వజ్రం
పచ్చని ప్రకృతిని చుట్టూ అల్లుకున్న ఒక అందమైన గ్రామం వజ్రపురం.
ప్రొద్దు గుంకే సమయం.
గోధూళివేళ.
కాసింత అలసిన సూరీడు కూసింత విశ్రాంతి కోసం పడమటింటకు మరులుతున్నాడు. ఆకాశం కెంజాయవర్ణాన్ని సంతరించుకుంది. నీరెండ కిరణాలు బంగారురంగుతో భూమిని తాకుతున్నాయి.
అలమందలు తమ గిట్టలను తాటిస్తూ తమ తమ ఇండ్లకు బయలుదేరాయి. వాటి మెడలలో కట్టిన మువ్వలు చిరు శబ్దం చేస్తూ వాటి రాకను తెలియచేస్తున్నాయి. వాటి గిట్టలనుండి రేగుతున్న గోధూళి పశ్చిమాన్ని ఎరుపెక్కిస్తోంది. వింత మట్టివాసన ఆహ్లాదాన్ని గొలుపుతుంది.
ఆహారం కోసం వెళ్లిన పక్షులన్నీ తమతమ గూళ్ళకి చేరుకుంటున్నాయి.
దూరంగా రామాలయంలో మైకు సెట్టులో దేవుడి పాటలు వినిపిస్తున్నాయి.
చల్లటి గాలి అల్లనల్లనగా అందరిని పలకరిస్తోంది. కొందరు ఆవులకు పాలు పితకడం మొదలుపెట్టారు. మరికొందరు రామాలయం వైపుగా వెళ్తున్నారు. కొందరు మేకల గుంపులను తోలుకొస్తున్నారు.
తమ పొలం నుండి ఇంటికి బయలుదేరిన పైడయ్య తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి బయలుదేరాడు.
“ఏం పైడయ్య మామా! ఇంటికేనా?” అని మరిడయ్య అడిగిన ప్రశ్నకు “ఔను మరిడయ్యా, ఇంటికే పోతా ఉండాను” అని సమాధానము చెప్తూ ముందుకు కదిలాడు పైడయ్య.
అలా దారిలో కనిపించిన అందరికి సమాధానం చెప్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్తున్నాడు పైడయ్య.
దూరంగా చెరువు నిండిపోయి పారుతున్న అలుగును చూడనే చూసాడు పైడయ్య కొడుకు. ఆ అలుగు వద్ద కొందరు పిల్లలు నీటిలో కేరింతలు కొడుతున్నారు. మరికొందరు చేపలను పడుతున్నారు.
అది చూడగానే “అయ్యా నేను ఆడుకోడానికి బోతా” అన్నాడు పట్టుకున్న పైడయ్య చేతిని వదిలేస్తూ.
“పో పోయి ఆడుకొని బిరీనా ఇంటికి రా” అన్నాడు పైడయ్య.
అప్పటికే ఆ కుర్రాడు వింటి నుండి వదిలిన బాణంలా పరుగు తీసాడు.
వెనకనుండి చూస్తున్న పైడయ్య. “నాయనా దేవుడయ్యా! భద్రం రా” అరుస్తున్నట్టే పొలికేక పెట్టాడు.
“అట్టాగే అయ్యా” అంతకంటే గట్టిగా దేవుడయ్య చెప్పిన సమాధానం పైడయ్య చెవులకు చేరింది.
ఇంటి దారి పట్టిన పైడయ్యకు తమ ఇంటికి మూడిళ్ళ అవతల ఉన్న మంత్రాల ఎల్లమ్మ కట్ట కనిపించింది. అక్కడ ఆగి భక్తిగా దండం పెట్టుకున్నాడు.
ఆ కట్ట మీద కూర్చుని ఉన్న ముసలయ్య “రారా పైడయ్య రొంతసేపు మాట్లాడి పోదురా” అని పిలిచాడు.
తన పై పంచని సవరదీసుకుంటూ కట్ట మీద కూర్చున్నాడు పైడయ్య.
ఆ పై పంచని పరిశీలనగా చూసిన ముసలయ్య “ఏరా పైడయ్య ఎన్ని రంగురాళ్లు తెచ్చినావు? ” అని పరాచికంగా అడిగాడు.
అందుకు పైడయ్య “చిన్నాయనా, దాన్లో ఒగటంటే ఒగటైనా వజ్రం ఉంటాదని ఆశ” అన్నాడు.
“వజ్రం చిక్కాలంటే రాత రాసి ఉండల్ల రా” అన్నాడు ముసలయ్య.
ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంట్లోకి అడుగుపెట్టాడు పైడయ్య.
బుడ్డిదీపం వెలుగులో ముగ్గురు తినడానికి కూర్చున్నారు.
దేవుడయ్య వాళ్ళమ్మను చూస్తూ “అమ్మా! ఎబుడు చూసిన కొర్రన్నమే పెడ్తావ్. రొట్టి అయినా సేయకూడదా” అన్నాడు.
వాళ్ళమ్మ ఏదో చెప్పబోయేంతలో పైడయ్య భార్యను చూస్తూ, “ఇగో పొద్దున్న సత్తిమయ్య అంగట్లో జొన్నలు కొనుకొని రా” అన్నాడు కొర్రన్నంలో ఉల్లిపాయను నంజుకుంటూ.
“దేవుడయ్యా ఈ పూటకి తిను నాయనా, రొట్టి రేపు పొద్దుగాలే చేస్తానులేరా” అనింది వాళ్ళమ్మ మజ్జిగ తాగుతూ.
గబగబా తినేసి ముగ్గురు బుడ్డిదీపాన్ని తెచ్చుకుని ఇంటి నడవలో కూర్చున్నారు.
పై పంచలో తాను తెచ్చిన రాళ్లను బుడ్డి ముందు పోసాడు పైడయ్య. అవన్నీ శనగగింజ పరిమాణం మొదలుకొని అన్ని పరిమాణాల్లో ఉన్నాయి.
ఒక్కొక్కరాయిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు పైడయ్య, అతడి భార్య.
దేవుడయ్య అలా రాయిని చూసి ఇలా పక్కన పెట్టడం చూసి “అట్లా చూస్తే కనబడవప్పా! ” అంటూ కొడుకును తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
ఒక రాయి తీసుకుని తన చేతి వేలుని ఆ రాయి కింద ఉంచాడు. “దేవుడయ్యా, సూడు రాయి కింద నా ఏలు కనిపిస్తాందా?” అడిగాడు. అందుకు దేవుడయ్య “అవును అయ్యా నీ ఏలు నాకు బాగా కనిపిస్తాంది” అన్నాడు దేవుడయ్య.
“ఒకాళ వజ్రం గనక అయ్యింటే మన ఏలు మనకు కనబడదు. దాన్లో ప్రాణం ఉందని మనం కనుగోవచ్చు” అని వివరించాడు.
అన్ని రాళ్లు బుడ్డి దీపం ముందు వెతికి వెతికి అలసిపోయి అలాగే నిద్రబోయింది పైడయ్య భార్య. తుండు పరిచి కొడుకుని పడుకోమని చెప్పి పైడయ్య కొడుకు పక్కన పడుకున్నాడు.
“అయ్యా ఆ రాయిలన్నీ వజ్రాలు కాదు కదయ్యా? అవిటిని నా జతగాళ్ల దగ్గరకు కొండబోయి ఆడుకుంటాను అయ్యా” అన్నాడు బతిమాలుడుతున్న ధోరణిలో. “అట్టాగేలేరా పండుకో ఇంగ” అంటూ నిద్రలోకి జారుకున్నాడు పైడయ్య.
కాలం గిర్రున తిరిగింది. పైడయ్య, అతడి భార్య ఎలాంటి వజ్రం దొరకకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. ఆ ఇంట్లో ఒక్కడే ఉంటున్న దేవుడయ్యను ఊరివారందరు ఆప్యాయంగా చూసుకునేవారు.
దేవుడయ్యా ఒంటిగాడివి, ఏడ వండుకుంటావు గాని, ఇయ్యేల మా ఇంట్లో బువ్వ తిని పోదురా అని పిలిచేవారు. అలా అందరికి తలలో నాలుకలా మారిపోయాడు దేవుడయ్య.
కానీ తనకు తండ్రి మిగిల్చిన ఎకరం పొలంలో వజ్రాలు వెతకడం మాత్రం మానలేదు.
ప్రకృతి పరవశించింది.
ఒక మేఘం హర్షమై వర్షమైంది.
నేలతల్లి స్నానమాడుతోంది.
చినుకమ్మ పలకరిస్తోంది.
తొలకరి చినుకులతో నేల తడిసి ముద్దవుతోంది.
జనం కదిలారు.
తొలకరి వానలు కురవడం వలన గ్రామ ప్రజలందరూ పొలాలకు ఉత్సాహంగా బయలుదేరుతున్నారు.
వారిలో పిల్లవాళ్ళ దగ్గరనుండి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు.
వారందరు వజ్రాలు వెతకడానికి బయలుదేరుతున్నారు.
కారణం ఆ ఊరి నేలలో పంటలు మాత్రమే కాదు. వజ్రాలు కూడా పండుతాయి.
వజ్రాలు వెతుకుకునేవాళ్ళు, పొలాలలో పనులు చేసుకునేవాళ్ళతో పంటపొలాలన్నీ సందడిగా మారిపోయాయి.
దుక్కి దున్నేవారు, కలుపులు తీసేవాళ్ళతో కలిసి దేవుడయ్య ఆ పని ఈ పని చేస్తూనే ఉన్నాడు. మరోపక్క తన పొలంలో వజ్రాలను వెతుకుతూనే ఉన్నాడు.
ఒకనాడు తన పొలం వద్ద నిలబడి ఉన్న దేవుడయ్యను చూసిన రాజప్ప “ఒప్పా దేవుడయ్యా, నా ఎద్దు ఒగదానికి దనువైంది. దున్నుదామంటే శానా కష్టం. కూలికి నా పొలాన్ని దున్నడానికి రాప్పా” అని అడిగాడు.
అందుకు దేవుడయ్య “అన్నా, ఏంటికి రాను, మర్సిపోకుండా వస్తాలేప్పా” అని రాజప్ప పొలానికి బయలుదేరాడు.
కాడికి ఒక పక్క ఎద్దు, మరోపక్క దేవుడయ్య కాడిమానుకు తగిలించిన మడకతో లాగుతూ దుక్కి దున్నసాగారు.
జానెడు జానెడు దూరంలో ఉన్నట్టుగా భూమిని సాళ్లు సాళ్లుగా దున్నుతుంటే మడక మీద నిలబడిన రాజప్ప
గొర్రు ద్వారా విత్తనాలు విత్తసాగాడు.
ఇంతలో మడకతో నడుస్తున్న దేవుడయ్యకు కాలికి బలంగా ఏదో తగిలింది. ముందుకు తూలే సమయంలో అతికష్టంమీద నిలదొక్కుకుని తగిలింది ఏమిటా అని చూసాడు. అక్కడున్న రాయిని చేతిలోకి తీసుకున్నాడు. అది తళుక్కున మెరిసింది. ఆ రాయిని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసాడు.
చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకున్న దేవుడయ్య తన చేతివేలిని ఆ రాయి కింద పెట్టి పరిశీలించాడు. తన ఊహ నిజమైంది.
ఆనందంతో “అన్నా! నీకి వజ్రం చిక్కింది” పొలికేక పెట్టాడు. ఆ అరుపు విన్న రాజప్ప ముందుకు వచ్చి వజ్రాన్ని చూసాడు. నిమ్మకాయంత పరిమాణంలో వెలుగులు చిమ్ముతోంది.
“దేవుడయ్యా, వజ్రం నా పొలంలో చిక్కినా కూడా అది నీకే చిక్కింది కాబట్టి అది నీకేప్పా! ఈ వజ్రం నువ్వే తీసుకోని అమ్ముకో” అన్నాడు. ఆ మాటలకు దేవుడయ్య “రాజప్పన్నా నాకి నా చేలోనే వజ్రం చిక్కల్ల. దాంతో నేను మనూరిని బాగుచేయల్ల” ఇది మా అయ్య కాలం సేయకముందు నుంటి అనుకుంటావుండా గదన్నా” తన అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు దేవుడయ్య.
బాయిగడ్డ మీద చిన్న కొట్టం.
ఆ కొట్టం నుండి బయటకు వచ్చింది గౌరమ్మ అవ్వ. తన మనవరాలు చుక్కతో కలిసి ఆ కొట్టంలో నివసిస్తోంది. ఊరంతటికి పెరుగు మజ్జిగ ఊరికే పంచుతుంది. బాయిగడ్డమీద గౌరమ్మ అవ్వ అంటే ఊరంతటికి ఎంతో అభిమానం. ఊరివారందరు తాగడానికి, వాడకపు నీటికోసం బాయి వద్దకు నీటికోసం వస్తారు. వచ్చిన ప్రతివారు గౌరమ్మ అవ్వను పలకరించకుండా ముందుకు కదలరు.
బాయి వద్ద నుండి చల్లగా వీస్తున్న గాలి అందరిని ఆహ్లాదపరుస్తోంది. బాయి చుట్టూరా పెరిగిన గడ్డి పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ గడ్డి మేయడానికి తన రెండు ఆవులను తోలింది గౌరమ్మ అవ్వ. గడ్డి మేసి అవి రాగానే వాటి మూతులకు చిక్కాలు తగిలించింది. పాలు పితకడానికి డేగిశా తెచ్చింది పాలు పితుకుతు ఉంటే అటు ఇటు చూస్తున్న ఆవును గమనించింది.
ఆవు మూతికి తగిలించిన చిక్కంలో ఏదో మెరుస్తోంది. డేగిశా చుక్క కు అందించింది. చిక్కం విప్పదీసి మెరుస్తున్నది ఏమిటా అని చూసింది. అదొక “వజ్రం “
ఊరు మొత్తం బాయిగడ్డమీద ఉన్న కొట్టంలోకి వచ్చి వజ్రాన్ని చూసి పోతున్నారు. ఎప్పుడూ బుడ్డి వెలుగులో మసకవెలుతురులో ఉండే గౌరమ్మ అవ్వ కొట్టం ఇప్పుడు వజ్రపు కాంతులతో తళుకులీనుతోంది. అందరు వస్తున్నా కూడా గౌరమ్మ అవ్వ కళ్ళు దేవుడయ్య కోసం వెతుకుతున్నాయి.
సాయంకాలం మంచినీటికోసం బాయికి వచ్చిన దేవుడయ్యను గౌరమ్మ అవ్వ తన కొట్టంలోకి రమ్మని పిలిచింది.
“అవ్వా నీకి వజ్రం చిక్కిందంట కదా.. పోన్లే అవ్వా ఈ కొట్టాన్ని కూల్పించి మిద్దిల్లు కట్టిచ్చుకో” అన్నాడు దేవుడయ్య అభిమానంగా.
అవ్వ దేవుడయ్య మాటలకు బదులివ్వకుండా “సుక్కా ఈ మజ్జిగబొట్టు కొండబోయి సీతమ్మ ఇంట్లో పోసిరా” అని చుక్కకు మజ్జిగ చట్టిని ఇచ్చి పంపించింది.
“ఇట్టా కూకోని మాట్టాడదాం రాప్పా” అంటూ అక్కడ బొంతని పరిచింది. “నాయనా దేవుడయ్యా నాకి సుక్కా, సుక్కకి నేను తప్ప ఎవుళ్ళు లేరని నీకి తెల్సు గదా. సుక్కని ఓ అయ్య సేతిలో ఎడితే నా భారం తీరిపోతాది. నీకి ఎట్టాటి అబ్బింతరము నేకుంటే సుక్కని మనువాడు” అని చెప్పింది.
అవ్వ మాటలకు దేవుడయ్య “అవ్వా నాకి సుక్కని మనువాడేటికి ఎట్టాటి అబ్బింతరం నేదు. కానీ సుక్కని ఓ మాట అడిగి సెప్పు” అన్నాడు.
“సుక్క ని ఏబుడో అడిగినా. ఆ పిల్లోడిని సేసుకుంటావా? అంటే సిగ్గుపడిపోనాది” అని చెప్తూ గూట్లో పెట్టిన వజ్రాన్ని తీసుకొచ్చింది గౌరమ్మ అవ్వ. ఆ వజ్రాన్ని దేవుడయ్య చేతిలో పెడుతూ. “నాయనా! సుక్క తో పాటు ఈ వజ్రాన్ని నీ సేతిలో ఎడుతున్నాను. ఇంగేమీ ఈలేని బీదరాల్ని. ఈ వజ్రం అమ్ముకొని సుక్కని మనువాడు నాయనా” అంటూ సంతోషంగా నోరు తీపి చేసుకోమంటూ బెల్లం ముక్క చేతికి అందించింది.
దేవుడయ్య వజ్రాన్ని అటు ఇటు తిప్పి చూసాడు. దాని విలువ అంచనా వేసాడు. తిరిగి అవ్వ చేతికి అందించాడు.
“అవ్వా! వజ్రం నాకి మా నాయన మిగలబెట్టిన పొలంలోనే చిక్కల్ల. ఆ వజ్రం అమ్మి మనూరుని బాగుసేయాల.
“నాకి సుక్క తప్ప ఈ వజ్రం ఒద్దవ్వా” అని చెప్పాడు.
దేవుడయ్య మంచితనం చూసి గౌరమ్మ అవ్వ కళ్ళు చెమర్చాయి.
మంత్రాలఎల్లమ్మ కట్ట వేదికగా చుక్క దేవుడయ్యల పెళ్లి ఖరారైంది. ఊరు ఊరంతా వారి పెళ్ళికి వచ్చినవారే. అందరు తలో పని చేస్తూ తమ ఇంటిలో పెళ్లి అన్నట్టు సందడి చేశారు. పెళ్లికూతురిగా దేవుడయ్య చేయి పట్టుకుని దేవుడయ్య ఇంట్లో అడుగు పెట్టింది చుక్క.
చుక్క వచ్చాక దేవుడయ్యకు వేళపట్టున అన్నీ అమరిపోసాగాయి. ఏది ఎలా ఉన్నా కానీ తన పొలంలో వజ్రాలను వెతకడం మానలేదు దేవుడయ్య.
బాయిగడ్డ మీద ఇప్పుడు కొత్త మిద్దిల్లు, చుక్క ఒంటిమీదకు బంగారపు నగలు వచ్చి చేరాయి. కొద్దిరోజుల తర్వాత గౌరమ్మ అవ్వ తన మిద్దింటిని కూడా చుక్క పేరిట రాసి కన్నుమూసింది.
కాలం గిర్రున తిరిగింది. చుక్క, దేవుడయ్యలకు ఒక కొడుకు చిన్న దేవుడయ్య అని పిలిచేవారు. పక్కూరిలో బడికి వెళుతున్న తమ కొడుకుని చూసి తెగ మురిసిపోయేవారు. తమ కొడుకుని పెద్ద చదువులు చదివించాలని చుక్కకు ఆశగా ఉండేది.
చిన్నదేవుడయ్య పదోతరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడన్న వార్త దేవుడయ్య ఇంటికి చేరింది. చుక్కమ్మ సంతోషంతో ఊరంతా గారెలు పంచిపెట్టింది.
ఒకనాడు చిన్న దేవుడయ్య బడి నుండి ఇంటికొచ్చాడు. తల్లిదండ్రులను చూసి “అయ్యా బడిలో మా అయ్యవార్లు సెప్తా ఉండారు. నేను బాగా సదుతానంట. పట్నంలో పెద్ద కాలేజీకి పొమ్మని సెప్పినారు. కాలేజీకి పోతా అయ్యా” అన్నాడు గారంగా చిన్నదేవుడయ్య.
“నువ్వొగడివే పట్నం ఎట్టా పోతావురా? మీ అయ్యతో పోయిరా” చెప్పింది చుక్క.
భాష్యం కాలేజీ.
“దేవుడయ్యా, నీకు చదువు లేకపోయినా నీ కొడుకును కష్టపడి చదివిస్తున్నావు. చిన్న దేవుడయ్య కూడా చక్కగా చదువుకుంటూ మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నాడు. మేమే స్కాలర్ షిప్ ఇచ్చి మరీ పెద్ద చదువులు చదివిస్తాము. ఇక్కడ మంచి హాస్టల్ కూడా ఉంది. మీరు ఆలోచించుకుని చెప్పండి” వివరించాడు అక్కడి ప్రిన్సిపాల్.
ఇంటికి వచ్చిన దేవుడయ్య చుక్కతో ఆలోచించాడు.
తమ కొడుకు బాగా చదువుతున్నందుకు వారికి సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో కొడుకుని విడిచి ఉండాలంటే వారికి బాధగా కూడా ఉంది. కానీ ఆ బాధని దిగమింగి కొడుకును హాస్టల్లో చేర్పించారు. చిన్న దేవుడయ్య శ్రద్దగా చదువుతూమంచిపేరు తెచ్చుకున్నాడు.
ఇంటికి వచ్చిన చిన్నదేవుడయ్యను చూసిన చుక్క చాన్నాళ్లకు కొడుకుని చూసిన సంతోషంతో కన్నీరు పెట్టుకుంది.
అమ్మని చూడగానే చిన్నదేవుడయ్య చాలా సంతోషించాడు. ఇంతలో దేవుడయ్య పొలం నుండి వచ్చాడు. కొడుకును చూసిన సంతోషంలో “ఒరే చిన్నదేవుడయ్యా, నిన్ని సూసి శాన్నాళ్ళు అయిందిరా!” అన్నాడు.
అది విన్న చిన్నదేవుడయ్య మొహం మ్లానమైంది.
“నాన్నా! అమ్మా ఇక నుండి నా పేరు చిన్నదేవుడయ్య కాదు. దేవా మాత్రమే. ఇకనుండి మీరు కూడా నన్ను అలాగే పిలవాలి” అన్నాడు. ఆ మాటలు విన్న దేవుడయ్య ఏమి మాట్లాడక మిన్నకుండిపోయాడు. చుక్కమ్మ మాత్రం తన కొడుకుకు పట్నపు పోకడలు బాగా వంటబట్టాయని సంతోషించింది.
మరుసటి రోజు దేవా పొలానికి వెళుతున్న తండ్రిని ఆపాడు. తల్లిని పిలిచాడు. ఇద్దరినీ అక్కడ కూర్చోబెట్టాడు. మీతో మాట్లాడాలి అంటూ ఆగిపోయాడు. చెప్పడానికి సంశయిస్తున్న దేవాని చూస్తూ దేవుడయ్య “ఏటయిందిరా సెప్పు” అన్నాడు.
“నాన్నా, అమ్మా నేను చదివిన చదువుకి నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమెరికా కంపెనీ వారు మా కాలేజీలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను అమెరికా వెళ్ళబోతున్నాను” చెప్పాడు దేవా.
అది విని చుక్కమ్మ, దేవుడయ్య స్థాణువులా ఉండిపోయారు. తమ కొడుకుకు అమెరికాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషించాలో, తమను వదిలేసి దేశం కాని దేశం వెళ్తున్నందుకు బాధపడాలో వారికి అర్థం కాలేదు. కానీ అందరు తమ కొడుకుని “తమ ఊరి నుండి అమెరికా వెళ్తున్న మొట్టమొదటి వ్యక్తి దేవా” అని పొగుడుతుంటే వారి ఆనందానికి అవధులు లేవు.
తనకు గౌరమ్మ అవ్వ పెట్టిన నగలు, తన పేరుతో రాసిన మిద్దిల్లు కొడుకు అమెరికా ప్రయాణం కోసం అమ్మేసారు చుక్కమ్మ, దేవుడయ్య. “నాన్నా అమ్మా వెళ్ళొస్తాను. విమానం ఎక్కడానికి సమయం అయ్యింది” అన్నాడు దేవా.
తమ కొడుకు తమను వదిలి వెళ్ళిపోతున్నాడు అనే బాధ వారిని పిండేస్తోంది. కానీ, చేసేదేం లేక కొడుకును దగ్గరకు హత్తుకుంటూ “భద్రం రా నాయనా” అని మాత్రం అనగలిగాడు దేవుడయ్య. చుక్కమ్మకు కన్నీళ్లు తప్ప నోటమాట రావడం లేదు. వారిద్దరిని అలా వదిలేసి ముందుకు నడిచాడు దేవా.
దేవా ఎక్కిన విమానం తమ ఊరు మీద వెళుతుందేమో అని ఆకాశంలోకి చూడసాగారు వాళ్లిద్దరూ. దూరంగా ఎక్కడో చుక్కలా కనిపిస్తున్న విమానాన్ని చూసి వారు కార్చిన కన్నీటి చుక్కలు ఆకాశాన్ని కదిలించాయి. హోరున వాన మొదలైంది.
ఆరునెలలు గడిచాయి. అమెరికా వెళ్లిన దేవా మొదటిలో రెండుమూడు సార్లు తల్లితండ్రులకు ఉత్తరాలు పంపాడు. ఆ ఉత్తరాలను వేరేవాళ్లతో చదివించుకుని చుక్కమ్మ దేవుడయ్య సంబరపడ్డారు. క్రమంగా దేవా దగ్గరనుండి ఉత్తరాలు ఆగిపోయాయి.
దేవుడయ్య తన పొలంలో పనులు చేసుకుంటూనే వజ్రాలు వెతకడం మానలేదు. కానీ చుక్కమ్మ తన కొడుకును తలుచుకుంటూ మంచం పట్టింది. కొడుకు మీద దిగులు పెట్టుకున్న చుక్కమ్మను ఊరడిస్తూనే దేవుడయ్య లోలోపల బాధ పడేవాడు. చేసేదేం లేక పొలం పనులు చూసుకుంటూ వజ్రాలు వెతకడం చేసేవాడు.
ఒకరోజు తన పొలంలో పని చేసుకుంటున్న దేవుడయ్య వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు భీమప్ప. దేవుడయ్య దగ్గరకు వచ్చి వగరుస్తూ అలా నిలబడిపోయాడు. అతడిని చూసిన దేవుడయ్య ” ఏందిరా భీమా అట్టా వగరుస్తా ఉండావు? ఏటాయినాది?” కొంచం గాభరాగా అడిగాడు.
“అన్నా, మన సుక్కమ్మ వదిన, వదిన” అంటూ ఆగిపోయాడు. సుక్కకు ఏటయింది? అంటూ తన చేతిలో ఉన్న పలుగుపారను అక్కడే పడవేసి ఇంటికి పరుగు తీసాడు దేవుడయ్య.
ఇంట్లో మంచం మీద ఉన్న చుక్కమ్మ అప్పటికే ఎగశ్వాస తీస్తోంది. ఊరిజనం అంతా అక్కడే ఉన్నారు. దేవుడయ్య చుక్కమ్మను తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆమె గుండెల మీద చిన్నదేవుడయ్య ఫోటో. దేవుడయ్యను చూస్తూ చుక్కమ్మ శ్వాస ఆగిపోయింది. దేవుడయ్య రాల్చిన కన్నీటిచుక్కలు చుక్కమ్మ తెరిచిఉన్న కనుల మీద పడి జారిపోయి చిన్నదేవుడయ్య ఫోటోను తడిపేసాయి.
చుక్కమ్మ మరణం, కొడుకు దేశం విడిచి వెళ్లిపోవడంతో దేవుడయ్య మరల ఒంటరివాడయ్యాడు. తల్లి మరణించినా కూడా రాలేని కొడుకును తలుచుకుని దేవుడయ్య బాధ పడుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. పొలం పనులకు వెళ్లడం, వజ్రాలను క్రమం, తప్పకుండ వెతకడం. . ఇంటికి వచ్చి తనకు ఎవరో ఒకరు పంపించిన భోజనం తినడం, మరల ఉదయాన్నే పొలం వెళ్లడం — ఇలా దేవుడయ్య జీవితం సాగిపోతూ ఉంది.
ఒకనాడు ఉదయం ఊతకర్ర పట్టుకుని పొలానికి మెల్లిగా వెళ్తున్న దేవుడయ్యను చూసి మంత్రాల ఎల్లమ్మ కట్టమీద ఉన్న నారాయణ “చిన్నాయనా! డెబ్భై ఏళ్లప్పుడు కూడా కష్టపడతాండావు. నీకి వజ్రం చిక్కి మనూరిని బాగు సేయల్ల అనే ఆలోచన బాగుండాది. గాని ఈ వయసులో ఇంత కట్టం నీకి అవసరమా?” బాధగా ప్రశ్నించాడు నారాయణ.
“నువ్వే అంటివి గదరా మనూరిని బాగు సేయల్ల అని. నా పాణం పొయ్యేవరకు ఆ మాట పోదురా!” అని చెప్తూ ముందుకు నడిచాడు దేవుడయ్య.
తన పొలంలో వజ్రాలను వెతుకుతూ ఉండిపోయాడు దేవుడయ్య. సాయంత్రం సూరీడు పడమరపొద్దుకు వాలుతున్నాడు. పక్కపొలంలోని గంగన్న దేవుడయ్యను చూస్తూ, “పొద్దు గుంకింది. మోడాలు గూడా అయితాండాయి. ఇంటికి ఎల్లబారుదాం. రా పెద్దయ్య” అని పిలిచాడు.
“వస్తాలేప్పా నువ్వు పో!” అన్నాడు దేవుడయ్య. “భద్రంగా రా పెద్దయ్య” అంటూ ఇంటిదారి పట్టాడు గంగన్న.
పొలం అంతటా కలియతిరిగాడు దేవుడయ్య. పొలం గట్టు మీద ఉన్న చెట్లను ఆప్యాయంగా పలకరించాడు. తన తల్లిదండ్రులు పొలంలో పని చేయడం గుర్తొచ్చింది. వణుకుతున్న చేతులతో మట్టిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
అప్పటికే చీకటి కమ్ముకుంటోంది. తనపొలంలో వజ్రాల కోసం వెతకడం తనకు ఎంతో ఇష్టమైన పని అని మనసులో స్ఫురణకు వచ్చింది. ఎక్కడైనా ఒక వజ్రం తళుక్కుమని మెరవకపోతుందా అనుకుంటూ ముందుకు దృష్టి సారించాడు. అల్లంత దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది దేవుడయ్యకు.
అది వజ్రం అయ్యి ఉంటుందన్న ఆశ కొత్త ఉత్సాహాన్ని నింపింది. చేతిలో ఊతకర్ర లేదు. దాన్ని పొలం గట్టుమీదనే వదిలేసాను అనుకుంటూ ముందుకు అడుగులు వేసాడు.
అడుగులు తడబడుతున్నాయి. ఒళ్ళు తూలిపోతోంది. శక్తిని కూడగట్టుకుంటూ ముందుకు నడిచాడు దేవుడయ్య.
అది వజ్రం అనే నిర్దారణకు వచ్చాడు. వజ్రం దొరకడం అనే తన కోరిక ఇప్పటికి నెరవేరబోతోందని సంతోషించాడు. మెల్లిగా అడుగులు ముందుకు వేసాడు.
అక్కడ మెరుస్తున్నదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆశగా దాన్ని అటు ఇటు తిప్పి చూసాడు. అది వజ్రం కాదు. గాజుముక్క. దేవుడయ్యకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. చుట్టూ కలియచూసాడు. అప్పటికే చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. ఆ చీకట్లు ఒక్కసారిగా తనను చుట్టుముట్టినట్టు అనిపించింది దేవుడయ్యకు. అక్కడే కుప్పకూలిపోయాడు.
తెల్లవారింది. ఊరిలోని జనం అంతా దేవుడయ్య పొలం వద్దకు పరుగులు తీస్తున్నారు. రాత్రి దేవుడయ్య పొలం నుండి ఇంటికి చేరలేదనే వార్త వజ్రపురంలో ఒక్కసారిగా గుప్పుమని వ్యాపించింది. రాత్రి కుప్పకూలి పడిపోయిన దేవుడయ్య మరి లేవలేదు.
ఊరిజనం మొత్తం దేవుడయ్య చుట్టూ గుమికూడి ఉన్నారు. దేవుడయ్యను చూస్తుంటే వారికి కన్నీళ్లు ఆగడం లేదు. కొడుకుకు కబురు పెడదాం అన్నారు అక్కడున్న వారు. మరికొందరు సుక్కమ్మ పోయినప్పుడే వాడు రాలేదు. ఇప్పుడు కూడా రాడు. అన్నారు మరికొందరు.
ఊరిజనం అంతా తమలో తామే మాట్లాడుకుని అదే పొలంలో గొయ్యి తవ్వాలని నిర్ణయించారు. అందరి మనస్సులో తమ దేవుడయ్య లేడనే బాధ మెలిపెడుతోంది. కానీ జరగాల్సిన కార్యక్రమాన్ని అందరు సమిష్టిగా నిర్వహిస్తున్నారు.
ఇంతలో కారుమబ్బులు ఆకాశం నిండా అలుముకుంటున్నాయి. ఆరడుగుల గొయ్యిలో దేవుడయ్య శవాన్ని పెట్టాలని అనుకునే లోపే దేవుడయ్య చావును చూసి ఆకాశం కూడా భోరున వర్షించింది. హోరున వర్షం మొదలైంది. అక్కడున్న వారందరి కన్నీళ్లు ఆ వర్షంలో కలిసిపోతున్నాయి.
వర్షంలో తమ కన్నీళ్లతో అక్కడున్న వారందరి కళ్ళు మసకబారిఉన్నాయి. దేవుడయ్య శవం మీద వాననీళ్ళు కురవకుండా అక్కడున్నవారు తమ పై కండువాలను గొడుగులా పట్టుకుని ఉన్నారు. అరగంట తర్వాత ఆకాశం శాంతించింది.
అందరు ఒక్కసారిగా తేరుకున్నారు. మనసులో మోయలేని బాధతో, కారిపోతున్న కన్నీటితో దేవుడయ్య శవాన్ని లేపబోయేంతలో ఒక్కసారిగా ఉరుము, ఆపై మెరుపు. ఆ మెరుపులు తగ్గిన తర్వాత అక్కడున్న గుంపునుండి “ఆడ సూడండి!” ఎవరో అరిచారు. అందరు అటువైపుగా చూసారు. వాననీటితో ఆ గొయ్యి మొత్తం తడిసిపోయి ఉంది. భూమి అడుగు నుండి ఉబికివచ్చిందేమో.
అక్కడ ఆరడుగుల గొయ్యిలో తళుక్కుమంటూ మెరుస్తున్న నిమ్మకాయంత వజ్రం.
అది చూసిన అందరి హృదయాలు మరింత ద్రవించిపోయాయి. వజ్రం దొరకాలని తన జీవితమంతా వెతుకుతూ గడిపిన దేవుడయ్య పొలంలో కోరుకున్నట్టే ఇప్పుడు వజ్రం దొరికింది. కానీ, ఆ వజ్రాన్ని చూడటానికి దేవుడయ్య ప్రస్తుతం ప్రాణాలతో లేడు.
వజ్రం కన్నా విలువైన మనిషి. వజ్రం అంతకు మించిన విలువైన మనిషి మనసున్న దేవుడు లాంటి దేవుడయ్య పోయాక ఆ వజ్రంతో పనేమిటి? అన్నారు అక్కడున్న గుంపులో ఒకరు.
చనిపోవడానికి ముందు వజ్రాలను అన్వేషిస్తూ దేవుడయ్య చెప్పిన చివరిమాటలు గుర్తొచ్చాయి.
“నా పాణం ఇడిసిపోయినా నా పొలంలో వజ్రం చిక్కితే మనూరిని సొరగంలా సేయాల” అని దేవుడయ్య ఊరిజనంతో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అందరు కన్నీరు కారుస్తూ ఉండిపోయారు.
బరువెక్కిన హృదయాలతో ఆ గొయ్యిలో దేవుడయ్యను పడుకోబెట్టారు. ఆ వజ్రాన్ని దేవుడయ్య చేతిలో పెట్టి గుప్పిలి మూసారు. వజ్రం లాంటి దేవుడయ్యతో తో పాటు ఆ వజ్రం కూడా సమాధి అయిపోయింది.
ఆ సమాధి మీద ఊరుఊరంతా శ్రమపడి కాయకష్టంతో దేవుడయ్య చివరికోరికను తీర్చారు. ఊరిని అభివృద్ధి చేశారు. ఆ వజ్రపురానికి దేవుడయ్యవజ్రపురం అని పేరు పెట్టుకున్నారు.
5 Responses to “వజ్రం”
😘😘🥺🥺🥺🥺🥺🥺
మట్టి వాసన ని మీ పదాల్లో చొప్పించి చక్కటి కథ ఇచ్చారు సుధామయి గారు.
కథ చదువుతున్నప్పుడు అక్షరాల్లో కన్నీటి చుక్క ప్రాణం పోసుకుంటే…
ఆర్తి ఆలింగనం చేసుకుంటే..
పల్లె వాసన పలకరిస్తే,
చదువరుల కళ్ళు చెమ్మగిల్లితే..
అక్షరం ధన్యమవుతుంది.
కథ సార్థ” కథ” అవుతుంది.
అది వజ్రం కథ లా ఉంటుంది.
దేవుడయ్య దేవుడే అవుతాడు.
కథ ప్రారంభం పురిటినొప్పులు పడింది
కథ ముగింపు పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుంది.
ఇది కథ మాత్రమే కాదు…
వజ్రాల అన్వేషణలో మా పరిగణాల్లో నిత్యం జరిగే అన్వేషణ చరిత.
వజ్రం లాంటి కథ “వజ్రం”
…….శ్రీలేఖ
వజ్రం కోసం దేవుడయ్య పడిన ఆరాటం కదిలించింది.
అది అందుకునే సమయానికి అతను లేకపోవడం బాధ కలిగించింది.
ఊరు మంచిది కావడంతో అతని కలను నెరవేర్చింది, గౌరవంగా అతని పేరుని పెట్టుకుంది.
మంచి పల్లెటూరి కథను చదివించిన రచయిత్రికి హార్దిక అభినందనలు.
కథ చదువుతుంటే మనసు ఆర్ద్రత తో నిండిపోయింది సుధామయి గారు.చక్కని కథను అందించారు