బృందావనమది
“పెద్దలకు వందనం బృందావనం”
గృహనిర్మాణంలో వృద్ధులకు అదో కొత్త పథకం. నగరంలోకొచ్చి ఏడాది దాటింది. కానీ నాకు తెలియదు, అమెరికానుంచి వేణు ఫోన్ చేసి చెప్పేదాకా.
అదేమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అంతర్జాల విస్తృతితో ఎక్కడెక్కడి కబుర్లూ ఆసక్తి ఉన్నవారికి ఇట్టే తెలుస్తున్న రోజులివి. ఐతే వేణు నాకు ఫోన్ చేసిన కారణం విని షాక్ తిన్నాను.
“నువ్వోసారి అక్కడికెళ్లి ఇళ్లు చూసి రా! బాగుంటే, అమ్మానాన్నలకోసం తీసుకుందామని” అన్నాడు వేణు.
‘కాశ్మీర్ ఇండియాది’ అని ఐక్యరాజ్యసమితిలో చైనా అన్నట్లు ఎవరైనా చెబితే, కామోసని విని ఊరుకునే తత్వం నాది.
కానీ వేణు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో ఉంచబోతున్న విషయం, అదీ, వేణు స్వయంగా నాతో చెప్పడంతో షాక్ కొట్టదూ మరి!
ఏమనాలో తెలియక కాదు, ఏమీ అనడం ఇష్టం లేక సరేనని ఫోన్ పెట్టేశాను.
అక్కణ్ణించీ ‘వేణు ఇలాంటి నిర్ణయమెందుకు తీసుకున్నాడు?’ అని మనసులో ఒకటే మథన.
మనసులో వేణుని విశ్లేషించడం మొదలైంది.
వేణు శ్రావణకుమారుడేం కాదు. చిన్నప్పట్నించీ కూడా తలిదండ్రుల్ని పెద్దగా పట్టించుకున్నదీ లేదు. అలాంటివాడికిప్పుడు ఇలాంటి ఆలోచన వస్తే ఆశ్చర్యమేముంది? అనుకుందుకు లేదు. ఎందుకంటే వాడు ఇటీవల కూడా నాతో అన్నాడు, పెద్దయ్యేక కన్నవాళ్లని తన వద్దనే ఉంచుకుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని.
ఇండియాలో శ్రద్ధగా చదివాడు, అమెరికాని ఆకర్షించేందుకు. అమెరికా వెళ్లేక తనే అక్కడి ఆకర్షణలో పడి గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నాడు. మరి తన బాగుకోసం మాతృదేశాన్ని వదిలివెళ్లినవాడు తలిదండ్రుల్ని పట్టించుకుంటాడా అనడానికి లేదు. వాడక్కడికి వెళ్లిన ఏడాదిలోనే గ్రామంలో తను చదువుకున్న స్కూల్లో పేద విద్యార్థుల పైచదువులకి ఉపకారవేతనాలు ఏర్పాటు చేశాడు.
వేణు పెద్దవాళ్లు చెప్పిన తెలుగమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. రెండుసార్లు తలిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్లి, దగ్గరుండి అక్కడి విశేషాలు చూపించాడు. అదీ చంటప్పుడు తన పిల్లలకు అయినవాళ్ల సేవలకని అనుకుందుకులేదు. వాళ్లు వచ్చినప్పుడు, పిల్లల సేవలకని వేరే మనుషుల్ని పెట్టాడు. వేణు తలిదండ్రులకి వాళ్లమీదో కన్నేసుంచడం మినహా వేరే బాధ్యతల్లేవు!
వేణు అమెరికాలో, నేను ఇండియాలో. వాడికున్నంత డబ్బు నాకు లేదు.
ఈ తేడా తప్పితే మేమిద్దరం సమవుజ్జీలం. వాడి పిల్లలవీ నా పిల్లలకి లాగే ఎల్కేజీ, యూకేజీ వయసులు.
అమెరికాలో వాడుండే ఇల్లు సీతాదేవీ, రావణాసురుడూ ఒకే ఇంట్లో తిరుగుతున్నా ఏళ్లతరబడి ఒకరికంట ఒకరు పడకుండా మసలగలిగేటంత లంకంత కొంప. తలిదండ్రులొచ్చి వెళ్లేక “పిల్లలకి తలిదండ్రులకంటే తాతయ్య, నానమ్మల అవసరమే ఎక్కువని అర్థమయిందిరా! వాళ్లనిక్కడికి రప్పించుకుని, పిల్లలకి వాళ్లని అప్పగిస్తే నిశ్చింతగా బ్రతికేయొచ్చు” అని వాడు నాకు ఫోన్లో చెప్పాడు. ఆ మాటలు నాపై ఎంతలా ప్రభావం చూపాయంటే, నేనూ వాడికిలాగే చెయ్యాలనుకున్నాను.
అలాంటి వేణుకి ఇప్పుడు తలిదండ్రుల విషయంలో వృద్ధాశ్రమం ఆలోచన వచ్చిందంటే షాక్ కొట్టదూ మరి!
వర్తమానంలో దొరకని జవాబులకోసమేమో, మనసు గతంలోకి వెళ్లింది.
మా నాన్న పేరు గోవిందం. పేద కుటుంబంలో పుట్టాడు. ఎందుకూ కొరగానివాడిగా ముద్ర వేయించుకుని దూరపు బంధువు భైరవమూర్తి గారింట్లో చేరాడు. మూర్తిగారేం చెబితే అది తూచా తప్పకుండా చేస్తూ ఆయన అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయనే నాన్నకి పెళ్లి చేశాడు. అమ్మ పేరు రాధ.
ఆ ఇంట్లో నాన్న హోదా పెద్ద పాలేరు. అమ్మ ఇంటిపని చెయ్యడానికి కూడా సంకోచించని వంటమనిషి. వాళ్లకి జీతం లేదు. తిండి, బట్ట మూర్తిగారు చూసుకునేవారు. అంతకుమించి వాళ్లు అడిగేవారు కాదు.
వసారాలో పడుకునేవారు. బట్టలు దాచుకుందుకు చిన్న చెక్క బీరువా ఉండేది. అంతకుమించి స్వంతంగా సామాను లేదు.
విశేషమేమంటే, ఇతరులకి పరిచయం చేసేటప్పుడు మూర్తిగారు మావాళ్లని బంధువులనే చెప్పేవారు. ఇంట్లో మిగతా పనివాళ్లంతా మావాళ్లని తమతో సమమని అనుకోకుండా, ఆ ఇంటి బంధువుగానే గుర్తించేవారు. ఎటొచ్చీ హోదాలో మాత్రం మేమక్కడ పనివాళ్లమే!
నేనా ఇంట్లోనే పుట్టాను. బానిస పుత్రుణ్ణి కదా, నాకు నాలుగైదేళ్లు వచ్చేసరికి ఇంట్లోవాళ్లు నాకూ చిన్న చిన్న పనులు చెప్పేవారు. బాగా చేస్తే మెచ్చుకునేవారు. అందుకని ఇంటి పనులు నేర్చుకోవాలనీ, అడిగి మరీ ఆ ఇంటివాళ్ల పనులు చేయాలనీ మనసుగా ఉండేది.
‘సేవాగుణంలో వీడు కన్నవాళ్లని మించిపోయాడు’ అని మూర్తిగారింటివాళ్లు పొగుడుతుంటే, నాకు గొప్పగా అనిపించేది. ఉత్సాహంగా అమ్మకు చెప్పేవాణ్ణి.
“నాకు నీ భవిష్యత్తు తెలుస్తోంది. అది నీకు ఉత్సాహంగా ఉందన్నమాట!” అని అమ్మ పైట చెంగుతో కళ్లొత్తుకునేది.
అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పటికీ అర్థమయ్యేది కాదేమో, ఓ రోజు ఆ ఇంటికి చుట్టపుచూపుగా ప్రకాశంగారు వచ్చేదాకా.
ప్రకాశంగారు వేణు తండ్రి. ఆయనకి మూర్తిగారు మమ్మల్ని తమ బంధువులుగా పరిచయం చేశారు.
నేను ప్రకాశంగారి మెప్పు పొందాలనుకున్నాను. పరుగున ఆయన వద్దకెళ్లి, ఏదైనా పని చెప్పమనీ, చాలా బాగా చేస్తాననీ అన్నాను.
ఆయన ముచ్చటపడి, “వేలెడంత లేవు. నువ్వు పని చెయ్యడమేంట్రా! బాగా చదువుకో” అన్నారు.
“వాడికి చదువంటే ఆసక్తి లేదు. ఉన్నా చదివించే స్తోమత నాకు లేదు” అన్నాడు మూర్తిగారు ఆయనతో.
ప్రకాశంగారు వెంటనే, “మా ఇంట్లో వీడి వయసు పిల్లలున్నారు. వాళ్లతోబాటే చదువుకుంటాడు. నాతో పంపిస్తావా?” అన్నాడు.
మూర్తిగారు వెంటనే, “దాందేముంది? వాడికీ వాళ్లమ్మకీ ఇష్టమైతే సరే!” అన్నాడు.
ప్రకాశంగారు అమ్మ నడుగుతాడనుకున్నాను. కానీ ముందు నన్నే అడిగాడు.
అప్పట్లో నా ప్రపంచమంతా అమ్మే! అందుకని, “అమ్మ కూడా వస్తుందిగా!” అన్నాను.
ఆయన ఏదో బదులిచ్చాడు కానీ నాకు బోధపడలేదు, ‘మా ఇంట్లో చదువుకునేవాళ్లకే చోటుంది. అమ్మదిప్పుడు చదివే వయసు కాదు’ అన్న సారాంశం మాత్రం తెలిసింది.
తర్వాత ఇంట్లో చర్చలయ్యాయి. నా భవిష్యత్తు దృష్ట్యా, నన్ను ప్రకాశంగారితో పంపడం మంచిదని అంతా నిర్ణయించారు.
నాకు అమ్మనొదిలి వెళ్లాలని లేదు. అమ్మ నన్నొదిలి ఉండలేదు కాబట్టి తనొప్పుకోదని అనుకున్నాను. కానీ తనూ ఒప్పుకునేసరికి, బాగా కోపమొచ్చింది. ఆ కోపంతోనే ప్రకాశంగారితో వెళ్లిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. తీరా బయల్దేరే సమయం వచ్చినప్పుడు కోపం కూడా మర్చిపోయి పరుగున అమ్మవద్దకెళ్లి గట్టిగా పట్టేసుకున్నాను.
అప్పుడు అమ్మ ఏడ్చేసింది. నన్ను విడిపించుకుని లోపలికెళ్లిపోయింది. నేను అయిష్టంగానే ప్రకాశం గారింటికి వెళ్లాను.
నా జీవితంలో అదొక మంచి మలుపని గ్రహించడానికి కొంత కాలం పట్టింది.
ప్రకాశం గారిదో ఉమ్మడి కుటుంబం. ప్రకాశం గారి తండ్రి మాధవయ్యగారు, ఆయన భార్య సూరమ్మ ఆ ఇంటిపెద్దలు. ఆయనకి ఏడుగురు పిల్లలు. ముందు కూతురు. ఆమెకు పెళ్లయింది. భర్త ఇల్లరికానికొచ్చాడు. అల్లుడు కాబట్టి పెత్తనమే కానీ బాధ్యతలు లేవు. పెత్తనంకంటే బాధ్యతే ఎక్కువగా భరిస్తున్నది మాధవయ్యగారి పెద్దకొడుకు ప్రకాశంగారు. ఆయన భార్య భవానికి పెత్తనం ఉన్నా చెలాయించడానికి వీల్లేనంత ఇంటిపని.
ప్రకాశంగారి కిద్దరు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు.
ప్రకాశంగారికి ముగ్గురు పిల్లలు. ఆయన అక్కకి నలుగురు. ఆయన పెద్ద తమ్ముడు ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతుంటాడు. అందుకని అతడి ముగ్గురు పిల్లలూ కూడా ఉండేదిక్కడే! రెండో తమ్ముడికి పట్నంలో వ్యాపారం. తలిదండ్రుల్ని చూడకుండా ఉండలేనని నెలకి పది రోజులు ఇక్కడే ఉంటాడు. అందుకని అతడి ఇద్దరు పిల్లలూ ఇక్కడే ఉంటారు. మూడోవాడు వ్యవసాయంలో అన్నగారికి తోడు. అతడికి ఒక్కడే కొడుకు.
ఉన్న పిల్లలు చాలనట్లు ఆ ఇంట్లో ఆశ్రయం పొందే పేదపిల్లలు కూడా కొందరున్నారు. ఇప్పుడు వాళ్లతో నేనూ చేరాను. ఐతే వాళ్లలా కాకుండా నేనా ఇంటివాళ్లలో ఒకణ్ణైపోయాను. అందుకు కారణం ప్రకాశంగారి పెద్దబ్బాయి వేణు నా ఈడువాడు కావడం. నన్ను తోడబుట్టినవాడిలా ఆదరించడం. తనని ‘ఒరేయ్’ అనడం అలవాటయ్యేదాకా ఊరుకోకపోవడం.
నేను, వేణు ఊరి స్కూల్లో టెన్తు దాకా కలిసి చదివాం. ఎక్కువగా నేనే క్లాసులో ఫస్టు. వేణు క్లాసులో మొదటి పదిమందిలో ఉండేవాడు.
వేణు నా వయసు వాడే ఐనా పరిజ్ఞానంలో, లోకజ్ఞానంలో నేను వాడిముందు పసిబాలుణ్ణి. తను చెప్పేవి నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేవి. అప్పుడు నాకేవేవో అనుమానాలొచ్చి అడిగితే, వేణు విసుక్కునేవాడు కాదు. తెలిస్తే చెప్పేవాడు. లేకుంటే పుస్తకాలు చూసో, పెద్దవాళ్లనడిగో తెలుసుకుని చెప్పేవాడు. ఇన్నీ చేసి గొప్పలకి పోవాలనో, నన్ను చులకన చెయ్యాలనో చూసేవాడు కాదు. పైగా, ‘నీవి చాలా గొప్ప అనుమానాలు. వాటివల్ల నాకూ జ్ఞానం పెరుగుతోంది’ అని మెచ్చుకునేవాడు.
చిత్రమేమిటంటే వాడి జ్ఞానం, క్లాసులో రాంకులకి సరిపోయేది కాదు. క్లాసులో వాడి రాంకెప్పుడూ మూడుకి మించలేదు. నాది రెండుకి దిగువన పడలేదు. అందుకు వేణు చిన్నబుచ్చుకునేవాడు కాదు. ‘సబ్జక్ట్ అర్థం కావడం వేరు. గుర్తుంచుకోవడం వేరు. నువ్వు గుర్తుంచుకోవడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు. అర్థం చేసుకోవడంమీద దృష్టి పెట్టకపోతే పెద్ద క్లాసులకెళ్లేకొద్దీ చదువు కష్టమవుతుంది. జీవితంలో ఎదగాలంటే, అవగాహన చాలా ముఖ్యం’ అనేవాడు ఆరిందాగా. నాకది అసూయలా కాక స్నేహపూర్వకమైన సలహాలాగే అనిపించేది.
జీవితంలో ఎదగాలన్న ఆలోచన నాలో ప్రవేశించింది వేణు సాహచర్యంలోనే. మూర్తిగారింట్లోనే కొనసాగాలన్న ఒకప్పటి నా ఆలోచనకు సిగ్గేసేది. నా గతం వేణుకి తెలుసు. ఐనా నన్నెప్పుడూ అలుసుగా చూడలేదు.
టెన్తులోనూ నాకు వేణుకంటే ఎక్కువ మార్కులొచ్చాయి. అందుకు వేణుతో సహా అంతా నన్ను అభినందించారు.
ప్రకాశంగారు నన్ను వేణుతో సమంగా చదివిస్తానని మొదట్లోనే మాటిచ్చారు. అది నిలబెట్టుకున్నారు. ఇంటర్ కూడా అయ్యాక ఇద్దరం ఇంజనీరింగులో చేరాం. అప్పుడర్థమైంది గుర్తుంచుకోవడానికీ, అవగాహనకీ ఉన్న తేడా! వేణుకి నీటిలోని చేపపిల్లకి ఈత కొట్టడమంత తేలికగా ఉండే ఆ చదువు నాకు ప్రాణాంతకంగా అనిపించేది. వేణు చకచకా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తుంటే, నాకెప్పుడూ బ్యాక్‌లాగ్స్ ఉండేవి. వేణు సహకారం లేకపోతే, గట్టెక్కడం కష్టమే అయ్యేది.
“అమెరికా వెళ్లడం నా లక్ష్యం. అది సాధించాలన్న పట్టుదల నా మెదడుకి పదును పెట్టింది. నువ్వూ అలాంటి ఓ లక్ష్యం పెట్టుకో” అని వేణు తరచుగా నన్ను ప్రోత్సహించేవాడు.
ఐతే వేణు స్థితిగతులు వేరు. నావి వేరు. వాటికి తగ్గట్లే నా లక్ష్యమూ ఉండేది.
నాకంటే తక్కువ స్థితిలో, హోదాకు మించిన పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుని సాధించిన మహనీయులు చాలామందున్నారు. వారి స్థాయికి చేరుకోలేక పోయానంటే ఆ లోపం నాదే!
ఇంజనీరింగు నాలుగేళ్లలో మేమిద్దరం బాగా దగ్గరయ్యాం. వేణు నాతో తన కుటుంబం గురించి చాలా చెప్పేవాడు.
‘అమ్మ అమృతం. నాన్న విచిత్రం’ అనేది తను తరచుగా అనే మాట!
అమృతం అంటే అర్థమయ్యేది. కానీ విచిత్రం అంటే ఏమిటో స్పష్టంగా తెలిసేది కాదు.
వేణుకి పురాణజ్ఞానం కూడా ఎక్కువే! ‘మన దేశంలోని తండ్రుల పాత్రకు ఆదర్శం. మన పురాణాల్లోని కశ్యపుడు. ఆయన్ని ప్రజాపతి అని కూడా అంటారు. భూమ్మీద మనుషులందరికీ ఆయనే మూల పురుషుడు’ అన్నాడోసారి అతడు నాతో.
కశ్యపుడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామందే భార్యలున్నారు. అందరూ మహాపతివ్రతలు. ఆయన ద్వారా సంతానాన్ని పొందారు. ఆ సంతానంలో దేవతలున్నారు. వాళ్లు మంచిపనులు చేసేవారు. రాక్షసులున్నారు. వాళ్లు దుర్మార్గం పట్టేవారు. మహాత్ములున్నారు. వారు తమ ప్రతిభతో లోకారాధ్యులయ్యేవారు.
తన భార్యల గురించి కానీ, సంతానం గురించి కానీ కశ్యపుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన ఆసక్తి అంతా తపోదీక్షమీదే!
కశ్యపుడి భార్యల్లో వినత, కద్రువ అనేవాళ్లు తమలో తాము పందేలు వేసుకునేవారు. అందులో మోసాలకూ పాల్పడేవారు. అలా వినత కద్రువకు వేల సంవత్సరాలు దాసి అయింది. కశ్యపుడు ఆదేమనలేదు. దాస్యం విడిపించుకుందుకు వినత కొడుకు గరుత్మంతుడు పూనుకున్నాడే తప్ప, కశ్యపుడు కలగజేసుకోలేదు.
కశ్యపుడి మరో భార్య దితి దుర్ముహూర్తకాలంలో భర్త పొందు కోరింది. అందువల్ల దుష్టుడైన పుత్రుడు కలుగుతాడని తెలిసీ ఆయన కాదనలేదు. ఫలితంగా పుట్టిన హిరణ్యకశిపుడు లోకకంటకుడైతే, వారించే ప్రయత్నమూ చెయ్యలేదు. అలాగే అదితి అనే మరో భార్యయందు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వామనుడిగా పుట్టి, బలి చక్రవర్తిని పాతాళానికి పంపితే, అందులో ఆయన శిక్షణ, ప్రోత్సాహం ఉన్నాయనిపించదు.
“మా నాన్న ఓ కశ్యపుడు” అంటాడు వేణు.
ఉమ్మడి కుటుంబం బాధ్యతలు ప్రకాశంగారివి. కానీ ఆయన తనకితానుగా కుటుంబ భవిష్యత్తు గురించి ఏమాలోచించడు. కన్నవారేం చెబితే అది చేస్తాడు. అక్కలూ, తమ్ముళ్లూ, చెల్లెళ్లూ ఏమడిగితే అదిస్తాడు. మంచి మనసుతో బయటివాళ్లనీ ఆదుకుంటాడు కానీ, అందుకు సంబంధించిన ఆర్థిక పర్యవసానాలు ఆలోచించడు. ఐతే భార్యతో సహా ఇంట్లోవాళ్లేం చెప్పినా వింటాడు.
భవానిగారు తెలివైనది. స్వార్థం తక్కువ, త్యాగం ఎక్కువ. ఇంట్లో మిగతావాళ్లు ఆమె మాటకి విలువిస్తారు. లేకుంటే ఆ సంసారం ఎప్పుడో వీధిన పడేది.
ప్రకాశంగారు సాహితీప్రియుడు. పుస్తకాలు బాగా చదువుతాడు. చదివిన విశేషాల్ని ఆప్తులతో పంచుకోవాలనుకుంటాడు. ఆయనకు సంగీతమంటే ప్రాణం. ఆప్తులతో కలిసి ఆస్వాదించాలనుకుంటాడు. ఇలాంటివే ఆయనకింకా ఎన్నో సరదాలున్నాయి. అవేవీ కుటుంబపు ప్రగతికి ఉపయోగపడవు. అంత పెద్ద కుటుంబంలో అంతమంది పిల్లలతో, అవన్నీ ఎక్కడ సాగుతాయి?
ఇంటికి పెద్దకొడుకు కాబట్టి, ఆయన నొక్కిస్తే సరదాలు సాగేవేమో కానీ ఆయన తత్వం వేరు. మొహమాటస్థుడు. తన భావాలకు ఎదుటివారి స్పందన చూసి వెంటనే తగ్గిపోయే రకం.
ప్రకాశంగారు దేవుణ్ణెంతగా నమ్ముతారో తెలియదు కానీ, ఆయన భార్యకు దైవభక్తి ఎక్కువే. ఏడాదికొకసారైనా ఏదో ఒక దేవుడికి మొక్కుకుంటుంది. అదీ తనకోసం కాదు. కుటుంబం బాగు కోసమే! ఆమె మొక్కుకున్నందుకు ప్రకాశంగారు తెగ విసుక్కునేవారు. తప్పనిసరై ఆమెతో తీర్థయాత్రలకు వెళ్లేవారు. పిల్లలకు వాళ్లతో వెళ్లాలని సరదాగా ఉండేది. కానీ తీసుకెళ్లేవారు కాదు.
విసుక్కుంటూనే బయల్దేరిన ఆయన, విసుక్కుంటూనే తిరిగొచ్చేవారు. ఆ ట్రిప్పులో తాము పడ్డ అవస్థలన్నీ ఏకరువు పెట్టి, ఇంకోసారి ఇలాంటి మ్రొక్కు మ్రొక్కావంటే మాట దక్కదని భార్యని హెచ్చరించేవాడు.
“మీలాంటివారితో తీర్థయాత్రకెడితే, పుణ్యం రావడం కాదు, పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడయింది చాలు. మళ్లీ మ్రొక్కుకోవడం కూడాను” అని భవానిగారు కూడా విసుక్కునేది.
విశేషమేమంటే, భవానిగారు మ్రొక్కులకి వెంటనే సత్ఫలితాలు వచ్చేవి. మానవ ప్రయత్నం కూడా అందుక్కారణమని తెలిసినా, ఇంట్లో వాళ్లు తమ అవసరాలకి ఆమెనే మ్రొక్కమనేవారు. అత్తగారు సూరమ్మ కూడా, “భవానీ! నీకున్న నిర్మలమైన మనసు, చిత్తశుద్ధి నాకున్నాయని నమ్మకం లేదే!” అని మ్రొక్కుని ఆమె పైకే తరలించేవారు.
విసుక్కుంటూనే ప్రకాశంగారు ఆ మ్రొక్కు తీర్చడంలో భార్యకు సహకరించేవాడు.
“నాన్నని త్యాగమూర్తి అనుకోవాలో, నిష్పూచీ మనీషనుకోవాలో అర్థం కాదు. కశ్యపుడిలాగే ఆయనా ఓ విచిత్రం” అనేవాడు వేణు.
ఆయనకి వేణు ఎలా చదువుతున్నాడూ, చదివి ఏంచేస్తాడూ అన్న ధ్యాసే లేదు. వాడి భవిష్యత్తు గురించిన బెంగే లేదు. అభిరుచులు పంచుకుందుకు వాడూ ఓ సాధనమౌతాడా అని మాత్రం ఆశ పడేవాడు.
ఆయనమీద జాలేసి రెండు మూడు సార్లు ఆయన వినిపించిన సాహితీ విశేషాలు విన్నాట్ట వేణు. వినేవాళ్లుంటే సమయం తెలియదుట ఆయనకి. కానీ వేణుకి తన చదువే భవిష్యత్తు. అందుకని మధ్యలో త్రుంచేసేట్ట. అప్పుడాయన, “నీకు సాహిత్యం పట్ల ఆసక్తి లేదు. ఉంటే నీకూ సమయం తెలిసేది కాదు” అన్నాట్ట కొంచెం చిరాగ్గా.
ఆ అసంతృప్తి ఇంట్లో చాలామంది పట్ల ఉన్నదేమో, ఆయన తరచుగా చిరాగ్గా చిటపటలాడుతూ ఉండేవాడు. అలాంటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే ఆ చిటపటలూ ఉండేవి కావేమో! ఆ ఇంట్లో ఆయనకు సాగేది ఒక్క ఆ చిటపటల విషయంలోనే!
“పెద్దయ్యేక నాన్నని దగ్గరుంచుకుని, అప్పుడప్పుడైనా ఆయనకి కొంత సమయం కేటాయించాలని నా కోరిక” అనేవాడు వేణు. అప్పుడు నాకు వేణు మనసు కొంత అర్థమయింది. తండ్రి అంటే ఎలా ఉండాలో వేణుకి కొన్ని ఆశలున్నాయి. అవి ప్రకాశంగారివల్ల తీరడం లేదన్న అసంతృప్తి వాడికుంది. ఐతే ఆ అసంతృప్తి ద్వేషంగా కానీ, కనీసం విముఖతగా కానీ మారలేదు. వీలైనప్పుడు తండ్రి అభిరుచులకు న్యాయం చెయ్యాలన్నదే తన కోరిక.
వేణు శ్రావణకుమారుడు కాకపోవచ్చు కానీ, మంచి పుత్రుడు.
ఇప్పుడు మాధవయ్య, సూరమ్మగారు జీవించి లేరు. వ్యవసాయానికి కూడా పల్లెటూళ్లో ఉండక్కర్లేదు. అప్పుడప్పుడు వెళ్లి చూసొస్తే చాలు. ఐనా అలవాటుగా అక్కడే కొనసాగుతున్నారు ప్రకాశం దంపతులు. వాళ్లుంటే చాలు, ఎవరో ఒకరు నిత్యం అక్కడికొచ్చిపోతూనే ఉంటారు. ఓపిక తగ్గినా భవానిగారికి ఇంటి చాకిరీ తప్పడం లేదు.
“అమ్మవల్ల ఇప్పుడు మా ఇల్లొక యాత్రాస్థలమైపోయింది. వాళ్లని అక్కణ్ణించి తప్పించాలి. అందుకే అమెరికా రప్పిద్దామనుకుంటున్నాను. వాళ్లకీ, మాకూ ఉభయతారకంగా ఉంటుంది” అన్నాడు వేణు నాతో.
ఊరొదలడానికి ప్రకాశంగార్ని ఒప్పించడానికి చాలామంది కష్టపడ్డారు. మొత్తంమీద వాళ్లొప్పుకున్నారు.
ఆ తర్వాతేమయిందో మరి ఉన్నట్లుండి వేణుకి వృద్ధాశ్రమం ఆలోచన వచ్చింది.
వేణు చెప్పేడని ‘పెద్దలకు వందనం బృందావనం’ ఆఫీసుకి వెళ్లాను.
అది పెద్ద కాలనీ. గేటు పక్కనే రెండంతస్తుల భవనంలో ఆఫీసుంది.
మొత్తం వంద ఇళ్లు. అన్నీ రెండంతస్తులవి. కొనేవాళ్లు మొత్తం ఇల్లు కొనుక్కోవచ్చు. లేదా ఓ అంతస్తు కూడా కొనవచ్చు.
ఇళ్లలో ఫ్రిజ్, ఎసి, వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, ఫర్నిచర్ వగైరాలతో పాటు వెళ్లిన వెంటనే వంట చేసుకునేలా ఫర్నిష్డ్ కిచెన్. నీళ్లు, కరెంటు అన్నివేళలా లభించే ఏర్పాటుంది. పనిమనుషుల్ని కూడా ఆఫీసే పంపుతుంది.
కాలనీలో ఓ సూపర్ మార్కెట్, కాంటీన్, మందుల షాపు, బాంకు ఉన్నాయి. ఏం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికి తెప్పించుకోవచ్చు. స్వయంగా వెళ్లాలనుకునేవారికి మొబైల్ వాన్సు ఉన్నాయి. ఫోన్ చేస్తే ఇంటిముందుకు వస్తాయి.
ప్రతి రోజూ ప్రతి ఇంటినీ ఓ నర్సు సందర్శించి హెల్త్ చెకప్ చేస్తుంది. కాలనీలోనే ఇద్దరు డాక్టర్లతో చిన్న హాస్పిటలుంది.
ఒక మాటలో చెప్పాలంటే వృద్ధాప్యంలో ఒక మనిషి ఏయే సదుపాయాలు కోరుకుంటాడో, అవన్నీ అక్కడున్నాయి.
అయితే ఒకే ఒక్క షరతు. ఆ ఇళ్లు దంపతులకి మాత్రమే పరిమితం. ఇంటికి ఎవరొచ్చినా పగలే రావాలి. రాత్రికి వెళ్లిపోవాలి.
ఆ షరతు విని గతుక్కుమన్నాను. ఎందుకంటే, నిజం చెప్పొద్దూ, ఆ సదుపాయాలకోశం నాకే అక్కడికి మారిపోయి అమ్మానాన్నలని కూడా దగ్గరుంచుకోవాలనిపించింది. ఇంటి ఖరీదు, మెయింటెనెన్సు, నా తాహతుకి అందవని తెలిసినా.
అందితే మాత్రం? అమ్మా నాన్నా నావద్దకు వస్తారా?
అమ్మ అమృతం, నాన్న విచిత్రం అంటాడు వేణు. కానీ నాకు అమ్మా నాన్నా ఇద్దరూ విచిత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే..
ఇటీవలే స్వంతిల్లొకటి కాస్త విశాలమైనదే కట్టుకున్నాను. గృహప్రవేశానికి అమ్మ, నాన్న వచ్చారు. మాతో పది రోజులున్నారు. ఆ పది రోజులూ మా పిల్లలిద్దరూ వాళ్లకి బాగా చేరికయ్యారు. వాళ్లు వెళ్లిపోతారని తెలిసి, ‘నానమ్మా తాతయ్యా మనతోనన్నా ఉండాలి. లేదా మేము వాళ్లవద్దకెళ్లి ఉంటాం’ అని పిల్లలిద్దరూ కాస్త గట్టిగానే చెప్పారు. విశేషమేమంటే నా భార్య అనుపమ కూడా వాళ్లకి వంత పాడడం.
అనుపమకి అత్తమామలంటే విముఖత లేదు కానీ, వాళ్లుంటే మా ప్రైవసీకి భంగమని ఆమె బాధ.
నిజం చెప్పొద్దూ అది నిజమని నాకూ అనిపించింది. పెళ్లయినప్పట్నించీ మేము ఆఫీసు ఇచ్చిన క్వార్టర్సులో ఉంటున్నాం.
క్వార్టర్సు పెద్దవి. ఉండేది ఇద్దరం. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. మనసు విప్పి మనోహరంగా మాట్లాడుకునేవాళ్లం. మనసు తప్పి బద్ధశత్రువుల్లా కొట్లాడుకునేవాళ్లం. తర్వాత అవి తల్చుకుని చిన్నపిల్లల్లా నవ్వుకునేవాళ్లం. విడిగా సినిమాలు చూసింది లేదు. హొటళ్లకి వెళ్లింది లేదు. షాపింగు చేసింది లేదు. మాతోపాటు మా సరదాల్నీ, అవసరాల్నీ ఒకరితో ఒకరు ముడి వేసుకోవడంవల్ల మేము ఒకరికొకరు బోరు కొట్టే అవకాశమే లేదు.
ఇంటికెవరైనా వస్తే, వాళ్లతో ఎక్కువసేపు గడపాల్సొస్తే అప్పటికేం తెలిసేది కాదు. రాత్రయ్యేసరికి లభించే ఏకాంతంలో ఎన్నాళ్లుగానో ఒకరికొకరు దూరమైన అనుభూతి కలిగేది.
ఎంతో అవసరమైతే తప్ప తను పుట్టింటికి వెళ్లేది కాదంటే, మా గురించి ఏం చెప్పను?
అంకితభావముంటే దాంపత్యజీవితమంత మనోజ్ఞమైనది లేదని ఇద్దరికీ స్వానుభవం.
పిల్లలు పుట్టేక మా అనుబంధంలోకి వాళ్లు కూడా చొరబడ్డారు. కొంతకాలం బాగానే ఉంది కానీ, వాళ్లిప్పుడు పెద్దవాళ్లై, ఎల్కేజీ, యూకేజీ స్థాయికి వచ్చారు. మా ఏకాంతానికి వాళ్లే ప్రతిబంధకమౌతున్నారు.
ఏకాంతమంటే వాంఛ చల్లార్చుకోవడాకే కాదు.
ఏ క్షణంలో ఎవరు డిస్టర్బ్ చేస్తారో అన్న అదుము లేకుండా ముసిముసి నుంచి పకపక దాకా దారితీసే నవ్వుల జ్ఞాపకాలకూ ఏకాంతం అవసరం. అవధులు ఎరుగని, అరమరికలు లేని ఆలుమగల ప్రైవసీ. అదో దివ్యానుభూతి.
గృహప్రవేశానికి అమ్మానాన్నలు వచ్చినప్పుడు. పిల్లలు వాళ్లకి చేరిక ఐనప్పుడు. ఆ దివ్యానుభూతినిచ్చే ఏకాంతం మాకు లభించింది. అది కొంతకాలంగా మిస్సవుతున్నామన్న స్పృహ కలిగింది.
అమ్మానాన్నలు మాతో వచ్చి ఉండాలన్నది మా స్వార్థం. దానికి ప్రేమాభిమానాలు, భక్తి గౌరవాలు, బాధ్యతాయుతవ్యాకులాలూ వగైరాల రంగులు పులిమి వాళ్లని ఆహ్వానిస్తే, కుదరదు కాక కుదరదని నాన్న అన్నాడు. నాన్న ఇష్టమే తన ఇష్టమని అమ్మ అంది.
‘అమ్మ అమృతం, నాన్న విచిత్రం’ – అని వేణు ఎందుకన్నాడో కానీ, నాకు మాత్రం ఇద్దరూ విచిత్రంగానే అనిపించారు.
అనుపమకి చాలా కోపమొచ్చింది, “బానిస బ్రతుక్కి అలవాటు పడ్డారు. వాళ్లని కొడుకు స్వంతింట్లో దర్జాగా తలెత్తుకుని గౌరవప్రదంగా ఉండమంటున్నాం. బురద నచ్చినవారు పన్నీరు మెచ్చగలరా?” అంది వాళ్ల జవాబు విన్నాక.
ఆ వేమన పద్యం నాకొచ్చు. ఆమెకీ వచ్చని తెలుసు. మావాళ్లని పందులతో పోల్చిందనడంలో సందేహం లేదు. కానీ అత్తమామల్ని అలాగనడం లోని అనౌచిత్యం ఆమెకు తెలుసు. కానీ న్యూస్ ఛానెల్సు తరచు చూస్తుంటుందిగా. పవిత్రమైన శాసనసభలో, పవిత్రమైన ప్రమాణాలు చేసిన తదుపరి పవిత్రులైన మన నేతలు సాటివారిని కుక్క, పంది, గాడిద వంటి సభ్య పదాలతోనే కాక అసభ్య పదజాలంతోనూ అలంకరించడం చూసి, అదే సంస్కారమన్న భ్రాంతిలో ఉంది. యథా రాజా తథా ప్రజా.
ఎవరితో పోల్చిందీ అన్నది పక్కన పెడితే. మావాళ్లు బానిస బ్రతుక్కి అలవాటు పడ్డారన్నది అక్షరాలా నిజం.
తనకి నీడనిచ్చి ఆదుకున్న భైరవమూర్తిగారంటే నాన్నకి అదో అనుబంధం. విశ్వాసంకంటే ఎక్కువగా అంకితభావంతోనే ఆ ఇంటిని సేవిస్తున్నాడు. ఆ విషయం క్రమంగా మూర్తిగారూ గుర్తించాడు. ఇంట్లోవాళ్లు ఒకొక్కరుగా పల్లె వదిలి దూరంగా తరలిపోతుంటే, ఆయనకు నాన్న ఆత్మబంధువు కూడా అయ్యాడు. క్రమంగా ఆ ఇంట్లో ఆయన స్థానం మారింది.
మూర్తిగారికి ఆ ఊరితో అనుబంధం. అందుకని ఆయన ఊరొదలడు. నాన్నకి ఆయనతో అనుబంధం. అందుకని ఆయన మూర్తిగారి నొదలడు. అమ్మకి నాన్నతో అనుబంధం. అందుకని తను ఆయన్నొదలదు.
ఐతే నాకుద్యోగం వచ్చేక అమ్మ ఆలోచన మారింది. నాతో వచ్చి ఉండాలని మనసు పడేది.
“ఇక్కడెన్నాళ్లుంటేనేం, ఎంత చాకిరి చేస్తేనేం. ఇది మనిల్లూ కాదు. వీళ్లకి మనం సాటివాళ్లమూ కాదు. మనవాడితో ఉంటే, అదే మనకి గౌరవం” అని నాన్నకి నచ్చజెప్పాలని చూసింది. నాన్న ఒప్పుకోలేదు.
“ఆయనకి అర్థం కావడం లేదు. మూర్తిగారు మంచివాడే. ఆయనకి నాన్నంటే అభిమానమే. ఇప్పుడీ ఇంటికి నాన్నే ఇంచుమించు యజమానిలా ఉంటున్నాడంటే, అదాయన నమ్మకం. కానీ ఆయన పిల్లలు వేరు. నాన్నెక్కడ తనే నిజంగా ఈ ఇంటి యజమాని అనుకుంటాడేమోనని వాళ్ల అనుమానం. అందుకని వచ్చినప్పుడల్లా పని కట్టుకుని మా స్థానాన్ని గుర్తు చేస్తుంటారు. వాళ్ల మాటలు నాకైతే అవమానకరంగానే ఉంటాయి. కానీ నాన్నకి అలా అనిపించదు. ఐతే నా ప్రయత్నాలు నేను మానను. ఏదో రోజున ఆయనకి అర్థం కాకపోదు. అప్పుడు నీ దగ్గరకొస్తాం” అంది అమ్మ నాతో చాటుగా.
అది జరిగే పని కాదనుకున్నాను కానీ, నా పెళ్లైన ఏడాదికి అమ్మ ఆయన్ని నిజంగానే ఒప్పించగలిగింది. ముందు అమ్మని పంపి, కొన్నాళ్లయ్యేక తనొస్తానన్నాడు నాన్న.
కానీ అప్పటికి నేను, అనుపమ దాంపత్య జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం. మా మధ్యకు మరో వ్యక్తి రావడం మాకిబ్బంది అని అనుపమ అంటే నిజమే ననిపించింది. ఏవో కుంటి సాకులు చెప్పి వాళ్ల రాకని వాయిదా వేస్తూ వచ్చాను. ఈలోగా మూర్తిగారి భార్యకి జబ్బు చేసి, వైద్యానికి పట్నంలో కొడుకు వద్దకి వెళ్లారు. చికిత్సకోసం ఆమె కొన్నేళ్లపాటు అక్కడే ఉండాలన్నారు.
ఇక గ్రామంలో ఆస్తులన్నీ అమ్మేద్దామని పిల్లలన్నారు. మూర్తిగారొప్పుకోలేదు. తను బ్రతికుండగా ఆ ఆస్తులు అమ్మడానికి లేదన్నారు.
అంత పెద్దింట్లో, ఆస్తికి పెత్తందారుగా మా నాన్న ఉండడం మూర్తిగారి పిల్లలకు ఇష్టంలేదు. దాంతో ఆ విషయమై ఆయనకూ పిల్లలకూ పెద్ద రాద్ధాంతమైంది.
చివరికి మూర్తిగారు ఓ నిర్ణయానికొచ్చారు. తనకి అంతకాలం సేవలు చేసిన నాన్నకి మూడెకరాల పొలం, ఉండడానికి చిన్న డాబా ఇల్లు రాసిచ్చారు. ఐతే నాన్న బ్రతికున్నంతకాలం వాటిని అమ్మడానికి వీల్లేదని షరతు పెట్టారు. ఇక మూర్తిగారున్నంతకాలం ఆయన ఇంటికీ, పొలాలకూ నాన్నే సంరక్షకుడిగా ఉండాలి. తను పోయేక పిల్లల ఇష్టం.
పెద్ద వయసులోనే ఐతేనేం, మొత్తంమీద నాన్న ఓ ఇంటివాడూ, ఆస్తిపరుడూ అయ్యాడు.
నా గృహ ప్రవేశానికి అమ్మా నాన్నా వచ్చేవరకూ నా సుఖజీవనం కొనసాగడానికి వాళ్లెంత అవసరమో తెలియలేదు.
కానీ, వాళ్లు రామంటున్నారు. అప్పటికీ అమ్మకి నేను చెప్పాను, “ఇల్లూ పొలమూ ఉన్నా కూడా అక్కడున్నంతకాలం నాన్న గుర్తింపు బానిసగానే. అదీకాక మీరూ పెద్దవాళ్లౌతున్నారు. చాకిరీ చేసే వయసు దాటిపోయింది” అని. కానీ ఈసారి అమ్మ కూడా ఒప్పుకోలేదు.
అందుకే. అనుపమ ఎవరితో పోల్చిందీ అన్నది పక్కన పెడితే. మావాళ్లు బానిస బ్రతుక్కి అలవాటు పడ్డారన్నది అక్షరాలా నిజం.
వేణుకి ఫోన్ చేసి ‘పెద్దలకు వందనం బృందావనం’ విశేషాలు చెప్పాను.
“ఇవన్నీ వెబ్సైట్లో చూశాను. ఆ ఆఫీసు వాళ్లతో ఫోన్లో కూడా మాట్లాడేను. అన్నివిధాలా బాగుందనిపించాకనే నీకు ఫోన్ చేశాను. మనవాళ్లెవరైనా కూడా కళ్లారా చూస్తే బాగుంటుంది కదా!” అన్నాడు వేణు.
వేణు బాధ నాకర్థమైంది. వాడితో సహా పిల్లలెవరూ తలిదండ్రుల్ని దగ్గరుంచుకునేందుకు ఇష్టపడుతున్నట్లు లేదు. వృద్ధాశ్రమంలో చేర్చడానికి పిల్లి మెడలో ఎవరు గంట కడతారా అని చూస్తున్నారు. ఇంటికి పెద్దకొడుకుగా ఆ బాధ్యతో, అపవాదో వాడు తీసుకున్నాడు.
నేను గతి లేనివాడుగా ఉన్నప్పుడే నాకు తనతో సమాన హోదా ఇచ్చి గౌరవించిన ఉత్తమ సంస్కారం వాడిది. కన్నవారి వద్దకొచ్చేసరికి ఆ సంస్కారం ఏమైందో తెలియదు. కానీ, అందుకు వాణ్ణి నిష్ఠూరమాడాలనిపించలేదు సరికదా, ఓదార్చడం న్యాయమనిపించి, “నాకా కాలనీ ఎంతలా నచ్చిందంటే. నాకే వెళ్లి అక్కడుండాలనిపించింది. పిల్లల్నీ, అమ్మనీ, నాన్ననీ కూడా మాతో ఉండనిస్తే. అప్పో సప్పో చేసి నేనూ ఓ ఇల్లు తీసుకునేవాణ్ణి” అని చెప్పాను.
వేణు నవ్వాడు, “వాళ్లు మనతో ఉండాలనుకుంటే, ఎక్కడో ఎందుకురా. ఇప్పుడున్న ఇంట్లోనే ఉండొచ్చుగా. దాంపత్య జీవితంలో ప్రైవసీ ఎంత ముఖ్యమో. స్వానుభవంతో తెలుసుకున్నాను. పెళ్లైన ఏ జంటకైనా ప్రైవసీ అనేది జీవితాంతం ఉన్నా తనివితీరదు. అలాంటిది అమ్మా నాన్నా వాళ్ల జీవితంలో ప్రైవసీ అన్నది లేకుండా ఇన్నేళ్లు గడిపేశారు. మనుమలూ, మనుమరాళ్ల పేరుతో వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం నాకిష్టం లేకే ఈ ఏర్పాటు. మన సంప్రదాయంలో పెరిగిన మొహమాటంతో. ఈ వయసులో మాకు ప్రైవసీ ఏమిటని వాళ్లొప్పుకోరు. అందుకే చెడ్డ పేరు నేను తీసుకుని వాళ్లని బృందావనానికి పంపిస్తున్నాను” అన్నాడు.
ఊహించని ఈ వివరణకి ఉలిక్కిపడ్డాను.
అమ్మానాన్నల గురించి ఇలా నేనెప్పుడూ ఆలోచించలేదేమిటి?
ఒక్కసారిగా నా ప్రశ్నలెన్నింటికో జవాబులు స్ఫురిస్తున్నాయి.
ప్రకాశంగారి చిటపటలు, భవానిగారు మ్రొక్కుల పేరిట తీర్థయాత్రలు….
తామిద్దరు మాత్రమే ఉండే స్వంతిల్లు అమిరేక అమ్మ మాతో ఉండడానికి రాననడం.
ఔనూ, ఇంతకీ వేణు చివర్లో ఏమన్నాడూ, నేను వృద్ధాశ్రమమని అనుకుంటున్నదాన్ని వాడు ‘బృందావనం’ అని కదూ అన్నాడు?
రచయిత పరిచయం
“వసుంధర” కలంపేరుతో సంయుక్తంగా రచనలు చేసే వీరు దంపతులైన డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు(శాస్త్రవేత్త), రామలక్ష్మి (గృహిణి). దాదాపు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసి, అన్ని వయసుల తెలుగు పాఠకులకీ చిరపరిచితులు అయినవారు. వేలాది కథలు, నవలలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు రచించారు. కొన్ని రచనలు సినిమాలుగా వచ్చాయి. టీవీ, ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు విలువైన సలహాలు ఇస్తూ “సాహితీవైద్యం” అనే వినూత్నమైన శీర్షిక 1992 నించీ రచన మాసపత్రికలో నిర్వహిస్తున్నారు.
Leave a Reply