్టెలు తీసి కొంగుకు ముడివేశి ఎడమ చేతిని పట్టుకుని కాడి దగ్గరికి తీసుకపోవడం,

ఆ ఊహనే భరించలేనట్టు కూతురుకంటే ముందే లేచింది పూలమ్మ. ఒకసారి చుట్టు చూసి పోశవ్వను రమ్మని పిలిచింది. పోశవ్వ ఎందుకన్నట్టు చూసి దూరంగా వచ్చి నిలబడ్డది.

“పోషా,నా బిడ్డ పుట్టిన తొమ్మిది రోజులకు లింగాలకు పెట్టి ఉల్లి పూసల పండుగు చేసింది నువ్వే కదనే. పుట్టంగనే బిడ్డను చాట్ల ఏసి నీకా నాకా అని అడిగితె నాకే అంటే నువ్వేకదా తొమ్మిదొద్దులనాడు మల్ల వత్తనని పోయింది,” అంటూ పుట్టిన నాటి పురుడును గుర్తు చేసింది పూలమ్మ.

పోషవ్వకు గతం గుర్తుకచ్చింది. ఊరిలో తను చాలా మందికి పురుడు పోసింది. తొమ్మిదొద్దులనాడు సంటి పిల్లలకు ఉల్లి పూసల పండుగు చేసి లింగాలకు పెట్టింది. బొడ్డు తాడును కాల్చి బొట్టు పెట్టి జిట్టి పూసలు గట్టింది. ‘ఎల్లెనుకా బుడుబుడుకా, ఎల్లితె నీతో ఎవలురుకా,పామోలె పాకులాడు, కప్పోలె దుంకులాడు,లేడోలె ఆటలాడు,కోకిలోలె పాటవాడు, నిండు నూరేండ్లు బతుకు,ఎల్లెనుకా బుడుబుడుకా’ అని పాట వాడి పొట్టు తీసిన ఎల్లిపాయలతో పిల్లకు తల్లికి ఉల్లిపూసల దారాలు కట్టి గాజులు తొడిగింది. బొడ్డును కాటిక చేసి బొట్టు పెట్టింది. చాట్ల బియ్యంపోసి బిడ్డనాకే నాకే అని కొట్లాడి కట్నం కల్లుగుడాలు తీసుకుని తల్లులకు పిల్లలనిచ్చింది.

“పోషా,బొట్టు గాజులు నా బిడ్డకు భర్త తోని రాలేదు,అవి పుట్టుకతోనే వచ్చినయి. మరి భర్త పోంగనే గవాటిని తీసుడేందే. నా బిడ్డ ముసలిది గాదు ముడిగిది గాదు. కండ్లముంగట అదేదో తప్పుజేసినట్టు బోసి మొఖంతో తిరుగుతె ఎట్ల తట్టుకుంటనే. అది ఇష్టపడితే రేపు ఇంకో పెండ్లి జేత్త గావచ్చు. భర్త పోంగనే తీసుడు ఇంకోడు రాంగనే పెట్టుడు, ఎవడు వెట్టిండే యిది. వాడు ఆడిదైతే తెలుత్తుండె నొప్పి. అది నాబిడ్డ యిష్టం. బుద్దుంటే తీత్తది లేకుంటే ఉంచుతది. వాల్లెవలు తియ్యిమనడానికి, నువ్వెవలు తియ్యడానికి. వచ్చిన తొవ్వన పో,లేకుంటె మర్యాదుండది” గట్టిగా అన్నది.

పోషవ్వ కండ్లల్ల నీళ్ళు. చేతులు జోడిచ్చింది. “అవ్వా,తీత్తనని నేనెట్లంటనవ్వ పాపపు నోటితోని. ఖర్మ కాలి మొగడు పోయినంక సావులు జేసి బొట్టు గాజులు తీత్తున్నగనీ అందరికి పురుడు జేసింది నేనే కదవ్వా,నా మొగన్ని మొద్దుల్ల వెట్ట. చెప్పితె ఇనక తాగి తందనాలాడి ఉత్తగ పానం తీసుకునె. వాడు రాకముందె నేను పుట్టెడు పురుడులు జేసిన. కాని వాడు వోయినంక నేను పురుడుకు పనికిరానని కాడుకాడికి మాత్రమే పిలుత్తండ్రు. పెండ్లీలకు నన్ను పిలిత్తె మంచిదిగాదని సావులకే పిలుత్తండ్రు. కడుపుల వుట్టిన పిల్లలు కూడ వెరిగిన అక్క చెల్లెలు ఎవ్వలయినా పెండ్లీలకు పెరంటాలకు నన్ను దూరముంచుడే గాదు,కనవడ్డా గూడా దరిద్రపు మొఖమని దూరదూరం బోతండ్రు. నేనేం తప్పు జేసిన్నవ్వా. నా మొగడు సచ్చుడు నాతప్పా. పదేండ్లనుంచి ముండ రాలునని నింద మోసుకుంట ఊరు ఏమంటదో అని పాణం ఉగ్గవట్టుకున్న” ఏడుత్తంది.

పూలమ్మ కండ్లు మెరిసినయి. కూతురును చేతు వట్టిలేపింది.

“సూసినావు బిడ్డా,ఇక్కడనే ఇద్దరయిండ్రు. భయపడక నాలుగడుగులు ముందుకు నడిచిసూడు. నలుగురయితరు.”

బిడ్డెతో ఊరుదిక్కు నడుత్తుంది పూలమ్మ.

ఎందరు తొక్కిండ్రోగనీ ఎండకు ఉడుకెక్కిన వాగుల ఉసికె కాలుతూ కాలుతూ కాళ్ళకింద మంటలు వెడుతుంది.

రచయిత పరిచయం

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్ గారి నివాసం సిరిసిల్ల. వీరు వృత్తిరీత్యా గణితశాస్త్ర ఉపాధ్యాయులు. సినిమాలకు పాటలు కూడా రాస్తుంటారు. రచయితగా ఇప్పటివరకూ ఏడు నవలలు, 250 కథలు, నాలుగు నాటకాలు, అనేక వ్యాసాలు రచించారు. ఎనిమిది కథా సంకలనాలు ప్రచురించారు. వీరి కథలు కన్నడ, మరాఠీ, హిందీ భాషలలోకి అనువాదం అయ్యాయి. వీరి నవల “జిగిరీ” 2006 లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తరఫున మా బృందం నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది. (జిగిరీ నవల ఆన్‌లైనులో చదవవచ్చు) ఈ నవల తొమ్మిది భారతీయ భాషలలోనికి అనువాదం అయింది. అరుదైన కథా వస్తువులు తీసుకొని, ఆగకుండా చదివించే శైలిలో రాయడం తన ప్రత్యేకత అని వీరు భావిస్తారు.

19 Responses to “ఉల్లి పూసలు”

 1. సురేష్

  అశోక్ కుమార్ గారూ..
  అద్భుతంగా రాశారు. అంశం కొత్తది కాదు. కానీ కథ రాసిన తీరు మాత్రం అద్భుతం.
  ఇంత చిక్కగా, పొందికగా, జీవం ఉన్న కథను ఇటీవలి కాలంలో (ఇప్పట్లో రాస్తున్నవారివి) నేను చదవలేదు. బహుమతి కథలు ఇప్పటికి మూడు చదివాను. మూడింటిలో ఉల్లిపూసలు కథ చాలా నచ్చింది. మీ ప్రయోగాలు కొన్ని చాలా గొప్పగా ఉన్నాయి. చాలా మంచి కథ.
  పెద్దింటి అశోక్ కుమార్.. పేరు అందరూ ఎరిగినదే గానీ, మీ కథ ఇదే నేను మొదటిది చదవడం. చాలా గొప్పగా అనిపించింది. మీ కథలన్నీ చదవాలనిపించేంత నచ్చింది.

  Reply
 2. Rohini Vanjari

  ఉల్లిపూసలు కథ చాల బాగుంది. అశోక్ కుమార్ గారి “గుండెల్లో వాన కథలు”చదివాను. ఉల్లిపూసలు కూడా గుండెల్లో కన్నీటి వానని కురిపించాయి. మీకు హృదయపూర్వక అభినందనలు సర్.

  Reply
 3. పెమ్మరాజు విజయరామచంద్ర

  శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారి కథ ఉల్లి పూసలు చాలా బాగుంది. కథాంశం సహజంగా అందరి మనసుల్లో దొర్లే ఆలోచనే. కానీ ఆ అంశాన్ని కథగా మలచిన తీరు అద్భుతం. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ లో ఒక స్త్రీ అలా ఆలోచించడం సహజమే. ఆ సహజమైన ఆలోచనని సమర్థవంతంగా అందరూ అంగీకరించే నేపథ్యంతో పాత్రలని, సంఘటనల్ని మలచిన తీరు మహా అద్భుతం. రచయిత ఎప్పుడో తన రచన శక్తి ఏమిటో నిరూపించుకున్నాడు. తెలంగాణా మాండలికంలో ఎన్నో అద్భుతమైన కథ రచనలు చేసి అందరి హృదయాలలో తన స్థానాన్ని పడిలపరచుకున్నాడు. తల్లి మనసులో ఆలోచనని ఎలా అమలుపరచగలదో అనే ఆలోచన కథ చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి వెంటాడుతూనే ఉంది. చివరలో ఆ పాత్రని ప్రవేశపెట్టినప్పుడు ఈ కథ ఎలా మారుతుందొననే ఆసక్తిని తన ప్రతిభతో అందరు అంగీకరించే లా కథ నడిపిన తీరు చాలా ప్రశంసనీయం.
  తెలంగాణ జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాల్ని స్త్రీ జీవితాలకు ముడి వేస్తూ రాసిన కథ.
  ఇలాంటి ఎన్నో కధలు ఆయన కలం నుంచి వచ్చి పాఠకులని అలరించాలని కోరుకుంటున్నాను. రచయితకు అభినందనలు

  Reply
 4. sujananamani@gmail.com

  నిజంగా చాలా అద్భుతంగా వ్రాశారు సార్. హార్దిక శుభాకాంక్షలు. మన చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు మహిళల మనసులను ఎంత బాధ పెడుతుందో వారి మనసులోకి పరాకాయ ప్రవేశం చేశారా అన్నట్లుగా రాశారు అది కేవలం మీకు మాత్రమే సాధ్యం మధ్య మధ్యలో సామెతలు ,మాండలిక భాష కథకు ప్రాణం పోశాయి. బహుమతికి అర్హమైన అద్భుతమైన కథ.

  Reply
 5. స్వర్ణ కిలారి

  బాగుంది అని మామూలుగా చెప్పలేను sir.

  ఎంత బాగా కళ్ళకు కట్టినట్లు రాసింరు సర్🙏

  ఆడోల్ల మనసుల ఏముంటదో , ఏమి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళకే ఒకోసారి తెల్వదు.

  మీరు చేసిన ఈ ప్రయత్నంతో అందరిలో ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒకడుగు ముందుకు వేస్తారు.

  మీ మాండలీకం, శైలి కథను మళ్లీ మళ్లీ చదివేలా చేసింది.

  ధన్యవాదాలు చిన్న పదం సర్🙏🙏

  Reply
 6. Jwalitha

  అవసరమైన కథ అద్భుతంగా రాశారు.. ఇంకా స్త్రీలను వెంటాడుతున్న అర్థంలేని ఆచారాలను వదిలించుకోవటం ఎట్లానో చాలా చక్కగా చెప్పారు.. మల్లెశాల పద ప్రయోగం మొదటిసారి చూస్తున్నా.. మొగశాల మలిశాల వరండా అర్థంతో వాడినట్టున్నారు..

  Reply
 7. డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ

  ఉల్లిపూసలు కథను అద్భుతంగా నడిపించారు సార్. మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళల్లోని ఆలోచన ధోరణి కూడా మారాలని ఈ కథ ద్వారా నిరూపించారు సార్. రోజు రోజుకి పెరిగిపోతున్న మూఢనమ్మకాలతో మగ్గిపోకుండా మహిళలు ఎలా చైతన్యం పొందాలో వారి అస్తిత్వాలను ఎలా కాపాడుకోవాలో సమాజంతో పోరాడి ఎలా గెలవాలో ఈ కథలో పూలమ్మ పాత్ర ద్వారా చూపించారు సార్. మీకు హృదయపూర్వక అభినందనలు సార్

  Reply
 8. Soujanya Vemula

  ఆచారం పేరుతో చేసే దురాచారం ఇది. చాలా అద్భుతంగా కథ రూపంలో చెప్పారు. ఇది కథ కాదు ఎందరో స్త్రీల ఎత. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మారుతున్న సమాజానికి ఈ కథ ఎంతో అవసరం.
  మంచి మార్పు అనేది ఒక్కరిలో మొదలై క్రమేణా అందరిలో వ్యాపిస్తుంది.ఇక మీరు రాసే విధానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ఆ పాత్రలల్లో జీవించేస్తాము.
  అభినందనలు సర్ 👏💐💐

  Reply
 9. చల్లా దేవి

  నమస్కారం సార్
  ఉల్లి పూసలు ఓ అద్భుతమైన కథ. మీరు రాసినటువంటి కథలు అన్నీ అలానే ఉన్నాయి . కళ్ళకి కట్టినట్టుగా అద్భుతంగా ఉన్నాయి సార్.
  “కొత్త పని చెయ్య లంటే మొదలు పెట్టంగా ఒకళ్ళే ఉంటారు”
  ప్రతి విజయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది
  ఆడవారికి ఉన్నటువంటి సమస్యలను కల్లకు కట్టినట్లుగా తెలంగాణ మాండలికంలో పదాల పొందిక చదవడానికి వినడానికి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్.

  Reply
 10. పెద్దపల్లి తేజస్వి

  సర్ కథ చాలా బాగుంది.. మగపిల్లాడితో పాటు ఆడపిల్లని సమానంగా తల్లి పెంచిన విధానం👌👌అల్లుడు ప్రమాదవశాత్తు మరణిస్తే విధవని ఎందుకు చేయాలి అని పూలమ్మ ప్రశ్నించిన విధానం ఆలోచింపచేసింది..పోషవ్వ పూలవ్వకి సపోర్ట్ గా నిలబడటం సంతోషం అనిపించింది..
  పెళ్లి అయ్యాక భర్త చనిపోతే విధవ చేస్తారు..మళ్ళీ పెళ్లి చేసి బొట్టు పెడతారు ..??

  ప్రతి ప్రశ్న ప్రశ్నించేటప్పుడు ఎస్ కరెక్టు గా అడిగారు అనిపించింది సర్..

  స్త్రీల జీవితాల్లో జరిగే బాధాకరమైన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు కనిపించింది సర్🙏🙏🙏

  Reply
 11. అనంతోజు పద్మశ్రీ

  అవును ..స్త్రీ జీవితంలో అత్యంత బాధాకరమైన హృదయ విదారకమైన
  దృశ్యం…ఆనవాయితీగా వస్తుందని అందరూ అడ్డుకోలేనిది…చాటుగా విమర్శించినా..బాహాటంగా అందరూ సమర్థించాల్సిన సందర్భం…ఉల్లి పూసల ద్వారా ఉన్నదున్నట్లు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిన మీ కథనం అద్భుతం..పరిష్కారం ఇంకా అత్యద్భుతం..పెద్దింటి గారి పెద్ద హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు…శుభాబినందనలు సర్

  Reply
  • డా . అడు వాల సుజాత

   అద్భుతమైన కథ మా పెద్దింటి అన్న తెలంగాణా అక్కాచెల్లళ్ళ ఆత్మ తెలిసినోడు . తరతరాల నుండి వస్తున్న ఆచారాల బూజు ను దులపాలనే కంకణం కట్టుకున్న వాడు. అన్నా నీ మనసులోని భావాల్ని చక్కని కథ గా అందించి ఇంకా ఆచారాలు సంప్రదాయాలు పాటించే వారికి చెంప పెట్టు గా ఈ కథ రాశారు మీకు శత కోటి వందనాలు🙏 మీ కథలన్నీ ఆణి ముత్యాలు రత్నాలు యెట్లా చెప్పల్నో తెలుస్తలేదు అన్నా👌🏻👍💐💐

   Reply
 12. సుజనా దేవి

  నిజంగా చాలా అద్భుతంగా వ్రాశారు సార్. హార్దిక శుభాకాంక్షలు. మన చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు మహిళల మనసులను ఎంత బాధ పెడుతుందో వారి మనసులోకి పరాకాయ ప్రవేశం చేశారా అన్నట్లుగా రాశారు అది కేవలం మీకు మాత్రమే సాధ్యం మధ్య మధ్యలో సామెతలు ,మాండలిక భాష కథకు ప్రాణం పోశాయి. బహుమతికి అర్హమైన అద్భుతమైన కథ.great sir👏👏👏👏👏👏👌👌👌👌🙏

  Reply
 13. పద్మజ బోలిశెట్టి

  సమాజంలో జరుగుతున్న మూఢ నమ్మకాలు అని కొందరు సాంప్రదాయాల పేరుతో ఇప్పటికీ ఆచరిస్తున్నారు. కథా వస్తువు పాతదే అన్న వాళ్లు అయినా కళ్ళ ముందు ఇంటి పక్కన్నో… ఊర్లోనో జరుగుతున్న ఆచారాలను ఆపలేక పోవడం వల్ల ఇప్పటికీ ఇంకా సరైన అవగాహన రాలేదని విషయం తేటతెల్లం చేస్తున్నాయి.పెద్దింటి గారు కథ ను నడిపించిన తీరు చాలా బాగుంది. హృదయ పూర్వక అభినందనలు సార్ 💐💐💐💐

  Reply
 14. జీ, srimathi

  నమస్కారం సార్. మీ కథలన్నీ దేనికవే విభిన్నమైనటువంటివి. నేను మీ కథల్ని చాలా వరకు చదివేశాను. ప్రతి కథ మన చుట్టూ జరుగుతున్నటువంటివి. ఈ కథ సమాజంలో ఒక ఆచారాన్ని మార్పు కోసం, ఆచారాల పేరుతో ఆడవారికి కలిగే మానసికక్షోభను ఈ కథలో మీరు కళ్లకు కనిపించేలా రాశారు. ఆడ పిల్లల విషయంలో మార్పుకు నాంది పలికేది తల్లి, ఎందుకంటే తను కూడా ఆడదే కాబట్టి ఈ కథలో తల్లి అవకాశం వస్తే నా బిడ్డకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని ధైర్యంగా నిర్ణయాన్ని ముందే తీసుకొని ఉంది. అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి సంకల్పం అది. దానికోసం సమాజాన్ని అయినా ఎదిరిస్తుంది తల్లి. కృతజ్ఞతలు సార్. ఆడవాళ్ళ మానసిక స్థితిని ఇంత బాగా కథలో చూపించినందుకు.

  Reply
 15. డా. సరోజ వింజామర.

  మార్పు రూట్ కాస్ నుంచి మొదలవాలి. స్త్రీలో చైతన్యం వస్తే ఆటోమేటిక్ గా సమాజంలో మార్పు వస్తుంది. చాలా చాలా బాగుంది ఇతివృత్తం చెప్పిన తీరు
  ఇక మన తెలంగాణా మాండలికంలో లో మీ అందే వేసిన చేయి గురించి చెప్పే పనే లేదు. మంచి కథ షేర్ చేసినందుకు థాంక్యూ సర్.
  బహుమతి గెలిచిన సందర్భంగా అభినందనలు. 👍👏👏👏

  Reply
 16. Pentaiah Veeragoni

  కథ ఏక బిగిన చదివించింది. కొన్ని పదాలు చాలా కొత్తగా అనిపించి నై. మా ప్రాంతం లో అట్లాంటి పదాలు వినలేదు. నీకా, నాకా కోసం చదివిన పాట కూడా నేను ఎప్పుడు వినలేదు. భలే సేకరించినవ్ తమ్మి. అభినందనలు.

  Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.