వాన మబ్బులు
మొబ్బులు మొగిలిపొద మాదిరి చిక్కగా అల్లుకొని మూడు పొదుండ్ల వాన కుర్శినాది నిన్న మొన్న.
యీపొద్దేమో ఎవ్వురో ఇసిరి పారేసిండెమాదిరి ఆడాడ పడుండాయి మేఘాలు.
సూరీడు లోకమంతా కొత్త ఎలుగు కుమ్మరిస్తుండాడు.
చెట్లు పుట్టలు అబ్బుడే తానమాడినట్టు కళకళగా మెర్సిపోతుండాయి.
భూమెమ్మ చల్లబడి చిక్కగా నవ్వుతునెట్టుగానే ఉండాది.
చేనికాటికి పోయేటి దొవ ముందెబ్బుడూ చూడనంత సొగుసుగా ఉండాది. అచ్చంగా ఆడదాని తలలో పాపిట మాదిరి.
ఆకాసం వుందాతనం, భూమెమ్మ సింగారం చూస్తానే అడుగులో అడుగేసుకుని మా చేన్ల దెగ్గిర దెగ్గిరికి చేరుకుంటిని.
ఉన్నేట్లుండి గాలి దిక్కు మాస్చినాది. గాల్లో అలలు అలలుగా పాటొగిటొచ్చి చెవులో పడినాది.
‘ఊరూరి ఉల్లిబూసే గంగమ్మ
మావూరి మల్లిబూసే జేసమ్మ
ఇట్టా తిరిగొచ్చే ఏడాదికి తిరపతి గంగ నీకు
తీలిపూల దోర్నాలే!
జగ్ జగ్! జగ్ జగ్!’ అని పాట సాగిపోతానే ఉండాది.
ఆ పాట పాడతాండే గొంతు ముందేబ్బుడొ బాగా ఇన్నేట్టే ఉండాది. పాడతాండే మనిసికోసరం నా కండ్లు ఆ దిక్కుకల్లా ఎతికినాయి. ఎదురెండ సరిగ్గా కండ్లకి కొట్టింది. దెబ్బకి కండ్లు బూసులు గమ్మినాయి ప్యానం తికిమికిలి అయినాది. కండ్లు పులుముకొని చుసినా గూడా మనిసి మసక మసగ్గా కనపడుతుండాడు.
కొంచిం తేరుకొని చేతుల్లో ఉండేటి సద్ది సంగటి, సంకన ఉండేటి చిక్కాన్ని కిందపెట్టి నొస్టకి చెయ్యి ఆనించుకొని చూస్తే పాటే కాదు పాటకి తగినట్టు ఆట కూడా అడుతుండాడు ఆ మనిసి.
ఆ మనిసి ఎవ్వురో కాదబ్బా! మా ఇంటాయినే!
నాకి ఆచ్చెర్యమంటే మరీ ఆచ్చెర్యం గాదు. గెడ్డం మింద చెయ్యి పెట్టుకొని అట్టాగే చూస్తా సిగ్గుపడతా ఉండిపోయినాను కొంచెపు. మా ఇంటాయనలో ఇసుమంటి కలలు గూడా ఉండాయని అబ్బుడే తెల్సినాది నాకి.
పాటకి పరవశించినాయో! వానకి ముర్శిపోయినాయో! తెలీదుగానీ పంటచెన్లు రాగాలు తీస్తున్నాయి. చేను చుట్టునున్న చెట్లు ఒకదానికొకటి రాసుకుంటా సంగీతాలతో పాటకి యింగా అందాన్నిస్తుండాయి. చూస్తుంటే కండ్లకి మనుసుకి పెద్ద సంబరమైనాది.
ఉండుకున్నట్టే పాట, ఆట ఆపేసి కిందకొంగి నీళ్ల మడవ ఇంగోపక్కకి మలదిప్పి తలకున్న రుమాలు తీసి ఇదిలించుకుంటా నా కల్లా చూసి చిన్నగా నవ్వినాడు. ఆ నవ్వు అచ్చంగా మల్లెపువ్వు ఇరిసినంత అందంగా ఉన్నింది.
దెగ్గిరికి పోతాపోతానే “బలే వుశారుగా వుండావేమయ్యో! కాళ్ళు చేతులు కడుక్కొని రా. రొవ్వంత ముద్ద కడుపులోకి పోతే ఇంగా సక్తి వస్తాది. అప్పుడింగా బాగా గొంతుపెంచి పాటపాడి అడుగేయ్యోచ్చును” అంటా సద్ది సంగటి, ఊరిబిండి, ఉప్పు మిరక్కాయి ఉండేటి చిక్కాన్ని గెనం మీద పెడ్తిని.
నా కల్లా చూసి సిగ్గుపడతా “ఇతూరి తిరపతి గెంగమ్మ తల్లి కన్నుతెరిసి మనల్ని చల్లగా చుసినాది. ఎబ్బుడూ రాళ్లు రప్పలు కంపా గట్రా ఉండేటి బాటేరు ఇతూరి నిండిపోయి మురిసిపోతుంది. పెద్దూరి చెరువు పొంగి పోర్లి సంబరపడతాంది. కట్టకింద బాయి, చెరువుకింద బాయి నిండుకుండలై తొణకలేక మూలుగుతుండాయి.
ఇంగ ఏడాదంతా నీళ్లు తరగవు.
మన కడుపులు కాలవు.
ఎటుచూసిన నీళ్లే.
మనసు నిండా సంతోసాలే.
మిట్ట చేను చెనిక్కాయలు, అనుములు, అలచందలు, కందులు, సామలు, సద్దలు, రాగులు, జొన్నలు.
కానకయ్యిల్లో వరిపంట.
చదరం కయ్యిలో చెరుకు తోట అబ్బా! అబ్బా! తల్సుకుంటుంటే వొళ్లు పులకిస్తుండాది.
వొగు పంట చెడిచేసినా ఇంగో పంట నిలబెట్టుతాది మన బతుకుల్ని.
ఎటు చూసిన పచ్చా పచ్చగా ఉంటే పరవశంతో పాట, ఆట నాకే తెలీకుండా వచ్చేస్తుండాది. మన బతుకులు పచ్చగా ఉండబోతున్నాయనే బరోసాతో” అని సంతృప్తిగా చెపుతూ కాళ్ళు చేతులు మొగం కడుక్కోనొచ్చి గెనం మింద కూసోని సద్దిసంగటి తిన్యాడు తృప్తిగా.
ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ ఉల్లిపూసలు
మా ఇంటాయిన మొగంలో మా పెండ్లయిన కొత్త కొత్తలో చూసినాను ఇసుమంటి సంతోసం, మళ్లింకి ఇన్నాళ్లకి చూస్తుండాను. ‘యీ సంతోషం కడంతకాలం ఉండాలి భగమంతా’ అని దేముణ్ణి గెట్టిగా మొక్కితిని కానీ కాలం చేసిన గాయం మానతాదో తిరగబడి మల్లోసారి గుండెకోతనే మిగల్చతాదో చూడల్ల.
మల్లెపువ్వు ఇరిసినంత చిక్కగా చుక్కలు, చందమామ ఎలిగిపోతుండాయి ఆకాసంలో.
వాన్లు పడి నిల్సినంక ఆకాసం పుచ్చపువ్వు మాదిరి బలే సొగుసుగా తేరిడిగా ఉండాది.
“ఆరుద్ర వాన అదున్ల వాన ఆరుద్రలో పడ్తే దరిద్రం ఉండదు అడ్డెడు సల్లితే పుట్టెడు పండతాయి. అట్లాంటి అరుద్రం మొదుల్లోనే మూడు పొదున్లు వాన పడినాది. యింగ బిరువులు బిరువులుగా గూడా వాన్లు పడ్తానే ఉంటాయి. బూమ్మెమ్మ యీతూరి నాల్గు రూకలు ఎక్కువే ఇస్తాది. మన కట్టాల్ని గెట్టెక్కిస్తాది” మనుసుని నిమ్మలంగా చేసుకొని మొగంలో ఎన్నెలలు కురిపిస్తా సంబరంగా చెప్పినాడు మా ఇంటాయిన.
పిలకాయిలు నేను ఆ మాటలకి సంబరపడిపోయినాము.
అబ్బుడనంగానే మాయత్త ఉండుకొని “ఒరేయ్ చిన్నోడా నోరు చప్పగా ఉండాది ఏమైనా తేగూడదా?” అనింది అదును చూసి పొదును పెట్టిన మాదిరి.
మాయత్తకి తెల్సు ఎబ్బుడు ఎట్లుండల్లనో. ఆ మాటకి నేను అడ్డం చెప్పలేదు. మాయత్త సాకుతోనైనా పిలకాయిలు గూడా ఓ ముక్కో, ముర్రో కొరకతారని.
మాయత్త మాటకి బొదులుగా “సరేమా, నేనుపోయి మస్తాన్ బాయ్ దెగ్గిర కోడికూర పట్టుకొస్తాను. ఈ సంబరం అంబరం కావల్ల. ఆకాసంలో చుక్కల్లా నీవు, నాపెండ్లాం! నేను, నా ముగ్గురు బిడ్డలు ఎలిగిపోవల్ల” తెగాయింపుగా, తెంపుగా ఆకాసం కల్లా తలెత్తి చూసి, గర్వంగా చెప్పిపోయినాడు కోడికూర తెచ్చేదానికి మా ఇంటాయిన.
నాకి తెల్సి మా ఇంట్లో కోడి కూర ఉడకేసి దెగ్గిర దెగ్గిర రెండేన్లు అయింటాదనుకుంటా.
కూర పొయ్యిమీద ఉడుకుతుంటే పిలకాయిల మొగంలో ఎన్నెల కురస్తుండాది.
వొపక్క పొయ్యిలో కోడికూర, ఇంగోపక్క రాగి సంగటి ఉడకతాంటే వాసన అబ్బుడబ్బుడే ముక్కుని తాకినాది.
నా పెద్ద కొడుకు మెల్లిగా దెగ్గిరికి వచ్చిందానా “మా మోవ్ ఉడికిండాదా కూర?” అనినాడు.
“ఇంగా ఉడకల్ల నయినా” అంటిని.
“ఎదిమా! ఓ తుండు గెంటితో ఎత్తియ్యి ఉడికిండాదో లేదో చెపుతాను” అనినాడు.
మద్దిలో నా కూతురొచ్చి “నువ్వేమి చెప్పద్దులేరబ్బా! ఉడికింది లేదనే సాకుతో తినేద్దాం అనే కాదా?” అని మొగం తిప్పి రాగం తీసినాది.
మాయతైతే కడప్మాన్ని వద్దల్నే లేదు. ఆయమ్మకి పెట్టకుండా యాడ తినేస్తామో అని ఆయమ్మ భయిము.
కోడికూర కోసరం నా బిడ్డలు తగువులాడుతా, మాయత్త గుమ్మాన్నే కాపెట్టుకొని ఉండేది చూస్తుంటే నాకి శ్యానా బాధేసేసి ‘ఎటుమంటి బతుకు బతకతా ఉండామురా భగమంతా! పిలకాయిలకి కడుపునిండాకా తిండి పెట్టేకి గూడా లేని ఈ బతుకు ఉండేమి సుగము, ల్యాకేమి సుగము.
ఉండేటోళ్ల కంటే లేనేల్లే మేలని ఊరికే చెప్పినరా పెద్దోళ్ళు.
చుసినంత దూరము కయ్యి, గాలవలె కానీ కడుపు నిండిందేమో లేదు. ఆడాడ కొందుర్ని చూస్తుంటే వాళ్లి బతుకు మేలనిపిస్తుంది. ఊరూరా తిరగతా దొరికిన గువ్వో, ఎలకో, పిల్లినో, పట్టుకు తిని బతికేటోళ్ల బిడ్డలు మారాజుల్లా ఉండారు యీపొద్దు. వాళ్ళకి బయిము, దిగులు, బాద, కట్టం ఎట్లుంటుందో తెలీదు. “ఈ వూరు గాకుంటే ఇంగో ఊరు, యీపేట గాకుంటే యింగో పేట, ఈ దేశం గాకుంటే యింగోదేశమైందిలేరా” అనే తేగాయింపు, తెంపు వాళ్లికి ఉండాది.
అదే మా ముండమోసిన ముండ బతుకుల్లో అట్ల కాదే. యీల్లెమంటారో, ఆల్లెమంటారో, ఇంగోగురేమంటారో నని పరువుకోసరం పాకులాడతా కడుపులు మాడ్చుకుంటా బతికేస్తుండాము.
‘మా కత ఎట్లైనా పోయి చావని అంతా అయిపోయినాది మాకింకేం కావల్ల? కందమ్మలు నాబిడ్డలు తిండికి లేనోళ్లు మాదిరి కోడి కూర కోసరం తగువులు అడుతుండారంటే మా దెట్లా బతుకో కండ్లు తెరిసి కొంచిం చూడు భగమంతుడా!’ అని దేమునికి చెప్పుకుంటా కూర సట్టి కింద పొయ్యిలో కొరువులు ఎగేస్తా కూర గెంటితో కలబెడతా ఉండాను.
ఆపక్కుండే పొయ్యిమీద ఉడకతాండే నూకలు గప్పున పొంగొచ్చి పొయ్యి బుస్సుమని ఆరిపోయినాది. సట్టిమీద పిలేటు తీసి ఆరిండే కొరువుల్ని ఎగేసి ఊదబర్రతో ఊబినాను. పొయ్యి మండుకునింది. కాసేపుటికి రాగిపిండి పోసి సంగటి కలికి ముద్దలు చేసి బాగానీలో ఏసినాను.
ఇంగోపక్కుండే కోడికూర అబ్బుడనంగానే ఉడికినాది. కొరువులు ఆర్పేసి సంగటి ముద్దలు, కోడికూర ఎత్తుకొని పోయి ఇంటిముందర పడసాల్లో పెడతా ఉండాను. నా కూతురు సొమ్ముతో నీళ్లుముంచుకొచ్చి పెడతాంది. చిన్నోడు అన్నం గిన్నెలు తెచ్చి పెట్టినాడు. మాయత్త పెళ్ళోకి పోయి చేతులు, నోరు కడగతాంది గబగబామని.
మా ఇంటాయిన అబ్బుడే బైటనింకా ఇంటికాడికి వస్తా “కోడికూర వాసన భలేగా జమాయిస్తుండాదే” నా కల్లా చూసి నవ్వినాడు. “కడుక్కొని రాబోబా!” అని సొమ్ములో నీళ్లిచ్చినాను.
“నువ్వు కడుక్కోమేయ్ తినేద్దాం! సంగటి ఆరిపోతే బాగుండదు తినేకి” అనినాడు. అందురూ గిన్నెల చుట్టూ కూర్చున్నారు. ముందుగా పిలకాయిలికి, మాయత్తకి గిన్నిల్లో పెట్టిచ్చినాను.
కడుపునిండకా తినేసి పిట్టుక్కుమని ఎక్కడోళ్ళక్కడ పోయి కుక్కిన పెన్లు మాదిరి గడ్చిప్ మని పొనుకునారు.
మా ఇంటాయిన నేను పెనుములో ఉండేది బండేది ఊడ్చుకొని గిన్నెలో పెట్టుకొని ఒక్కొకడి తింటా ఉండాము.
పిలకాయిలు కడుపునిండకా తినిందానికి నాకి నెమ్మతిగా ఉనింది ప్యానం. మా ఇంటాయిన నా మొగం కల్లా చూసి “యిపొద్దు బలే తెంపుగా ఉండావే” అనినాడు.
“ఎన్నిదినాలు అయినాదో పిలకాయిలు కడుపునిండకా కూర, కూడు తిని. యిపొద్దుకి మోచ్చం కలిగినాది. దానికే మొగంలో తెంపు ఉండాది” అంటిని.
“దేముడు కండ్లు తెరిసినాడు. మంచి దినాలు వస్తుండాయి. ఇంగెబ్బుడూ ఇట్లనే తింటాము. బిడ్లకి కడుపునిండా తిండి పెడతాము” భరోసాగా చెప్పినాడు.
మా ఇంటాయిన అట్ల చెపుతుంటే మా నాయినే గుర్తుకొచ్చినాడు.
నాకి నా తొమ్మునికి ఉండేది బండెది పెట్టి ఎన్ని దినాలు పొస్తు పొనుకున్యారో? మేము నిద్రబొయినామనుకొని మా నాయిన “ఒమేయ్ పార్వతి రేపిటికి నూకలు ఉండాయా?” అంటే
“యాన్నో కాసిన్ని ఉండాయి. తెల్లారికి గెంజికి సరిపోతాయిలే దిగులు పడకుండా పొనుకో, రేపిటి కత రేపిటికి” అనింది మాయమ్మ.
“వానేమ్మనాయలి సేద్యమైపోయే యాపొద్దు బాగుపడింది లేదు. అట్లని వొదిలిపెట్టేసి యడన్నా దూరంగా పట్నం కల్లా పోయి కక్కూసులు కడుక్కొని బతకదాం అంటే మనల్ని నమ్ముకొని ఉండేటి బూములు, గొడ్లు, గోదలు ఏమైతాయి?”
“అయినా గాని మనం దేశానికి తిండిపెట్టెటోళ్లము మనమాదిరి అందరూ అనుకోని ఊర్లోదిలి పూడిస్తే పంటెవ్వురు పండిస్తారు. తిండి గింజలెట్లా వస్తాయి. మనమెబ్బుడూ వొగురికి పెట్టేమాదిరే ఉండల్ల మనుసుని చంపుకొని కక్కూసులు ఎట్లా కడుగుతామయ్యా! అట్లాంటి ఆలోసన పెట్టుకోబాకా చావైనా బతుకైనా భూమితోనే” అని గెట్టిగా చెప్పింది అమ్మ.
“మెయ్ మన బతుకు ఎట్లైనా పోనీ అట్లా చూడు. యీపోద్దో రేపో వొయుసుకి వచ్చేమాదిరి ఉంది మన బిడ్డ. రోయిక గుడ్డ చినిగిపోయింటే వొళ్లు కనిపిస్తాదని సూదితో కుట్టి కుట్టి ఏసుకుంట ఉండాది. మన బతుకులు మాదిరి వాళ్ళ బతుకు ఉండగూడదు గదా” అని అమ్మ, నాయిన మాట్లాడుకుంటూనే ఉండగా నేను నిద్రలోకి జారుకున్యాను.
యిపొద్దుకి పదైదేండ్లు అయినా వాళ్లి మాటలు ఇబ్బుటికీ కండ్లల్లో మెదలతానే ఉండాయి. మా నాయిన్ని తల్సుకుంటానే గుండె బరువెక్కినాది. మనసు మూగబోయినాది. మాట సన్నగిల్లినాది కండ్లల్లో నీళ్లు తిరిగినాది.
“మెయ్ ఇబ్బుడే కదా సంతోషంగా మాట్లాడినావు అబ్బుడే ఏమైనాది. ఆ కండ్లుల్లో నీళ్లు దేనికి” అన్నాడు దెగ్గిరికి తీసుకుంటా మా ఇంటాయిన.
ఏం చెప్పేది ఉనిందే కదా చెప్పల్ల అనుకోని “మా నాయిన గుర్తొచ్చినాడు” అంటిని.
యాట్నింక వొచ్చిండాదో కోపం భుజానికి అనించుకొని ఉండేటి నన్ని గబక్కని పక్కకి నెట్టేసి తింటుండే గిన్నెలో చెతులు కడిగేసి బిర్రని లేచి “నీయమ్మనాయాలి ముండ మీ వొంశం సొబావం ఏడపోతాదే తూ” అని ఊసేసి ఈదికల్లా పోయినాడు. ఆయప్ప తినకుండా లేసిపోతే నేనెట్ల తింటా? ఏడ్సుకుంటానే గిన్నెలో చెయ్యి కడిగి ఉండేటి కొద్దో గొప్పో ఎత్తి కుక్కలకి పారపోసి బిడ్ల పక్కన పోయి పోనుకుంటిని.
ఆపొద్దు చెనిగ్గింజలు ఏసేదానికి మడకలోళ్లు వస్తారని పొద్దుగలగానే లేసేసి ప్యాన్నిళ్ళు చల్లి ముగ్గులేసి సంగటి, ఉలవస్యారు, ఉప్పుమిరక్కాయి రెడీగా పెట్టి. మడకల చిన్నబ్బన్నోలింటికాడికి పెరిగెత్తిపోయిందానా తలుపుతట్టి ఆయన్నని లేపినాను.
నేను లేపిన దెబ్బకి ఇల్లాదులు లేసేసినారు. చిన్నబ్బన్న పెండ్లాం కాంతక్క ఆవిలిస్తా జుట్టు మూడేసుకొని బైటికొచ్చి, “ఏమే లచ్చుము నీక్యాట్నింక వచ్చినాదే ఇంత నానం. మొగోడు మాదిరి పారుకులాడతావు. యదరొమ్ముతో సగా ఎండిపోయినా సేద్యంలో బిరాడతావు.
నాయాలిసెమ సచ్చెదకా నిన్ను వొదిలేమాదిరి తెల్లదు.
పెండ్లయి పెండ్లి కూతురుగా వచ్చినబ్బుడు చిలక మాదిరి అందంగా ఉంటివి. నిన్ని చూసి ‘ఈ బిడ్డకి పోయి ఆ ఇంట్లో కాలం వస్తాదారా భగమంతా’ అనుకుంటి. ఇబ్బుడు చూస్తేయమ్మో మొగరాయిడు మాదిరి సంసారాన్ని యీదుతుండావు” అని యింగా ఏదో చెప్పేదానికి వచ్చినాది.
చిన్నబ్బన్న మడకలు, కాడి మాను ఎత్తుకొనొచ్చి ఎద్దులు తొలుకుంటా “తెల్లార్తో ఇది మాట్లకు పెట్టుకునిందా? పదమ్మా లచ్చుము, పదా! దానికేం గాని ఎన్నైనా చెపుతాది” అని కేక ఏసినాడు.
“సరే కాంతక్క నేను పోయొస్తాను” అని చెప్పేసి ఇంటికాడికొచ్చి సంగటి గుండాము, పార్లు, సంచులు ఎత్తుకొని మా ఇంటాయిన్ని నిద్రలేపి “మొగం కడుక్కొని ఇత్తనాల చెన్నిగ్గింజల మూట సైకీల్లో పెట్టుకొని తోసుకుని పాప నువ్వు ఇద్దురూ రాండీ, చిన్నబ్బన్న మడకల కట్టుకొని పోయినాడు. రామక్క గింజలేసేకి ఈ పాటికి పోయి ఉంటాది” అని గెట్టిగా చెప్పేసి చేనుదావ పట్టినాను.
మా చెన్లు కొంచిం దూరమే ఇంటెనకాల చింతచెట్టు కింద దూరి చేన్ల౦బడి పోతుంటే రాత్రి జరిగినది కండ్లుముందరకి వచ్చినాది.
మా నాయిన పేరు ఎత్తితే ఎబ్బుడూ గిట్టేల్దు వీలికి. చెప్పాలంటే యింగా అయిన సొమ్మంతా వీళ్ళ రొమ్మున ఏసుకొని నీళ్లుపోసుకున్నారు. సాల్ని కొదవకి నా జీవితాన్ని నాసినం చెసినారు. కండ్లుల్లో నీళ్లు తిరుగుతుండాయి.
దుఃఖం ఆపుకునేదానికి కాలేదు నానించి గెట్టిగా ఏడ్చేసినాను.
నా ఏడుపినేసి పక్కసేండ్లో పొయ్యేటి రామక్క “ఎవురాడా?” అనింది. తెల్లార్లేదు కదా ఆపక్కుండే మనిసి యీపక్కకి కనపళ్లెదు. రామక్క గొంతు ఇనేసి గబామని ఏడుపాపేసి కండ్లు తుడుసుకొని “నేనుకోవ్ లచ్చిమి”ని అంటి. దెగ్గిరికి వస్తా “ఎమ్మె! ఉండుకున్నట్టు ఆ మాదిరి ఏడ్చినావు” అనింది.
“ఎం చెప్పేది లెక్కా ఎబ్బుడూ ఉండేదే కదా మనిండ్లల్లో” అని తెంపుగానే అన్నాను.
ఆయక్క మళ్లింకి గొమ్మునుండకుండా “చెప్పుమే ఆ మాదిరి ఏడ్చి ఏమి లేదంటుండావు” అనింది. ఆయక్క అట్లంటానే ఏడుపొచ్చేసి గెట్టిగా ఏడ్చేసినాను మళ్లింకి. “గొమ్మునుండమ్మె గొమ్మునుండు దేనికి బాధపడతావు? తలకాయి నొప్పి వాస్తది, యడద్దు. ఏమైనాదిబ్బుడు? నీ మొగుడేమన్నా అన్నాడో! చెప్పు నా బొట్టబిడ్డని పొరకతో దిగదీస్తా” అనింది కోపంగా నాకనేసి నా బాధలు చెప్పెకి ఎవ్వురు లేరు రామక్క ఇంతలా అడగతాంటే ఆపుకునేకి కాకుండా “చెపుతాను కా చెపుతా” అంటిని. రామక్క నా కండ్లుల్లో నీళ్లు తుడిసింది.
“అక్కా ఏమి సెప్పేది? ముందుగలగా నా తలరాత బాగారాయలేదు దేముడు. ఎవ్వురినని ఏమి లాభం.
నా జీవుతం ఎబ్బుడో నాసినం అయినాది. అసుల్లో నేను మెచ్చి నా మెడలో బొట్టు కట్టించుకునింది లేదు. మా నాయిన ఇయ్యాల్సిన బాకీకి నన్ని వీళ్ళు కొనక్కచ్చుకున్నారు.”
“అదేందిమే అట్లా అంటుండావు. కొనక్కచ్చికునేది ఏమిడిది కొంచిం ఇవరంగా చెప్పు ఏమైనాది?”
“అబ్బుట్లో ఇదేమాదిరి బెమ్మాండమైన వానలు పడినాయి. మూడుపొదున్ల వాన ఊరందురూ మడకలు కడుతుంటే మా నాయిన దెగ్గిర దుడ్లు లేదని బాదపడతాంటే మా ఇంటాయినోళ్ళ నాయిన మా మామ మా నాయినకి జతకాపు. బాగా నేస్తంలే అబ్బుట్లో. ‘ఒరేయ్ జయరామ బీడుపెడితే ఏమొస్తది. ఇద్దో యీ దుడ్లు తీసుకోపొయి దున్నించి గింజలై నీదెగ్గిర ఉన్నేబ్బుడు యిద్దువుగాని’ అని దుడ్లు చేతిలో పెట్టి పోయినాడు. మా నాయిన ముందు ఎనక చూడకుండా దుడ్లు తీసుకొని పంట ఏసేసినాడు. ఆతూరి వాన్లు పడిందే పడింది నిలుకు నిమంద్రం లేకుండా.
వాన దెబ్బకి చెన్లో పంట చెన్లోనే కుళ్ళిపోయినాది. వొగు గింజా దక్కలేదు. ఒక్క రూపాయి గూడా కండ్లు చూడలేదు.
‘అబ్బుడనంగానే మా మామ నాకియ్యాల్సిన దుడ్లు ఇస్తేనే’ అని పట్టుపట్టినాడు. మా నాయిన అడుకున్నాడు, ధకోరించినాడు. మా మామ ఇనిపించుకోలేదు.
మా ఇంటాయిన తాగుపోతు తిరుగుపోతని ఎవ్వురు బిడ్డని యీలేదని ఇయ్యాల్సిన బాకీకి బొదులుగా మా నాయిన్ని అవుమానించి బెదిరించి నన్ని పెండ్లి చేసుకున్నారు.
నా పెండ్లయినాక మా నాయిన ‘బంగారట్ల బిడ్డని పొరంబోకోడికి ఇచ్చినామే’ అనే దిగులుతో మంచాన పడి కొన్ని దినాలకే చచ్చిపోయినాడు.
ఇబ్బుడు చుస్తే నా బతుకు యిమార్తో ఉండాది. రాతిరి మా నాయిన గుర్తొచ్చినాడు అన్నిండే పాపానికే తినే గిన్నిలో చేతులు కడిగేసి పోయినాడు మా ఇంటాయిన. ఇవన్నీ తల్సుకుంటే ఏడుపొచ్చేసినాది” అని ఇవరంగా చెప్పినాను రామక్కకి.
“యీ నాబొట్ట మంద ఇంతపని చెసినారా? దేముడు అందుకే మీ మామకి చచ్చెనబ్బుడు అట్లా గెతి పెట్టింది. పురుగులు పడి చచ్చినాడు” అని తిట్టినాది రామక్క.
“ఇబ్బుడు నా దిగులు నామ్మింద కాదు రామక్క, నా బతుకెట్లా అయిపోయినాది నాకింగేమి కావల్ల?
ఇంట్లో వొయసు కొచ్చిండే అడబిడ్డ ఉండాది. యీ సేద్యాన్ని నమ్ముకొని వేరే తావ ముప్పైవేలు అప్పు తెచ్చినాడు. యీతూరి పంట పోతే నా మాదిరి నా బిడ్డని ఏ తాగుపొతోనికో ఇచ్చి కట్టబెడతారనే భయం” అన్నాను రామక్క గుండెపై వాలి.
“నువ్వేం దిగులు పడొద్దు. ఎబ్బుడో ఓసారి ఇట్లా అయినాదని తడవ తడవ ఇట్లే అవుతుందా? ఏమికాదు గొమ్మునుండు. భూమేమ్మ మన కట్టాల్ని తీరస్తాది గాని” అని బరోసా ఇచ్చినాది రామక్క.
మాటల్లోనే చేన్లోకి వచ్చేసినాము.
మనుసులో మాతరం గెట్టిగా అనుకున్యాను
‘నా బిడ్డకి అట్లాంటి పరిస్థితి వస్తే కసువుకోసే కొడివిలితో మా ఇంటాయిన గొంతు కోసేసి నేనూ సచ్చిపోతాను. పిల్లలు ఏదో దారి చూసుకుంటారు.
ఎట్లయితే అట్లవనీ. నాకు మాదిరి బతుకంతా బాధ పడేకంటే అదే మేలు నా బిడ్డలకు’
నేననుకున్నది ఇనేసినాడేమో వానదేముడు మా బతుకుల్లో ప్రళయమెందుకని గమ్మునుండి పోయాడేమో? యీతూరి సరిపోయినంత వాన్లు పడి పంట బాగా చేతికొచ్చినాది. మా బతుకులు ఓదారిలో పడ్డట్టయినాది.
4 Responses to “వాన మబ్బులు”
చాలా చాలా బాగుంది కథ.
చదువుతూంటే కథను చదివినట్లు లేదు.
ఎదురుగుండా ఒక జీవితాన్నే చూసినట్లుంది. బాధలున్నా… ఎన్ని కష్టనష్టాలొచ్చినా చివరకు తెగింపుతో ఆశావహ దృక్పథాన్ని కథలో కల్పించడం బాగుంది.
మంచి శైలిలో చదివిన ఈ కథ మనసును కష్ట పెట్టినా ఆఖరుకు మనసును ఊరడిల్లేట్లు చేసింది.
రచయిత మేఘనాథ్ రెడ్డి కి అభినందనలు…
💐💐💐👏👏👏🤝🤝🤝
చాలా ధన్యవాదాలు నరహరి గారు.
అప్పులు, పంటను ముంచెత్తించే వానలు, రైతు కుటుంబాల కడగండ్లు, ఆశలు అన్నీ కళ్ళ ముందు దృశ్యమానం అయినాయి.మేఘనాధ్ గారికి అభినందనలు.
కథ చాలా బాగుంది మేఘ నాథ్ గారు.