తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

రాజవ్వ

తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
© Telugu Society of America

“ఒరే గంగన్నా! నీకు మూడొందల ఎకరాల భూమి ఉంది గదా! ఇంకా నీకు సంపాదించాలనే ఏవ ఎందుకురా?” అంది గంగరాజపురం భూస్వామి గంగన్నతో రాజవ్వ. మోకాలికి దెబ్బ తగిలితే ఎడ్లబండి మీద తీసుకువచ్చి పాలేర్లు రాజవ్వ గుమ్మంలో కూర్చోబెట్టారు. కాలు మొత్తం పరీక్ష చేసి “ఎముక ఇరగలేదు. ఇరుకు నెప్పిరా! మోచిప్ప ఎనకాల పట్టేసింది” అంది. అతనికి బెల్లం ఉడికించి, సున్నంతో కలిపి కట్టు కట్టి ఎల్లిపొమ్మంది. గంగన్న రెండు చేతులు ఎత్తి దణ్ణం పెట్టి “అమ్మా! ఈ చుట్టుప్రక్కల ఉన్న కుగ్రామాలలో రోగుల రోగాలను నయం చేసే ధన్వంతరి మీరు! మా మూడు తరాలూ మీకు ఋణపడి ఉన్నాం” అన్నాడు.

“తగ్గిపోతుందిలే, ఇంకెళ్ళు? ఉంచుకున్నదాన్ని ఎంచక్కా చూస్తున్నావట, చేసుకున్న అమ్మిని ఈసడించు కుంటున్నావట, మొన్ననే నీ పెండ్లాం వచ్చి కళ్లనీళ్ళు పెట్టుకుంది. అట్ట చేయమాకు అబ్బీ, ఆడది కళ్లనీళ్ళు ఊరికి మంచిది కాదు. నీ ఆరోగ్యానికి అంత బాగూ కాదు. మళ్ళీ మూడు రోజుల తరువాత రా. నొప్పి తగ్గకపోవడం అంటూ ఉండదు. తగ్గిపోద్ది. పొలానికి మూడు పొద్దులు పోమాకు. ఇంటికాడే చక్కంగా ఉండు. ఎల్లిరా!” అంది రాజవ్వ. ఎనభై ఏళ్ళు నిండిన రాజవ్వ పసుపు రంగులో మెరుస్తూంటుంది. వెండిరంగులో పొడవాటి జుత్తు, పెద్ద కళ్లు, కోటేరు లాంటి ముక్కు, నిండైన విగ్రహం, ఆ ఊరికి ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఆమే పెద్ద దిక్కు. ఆ ఇంటికే వస్తారు. అక్కడే ఏ తీర్పు అయినా జరగాలి. భర్త గుర్రాజు ధాన్యం వ్యాపారం చేసి మూడు తరాలకు సరిపడా సంపాదించాడు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లులకు తోలించేవాడు. ధాన్యం బస్తాలతో పాటు వెండి రూపాయల బస్తాలు ఇంటిలో పేర్చి ఉండేవి. ఆ రోజుల్లో నాణేలు చెలామణిలో ఉండేవు. వాటితోనే ఎక్కువ మారకం జరిగేది. రాజవ్వకి ముగ్గురు పిల్లలు. ఆడపిల్లలిద్దరికీ ఎప్పుడో పెళ్లిళ్ళు చేసి పంపించేసింది. కొడుకు సుబ్బరాజు ఊళ్ళో వ్యవసాయం చూసుకుంటూ తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. రాజవ్వ భర్త ఇరవై ఏళ్ళ క్రితమే కాలం చేసాడు. అప్పటినుండీ రాజవ్వకు పని ఒత్తిడి ఎక్కువయింది. రాత్రి ఒంటిగంటకు లేస్తే మళ్ళీ తిరిగి సాయంత్రం ఏడు గంటలకే విశ్రాంతి.

రాజవ్వది పది ఎకరాల విస్తీర్ణంలో కట్టిన నూట ఒక్క గుమ్మం ఇల్లు. కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజీ కట్టడంలో రాజవ్వ తాత రంగరాజు ప్రముఖ పాత్ర వహించాడని ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఇప్పటికీ చెబుతారు. రంగూన్ నుండి టేకు తెప్పించి నలువైపులా రాతిగోడలు నిర్మించి కట్టిన ఆ ఇల్లు నేటికీ ఓ చారిత్రక కట్టడంలా ఉంటుంది. రెండు మూడు పర్యాయాలు కాటన్ దొర వీరి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించాడట. ఇప్పటికీ ఆ ఇంటి గోడల మీద వేసిన రంగు కూడా చెక్కుచెదరలేదు. ఆంధ్రదేశంలో మారుమూల ఒక పల్లెలో ఆ ఇల్లు తల్లిలా కనిపిస్తూంది. ఆ పల్లెలో వందల ఏళ్లనాటి పాడయిపోయిన మైసమ్మ గుడి. ఆ గుడి ముందు నుంచే ఊళ్ళోకి వెళ్ళే రహదారి. ఆ రహదారి ప్రక్కనే ఓ పెద్ద రావిచెట్టు. దాని చుట్టూ రచ్చబండ. పెద్దలంతా సాయంకాలాలు సేద తీరుతుంటారు. ఊరి చివర రెండు పెద్ద చెరువులు. మంచినీటితో నిండిన చెరువు ఒకటయితే రెండోది పశువులు నీరు తాగడానికి ఉపయోగించేవారు. తెల్లారితే చాలు ఆ చెరువుల చుట్టూ పల్లెపడుచుల నీళ్ల బిందెలతో సందడిగా ఉండేది. ఊరి మధ్యన పెద్ద రామాలయం. రాజవ్వ ఊరిని బాగుచేసింది. బడినీ, గుడినీ, ఆసుపత్రితో పాటు గ్రంథాలయాన్ని స్థాపించింది. తమ పూర్వీకులు భద్రపరచిన పుస్తకాలన్నీ ఆ గ్రంథాలయానికి ఇచ్చేసింది. వాటిలో మహాభారతం రామాయణం ఎన్నో ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలున్నాయి. సాధుసంతులను గౌరవించి ప్రతీ గురువారం భోజన ఏర్పాట్లు చేసి, బట్టలిచ్చి పంపేది. దాన ధర్మాలకు ఆమె పెట్టింది పేరు. ఆ గ్రామం నుండి చుట్టుప్రక్కల గ్రామాల్లోకి నడకదారిన వెళ్ళే బాటసారులకు తన భూమిలో ఓ పెద్ద ధర్మసత్రం కట్టించి, అక్కడే వారికి భోజనాలు పంపించి కడుపాకలి తీర్చేది.

అప్పట్లో పక్కింటి కూఠంరాజుకు పదిమంది సంతానం. అతను కూలికి పోయేవాడు. ఏదో కొద్దిగా వచ్చిన కూలి ఆ బిడ్డలకు తిండి పెట్టడానికే సరిపోయేది కాదు. భార్య కాంతమ్మ రాజవ్వ ఇంటికాడ వడ్లు దంచేది. చిన్న చిన్న పనుల్లో సహాయపడేది. ఒకరోజు కరువుతో అతని బిడ్డలు రెండు రోజుల్నుండి ఆకలితో విలవిల్లాడి పోతున్నారు. రాజవ్వ తన ఇంటిలో నుండీ అంతా గమనిస్తూనే ఉంది. అప్పుడే అన్నం వార్చిన రాగిబిందె పాతికమందికి సరిపోతుంది. ఇంతలో కాంతమ్మ వచ్చి రెండు చేతులు జోడించి, పిల్లల్ని చూపించింది. హృదయం విలవిల్లాడిన రాజవ్వ వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆ బిందెను, పక్కనే తాళింపు పూర్తయిన పప్పుచారు కుండను ఆ పసిపిల్లల ఆకలి తీర్చమని పంపింది.

సత్తుంరాజు గొడ్డు గేదెలకు బంధాలేసి, తోటకు వెళ్ళి, పాడి ఆవులను దూడలను పైరుగట్ల మీద వదిలిపెట్టేవాడు రోజూ. వీడు పుట్టినకాడ నుండి ఇదే దినచర్య. చిన్నప్పుడెప్పుడో పుంగనూరు ఆవులా ఇక్కడికి చెదిరిపోయి వచ్చాడు. తెల్లగా ఉంటాడు. మోకాళ్ళపైకి కురచ నిక్కరు వేసుకుని, మనిషి చిత్రంగా ఉండేవాడు. తన మంచం, కంచం వేరుగా ఉంచుకునేవాడు. ఎవరినీ ముట్టుకోనిచ్చేవాడు కాడు. అరవై ఏళ్ళ క్రితం రాజవ్వ ఇంటికి వచ్చి ఆకలితో నిలబడితే, తిండి పెట్టి, పెళ్ళిచేసి దూరంగా ఉన్న కొబ్బరితోటలో ఓ పెంకుటిల్లు కట్టించి ఇచ్చింది. చుట్టుప్రక్కల ఎవరింటికి చుట్టాలొచ్చినా కుతకుతా ఉడికిపోయేవాడు. అదో రకమైన మానసిక స్థితి. ఎదుటివాళ్లు కడుపునిండా తింటే వీడికి అరగదు. అదో రకమైన దినచర్య. ఉదయాన్నే దూడల దగ్గర పేడ అంతా తీసి ఒకచోట పేర్చి పిడకలు తయారుచేసి గోడ మీద అద్దేవాడు. నిత్యం రాజవ్వ ఇంట్లో పొయ్యి వెలగాల్సిందే. నిండు పాలకుండ పిడకలతో మరగాల్సిందే. రాజవ్వ పొలం నుండి దిగువ రైతులకు నీరు వెళ్లనిచ్చేవాడు కాదు. ఇంతటి మహాతల్లి ఇంట్లో వీడు పాలేరుగా చేరి ఇదేం బుద్ధని మొరపెట్టుకునేవారు రాజవ్వ దగ్గరకొచ్చి.

“ఏం రా సత్తుం. ఎందుకు వారితో గొడవలు?” అని చాలాసార్లు మందలించేది. వినేవాడు కాదు. వాడి జన్మ అంతే అని ఊరుకునేది. ఎటువంటి చెడుగుణం ఉన్నవానినయినా క్షమించే మంచి మనిషి ఆమె. “చెట్టుకు చీడ పడితే మందు కొట్టాలి కాని మొత్తం దాని మూలాన్ని నరికేయకూడదు” అనేది ఆ మహాతల్లి.

ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. పదివేలు జనాభా ఉన్న ఆ పెద్ద గ్రామానికి చుట్టుప్రక్కల ఊళ్లన్నీ కదిలివస్తాయి. రెండు రామాలయాలు ఉన్నాయి. భారీస్థాయిలో జనం వచ్చినా ఉరు పెద్దది కాబట్టి రావిచెట్టు సెంటర్ నుండి రేవళ్ళ చెరువు వరకూ రోడ్డు కిరువైపులా విద్యుత్ దీపాలతో కనులకింపుగా లైటింగ్ అమరుస్తారు. రాజుల రామాలయం దగ్గర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ జిల్లాలో పేరుమోసిన బిక్కవోలు బ్యాండ్ ముందు రోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఊరేగింపుతో ఊరంతా తిరగాల్సిందే. పేరున్న ఆ బ్యాండ్ దగ్గరకు పాటలు వినడానికి కుర్రకారు బారులు తీరేవారు. ఎవరూ కదిలేవారు కాదు. దొరల రామాలయం దగ్గర జనం తక్కువ. రాజుల రామాలయం దగ్గర సంబరాలు అంబరాన్నంటేవి. అక్కడ వారు కూడా ఇక్కడకు వచ్చి వివిధ రకాల ప్రదర్శనలు తొమ్మిది రోజులు తిలకించేవారు. రికార్డింగ్ డ్యాన్సులు, పెద్దాపురం భోగం మేళాలు, కాకినాడ తూరంగి వారి గేదెలాటలు, గొల్లప్రోలు దాసుగారి హరికథా కాలక్షేపం, నాజర్ బుర్రకథ అక్కడ ఉండాల్సిందే, జనం ఇసుక వేస్తే రాలేవారు కాదు. అన్ని రోజులూ పట్టణాలలో ఉన్న ఆ ఊరి బంధువులు, చుట్టుప్రక్కల గ్రామప్రజలు అక్కడికి తరలి వచ్చేవారు. ఊరిలో కొంతమంది కుర్రాళ్ళు సాంఘిక నాటకాలు వేసేవారు. చాలా ఆనందంగా సంబరాలు జరిగేవి. ఒక సంవత్సరం అనుకోకుండా ఓ పెద్ద గొడవ జరగడానికి కారణమయ్యాడు గ్రామ సర్పంచ్ లచ్చన్న. లచ్చన్న తమ్ముడు నర్సన్న. అక్కడ నెంబరు గుండాట వేలంపాట జరిగేది. ఇరు కులాల రామాలయాల వారు ఆ వేలం పాటలో డబ్బు పంచుకోవాలి. ఆ సంవత్సరం అలా జరగలేదు. వచ్చిన మొత్తంలో రెండు వంతులు మేము తీసుకుని ఒక వంతు మీకు ఇస్తాం అన్నారు నర్సన్న వర్గీయులు. అలా ఒప్పుకోలేదు రాజవ్వ తమ్ముడు అబ్బన్నరాజు. మనిషి ఏడడుగుల పొడవు ఉండేవాడు. “మీరు ధర్మంగా మాకు సమాన వాటా ఇవ్వండి” అని అడిగాడు నర్సన్నను. నర్సన్న “నేను ఇవ్వను. మీ దిక్కున్న చోట చెప్పుకోండి” అని తన వర్గంతో దూకుడుగా వ్యవహరించాడు.

సరే అని తను రామాలయం దగ్గర తన మనుషులను అందరినీ సమావేశపరచి ఒక నిర్ణయానికి వచ్చాడు అబ్బన్నరాజు. దాని ప్రకారం తుని నెంబరు గుండు సాంబను పిలిపించి రామాలయం ఎదురుగా బల్లలు వేయించాడు. రాత్రిళ్లు నెంబరు గుండాట లక్షల్లో జరిగేది. ఇదంతా ఎప్పటికప్పుడు రాజవ్వతో చర్చించేవాడు తమ్ముడు అబ్బన్నరాజు. ఈ జనంలో దాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలి అని తమ్ముడు రాములు రాజుకి కబురంపాడు. మిద్దె మీద ఉన్న బళ్లాలకు సానపట్టి కొబ్బరినూనె రాయించాడు. పెద్ద పెద్ద బాణాకర్రలు ఓ వంద ఎప్పుడో తెచ్చినవి కిందకు దింపి గోడవారగా పెట్టించాడు. కిళ్లీకొట్టు సూరిబాబుకి కబురంపాడు. ఓ అయిదు కేసులు సోడాలు రామాలయం వెనుక దాయించి బరఖా కప్పించాడు. ఊరి ప్రక్కనే దళితులకు కబురంపాడు. పరిగెడుతున్న పామును తోక పట్టుకుని మనిషి నరాలు వేళ్ళతో లాగేసే నక్కా అప్పిగాడిని దూరంగా కాపలా పెట్టించాడు.

రాజుల సంఖ్యాబలం తక్కువయినా ఒకడు వందమందికి సమాధానం చెపుతాడు. అంతా కలిపితే రెండు వందల మంది ఉంటారు. వారిలో వందమందే బరిలో ఉంటారు. ఇది అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. దొరల వర్గం వారికి దూకుడు తప్ప బరిలో నిలబడే ధైర్యం ఉండదు. మొదటిరోజు బాగానే జరిగింది. ఎవ్వరూ గొడవకు రాలేదు. కానీ ఏమి జరుగుతుందో అని కనిపెట్టడానికి కొంతమంది మనుషులను పంపించాడు నర్సన్న. అంటే ఏదో ఒకరోజు వారు కుయుక్తితో దాడికి పాల్పడి ఇక్కడ సంబరాలను రసాభాస చేస్తారని తమ్ముడు అబ్బన్నరాజుని పిలిచి సిద్ధం కమ్మంది రాజవ్వ. “నేను కూడా వస్తాను. మీ ముందుంటాను” అంది. అక్కను ఆపే సాహసం చేయలేడు అబ్బన్నరాజు. ఎందుకూ అనలేదు. అలాగని ఆగమనలేకపోయాడు.

పక్కనే చేతులు కట్టుకుని ఇదంతా వింటున్న చిన్న తమ్ముడు రాములు రాజు మాత్రం. “ఎందుకు అక్కా? నీవు ఇక్కడ ఉండి అంతా చూడు. నాకు వందమందిని వదిలేయండి. కుస్తీపట్టి చాలాకాలం అయింది. మళ్ళీ ఈ శరీరానికి పని దొరికింది. చావును వాళ్ల చెవిలో ఊదాలని ఉంది” అన్నాడు.

“నీకు ఆవేశం ఎక్కువ. తొందరపడకు. వారు ముందు రాకుండా మనం వారితో తగవు పెట్టుకోకూడదు. అర్ధమయిందా?” అంటూ ఎనభై సంవత్సరాలు నిండిన ఆ ముదుసలి ఇరవై సంవత్సరాల బలవంతురాల్లా మాట్లాడింది. ఎర్రజెరీ అంచు చీర కచ్చా పోసుకుని, నడుముకు పచ్చని తువాలు బిగించి కట్టింది. శిరస్సుపై దెబ్బ పడకుండా రక్షణగా తువాలును తలపాగా చుట్టింది. ఆమె తెగువను దూరం నుండి చూస్తున్న నక్కా అప్పిగాడు పరుగున వచ్చి చేతిలో కర్ర పక్కన పారేసి కాళ్లమీద పడ్డాడు. “మీరెందుకు తల్లీ? మీరు చెబితే ఈ చుట్టుప్రక్కల మావాళ్లంతా కర్రలేసుకుని వస్తారు. నాకొదిలేయండి. నేను ముందుంటాను” అని వేడుకున్నాడు.

“లేరా! అప్పీ! నీకు తెలియదు. యుద్ధం నడిపించేవాడు ఇంట్లో ఉండకూడదు. వీథిలో ఉండాలి. ఇన్నాళ్లు గోడవారగా కాపలా ఉన్న కర్ర వీథిలోకి వస్తే దాని బలం ఏమిటో చూపిస్తుంది” అంటూ, “ఒరే! చక్రరావూ! ” అంటూ పిలిచింది. పక్కింట్లో ఉన్న చక్రరావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. “మన దొడ్లో భోజన ఏర్పాట్లు చూడు. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా అక్కడే భోజనం చేసి వెళ్లాలి. ఈ పని నీకు అప్పజెప్పాను. ఎవరికీ ఏ లోటూ రానీయకు” అని ఆఙ్ఞాపించింది.


కాకినాడ రామకృష్ణారావుపేట నుండి కాకి సుబ్బారావును కబురుచేసి రప్పించింది. రాజవ్వ గుమ్మంలో సుబ్బారావు చేతులు కట్టుకుని వినయంగా నిలుచున్నాడు.

ఇంతలో రాజవ్వ బయటికి వచ్చింది. ఆమె ప్రక్కనే అబ్బన్నరాజు, రాములురాజు నిలబడి ఉన్నారు. “అమ్మా! సెలవివ్వండి! ” అన్నాడు కాకి సుబ్బారావు. “సోడాబుడ్లతో యుద్ధవిన్యాసాలు చేస్తావని విన్నాను. ఒకసారి చూడాలని ఉంది” అంది.

ఓ పది సోడాకాయలు అక్కడ తెచ్చిపెట్టాడు నక్కా అప్పిగాడు, సుబ్బారావుక కళ్లకు గంతలు కట్టాడు పక్కనే ఉన్న పాలేరు సీతారాముడు.

కుర్చీలో ఆసీనురాలయి ఇదంతా వింతగా చూస్తుంది రాజవ్వ. నిలబడి ఉన్న రంగప్పతో, ఎవరూ లోనికి రాకుండా ఇంటి నలువైపుల గేట్లు మూసిరమ్మంది. రంగప్ప మూసేసాడు. నల్లగా పొట్టిగా ఉన్నాడు కాకి సుబ్బారావు. అతనిలో దేహదారుఢ్యం కంటే శబ్దాన్ని, గాలిలో వీచే అతి చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టే శక్తి ఉందని ఆమె గ్రహించింది. చేత్తో గాల్లోకి ఒక సోడాబుడ్డి విసిరాడు. విసిరిన ఆ మార్గంలోనే మరో క్షణంలో దానికి తగిలేలా తల ఎత్తకుండానే గురిచూసి మరోటి కొట్టాడు. రెండూ గ్యాస్ నింపిన సీసాలు. భళ్ళున బద్దలయి పెంకులు గాల్లో నుండి నేల రాలాయి. దూరం నుండి చప్పట్లు వినిపించాయి.

“శెహబాష్ సుబ్బారావు! నీ విన్యాసం కళ్ళను విభ్రాంతికి గురిచేసింది. మన చావిట్లో బస ఏర్పాటు చేయండి” అంటూ పక్కనే ఉన్న తమ్ముడు రాములురాజు వైపు చూసింది.


దొరల చావిడిలో కాపలా కాసే నాగన్నదొర రాజవ్వతో మాట్లాడాలంటూ వచ్చాడు. ఎందుకో చెప్పమని సీతారాముణ్ణి పంపించిది.

“మీతోనే మాట్లాడతాడండి. ఏదో రగస్యమట” తిరిగొచ్చిన సీతారాముడు అన్నాడు నెమ్మదిగా, ఒత్తిపలుకుతూ. అతనికి కొంచెం నత్తిగా మాటలు ఆగిపోయి వస్తుంటాయి చిన్నతనం నుండీ. గేటు బయట నిలుచున్న నాగన్నదొరను లోపలికి పిలిపించి, విషయమేమిటో చెప్పమంది. చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా అని పరికించి చూసాడు.

“ఫరవాలేదు. ఇక్కడ ఉన్నవారంతా మన మనుషులే నీవు ధైర్యంగా చెప్పచ్చు” అంటూ సైగ చేసింది రాజవ్వ. “మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. సర్పంచ్ లచ్చన్న అతని తమ్మునితో సహా అయిదు వేలమంది మూకుమ్మడిగా మీ రాజుల కుటుంబాల మీదకు ఒక్కసారిగా దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిన్న దొరల చావిడిలో సమావేశమయ్యారు. ప్రమాదం జరుగుతుందని నాకు భయం వేసి మీ దగ్గర విన్నవించుకుంటున్నాను. మీపై వాళ్ళంతా కలసి యుద్ధానికి వస్తున్నారంటే నా మనసొప్పుకోక మీకాడకు పరిగెత్తుకొచ్చాను. మీరేమి చేస్తారో తెలియదు. మీరే నా కొడుకుని పట్నంలో చదివించి ఉద్యోగం వేయించి, నాకూతురికి కట్నం ఇచ్చి పెళ్ళిచేసి పంపించారు. పాతికేళ్ళుగా ఆ లచ్చన్న భవంతికి కాపలాగా ఉంటున్నా నాకేనాడూ ఉపకారం చేయలేదు. మీ రుణం ఇలాగైనా తీర్చుకోవాలని ఈ మాట మీ చెవినేయాలని వచ్చాను తల్లీ!” అన్నాడు.

“కృతఙ్ఞతలు తెలియజేసుకున్నావు నాగన్నదొరా! మీ పిల్ల పురిటికొచ్చినప్పుడు కనిపించు ఆమెను బిడ్డతో తిరిగి సకల లాంఛనాలతో పంపిద్దువు”

తలవొంచి దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు నాగన్నదొర.

రాజవ్వ ఒకసారి తన చుట్టూ ఉన్న మనుషుల వైపు పరికించి చూసింది. తన తమ్ముళ్లయిన అబ్బన్నరాజు, రాములురాజుకు చిన్నతనం నుండీ మల్లయుద్ధం, కర్రసాము, కత్తిసామూ వచ్చు. కానీ రేపు జరిగే ఆ దొమ్మీలో వీరు సాయుధులుగా నిలబడితే కర్రకూ, కత్తికీ పనిచెబితే వారిలో ఒక్కరు కూడా మిగలరు. పొరుగూరిలో ఉన్న తన చెల్లి కొడుకు గుడ్డి సుబ్బన్నను పిలిపించింది. అతను ఇటువంటి పోరాటాల్లో ఆరితేరిన మొనగాడు. ఎటువంటి బరువునయినా అవలీలగా తేల్చి అవతల పారేస్తాడు. అట్లతద్ది తెల్లవారుజామున ఉప్పు పొట్లాం తిప్పినట్లు రెండు చేతులతో ఇద్దరు మనుషులను గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేస్తాడు. ఇది చేయి అని పురమాయిస్తే అదే చేస్తాడు. ఎదురుదాడిలో ప్రత్యర్థులను ఎదుర్కొని తుదముట్టించడం పరిగెత్తించడం అతనికి చాలా సరదా.

“కన్నమ్మా, మీరు చెప్పండి నేను ఏమి చేయాలో ” అన్నాడు.

“సుబ్బన్నా, నీవు ఓ బాణాకర్ర, మరో రెండు కత్తులు తీసుకో! వాటిని గాల్లో తిప్పడమే! ఒక్క మనిషి కూడా గాయపడకూడదు. నీ ఎడమవైపు కాకి సుబ్బారావు మన మీద దాడిచేసే వారికి తగలకుండా గాల్లోకి సోడాబుడ్లు విసిరి భయభ్రాంతులకు గురిచేస్తాడు. చీకటి పడిన తరువాత ఈ గొడవ మొదలవుతుంది కాబట్టి బెండపూడి నుండి వచ్చిన కోన కుట్టమ్మ ఆముదం గుడ్డలు చుట్టిన కర్రలకు దీపం ముట్టించి, వచ్చే జనం ముందుకు రాకుండా రెండు చేతులతో తిప్పుతూనే ఉంటాడు. ఆముదం తడి తగిలిన దీపాలు ఆరిపోవు. గాల్లో మంటలు చూసి వారి గుండెలు జారి వెనక్కి పారిపోతారు.

చాకలి గుర్రయ్య ఇంటి పక్క సందు మూసెయ్యండి అటువైపు పారిపోకుండా. కుట్టమ్మా, నువ్వు అక్కడ నిలబడు. సుబ్బన్నా! మునసబు ఇంటిముందు దారి కూడా బంధించండి. నీవు అక్కడ నిలబడు. కాకి సుబ్బారావు కరణం గారి ఇంటిముందు కాపు కాస్తాడు. మీరంతా పక్కనే కాపు కాసి విన్యాసాలు మొదలుపెట్టండి. మిగతావాళ్లంతా రామాలయం ముందు ఉంటారు. అబ్బన్నా, రాములు మీరు కర్రలు పట్టుకుని నిరోధించండి అంతే! ఆయుధం కంటే వ్యూహం గొప్పది ! దానిముందు శత్రువు పారిపోతాడు. పద్మవ్యూహం దారి ఒక్క ద్రోణుడికే తెలుసు. తిరిగిపోవడం అభిమన్యుడికి తెలియనట్లు శత్రువులు గ్రహించాలి. మన సరిహద్దు వరకు దారులన్నీ మూసెయ్యండి. ఎటు ప్రక్కనుండీ పారిపోవడానికి వీల్లేదు.

ఒక్క మనిషి రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. కానీ యుద్ధం జరగాలి. ఏమి చేస్తారో అంతా నేను చూస్తూనే ఉంటాను” అని ఆదేశించింది.


“లచ్చన్నా! అనవసరంగా గొడవను పెద్దది చేసాడు నీ తమ్ముడు. నువ్వు పెద్దమనిషివని చెబుతున్నాను, నీవాళ్లను వెనక్కి తీసుకుని వెళ్ళిపో! ఇక తప్పదు మాతో కలబడతాను అంటే ముందుకు రా! వచ్చే ముందు నీకో సవాల్ విసురుతున్నాను.

నాకు ఇప్పుడు ఎనభై ఏళ్లు. చివరి దశలో ఉన్నాను. నీ వెనుక వేలమందిని తీసుకువచ్చావు. ఇటువైపు నావాళ్లు దాదాపు వందమంది దాకా ఉంటారు. ముందు నీవు ఇదిగో! ఈ కర్ర పట్టుకుని నాతో తలపడు. కర్రసాములో నన్ను ఎదుర్కో! నిలబడి గెలిచావనుకో, మేమంతా పొలాలు, ఇళ్ళు, సర్వస్వం వదిలి ఈ ఊరినుండి వెళ్ళిపోతాం. ఈ గొడవ వల్ల అమాయకుల తలలు బద్దలవడం అంత మంచిది కాదు. రా! ఇదిగో అందుకో!” అంటూ పొడవాటి కర్రను విసిరింది ముందుకు దూసుకొస్తున్న లచ్చన్న మీదకు. అరవై నిండిన అతనికి ఆమె ధైర్యాన్ని చూసి గుండాగినట్లయింది. కర్ర పట్టుకుని నిలబడ్డాడు. ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. వెనుక జనం అంతా రాజవ్వ మాటలకు బిత్తరచూపులు చూస్తున్నారు.

“రాజవ్వా! నేను మీతో కలపడటానికి సిద్ధమే! మీరు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ మూర్తి. మా అమ్మతో సమానం. మీపై కర్ర ఎత్తడానికి నాకు చేతులు రావట్లేదమ్మా! ”

“అంత మాటన్నావు చాలు లచ్చన్నా! అమ్మనన్నావు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపొమ్మనను. నేను బరిలో కొట్టే దెబ్బలకు కాచుకుని ఎదుర్కొని నన్ను గెలువు చాలు. నిన్ను గాయపరచకుండా కర్ర తిప్పుతాను. నాపై నీవు చేసే ప్రతిదాడిని తప్పించుకోలేక గాయపడితే, కిందకు ఒరిగిపోతే అప్పుడు అమ్మగా నన్ను నీ చేతులతో లేపు. అప్పుడు ఈ గొడవను చల్లార్చి వెనక్కి పంపు. ఎప్పుడో తెలంగాణ నుండి మూడు వందల ఏండ్ల కిందట వలస వచ్చిన రాజుల కుటుంబాలు మావి. మీకంటే ముందు ఇక్కడకు వచ్చి, పిఠాపురం రాజా ఈనాం భూములు నాలుగు వందల ఎకరాలకు మా ముత్తాత రంగరాజు శిస్తు కట్టేవాడు. అప్పటినుండి ఇప్పటి వరకు ఇక్కడే స్థిరపడ్డాం. మాపై మీ పొలాలున్నాయి. నీటి తగవులు ఎన్నో జరిగాయి గతంలో. మా పొలాలకు నీటివంకలు ఆపుచేసి పొలాల్ని ఎండబెట్టారు. ఎన్నో బాధలు పెట్టారు. అయినా సహించాం. వర్షం పడి సుభిక్షంగా పంట చేతికొచ్చినప్పుడు మాత్రమే మాకు ధాన్యం ఇంటికి వచ్చేది. మేము ఏనాడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇది ఎన్నో ఏళ్ళనుండి జరుగుతోంది. ఈరోజు ఈ గొడవ ఇంకా ముదిరి మేము వెనక్కి తగ్గితే మా ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది. ఊరు ఖాళీ చేయాల్సి వస్తుంది. నివాసానికి దూరంగా మళ్లీ ఎక్కడికో వలసపోవాల్సి వస్తుంది. మేము అలా జీవించలేము. మీ చేతిలో ఓడిపోతే రోజూ చస్తూ బ్రతకాలి. గెలిస్తే మీరు తలవంచి బ్రతకాలి, కానీ మీరు ఓడినా మేము అలా చూడము. మీరు మాత్రం ప్రతీదినం మమ్మల్ని వేధిస్తారు. వీథుల్లో నడుస్తున్నప్పుడు చులకనగా చూస్తారు. ఆ అవమానాల్ని మేము తట్టుకుని ఇక్కడ బ్రతకలేము. రా! ఇక సమయం వృథా చేయకు” అంటూ ముందుకురికింది రాజవ్వ. ఆమెతో కర్ర కలపడానికి చేతులు రావడం లేదు. వెనుకనున్న జనం గోల చేస్తున్నారు. “ఆ ముసిల్ది మిమ్మల్నేం చేయగలదు? ముందుకురికి మట్టి కరిపించండి!” అని ఒకటే గోల. లచ్చన్న వెనుక సాయుధులైన దృఢకాయులు ఓ ఇరవైమంది ఉన్నారు చేతులు కట్టుకుని. వారి చేతుల్లో ఏ మారణాయుధాలు లేవు. అయినా వారిని నమ్మకూడదు.

కర్రసాము మొదలైంది ఇరువురి మధ్య. ఓ ఇరవై నిముషాల కాలవ్యవధిలో హోరాహోరీగా ఇద్దరూ కర్రలు తిప్పుతున్నారు. లచ్చన్న చేతిలో నాలుగుసార్లు కర్ర ఎగిరిపోయింది. కర్ర కిందపడినా ఓడిపోయినట్లే లెక్క. అయినా కిందపడిన కర్రను తీసుకుని మళ్ళీ అతని మీదకు విసిరేది. అపరకాళిలా కర్ర తిప్పుతున్న ఆమె ధాటిని లచ్చన్న నిలువరించలేకపోతున్నాడు. ముందుకు వేసే ఆమె అడుగులకు వేల అడుగులు వెనక్కి జంకుతున్నాయి. ప్రత్యర్థుల శరీరాల్లో కంపనం బయల్దేరింది. చిన్న దెబ్బ కూడా ఆమెకు తగలకుండా లాఘవంగా తప్పించుకుంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు లచ్చన్న. ఇరువైపులా ఉత్కంఠగా చూస్తున్నారు. ఇక నాలుగోసారి ఓటమిని అంగీకరించక తప్పేలా లేదు లచ్చన్నకు, అతని వర్గీయులకు. ఇంతలో హఠాత్తుగా ఓ స్త్రీ చీరచెంగులో గుప్పెటతో కారం తీసి ఆమె మీదకు కళ్లలో కొట్టింది. అంతే! ఆమె గాలిలో తిప్పుతున్న కర్ర నేలకు ఒరిగింది. కూలబడింది. ఒక్కసారిగా కళ్లలో నిప్పులు పోసినట్లయింది. ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. నుదుటి భృకుటి ముడివేసి పరమేశ్వరుని ప్రార్థించింది. అంత బాధలోను తన ఎదురుగా మూడు అడుగుల దూరంలో తుమ్మమొద్దులాంటి బలీయమైన ఆ స్త్రీ మెడను ఒడిసి పట్టుకుని, రెండు చేతులతో పైకెత్తి తన మోకాలితో వెన్నుపూసపై పొడిచింది. ఎండిన కర్ర విరిగిన చప్పుడు. నిర్జీవంగా తన ప్రత్యర్థి తలవాల్చిందని తెలుసుకుంది. రెండు చేతులతో గిరగిరా తిప్పి విసిరేసింది. తనకు ఆపద ముంచుకొచ్చినప్పుడు మాత్రమే ఆయుధం వాడాలి అనుకున్న రాజవ్వ తన మొలనున్న పిడిబాకుతో, తన ఎదురుగా బాకు మొనకు ఎవరు తగిలితే వాళ్లను చీల్చుకుంటూ ముందు దూసుకుపోతుంది. ఇప్పుడు గొడవ దారి తప్పింది. ఎదురుగా ప్రత్యర్థుల గుంపులోకి వెళ్ళిపోతుంది. లచ్చన్న వర్గీయులు కళ్లు మూతపడుతున్నా ఇంకా పోరాటం ఆపని ఆ వీరవనితను చూసి భయంతో పరుగులు తీస్తున్నారు. దగ్గరకు వెళ్ళి ఆపడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతలో లచ్చన్న అనుచరుడు ఉప్పాడ నుండి వచ్చిన సందాడి వీరన్న సముద్రంలో చేపలు పట్టే పెద్ద వలను తెచ్చి ఆమె మీదకు విసిరేసాడు. ఆ వలలో బందీ అయిన ఆమెను మరి కదలనివ్వలేదు. మూకుమ్మడిగా దాడి చేసారు. దూరం నుండి చూస్తున్న గుడ్డి సుబ్బన్న కోపం కట్టలు తెంచుకుంది. చేతిలో ఏ ఆయుధం లేకపోవడంతో తనకు సమీపంలో ఉన్న ఎడ్లబండికి ఉన్న కాడిని పట్టుకుని లాగేసాడు – కట్లుతెగి కాడి చేతిలోకి వచ్చేసింది. కాడిని ఒక చేత్తో పట్టుకుని ఎదురుగా గుంపుగా ఉన్న జనాన్ని చెదరగొట్టాడు. అలా కొడుతూనే ఉన్నాడు. జనం చెల్లాచెదురు అయిపోయారు. అంతకు ముందురోజే చేబ్రోలు నుండి వచ్చిన రాజవ్వ ముఖ్య అనుచరుడు కొయ్యా ముత్తయ్య కోపంతో ఈటెలను తీసుకుని జనం మధ్యలోకి ఉరికి గాలిలో తిప్పుతూనే ఉన్నాడు. లచ్చన్నకు ఒక కాలు, చేయి విరిగిపోయింది. నేలను ఈడ్చుకుంటూ ముందుకు దేకుతున్నాడు. కాకి సుబ్బారావు గాల్లోకి సోడాబుడ్లను కొట్టి జనం పైకి ప్రయోగించాడు. పెంకులు గుచ్చుకుని పారిపోతున్నారు. మరో పక్క నక్కా అప్పిగాడు మనుషులను పట్టుకుని గిరగిరా గాల్లోకి తిప్పుతున్నాడు.

తమ అక్కపై దొంగదెబ్బ తీసినవాళ్లను వదలకూడదని తమ్ముళ్ళు అబ్బన్నరాజు, రాములురాజు ముందుకు వచ్చిన వాళ్లను చితక్కొడుతున్నారు. దాడి చేసిన అయిదువేల మంది లచ్చన్న వర్గీయులను నేలకరిపించారు. చాలామంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. రక్తం నేల కారకూడదు అన్న ఆమె ఉద్దేశ్యం నెరవేరలేదు. ఇరువర్గాల వారు కోర్టులకెళ్లారు. మరణించినా చివరికి రాజవ్వ గెలిచింది. వేలమందిని వందమందిని ఎదుర్కోవడం ఆశ్చర్యంగా ఉందంటూ జడ్జిగారు ఓ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. లచ్చన్న వర్గీయులు చాలామంది కారాగారంలోనే మగ్గిపోయారు. కొంతమంది అక్కడే ప్రాణాలు విడిచారు. ఆనాటి ఆమె ధైర్య సాహసాలను నేటికీ కథలుగా చెప్పుకుంటారు.

రచయిత పరిచయం

పొత్తూరి సీతారామరాజు

పొత్తూరి సీతారామరాజు

పొత్తూరి సీతారామరాజు గారి నివాసం కాకినాడ. వృత్తి భవన నిర్మాణరంగంలో. కవిత్వం, కథా రచన, విమర్శ, సమీక్ష వీరి ప్రవృత్తులు. ఇప్పటి వరకు 50 కవితలు రాసారు. “మా భూమి నవ్వదా”, “ఆకలిపూవు”, “ధరణి ఘోష”, “అమ్మలేని సముద్రం”, “ప్రతిభా నీ కలం ఏమిటి” మొదలైన రచనలు బహుమతులు పొందాయి. డా. అద్దేపల్లి రామమోహన రావు వీరి గురువు.

20 Responses to “రాజవ్వ”

  1. బొడ్డేడ బలరామస్వామి

    వాస్తవిక చరిత్రను కళ్ళకు కట్టారు. కథ, కథనం బావున్నాయి.

    Reply
  2. D.Nagajyothi

    పల్లెను కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు.ధీర వనిత రాజవ్వ నిజంగా స్మరణీయురాలే. కథ చాలా సహజంగా నడిచింది సర్ అభినందనలు

    Reply
  3. Dondapati Krishna

    ఒక నవలా వస్తువు కథావస్తువుగా కుదింపబడితే ఎంత గందరగోళంగా ఉంటుందో ఈ కథ చదువుతున్నప్పుడు తెలిసింది. ఒక వార్తాకథనాన్ని చదువుతున్న అనుభూతి కలిగింది. ఒకేసారి అన్ని పాత్రలు ఇబ్బడిముబ్బడిగా నామీద దాడి చేయడం మూలంగా ఆ భావన కలిగిందేమో తెలీదు. ఏదేమైనా రచయిత గారి కృషికి అభినందనలు.

    Reply
  4. డాక్టర్ ఎమ్ సుగుణ రావు

    రాజవ్వ ను రక్త మాంసాలు ఉన్న మనిషి గా పాఠకుడి ముందు నిలబెట్టారు.
    ఆమె యుద్ద విన్యాసాలు ఉత్కంఠ కలిగించే దిశగా సాగాయి.చరిత్రకు చక్కటి కళా ,కథా రూపం.
    కథనం అద్భుతమైన రసపుష్టి తో సాగింది…కథకుడి కష్టం కథలో కనిపిస్తుంది.
    నాకు నచ్చిన కథ..
    రాజు గారి కి అభినందనలు

    Reply
  5. Dr.Md.Munni

    నమస్తే సర్🙏🙏🙏
    రాజవ్వ కధ…ఇది నిజంగా జరిగిన కధ అన్నారు….ఒక వేళ కల్పిత కధ అయిన అలా అనిపించేది కాదు….
    ఎందుకంటే కధలో ప్రాణం ఉంది….ఒక ముసలి అవ్వ కథ కాదు ఒక చారిత్రాత్మక రాజవ్వ అనబడే ఒక ఝాన్సీ రాణి కథ…..
    పాత కాలం మనుషుల స్వభావం చాలా గొప్పది…అందరికి సహాయం చేసే గుణం….గ్రామం మొత్తం ఒక కుటుంబంగా ఉండేవి…ఎవరికి బాధ కలిగిన సంతోషం అయినా అందరూ భాగం పంచుకునే వారు…
    కధ ప్రారంభంలో చాలా సాదా గా రాజవ్వ గొప్పతనం తో పాటు ఆ కాలం లో మనుషుల మధ్య ఉండే బంధాలు, బాధ్యతలు అప్పటి కాలం లో ఉన్న గొప్ప విషయాలు కళ్ళకు కట్టి నట్లు చూపించారు…
    కధ అంటే అది కళ్ళముందు నడిచే పాత్రల ఘట్టం….ఈ కధ చదువుతున్నంతసేపు పాత్రలు వాటి స్వభావం సంభాషణలు అన్ని కళ్ళముందు కదలాడయి… చుట్టుపక్కల ప్రపంచాన్ని మరిచిపోయాను కధ తప్ప ఏమీ గుర్తు లేదు….అన్ని పాత్రలు వాటి వాటి పరిధిలో ఆక్కట్టుకున్నాయి.
    కథని నడిపించిన తీరు పాత్రల పరిచయం అన్ని సహజంగా ఉన్నాయి…
    ఇక కధ విషయానికి వస్తే…
    ముఖ్య పాత్ర రాజవ్వది… స్త్రీ కి అర్థం సంపూర్ణత్వం ఇచ్చిన పాత్ర…
    ఉరి పెద్దగా, వైద్యురాలిగా, నాయకురాలిగా, ఆకలి తీర్చే అమ్మగా, బుద్ది చెప్పే పెద్ద మనిషిగా ఇలా ఒక పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి…అన్నిటికీ న్యాయం చేయడం రాజవ్వకే దక్కింది….
    One women army….అన్నట్టు ఉంది కథ…..
    సత్తున రాజు లాంటి మనిషిని కూడక్షమించి భరిస్తూ….చెట్టుకి చీడ వస్తే మందు వేయాలి కానీ మూలాల్ని తీసేయకూడదు అన్న మాట తో ఆమె గొప్పతనం తెలుస్తుంది…
    సత్రం కట్టించి అంత మంది ఆకలి తీర్చడం, గుడి,బడి,గ్రంధాలయం ఏర్పాటు చేయడం…ఆమె గొప్పతనాన్నీ తెలియచేసాయి…
    కధలో సామాజిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి ఉరి గుర్తులు, రావి చెట్టు, మైసమ్మ గుడి, రచ్చ బండ, శ్రీరామనవమి ఉత్సవాలు….కధకి మరింత ఆకర్షణని పెంచాయి…
    అబ్బన్న రాజు, రాముల రాజు రాజవ్వ తమ్ముళ్లు గా మంచి సపోర్ట్ ఇచ్చారు…అక్క మాటకి ఎదురు చెప్పని వారుగా అంతే కాక అక్క వెనకాల నిలబడి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదురుకున్నారు…
    లచ్చన్న పాత్ర తో రాజవ్వ యుద్ధం వీరురాలిని చూపించింది..
    కాకి సుబ్బరావు పాత్ర చాలా సపోర్ట్ గా ఉంది…ఆ కాలం లో చాలా విద్యలు ప్రాచుర్యంలో ఉన్నాయి…కానీ అన్ని మంచికి వాడే వారి బుద్ది కుసలత నేటివారికి ఆదర్శం….
    మంచితనానికి మంచే జరుగుతుంది అన్న దానికి నాగన్న దొర ఉదాహరణ…రాజవ్వ మంచితనానికి అన్ని పాత్రలు ఉదహరణలే…..
    “నాయకులు పుట్టరు తయారు చేయబడతారు’…అన్నదానికి రాజవ్వ కధ ఒక ఉదాహరణ…

    “ఆయుధం కంటే వ్యూహం గొప్పది ! దానిముందు శత్రువు పారిపోతాడు. పద్మవ్యూహం దారి ఒక్క ద్రోణుడికే తెలుసు. తిరిగిపోవడం అభిమన్యుడికి తెలియనట్లు శత్రువులు గ్రహించాలి. మన సరిహద్దు వరకు దారులన్నీ మూసెయ్యండి. ఎటు ప్రక్కనుండీ పారిపోవడానికి వీల్లేదు.
    ఒక్క మనిషి రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. కానీ యుద్ధం జరగాలి. ఏమి చేస్తారో అంతా నేను చూస్తూనే ఉంటాను” అని ఆదేశించింది.

    ఇది కద నాయకత్వం అంటే… గొప్ప రాజు లాగా ఆలోచించింది రాజవ్వ…వ్యూహం లో గెలిచినా ఓడినా.. రక్తం చిందించకుండా యుద్ధం చేయాలన్న ఆలోచన గొప్పది…
    పోరాడుతూనే మరణించినా రాజవ్వ తెగింపు, ధైర్యం నేటి మహిళా లోకానికి ఆదర్శం…
    చరిత్రలో నిలిచిపోయిన రాజవ్వ ఇప్పటికి కధలో బ్రతికే ఉంది…ఆదర్శంగా మహిళ శక్తి గా నిలిచింది…అపర కాళి గా ఆమె సాహసం సదా స్మరణీయం…
    ఈ కధలో మరో గొప్ప విషయం చర్తిత్రాత్మక విషయాలు ….చరిత్ర…తెలంగాణ రాజులు…..ఎన్నో విషయాలు తెలిసాయి…
    మంచి కధని అందించిన సీతారామ రాజు గారికి అభినందనలు…ధన్యవాదములు..🙏🙏🙏
    ************************
    Dr. Md.Munni
    (M.A.,M.Phil.,Ph.D.,Pgdt)(Hindi Language)

    Reply
  6. Chinnababu

    ఆద్యంతం కథ అద్భుతంగా ఉంంది.కథలో రాజసం ఉట్టిపడుతోంది.

    Reply
  7. Venkatesh puvvada

    ఇది యధార్థ కథో, కల్పితమో తెలీదు కానీ, రచయిత గతం తాలూకు గ్రామీణ వాతావరణాన్ని, ఆనాటి గుండె తడుల్ని, వివిధ వర్గాల భుజబలాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా రాజవ్వ ద్వారా అప్పటి స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో ఎట్లాంటి సమర్థనీయమైన పాత్ర పోషించేవారో చాలా అద్భుతంగా అక్షరీకరించారు రచయిత. మీ కవిత్వమే నాకు పరిచయం ఇప్పటిదాకా! దీనికి మునుపు ఒకటి రెండు కథలు చదివాను గానీ ఇది చూసాక కవనం ఎంత ఖచ్చితంగా ఉందో కథనం కూడా అంతే నిక్కచ్చిగా ఉంది.🙏 Congratulations sir

    Reply
  8. మథు చిత్తర్వు

    కథ చాలా చాలా బాగుంది.మీ కథనం వర్ణనలు ఉత్కంఠ భరితంగా వున్నాయి.ఆ రోజుల‌లో పల్లె ప్రజలు వాతావరణం,రాజవ్వ వ్యక్తిత్వం, పోరాటం ఇలాంటి వి నేనెన్నడూ చదివి వుండలేదు‌.కానీ మాది కూడా గ్రామం, వ్యవసాయ కుటుంబం కనుక చాలా బాగా నచ్చింది.అయితే ఇంత
    స్థాయిలో యుద్ధాలు ఎన్నడు మావూరి లో నాకు తెలిసి జరగలేదు.
    అభినందనలు

    Reply
  9. DVSRAJU (Ramesh )

    గత కాలపు జ్ఞాపకాలు కాగితంపై మీ కలం పొందుపరచిన తీరు నేటి తరాలకు ఒక విజ్ఞాన వేదిక . ప్రాంతాల ప్రాముఖ్యతను పొందు పరచిన తీరు మరీ అభినందనీయం . బహుశా మీ కధ చదివితే కానీ ఆ ప్రాంత వాసులకు కూడా ఆ ప్రాధాన్యత తెలియదేమో . ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కధ గతానికి ప్రస్తుతానికి ఒక విజ్ఞాన వారధి . ఆ వారధిపై పయనించిన ప్రతివారికి అది ఒక మధుర అనుభవమే అవుతుంది. అభినందనలతో ….రమేష్

    Reply
  10. Manipuri Shirisha

    రాజవ్వ కథ రాజమౌళి కథలా అనిపించింది. చదివినంతసేపు బాహుబలి అంటే మగవారే కాదు స్త్రీలలో కూడా బాహుబలిష్టులు ఉంటారని, ఎనభై సంవత్సరాల వృద్ధురాలు కర్రసాము చేసి ప్రత్యర్థులను తుదముట్టించడం నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక సినిమాగాను, ఒక నవలగాను రాస్తే బాగుండేదేమో అనిపించింది, ఎంతగానో ఆకట్టుకుంది. రచయిత సీతారామరాజుగారు కవిగా తెలుసు కథకుడిగా ఆయన చాలా ఎత్తుకు ఎదిగారు ఈ కథతో అని నేను చెప్పగలను. “రాజవ్వ”: స్త్రీల గురించి ఇంత గొప్ప వీరో చితగాథ ఈ మధ్య కాలంలో రాలేదు. స్త్రీ జాతిలో ఎంతోమంది వీరవనితలు ఉన్నారు. ఓ ఝాన్సీరాణి రుద్రమదేవి, స్వతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన ఎందరో వీరనారీమణుల కథ గుర్తుకు తెచ్చారు రచయిత సీతారామరాజుగారు.
    ధన్యవాదములు,
    ఇట్లు,
    NATA పురష్కార గ్రహిత,
    మణిపూరి శిరీష.

    Reply
  11. డా. కె.గీత

    గోదావరి జిల్లాల స్థానికతని అద్దంలా చూపించారు. చదివింపజేసే కథనం. మంచి కథను అందించినందుకు రచయిత సీతారామరాజు గారికి అభినందనలు.

    Reply
  12. Bobbili satyanarayana

    Excellent narration rajavva story. Awesome.
    I like it very much. Nostalgia memmories. Rare rural story.
    Congratulations writer Seetaramarajugaru. We expect more stories like this from you. Thankyou very much sir

    Reply
  13. Gadiraju Rangaraju

    తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణ పొందిన పొత్తూరి సీతారామరాజు కధ ‘రాజవ్వ ‘ఏకబిగిన చదివించింది. యుద్ధం లో వెన్ను చూపనవాడే నిజమైన క్షత్రీయుడుఅంటారు పెద్దలు. రాజవ్వ యుద్ధ వ్యూహ్యలు అద్భుత్వం. కల్లాకపటం ఎరుగుని పల్లెవాసుల మంచితనం ఈ కధ లో గుర్తు చేశారు రచయిత. అంతరించి పోతున్న కొన్ని కళలు ఈనాటి తరానికి తెలియ జేయటం అభినందనీయం. చాలా పల్లెల్లో గొడవ వస్తే ఇలాగే జరుగుతుంది. అలాంటి అనుభవం నేను మా గ్రామం లో నాచిన్నతనంలో జరిగిన సంఘటన ఈ కధ జ్ఞాప్తికి తెచ్చింది. క్షతీయుల అభిమానం, పట్టుదల, వ్యహరశైలి, రాజసం, తెగువ, వంటి లక్షణాలు పాత్రలకు తగట్టు సంభాషణలు ఆకట్టుకున్నాయి. కధ శైలి బాగుంది. కధా వస్తువు వాస్తవికతకు దర్పణం పట్టింది. కధలో అనేక పాత్రలను ప్రవేశపెట్టినా కూడా ఎక్కడా గందరగోళానికి తావివ్వ నీయలేదు రచయిత. వాస్తవ సంఘటన తీసుకున్న ఏ కధ అయినా పాఠకుల మన్నలను పొందుతుంది. మంచి కధ గా నిలిచి పోతుంది. కధ రచయిత సీతారామరాజు కు అభినందనలు.
    -గాదిరాజు రంగరాజు
    కవి, రచయిత, కారూనిస్ట్, సమీక్షుడు
    M.A., M. A., M. A., M. A., M. Ed,

    Reply
  14. Anilkumar Seshendra Cherukuvada

    రాజవ్వ కి జోహార్లు, ఇలాంటి కథని అందించినందుకు మీకు కృతజ్ఞతలు. పల్లెటూరు వాతావరణం ,అక్కడ ఉండే మనుషులు వారి మనస్తత్వాలు,పద్ధతులు కళ్ళకి కట్టినట్టు గా రాశారు. ముఖ్యముగా రాజవ్వ ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం.. ఇలాంటి కథ చదవడం మాలాంటి పాఠకుల అదృష్టం.. ధన్యవాదాలు అన్నగారు.. అధ్భుతమైన కథ..

    మా అన్నగారు రాజు గారి కలం నుండి వచ్చిన రాజవ్వ కథ ఒక అందమైన అధ్భుతం..

    Reply
  15. వంశీకృష్ణ

    రాజవ్వ కథ బావుంది. ఆ కాలాన్ని కళ్ల ముందు ఉంచడం లో రచయిత నైపుణ్యం ఎన్నదిగినది
    అభినందనలు

    Reply
  16. MV Ramireddy

    ద్రోణాచార్య ధీరత్వాన్ని, అభిమన్యుడి యుద్ధ నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్న వీర వనిత రాజవ్వ.
    ఒకనాటి చారిత్రక పరిణామాలు, కక్షలు, కార్పణ్యాలతోపాటు మనుషుల్లోని దయాగుణం, శౌర్యం కథ నిండా పరచుకున్నాయి. ఆ పరిస్థితులను కథనం చేయటం అంత తేలిగ్గాదు.
    ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసిన సీతారామ రాజు గారికి అభినందనలు.

    Reply
  17. ఆనంద్ తలారి

    చాలా అద్భుతమైన కథను రచించినటువంటి శ్రీరాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు 🌹💐🙏💐🌹 మాకు తెలియని విషయాలు ఎన్నో ఈ కథలో పొందుపరిచారు. ఇటువంటి కథలు చదవడం వల్ల స్త్రీలకే కాదు పురుషులకు కూడా చాలా మనోధైర్యం ఉంటదని నా యొక్క అభిప్రాయం. 🤝

    Reply
  18. విరించి

    ఒక అసాధారణ కథ ను సాధారణ ప్రచురణకు తీసుకున్నారనే విషయం తెల్సా వారికి తెలుసా అనిపించింది రాజవ్వ కథ చదివాక. ఒక పెద్ద నవలకు ఇది చిన్న కథా రూపం . చారిత్రక నేపథ్యం ఉన్న కథాశం తో ఒక సమగ్ర నవల రాజు గారు కలం నుంచి ఆశిస్తున్నాను. పాత్రలు ఎక్కువైనా కథనం లోతుగా, బిగువుగా ఉండటంతో పాఠకుడిని చకచకా చదివిస్తుంది. ఇది మంచి కథ అని చెప్పలేం..
    గొప్ప కథ అని చెప్పొచ్చు…కవి గానే ప్రసిద్ధులైన రాజు గారు మంచి రచయితగా నిరూపించుకున్నారు.

    Reply
  19. మార్ని జానకిరామ చౌదరి

    అద్భుతమైన కథనంతో సాగిన “రాజవ్వ” కథ చదువుతున్నంతసేపూ శరీరం రోమాంచితమై, నరాలు తెగే ఉత్కంఠ కలిగి, పరిసరాలను మర్చిపోయేలా చేసింది. మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారు 70 ఏళ్ల క్రిందట రాసిన “గొల్ల రామవ్వ” కథలోని రామవ్వ తెగింపు, ధైర్యసాహసాల్ని మించిన సృష్టి. ఈ రాజవ్వ పాత్ర. బహుముఖీనమైన, ఉత్కృష్ఠమైన లక్షణాలు కలిగిన రాజవ్వ యుద్ధ విన్యాసాలు, వ్యూహాలు అనితరసాధ్యం. అనన్యసామాన్యం.

    ఆనాటి గోదావరి జిల్లాల సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లతో పాటు గొప్ప చారిత్రాత్మక సంఘటనల్ని, సామాజిక పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు అత్యద్భుతంగా దృశ్యమానం చేసారు. ముఖ్యంగా శైలి, కథనం,
    పదగుంఫనం ఆకట్టుకున్నాయి. ఇక వాక్య నిర్మాణంలో మిత్రులు సీతారామరాజు గారిది అందె వేసిన చేయి.

    “నాయకులు పుట్టరు.. తయారు చేయబడతారు”
    “ఆయుధం కంటే వ్యూహం గొప్పది”

    “అట్లతద్ది తెల్లవారుజామున ఉప్పు పొట్లాం తిప్పినట్లు రెండు చేతులతో ఇద్దరు మనుషులను గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేస్తాడు..”

    “పరిగెడుతున్న పామును తోక పట్టుకుని మనిషి నరాల్ని వేళ్ళతో లాగేసే”

    “తుమ్మమొద్దులాంటి బలీయమైన ఆ స్త్రీ మెడను ఒడిసి పట్టుకుని, రెండు చేతులతో పైకెత్తి తన మోకాలితో వెన్నుపూసపై పొడిస్తే.. ఎండిన కర్ర విరిగిన చప్పుడు…”

    “ఒక్క మనిషి రక్తం చుక్క కూడా నేల రాలకూడదు. కానీ యుద్ధం జరగాలి”

    ఇటువంటి వాక్యాలు రాయాలంటే అందరికీ సాధ్యంకాదు. సాహిత్యంమీద పట్టూ, కవిత్వనిర్మాణం మీద ఒడుపూ, సబ్జెక్టు(వస్తువు) పై సాధికారత ఉన్న సీతారామరాజు వంటివారికే సాధ్యం. ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

    సోడాబుడ్ల విన్యాసం, కర్రసాము వంటి యుద్ధవిద్యలతో పాటు అనేక యుద్ధ వ్యూహాల గురించి గొప్పగా ఆవిష్కరించారు.

    నక్కా అప్పిగాడు, గుడ్డి సుబ్బన్న, సందాడి వీరన్న, కొయ్యా ముత్తయ్య, కోన కుట్టమ్మ, గుండు సాంబ, చాకలి గుర్రయ్య, కాకి సుబ్బారావు, అబ్బన్నరాజు, సత్తుంరాజు, కూఠంరాజు వంటి పేర్లు భలే విచిత్రంగా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా రాయటం రచయిత అవగాహనకు, పరిజ్ఞానానికి తూనికరాళ్ళుగా చెప్పవచ్చు.

    ఇంత గొప్ప కథను అందించిన ఆత్మీయ మిత్రులు పొత్తూరి సీతారామరాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. మరిన్ని వైవిధ్యభరితమైన కథలు వారి కలంనుండి జాలువారాలని ఆశిస్తున్నాను.🙏
    – మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ.

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.