ఆరంజ్యోతి మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో!
“మా! నా పెండ్లికి నేను కోరుకునే మూడు మంచి చీరలు కావల్ల, తొలి నలుగు పెట్టేటప్పుడు సీత సమేత రామ సీరియల్లో హీరోయిన్ కట్టుకునిందే అట్లాంటి కలర్ అదే డిజైన్ చీర కావల్ల, ఆ సీరియల్లో మారిగా నలుగు పెట్టేటప్పుడు పసుపు నీళ్లు చల్లల్ల. నా పెళ్లి వీడియో లో అవన్నీ ఉండల్ల. ఒక డిజైన్ జాకెట్కి మూడు వేలంట. నాకు మూడు జాకెట్లు కుట్టించు. ముహూర్తానికి వరుడు కావలెను సినిమాలో హీరోయిన్ కట్టుకొని ఉంటుందే ఎర్రంచు పట్టు చీర, దానికి తగ్గ నగలు కావల్ల. అదే నగల సెట్టింగ్ ఉమాగోల్డ్ లో దొరుకుతాయంట. వాటికి దగ్గ మ్యాచింగ్ గాజులు, బొట్టు బిళ్ళలు, స్మూత్ హీల్స్ కూడా కావల్ల. పూలమాలలు కూడా మేము సెలక్షన్ చేసినవే కావల్ల” అని నా కూతురు పెండ్లి ఇంకా ఇరవై రోజులు ఉందనగా నాకు చెప్తా ఉంది.
ఇదంతా దాని సొంత ఆలోచన కూడా కాదు. దానికి నచ్చిన సినిమా హీరోయిన్ని చూసి, ఊర్లో జనాలు, దాని స్నేహితులు చెప్పిన ఆలోచనల్లో నుండి దాని పెండ్లికి అది ఎట్లుండాలా అని, ఏమి కావల్ల అని నాతో చెప్తా ఉంది. దీనికి నచ్చేదే గాకుండా ఇది చేసుకోబోయే వాని సలహాలతో వాడు ఏది చెప్తే అది వేసుకోవల్ల అని అనుకుంటుంది. గోరింటాకు డిజైన్ తో సహా అన్ని సినిమా మోడల్ లో జరగాలని కోరుకుంటోంది నా కూతురు.
నేను నా కూతురు మాట్లాడుకుంటూ ఉన్నట్లే నా జతగత్తె సరస వచ్చే! “ఏమ్మే! అమ్మ, బిడ్డ లెక్కలేసుకుంటుండారు పెండ్లి గురించేనా?” అని అడిగే!
నేను “కాదే! సరసా! పతి ఒకటీ ఆయమ్మ కోరినట్లే కావాలంటే అయ్యే పనేనా! ఈడ మాకు తక్కిడి ఎంత లేస్తుందో ఆటికే చూసుకోవల్ల. టీవీలు, సినిమాలు చూసి అట్ల మనం కూడా పాటుపడాలంటే అవుతుందా? వాల్లు జనాలను ఆకట్టుకునే దానికి ఎన్నో చూపిస్తారు. ఎంటికలు ఉండే యమ్మ ఎట్లయినా కోప్పేస్తుంది. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని మొండికేస్తే ఎట్లా?” అంటి. ఆ మాటకి సరస “సరేలే మన పెళ్ళిల్లకి మనకు చీర కట్టేది చాతకాదు. మన అమ్మ నాయన ఏవి తెస్తే అవి పిరింగా ఏసుకున్నాము. పెండ్లి కూతుర్ని ఇంట్లోవాల్లో చుట్టాల్లోచేస్తా వుండిరి. ఇప్పుడేమంటే వాళ్లను అలంకరించే దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని తెచ్చుకుంటున్నారు. వాల్లకు వేలకువేలు కూలి. కాలం మారే కొద్ది అన్నీ మారిపోతాయి. మన దాకా వస్తారా? అన్నీ వాల్లు చెప్పినట్లు జరగల్ల. ఏమన్నా మాట్లాడితే ఒక్కసారే కదా పెల్లి చేసుకునేది. అన్ని గుర్తులు ఉండాల అని మాట్లాడతారు. మన అమ్మ నాన్నపెల్లిల్లకి ఫోటోలు కూడా లేవు. వాళ్ల గుర్తులు మనమే! మా అమ్మ చెప్పేది నా పెండ్లి మూడు నూర్లతో చేసిందంట. ఎట్లనోలే చేసేయి మీకూ ఒక బాద తీరుతుంది. నాకు కొంచెం మిరప్పొడి పెట్టు ఇంకా కూర అవలా మల్లా పనికి పోవల్ల” అని మిరప్పొడి తీసుకుని ఎలిపాయ.
సర్లే, బిడ్డను బాద పెట్టేది ఎందుకు, ఆయమ్మ అడిగిందల్లా చేసేద్దామని వడ్డీ ఎంతన్నా కానీలే అని ధైర్యం చేసి మామూలుగా అప్పు అడిగేవాల్లని అడగనివాల్లను కూడా అడిగి ఇంత జేసేది బిడ్డ కోసమే కదా అని పత్రం రాసిచ్చి తెచ్చిన అప్పుతో సరుకులకు పోతే, మా అంచనా నాలుగు రూపాయలు అవుతుంది అనుకొంటే నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు అయిపోయ. ఆయమ్మ కోరిన కొండమీద వాన కురిపిస్తిమి. ఆయమ్మ సంతోషంగా అత్తారింటికి ఎలిపాయ!
ఆరంజ్యోతి వాళ్లకు కాదు మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో. నెలనాడు అప్పులోల్లు అప్పుకట్టమంటా వుంటే వచ్చే వొరంబడి సాలక నేను, నా మొగుడు ఎట్లబ్బా అప్పులు తీర్చేదని అంగలారిస్తిమి. సేద్యంలో ఏమీ మిగలడం లేదు. భూమిలో ఇత్తనం ఏయక ముందు నుండే రోగాలు. ఏలుపోసి మందులు కొట్టినా రోగాలు అరికట్టలేము. అప్పులుసప్పులు చేసి పంట ఎలబెరికితే అప్పుడనంగానే సవక అయిపోతాయి. ఇప్పుడు ఉండే పరిస్తితిలో ఒక రూక కండ్ల చూసేది పాల సుక్కల్లోనే అని ఆలోసన జేసి నేను నా మొగుడుతో “మనము ఇబుడు ఎట్లా రెండు ఆవులు మేపతా ఉండాము దాని జతకు ఇంకొక ఆవును పట్టుకుందాము” అన్నా! నా మొగుడు “ఇంకొక ఆవును పట్టల్లంటే దానికి పెట్టుబడి కావద్దా ఒట్టి చేత్తో మూర ఏస్తే ఎట్లా” అనే!
అబుటికి నా మెడలో ఇరవై గ్రాముల బంగారు గొలుసుంది. ఇది మెల్లో ఉంటే ఏమొస్తుందని దాన్ని బ్యాంకు లో పెట్టి అరవై వేలు అప్పుతెచ్చి నా మొగిని చేతికిచ్చి దలార్ని తీసుకొని పోయి మంచి గుత్తగా ఉండే ఆవును పట్టమంటి. ఆ రోజు నుండి పొద్దున పోతే మల్ల పొద్దుగూకేటప్పుడు ఇంటికి వచ్చేది నా మొగుడు. “మే! నాలుగు దిక్కులు తిరిగినా. యాడ చూసినా మంచి ఆవులు లేవు. మనకు నచ్చిన దాన్ని పట్టాలంటే ఈ డబ్బుసాలదు. తొలి ఈతయి,రెండు పొల్లు తరుపు అయి, ఎమక బలం, కండ బలం ఉండి తోలు పలసగ ఉండి ప్యాచ్లు ఉంటే డెబ్భై ఎనభై వేలు దర పెట్టాలంటా” అంటూ వారం దినాలు తిరిగె. దావ కర్సులకు ఐదు వేలు అయిపోయింది. ఉండేకొద్దీ అది కూడా అయిపోతుందని “రేపు ఆదివారం పరమట కర్ణాటక సంత జరుగుతుంది పోయి ఎట్లాడిదన్న రానీ తెచ్చేయి” అంటి. ఆ మర్నాడే నా మొగుడు సంతకు పాయ. పోయిన టైమ్ బాగుంది. ఉన్న రూపాయలు లోనే మంచి ఆవు చిక్కింది. తొలిచూలు. ఒక ఇరవై దినాల్లో ఈనేటట్టు ఉండే ఆవు పట్టినాడు. మన చేయి కాలకుండా అసలు లోనే దలారికి, ఆవును ఏసుకొచ్చిన బండి బాడిగకి సరిపోయింది.
ఆవును ఇంటికి తెస్తానే ఇరుగుపొరుగు, ఆడ, మగ అంతా దాని చుట్టూ తిరిగిచూసి, తడిమి, తాకి “మీ అదృష్టం బాగుంది. గుత్తంగా ఉండే నేతావు దొరికింది. పొదుగు సుడి సుద్దం బాగుంది. ఎట్ల లేదన్నా పూటకి పది లీటర్లు పాలిస్తుంది” అన్నారు. ఆ మరునాడు మాకు పట్టిచ్చిన దలారి వేరే యాపారస్తులని పట్టకొచ్చినాడు “మీకు ఇంగా పదివేలు లాబం ఇప్పిస్తా అమ్మేయండి” అని. దానికి నేను “రెడ్డొచ్చె మల్ల మొదలుపెట్టు అన్నట్లు ఆ లాబమూ సాలు, మేము మల్లా ఆవు కోసం తిరిగేదీ సాలు, తిరిగి డబ్బులు పోయే దానికంటే ఉన్నది ఉన్నీలే” అంటి. ఆ యాపారస్తులు ఎలిపాయిరి, ఆ దలారి కేమి? కొనే వాని దగ్గర లంచం తీస్తాడు మంచావు ఉంది నీకు తక్కువ రేటుకు పట్టిస్తా అని. మల్లీ అమ్మే వాని కాడికొచ్చి నీ ఆవును ఎక్కువ రేటుకు అమ్మిస్తా నాకు ఏమిస్తావ్ అని మాట్లాడుకుంటారు. వానికి చెప్పే మాట వానికి చెప్పి మాకు చెప్పే మాట మాకు చెప్పి ఇద్దర్ని పూన దోస్తాడు. వాని దుడ్డు వాడు పెరుక్కొని పోతాడు. దలారి పనే అది. మా ఆవు రోజు రోజుకి పొదుగు బాగా పెడతా ఉంది. మా దగ్గర మంచి ఆవు ఉంది అనే పోవిడి అందరికీ తెలిసిపోయింది.
లాబం మాట ఇంటనే నా మొగుడు అమ్మదాము అంటాడు. రోజుకు ఐదారు మంది బేరగాల్లు జడి తిరగతా ఉండారు. నా మొగుడు ఎక్కువమంది అడిగిన గొడ్డును ఇంటికాడ పెట్టుకో కూడదు. అది గొడ్డయినా సరే బిడ్డయినా సరే. గొడ్డు ఉండే తావికి బిడ్డ ఉండే తావకి పదిమంది వచ్చిపోతంటారు అని అంటాడు. నేను వచ్చిన యాపారస్తులందరికీ ‘ఆవుని అమ్మమ’ని కచ్చితంగా చెప్పేసిన.
ఆవుకి డొక్కలు దిగి, పొదుగు బిగిసుకుంటా ఉంది. మడవ ఇడుస్తా ఉంది. కనే దినాలు దగ్గరికొచ్చాయని అర్థమయింది. నిద్రపొద్దులో ఈనిందంటే దాని బిడ్డను యాడ తొక్కేస్తుందో, దాని మాయ అదే యాడ తినేస్తుందో అని మా బయం. అందుకే రేయంతా మేము గడికొకసారి లేసి చూసేది దాన్ని. అట్లా పగలు రేయి దాన్ని కనిపెట్టుకోని ఉన్నాము. ఆవుకు పొదుగు ఎక్కువై, ఆ పొదుగు రెండు కాల్ల సందులో ఉండి నడవను కాలా. దాని రెండు కాళ్లను ఇర ఏసుకోని నడుస్తోంది. కాళ్లమింద బొరువంత మోపి మోయలేక నాలుగు కాల్లు పార చాపి పడుకునేస్తుంది. అట్లా పడుకునేటప్పుడు దాన్ని చూసి మాకు భయమేసేది మల్ల మేము “సరేలే మానుకాయి మానుకు బరువా?” అని అనుకునేది.
మేమిట్లా ఇరుకు తరకులో ఉన్నట్లే ఆవు నలినొప్పులు పడతా ఉంది. ఆవు యబ్బాటంగా ఉంది. పనుకుంటే లేయ లేక పోతుంది. ఒకపక్క పొదుగు, ఒకపక్క బిడ్డ. ఈ రెండు బరువులు ముందర ముని కాళ్ల పైన మోపి లేస్తోంది. తొలిసూరి ఆవు. ఇది బిడ్డని ఎట్లా నేలకేస్తుందో అని మాకు నోట్లో తేమ లేదు. అందరూ డాక్టర్కి పోన్ చేయమన్నారు. పసువులాస్పత్రి మా ఊరికి మైలు దూరంలో ఉంది. ఆ డాక్టర్ పల్లెల పైన ఆవులు సూడను రాడు. యా యాలకీ గొడ్లను మనమే నడిపించుకుని పోవల్ల. జబ్బు ఎక్కువైపోయి నేలబడి పోయినా కూడా బండ్లో ఏసుకొని పోవల్ల లేదంటే కాంపౌండర్ని పంపిస్తారు. వాళ్లు “ఒకర్నిద్దరిని చంపంది వైద్యుడు కాడు” అనే టైపు. ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. దానికి నొప్పులు బలంగా ఎత్తుకున్నాయి. పనుకునేది లేచేది ఇట్లా నిలుకు లేకుండ ఉంది.
మా ఊరిలో మనుషులు గాని, ఆవులు గాని ఈనతా ఉంటే కానుపు సులువుగా అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ బోయకొండ గంగమ్మకు మొక్కుంటాం. పసుపు గుడ్డలో రూపాయి కట్టి “తల్లీ మాఆవు దూడ క్షేమంగా ఉంటే చీర పెట్టి కోడిని కోస్తాను” అని ఆ తల్లికి మొక్కుబడి చేసి, ఆ మీదు తీసి ఆవు మెడలో కడితి. మనుషులు అయితే అరిచి అబ్బరింతురు. దీనికి నోరు లేదు కాబట్టి దాని నొప్పి మనకు తెలీలా. నా మొగుడు నా మీదకి యుద్ధానికి వచ్చినాడు “అమ్మేస్తాం అంటే అడ్డం బడితివి ఈ పొద్దు ఏమన్నా జరగరానిది జరిగితే ఇన్సూరెన్స్ కూడా మన పేరుతో చేసుకోలే. అరవై ఏలు నెత్తిన పడుతుంది. మనం ఎప్పుడు మల్ల కోలుకునేది” అని. సందు దొరికింది కదా అని నన్ను బెదిరిస్తాడు. నాకూ లోలోపల బయం గానే ఉంది పైకి బింకంగా ఏదైతే అది గానీలే అని ఉండా. ఆ ఎంకటరమణ సామికి కూడా మొక్కుకున్నా. ఆవు నొప్పులు నిలిచినప్పుడు గబగబా పట్టెడు గడ్డి తింటుంది. నొప్పులు ఎత్తుకున్నప్పుడు మల్ల ముక్కుతుంది. నొప్పులు పడిపడి ఉమ్మనీరు బయటికి వచ్చే. మల్ల పనుకొని గట్టిగా ముక్కేకుందుకే బిడ్డ నేలబడే, తలతిప్పి ముడ్డి కాడ దాని బిడ్డను చూసి గబుక్కున లేసి అరిసె గట్టిగా. మేము బిడ్డను పట్టి దాని ముందుకు తోస్తిమి. అది బిడ్డమీద ఉందే బొంపు అంతా నాకేసింది. తోకలేపి చూస్తే పెయిదూడ. మాయ ఇంకా ఎయ్యలేదే అనే బాద పట్టుకునే మాకు. అంతకు ముందు మా ఎదురింట్లో ఒక ఆవు ఈనుంటే మూడు రోజులు మాయ ఎయ్యలా. దానికి కడుపులోనే కుల్లి వాసన వచ్చేసింది. మా ఊర్లో పెద్ద కిట్టతాతను అడిగితి ఏమి చెయ్యల్ల అని. దాని యాలాడే పేగుకు నల్లేరు తెచ్చి కట్టమని, మంచి నూగులాకు బెల్లం కలిపి నూరి తినిపించండని చెప్పాడు. ఆయప్ప చెప్పినట్లు చేస్తే మూడు గంటలకు మా ఆవు మాయ ఏసేసా. బిడ్డను కూడా బాగా సాక్కున్నింది . అప్పుడు మా పానాలు పైకి లేచినాయి. పాలు కూడా బాగనే ఇస్తావుంది. మొక్కుబడులు, అప్పులు తీర్చుకొనే పనిలో పడినాము అందరమూ!
అర్థాలు
నలినొప్పులు = తొలి నొప్పులు
పేయి దూడ = ఆడ దూడ
తరుపు = వయసు
మడవ = మానం
3 Responses to “ఆరంజ్యోతి మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో!”
కథ చాలా బాగుంది భారతి బ్రాండ్ లో…
మీడియా సీరియల్స్ ప్రభావం.. గొంతెమ్మ కోరికలు.. అప్పుల తిప్పలు..
అద్భుతమైన కథనం. దిగువ తరగతి మనుషులు, దిగులు పడ్డ గుండెలు.
మీ కథ చాలా బాగుంది. ఎదురుగుండా ఆవు ఈని నట్లే ఆ బాష , చక్కని పదాలు.
ధన్యవాదాలు