తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

హద్దులకు ఆవల

తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
హద్దులకు ఆవల
© Telugu Society of America

“ఇగ్నోర్‌ చేస్తాను. కానీ, క్షమించలేను”

ఈ మాట చెప్పినందుకు పొగరుబోతును అనుకునేరు. అస్సలు కాదండి. నాకు ఇలాంటి అభిప్రాయాలు కలిగేలా చేసిన సొసైటీదే ఆ బాధ్యత.

ఆడదాన్ని అయినంతమాత్రాన జాలి, దయ, కరుణ లాంటి గుణాలు ప్రతి ఒక్కరిపట్లా పొంగిపొరలాల్సిందేనా?

భావాలన్నింటినీ లోపల దాచుకుని పైకి మాత్రం ఏమీ జరగనట్లు ముఖాన ఇంత నవ్వు పులుముకుని ఉండాలా?

ఎలా సాధ్యం అసలు?

మనిషి అన్న తరువాత భావావేశాలు సహజాతి సహజంగా కలగాలి అంటాను.

తప్పేముందండీ?

అలా ప్రదర్శించినందుకే మగరాయుడు అని పిలవడం మొదలు పెట్టారు.

అంటే అన్నారు. అభ్యంతరం ఏమీలేదు దానిపట్ల.

కాకపోతే “ఆడదానివి గనుక ఈ మూసలోనే ఒదిగి పో” అంటూ హద్దులు చూపుతుంటారు చూడండి. వాళ్ళతోనే అభ్యంతరమంతా.

ఇప్పుడు ఒక్కదాన్నే ఉద్యోగం కోసం సిటీకి వచ్చాను. వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను.

ఇక్కడే ఇల్లు తీసుకుని అమ్మమ్మా తాతయ్యను తీసుకురావాలా? లేక వాళ్ళను అక్కడే ఉంచి ఇలాగే కొనసాగాలా? లేక ఇంకేమైనా ఆలోచనలు వస్తాయా? ప్రస్తుతానికి ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నాను. ఏ దారిలో వెళ్ళాలనేది స్పష్టత వచ్చేదాకా ఇలా ఉంటాను. జీవితం కదా. తొందరపడ కూడదని నా అభిప్రాయం.

నా అభిప్రాయంతో అమ్మమ్మకు ఇబ్బంది లేదు. తాతయ్యకూ లేదు. ఉన్నదల్లా జనానికే.

పోనీలే. పల్లెటూరిలో ఉన్నారు. అక్కడ ఉండేవాళ్ళు కల్మషం లేకుండా కేవలం సానుభూతితోనే అలా మాట్లాడతారు అనీ అనుకుందాం. మరి ఇక్కడ?

ఆఫీసులో?

ఎవరూ లేని దాన్ని అని ఎలా తెలిసిందో ఏమో! అప్పటి నుంచి ప్రాజెక్టు మేనేజర్ ప్రవర్తనలో తేడా వచ్చేసింది.

అంతే!

అతడికి పెళ్ళి అయిందనీ, పిల్లలు ఉన్నారనీ మరిచిపోయాడేమో.

లంచ్‌కు వెళ్దామనీ, డిన్నర్ అనీ, హాస్టల్ దాకా డ్రాప్ చేస్తాననీ ఒకటే మెసేజులు.

మేనేజర్ అంటే ఎంతో రెస్పెక్ట్ తో చూస్తాం కదా, అదే రెస్పెక్ట్ తో సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాను. కానీ, అతడికి ఆ సున్నితత్వం అమాయకత్వంలా అనిపించిందేమో. ధైర్యం వ‌చ్చేసింది. ఇక మెసేజులలో డోస్ పెంచాడు. ప్రేమ పేరుతో అతడు పంపుతున్న మెసేజెస్లో అంతా అస‌భ్య‌తే. కొన్ని కొన్ని నగ్నంగా ఉండే దేహాల ఫొటోలూ పంపుతున్నాడు.

చాన్నాళ్ళ నుంచి ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాను. ఇక ఇప్పుడు ఆ బోర్డ‌ర్ దాటేసాడు. క్షమించడం మాత్రం నావల్ల కావడంలేదు.

చాలామందికి ఇలాంటివి అనుభవమే అయి ఉండొచ్చు. ఇంతకన్నా ఎక్కువా తక్కువ స్థాయిల్లో ఎదుర్కొని ఉండొచ్చు.

అయినా బాధను మనసులో అదిమి పెట్టుకుని హుందాగా జీవించేస్తున్నవారు మన చుట్టూ చాలామంది ఉండే ఉంటారు. క్షమించేయమని మనలాంటి వారికి తేలికగా సలహా ఇచ్చేస్తుంటారు.

నిజమే. వాళ్ళు చెప్పినట్లుగా వదిలేద్దామనే కదా ఈ ఇగ్నోరెన్స్ ను పట్టుకుని చుట్టూ కమ్ముకొని ఉన్న నిర్ద‌యా ప్ర‌వాహాల‌ను ఈదుకుంటూ వస్తున్నాను.

కానీ అతడు చేతకానితనం అనుకుంటున్నాడు.

బలహీనురాలిని అనుకుంటున్నాడు.

ఒంటరిదాన్ని అనుకుంటున్నాడు.

అందుకేగా “వీకెండ్ అంతా ఎంజాయ్ చేద్దాం. రూం బుక్ చేశాను. రాకపోతే నువ్వే కారణమని రాసి మరీ సూసైడ్ చేసుకుంటాను” అని మెసేజ్ చేసాడు.

ఆటలుగా ఉందా?

ఎంత ఒంటరిదాన్నైతే మాత్రం అంత అలుసా? ఈ తరహా బెదిరింపులకు దిగుతాడా?

“అప్రైజల్స్ లో ఏవైనా చేస్తాడేమోనే” అద్దాలు సరిచేసుకుంటూ అంది విజయ. సీనియర్. ప్లేస్‌మెంట్‌లో జాబ్ కొట్టేసి ఎంతో ఉత్సాహంగా జాయిన్ అయిన రోజు నుంచీ సపోర్ట్‌గా ఉంది. ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసేస్తుంది.

ఇలాగే ఇంతకుముందు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడట. కాండక్ట్ సర్టిఫికెట్లో ఎక్కడ నెగటివ్ రాస్తాడోనని భయపడి ఒప్పేసుకుందట. అవే మంచిమాటల తో మెల్లగా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని వేరే కంపెనీలోకి షిఫ్ట్ అయిందని చెప్పింది విజయ.

“మరి మీరంతా ఏ హెల్ప్ చేయలేదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“ఏం చేయమంటావ్? ఒక్కొక్కరికీ ఒక్కో ఇబ్బంది” అంది.

“సో, అలా కంటిన్యూ అవుతూ అతడు బలవంతుడు అనే భావన అతడికి కలిగించారు” అన్నాను బాధగా.

“నిజంగానే. వాడితోపాటు పని చేసినవారు చాలా ఆర్గనైజేషన్స్ లో ఉన్నారే. మనం ఎక్కడ జాబ్‌కు వెళ్ళినా ముందు వీడికి కాల్ వస్తుంది. టచ్ లో ఉంటాడు అందరితో” అతడి పవర్ గురించి మమత చెప్తూ పోయింది.

“వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యకు చెప్తే? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే? మన హయ్యర్స్‌కి చెప్తే?” సందేహాలు వెలిబుచ్చాను.

“ఇన్నేళ్ళలో ఇవన్నీ జరగకుండా ఉంటాయని అనుకుంటున్నావా?” టీ సిప్ చేస్తూ ప్ర‌శ్నించింది విజయ.

“నీలాంటి ముక్కుసూటి మనుషులు ఈ లోకంలో బతకలేరు” వ్యవహారాన్ని సింపుల్‌గా తేల్చేసింది మమత.

“అంటే? లొంగిపొమ్మ‌నా నీ స‌ల‌హా?” మ‌మ‌త‌పై కోపం వ‌చ్చేసింది.

“ఛా! అది కాదే. స‌మ‌స్య మ‌న దాకా రానే వ‌ద్దు. వ‌చ్చిన‌ప్పుడు ధైర్యంగానే స‌మాధానం చెబుదాం. నేన‌నేది ముక్కుసూటిగా అయితే ఏదైనా ప్ర‌మాదం రావొచ్చు క‌దా. అలా కాకుండా మ‌రో మార్గం. అంటే బెదిరించ‌డం, బ్లాక్ మెయిల్ లాంటివి బెట‌రేమో” ఆలోచిస్తూ అంది.

“మనకు మనం ధైర్యం చెప్పుకోకపోతే ప్రతిసారీ మన రక్షణకు ఎవరో ఒకరు ఉంటారా?” అని అడిగాను.

మమత అలా చెప్ప‌టానికి కారణం ఉంది. జాబ్ వదిలేసి వెళ్ళిపోతానేమో అని ఆమె బాధ.

ఆఫీస్‌లో జాయిన్‌ అయిన కొత్తలో ఆఫీస్‌కు దగ్గరపట్లనే ఏదైనా వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌ వెతుక్కుందామనుకున్నాను. అప్పటిదాకా విజయ రూమ్‌లోనే ఉన్నాను. ఒక ఆదివారం మధ్యాహ్నం వేళ ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి రాజ్‌భవన్‌ రోడ్డువైపుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. రోడ్డు ఎంతో నచ్చింది. విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఉన్న మిగతా రోడ్లకన్నా కాస్త నెమ్మదిగా ఉంది ఆ రోడ్డు. మరీ ముఖ్యంగా నిటారుగా ఉన్న చెట్లు మరీ మరీ ఆకర్షించాయి. ఆటోలో అయితే ఆ సౌందర్యాన్ని కళ్లల్లో నింపుకోవడం సాధ్యం కాదని నడకనే ఆశ్రయించాను.

ఒక్కదాన్ని అందులోనూ విస్మయంగా నడుచుకుంటూ పోవడం నేను సిటీకి కొత్త అని పట్టిస్తున్నదేమో. ఉన్న‌ట్లుండి ఎవరో నా వెనకాలే నడుచుకుంటూ వస్తున్నట్లు గమనింపులోకి వచ్చింది‌. వెనక్కు తిరిగి చూస్తే నా వయసో, నాకంటే కాస్త ఒకటిరెండేళ్లు ఎక్కువనో ఉన్న యువకుడు నావైపే తీక్షణంగా చూస్తూ వస్తున్నాడు. అనామకుడు. నా గురించి కాదేమో. తన దారిన తాను పోతున్నాడేమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని రోడ్డు క్రాస్‌ చేసి నడక సాగించాను. అయిదు నిమిషాల తరువాత వెనక్కు చూస్తే, నా వెనకాలే ఉన్నాడు. ఈసారి మళ్లీ క్రాస్‌ చేసాను రోడ్డు. అతడూ అంతే.

అప్పుడు అతడిపై ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు నేను ఆ ప్రాంతానికి పూర్తిగా కొత్త అనే బెరుకు ఎటు ఎగిరిపోయిందో మరి. వెంటనే వెనుదిరిగాను. నాకూ అతడికీ పది పదిహేను అడుగుల దూరమే ఉండి ఉంటుంది. మొండి ధైర్యంతో వెనక్కు నడవటం మొదలుపెట్టాను. అది కూడా ఇందాకటి కన్నా కొద్దిగా వేగం హెచ్చించి. అతడి మొహంలో కన్ఫ్యూజన్‌ కొట్టొచ్చినట్లు కనపడింది. అతడూ వెనుదిరిగాడు. నడుస్తున్నాడు. ఇప్పుడు అతడు ముందు. నేను వెనకా. కాసేపు నడిచాక వెనుదిరిగి చూసాడు.

నేను ఆగమన్నట్లుగా చెయ్యెత్తి సైగ చేసాను. అతడు స్పీడ్‌ పెంచాడు. నేనూ స్పీడ్‌గా నడిచాను. మొత్తానికి చౌరస్తా దగ్గరకు వచ్చే సరికల్లా అతడిని చేరుకున్నాను.

“పిలుస్తున్నవేంది?” ఆశ్చర్యం, ఆందోళన మిళితమైన గొంతు ధ్వనించింది.

“ఫాలో చేస్తున్నవు. ఏంది కథ. పనీ పాటా లేకుండా రోడ్డుమీద పడ్డవా?” గట్టిగానే అడిగాను.

“ఆ ఫాలో చేస్తే? నువ్వే ఇప్పుడు నన్ను ఫాలో చేసుకుంటొచ్చిన‌వ్ క‌దా” హెచ్చు స్వరంతో అన్నాడు.

“అవును. ఎవడు నన్ను ఫాలో చేస్తే వాడినే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన. పోదాం పా మీ ఇంటికి” పట్టుదలగా అన్నాను.

“హోయ్‌. ఏందీ ఇంటికి పొయ్యేది. నేను పోవాల్సింది నెక్లెస్‌ రోడ్డుకు” అని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జ్‌ వైపు పరుగులు తీసాడు.

నాకు నవ్వు ఆగలేదు.

ఇదే విషయాన్ని విజయ ఆఫీసులో చెప్పేసింది. పడీ పడీ నవ్వారందరూ.

“కొద్దిగా భయపడితే వాడి ఈగో సాటిస్ఫై అయ్యేది కదా?” అడిగింది మమత.

అంతేకాదు.

“ఈ ప్రపంచంలో సునాయాసంగా బతుకీడ్చే లక్షణం ఒక్కటీ లేదు” తేల్చి పడేసింది.

ఎవడో ఫాలో అవుతుంటే నేనూ భయపడి, ఇంకొకరి సహాయం కోసం అర్ధించాల్సిందేనా?

అలా అయితేనే నాకు బతుకు ఉంటుందా?

ఏమో?

నిజమే అనుకుందాం. రాజీపడి చస్తూ బతకటం అవసరమా? అయినా “నన్ను నేను కాపాడుకోవటం నేరమెట్లా అయింది? అలా బతికేయటం అంత సులువా?” అడుగుతాను.

“సులువు చేసుకోవాలి తల్లీ” మా తాతయ్య సమాధానం ఇదే ఎప్పుడూ. మా అమ్మకు నాన్నలెండీ. అమ్మలేదు కదా. అమ్మమ్మ, తాతయ్యలే పెంచారు నన్ను.

అసలు వాళ్ల క్షమా విధానం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎప్పటికైనా అర్థమవుతుందో లేదో.

ప్రతి ఒక్కరినీ “పోనీలే” అంటుంది అమ్మమ్మ. పనోళ్లు తప్పు చేస్తే చూసీ చూడనట్లు వదిలేయడంలో ఓ అర్ధం ఉంది. పోనీలే, పేదవారి విషయాల్లో జాలిగా ఉన్నారని నేనూ సంతోషపడతాను.

కానీ మా అమ్మ విషయంలోనూ వీళ్ళిద్దరూ అలా మెతకగా ప్రవర్తించారు. కన్న కూతురిని చంపిన వాళ్లను క్షమించగలిగేంత ఉదారత ఏమిటో మరి. ఆ చావుకు కారకులైన అల్లుడినీ, అతడి తల్లిదండ్రులతో బాంధవ్యాలు కలుపుకోవాలని చూడటం. ఎలా సాధ్యమని?

వాళ్లకైనా పధ్నాలుగేళ్లపాటు కూతురిని చూసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. నా దగ్గర ఏమున్నాయి? కొన్ని బ్లాక్‌ ఆండ్‌ వైట్‌, మరికొన్ని కలర్‌ ఫొటోలు తప్ప.

ఆమెతో కేవలం ఏడు నెలలు గడిపిన శిశువును అని చెప్తారు. నాకేం తెలుస్తాయని? జ్ఞాపకాలు నిర్మించుకునే వయసు కానే కాదు.

మా అమ్మదీ చచ్చిపోయే వయసూ కాదు.

నిజానికి ఆమెది పెళ్ళి చేసే వయసు కాదు. నన్ను కనే వయసు అంతకన్నా కాదు.

తల్లి లేని బిడ్డను చేసిన వారిని నేనైతే క్షమించను. క్షమించలేను. కనీసం నేను పుట్టాకైనా వారిలో మార్పు రాకూడదా? నా భవిష్యత్తు గురించైనా ఆలోచించకూడదా? వాళ్ల అదనపు కట్న దాహానికి ఇసుమంతైనా తూగనిదాన్నా?

తల్లిదండ్రులు లేకుండా పెరగటం ఎంత కష్టమో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు.

అమ్మమ్మా, తాతయ్య లేకపోతే నా బతుకు ఏమయ్యేది? ఏదైనా అయ్యేదేనేమో. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.

అవగాహన వచ్చాకా అమ్మ సంగతి విన్నాను. పంటపొలాలకు వేసే పురుగుల మందు తాగేలా పరిస్థితులు కల్పించిన వాళ్ళు హంతకులకన్నా తక్కువా?

అప్పటినుంచీ “నాన్నా” అని కూడా పిలవటం మానేసా ఆ వ్యక్తిని. అతడి తల్లినీ “నాయనమ్మా” అని పిలిచేందుకు నోరు రావటంలేదు.

ఎప్పుడైనా వాళ్ల ఇంటికి వెళ్లి రమ్మని బతిమాలుతుంటుంది అమ్మమ్మ. పెళ్లికి ఎదిగాను కదా. కన్యాదానం వంటి బాధ్యతలుఉంటాయనేమో?

అయినా పెంచి పెద్దచేసిన అమ్మమ్మ,తాతయ్యలు ఉండగా నేనెందుకు అతడి చేతినుంచి దానం చేయబడతాను? అయితే గియితే పెళ్లే మానేస్తాను కానీ.

“అమ్మ నోట్లోంచి ఊడిపడ్డానట” ఈ మాట చెప్పి మురిసిపోతుంటుంది అమ్మమ్మ.

పెళ్లి కాకపోయినా ఆడపిల్లలకూ ఒక బతుకు ఉంటుందని, దానికి ఊపిరి ఆడుతుందనీ తెలుసుకోరు. పెళ్లే పరమావధి అన్నట్లుగా బతికేస్తున్న ఈ మనుషులకు హద్దులకు ఆవల ఉండే అందమైన వనాల గురించి ఎలా చెప్పాలి?

ముప్ఫై ఏళ్ల క్రితం ఉన్న అత్తగార్లకు ప్రతీక మా అమ్మ అత్తగారు. అమ్మకు పదమూడో ఏట నేను పుట్టానట. ఇప్పుడు ఇరవై అయిదు వచ్చినా నేను పెళ్లి చేసుకోలేదని దెప్పిపొడుస్తుంటుంది అమ్మమ్మ.

ఆరో తరగతి సెలవుల్లో మెచ్యూర్‌ అవటం, ఏడో తరగతిలోకి వచ్చేసరికే తనకన్నా పదిహేనేళ్లు పెద్దవాడైన తన మేనబావకు ఇచ్చి పెళ్లి చేయటం, చదువు పక్కకు తప్పుకుని సంసారం మెయిన్‌ ట్రాక్‌లోకి రావటం అంతా ఒకదాని తరువాత ఒకటి వెంటవెంటనే జరిగిపోయాయి.

ఇప్పటిలా చదువుల గురించి అమ్మమ్మా తాతయ్యల్లో ఏ ఒక్కరికి కొంత తెలినా “ముందు చదువు” అనే అనేవారేమో.

యాభై ఎకరాల పొలం, పెద్ద తోటలాంటి ఇల్లు, ఏడెనిమిది మంది జీతగాళ్లు, ఇంటి నిండా పాడి. వీటితోనే సతమతమయ్యేది అమ్మమ్మ. ఊరికి సర్పంచుగా పని చేసిన తాతయ్యకు ఎప్పుడూ పొలమూ, ఊరు, రాజకీయాలే తప్ప మిగతావి పట్టేవి కాదు.

ఒక్కగానొక్క కూతురు. ఉన్న ఊర్లో, సొంత చెల్లెలు ఇంటికే మెట్టితే కళ్లముందే ఉంటుందనుకున్నాడు తాతయ్య.

“పెళ్లిలోనే అతడి అసలు రంగు చూపెట్టినా కనిపెట్టలేకపోయాను” అనే దిగులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది ఆయనను.

“పాతిక ఎకరాలు ఇస్తే తప్ప పెళ్లి పీటలమీద కూర్చోను” అని మొండికేసాడట.

“ఒక్కగానొక్క సంతానం. ఇంకెవరికి పోతుంది? ఏనాటికైనా ఆస్తి అంతా నీకేరా అల్లుడూ” అంటే విననే లేదు. కొడుకుకు నచ్చచెప్పాల్సిన చెల్లెలు కొడుక్కే వంతపాడింది. అప్పుడు పెళ్లి ఆపేసినా కూతురు కళ్ల ముందు ఉండేదని గుర్తు చేసుకున్న‌ప్పుడ‌ల్లా క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతుంటాయ్‌.

అమ్మమ్మా అంతే. అమ్మలాగా ఉన్న నన్ను పట్టుకుని ఏడుస్తుంటుంది.

చిన్నప్పుడు అర్థం అవక బిక్కమొహం వేసేదాన్ని. ఇప్పుడు కాస్త అలవాటైపోయింది. పైగా ధైర్యం చెప్తుంటాను.

ఎంత అలవాటైనా కడుపుకోతకు ఓదార్పు అంత తేలికా?

మా అమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పటి సంగతి. ఆమెకు ఒంట్లో నలతగా ఉంది. నేను కడుపులో ఉన్నాను. పురిటి నొప్పులు మొదలైనా అవి కాన్పు నొప్పులని తెలియలేదు. తొలుసురు కాన్పు. అందునా చిన్న వయసు కదా.

చీకటి పడేవేళ. పొలం నుంచి వచ్చింది ఆమె అత్తగారు. వచ్చేసరికి ఈదురు గాలులకు కొట్టుకొచ్చిన చెట్ల ఆకులు, గడ్డి పోచలు రాలి చెత్తగా కనిపించింది వాకిలి. ఇంట్లో చూస్తే ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఉన్నాయి. నిజానికి ఆమె వచ్చేసరికి కట్టెల పొయ్యిమీద వంట అయిపోయి ఆమె స్నానానికి పొంతలో నీళ్ళు కాగుతూ ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అయ్యే పనులు ఆరోజు ఎందుకు కాలేదనే స్పృహే రాలేదు ఆ అత్తగారికి. నొప్పితో విలవిలలాడుతూ గదిలో పడుకుని ఉన్న అమ్మను బయటకు పిలిచింది. పొద్దు వాలిన సంగతి తెలియని అమ్మ మూలుగుతూ బయటకు వచ్చింది.

వాకిలి ఊడ్చకుండా, వంట చేయకుండా, పశువులకు కుడితి పెట్టకుండా ఏం చేస్తున్నట్టు అని గద్దిస్తూనే కాలెత్తి నడుముపై ఒక్క తన్ను తన్నింది. అంతే! పక్కనే ఉన్న నులక మంచంలోకి సోలిపోయింది అమ్మ. ఇంకా నయం ఆ తన్నుకే నేను భూమిపై పడి ఉంటే చితికిపోయేదాన్ని. ఈరోజు మా అమ్మ కథ ఇలా చెప్పుకోడానికి ఉండేదాన్ని కాదు.

నిజానికి అమ్మ అప్పుడే చచ్చిపోవాల్సింది. నులక మంచం కావడంతో బతికిపోయిందేమో.

ఇంకో విష‌యం ఇక్క‌డ చెప్పాలి. అస‌లు బాల కార్మిక చ‌ట్టాలు, వ‌ర‌క‌ట్న నిషేధ చ‌ట్టం లాంటివి ఎటుపోయాయో అస‌లు. బాల్య వివాహాల నిషేధ చ‌ట్టం నాటికి అమ్మ చ‌నిపోయి చాలా ఏళ్ల‌యిపోయింద‌నుకోండి.

ఒకవేళ ఆమె తన్నినప్పుడే నేను పుట్టి, అమ్మ చనిపోయి ఉంటే “తల్లిని మింగేసినదాన్ని” అనే నిందతో లోకం ఆడిపోసుకోకపోయిందా? మహానుభావురాలు. ఎలాగో కాపాడింది.

ఆ తరువాత రెండు గంటలకు నేను ఈ భూమిపై పడ్డాను.

అటువంటి మా అమ్మ అత్తగారు ఇప్పుడు మంచాన పడి ఉందనీ, ఆమెను చూడటానికి నన్ను వెళ్లమంటుంది మా అమ్మమ్మ. ఆడపడుచు అనీ, వియ్యపురాలు అనీ ఇంకా బాంధవ్యాలేమిటి అసహ్యంగా? నాకసలు ఆమె ముఖం చూడాలనే లేదు.

“పోనీలేవే. వాళ్లపాపాన వాళ్లే పోతారు. చూసిరామ్మా. పోయేముందు నిన్ను చూడాలని ఉందని పరామర్శకు పోయినోళ్లందరితోనూ చెప్తుందంట” అని బతిమాలింది ఓసారి.

“నిండు చూలాలు. అంతకుమించి ఏమీ తెలియని పసిపిల్లపై అంత కాఠిన్యం చూపిన ఆ ముసల్ది ఎలా పోతే నాకేమి? అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నట్లు ఈ పాతికేళ్లలో ఏనాడూ గుర్తుకురాలేదే.? ఏం నేను వెళితేమటుకు పోయే ప్రాణాన్ని ఆపుతానా? పోనీ. ఇన్నాల్టికైనా ఛస్తుంది” కసిదీరా తిట్టుకున్నాను.

ఈ ముక్క మీతో అంటున్నాను కానీ పైకి అనే ధైర్యం చేయనులేండి. ఒకసారి ఇట్లాగే ఏదో అమ్మమ్మ ముందే అన్నాను. వెంట‌నే తిట్టేసింది.

“పెద్దవుతున్నాకొద్దీ మనసు రాయి అయిపోతుందేమే. నోరూ ఎక్కువే అయితున్న‌ది” అని కసురుకుంది.

పేగు తెంపుకుని పుట్టిన బిడ్డను, అదీ అడిగినంత కట్నకానుకలు ఇచ్చీ ఘనంగా పెళ్లి చేసి సాగ‌నంపిన‌ బిడ్డను వేధించి, వెంటాడి చంపిన వాళ్లను ఇంత శాంతంగా ఎలా వదిలేయమని చెప్పగలుగుతుంది? ఇది క్షమే అంటారా? కాదనిపిస్తుంది. తల్లి స్పర్శే సరిగ్గా ఎరుగని నేను క్షమించలేకపోతుంటే, కొన్నేళ్లపాటు కళ్లముందు తిరగాడిన పిల్ల అకారణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఎంత ఇబ్బంది పెడితే తన ప్రాణాలు బలి ఇచ్చి ఉంటుంది ఆ పసి మనసు? ఈ ఆలోచనలే లేవా అమ్మమ్మలో!?

క్షమ ఇంతపని చేయిస్తుందా? అసలు ఇది ఉదారతా లేక ఉదాసీనతా?

అయితే అలా చంపినవాళ్లందరినీ క్షమిస్తూ పోతే చంపేవాళ్లు ఇంకా ఇంకా పెరగరా?

దానికీ మా అమ్మమ్మ దగ్గర సమాధానం ఉంటుంది.

“వాళ్ల పాపాన వాళ్లే పోతారులేవే” అని.

అమ్మమ్మ చెప్పిన మాటలే నిజమైతే ఎదుటివారిని మాటల శూలాలతో పొడిచి పొడిచి చంపేవాళ్లు ఈపాటికే మసైపోవాలిగా?

అదనపు కట్నం ముందు, భార్య తూగలేదు. కడుపులో పిండమూ తూగలేదు. అటువంటి వాళ్ళ నామరూపాలు లేకుండా ఏనాడో భూగర్భంలో కలిసి పోవాలిగా?

ఇవేమీ అవలేదు. సరికదా అమ్మ అత్తగారు ఎనభయ్యేళ్లు వస్తున్న ఇప్పటికి కానీ మంచాన పడలేదు.

అయ్యో! నేను చావుల కోసం ఎదురుచూసే మనిషిని కాదండీ. నన్ను కన్న నా తల్లి భర్తకు ఇప్పుడు ఇంకో భార్య, ఇద్దరు పిల్లలు. “చిన్న కుటుంబం చింతలేని కుటుంబం” అని పాటలు పాడుకుంటున్నాడు. తన దారిన తాను పోయిన నా తల్లి కూతురిగా “అమ్మమ్మ తాతయ్యలే కాదు. అమ్మానాన్న ఉండి ఉంటే, నా జీవితం ఎంత బాగుండేది” అనీ కుంగిపోతూ బతుకు వెళ్ళదీస్తున్నాను నేను.

మనసు అల్లాడిపోతుంటుంది.

ఎన్నిసార్లు నాకు అమ్మానాన్నల అవసరం పడిందో తెలుసా?

స్కూల్లో చేరినప్పుడు, ఫ్రెండ్స్‌తో కొట్లాటలు అయినప్పుడు, కాలేజీలో చేరినప్పుడు, ఇంజనీరింగ్‌లోకి వెళ్లినప్పుడు, ఇదిగో ఇలా హైదరాబాద్‌కు వచ్చి పరీక్ష రాసిన ప్రతిసారీ, ఆఫీస్‌లో చేరినప్పుడు, ఉండటానికి హాస్టల్‌ వెతుక్కునప్పుడు, ఈవ్‌ టీజింగ్‌ ఎదుర్కొన్నప్పుడు, లవ్‌ అంటూ ఎవడో ఒకడు వెంట పడుతున్నప్పుడు. ఎన్నిసార్లు భయపడ్డానో.

అందరిలా నా వాళ్లూ నా స్కూలుకు, కాలేజీకి రావాలని మనసు ఎంత తహతహలాడేదో. ఈ లెక్కన నేను అనాథను కానంటారా?

కాదులేండి. అవునూ అంటే అమ్మమ్మాతాతయ్య నేర్పిన మానవత్వం, స్వచ్ఛమైన ప్రేమ, వాళ్ల పెంపకాన్ని అవమానించినట్లు అవుతుంది. పైగా వాళ్ళైనా లేకుండా పెరిగిన అనాథలు ఎంతమందో. ఆ రకంగా చూస్తే “ఎంతో గొప్ప అదృష్టవంతురాలినే” అని అనిపిస్తుంటుంది.

ఇటువంటివన్నీ పోగొట్టుకున్నప్పుడు, కాదు కాదు దక్కకుండా చేసిన వారిని కూడా మరిచిపొమ్మనే చెబుతుంది అమ్మమ్మ.

ఆమెలో ఈ ఇగ్నోరింగ్‌ మైండ్‌సెట్‌ మొదటి నుంచీ ఉందా? లేక అబ్బాయి వాళ్లంటే తమకంటే అధికులు. ఏమైనా చేస్తారు. అనే భయమో. ఇద‌మిత్థంగా చెప్పలేను.

“ఏం చేస్తారే వాళ్లు మాత్రం? వాళ్లు పోయాక నువ్వు ఒంటరిదానివవుతావేమో అన్న భయం వెంటాడుతున్నదేమో!” ప్రాజెక్ట్‌ కాపీస్‌కు ప్రింట్‌ఔట్‌ ఆప్షన్‌ నొక్కుతూ అంది వైష్ణవి ఓసారి.

“స్రవంతీ, తల్లి వేరైనా తమ్ముడూ, చెల్లీ కాకుండా పోతారా? వాళ్ళకు దగ్గరైతే ధైర్యంగా ఉంటావని ఆలోచిస్తున్నారేమో. ఇటుచూస్తే పెళ్లీ వద్దంటున్నావాయె” దూరదృష్టి ఎక్కువగా ఉన్న విజయ అంది. ప్రాక్టికల్‌గా చెప్తుంది ఏదైనా. అందుకే సెన్సిటివ్‌ ఇష్యూస్‌ ఇద్దరమూ ఎక్కువగా డిస్కస్‌ చేసుకుంటుంటాం.

“నాకేమీ వాళ్ళతో కలిసి పోవాలని లేదు. తోబుట్టువుల్లా మీరంతా ఉండగా నాకేమి లోటు?” అంటే నవ్వేస్తుంది.

“తననుతాను బేరం పెట్టుకుని పాతిక ఎకరాల భూమిని అప్పనంగా తీసుకుని కూడా అదనపు కట్నం కావాలని అమ్మను వేపుకు తిన్న మనిషి. ఇచ్చిన పొలంలో ఒక బండరాయి వస్తే దానిని ఇష్టమైతే తీసేయించుకోవడమో, లేకపోతే అంతవరకు వదిలేసో వ్యవసాయం చేసుకుంటారు రైతులు. కానీ, ఈ ఆశపోతు ఆ బండరాయి ఉన్నమేరకు కనీసం బస్తాడు ఒడ్లు నష్టపోయినట్లుగా తాతయ్య దగ్గర వసూలు చేశాడట. బండరాయి ఉన్న పొలం ఇచ్చారని అమ్మను వెళ్ళగొట్టాడు‌. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక అమ్మ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్లిపోయేది. ఎంత గాయపడి ఉంటుంది ఆ పసి హృదయం. అవన్నీ భరించలేకే పురుగుల మందుకు బలి అయిందేమో? అటువంటి వ్యక్తి రాక్షసుడికి ఏమైనా తక్కువా? బంధువుల ఇళ్లకు పెళ్లికో, గృహ ప్రవేశానికో వెళ్లినప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. నాకు అతడి ముఖం చూస్తేనే గగుర్పాటు. తోటి మనిషిని అంతగా వేధించే మనిషి మరొకరితో నవ్వుతూ ఎలా ఉండగలడు అతడిలో ఏనాడైనా పశ్చాత్తాపం కనిపించిందేమో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది చాలాసార్లు. తెలుసుకోవడానికి అదేమైనా గాంధీజీ బయోగ్రఫీనా? అని కూడా అనిపిస్తుంది. అందుకే ఇగ్నోర్‌ ఈస్‌ మై మెడిసిన్‌.

ఇటువంటివారినెవరినీ ఎప్పటికీ క్షమించలేను. “స్త్రీత్వానికి కళంకం” అంటారేమో నన్ను. అయినా సరే. ఒకరిని బాధపెట్టే ఏ ఒక్కరినీ క్షమించనుగాక క్షమించను” ఆవేశంగా చెప్పుకుంటూ పోయాను. అంతా నిశ్శబ్దం. ప్రతి ఒక్కరి ముఖంలోనూ బాధ. ఎర్రబడిన నా ముఖాన్ని అలాగే చూస్తుండిపోయారు వాళ్ళు.

“తోబుట్టువులం గనుకే నీకు పెళ్ళి అయితే ఇలా బాస్‌ల బెదిరింపులు ఉండవని చెప్తున్నాం” తేరుకుని, వాతావరణాన్ని తేలిక చేసేందుకు పెదవులపై పెన్సిల్‌ను ఆడిస్తూ అంది విశాల.

తనకూ తెలుసు. అమ్మ పూరించాల్సిన ఖాళీని నేను ఆక్రమించాల్సి ఉందని. అమ్మమ్మా తాతయ్యను సిటీకే తీసుకురావాలని అనుకుంటున్నానని. అందుకోసం వీకెండ్స్ లో ఇళ్ళను వెతుకుతున్నాం కూడా.

“సరేలేవే! తెలియనిది కాదుగా. నువ్వే ఓ కంపెనీ స్టార్ట్ చేయాలి. 33శాతం అబ్బాయిలకు, మిగిలిన జాబ్స్ అమ్మాయిలకు ఇవ్వాలి” దండకంలా చదవడం మొదలుపెట్టింది విశాల.

“అమ్మమ్మా తాతయ్యను ఊరి నుంచి సిటీకి షిఫ్ట్ అవడానికి ఒప్పించాలి. వాళ్ళతో పాటు నిన్నూ ఇష్టపడిన వాడినే నువ్వు పెళ్ళాడతావు. లేకపోతే ఒంటరిగానే సొసైటీకి మంచి చేసే పని స్టార్ట్ చేస్తావు” నవ్వుతూ కంటిన్యూ చేసింది విజయ. దగ్గరగా వచ్చి హత్తుకుంది.

కళ్ళ వెంట నీళ్ళు పొంగుకొచ్చాయి. ఏదో తెలిసినట్లుగా చదువుకుంటూ వచ్చాను తప్పితే గైడ్ చేసిన వారెవరూ లేరు. ఎప్పుడూ ఒంటరినే అనే భావన వెంటాడుతుంటుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వీళ్ళ ప్రేమను జీవితాంతం పదిలపరుచుకోవాలని అనిపించింది ఆ క్షణం.

“ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడేందుకు అదిరిపోయే ఐడియా కావాలి” అంది మమత.

ఆ డెడ్లైన్ ఈలోకంలోకి తెచ్చి పడేసింది.

“నీ నుంచి ఏమీ ఆశించకుండా ప్రాజెక్టు ఎలా అప్పగించగలను?” కంపరంగా ఉన్న అతడి మెసేజ్ ఫోన్లో మరోసారి చదివాను.

“ఆశించడం” అనే మాటకు అర్థం తెలిసినా మరికాస్త వివరణ లేకపోతే తను చెప్పినదానికీ, నేను అనుకున్నదానికీ పొంతన లేకుండా పోయే అవకాశం ఉంది. అందుకని స్పష్టంగా అడిగాను ఓసారి.

“తెలియనట్లు మాట్లాడకు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ నిన్ను చూసాకే అసలు ప్రేమేంటో అర్థమవుతోంది” అన్నాడు.

కొత్త అయినా మమతతోనే షేర్‌ చేసుకున్నాను అప్పుడు. అతడి కాపీ పేస్ట్‌ డైలాగ్స్‌ ఇంకొన్ని చెప్పి, ఆఫీసులో అందరికీ తెలుసు అతడి నిర్వాకం అని నవ్వింది. తోచినట్లుగా బుద్ధిచెప్పమని, ఆఫీస్‌ అంతా సపోర్ట్‌గా ఉంటుందని అభయమిచ్చింది.

ఆ తరువాతే అతడి చాట్ సేవ్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు వీకెండ్ నా డెడ్ లైన్ అయిన మెసేజ్ తో సహా సేవ్ అయి ఉన్నాయి నా మొబైల్‌లో. ఈ మెయిల్‌లో. సిస్టమ్ లోని వర్డ్ ఫైల్‌లో.

బెరుకు బెరుకుగా ఉద్యోగాల్లోకి వచ్చే ఆడపిల్లలను ఇంతగా బెదిరించి లొంగదీసుకోవాలనుకునేవాళ్ళను ఎందుకు క్షమించాలి? నేను కాకుండా ఏ బెదురుగొడ్డో అయివుంటే?

ఉద్యోగం కావాలి అనుకుంటే లొంగిపోవటమో, లేదా అసలు బయటకు రావడమే తప్పయిందని భావించి ఇంట్లోనే ఉండిపోవటమో చేయాల్సిందేనా? అన్యాయం కదూ?

ఆరోజు శుక్రవారం. ఉదయం లేవగానే అతడి నుంచి వచ్చిన మెసేజ్ తో గుండెల్లో రాయిపడినట్లైంది.

“గుర్తుందిగా! రెండు రోజుల కోసం బ్యాగ్ రెడీగా పెట్టుకో!”

వారం రోజుల నుంచి మనసు మనసులో లేదు. తిండి సరిగా లేదు. నిద్ర సరిగా లేదు. ఇంటికి ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. వాళ్ళు చేసినా లిఫ్ట్ చేయలేదు.

ఏదో ఒక నిర్ణయం తీసుకునే రోజు వచ్చేసిందన్నమాట అనుకుంటూ ఎటూ తేల్చుకోకుండానే ఆఫీసులోకి అడుగు పెట్టాను. మొద్దుబారి పోయింది మెదడు.

ఎవరి క్యాబిన్లలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. నా క్యాబిన్లోకి అడుగుపెట్టాను.

రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేయడం మొదలుపెట్టాను. అరగంటలో పూర్తయింది. ఆ తరువాత అతడి మెసేజెస్ ఉన్న వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి మెసేజెస్ ఎలా మొదలు పెట్టాడో, ఇప్పుడు ఏ స్టేజ్‌కు వచ్చాడో అన్నీ ఒక్కొక్కటీ చదవడం మొదలు పెట్టాను.

ఆ తరువాత A4 సైజు పేజెస్‌లో అన్నింటినీ ప్రింటవుట్ తీసుకున్నాను. వెంటనే బాయ్‌ను పిలిచి వాటిని నోటీస్ బోర్డు నిండా పెట్టించాను. అటువంటిదే మరో సెట్, నా రెసిగ్నేషన్ లెటర్ చైర్మన్‌కు పంపించాను.

లంచ్ అవర్‌లో అంతా ఇదే చర్చ.

ఇదివరకే అటువంటి కంప్లైంట్స్‌ వినీవినీ ఉన్న చైర్మన్‌ గారికి విషయం అర్ధమైంది. నా రెసిగ్నేషన్ క్యాన్సిల్.‌ అతడు డిస్‌మిస్‌. ఆరోజు విమెన్‌ ఎంప్లాయీస్‌ అంతా ఎంతగానో సంతోషపడ్డారు.

ఇప్పుడు అతడు మా ఆఫీస్‌లో లేడు. అయినా అతడిని క్షమించలేకపోతున్నాను. అసలు ఇది క్షమ ఎలా అవుతుంది? ఆ సమయానికి తోచిన పరిష్కారం మాత్రమే.


“రాను రానూ పురుషద్వేషివి అయిపోతున్నావే!” అంది విజయ.

“ఎవరైనా తమకు ఎదురైన అనుభవాలనుంచీ, చుట్టూ ఉన్నవారిని చూస్తూనే కదే అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు?” అన్నాను.

మళ్ళీ నేనే “పురుషులందరినీ ఎందుకు ద్వేషిస్తాను? మా తాతయ్యలాంటి వారు లేనిదే ఇంతటి ప్రపంచం ఉంటుందా? ఇంకా నాకు తారసపడలేదంతే!” అని క్లియర్ గా చెప్పేసాను.

ఈ మాట చెప్పగానే మనసారా నవ్వేసింది.

రచయిత పరిచయం

నస్రీన్ ఖాన్

నస్రీన్ ఖాన్

నస్రీన్ ఖాన్ గారు వృత్తిరీత్యా పాత్రికేయులు. నివాసం హైదరాబాదు. “తెలంగాణ సాహితి” అనే సంస్థలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నారు. అందులో భాగంగా కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు లాంటి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. “ౙఖ్మీ” పేరిట కవితా సంపుటి వెలువరించారు. త్వరలో “దాస్తాన్” అనే కథల సంపుటి ప్రచురించబోతున్నారు. వీరికి సామాజిక అధ్యయనం ఇష్టమైన వ్యాసంగం.

7 Responses to “హద్దులకు ఆవల”

  1. Amjad

    This type of environment in offices very common now a days. Nasreen high lighted this situation.
    Appreciated ending
    Congrats .

    Reply
  2. Jwalitha

    కథ చాలా బాగుంది.. బాధితులకు భరోసా ఇస్తున్నట్టుగా..

    Reply
  3. Dr. zareenaBegum

    కథ చాలా బాగుంది, ప్రస్తుత పరిస్తులకు అద్దం పట్టే నట్లు, పెళ్ళి కాని అమ్మాయి లనే కాదు widow’s ni kuda ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు, సమాజం లొ. ఇలాంటి సమస్య లు ఎప్పటి కప్పుడు friends group లో చర్చిస్తూ అందరికీ తెలిసే లా చేస్తెప్రొబ్లం కొనసాగ కుండా తొందరా గా solve చేయ బడుతుంి. నస్రీన్ కథకు మంచి ముగింపు ను ఇచ్చారు.

    Reply
  4. బి.నర్సన్

    మంచి కథ. నడిపిన తీరు బాగుంది. నిజంగా బాధితురాలి చెప్పుకొచ్చినట్లు సహజంగా సాగింది.

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.