కర్రెద్దు
“తినడానికి తిండి లేదు. జుట్టు చూస్తే పండిపోతోంది. ఉన్న ఎకరం అమ్మీసేవ్. మిగిలింది ఒంటెద్దు బండి. ఈ కూరగాయలు అమ్ముకోపోతే కంచంలో కూడుండదు. సిగ్గు నేకపోతే సరి ఎదవ జలమ”
“ఇపుడేటంటావే? సరిగా సెప్పేడు” చిరాగ్గా అన్నాడు గవరయ్య.
“ఇన్నాలయింది లగ్గవై. ముందల నన్ను తల్లిని సేసి ఏడు! ఆనాక దానెనకాల సద్దువుగాని” ముక్కు చీదుకుంటూ అంది కొండమ్మ.
“నేల గట్టిదైతే గింజ మొలకౌద్ది. నీ యమ్మ దానికి నానేటి సేసేదే?” నవ్వాడు గవరయ్య.
“ఆ ఎర్రనేల అంత గట్టిదా? సచ్చినోడా! బేరాలాడతన్నావంట”
“ఏటి ఆ ఎర్రమ్మే సెప్పేసిందా?” మళ్ళీ నవ్వాడు గవరయ్య
“సెప్పిచ్చు కొడ్తాను దాన్నీ, నిన్నూ. బేగీ మార్కెట్లో సరుకు దింపి బండేసుకు పో. దాని పక్కన కూకుంటే సచ్చావే నా సేతిలో ఇయ్యాల” మండిపోయి తక్కెడతో తలమీద మొత్తినట్లుంది.
“సచ్చానే! నీ యమ్మా!” లాగి పెట్టి మక్క మీద కొట్టాడు కొరడాతో.
“నీ జిమ్మడ! నానేం సేసాన్రా?” సుర్రు మనే సరికి తెలియకుండానే పరుగు పెంచేసాను.
ఇలా ఇని ఇని మీ బాస తెలిసిపోతాంది నాకు! నెల తిరిగే సరికి పైన మాటాడుకున్న ఇద్దరిలో సానా మారుపొచ్చేసింది. ఇపుడా గవరయ్య మంచం మీదున్నాడు. కొండమ్మ ఏదో గొనుక్కుంటూ కొంపలో తిరుగుతోంది. నాకు కొన్ని దినాలు పనిసెలవు. అమ్మనాంటి కొండమ్మ నాకే లోటూ సేయదు. అందుకే తాపీగా దవడలు కదిలిత్తూ కూకున్నా. అసలు దీనంతటికీ కారనం నానే. గడ్డి అయినా, గతవయినా నెమరేసుకుంటేనే రుసి.
తెల్లగా ఉంటాది తను. అందుకే తుని సంతలో ఎండదెబ్బ తగల్లేదు తనకి. నా యవ్వారం అట్టా కాదు. మండిపోతోంది ఒల్లంతా – సుట్టూ గోల గోల. తను మాత్రం సిరాగ్గా సూత్తోంది నావంక అంతంత నల్లటి కల్లేసుకొని. నలుపంటే అంత నోకువా? అందుకేనేటి నన్ను నర్సీపట్నం నుంచి తోలుకొచ్చి మరీ తక్కువ రేటుకి అమ్మేసింది!అట్టాంటి సమయంలో గవరయ్య దేవుడల్లే అనిపించాడు – నాతోపాటు తనని కూడా కొనేసాడని గావాల్సు. కొంప కొచ్చాక కొండమ్మ ఇద్దరినీ సూసి మురిసిపోనాది. తనకి ‘నచ్చివి’ అని పేరెట్టినాది. నా పేరు సీనట. సావిడ్లో సివుడని ఉన్నాడు. ఆడిదంతా అదోనోకం. “నచ్చివిని సూత్తుంటే ఈతకొచ్చేసేనాగుంది. ఎన్నో ఏడేంటి?” కొండమ్మ తన ఒంకే సూత్తూ అంది. “నాల్గన్నాడు, గానొసే! ఈ సీనుగాడినొదెలేత్తే ఈడే తెచ్చీసేనాగున్నాడు దీన్ని ఈతకి. ముందీడి సంగజ్జూడాల!” నా ఎనక కాల్లొంక సూత్తూ అన్నాడు గవరయ్య. ఆ సూపెనక ఆలోసెన నాకపుడు తెలీనేదు. నచ్చివి ఒంక సూసాను. కొత్తాలోసెనతో గుండె గుబిల్లుమంది.
గవరయ్య దేవుడు కాదు దెయ్యంగాడు అని తెలీడానికి ఎన్నో రోజులు పట్టనేదు.
మర్నాడు ఉదయాన్నే పొలం గట్లకి తోలుకెల్లింది ముగ్గుర్నీ కొండమ్మ. అంతే! లచ్చివి పని ఆ దినానే అయిపోయేది. పరిగెత్తించేసాను పొలవంతా. నన్నాపడం కొండమ్మ తరం కానేదు. సివుడిదంతా అదో నోకం. మద్దెమద్దెలో మావంక సూత్తూ పరకలు పీకుతున్నాడు. మద్దెనేల గవరయ్య వచ్చాడు, కొమ్ములట్టుకొని లొంగదీద్దామనుకున్నాడు. పొట్టి కొమ్ములు నాయి. జారిపోయి దొరకనేదు. సివరికి గంగులు గాడిని తీసుకొచ్చి మీదడి నన్నట్టుకొని బండకర్ర ఏసేసారు మెడలో బలవంతంగా. సివుడ్ని సూత్తే సిర్రెత్తుకొచ్చింది. ఇంతా జరుగుతున్నా పరకలు పీకుతూనే ఉన్నాడు తనకేం పట్టనట్టు.
ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ దాహం
గుదిబండ ఆపేత్తాదా గుండెల్లో పేవని? దానికి తోడు లచ్చివి నావంక సూసే దొంగ సూపులు! రేతిరి ఎవురినీ నిద్దర పోనివ్వనేదు నాను. తెల్లారగట్ట నా గోలకి కర్రతో కొట్టి దూరంగా రాటకు కట్టేసాడు గవరయ్య తాగిందంతా దిగిపోయి. ఆ మరనాడు నరకం సూపించాడు దెయ్యంగాడు. నా బతుకుని బలవంతంగా నలిపేసాడు. ఆ రోజే సివుడు ‘అంబా’ అని అరవడం ఇన్నాను. నన్ను గవరయ్య, కాంపోండర్ కలిసి బయటకు తీసుకెల్తంటే…
గొంతు నరాలు సిట్లిపోయేలా అరవాలనిపించింది నాకు అపుడు. కాని మూతికి బలంగా సిక్కం తగిలించారు. నరాలు పిండేసినట్లయ్యి ఇల ఇల్లాడిపోయాను. సుట్టూ ఇనుప గొట్టాల మద్దెన ఉంచారు. పొద్దుగూకేక ఆటో మీద తెచ్చడేసారు. ఆటో ఎక్కి దిగడం కూడా నరకంలా అనిపించినాది. సివుడు, లచ్చివి నావంకే సూత్తూ ఉండిపోయారు. నాకు తెలీకుండానే కల్లు మూసుకున్నాను ఎప్పుడో.
ఆ నెప్పి తేరుకోవడానికి నెలరోజులట్టింది. ఈనోగా కాంపోండర్ మూడుసార్లొచ్చి ఏదో మందు రాసాడాడ. ఏవో గోలీలిచ్చాడు కొండమ్మకి. కుడితిలో కలిపెట్టమని.ఈ నెల రోజుల్లో సివుడి కంటే లచ్చివిలో సానా తేడా సూసాను. గడ్డికూడా సరిగా మేయనేదది. తనకి నామీద జాలి కాదు ఇంకేదో ఉందనిపించినాది. ఈ నెల రోజుల్లో నాలో కూడా సానా తేడా ఒచ్చేసింది. ఇది వరకులాంటి సెలాకీ నేదు. లచ్చివి వంక పదేపదే సూడాలనిపించడం నేదు. ఎపుడూ కల్లు మూసుకుని ఉండాలనిపిత్తాంది. కల్ల చివర ఈగలు వాలుతుంటే సెవులను ఊపడం తప్ప ఏవీ సేయడం నేదు. కొండమ్మ గజ్జల సప్పుడు వింటే కల్లు తెరుత్తున్నా. ఆమె ఈపు నివురుతుంటే కాత్తంత ఆయి. కుడితిలో గోలీలు కలిపి ఎడుతుంది. అక్కడ కాత్త మందు రాత్తంది. అమ్మ గురుతుకొత్తంది.
ఓ దినం గంగులొచ్చి అన్నాడు “ఈ సంకురేతిరికి ఒంటెద్దు బల్లేనట. జోడెద్దులు కావు. ఈసారీ సివుడేనా? సూడు మరి!” గవరయ్య నాదగ్గరకొచ్చి అన్నాడు “ఈపాలి సీనుగాడిని తయారుసేద్దాం! సివుడిక నాగలేడు”
ఆరోజు బండి కొని తేచ్చేసాడు గవరయ్య మరనాటి నుంచి నాకు పని రెట్టింపు అయింది. ఉదయాన్నే ఆ బండిని నాగుతూ పరిగెత్తడం. పొద్దుగూకే దాకా సివుడితో కలిసి పొలం పని. సివుడు మాతరం తను ఏదోలోకంలో ఉన్నట్లుంటాడు గానీ అప్పుడపుడూ నావంక సూసి నవ్వుతున్నట్లనిపిత్తాది. లచ్చివి మాట ఏవిటో గానీ, ఈ మద్దెన తన ఏపు సూడాలనిపించడం నేదు. మరో నెలరోజుల్లో బండిని బాగా పరుగెత్తించడం నేరిసేసుకున్నాను కానీ గవరయ్య ఇంకా ఇంకా అని కొరడాతో తట్లు తేలేలా కొట్టడం మాత్రం ఆపడం నేదు. నరకం సూపిత్తన్నాడు సచ్చినోడు. ఆ దినం జరిగినది నేనెప్పటికీ మరిసిపోలేను.
పొద్దుటేల కుడితి తాగుతూ ఎదురుగా కనిపించిన దానికి మెడ పైకెత్తి సెవులు రిక్కించి సూసాను. గంగులు గాడు తీసుకు వచ్చాడు. ఎత్తుగా, పొట్టి కొమ్ములతో బలంగా. మక్క మీద గుండ్రంగా అచ్చు మెరుత్తోంది తెల్లటి ఆంబోతుకి. లచ్చివిని సూడగానే ఆడు ముక్కు కన్నాల్లోంచి బలంగా గాలిని బయటకు ఒదిలి దగ్గరకు కదిలాడు. కుడితి గోలెంలోంచి తలపైకెత్తి కంగారుగా సూసింది లచ్చివి. దగ్గరకు ఒచ్చిన అంబోతు ఆగనేదు. ఒక్కసారి లచ్చివి మీద పడింది. దాంతో ముంగాల్ల మీద ముందుకు పడిపోయింది లచ్చివి. నానూ, సివుడూ ముందుకు ఉరకబోయి రాటలకు కట్టిన పలుపు తాల్లెనక్కి లాగడంతో ఆగిపోయాం. గంగులు “గవరయ్యా! ఈటిని పొలానికి తోలుకు పో! కొండమ్మ కూడా ఒత్తాది. నాను ఈడ సాల్లే. మద్దినేల దాటాక ఒద్దురు గాని. కాంపోండరు ఒత్తానన్నాడు!” అన్నాడు.
నన్ను బండికి కట్టేసాడు గవరయ్య. సివుడిని పట్టుకొని కొండమ్మ బైటకు ఒచ్చింది. నా ఆలోసెన నోపలే ఉంది. ఆ ఆంబోతు గట్టిగా రంకెలు ఏత్తోంది. గంగులు గాడు అదమాయిత్తన్నాడు. మద్దెమద్దెన లచ్చివి ‘అంబా!’ అంటోంది. ఈ నోగా గవరయ్య కొరడాతో ఈపు మీద కొట్టి, తాడు బలంగా నాగాడు. తట్టుకోనేకపోయాను. కసిదీరా ఒక్కసారి ముందుకు ఉరికాను. వెనుకనుంచి కొండమ్మ ‘మావా!’ అని అరిసింది.
“నువ్వుండవే. దీని సంగతి ఇయ్యాల తెల్సేత్తా” తాడు లాగిపెట్టి కొరడాతో బాదుతూ అరిసాడు గవరయ్య. నాకు తిక్క రేగిపోనాది. ఎలా నాగుతున్నానో బండిని తెలియడం నేదు. ఎలా ఉరుకుతున్నానో తెలియడం నేదు. అదే ఊపులో పొలం గట్టు దిగేసాను. అది సూసి గవరయ్య ముక్కుతాడు బలంగా లాగుతూ కొరడాతో బాదడం మొదలు పెట్టాడు. ముక్కు మండిపోతోంది. ఏడిగా గాలి బయటకు బుసకొడుతోంది. నాకు పిచ్చి ఎక్కిపోయేలా ఉంది. ఆగడం నేదు నానూ, గవరయ్య కూడా. గట్లు ఎక్కుతున్నా, దిగుతున్నా. ఎనక తట్లు లేసిపోతున్నాయి ఈపుమీద. బయంతో బాదేత్తున్నాడు గవరయ్య. ఉండుండి ఎందుకో ఏడుపొచ్చేత్తాంది. ఎడ్లు కూడా ఏడుత్తాయా అనా! పేవించడం తెలిసాక ఏడుపు తెలీకుండా ఉంటాదా?
పల్లు బిగపట్టి అలా పరిగెత్తుతూనే ఉన్నాను. ఏడుపు ఎక్కువవడంతో పరుగు ఏగం తగ్గిపోయింది. సూసాడది గవరయ్య. ముక్కుతాడు గట్టిగా నాగిపెట్టి కాసేపటికి ఆపేయగలిగాడు నన్ను. తీరా సూత్తే పొలం దగ్గరకే తిరిగొచ్చేసాం! కాసేపటికి కొండమ్మ దగ్గరకు వచ్చింది. దూరంగా సెట్టుకింద నవులుతున్నాడు సివుడు.
“దీనియమ్మా! ఏం పరిగెత్తాడే సీను! ఈసారి పందెం నాదే. ఎవడోత్తాడో రమ్మను.ఆడి తల్లి”
ఆయాసపడుతూనే ఆనందంగా నా ఈపు నిమిరాడు గవరయ్య. నవ్వాలో, ఏడవాలో తెలీనేదు నాకు.
బోగి రోజున మాకు కూడా తానాలు సేయించి బొట్లు ఎట్టారు. లచ్చివినైతే మరీ ముద్దు సేసేసారు. కొండమ్మ లచ్చివికి గిట్టలకి పసుపు రాసింది తెల్లటి నొసట ఎర్రటి బొట్టు ఎట్టింది. కొమ్ములకు పూలు సుట్టింది ఈపు మీద ఎర్రటి సీర కప్పింది. ఆ మరనాడు మొదలయ్యాయి ఎడ్ల పందాలు ఊరు సివర పాటిదిబ్బ దగ్గర. బండికి రంగులేయించాడు గవరయ్య. పదేసి ఏలు సొప్పున ఆరు బల్లు. ఒత్తే యాబైఏలు తనది కాక. పోతే పది. నాకు లచ్చివే గురుతుకొత్తాంది. మనసంతా సిరాకుగా తయారయింది. సావిడికి పోయి పడుకోవాలని ఉంది.
గవరయ్య దగ్గరకు ఒచ్చి కొరడా ఎనక్కి తిప్పి కర్రతో కొట్టాడు మక్క మీద. కల్లు తెరిసాను కానీ లేవాలనిపించనేదు. “కొరడా తేకూడదొరె గవురయ్యా. మర్సిపోమాక” ఎవరో నవ్వుతూ బిగ్గరగా అన్నారు.
“తెల్సులేరా!” లెగాస గట్టిగా మక్క మీద సరిచాడు. నేవక తప్పనేదు నాకు. వీపు, పొట్టా నిమిరి, బండికి కట్టాడు గవరయ్య. నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెల్లి వరసలో నిలబెట్టాడు. అప్పటికే మిగిలిన బల్లు వరసలో కొచ్చీసాయి. దూరంగా మైకులో ఏదో సెపుతున్నారు. బండి ఎక్కాడు గవరయ్య. నెమ్మదిగా తోకను పట్టుకొని మెలిపెట్టాడు. బండి ముందు కాడి పైకి వంగి మెలిపెట్టిన నాతోకను కసిదీరా కోరికేసాడు. ముక్కుతాడు నాగిపెట్టడంతో తలపైకి లేసి ఆకాసం కనిపించింది. గట్టిగా అరవనేక ముక్కు కన్నాల్లోంచి ఏడి గాలితో బుస కొట్టాను. అక్కడితో ఆగనేదు రాచ్చసుడు. అప్పటి దాకా ఎక్కడ దాసాడో గుప్పిటతో కారాన్ని తోక మీద కొరికిన సోట బలంగా నొక్కిపట్టాడు – ఎవరో ఇజిలూదారు. లాగిపెట్టిన ముక్కుతాడును కాత్త ఒదులు సేసాడంతే. ఆపుకోలేని మంటతో తట్టుకోనేక గట్టిగా రంకెలెట్టి ముందుకురికేసాను!
సవితి రోజు రాత్రి కొండమ్మ, గవరయ్య, గంగులు నచ్చివి సుట్టూ సేరారు. మాకల్ల ముందే నచ్చివికి తెల్లటి పెయ్యదూడ పుట్టింది. గంగులు గబగబా పరుగెత్తుకెల్లి కాంపోండర్ని తీసుకొచ్చాడు. నచ్చివి కాసేపు దూడని వాసన చూసి కాంపోండర్ సూదిమందు ఇత్తే పడుకుండిపోయింది. పొద్దుటేల నాను లేసి సూసే సరికి దూడని నాకుతూ కనిపించినాది. దూడలోనే అనుకున్నంత కదలిక లేదు. రొండు దినాలు కాంపోండర్ వచ్చి దూడకు కూడా సూదిమందు ఇచ్చాడు. ఆ మరనాడు పొద్దుటేల నచ్చివి పదేపదే ‘అంబా’ అని అరవడం విని మెలుకువ వచ్చింది. లేసి సూసే సరికి దూడ నచ్చివి దగ్గర నేదు. నచ్చివి రాటకు కట్టి ఉండే అటూఇటూ తిరుగుతూ అరుత్తోంది. కొండమ్మ కొంపలోంచి బయటకు వచ్చి చూసి గొనుక్కుంటూ అంది. “దూడ సచ్చిపోనాదని నచ్చివికి తెల్దు. ఎతుకుతోందెర్రి తల్లి. ఏటి సేసేది? పాలు సేపుకొచ్చినట్లుంది. పొదుగుబ్బిపోతాంది” నెమ్మదిగా ఇత్తడి ముంత పొదుగు కిందకు సేర్సి పొదుగు మీద నీల్లు కొట్టింది. సెయ్యి పొదుగు మీద వెయ్య పొతే, ఎనక కాలితో ఇసిరి కొట్టింది నచ్చివి. ఈనోగా గవరయ్య ఆడికి ఒచ్చాడు. అతని సేతిలో ఏదో ఎండుగడ్డితో సేసిన దూడ బొమ్మనాంటిది ఉంది. దాన్ని ఎనక ఎట్టుకొని పట్టుకొచ్చాడు. నెమ్మదిగా కొండమ్మను ఆడనుండి నెగమని సైగ సేసాడు. తను తెచ్చిన బొమ్మని పొదుగు కాడ తల ఎట్టినట్లు నిలబెట్టాడు. నెమ్మదిగా పొదుగు మీద నీల్లు కొట్టాడు. కొండమ్మ పట్టుకు ఉండడంతో నచ్చివి కొద్దిగానే తల తిప్పగలిగింది. ఆమెకు గడ్డి బొమ్మ ఎనక తగిలింది. అంతే. గవరయ్య రెండు ఏల్లతో సన్నికట్టు పట్టుకు నాగుతుంటే పాలు ఇత్తడి ముంతనోకి తన్నడం మొదలెట్టాయి. నచ్చివి నెమ్మదిగా తల పైకెత్తింది బరువు దిగుతున్నట్లు. సూత్తున్న నానూ, సివుడూ నేసి నుంచున్నాం కంగారుగా.
ఓ ఏడాది ఇలా గడ్డిబొమ్మని సూపి పాలు పితికేసాడు గవరయ్య. ఆ పై వరుసగా నాలుగేల్లు రొండు గిత్తలూ, రొండు పెయ్యలూ. ఈనోగా గవరయ్యకి పందాల్తోపాటూ మందూ, పేకాటా పెరిగిపోయాయి. ఎకరం పొలం జపుతుకు ఎల్లడంతో అమ్మేయక తప్పనేదు. పొలం అమ్మేసాక అనవసరం అనిపించి సివుడిని అమ్మేసాడు. అయిదీతల తరవాత నచ్చివి ఈతకు పనికి రాదన్నాడు కాంపోండర్. అమ్మడం అలవాటైతే ఇంకేముంది. వరుసగా రొండు గిత్తలూ, తరవాత రొండు పెయ్యలూ మార్కెట్టుకి ఎల్లిపోయాయి. ఎవరూ కొనక నచ్చివి, బండికోసవని నానూ మిగిలిపోయాం. కొండమ్మ డోక్రా గూపులో సేరి మిగిలిన మడిసెక్కలో కూరగాయలు పండిత్తాంది. ఆటిని మార్కెట్టుకి సేర్సి కొండమ్మని కూకో బెట్టి తను బండి తోల్తానంటాడు. ఆదాయం మారిపోయినా అతని అలవాటులు ఏమాత్రం మారనేదు. పైగా ఈ మద్దెన ఎర్రమ్మ ఒచ్చి పడింది ఆల్లిద్దరి మద్దెన. గవరయ్య నెక్క ప్రకారం ఎర్రమ్మ దారిలోకి ఒచ్చేసినట్లే. ఆమెకీ మద్దెన అయిదేల రూపాయలు అరిజంటుగా అవసరవడ్డాయట. ఇత్తే ఎర్రమ్మ గవరయ్య బండి ఎక్కేసినట్లే. ఇప్పుడు అతని కాడ రెండేలు మాత్రవే ఉన్నాయి. అందుకే గిలగిల్లాడి పోతన్నాడు ఏంసేయాలో తెలీక. బండేసుకొని, బేరం మానేసి సివకోడే కాదు. రాజోలు కూడా తిరిగేసాడు. అలాంటేల ఒట్టోయిందని సెప్పడంతో నచ్చివి మీద పడింది గవరయ్య కన్ను.
“ఇంక దేనికే. బక్కసిక్కిన ముండ. సచ్చిపోతాదంటే ఆంబోతుని ఒదిలేసి ఇత్తనం పోతుని అట్టుకొచ్చినా. ఒట్టోయినాక ఎంత దున్నితే మాతరం ఏటి నాబవే. ఇంక దీనికీ, నీకూ ఏటి తేడా నేదు. తెల్లారి దీన్ని కబేలాకి తోలేయడవే. అది ఉండెంత. నేకెంత?“ లచ్చివి వంకే సూత్తూ తేల్చేసాదు గవరయ్య. కొండమ్మ సీరకొంగుని నోట్లో కుక్కుకుంది ఆ మాటలకి తట్టుకోనేక. పడుకున్న నాను లేసి నిలబడ్డాను కంగారుగా. లచ్చివి తల ఒంచుకు నిలబడింది.
“పది పన్నెండు ఈతలు తీత్తాది ఆవు. కాత్త సత్తువు లేనిది. ఈ సాలుకు ఒదిలేయి మావా” బతిమాలినట్టు అంది కొండమ్మ. “ఏటొదిలేసేదే? ఏటొదిలేసేది? ఒచ్చి సూసి సెప్పాడు కదా. పనికిమాలిన దానికి తిండి దండగ!” ఇసుక్కున్నాడు గవరయ్య.“అది కాదు అసలు సంగతి. ఎర్రమ్మకి ఏదో బేరం పెట్టావటగా. తక్కువైనట్టుంది. అది సెప్పు” అంది రుసరుస లాడుతూ కొండమ్మ. గతుక్కుమన్నాడు గవరయ్య.
“ఎడిసావ్! అట్టాంటియి ఏం లేవ్. తిండి దండగ దాన్ని తెల్లారితే కబేలాకి తోలేయడవే” కొంపలోకి పోయి బయటకు రానేదు గవరయ్య. సాలాసేపు ఆడనే కూకుండి పోయింది కొండమ్మ. లచ్చివినే సూత్తూ, ముక్కు సీదుకుంటూ – ఏడుత్తుందేమో అనిపించింది. తెల్లారుతుండగా అనుకుంటా కొండమ్మ లచ్చివితో అంటోంది, “లచ్చివీ! ఒట్టిదానివని నిన్ను కబెలాకి తోలేత్తాడంట. రేపటేల నన్నూ తోలేసే రకం ఈడు. ఈడ మన బతుకింతే! సీనుగాడు తోడుంటాడు. పారిపోయే! ఆ ఎర్రమ్మకి సొమ్ములు ఎట్టా ఇత్తాడో సూద్దారి. బండి కట్టిన డబ్బులన్నీ తాగుల్లకీ, తిరుగుల్లకీ తగలేత్తన్నాడు. సీనుగాడే నేకపోతే నోర్మూసుకుని కూకుంటాడు నాకాడ” అంటూ లచ్చివి పలుపు తాడు, నాది కూడా ఇప్పేసింది. సెవులు రిక్కించి ఇంతగా చూసాను తన వంక.
“ఒరే! తీసుకెల్లరా లచ్చివిని. ఏడకన్నా పారిపోండే. ఈడు సంపేత్తాడు”. సావిడి రాటకు ఏలాడదీసిన లాంతరుని నాగి నేలకేసి కొట్టింది! లాంతరు కిరసనాయిలుతో కలిసిన ఎండు గడ్డి బగ్గుమంది. నాను ఆ మంట ఎలుగులో లచ్చివి వంక సూసాను. కొండమ్మ రొండు సేతులతో లచ్చివి ఎనకనుంచి ముందుకు తోసింది. తన ఎనకే నానూ పరుగందుకున్నాను.
తెల్లారేదాకా కొబ్బరి తోటల్లోనే తిరిగాం. లచ్చివి పరిగెత్తనేక పోతోంది. నెమ్మదిగా గోదారి గట్టెక్కాం. ఒక్కపాలి ముందెల్తోన్న లచ్చివి ఆగింది. ఎనక నానూ ఆగాను. గోదారి కాలవ మీద గాలి. ఎంత బాగా ఉంది. తోక ఊపుతూ తల పైకెత్తాను.
“గవరయ్యా! అదిగో! గోదారి గట్టెంట సీనుగాడు, లచ్చివీ! లగెత్తరా!” ఎనక గంగులు అరుపు ఇనబడి అదిరిపడ్డాను. సూసేసినాడన్న మాట సచ్చినోడు.
ఒక్కసారి తలూపి పరుగందుకున్నాను. లచ్చివి పరిగెత్తనేకపోతాంది. ఎనక గంగులు గాడు అరుత్తూ ఒచ్చేత్తన్నాడు. ముందు పరిగెత్తుతోన్న లచ్చివి ఆగిపోయింది. ఎదురుగా గవరయ్య గట్టుమీద ఉరుక్కుంటూ ఒచ్చేత్తన్నాడు. ఏం సేయ్యాలో తోచనేదు – ఉన్నట్టుండి లచ్చివిని గోదాట్లోకి ఓ నెట్టు నెట్టాను. ఎనకమాల నానూ దూకేసాను. గబగబా కాల్లతో నీటిని ఎనక్కి నెట్టి కొట్టుకుపోతన్న లచ్చివి ముందుకొచ్చేసాను. గోదారి తోసుకుంటూ పోతాంది ఇద్దర్నీ. గంగులూ, గవరయ్యా ఆడే ఆగిపోనట్టున్నారు! లచ్చివి నన్నంటుకుని ఉండిపోయింది తల పైకెత్తి. అలా ఏడకి కొట్టుకుపోతన్నావో తెల్దు. నేనూ తల పైకెత్తి కల్లు మూసుకుండిపోయా.
ఆగిపోయినట్లనిపించి కల్లు తెరిచాను. ఇసక దిబ్బ. కొంత దూరంలో కొబ్బరి సెట్లు. ఇంకా అరిటి మొక్కలు కూడా కనిపిత్తన్నాయి. ఏదో లంకకి కొట్టుకొచ్చామన్న మాట. నాకు ఆనుకునే ఉన్న లచ్చివి కూడా తలెత్తి సూసింది. తన కల్లల్లో ఏదో మెరుపు కనిపించింది. నెమ్మదిగా లేసి లోపలికి నడిసాం. సుట్టూ గోదారి. నోపల పచ్చటి మొక్కలు, సెట్లు. సల్లటి గాలి. దూరంగా పొగ కనపడతాంది. మడుసులున్నారన్న మాట. కానీ గవరయ్యలు ఉండరు, కబేలాలు ఉండవు. బలవంతంగా సావడం ఉండదు. అరిటి సెట్ల దగ్గరకెల్లాం. అడిగే వాడు లేడు.. ఆకుల్ని లాక్కుని మరీ తిన్నాం. పచ్చటి గడ్డి. ఎన్నాల్లయింది. కడుపు నిండి పోయింది. కాత్త ఎనక్కి ఎల్లాం. సీకటిగా అనిపిత్తాంది పగలే. తను నెమ్మదిగా వాలింది. తన ముందు నాను కూడా. తన గిట్టలు నా ఎన్నుకి తగులుతున్నాయి. తాపీగా సెవులు ఊపుకుంటూ నెమరేత్తన్నాం. బతుకు ఇంతిలా బతికినంత కాలం ఉంటే. కల్లు మూసుకున్నాను.
“ఈ లంకలోనే ఉంటాయి. ఎతకరా గంగులూ!”
గవరయ్య మాటలు ఇని ఉలిక్కిపడి కల్లు తెరిసాను. కాత్తంత దూరంలో గవరయ్యా, గంగులూ మాకొసవనే ఎతుకుతూ ఒత్తన్నారు. గుబురుమొక్కల మద్దెన ఈ నల్లెద్దు కనిపించినట్టు నేదు, నా ఎనక లచ్చివీ కనపడదు. అలాగే కదలకుండా ఉన్నా. ఆల్లు దగ్గరకోచ్చేత్తన్నారు. సూడకుండా పక్కకి పోతే ఇలా దాటేయొచ్చు. ఈలోగా కంగారుపడి లేచి నిలబడిపోయింది లచ్చివి.
“గవరయ్యా! అదిగో లచ్చివి. ఆ కర్రి సీను గాడు అడ్డంగా ఉన్నాడు. ఈపాలి సూడు” అరిచినట్లు అన్నాడు గంగులు. తన తప్పు తెలిసి పరిగెత్తింది లచ్చివి. ఎనక నేనూ పరిగెత్తా. మా ఎనక ఆల్లు తరువుతున్నారు. కాసేపటికి లచ్చివి ఎనకపడి నేను ముందయ్యాను, ఎనక నుంచి గవరయ్య అరిచాడు.
“గంగులూ! ఆ సీనుగాడిని ఆపడం కట్టం. ఈ లచ్చివిని ఏసేయ్! ఆడే ఎనక్కి ఒత్తాడు”
గబుక్కున ఆగిపోయాను. ఈ లోగా కర్రతో గట్టిగా బాదిన సప్పుడు, ఆ ఎనకనే ‘అంబా!’ అన్న లచ్చివి గొంతూ, దానితోపాటూ దభీ మని పడిన సప్పుడూ ఇనిపించాయి. ఎనక్కి తిరిగాను. లచ్చివి కుప్పకూలిపోయి పడిఉంది. దాని ఎనక రొండు సేతులతో లావాటి పొడవైన కర్ర పట్టుకొని గంగులు సూత్తన్నాడు. ఒక పక్కగా గవరయ్య నావంకే సూత్తన్నాడు మీద పడాలని. నాను గంగులు వైపు సూసాను. నా సూపు సూసి రడీగా నిలబడ్డాడు గంగులు.
“పొట్టికొమ్ములు సీనుగాడియి! అంకవు. గంగులూ, ముంగాల్ల మీద ఏసేయ్ దెబ్బ! పడిపోతాడు” గవరయ్య అన్నాడు. కానీ బాస నాకు తెల్దని బెమ. అందుకే కన్ను మూసితెరిసే నోగా గంగుల్ని ఒదిలేసి గవరయ్యని నా పొట్టికొమ్ముల తల ఒంచి గురి సూసి గుద్దేసాను.
“అమ్మ నీయమ్మా! సంపెసావురా నంజకొడకా” గొంతు పగిలేలా అరిసి కింద పడిపోయాడు గవరయ్య. అలా సేతులు తొడల మద్దెన పెట్టుకుని గిలగిల లాడి పోతన్న గవరయ్యని సూసి అయోమయంలో కర్ర ఒదిలేసి దగ్గరకు పరిగెత్తాడు గంగులు. నేను లచ్చివి దగ్గరకెల్లి సూసాను. ఎనక్కాల్ల మీద బాదేసాడేమో లేవనేక పోతాంది. కాత్త దూరంగా పోయి పడి ఉన్న గవరయ్యనే సూత్తన్నాను. గంగులు లేసి నిలబడి లచ్చివి దగ్గరకు ఒత్తూ అన్నాడు
“మరయితే లచ్చివి నడిసేలా నేదు. మోసుకు పోవాల్నా?”
“ఉప్పుడు దాన్ని మోసుకుపోయి ఏటి సేత్తావురా ఎదవా? “
“అదేటి గవరయ్యా? కబేలాకి తోలేసి, ఎర్రమ్మకి సొమ్ములివ్వాలిగా!”
“నంజికొడకా! ఈ పోజీసంలో ఎర్రమ్మ అవుసరంరా! నన్ను మోసుకు పో బెగీ ఆస్పటాల్ కి” మూలుగుతూ అన్నాడు గవరయ్య.
“మరి, లచ్చివి?”
“దాని సావు అది సత్తాది. దాన్నట్టానే ఒగ్గీ. దాన్నమ్మితే మూడేలు కూడా రావ్. అసలీడ్నుంచి ఎట్టా తీసికెల్తావ్ రా దాన్ని? ఒగ్గీ. “ఇసుగ్గా అన్నాడు గవరయ్య.
“మరి. సీను గాడు?” అయోమయంగా అడిగాడు గంగులు
“ఇంత ఎదవ్వేటిరా? పాతికేలు ఆడి కరీదు”
గవరయ్యని ఈడనే ఒదిలేసే కంటే, లచ్చివినే ఒదిలేసి గవరయ్యని లాక్కూపోడం మంచిది. లచ్చివికి ముందు కబెలా తప్పింది. ఇక్కడ బతికినంత కాలం దానిట్టం. అడిగే ఓడు నేడు. ఆడ కొండమ్మ ఒంటరిదై పోతాది. దానికి గవరయ్య కావాలి. ఇప్పుడు గవరయ్యకు ఎర్రమ్మ కుదరదు. బతకడానికి బండి కావాలి. బండికి నాను కావాలి. అమ్మేత్తే కొని తెచ్చి, పెంచాడు. పోనీ. అమ్మలాంటి కొండమ్మ కోసం. ఏదో ఆలోసిత్తా గంగులు మాటలకి ఈలోకంలోకి ఒచ్చా.
“ఒత్తాడా అని? దగ్గరకెల్తే. నీ లాగే నన్నూ గుద్దేసేలా ఉన్నాడు. సీనుగాడి సంగతొదిలీ. నిన్ను పడవ దాకా మోసుకెల్లేదెలా అని? ఒంద కేజీలుంటావ్” ఏదో ఆలోసిత్తూ అన్నాడు గంగులు
“మరయితే ఏటి సేద్దావనిరా? నన్నూ ఒదిలేత్తావా!” అయోమయంగా అడిగాడు గవరయ్య.
“అదే కదా ఆలోసించేది. ఓ సారి నా సెయ్యట్టుకుని లేసి సూడు!” సెయ్యి అందించాడు గంగులు. గవరయ్య అలానే లేవబోయి “ఓర్నీయమ్మా!” అంటూ పడిపోయాడు.
ఇది జరిగే పని కాదు. నేనే నెమ్మదిగా దగ్గరకెల్లి మోకాల్ల మీద కూకున్నా. గవరయ్యా, గంగులూ ఒకరి మొకాలు ఒకరు సూసుకున్నారు ఎర్రిగా. నానట్టా నొంగుతానని అనుకొనేదు ఎర్రెదవలు.
కాసేపటికి గంగులు సాయంతో గవరయ్య నా వీపు మీద అడ్డంగా బోర్లా పడుకున్నాడు. నేను ఒక్కసారి నచ్చివి వంక సూసి నెగిసి నిలబడ్డాను. నా ఎనక పడిపోకుండా గవరయ్యను పట్టుకు నడుత్తున్నాడు గంగులు. నాకు తెల్సు. నచ్చివి నా ఒంకనే సూత్తూ ఉంటాది.నల్లటి కల్లతో. ఆయ్.
6 Responses to “కర్రెద్దు”
రచయిత పరిచయం ఇస్తే బావుండేది. ఈ యాస కథలు అందరికీ అర్ధం కావండీ బాబూ
Any art work is that riddle to that artist vision….
So yes only few can solve the riddles.
కర్రెద్దు ద్వారా కథ చెప్పిన తీరు బావుంది. రచయితకు అభినందనలు
కథ చాలా బాగుందండి.
భాష మాధుర్యం తప్పితే కథలో ఏమీ సహజత్వం లేదు. సినిమా కథ లాగా ప్రేమ త్యాగం, ప్రేమ గొప్పదనం అనే ఒక అభూత కల్పనను అందంగా మాత్రం చెప్పాడు కథకుడు. ఇలా అబద్దాల కలల్లో జీవించడం నేర్పే కథకు కథా రచయితకు అభినందనలు. సామాజిక సమస్యల పరిష్కారానికి దోహద పడని, సామాజిక అభివృద్ధికి అక్కరకు రాని రచనలు కూడా సాహిత్యం అయిపోతున్నాయి.
కథకు భాషా సౌందర్యమూ , వస్తు ఎంపికా , కథనముతో పాటు చదివించే గుణమూ( readability) అత్యవసరం.
పై లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కథ యిది.
కథారచనలో సహజత్వాన్ని ప్రదర్శించడం ఒక లక్షణమైతే నాటకీయతను ( తిక్కన గారిలా) ప్రదర్శించడం మరొక పద్ధతి.ఇది ఆ రెండవ వర్గానికి చెందినది.
మనిషి హీన స్థాయికి దిగజారిపోయినా, పశువు మనిషి స్థాయికి దిగజారదని చెప్పడంలో రచయిత కృతకృత్యులయ్యారు.
ఇటువంటి కథలు తెలుగు కథకు జవసత్వాలిస్తాయనడంలో సందేహం లేదు.
విలువైన కథను అందించిన రచయితకు , తెల్సా వారికి హృదయపూర్వక అభినందనలు.