తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

పులి వన్నె మేక

తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
© Telugu Society of America

మారువేషంలో ఉన్న మహారాజులా మబ్బు ముసుగేసుకున్న సూర్యుడు వచ్చిందీ, లేనిదీ తెలియకుండా తచ్చాడుతున్నాడు.

ఆరోజు ఉదయం ఆటకి వెళ్లేసరికి అందరూ బైట నుంచుని ఉన్నారు. బండి సైడ్ స్టాండ్ వేసి వెనక తగిలించుకున్న షటిల్ బ్యాట్ ను సరిచేసుకుని, ఓ చేత్తో స్టీల్ బాటిల్ పట్టుకుని వాళ్ళదగ్గరకి వెళ్లి “ఏంటి? ఇవాళ ఆటకి సెలవా?” అడిగాను నవ్వుతూ. అందరూ నావైపు అదోలా చూసి “మీరే వెళ్లి చూడండి ఓసారి” అన్నారు. గేటు తెరిచి లోపలకి వెళ్లి చూసేలోగానే కంటి కంటే ముందు ముక్కుకి తెలిసిపోయింది అక్కడేం జరిగిందో. కోర్ట్ మధ్యలో ఓ కుక్క చచ్చి పడుంది. ముక్కుమూసుకుని బైటకొచ్చేసాను.

“ఇప్పుడెలా” అడిగాను అక్కడున్నమిగిలిన ముగ్గురినీ. “ఏముంది, మున్సిపాలిటీ వాళ్లకి ఫోన్ చెయ్యాలి. ఏ రెండు మూడు రోజులో పడుతుంది. అంతవరకూ వాకింగ్‌కి వెళ్ళటమే, పదండి” అంటూ విశ్వం గారు ముందు నడిచారు. అతని వెనకే శేఖర్ అనుసరించాడు.

మేమంతా ఏభై దాటిన వాళ్ళమే. ఆ కాలనీలో నాలుగు బిల్డింగ్‌ల మధ్య ఖాళీగా ఉన్న జాగాని ఎర్ర మట్టితో చదును చేసి రోజూ షటిల్ అడతాము. ఇంచుమించు అందరికీ ఇన్డోర్లో ఆడే స్థోమత ఉన్నా, పొద్దున్నే ఇక్కడ పీల్చే సహజమైన గాలి, చుట్టూ మేం పెంచిన మొక్కలు మమ్మల్ని వెళ్ళకుండా ఆపాయి.

“వెంకట్రావు రాలేదా” అడిగాను. “నిన్న శనివారం కదా! ఫుల్లుగా లాగించి పడుకుని ఉంటాడు” అన్నాడు శేఖర్ వెటకారంగా. ఎందుకో అతనికి వెంకట్రావు అంటే పడదు. అతనికే కాదు కోర్టులో ఎవరికీ అతను అంతగా నచ్చడు. నాకు తప్ప. రెంటికీ కారణాలు నాకూ స్పష్టంగా తెలీవు. కొత్తలో అతన్ని చేర్చుకోడానికి మా గ్రూప్‌లో ఎవరూ సముఖత చూపలేదు. వచ్చి నుంచుని చూసేవాడు. కొన్నాళ్ళు గమనించి, అతని ప్రొఫైల్ అంతగా నచ్చకపోయినా, నా బలవంతం మీద చేర్చుకున్నారు. తర్వాత అతను రోజూ నెట్ పట్టికెళ్ళటం, కోర్ట్ తడపటం లాంటి పనులు చేస్తూ ఉండటంతో ఊరుకున్నారు. నాకళ్ళు అతనికోసం రోడ్డు వైపు చూస్తున్నాయి.

అతని గురించి ఎప్పుడు ఆలోచించినా నాకు ఆశ్చర్యమే. సన్నగా రివటలా ఉంటాడు. మాలో తలకి రంగు వెయ్యనిది అతనొక్కడే. ఒక్క పూటే తింటాడు. అతని క్రాఫ్ అతనే చేసుకుంటాడు. డిగ్నిటీ అఫ్ వర్క్ తెలిసిన వాడు. మాలో ఎవరైనా లాంగ్ జర్నీ చెయ్యాలంటే ఆప్టింగ్ డ్రైవరుగా వస్తాడు. రాత్రికి తిరిగొచ్చాక ఎంతిచ్చినా సంతోషంగా తీసుకుంటాడు. ఫ్యామిలీ వివరాలు అడిగితే “నాకెవరూ లేరు సర్” అంటాడు. మేమంతా అతన్ని ‘నువ్వు’ , ‘ఏవోయ్’ అంటాం. అతను మాత్రం “సార్” అనే పిలుస్తాడు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలూ తీసుకోడు. ఏవయ్యా అంటే ‘నాకెందుకండీ, నాకంటే పేదోళ్ళు బోల్డు మందున్నారీ దేశంలో’ అంటాడు.

ఎప్పుడైనా షటిల్ కాక్ చెట్టుమీద పడితే మేమంతా తలెత్తి చూసేలోపు చెట్టెక్కి తెచ్చేస్తాడు. పక్కనే ఉన్న బిల్డింగ్‌లో ఉన్న కొబ్బరి చెట్టు నించి కాయ రాలిపడితే చేత్తో వలిచేసి తలా ముక్కా పెడతాడు. ఆటకీ ఆటకీ మధ్యలో బండి ఇంజిన్ ఆయిల్ మార్చేస్తాడు. సెల్ ఫోనయితే లోపల పార్టులు మొత్తం విప్పి బిగించేస్తాడు. బట్టలు కుడతాడు, టూ వీలర్ డ్రైవరుగా కూడా చేస్తాడు.

వీధి కుక్కలకి బిస్కట్లు తెచ్చి వేస్తాడు. అందరూ టిఫిన్లు తెప్పించుకుని తిన్నంత తిని మిగతాది కెలికి వదిలేస్తే, అదంతా ఇంటికి తీసుకెళతాడు. అందరూ ‘కక్కుర్తి గాడు’ అంటారు. అతని వెనుకే వెళ్ళిన రెండుమూడు సార్లు చూసిన నాకు మాత్రమే తెలుసు అతను ఎవరికి పంచుతున్నాడో. బట్టల మోజు లేదు. ఎవ్వరు పాత బట్టలిచ్చినా, పాత చెప్పులు ఇచ్చినా వేసుకుంటాడు. అసలు అతను ఏ పనికీ వెనకడుగేయ్యటం చూడలేదు ఇంతవరకూ. కనీసం ట్యూబ్ లైట్ స్టార్టర్ మార్చటం కూడా రాని నాకు అతన్ని చూస్తే ఎప్పుడూ వింతే. ఎవర్నో పట్టుకుని డిఫెన్సు మద్యం కొంటూ ఉంటాడు.

అంతలో లూనా మీద వెంకట్రావు వచ్చాడు. “ఏమైంది? అందరూ బైటే ఉన్నారు” అడిగాడు.

“మడిసి మడిసికీ చెప్పలేం కానీ నడు హెల్త్ ఎరీనా దగ్గర వాకింగ్ చేద్దారి” అంటూ నడిచారు విశ్వం. ఎవర్నీ అడక్కుండానే లోపలికి వెళ్ళొచ్చి “అరెరె పాపం చూడు కుక్క చచ్చి పోయింది. ఎవరో కర్ర పెట్టి కొట్టినట్టున్నారు” అంటూ ఇంచుమించు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు.

“రావయ్యా, ఇప్పుడు దానికి సంతాపం ప్రకటించి మౌనం పాటించమంటావా” అంటూ విశ్వం గారు శేఖర్ని లాక్కుని వెళ్ళసాగారు.

“ఉండండి సర్, అలా వదిలేసి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవదు కదా” అన్నాడు వెంకట్రావు చుట్టూ దేనికోసమో వెతుకుతూ.

“లేకపోతే మమ్మల్ని కానీ ఎత్తి అవతల పారేయమంటావా?” విసుక్కున్నారు రాజుగారు.

“ఏం అక్కర్లేదు. మీరంతా ఒక్క ఐదు నిమిషాలు ఇక్కడే వెయిట్ చెయ్యండి. నేను పిలిచాక రండి చాలు” అంటూ లోపలికెళ్ళాడు వెంకట్రావు.

అతనేం చేస్తాడో అని ఉత్సుకతతో అతని వెనుకే వెళ్లాను. రెండు చేతులతో చచ్చిన కుక్క కాళ్ళు పట్టుకుని పైకి లేపి దూరంగా తీసుకెళ్ళి కింద పెట్టి, అక్కడే ఉన్న ఓ పుల్లముక్కతో గొయ్య తవ్వి కుక్కని అందులో పూడ్చి, పక్కనే ఉన్న చిన్న వేప మొక్క ని వేర్లుతో జాగ్రత్తగా పెకిలించి తెచ్చి కుక్కని కప్పెట్టిన చోట పాతి చుట్టూ గొప్పు తవ్వి ఓ చెంబుడు నీళ్ళతో అందులోనే చెయ్యి కడుక్కుని వచ్చి, కోర్ట్ మొత్తం రెండు బకెట్ల నీళ్ళతో తడిపి, నెట్ కట్టి అందరినీ పిలిచాడు. అందరూ ఊపిరి పీల్చుకుని ఆడుకున్నాం. మధ్యలో శేఖర్ “ఇంతకు ముందు నువ్వు స్మశానాల్లోనూ, మార్చురీలోనూ పనిచేసావేటోయ్” అంటూ జోకులేసాడు.

దానికి వెంకట్రావు నవ్వి “శవాన్ని మోస్తే పుణ్యం సర్. మనది మనం ఎలాగూ మోసుకోలేం. ఎవరో ఒకరిది మోస్తేనే కదా మనది ఇంకొకరు మోస్తారని ఆశించే హక్కొస్తుంది” అన్నాడు.

“ఏటివోయ్ ఈనెల ఎన్ని పాలసీలు కట్టించావ్, ఎంత కమిషన్ కొట్టావు?” మాట మారుస్తూ శేఖర్ నా వైపు తిరిగాడు. నవ్వి ఊరుకున్నాను.

అంతలో వెంకట్రావు “నాకో అనుమానం సర్, మీరు అస్సలు మాట్లాడరు కదా, పాలసీలు ఎలా కట్టిస్తారు సర్“ అడిగాడు. మళ్ళీ నవ్వి ఊరుకున్నాను.

“ఆయన అరనవ్వు నవ్వితే చాలు ఆరు పాలసీలు జాయిగా అయే వత్తాయి కానీ కబుర్లాపి ఆటకి రండేహే” అంటూ కసిరారు రాజుగారు.


“సర్ రేపు నేను ఆటకి రాను. హైదరాబాద్ క్యాంపు ఉంది” అన్నాను బ్యాటు బ్యాగ్‌లో సర్దేసి మిగిలిన నీళ్ళు చెమటతో తడిసిన మొహం మీద పోసుకుంటూ. నా భార్య కూతురు గౌహతిలోఉంటారు. ఇక్కడ నేనొక్కడినే.

“అవునా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు?” అడిగారు రాజు గారు. కనీసం నలుగురు లేకపోతే ఆట నడవదన్న ఇబ్బందితో.

“రేపు నైట్ ఫ్లైటుకి సర్. వచ్చేటప్పటికి పదకొండు అవుతుంది. పొద్దున్నే లేవగలిగితే ఎల్లుండి వస్తాను. లేదంటే బుధవారమే”

“రాత్రి ఎయిర్పోర్ట్ నించి ఇంటికి ఎలా వస్తారు? ఆ టైంలోటాక్సీ లు దొరకవు కదా?”

“అదే చూస్తున్నాను సర్. ఏ ఆటోనో దొరక్కపోదు”

“నన్ను రమ్మంటే నేనొస్తాను” అన్నారు రాజుగారు. ఎందుకో అతనికి నేనంటే అభిమానం. వెంకట్రావు తప్ప మిగిలిన వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు.

“అయ్యో మీరు పెద్దవారు అంతరాత్రి వేళ ఎందుకు సర్ మీకిబ్బంది” అన్నాను మొహమాటంగా.

“పోనీ ఓ పని చెయ్యండి. నా కారిస్తాను. మన వెంకట్రావుని రమ్మనండి” అన్నారు రాజుగారు.

“ఓకే సర్, నేను వస్తాను” అన్నాడు వెంటనే వెంకట్రావు.

“సరే సర్. థాంక్ యు” అన్నాను సంతోషంగా. గేటు తాళం వేసేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం.


సోమవారం రాత్రి ఫ్లైట్ వచ్చేటప్పటికి పన్నెండు దాటిపోయింది. ల్యాండ్ అవగానే సెల్ ఆన్ చేసి చూసాను. వెంకట్రావు మేసేజ్. ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాడని. లగేజ్ కలెక్ట్ చేసుకుని బైటకొచ్చి చూస్తే అరైవల్ దగ్గర రెడీగా ఉన్నాడు. నా చేతిలో బ్యాగ్ అందుకోబోయాడు. సున్నితంగా వారించి డిక్కీలోపెట్టాను. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కారు నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు.

“పోర్ట్ రోడ్‌లో వెళ్దాం సర్” అన్నాడు.

“ఎందుకు ఈ టైంలో ఎన్ .ఏ .డి రూట్ కుడా ఖాళీగానే ఉంటుందిగా” అన్నాను.

“ఊరికినే సర్” అంటూ నసిగాడు. “సరే సరే నీ ఇష్టం” అన్నాను వెనక్కి వాలి.

కారు షీలా నగర్ జంక్షన్ దగ్గరకి వచ్చేసరికి లెఫ్ట్‌కి తీసి ఆపాడు వెంకట్రావు.

“ఏమైంది” అడిగాను.

“అది, సర్, జంక్షన్లో పోలీస్ పేట్రోలింగ్ వేన్ ఉంది” అన్నాడు కంగారుగా.

“ఉంటే?” అన్నాను ఆశ్చర్యంగా.

“సారీ సర్ , మిమ్మల్ని పిక్ అప్ చేసుకోడానికి వస్తూ కారు ఉందికదా అని మా ఫ్రెండ్ దగ్గర కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేసుకున్నాను. పోలీసులు చూస్తే ఇబ్బంది” అన్నాడు ఇబ్బందిగా.

“ఓహ్ అదా , ఎన్ని బాటిల్స్ ? ఎక్కడ పెట్టావు?” అడిగాను.

కొంచెం నసిగి, “ఆరు సర్, డిక్కీలో స్టెఫినీ లేదు ఆ ప్లేస్లో పెట్టాను” అన్నాడు బెరుగ్గా నవ్వుతూ.

నేను ఏదో చెప్పేలోపే ఇంతలో పేట్రోలింగ్ జీప్ రానే వచ్చింది. అందులోంచి ఓ కానిస్టేబుల్ దిగి, వెంకట్రావు వైపు వచ్చి “ఈ టైములో ఎక్కడినించి, ఓ సారి డిక్కీ ఓపెన్ చెయ్యి” అన్నాడు. ఎందుకో వెంకట్రావు ని ఎవరు చూసినా ‘నువ్వు’ అనే సంబోధిస్తారు.

వెంకట్రావు దిగి డిక్కీ దగ్గరకి వెళ్లి నసుగుతూ ఏదో చెప్పబోయాడు. కానిస్టేబుల్ బలవంతాన డిక్కీ ఓపెన్ చేయ్యబోతూ ఎందుకో నావైపు వచ్చి గ్లాస్ డోర్ మీద తట్టాడు. నేను నెమ్మదిగా అద్దం దించాను. చీకట్లో ఒకరికొకరం కనబడటం లేదు. ఇంతలో వెంకట్రావు డిక్కీ మూసేసి పరిగెత్తుకుని ముందుకొచ్చి,

“సర్, ఇందులో ఆయనకేం సంబంధం లేదు సర్. ఆ బాటిల్స్ నావి” అన్నాడు. నేను కారులో కర్టెసీ లైట్ ఆన్ చేసాను. కానిస్టేబుల్ ఒంగుని నన్ను చూసి ఒక్కసారిగా స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసాడు. నేను తిరిగి విష్ చేసి చేత్తో సైగ చేసాను. అంతే! అతను మరోసారి సెల్యూట్ చేసి మేం వెళ్ళేవరకూ అటెన్షన్‌లో ఉండిపోయాడు.

వెంకట్రావు తేరుకోడానికి దాదాపు పది నిమిషాలు పట్టింది. కారు పోర్ట్ రోడ్ చేరుకుంది. రిఫైనరీ దాటుతూ ఉండగా “మీరు డిపార్టుమెంటు అని ఎప్పుడూ చెప్పలేదు సర్” అన్నాడు కొద్దిగా అక్కసు మరికొద్దిగా సంతోషం జతగా. “అబ్బే అదేం లేదు వెంకట్రావు, వాళ్ళ ఆఫీస్‌లో మీటింగులకి వెళ్ళినప్పుడు ఓ రెండు మూడు సార్లు నన్ను చూసి ఉంటాడు అంతే” అన్నాను తేలిగ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ.

“అంతే లెండి సర్, లేకపోతే మీరు నాతో అబద్దం చెప్పరుగా” అన్నాడు పల్చగా మెరుస్తున్న నా చెంపలకేసి, నా ‘హై అండ్ టైట్’ హెయిర్ కట్ కేసి చూస్తూ.

నా చూపులు చీకట్లో దాక్కున్నాయి. నా మౌనం నాకే ఇబ్బందిగా ఉంది.

“అయినా అన్నేసి బాటిల్స్ ఏం చేసుకుంటావు వెంకట్రావు? అతను కొంచెం స్ట్రిక్ట్ అయ్యుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను? ఈ టైంలోఇలాంటి విషయానికి సిఫారుసు కోసం ఫోన్ చేస్తే ఏం బావుంటుంది” అన్నాను కొంచెం విసుగ్గా మాట మారుస్తూ. అతని మీద ఆ మాత్రం కూడా విసుక్కోవటం నాకు అదే ప్రధమం.

దానికతను “కొంతమంది ఉంటారు సర్. వాళ్ళ సేవకి మనం ఎంతిచ్చినా తక్కువే. మనం పారేసే చెత్త తీసేవాళ్ళు, డ్రైనేజి పొంగిపోతే క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళు రోజూ తాగక తప్పదు. డబ్బు సరిపోక మరీ చీప్ లిక్కర్ తాగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తాగటం తప్పు అని చెప్పటం ఓ పద్దతి, ఇలా చవుకలో ఓ నాణ్యమైన బాటిల్ కొనివ్వటం మరో పద్దతి. నాకు నచ్చిన పద్దతిలో నేను హెల్ప్ చేస్తా. మీరు ఉండగా ఇలాంటి పని చెయ్యటం తప్పే. సారీ సర్” అన్నాడు వెంకట్రావు సిన్సియర్గా.

మరోసారి అతన్ని చూసి ఆశ్చర్యపోవటం తప్ప నేనేం మాట్లాడలేకపోయాను.

కారు ఫ్లై ఓవర్ దిగి మరో ప్లాంట్ దాటుతోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అర కిలోమీటర్ మేర రోడ్డంతా పార్కింగ్ టైల్స్ వెయ్యటం మూలానా వళ్ళంతా అదురుతోంది. అంతలో గుండె కూడా అదిరేలా ఎడం పక్క చీకటి పొదల్లోంచి ఓ నలుగురు సాయుధులై వచ్చి కారుకి అడ్డంగా నిలబడ్డారు. కారు ఆగిన వెంటనే నా వైపు తుపాకీలు గురిపెట్టి డోర్ తీసి నన్ను దిగమన్నారు. ఆ వెన్నెల రాత్రిలో వాళ్ళు వేసుకున్న ముదురు రంగు డ్రెస్ రంగు మరింత ముదురుగా ఉంది.

నాకు విషయం అర్ధమైంది. నాలాంటి చిన్న ఉద్యోగస్తులకోసం ఇదంతా జరగదు. నిజానికి ఈరోజు మా బాస్ కూడా రావాలి. అందుకే నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు. ఆఖరి నిమిషంలో ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఆ విషయం వాళ్లకి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు విషయం తెలిసి ఎలాగూ రిస్క్ తీసుకున్నాము కదా అని నన్ను ఎత్తుకెళ్ళొచ్చు. చంపరు కానీ కనీసం ఓ పది పదిహేను రోజులు తిప్పుతారు. అది చాలు మందులతో మేనేజ్ చేస్తున్న నా సి .కె .డి డయాలసిస్‌కి చేరడానికి. ఏం చెయ్యలేక వాళ్ళు చెప్పినట్టే తలవెనుక చేతులు పెట్టుకుని రోడ్డుమీద మోకాళ్లమీద నిలబడ్డాను. నా భార్యా, కూతురు గుర్తొచ్చారు. ముఖ్యంగా నా కూతురు. ఈ పదిరోజులూ వాళ్ళు పడే బాధ గుర్తొచ్చింది.

ఇంతలో డ్రైవింగ్ సీట్ లోంచి వెంకట్రావు దిగాడు. మావైపు పరిగెత్తుకుని వచ్చాడు. వాళ్ళలో నాయకుడిలా ఉన్న అతన్ని వెనకనించి తట్టి పిలిచాడు. అప్పటివరకూ నావైపే గురిపెట్టి చూస్తున్న అతను వెనక్కి తిరిగి హై మాస్ట్ నియాన్ లైటింగ్‌లో వెంకట్రావుని చూసి నవ్వి పలకరించాడు. వెంకట్రావు కూడా అతన్ని పలకరించి, అతనితో ఓ ఐదు నిమిషాలు ఏదో మాట్లాడి నన్ను లేపి తీసుకొచ్చి కార్లో కుర్చోపెట్టాడు. నేను అటు తిరిగి చూసేటప్పటికి వాళ్ళంతా చీకట్లో కలిసిపోయారు.

షాక్‌లో నేనేమీ మాట్లాడలేదు. వెంకట్రావు కూడా మౌనంగానే ఉన్నాడు. ఇంటిదగ్గర నన్ను దింపి, “కారు రేపు రాజుగారికి మీరే ఇచ్చేయండి సర్” అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు.


ఆ తర్వాత ఓ వారం రోజులు నేను మనిషిని కాలేక పోయాను. ఇదేమీ నా భార్యకి కుడా చెప్పలేదు. మరుసటి వారం ఉదయమే కోర్టుకి వెళ్లాను. బైట వెంకట్రావు లూనా లేదు. లోపలకెళ్తే ఆట జరగటం లేదు. అంతా సీరియస్ డిస్కషన్‌లో ఉన్నారు.

“నేను ముందే చెప్పాను. ఎవరో తెలీకుండా జాయిన్ చేసుకోవద్దని. మీరెవ్వరూ ఇనలేదు. ఆరోజు చచ్చిన కుక్కని చేత్తో తీసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆడు ‘మేక వన్నె పులి’ అని. మీరే ఎగేసుకుని కలుపుకున్నారు. ఇదిగో ఈయన మరీను, ఎప్పుడైనా పొమ్మందాం అంటే అడ్డుపడిపోయేవాడు. మరి ఈయన పాలసీలకి కస్టమర్లని పట్టుకొచ్చేవాడేమో. ఇప్పుడు చావండి ఎలా చస్తారో. పోలీసులొచ్చి మనల్ని ఎంక్వయిరీ చెయ్యకుండా వదలరు” అంటూ రొప్పుతున్నాడు శేఖర్ నాకేసి కోపంగా చూస్తూ.

నేనేమీ మాట్లాడకపోవటంతో రాజు గారే నెమ్మదిగా చెప్పారు.

“వెంకట్రావు ఎవరికో సానుభూతిపరుడంట. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తే తీసుకెళ్ళారంట. ఈరోజు పేపర్ లో వేసారు”

కాసేపు చర్చ తర్వాత వాళ్ళు ఆటలో పడిపోయారు. నేను తర్వాత ఆడతానని కూర్చున్నాను. నా మనసంతా అదోలా అయిపోయింది. పాపం వెంకట్రావు గురించి పూర్తిగా తెలియదు వీళ్లకి. అతను ‘పులి వన్నె మేక’ అని నాకు మాత్రమే తెలుసు. మరి ‘మేక వన్నె పులి’ ఎవరు ?

దూరంగా వెంకట్రావు నాటిన వేపమొక్క గాలికి అమాయకంగా ఊగుతోంది. నాకు మాత్రం అది నాలుక బైటికి చాచిన అమ్మోరులా అనిపించి భయమేసింది.

అంతలో నా ఫోనుకి మేసేజి వచ్చినట్టు శబ్దం వచ్చింది. చూస్తే డిపార్టుమెంటు నుంచి క్యాష్ రివార్డ్ నా ఎకౌంటులో పడినట్టు బ్యాంకు మేసేజి.

రచయిత పరిచయం

ఉమా మహేష్ ఆచాళ్ళ

ఉమా మహేష్ ఆచాళ్ళ

ఉమా మహేష్ ఆచాళ్ళ గారు 27 ఏళ్ళుగా విశాఖపట్నం కస్టమ్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. 2016 డిసెంబరునుండి ఇప్పటివరకూ అన్ని ప్రముఖ పత్రికల్లో దాదాపు 40 కథలు ప్రచురించారు. వీటిలో 21 కథలతో “సంఘే శక్తి కలియుగే” అనే కథా సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ఇటీవలే విడుదలైంది. అనేక కథలకు బహుమతులు లభించాయి.

13 Responses to “పులి వన్నె మేక”

  1. ఉమా మహేష్ ఆచాళ్ళ

    నా కథకి బహుమతి ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు తెల్సా బృందానికి కృతజ్ఞతలు.
    ఉమా మహేష్ ఆచాళ్ళ

    Reply
  2. Togaram Ananda Rao

    రచయిత కథలు చాలా చదివాను ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా వ్రాసి ప్రతి కథలోను తన ముద్రను వేస్తుంటారు …….ఈ కథ కూడా అంతె నభూతో నభవిష్యతి ……రచయితకు, ప్రచురించిన ముద్రణ సంస్దకు వందనాలు

    Reply
  3. Siva Kumar Panchadarla

    కథ, కథనం రెండూ బావున్నాయి.. ఒకరిది ఉద్యోగ ధర్మం మరొకరిది సమాజం పైన భాద్యత.. ఇందులో ఎవరిదీ తప్పు అనలేము..

    ఒకవేళ మోసం చేసినా! .. ఈ రోజుల్లో మోసం సమాజంలో రోజూ వారీ కార్యక్రమం అయిపోయింది.

    మంచి కథకు జరిగిన సన్మానం..
    ఆచాళ్ళ ఉమా మహేష్ గారి కి నా హృదయపూర్వక అభినందనలు 🎉

    Reply
  4. Dokkara Harikrishna

    వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన ఒక నిబద్ధత గల ఆఫీసర్ కనిపించారు మీ కథ లో ….
    అలాగే మన ఇగో లతో చుట్టూ జరిగే సంఘటనలను పట్టనట్లుండే
    మామూలు మనుషులు కూడా ఉన్నారు… మీ కథని చదివి మనమెంత దిగజారి ఈ సమాజం లో బతుకుతున్నామో తెలుస్తుంది… కథ చిన్నదైనా చదవాలనిపించే కథ

    Reply
  5. పురాణం శ్రీధర్

    చాలా బావుంది 👏👏👏
    ఓ హెన్రీ కథలు చదివేటప్పుడు కలిగిన అనుభూతి కలిగింది. అభినందనలు💐

    Reply
  6. డా. మనోహర్ కోటకొండ

    చాలా చిక్కనైన కథ.
    అడుగడుగునా మనసు ఉన్నవాడి గొప్పతనం తెలుస్తూనే ఉంటుంది. హీరో గంభీరమైన ప్రవర్తన గొప్పగా ఉంది.
    ఇంత చిక్కని సన్నివేశాలు చకచకా చదివించేసాయి .
    ఎక్కడ వర్ణనల జోలికి వెళ్లకుండా అత్యద్భుతంగా కథను నడిపిన రచయితకు అభినందనలు.
    మబ్బుల్లోని సూర్యుడు ఉన్న మహారాజు లాగా పోలిక చెప్పడం చాలా బాగుంది.. ఈ రచయిత వర్ణనలోను, ఊహకందనిపోలికలు చెప్పడంలోనూ సామ్రాట్ .
    చివర సన్నివేశంలో మనకు షాక్ తగులుతుంది.

    ఒక సవరణ ఏంటంటే ముగింపులో ఉన్న రెండు పేరాగ్రాఫ్లు అటు ఇటు మారాలి.
    అప్పుడే వేపాకుల అమ్మోరు లాగా భయపెట్టేది.
    రచయితకు అభినందనలు శుభాకాంక్షలు.

    Reply
  7. Dondapati Krishna

    ప్రస్థుతమున్న కథకులలో ఉమా మహేష్ ఆచాళ్ళ గారిది విభిన్నమైన శైలి.
    అందుకే కొంతమంది ఆయనను మాటల మాంత్రికుడు అంటారు.
    ఆ మాటను నిజం చేస్తూ ఈ కథ నడిచింది.
    ఎక్కడా చదువరులకు అనుమానం రాకుండా కథనం నడిపారు.
    ముగింపులో అద్భుతాన్ని ఆవిష్కరించారు.
    వృత్తి ధర్మం, బాధ్యత అనే రెండింటిలో ఏది గొప్పదని అనిపిస్తూ ఉంటుంది.
    దాని సమాధానం కోసం ఎదురుచూస్తూ…
    రచయితకు హార్దిక అభినందనలు.

    Reply
  8. డా.లక్ష్మీ రాఘవ

    మంచి కథ అనేకాదు, ఎలాటి మనుషులు వుంటారు అని తెలియచెప్పే కథ. మంచి అనుభూతిని ఇచ్చినందుకు అభినందన !

    Reply
  9. SrinivasaRao A

    చాలా బాగుంది. కధనం అద్భుతం.

    Reply
  10. ఎమ్వీ రామిరెడ్డి

    నిస్వార్థంగా, నిశ్శబ్దంగా మంచికి కోపు కాసే వెంకట్రావులు నిస్సందేహంగా ఇంకా ఈ సమాజంలో ఉన్న అంశాన్ని కథగా మలచిన ఉమా మహేష్ గారికి అభినందనలు.
    అదే సమయంలో అధికారుల నిజాయితీ కూడా ఎంత ఆవశ్యకమో వివరించటం బాగుంది.

    Reply
  11. బొడ్డేడ బలరామస్వామి

    కథ, కథనం చాలా బావున్నాయి. ముగింపు ఆశ్చర్యం గొల్పింది. మేక వన్నె పులి రివార్డుకోసం ఎంత అన్యాయంగా ప్రవర్తించింది. పాపం అనిపించింది. ఉమామహేష్ గారికి అభినందనలు.

    Reply
  12. కె.వి.లక్ష్మణ రావు

    మారు వేషం లో ఉన్న మహారాజు లా మబ్బుల చాటున సూర్యుడు వచ్చిందీ, లేనిది తెలియ కుండా తచ్చాడు తున్నాడు..ఈ వాక్యాలతో ప్రారంభం అయిన కథ ఆద్యంతమూ చక్కని ,సొగదైన ఉప మానాలతో ఏక బిగువున చదివించింది… ఆ వాక్యాల్లో ఉన్న మహారాజు,సూర్యుడు కూడా..కథలోని ప్రధాన పాత్రధారి వెంకట్రావు గురించే నని కథ పూర్తిగా చదివాక అర్ధం అవుతుంది. ఇక కథలో వెంకట్రావు గురించి ..ఆ పాత్ర ని రచయిత తీర్చి దిద్దిన తీరు అత్యంత ప్రశంస నీయంగా ఉంది.బహుశా వెంకట్రావు లాంటి వారు రచయిత జీవితానుభవం లో తచ్చాడి ఉంటారు.అందుకే ఆ పాత్రని ప్రధాన సూత్రధారి చేశారు.నిజమే సరిగ్గా గమనిస్తే వెంకట్రావు లాంటి వారు ఊరి కొక్కరు ఉంటారు.కానీ ఎవ్వరూ అలాంటి వారిని గమనించే ప్రయత్నం చేయరు..ఏదైనా మూగజీవి చనిపోతే ముక్కు మూసుకుని దిక్కులు చూస్తారే గాని..ఒంటిచేత్తో ఆ మూగజీవిని తీసే ప్రయత్నం చేయని వారే(నాతో సహా) సమాజం లో ఎక్కువ.మేము అందుకు పుట్టలేదు అనుకుంటారు.కానీ వెంకట్రావు అందుకు పూర్తిగా విభిన్నం..సమస్య ఏదైనా క్షణాల్లో పరిష్కరిస్తాడు. ప్రమాదం జరిగితే సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని చూసే వాళ్లే ఎక్కువుంటారు..కానీ ప్రమాదం జరిగిన వారిని ఆదుకునే కనీస ప్రయత్నం చేయరు.చేయ లేరు.వీళ్లకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే అందమైన పదం ముందరి కాళ్లకు బంధం అవుతుంది.కానీ వెంకట్రావు ఆ “పద” బందాల్లోంచి ఇట్టే బయటకు వస్తాడు.”ఆపద” నుండి ఇట్టే బయట పడేస్తాడు..అందుకే అందరూ అతణ్ణి విభిన్నంగా చూస్తారు…అందరి చేతా ఏకవచనం లో పిలిపించ బడతాడు. ఆ వచనం లోనే వెంకట్రావు సాయానికి,సహాయానికి నిర్వచనం అవుతాడు.వెంకట్రావు ఊరిలో ఉంటాడు.అందరికీ అవసరమైన పనులు చేస్తాడు.అతని ఉనికి ఎవరికీ పట్టదు.కానీ అతని లాంటి వారు ఊరిలో లేక పోతే ఊరికే ఉనికి ఉండదు. చక్కని,చిక్కని కథాoశo తో ఒక గొప్ప పాత్ర చిత్రణ జరిగింది.వెంకట్రావు రూపంలో ఆవిష్కరణ అయింది.పేరు కే అతడు “వెనకటి” రావు.కానీ అతను అన్ని పనుల్లో ముందుండే “రావు”…అబద్ధం ఆడటం,మోసం చేయడం, తప్పించు కోవడం అతనికి ఎప్పటికీ రావు..లేవు.అందుకే అతడు మారు వేషంలో ఉన్న మహారాజు.మబ్బు చాటు సూర్యుడు.రాజు,సూర్యుడు కొంతసేపటికి అయినా వారి రూపం ప్రదర్శిస్తారు.కానీ వెంకట్రావు కు ఏ దర్పం అవసరం లేదు.గుర్తింపు అతనికి అక్కర్లేదు. గుర్తింపు కోసం పని చేసే వాడు రాజు లా ఉంటాడు.పని నే దైవంగా చేసే వాడు ఎప్పటికీ రాజు కాలేడు. వెంకట్రావు అవుతాడు.ఎందుకంటే అతడు “వెనకటి రావు”..పనిలోనే “ముందుకు”..పడండి “ముందుకు”..అనే రకం కనుక….ఒక గొప్ప కథని చదివామన్న అనుభూతి ని రచయిత శ్రీ ఉమా మహేష్ గారు కలిగించారు.ఒక కథ చదవ గానే చదివిన పాఠకుడు చాలా రోజులు ఆ కథ లోని పాత్రల గురించి ఆలోచించ గలిగితే..ఆలిచింప చేస్తే అది గొప్ప కథ గా నిలిచి పోతుంది..పాఠకుల మదిని గెలుచు కుంటుంది..అలా ఈ రచయిత రాసిన కథలన్నీ అలాగే గొప్పగా ఉంటాయని అనడంలో అతిశయం లేదు..ఈ మధ్యనే ఆయన రాసిన కథా సంపుటే అందుకు ప్రత్యక్ష నిదర్సనం…..

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.