వెయిటింగ్ ఫర్ వీసా
అద్దంలో తను. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. నిద్రలేని కళ్ళు. అలసటగా కనిపిస్తున్న ముఖం. అద్దం మీదనుంచి ముఖాన్ని పక్కకు తిప్పుకొని లాప్ టాప్ లోకి తల దూర్చాడు నిర్మల్ కుమార్. మనసు ఎటో పోతోంది. ఎదురుగా ఉన్న అమ్మ ఫొటోకి వేసిన తాజా గులాబీల దండ. ఉదయమే రేణుకా దేవి వచ్చి ఆ ఫోటోకి దండ వేసింది. ఎందుకో ఆ దండను చూడగానే ఏదో భయం. కారణం. ఇష్టమైన గులాబీకి ముళ్ళుంటాయి కదా. భార్య పువ్వుల్ని మాలగా గుచ్చుతోంది. ఇంతలో ఆమె గుచ్చుతున్న సూదిలోంచి దారం ఊడి వచ్చేసింది. తను విశ్వ ప్రయత్నం చేస్తోంది సూదిలో దారం ఎక్కించడానికి. “ఇలా తే” అంటూ ఆ దారాన్ని నోటితో తడిపి, అవలీలగా సూదిలోకి ఎక్కించి, ఆమె చేతికి ఇచ్చేశాడు. ఆ దారాన్ని అలా తడపగానే చాలా సంవత్సరాలు వెనక్కి. అమ్మ తనతో పంచుకున్న పూర్వీకుల జ్ఞాపకం.
అప్పట్లో జౌళీ మిల్లులో పనిచేసేందుకు దళితుల్ని దారం తీసే పనిలో ఉంచేవారు కాదట. ఆ దారాన్ని నోటితో తడి చేయాల్సి వచ్చేది. అందుకు పై కులాల కార్మికులు ఆ దారాల్ని ముట్టుకోవడానికి ఒప్పుకునేవారు కాదు. ఫలితంగా దళిత కులాల వారికి తక్కువ వేతనం లభించే ఇతర పనులు లభించేవి. ఇంతలో తలుపు చప్పుడైంది. ఎవరో బెల్ కొట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తను హిస్టోరియన్ అయిన తరువాత అది మరీ ఎక్కువైంది. భార్య తలుపు తీయడంతో – బాగా పండిన జుట్టు, పచ్చగా ఉన్న మొహం, ఎదురుగా పక్కింట్లోంచి వచ్చిన పెద్దావిడ. ఒక ట్రేలో డిస్పోజిబుల్ ప్లేట్లు, కప్పులతో నిండిన ఆహారం. “ఎందుకండి శ్రమ” భార్య నొచ్చుకొంటూ ఆవిడ వంక చూసింది.
“భలేవారే ఈ టైమ్ లో మీరు పొయ్యి వెలిగించకూడదు. మేము లేమా! మీ అత్తగారు మాకు చేసిన సాయం ఏమైనా తక్కువా!” అంటూ ఆవిడ గడపకు కొంచెం దూరంగా ఉండే చెబుతోంది.
నిర్మల్ కుమార్ కు ఆ దృశ్యం కలవరపెట్టింది. మానవత్వం, మంచితనం, వీటితోపాటు ఆ పెద్దావిడ వదులుకోలేనిది! భార్య ఆవిడ ఇచ్చిన ప్లేటు అందుకుంటూ “థ్యాంక్స్ అమ్మా” అంది.
భార్య తను తెచ్చిన ప్లేటుని టేబుల్ మీద పెట్టి, గోడమీద గడియారం వంక చూస్తూ “మనవాడు ఇంకా రాలేదు” అంది.
“కేసులు ఎక్కువ ఉన్నాయేమో, అయినా వచ్చేసరికి రెండు దాటిపోతుందిలే” అన్నాడు. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. ఈసారి తనే తలుపు తీశాడు. బయట పొట్టిగా, బొద్దుగా ఉన్న ఒక మధ్య వయస్కుడు. బాగా పెరిగిన జుట్టు, గడ్డం.
“నమస్కారం, నా పేరు నారాయణమూర్తి. ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని” అన్నాడు.
తనూ నమస్కారం చేసి “రండి” అన్నాడు.
“ఫరవాలేదు, మీరు ఒక్కసారి బయటకు వస్తారా?” అంటూ మెట్లదగ్గర ఆగిపోయాడు.
“మీతో రెండు నిముషాలు మాట్లాడాలి” అంటూ అపార్టుమెంట్ బయట ఉన్న బాల్కనీ వైపు నడిచాడు.
నిర్మల్ కుమార్ ఆయన్ని అనుకరించాడు. ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అయ్యింది నిర్మల్ కుమార్ కి . స్వచ్ఛమైన గాలి శరీరాన్ని తాకింది. వారం రోజులుగా ఇంట్లోనే బందీ అయిపోయాడు. డిసెంబర్ కావడంతో మధ్యాహ్నం అయినా వాతావరణం చల్లగానే ఉంది.
“సారీ, మీ అమ్మగారు చనిపోయారని నిన్ననే తెలిసింది నాకు” అన్నాడు.
“అవునండీ, సంవత్సర కాలంగా బాధపడుతోంది. గుర్తించేసరికి థర్డ్ స్టేజి. కీమో, రేడియేషన్ పూర్తయ్యింది. ఆరు నెలలుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. వయసు డెబ్భై సంవత్సరాలు దాటింది. వారం క్రితం నిద్రలోనే, ఎప్పుడు జరిగిందో తెలియదు. ఉదయం లేచి చూసేసరికి ప్రశాంతంగా పడుకున్నట్టు కనిపించింది” అలా చెబుతుంటే, నిర్మల్ కుమార్ కళ్ళు తడిసాయి.
“అయ్యో మీ అమ్మగారి గురించి ఈ అపార్ట్ మెంట్ లో చాలా బాగా చెప్పుకుంటారు. ఆవిడ ఘోషా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారంట కదా” అన్నాడు ఆయన.
“అవునండీ, మాకు రెండు బెడ్రూమ్ లు గల సొంతిల్లు ఉంది. నేను వెస్ట్ జెర్మనీలో నా పిహెచ్.డి పూర్తి చేసుకుని రావడం, ఇక మా అబ్బాయి, పి.జి. చదవడం కోసం మా సొంతిల్లు సరిపోకపోవడంతో ఈ గేటెడ్ కమ్యునిటీలో మూడు గదుల బెడ్రూమ్ ఇంటికి వచ్చేశాం, ఆ ఇంటిని అద్దెకు ఇచ్చేసి” అన్నాడు.
“అవును మీరొచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో మీ అమ్మగారు అపార్ట్మెంట్ వారితో పూర్తిగా కలిసిపోయారు. ఎవరికైనా ఆడవారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, డెలివరీ సమయంలోనూ మీ అమ్మగారు ధైర్యం చెప్పేవారు. ఆవిడే అన్నీ దగ్గురుండి చూసుకునేవారట” అన్నాడు ఆయన.
“అవునండీ రిటైర్ అయిపోయినా ఐదేళ్ళపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పనిచేసింది. మా అమ్మకు సర్వీస్ చేయడం ఇష్టం. తను పురుళ్ళు పోయడంలో స్పెషలిస్ట్” అన్నాడు చిన్నగా నవ్వి.
ఆయన ఆ మాటలకు తనూ నవ్వి అపార్ట్మెంట్ కింద వినాయకుడి గుడిలో హారతి ఇస్తున్నవైపు చూసి రెండు చేతులు జోడిరచి, “ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను” అన్నాడు.
“ఏమిటి?” అన్నాడు నిర్మల్ కుమార్ ఆయన వంక తిరిగి.
“మీకు ఒక విషయం తెలుసో తెలియదో ఎవరైనా చనిపోతే ఆరు నెలల పాటు ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఇక మీ అమ్మగారి విషయంలో ఆవిడకు ధనిష్ఠా పంచకం ఉంది”
ఒక్కసారి ఆ మాటలకు తల దిమ్ముగా అయిపోయింది నిర్మల్ కుమార్‌కు. “ఆర్నెల్లు ఖాళీ చేయాలా? అది సాధ్యమా ఇప్పటి రోజుల్లో ఇక ధనిష్ఠా పంచకం ఏమిటి?” అన్నాడు అతనివంక విస్మయంగా చూసి.
వెంటనే అతను “కంగారు పడకండి, పూర్తిగా వినండి. ధనిష్ఠా, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఐదు నక్షత్రాల్లో మరణిస్తే విధిగా ఆర్నెల్లు ఆ ఇల్లు మూసి ఉంచాలి. ఆ ఇంటిని తిపాతి ఇల్లు అంటారు” అన్నాడాయన వివరంగా.
“అయ్యో ఇప్పుడు అర్థాంతరంగా ఇల్లు ఖాళీ చేయడం కష్టం కదా! పైగా మాకు అలాంటి నమ్మకాలు లేవు” అన్నాడు.
ఆ మాటలకు వెంటనే “మీకు లేకపోయినా, మీ ఇంటి ఓనర్లకు ఉంటాయి. పైగా వచ్చే సంవత్సరం వారి అమ్మాయి పెళ్ళి. వారు హైదరాబాద్‌లో ఉంటారు. మీరు ఖాళీ చేస్తే వాళ్ళు ఈ అర్నెల్ల తర్వాత ఇంటిని బాగు చేయించుకుని, పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటారట” అన్నాడు.
ఊహించని ఈ పరిణామానికి నిర్మల్ కుమార్‌కు దిక్కు తోచనట్టయ్యింది. స్తబ్దుగా అయిపోయాడు.
వెంటనే అతను “నేనూ టెన్షన్లోనే ఉన్నాను. మా అమ్మగారు చనిపోయి నెల అయ్యింది. మా అక్కగారి ఇంట్లో చనిపోయింది. రెండు రోజుల్లో ఆవిడ కర్మకాండ కార్యక్రమం. దానికి సంబంధించిన భోజనం ఏర్పాట్లతో హడావుడిగా ఉన్నాను. మన అపార్ట్మెంట్ ఫంక్షన్ హాలులోనే భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాను. మీ విషయం తెలిసి, ఇది మీకు చెప్పడానికి వచ్చాను” అన్నాడు.
అప్పటికే ఆలోచనల్లో మునిగిన నిర్మల్ కుమార్. “సారీ, మీ అమ్మగారు చనిపోయినట్టు తెలియదు. దీనికి ప్రత్యామ్నాయం లేదా?” అన్నాడు.
“ఉంటుంది. శాంతి జరిపించడం, ఐదుగురు పండితులతో సంప్రోక్షణ చేయొచ్చు. కానీ అవన్నీ మీరు చేయలేరు కదా” అన్నాడు నిర్మల్ కుమార్ మొహంలోకి చూసి.
నిర్మల్ కుమార్ తలొంచుకున్నాడు. అతనికి పూర్తిగా అర్థమైపోయింది. తన మతానుసారం అవేమీ చేయలేడు. తల్లి మతం పుచ్చుకుంది. ఆవిడ విధానమే తనది కూడా.
“సరే, మీరు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను” అంటూ ముందుకు ఇంట్లోకి నడిచాడు.
అప్పటికే భోజనం బల్లమీద భోజనం వడ్డిస్తోంది భార్య. కొడుకు వచ్చేసాడు.
“రండి” అంది భార్య.
వాష్ రూమ్ లోకి వెళ్ళి చేతులు కడుక్కొని, మౌనంగా భోంచేస్తున్నాడు.
“ఏమైంది? ఆయన ఎందుకు వచ్చారు” అంది భార్య భోజనం వడ్డిస్తూ. “ఇల్లు ఖాళీ చేయాలట! ఆర్నెల్లపాటు ఖాళీగా ఉంచుకుంటారట” అన్నాడు.
“అయ్యో! ఇప్పుడు మన సొంతింటికి వెళ్ళిపోవాలా? వాళ్ళనీ సడన్ గా ఇల్లు ఖాళీ చేయమనడం బాగోదు” అంది.
తలొంచుకొని భోజనం చేస్తున్న రాహుల్ “మైగాడ్. గొప్ప చిక్కే వచ్చిపడిరది. మనకు ఈ ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది” అన్నాడు.
ఆ మాటలకు ముభావంగా అయిపోయాడు నిర్మల్ కుమార్ కు .
కొడుకు గబగబా భోజనం ముగించేసి, “అర్జెంటు కేసు ఉంది. నేను వెళ్తాను. అన్నట్టు రాత్రికి రేణుక భోజనం పట్టుకొస్తానంది మనకి” అలా చెప్తూనే తన బ్యాగ్ సర్దుకొని, యాప్రాన్, సెతస్కోప్ భుజం మీద వేసుకుని బయటకు కదిలాడు రాహుల్.
నిర్మల్ కుమార్ కు ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. త్వరితగతిన భోజనం పూర్తి చేశాడు. తల్లి ఫోటో పక్కన పాలరాతితో చేసిన ఏసుక్రీస్తు సిలువ మీద వేలాడుతున్న బొమ్మ.
“కాసేపు పడుకుంటాను” అంటూ తన గదిలోకి వెళ్ళాడు.
భార్య కూడా తన పని ముగించుకుని, తనూ బెడ్రూమ్ లోకి వచ్చింది.
“కేలండర్ పట్రా” అన్నాడు. ఆమె కేలండర్ తీసి ఇచ్చింది.
“పదమూడవ రోజు శనివారం అయ్యింది. ఆరోజే జ్ఞాపకార్థ కూటమి. మన బంధువులు, స్నేహితులు, మా కాలేజీ స్టాఫ్, అబ్బాయి కొలిగ్స్, వీరంతా కలిపి వందమంది అవుతారు. ఇక మన అపార్ట్మెంట్లో మనకు వంద కుటుంబాలతో పరిచయం ఏర్పడిరది. అమ్మకు కూడా వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. సో ఒక వందమందిని వేసుకోవచ్చు. అంటే మనం రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి” అన్నాడు.
“ఇంతకీ కేటరింగ్ వారితో మాట్లాడారా?” అంది.
“అపార్ట్మెంట్లోనే రెగ్యులర్ గా చేసే అతను ఉన్నాడట. అబ్బాయి మాట్లాడేశాడు. ఇక మనం ఫోన్ చేసి చెప్పడమే. ఇది ఇంటికి వెళ్ళి ఆహ్వానించే కార్యక్రమం కాదు కనుక. ఫోన్ నెంబర్లకు సమాచారం ఇద్దాం. నువ్వు ఆ పనిమీద ఉండు” అంటూ మంచం పక్కన ఉన్న డైరీ తీసి, చేయవలసిన ఫోన్ నెంబర్ల లిస్ట్ ఆమెకు అందించాడు.
“సరే” అంటూ ఆమె ఆ లిస్ట్ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది.
కళ్ళు మూసుకున్న నిర్మల్ కుమార్ కి నిద్రపట్టే సూచనలు కనబడటం లేదు. ఏవో ఆలోచనలు. ‘తన తల్లి ధనిష్ఠా పంచకంలో చనిపోయిందా? ఇంట్లోవారు చనిపోతే ఆర్నెల్లు ఇల్లు ఖాళీ చేయాలా! అందుకు ప్రత్యామ్నాయంగా ఇంటిని సంప్రోక్షం చేయాలి. నీతిగా, నిజాయితీగా అందరి మేలుకోరుతూ బతికిన తల్లి పవిత్రురాలే. తన పదేళ్ళ వయసులో తండ్రి చనిపోతే ఒంటరిగానే తన బతుకును సాగించింది. కొడుకును ప్రయోజకుడ్ని చేసింది. తన నర్స్ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ బతికింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆవిడ మసిలిన ఈ ఇల్లు అపవిత్రమౌతుందా?’ అనే ఆలోచనలతో మనస్సు బాధగా మూలిగింది. ఇక మరి నిద్రపోలేక, డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు.
ఇంతలో తలుపు తోసుకుంటూ ఐదేళ్ళ అమ్మాయి. రెండు జడలు, నుదుటిపై పొడుగ్గా గీసిన బొట్టు. జాకెట్టు, పరికిణీలో ముద్దుగా ఉంది.
“అమ్మమ్మా” అంటూ లోపలికి వచ్చింది. ఈ చిన్న పాప అమ్మ స్నేహితురాలు. ‘ఈ పసిదానికి ఎలా తెలుస్తుంది! తను పిలుస్తున్న అమ్మమ్మ లేదని’. ఇల్లంతా కలియ తిరుగుతూ
“అమ్మమ్మ ఊరు వెళ్ళిందా?” అంటూ వచ్చి తన పక్కనే కూర్చుంది.
“అవును” అంది భార్య ఏమి చెప్పాలో తెలియక.
ఇంతలో “గాయత్రీ” అంటూ బయట కేక వినిపించింది. ఆ కేకకు ఆ పాప బయటకు పరుగెత్తింది.
ఈ చిన్నపిల్లకు మైలంటు ఏమిటో తెలియదు. అశౌచం అంటే కూడా ఏమిటో తెలియదు. ఇంట్లోవాళ్ళ తిట్లకు గురౌతుందేమో అనుకున్నాడు నిర్మల్ కుమార్.
ఆ చిన్నపిల్ల తల్లితో ఆడుకునేది. తల్లి బాగా ముద్దు చేసేది. ఆ పిల్ల కోసం చాక్లెట్లు తెప్పించి ఉంచేది. నిట్టూర్చాడు నిర్మల్ కుమార్.
ఇంతలో బయట బెల్ మోగింది. తలుపు తెరిచాడు. ఎదురుగా తెల్లగా, పొడుగ్గా ఉన్న ఒక పెద్దాయన. పూర్తిగా తెల్లబట్టలు. వైట్ అండ్ వైట్. కళ్ళకు రేబాన్ గ్లాసెస్.
“రండి సార్” అంటూ లోపలికి ఆహ్వానించాడు.
భార్య నమస్కారం చేసి, కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది.
తల్లి ఫోటోకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని “మీ అబ్బాయి పనిచేస్తున్న ఆస్పటల్లో నేను ఆర్.ఎమ్.ఓ.ని. నా పేరు డా.హర్నాథ్. సారీ, మీ అమ్మగారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను గవర్నమెంట్ ఆస్పత్రిలో పనిచేశాను. ఆ తర్వాతే రిజైన్ చేసి రేణుకా గ్లోబల్ హాస్పటల్లో చేరాను. మీ అమ్మగారి లాగే మీ అబ్బాయి కూడా సర్వీస్ ఓరియంటెడ్. డెడికేషన్, డివోషన్ ఉన్న వ్యక్తి. మా చైర్మన్ గారు కూడా బాగా లైక్ చేస్తారు” అన్నాడు.
నిర్మల్ కుమార్ మౌనంగా వింటున్నాడు.
“చైర్మన్ గారు రావలసింది, ఆయన హైదరాబాద్‌లో మా కొత్త హాస్పటల్ ఓపినింగ్ ఏర్పాట్లలో ఉన్నారు” అన్నాడు.
భార్య కాఫీ కప్పులతో వచ్చింది. ఆయనకు అందించాడు.
“మీ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వెంటనే మా ఆస్పత్రిలో చేరడం, స్వల్పకాలంలోనే మంచి సర్జన్ గా పేరు రావడం, చాలా సంతోషించాల్సిన విషయం” అన్నాడాయన కాఫీ తాగుతూ.
ఆ మాటలకు నిర్మల్ కుమార్ “చాలా సంతోషం. మావాడిది చిన్నప్పటి నుండీ కష్టపడేతత్వం” అన్నాడు.
ఆయన కాఫీ తాగడం పూర్తి చేసి ఆ గదిలోని ఫోటోకి వేసిన గులాబి దండకేసి చూస్తూ “దాన్ని చైర్మన్ గారి అమ్మాయి రేణుకా మేడం గారు తెచ్చినట్టున్నారు” అన్నాడు
“అవునండీ ఆవిడ ఉదయమే వచ్చారు” అన్నాడు నిర్మల్ కుమార్.
“అవును. ఈ గులాబీల దండ ఖరీదైనది. వారం, పదిరోజుల వరకూ పూలు వాడిపోవు. మేడం బెంగుళూరు నుండి తెప్పించారనుకుంట” అన్నాడు.
“అలాగా, అవును, ఆ దండ చాలా ఖరీదైనదిగానే కనిపిస్తుంది. రేణుకా మేడం చాలా మంచివారు” ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు నిర్మల్ కుమార్.
“మేడం, రాహుల్‌తో చాలా స్నేహంగా ఉంటారనుకుంట” అన్నాడు.
“అవునండీ, మా ఇంటికి తరచుగా వస్తారు కూడా” అన్నాడు
“అవును, ఆవిడ డౌన్ టు ఎర్త్. లండన్‌లో హాస్పటల్ మేనేజ్మెంట్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చైర్మన్ గారి తర్వాత రేణుకా గ్లోబల్ హాస్పటల్స్ గ్రూపులోని వైద్యాలయాలన్నీ వీరి కనుసన్నలలోనే నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రితో పాటు, వీరి గ్రూపులోని హాస్పట్ల సంఖ్య ఏడు. చాలా సంపన్నులు. అయితే.. ” ఆయన చెప్పడం ఆపాడు.
నిర్మల్ కుమార్ కు అర్థం కాలేదు. అదంతా ఆయన ఎందుకు చెబుతున్నాడో.
ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు “అంత గొప్పవారు మనతో స్నేహంగా ఉన్నారని, మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి”.
ఆయన మాటలకు నిర్మల్ కుమార్ మతిపోయింది. తను కూడా ఆ విషయం గురించి భయపడుతున్నాడు. రేణుక ఉదయం తన తల్లి ఫోటోకు వేసిన గులాబీలు బాగున్నాయి కానీ, ఆ గులాబీల వెన్నంటి ఉండే ముళ్ళ సంగతి తనకు తెలుసు. మనసులో ఏదో భారం పెరిగినట్టు అయ్యింది.
ఆయన చెప్పడం కొనసాగించారు “చైర్మన్ గారు మాతో, మీ అబ్బాయిలాంటి డాక్టర్లతో కలిసి భోజనం చేస్తారు. అభినందించాల్సి వచ్చినప్పుడు హగ్ చేసుకుంటారు. అంతవరకే చనువిచ్చారని ఎప్పుడూ మేము మా స్థాయి దాటము. ఆయన మాకు దూరపు బంధువైనా” అని చెప్పడం ఆపాడు.
ఆయన వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు.
“ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోకండి. పరువు కోసం ఏదైనా చేస్తారు. నా మాటలు మీకు కటువుగా అనిపించొచ్చు. చూస్తున్నారుగా పేపర్లలో. మీ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది. డాక్టర్ గా ఎంతోమంది జీవితాలకు ప్రాణం పొయ్యాలి. మరి అర్థాంతరంగా” చెప్పడం ఆపి, ఇంట్లోంచి బయటకు కదిలాడు.
నిర్మల్ కుమార్‌కు ఆయన చెప్పిన విషయం అర్థమై, మనసులో ఒకసారి విప్ఫోటనం కలిగింది. వెళ్ళిపోతున్న ఆయన తలుపును మూసి వెళ్ళిపోయాడు. ఆ మూయడంలో ఆ తలుపు చేసిన చప్పుడు తన గుండెలమీద మృదంగంలా శబ్దం చేసినట్టు అనిపించి, సోఫాలో కూలబడ్డాడు.
రెండు రోజుల తర్వాత
యూనివర్సిటీ నుండి వస్తూ తన కారుని పార్కింగ్ ప్లేసులో ఉంచి, లిఫ్ట్ వైపు కదులుతుండగా అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్ దగ్గర హడావుడి చూసి ఆగిపోయాడు నిర్మల్ కుమార్.
అందరూ భోజనం ప్లేట్లతో కనిపించారు. కొంచెం దూరంగా రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన నారాయణ మూర్తి గుండుతో కనిపించాడు. అపార్ట్మెంట్లోని చాలామంది భోజనాల ప్లేట్లతో దర్శనమిచ్చారు. ‘రండి సార్’ అని ఎవరో పిలిచినట్టు అయ్యింది. తల తిప్పి చూశాడు.
“భోజనానికి రండి” అన్నారు ఎవరో.
ఆ పిలుపుకు చిన్నగా నవ్వి, ‘మమ్మల్ని పిలిచినట్టు లేరు’ అనుకున్నాడు మనసులో. ఇంటికి చేరుకుని ఆలోచనలో పడ్డాడు. భార్య డైనింగ్ టేబుల్ మీద భోజనం ఏర్పాట్లు చేస్తోంది.
“కింద ఫంక్షన్ హాలులో భోజనాలు. మనల్ని పిలిచారా? నీకేమైనా చెప్పారా?” అని అడిగాడు.
“అబ్బే లేదు” అంటూ తన పనిలో నిమగ్నమైంది.
నిర్మల్ కుమార్ నిస్సత్తువగా సోఫాలో వాలాడు. “అందర్నీ పిలిచి, మనల్ని ఎందుకు పిలవలేదో?” అన్నాడు భార్యతో.
“మీకు తెలియదా? లేక తెలిసే అడుగుతున్నారా?”
“అంటే అమ్మ పోయిన మైలు ఇంకా ఉందా? పదిరోజులు దాటిపోయింది కదా!” అన్నాడు.
“మీకు తెలిసీ ఎందుకు అడుగుతారో”
ఆ మాటలకు నీర్సంగా నవ్వాడు. అంతలో తలుపు చప్పుడైంది. తలుపు తీశాడు.
ఆ అపార్ట్మెంట్లోనే అద్దెకుంటున్న విల్సన్ రాజు వచ్చాడు.
“రండి సార్” అన్నాడు నిర్మల్ కుమార్.
అతను లోనికి వచ్చి కూర్చుని “సారీ నేను ఊళ్ళో లేను. ఆఫీసు పనిమీద చెన్నై వెళ్ళాను. మా ఆవిడ చెప్పింది” అన్నాడు.
నిర్మల్ కుమార్లో గబుక్కున ఏదో సందేహం. అడగాలా, వద్దా అనుకుంటూనే “మీరు కింద భోజనం చేసారా” అన్నాడు మెల్లగా
“పిలవలేదండీ, ఇప్పుడే ఇంట్లో భోజనం చేసి వస్తున్నాను” అన్నాడు.
“ఆయన మీకు పరిచయమే కదా! పైగా మీ ఆఫీసే మమ్మల్ని అయితే మా అమ్మగారి మైలని పిలవలేదేమో మిమ్మల్ని ఎందుకు పిలవలేదు” అన్నాడు నిర్మల్‌కుమార్.
ఒక్కక్షణం విల్సన్ రాజు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు “మనం ఎప్పటికీ మైలే వాళ్ళకి. చచ్చిపోయినప్పుడు కొంతమందికి మైలు ఉంటుంది. మనం బతికినంతకాలం మైలే”
అతను చెప్పిన మాటలు ఆ గదిలో బాంబులా పేలాయి.
ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేక నిర్మల్ కుమార్ అన్నాడు “ఎల్లుండి మన ఫంక్షన్ హాల్లోనే మా అమ్మగారి జ్ఞాపకార్థ కూటమి. ఉదయం పాస్టర్ గారు వస్తారు. గంటలో ఆయన ప్రసంగం ముగుస్తుంది. వెంటనే భోజనాలు. మీరు, మీ కుటుంబం తప్పనిసరిగా రావాలి” అన్నాడు.
“అలాగే” అంటూ అతను తల్లిగారి ఫోటోవంకే చూస్తూ ఉండిపోయాడు. భార్య అతనికి పళ్ళ రసం తీసుకొచ్చి ఇచ్చింది. అతను తాగుతూ “మీ అమ్మగారు ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? పెళ్ళైనప్పటి నుండా?” అన్నాడతను.
“నాకు పదేళ్ళ వయసప్పుడే మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయనది ఆస్పత్రిలో చిన్న ఉద్యోగం. లాబ్ అటిండెంట్. పెళ్ళైన టైమ్ లో మా అమ్మానాన్నా ఇద్దరూ హిందూమత విధానాలే పాటించేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, అంతకుముందే నర్సుగా మా అమ్మ ట్రైనింగ్ పొందడంతో, మా నాన్న పనిచేస్తున్న మిషన్ ఆస్పటల్ల్లోనే నర్సు ఉద్యోగం వచ్చింది. యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ పదేళ్ళ కుర్రాడ్ని పెంచడం, అటువైపు నుండి ఇటువైపు నుండి కూడా ఏ సహాయ సహకారాలు లేకపోవడంతో అమ్మకు ఒక కమ్యునిటీ రక్షణ కావలసి వచ్చింది. అది ఆ మిషన్ ఆస్పటల్లో పనిచేసే కేరళ నన్‌లు, ఇంకా పనిచేసే సిబ్బంది ద్వారా లభించింది. అలా తనకంటూ ఒక ప్రపంచం ఏర్పడిరది. ఇది స్లోగా జరిగింది. అప్పట్లో నేను చర్చికి వెళుతున్నానని తెలిసి, మా మిత్రులు ‘ఒరేయ్ రైస్ బ్యాగ్’ అని ఏడిపించేవారు.
ఆ మాటలకు విల్సన్‌రాజు “రైస్ బ్యాగ్ ఏంటి?” అంటూ చిన్నగా నవ్వాడు.
“అప్పట్లో 19వ శతాబ్దంలో వచ్చిన కరువు మూలంగా చాలామంది దళితులు, క్రిష్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. ఈ విషయం గురించి నేను నా పిహెచ్.డి. థీసెస్‌లో కూడా వ్రాశాను. ఆరోజుల్లో వచ్చిన కరువు మూలంగా దళితులకి కూలిపనులు దొరకలేదు. ఆకలి చావులతో చాలామంది చనిపోయారు. ఆ సమయంలో మిషనరీలు వారికి బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. అలా ఆకలి వారి మతాన్ని మార్చింది. అంతే” అన్నాడు నిట్టూరుస్తూ.
“సరే మీరు భోజనం చేయండి, నేను వెళ్తాను” అంటూ విల్సర్ రాజు బయటకు కదిలాడు.
భార్య పిలవడంతో డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చున్న నిర్మల్ కుమార్‌కి ఏమీ తినబుద్ధి కాలేదు. ఏదో అయింది అనిపించాడు. నాలుగైదు రోజులుగా ఎదరౌతున్న పరిణామాలు, షాక్‌కు గురిచేస్తున్న ఘటనలు. వీటితో మంచం మీద వాలినా అతని కంటిమీద కునుకులేదు. వెంటనే లేచి రెండురోజుల్లో జరగబోయే తల్లి పదమూడవ రోజు కార్యక్రమం గురించిన పనులతో భార్యకు చెప్పి బయటకు కదిలాడు.
ఆ రోజు ఉదయం పది గంటలకే భార్య, కొడుకుతో కలిసి ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాడు నిర్మల్ కుమార్. అప్పటికే బంధువులు, ఆ అపార్ట్మెంట్లోనివారు వచ్చేశారు.
ఆ హాల్లో చిన్న వేదికమీద తల్లి ఫోటో ఉంచారు. వచ్చినవారంతా పక్కనే ఉన్న పూలతో ఆమెకు అంజలి ఘటిస్తున్నారు. పాస్టర్ గారి ప్రసంగం మొదలైంది.
“అబ్రహామ్ కథ మీకు తెలిసే ఉంటుంది. ఆయన ప్రజల దాహం తీర్చడం కోసం బావులు తవ్వించాడు. అతను తవ్విన బావుల్ని శత్రువులైన ఫిలిప్తీయులు పూడ్చేశారు. అంటే అతని జ్ఞాపకాలు. అబ్రహామ్ కొడుకు ఇస్సాకు శత్రువులు పూడ్చేసిన బావుల్ని తిరిగి తవ్వించాడు. తండ్రి జ్ఞాపకాలను నిలబెట్టాడు. అలా మనం మనముందు తరాలవారి జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞాపకార్థ కూటమిలో నిర్మల్కుమార్గారి తల్లి ఆగ్నేసమ్మగారిని మనం గుర్తు చేసుకుంటున్నాం. అదే ప్రకారంగా రేపొద్దున్న మనం ఈ లోకం నుండి వెళ్ళిపోయేముందు మన జ్ఞాపకాలే మనవాళ్ళకు మిగుల్తాయి. ఒక కవిగారు చెప్పినట్టు, వెళ్ళిపోయినవారిని గుర్తు పెట్టుకోవడం ఒక వేడుక కాదు. ఒక యాగం. ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం. వెళ్ళిపోయినవాళ్ళు మన బాధల్లోనూ బాధ్యతల్లోనూ తోడుగా ఉన్నారనే భరోసాయే అతి ముఖ్యం”
ఆ మాటలు విన్న నిర్మల్ కుమార్ మనసులో జరుగుతున్న అలజడికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది. పాస్టర్ గారు ప్రసంగం పూర్తి చేశారు. నిర్మల్ కుమార్ ని తన తల్లితో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకోమన్నారు పాస్టర్గారు.
నిర్మల్ కుమార్ ఆ ఫంక్షన్ హాల్లోని కొంతమందివంక పరిశీలనగా చూశాడు. అతనిలో కొద్దిగా నైరాశ్యం. రెండు వందల మంది పట్టే ఆ హాలు సగభాగం ఖాళీగా ఉంది. క్షణంలో అతనికి అర్థమైపోయింది. తను పిలిచినవారు చాలామంది రాలేదు. ఎందుకు రాలేదో కూడా అర్థమై, మనసు బాధతో మూలిగింది. రెండు రోజుల క్రితం ఇదే ఫంక్షన్ హాలులో స్థలం సరిపోక బయట కనిపించిన అతిథులు గుర్తుకొచ్చారు. ఒక్క నిముషం ఆలోచనలో పడి చెప్పడం మొదలెట్టాడు.
“మా తల్లిగారి ఈ మెమోరియల్ సెర్మనీకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సమయంలో మా తల్లిగారు నాకు చిన్నప్పుడు చెప్పిన ఒక కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ కథలోని బాలుడి వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఆ అబ్బాయి తన అన్నదమ్ములతో తండ్రిగారు పనిచేసే ఊరికి ప్రయాణమయ్యాడు. అప్పట్లో ట్రైన్ దిగి ఆ ఊరుకి వెళ్ళాలంటే గుర్రపు బండి ఎక్కాలి. అయితే ఆ అబ్బాయి కులం ఏమిటో తెలిసిన బండి తోలేవాడు తన బండి నడపడానికి ఒప్పుకోలేదు. బండి వెనుక నడుస్తానన్నాడు. అలా ఆ గుర్రపు బండి నడపడం చేతకాక వారి ప్రయాణం చాలా భయానకంగా సాగింది. ఆ సమయంలో వారికి ఆకలేసినా ఎవరూ నీళ్ళు ఇవ్వకపోవడంతో, ఆహారం తెచ్చుకున్నా తినకుండా ఉండిపోయారు.
ఆ తర్వాత ఆ అబ్బాయి కొలంబియా యూనివర్సిటీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకొని బరోడా వచ్చాడు ఉద్యోగం చేయడానికి. అంత చదువు చదివినా అతని కులం కారణంగా హోటల్లో రూమ్ దొరకలేదు. ఒక పార్సీవారి సత్రంలో, తను పార్సీవాడినని చెప్పి గది తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవం తెలిసిన వారు అతనిని కొట్టడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఇంకో సందర్భంలో ఒక ఊరికి ప్రయాణం అయినప్పుడు కూడా గుర్రపు బండివాడు బండి నడపడానికి మొరాయించాడు. ఆయన కులం వారిచేతే బండి తోలించాడు. బండి నడపడం చేతకాని ఆ దళితుడి వల్ల ఆ బండి గాడితప్పి ఎటో వెళ్ళింది. ఆయనకు ప్రమాదం జరిగి చాలారోజులు హాస్పటల్లో ఉండవలసి వచ్చింది. ఇలా తను పడిన బాధలు గాయల్లా సలుపుతున్నా దాన్ని ఒక డైరీగా వ్రాసుకున్నారు. ఆ డైరీని కొలంబో యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశంగా పెట్టారు. దానిపేరే “వెయిటింగ్ ఫర్ వీసా”. అది వ్రాసింది డా.బాబాసాహెబ్ అంబేద్కర్. మన రాజ్యాంగ నిర్మాత. దీనితో ఎంత ఆర్తి ఉంది, ఎంత ఆవేదన ఉంది! లండన్, అమెరికా దేశాల్లో చదువుకొని అక్కడ ప్రముఖుడిగా వెలిగిన వ్యక్తిని స్వదేశంలో సమాజం స్వీకరించలేదు. కానీ విదేశాలకు తిరగడానికి మాత్రం అతనికి వీసా దొరికింది. స్వదేశంలో తనని సాటిమనిషిగా గుర్తించే వీసా ఎప్పటికి దొరుకుతుందో? అదే ‘వెయిటింగ్ ఫర్ వీసా’ లో మనకు కనిపించే ఆత్మ. ఇది మా అమ్మ నాకు చెప్పిన కథ. ఆ తర్వాత నేను దీనిగురించి మరింత విస్తృతంగా తెలుసుకున్నాను” నిర్మల్ కుమార్ తన ప్రసంగం పూర్తిచేయకుండానే ఒకాయన లేచి నిలబడి,
“దయచేసి నేను ఒక రెండు విషయాలు మీతో చెప్పాలి” అన్నాడు.
“అలాగే సార్” అంటూ నిర్మల్ కుమార్ ఆయనకు మైక్ అందించాడు.
అతను ఆ ఫంక్షన్ హాల్లోని వారివంక పరిశీలనగా చూసి
“ఇప్పుడు రోజుల్లో అంతరాలు తరిగిపోయాయి. అందుకని వీటికి ఈ కాలమాన పరిస్థితుల్లో సానుభూతి అవసరం లేదు. మీరు చెప్పింది వందేళ్ళ క్రిందటి కథ. ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా ఎలా భ్రమింపచేస్తున్నారో! మీలాగే రచయితలు, కవులు అలాంటి భావజాలాన్ని సమాజానికి రుద్దుతున్నారు. ఇప్పుడు అంతా సమానమే. అట్టడుగు వర్గాలు కాస్త ఎక్కువ సమానం అని చట్టాలు, పాలకులు కూడా చెబుతున్నారు. మీరు ప్రొఫెసర్ విదేశాల్లో చదువుకొని వచ్చారు. మీ అబ్బాయి, ఐదు నక్షత్రాల ఆస్పత్రిలో డాక్టర్. మీకేం తక్కువ” అని చెప్పి కూర్చున్నాడాయన.
ఎవరో చిన్నగా ఆ మాటలకు చప్పట్లు కొట్టినట్టు అనిపించింది. నిర్మల్‌కుమార్ మనస్సు మొద్దుబారిపోయింది. కళ్ళనుండి నీళ్ళు మెల్లగా కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఐదారు రోజులుగా తల్లిగారు పోయినప్పటి నుంచీ జరిగిన పరిణామాలన్నీ గుర్తుకొస్తున్నాయి. తన ఇల్లు ఆరు నెలలు ఖాళీగా ఉంచమనడం ప్రేమిస్తున్న కొడుకు మెడపై వేలాడే కత్తి, అపార్ట్మెంట్లో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూనే దూరంగా ఉంచే మనుషులు.
అతని పరిస్థితి చూసి భార్య, కొడుకు భుజంపై చేతులేసారు. వెంటనే కొడుకు మైకు తీసుకుని చెప్పాడు.
“భోజనం బయట షామియానా కింద అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందని నా ప్రార్థన” అని అన్నాడు చేతులు జోడిరచి.
భోజనాలు మొదలయ్యాయి. తనను ప్రశ్నించిన పెద్దమనిషి భోజనం ప్లేటు తీసుకుని కొంతదూరంలో భోజనం చేస్తూ కనిపించాడు. నిర్మల్‌కుమార్ స్తబ్దుగా ఉండిపోయాడు. నిముషాలు దొర్లాయి. అరగంట గడిచింది. అందరి భోజనాలు పూర్తయ్యాయి.
పక్కింట్లో ఉండే గాయత్రి యూనిఫామ్‌తో పరిగెత్తుకొంటూ స్కూల్ నుండి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ “భోజనం చేయమ్మా” అన్నాడు నిర్మల్‌కుమార్.
“వద్దు అంకుల్ నేను చేయను” అంది.
“పోనీ ఐస్‌క్రీమ్” అన్నాడు కప్పు ఆ పాపకు అందిస్తూ.
“మా అమ్మ తినొద్దు అంది” అంటూ ఆ పాప పరిగెత్తింది అక్కడినుండి.
అంతలో కొడుకు వచ్చాడు. “నాన్నా, చాలా ఫుడ్ మిగిలిపోయింది. అపార్ట్మెంట్ సెక్యురిటీవారు, సూపర్వైజర్లు తిన్న తర్వాత కూడా చాలా మిగిలింది. మనం రెండు వందల మందికి చెప్పాం. కానీ వందమంది మాత్రమే వచ్చారు” అన్నాడు.
“రేణుకాదేవి రాలేదేం?” అన్నాడు నిర్మల్‌కుమార్.
ఆ మాటలకు కొడుకు తలొంచుకున్నాడు. “తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే నన్ను వదులుకోలేనంతగా. మన ఇంటికి వచ్చిన డా.హర్నాథ్ గారు మీతో మాట్లాడిన విషయాలు తనకు తెలిశాయి. తనూ భయపడుతోంది. ఆ భయం నా గురించే” మరి చెప్పలేకపోయాడు రాహుల్.
ఆ మాటలకు దుఃఖం, ఆనందం ఏకకాలంలో కలిగాయి నిర్మల్ కుమార్ కు. కొడుకు రెండు చేతులు పట్టుకొన్నాడు. భోజనం చేసి దూరంగా తననే గమనిస్తున్న తనను ప్రశ్నించిన ఆ పెద్దాయన మెల్లగా వచ్చాడు.
“సార్, మేం మాలో అనుకునే మాటలే ఇక్కడ మాట్లాడేశాను. కానీ మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తుంటే ఏదో గిల్టీగా అనిపిస్తోంది. ఇంతకీ మీ బాధ దేనికి?” అన్నాడు.
ఆ మాటలకు నెమ్మదిగా ‘వెయిటింగ్ ఫర్ వీసా’ అన్నాడు నిర్మల్ కుమార్.
“అంటే?” ప్రశార్థకంగా చూసాడతను.
‘వెయిటింగ్ ఫర్ వీసా, వెయిటింగ్ ఫర్ వీసా’ తనలో తాను గొణుక్కున్నాడు.
5 Responses to “వెయిటింగ్ ఫర్ వీసా”
ముగింపులో ఆ పెద్దాయన చెప్పినట్లు అట్టడుగు వర్గాలు కాస్త ఎక్కువ సమానం అని చట్టాలు, పాలకులు చెప్తున్నారు అన్నది నిజమే!
అది వాళ్ళు చెప్పడమే కానీ చేస్తున్నది కాదు.
“వెయిటింగ్ ఫర్ వీసా” అనేది నిర్మల్ కుమార్ మనసులో మాట కాదు, నలిగిపోతున్న ఎందరో అట్టడుగు వర్గాల గుండె కోత…
ఆ పెద్దాయన చెప్పిందే నిజమైతే మొన్నీమధ్యనే రాజస్థాన్ లో ఒక దళిత మహిళకు ఆ దుస్థితి ఏర్పడి ఉండకూడదు కదా…
కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కులాలదే ఆధిపత్యం అన్న మాట వాస్తవం కాదా?
కళ్ళకు కనిపించిందే నిజమైతే ప్రతీదీ నిజం కావాలి కదా…
రాసుకుంటూ పోతే ఎన్నో అక్షరాలూ, చెప్పుకుంటూ పోతే ఎన్నో గుండె వ్యథలు…
రచయితకు హార్దిక అభినందనలు.
మీ కథ సామాజిక అస్పృశ్యత మీద ఎక్కుపెట్టిన బాణం. మానవ హితం ఇది ఒక దర్పణం. ధన్యవాదాలు సుగుణరావు గారు.
సామాజిక పరిస్థితులను సునిశితంగా అధ్యయనం చేసి అక్షరాలలో వెలిగించడానికి మీకు మీరే సాటి సర్. అద్భుతమైన కథ రాశారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయ్యింది.
ఒక సున్నితమైన అంశాన్ని కథనం చేసిన తీరు చాలా బావుంది. నిర్మల్ కుమార్ ఆవేదన మనసును చలింపజేసింది. రచయిత డా,, సుగుణరావు గారికి అభినందనలు.
నేటి సామాజిక వ్యవస్థకు అద్దం పట్టేలా ఉంది ఈ కథ.
ఎంత చదివినా , ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా నేటికీ చాలా మంది పరిస్తితి వెయిటింగ్ ఫర్ వీసా నే.
రచయిత శ్రీ సుగుణ రావు గారికి అభనందనలు.