వేస్ట్ బాడీ
నేనొక పెద్ద వేస్ట్ బాడీ. నావల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదు. చివరికి నాక్కూడా!
నా వ్యక్తిత్వంతోగానీ అస్తిత్వంతోగానీ విలువలతోగానీ ఎవ్వరికీ ఏమాత్రం పనిలేదు. నాకంటూ కొన్ని అభిప్రాయాలూ మనోభావాలూ ఉంటాయనికూడా ఎప్పుడూ ఎవరికీ అనిపించినట్టులేదు. అయినా నాలాంటి వేస్టుబాడీగాళ్ళకి మనోభావాలూ ఆత్మాభిమానాలూ కూడానా?
గానుగెద్దులకి ఆడిస్తున్నది నువ్వుల నూనా? కొబ్బరి నూనా? ఆముదమా? అనే ప్రశ్నలతో పనిలేదు. గాడిలో పడి తిరగడమే. గుడుగుడు గుంచం “గుండే”రాగం. ఆ గుండెల్లోని మనసుని చంపుకుని మరీ వాళ్ళగాడిలో పడి తిరిగీ తిరిగీ నన్ను నేను మర్చిపోయేంతగా సంపాదించాను. అయినా సరే, ఎవరికీ తృప్తి లేదు. అది లేనివాళ్ళకి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించేవాడెవడైనా సరే, నాలాగానే పెద్ద వేస్టుబాడీ!
అయినా, ఎవరు ఎంత సంపాదించినా మిగిలేదేముంటుంది గనక?
డబ్బుల్లెక్కెట్టడానికి నోట్లు, చదువుల్లెక్కెట్టడానికి సర్టిఫికెట్లు, ఆస్తుల్లెక్కెట్టడానికి డాక్యుమెంట్లు, అన్నీ కాయితం ముక్కలే, నానేసి రుబ్బేస్తే చేటలలకీ బుట్టలకీ మెత్తుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు. అయినా మెత్తడానికి ఇప్పుడు వెదురుబుట్టలూ చేటలూ ఎక్కడున్నాయిగనక? అవికూడా మనలాగే వేస్టుబాడీలు! అయినాసరే ఆ కాయితం ముక్కలకున్న విలువ మనలో ఉండే మనిషిగాడిగ్గానీ వాడి మనిషితనానిగ్గానీ ఉండదు.
లక్ష్మీ కటాక్షం కోసం అర్రులు చాచే వెర్రులారా, తెర్రమొహాల కొర్రులారా, ఎప్పుడైనా అష్టలక్ష్మీ స్తోత్రం చదివారా?
బతుక్కి శ్రీకారం చుట్టడానికి ఆది లక్ష్మి, బతుకుబండిని ఈడ్వడానికి ధాన్యలక్ష్మి, ఆ బండిని నడిపే ఇంధనంగా ధైర్యలక్ష్మి, ఆవేశంతో దూకుడుగా కాకుండా ఆలోచనతో స్పష్టంగా నిదానంగా ముందడుగు వెయ్యమని చెప్పే గజలక్ష్మి,నీలోని మంచిని ముందుతరాలకి అందించమనే సంతానలక్ష్మి, అందరూ కలిసికట్టుగా ఉంటే గెలుపు మీదేనని చెప్పే విజయలక్ష్మి, వీటన్నిటినీ పొందడానికి అర్హతనిచ్చే విద్యాలక్ష్మి. ఈ ఏడుగురు అక్కగార్లనీ సంతృప్తి పరిస్తేగానీ నేను మీ దరికి రానని ధనలక్ష్మి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. విన్నారా? “ఈ ఏడు కొండలెక్కి వస్తేగానీ నాకా శ్రీదేవి లభించలేదురా అబ్బాయ్”అని తెలుగువారి ఇలవేలుపు కలియుగ వైకుంఠాన్నించీ సంపదల మూల తత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే ఉన్నాడు. విన్నారా? అయినా ఇయర్ ఫోన్స్ దూరిన చెవుల్లోకి సత్యాలెలా దూరతాయి? దూరనివాటికెప్పుడూ దూరంగానే ఉండాలంటారా? వెరీ గుడ్!!! వెంటనే కెరీర్ గైడెన్స్ సెంటర్ స్టార్ట్ చెయ్యండి. అదే మీకు తగిన కెరీరవుతుంది. ఊహూ! అలా కుదర్దు, మేం మీలాంటివాళ్ళ నొసళ్ళపై వేస్ట్ బాడీలనే ముద్రలు కొట్టి లోపాముద్రలమైపోతామంటారా? నన్ను మళ్ళీ మళ్ళీ వేస్టు బాడీ అనే అంటారా? మీ నోరు మీ ఇష్టం. గుర్రాలు సకిలిస్తాయి-కోతులు ఇకిలిస్తాయి- గాడిదలు ఓండ్రపెడతాయి. పెట్టండి పెట్టండి. “సత్యాన్ని చూసి ఎన్నిరకాల ఓండ్రలు పెడతారో పెట్టుకోండి”అంటూ ఈ చెవుల్తో విని ఆ చెవుల్తో వదిలెయ్యడానికి మధ్యలో మెదడు అడ్డం పడుతోంది. వాట్టూడూ?
వేస్టుబాడీ, వేస్టుబాడీ, వేస్టుబాడీ. మోసినంతకాలం మోశాను. ఇంకా మొయ్యడం నావల్ల కాదు. ఈ జంక్ ని డస్ట్ బిన్లో పడెయ్యాలా? రీసైకిల్ బిన్లో పడెయ్యాలా? సైక్లింగ్ మనకి ఆరోగ్యం, రీసైక్లింగ్ ఆస్పత్రులకి ఆరోగ్యం.
పనీపాటూ లేకుండా కూర్చుని రాస్తుంటే ఇన్నిరకాల ఆలోచనలూ అనుమానాలూ అనవసర ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయిగానీ ఆ సమయంలో నా మెదడు ఏమాత్రం పని చెయ్యలేదు.
ఎందుకంటే,”ఆయనో పెద్ద వేస్టుబాడీ” అనే మాట చెవిన పడగానే ఆలోచనలన్నీ చచ్చిపోయాయి. ఆ చావు కళల్లోంచీ పుట్టిందొక్కటే! ఆవేశం! అదుపుకానంత ఆవేశం! ఆ ఆవేశంతోనే ఈ వేస్టుబాడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ తిన్నగా రోడ్డుమీదకి వచ్చాను.
కంటికి కనిపించిన కారు కింద పడ్డానికి ప్రయత్నించే లోపే దాని డ్రైవర్ సడెన్ బ్రేకేశాడు.
అడ్డంపడ్డవాణ్ణి గుద్దేసిపోయే ధైర్యం లేదుగానీ ఆ డ్రై-వరుడి నోటి దురదకేం తక్కువలేదు. అందుకే, “చావడానికి నా కారే దొరికిందంట్రా నీయమ్మ!” అంటూ మొదలుపెట్టి నోటికొచ్చిన బండబూతులన్నీ తిట్టేసి పోయాడు. “ఈ బూతులకంటే వేస్ట్ బాడీగా సెటిలైపోవడమే బెటర్” అనుకుంటూ వాడినీ వాడి తిట్లనీ గాలికొదిలేసి రోడ్డు వారగా నడవటం మొదలెట్టాను.
అయినాసరే, ఆ డ్రైవరుగాడి బూతులింకా చెవుల్లో గింగిర్లెత్తుతూనే ఉన్నాయి. అందుకే “థూ, దిక్కుమాలిన ప్రజాస్వామ్యం. కోరుకున్న కారుకింద పడి చచ్చే స్వాతంత్ర్యం కూడా లేదు” అని తిట్టుకుంటూ పోతుంటే ఓ సిగరెట్టంగడి కనిపించింది. తిన్నగా వెళ్ళి సిగరెట్ తీసుకుని వెలిగించి పొగేసుకుంటుంటే ఎదురుగా వస్తూ కనిపించిందో ఆర్టీసీ బస్సు. ఎవరో ప్రయాణీకుడు బస్సెక్కడానికి చెయ్యడ్డం పెట్టాడు. ఆ ప్రయాణీకుడిని దయతలచి బస్సాపాడు డ్రైవర్. అది ఆగీఆగ్గానే ఏదోవిధంగా ఈ వేస్టుబాడీని వదిలించుకోవాలనే కోరిక పదింతలైంది. అప్పటికే కదుల్తోంది బస్సు. అందుకే పరిగెత్తుక్కుంటూ వెళ్ళి దాని వెనుకనున్న నిచ్చెన పట్టుకుని పైకెక్కేశాను.
ఇంత జరుగుతున్నా సిగరెట్టు మాత్రం వేళ్ళ మధ్యనించీ జారిపోలేదు. అందుకే దాని నిప్పు నా వేళ్ళ కొసలకి తగిలేంతవరకూ పొగంతా కసికసిగా పీల్చి పారేశాను. తరవాత దాన్ని విసిరికొట్టాను. ఈ వేస్టుబాడీని కూడా ఆ సిగరెట్టుపీకలాగే విసిరి పారెయ్యాలి. అందుకే కిందకి దూకేద్దామనుకున్నాను. దూకడానికి కౌంట్ డౌన్ మొదలెట్టగానే కొత్త అనుమానం పుట్టింది. స్లోగా వెళ్తున్న బస్సుమీంచీ దూకితే మనిషి చావడం మాటెలా ఉన్నా కాళ్ళూ చేతులూ మాత్రం తప్పకుండా విరుగుతాయి. దాంతో నిజంగానే వేస్ట్ బాడీగా మారి జీవితాంతం మంచం మీద తీసుకుంటూ తీసుకుంటూ చచ్చేంతవరకూ చచ్చినట్టు బతకాల్సొస్తుంది. దానికంటే కాళ్ళూ చేతుల్తో చావుబతుకుని లాగించెయ్యడమే బెటర్.
చూస్తూండగానే బస్సు ఊరు దాటింది. స్పీడందుకుంది.
తూర్పునించీ చీకట్లు కమ్ముకొస్తున్నాయి. రెండుమూడు లారీలూ నాలుగైదు కార్లూ బస్సుని తరుముకొస్తున్నాయి. ఇప్పుడుగనక దూకేస్తే బస్సుమీంచి కిందపడిన వెంటనే చచ్చినా చావకపోయినా వెనక్కాలొస్తున్న లారీలో కార్లో పచ్చడిచేసిపారేస్తాయి. కాబట్టీ సక్సెస్ ఫుల్ గా చావచ్చు. అందుకే ప్రిపరేషన్లూ కౌంట్ డౌన్లూ లాంటి ఫార్మాలిటీసేం పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని ఎగ్గిరి దూకేశాను. ఆ పడ్డం పడ్డం మామూలుగా పడలేదు.
హమ్మయ్య, ఓ పనైపోయింది!
తరవాత ఏం జరిగిందో ఎంత సమయం గడిచిందో తెలియదు. నా ప్రాణాలు ఉన్నాయో పోయాయో తెలియదు. పోతే అవి నరకానికి పోతున్నాయో స్వర్గానికి పోతున్నాయో లేక అసంతృప్త ప్రేతాత్మలా మారి త్రిశంకుస్వర్గాన్ని పట్టుకు వేళ్ళాడుతున్నాయో అస్సలు తెలియదు. కానీ కళ్ళు మిరుమిట్లుగొలిపే మెరుపులు. ఆ మెరుపుల మధ్యలో విస్ఫోటనం చెందుతున్న నక్షత్రాలు. ఆ విస్ఫోటనాల్లో ముక్కలు చెక్కలౌతున్న అస్తిత్వాలు. ఆ అస్తిత్వాల్నింతకాలం నిలబెట్టిన ఆస్తిత్వాలు. ఆ ఆస్తిత్వాల బంధనాలన్నీ పటపటా తెగిపోతున్నాయి. ఆ తెగుళ్ళలోంచీ వేగంగా వాయువేగ మనోవేగాల్ని అధిగమించి కాంతిసంవత్సరాల్ని దాటుకుంటూ అనంతంలోకి ఎగిరిపోతున్నాను. ఆ అనంత ధీరగంభీర నీలవర్ణంలోంచీ నీలాంజనాల్లోకి, ఎగిరిపోతున్నాను. ఓ నా రైట్ బ్రదర్సూ, ఆకాశంలో ఎగరడానికి విమానమే అక్కర్లేదు. మనం అద్దెకొచ్చిన ఈ దేహం అనే మానంలేని విమానం ఎక్కితే చాలు. ఎప్పుడో ఒకప్పుడు ఎగిరిపోక తప్పదు. ఈమాత్రానికి విమానమే కనిపెట్టాలా?
మీదికొచ్చి పడుతున్న మెరుపుల గోళాల గందరగోళంలోంచే వాయుదేవుడు ఈలలు వేస్తూ పిలవడం మొదలుపెట్టాడు చూస్తూండగానే. మలయమారుతం కాస్తా ప్రళయమారుతంలా మారి చెవుల్ని దిబ్బెళ్ళేయించేస్తోంది. అంతలోనే నా నాకళ్ళు క్రమంగా కొత్త లోకాల్లోకి తెరుచుకోవడం మొదలుపెట్టాయి.
అవిగో చుక్కలు. ఆ చుక్కల్ని మూసేస్తూ మబ్బులు. ఆ మబ్బుల్లోంచీ అక్కడొకటీ ఇక్కడొకటీ పడుతున్న చినుకులు. వాటిమధ్యలోంచీ వేగంగా వెళ్ళిపోతున్నాను. పైకి, పైపైకి, ఇంకా పైకి, నేను పైకి వెళ్ళిపోతుంటే కల్పవృక్షాల కొమ్మలు కిందకి జారిపోతున్నాయి. వాటిని చూస్తుంటే కొత్త అనుమానం పుట్టింది. ఇంతకీ నేను దూసుకుపోతున్నది పైకా? కిందకా? వెనక్కా? ముందుకా?
అదేమిటి ఏదో బ్రిడ్జిలా ఉంది? ఇదేమిటి ఫ్లై ఓవర్లా ఉంది? అవేమిటి? బిల్డింగ్స్లా ఉన్నాయి?
కళ్ళు నులుముకుని చూస్తే నా పరిస్థితేమిటో అర్థమైంది. నేను వాహనాల కింద పడి చావలేదనుకుంటాను. అందుకే ఏ బస్సుమీంచీ దూకానో, ఆ బస్సుమీదే పడి ఉన్నాననుకుంటాను. అయినా ఫుల్ కండిషన్లో ఉన్న బస్సుకి నా మెంటల్ కండిషన్‌తో ఏం పని? అందుకే అది ముందుకు పరిగెడుతుంటే అన్నీ వెనక్కి పారిపోతున్నాయి. ప్రేమా పేరూ డబ్బులవెంట పరిగెత్తే నా శ్రీమతీ కొడుకూ కూతుళ్ళలాగే బస్సుకూడా రోడ్డుని తరుముకుంటూ పరుగెడుతోంది. అంటే ఈ బస్సు సాక్షిగా నా వేస్టుబాడీకి ఏ యాక్సిడెంటూ జరగలేదన్నమాట.
థూ, ది వరస్ట్ మోస్ట్ వేస్ట్ బాడీ ఆఫ్ ది వరల్డ్!
అయినా నేను కిందకి దూకితే వెల్లకిలా వెనక్కెందుకు పడ్డానంటారు?
ఏముందీ, బస్సుకి ఏ గాడిదో దున్నపోతో అడ్డం పడుంటుంది. దాన్ని రక్షించడానికి డ్రైవర్ ఏ సడెన్ బ్రేకో వేసుంటాడు. నా కర్మకాలి అదే సమయానికి నేను దూకుంటాను. స్పీడుగా ముందుకెళ్తున్న బండిమీంచీ ముందుకి దూకినా వెనక్కి దూకినా వెనక్కే పడతారు. దటీజ్ ది పవరాఫ్ బ్రేక్స్!
దీన్నిబట్టి ఏం అర్థమైంది? యాక్సిడెంటవ్వాలంటే వన్ వేలో వెళ్ళకూడదు. అంటే నేను మాత్రమే ఈ వేస్టుబాడీని వదిలించుకోవాలనుకుంటే సరిపోదు! అదికూడా నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటే తప్ప నాకు విముక్తి కలగదన్నమాట!
మెల్లగా లేవడానికి ప్రయత్నించాను. నడుము కాస్త నొప్పనిపించింది. లేచి చూస్తే మోకాలి మీద రక్తం గడ్డ కట్టి కనిపించింది. అంటే నేను పడి చాలాసేపైందన్నమాట.
బస్సు ముందుకు పరుగెడుతూనే ఉంది. చల్లటిగాలి చెవుల్లో దూరి వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉంది. ఆ వణుకునించీ తప్పించుకోవడానికి మోకాలి దెబ్బ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. వెంటనే గడ్డ కట్టిన రక్తం గుర్తొచ్చింది. మనసులోని బాధక్కూడా అలా గడ్డ కట్టేస్వభావం ఉంటే ఎంతబాగుండేది? దాంతోబాటు ఆలోచనలకీ జ్ఞాపకాలకీ కూడా రక్తంలాగే ఘనీభవించే గుణం ఉంటే ఎంత బాగుండేది? బాధలోంచీ బాధబాధగానే అయినా బాధాగ్రస్తం కాకుండా బాధని బాధతో బాపుకుంటూ మనసుని చుట్టుముడుతున్న ఆవేదనల్ని గాలికొదిలేస్తూంటే, ఆ గాలి మళ్ళీ గుండెల్లో దూరి బాధాతప్తమైన గాయాల్ని పదే పదే కెలుకుతూంటే, వేస్టు బాడీ వేస్టుబాడీ అని పదే పదే నన్ను నేనే తిట్టుకుంటూండగానే ఎప్పుడో నిద్రపట్టేసింది.
ఉన్నట్టుండి స్పర్శవాణి పిలవడంతో మెలకువొచ్చింది.
మతిలేని ఫోను “మీ శ్రీమతి పిలుస్తోంది పలకరా వేస్ట్ బాడీ” అంటోంది. ఆవిడ నోరు నొక్కేంత ధైర్యం ఎలాగూ లేదు. అందుకే, “నాలాంటి వేస్ట్ బాడీతో నీకేం పని?” అనుకుంటూ సెల్లు గొంతు నొక్కాను. వెంటనే ఊరుకుంటే అది కరవాణి ఎందుకౌతుంది? కాల్ చేసింది నా గుదిబండ ఎందుకౌతుంది? అందుకే అది మళ్ళీ మోగింది. మళ్ళీ గొంతునొక్కాను. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. మళ్ళీమళ్ళీ గొంతు నొక్కుతూనే ఉన్నాను. భలే బాగుందీ ఆట. ఆవిడ కాళ్ళమీద కాళ్ళు చేస్తోంది. నేను కట్లమీద కట్లు చేస్తున్నాను. ఈ ఆట పేరు “కాలూ-కట్టూ”అని పెడితే తెలుగులోనూ ఇంగ్లీషులోనూ కూడా చెలామణీ అయిపోతుంది. భలే భలే! ఒకేదెబ్బకి రెండు పిట్టలు. ఏక్ మార్ దో టుక్డా!
అంతలోనే బస్సాగింది. ఇప్పుడు సెల్లు రింగైతే నేను టిక్కెట్టు లేకుండా బస్సెక్కిన సంగతి బైట పడుతుంది. అందుకే స్విచ్చాఫ్ చేశాను. బస్సుమీంచి దిగబోతూండగా కొత్త అనుమానం వచ్చింది. ఈ బస్సు ఏవూరొచ్చిందో కూడా తెలీదు. జేబులో పైసా లేదు. ఉన్న చిల్లర కాస్తా సిగరెట్టుకే సరిపోయింది. ఖాళీ జేబుల్తో దిగడం కంటే అక్కడే మూడంకె వెయ్యడం మంచిదనిపించి కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాను.
ఏసీ లేదు. అదిచ్చే చలి లేదు. ఆ చలినించీ కాపాడే రగ్గులేదు. ఆ రగ్గు తొలగినప్పుడు వచ్చే దగ్గులేదు. అయినా సరే అవన్నీ ఉన్నప్పటికంటే గాఢంగా నిద్రపట్టేసింది. బారెడు పొద్దెక్కి సూరిబాబు కంట్లోకి వదిలే బాణాలు విటమిన్ డీతో ఢీకొట్టేవరకూ మెలకువ రాలేదు. మెల్లగా ఎవరూ చూడకుండా బస్సు దిగి బైటకి నడిచాను.
ఎంతదూరం నడిచానో తెలీదు. ఎక్కడినుండో సముద్రం హోరు వినిపిస్తోంది.
కాళ్ళు అలో లక్ష్మణా అంటూ ఈ వేస్టుబాడీని మోసుకెళ్ళి సముద్రం ఒడ్డున కుదేశాయి. దాన్ని చూడగానే స్నానం చెయ్యాలనిపించింది. ప్యాంటు షర్టు విప్పేసి కేవలం డ్రాయర్తో వెళ్ళి సముద్రంలో పడ్డాను. స్నానం చేస్తూ చేస్తూ ఒడ్డుకి చూస్తే ఎవరో నన్నుమించిన పెద్ద వేస్టుబాడీగాడు నా ప్యాంటూషర్టుల్ని ఎత్తుకుపోతూ కనిపించాడు. నేను సముద్రంలోంచే అతని వెంట పడ్డాను. కానీ కెరటాల్నీ చెలియలి కట్టనీ దాటేలోపే వాడు కంటికి కనిపించనంత దూరం పారిపోయాడు. పాపం ఆ పరుగెత్తే హడావిడిలో నా ప్యాంటు జేబులోంచీ సెల్లు జారిపోవడం గమనించినట్టు లేడు.
బట్టలు పోయాయిగానీ సెల్లుమాత్రం పోలేదు. దాన్నిచేతిలో పట్టుకుని అన్యమనస్కంగా కూలబడ్డచోటే కూర్చుండిపోయాను. కాసేపటి తరవాత చూస్తే నాకు తెలియకుండానే నా వేళ్ళు నెట్లో సెర్చ్ చేస్తున్నాయి. నా ప్రమేయం లేకుండానే దేన్నో వెతుక్కుంటూ ముందుకుపోతున్నాయి. ఉన్నట్టుండి నా వేస్టుబాడీకో అద్భుత గమ్యం కనపడింది. ఆ గమ్యం చెప్పినట్టల్లా చేసుకుంటూ పోతున్నాను. మీవాళ్ళందరికీ ఓకేనా? అని అడిగింది. వాళ్ళకి ఓకే అయితే ఈ బాధలెందుకు నాకు? అయినాసరే “ఓకే”అని ఓ అబద్ధం కొట్టాను. వాళ్ళనించీ అనుమతి పత్రాలు సబ్మిట్ చెయ్యమంది. దాంతో “నాకూ మా వాళ్ళకీ ఎటువంటి సంబంధబాంధవ్యాలూ లేవు. కనుక నేను ప్రస్తుతం ఒంటరి అనాథని. కాబట్టీ ‘నా నిర్ణయమే అంతిమ నిర్ధారణ’ అని కొట్టాను. ఆ సెల్లుకి కన్ఫ్యూజన్తో ఫ్యూజులు ఔటైనట్టున్నాయి. అందుకే “మీ అభ్యర్థన విజయవంతమైనది”అని తెలియజేస్తూ నన్ను అభినందించింది. దాంతో నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఎందుకంటే,
నేనిప్పుడు వేస్టుబాడీని కాదు. కాబట్టీ నా గురించి ఎవరేమనుకుంటే నాకేమిటి? అందుకే ధైర్యంగా డ్రాయర్ తోనే బైటకొచ్చాను. డ్రాయర్ తోనే సెల్లు తాకట్టుపెట్టాను. డ్రాయర్‌తోనే బస్సు ప్రయాణం చేశాను. డ్రాయర్‌తోనే ఇల్లు చేరాను. చివరికి ఆ డ్రాయర్ని బాగా ఉతికి ఎండేసి ఇస్త్రీ చేసి డ్రాయర్లో పెట్టి తాళం వేశాను.
అప్పటినుండీ అందర్తోనూ అంటీముట్టనట్టుగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఎవరేమన్నా పట్టించుకోవడం మానేశాను. భార్య, కొడుకు, కూతురు ముగ్గురూ నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. అయినాసరే నేను మాత్రం నా స్థిమితాన్ని ఏమాత్రం కోల్పోవడం లేదు. దాంతో క్రమంగా ముగ్గురూ ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడిపోయారు.
అందుకే, నా జీతం, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బతికెయ్యడం మొదలుపెట్టాను.
నాకు ఏది మంచనిపిస్తే అది చేస్తున్నాను.
నువ్వు ఏది చేస్తే అదే మంచా? అనిమాత్రం అడక్కండి. మంచి, చెడుల్ని మించిన గజిబిజి పదాలు ప్రపంచ భాషల్లో ఉండవు. కాబట్టీ నా రైటే నీ లెఫ్టు, నీ రైటే నా లెఫ్టు. లెఫ్టెప్పుడూ రైట్ తో లెఫ్టైపోతూ ఉంటుంది. లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ చిన్నప్పుడు టెన్సులు బట్టీ పట్టలా?
కాలం గడుస్తున్నకొద్దీ నాకు రిటైర్మెంటొచ్చింది. ముఖం నిండా ముడతలొచ్చాయి. చర్మం ఎముకలకి వేళ్ళాడేసిన చింకిచాపైపోయింది. చివరికి ఎన్నో ఏళ్ళనాడు ఉగాదికి చేసిన మంచిపని ఇప్పుడు ఈ శుభకృతు నామసంవత్సరం శివరాత్రికి శుభకరమై “శివోహం” అంటూ ఫలించింది. అంటే అందర్లాగే నాకూ చావొచ్చిందన్నమాట. ఇంక నలుగురితో “నారాయణ” అనిపించుకోవడమే తరువాయి. అందుకుగాను మావాడు ఢిల్లీనించీ రావాలి. వాడొస్తేగానీ జరగాల్సినవేవీ జరిపించడం కుదరదు. అందుకే తక్షణ కర్తవ్యంగా నన్ను హిమపేటికలో భద్రపరిచారు.
అయినవాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. ఆ హిమపేటికమీద పడీపడీ ఏడుస్తున్నారు. ఈ హిమపేటికలోని సౌకర్యం అదే. ఎవరెంతగా ఏడ్చినా కనపడదు. వినపడదు. కన్నీరు మీద పడదు.
అలా ఎవడి ఏడుపు వాడు ఏడుస్తూండగా ధర్మాసుపత్రివారి రోగుల బుగ్గబండి కూతేసుకుంటూ వచ్చి ఆగింది. అందులోంచీ కొందరు అధికారులు దిగారు.
వాళ్ళు నా శరీరాన్ని వాహనంలో ఎక్కిస్తూండగా మా సుపుత్రుడు ఎదురొచ్చాడు. నాన్నని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగాడు. వాళ్ళు పత్రాలు చూపించారు. వాటిని చూడగానే కిక్కురుమనకుండా పక్కకి తప్పుకున్నాడు.
మావాడు ఇంట్లోకి వెళ్ళగానే, వాళ్ళమ్మని చూసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు, “పున్నామ నరకాన్నించీ తప్పించే అవకాశం కూడా లేకుండా చేశాడు. చివరికి చావులోకూడా తనో పెద్ద వేస్టుబాడీ అని నిరూపించుకున్నాడు” అంటూ బావురుమన్నాడు.
అంతలోనే అటుగా వచ్చిన మా చిన్నతమ్ముడు, “అలా అనకూడదురా అబ్బాయ్. మనకీ అవయవదానం కొత్తేం కాదు. అప్పట్లో గజాసురుడు చర్మదానం చెయ్యకపోతే ఆదిదేవుడైన పరమేశ్వరుడు కట్టుకోవడానికి బట్టెక్కడుండేది చెప్పు? ఆ గజాసురుడు తలదానం చెయ్యడంవల్లేకదా, మనచేత ఆదిపూజలు అందుకోవడానికి విఘ్ననాయకుడు లభించింది? అయినా మరణం తరవాత కూడా జీవించడం ఎలాగో అందరికీ తెలిసేలా చేశాడు మీ నాన్న. అలాంటి నాన్నని అభినందించడం మానేసి ఆడిపోసుకుంటే ఎలా?” అంటూ వాడి భుజం మీద చెయ్యేసి ఊరడించే ప్రయత్నం మొదలుపెట్టాడు.
“అంతేలే బాబాయ్, మైనస్సింటూ మైనస్సీజీక్వల్టూ ప్లస్. నెగెటివ్ థింకింగ్ పీక్స్‌కి వెళ్తే పాజిటివ్ రిజల్ట్” అంటూ పుణ్యం మూటకట్టుకునే అవకాశం తప్పిపోయినందుకు ఇంకా బిగ్గరగా విలపిస్తూనే ఉన్నాడు.
“రేయ్, ఈ ఏడుపంతా తరవాత ఏడవచ్చుగానీ, ముందు పాజిటివ్కీ నెగెటివ్కీ తేడా తెలుసుకోరా” అని నేను అరుస్తూనే ఉన్నాను. ఆ అరుపులు హిమపేటికలో ప్రతి అణువుకీ వినిపిస్తూనే ఉన్నాయి.
One Response to “వేస్ట్ బాడీ”
మూర్తిగారూ, మీ వేస్ట్ బాడీ స్వగతం చదువుతూంటే త్రిపురనేని గోపీచంద్ రచనలు కొన్ని జ్ఞాపకానికి వచ్చాయి. నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు .