మరణానికి మరో చూపు
ఒకవైపే కాదు, రెండో వైపూ చూడాలి
అనుకున్న వైపే కాదు, అనువుకాని వైపు కూడా.
ఏముంటాయి?
పొదచుట్టూ ముళ్లే కనిపిస్తాయి
ఓరిమితో వెతికితే ఆ చాటునే పెద్ద పూలతోట
ఎప్పుడూ పైకే కాదు,
అప్పుడప్పుడు కిందకీ చూడాలి.
కుదిరిన వైపే కాదు, కుదరని వైపు కూడా.
ఏముంటుందక్కడ?
ఇంతో, అంతో మట్టి
తెలివితో శోధిస్తే ఆ దిగువనే మణుల మాగాణి
కిందకే కాదు, ఈసారి పైకీ చూడు
తలెత్తుకునే కాదు, తల ఎత్తుకునేలా చూడాలి
ఏం కనిపిస్తుందక్కడ?
ఓ వెరుపెరుగని వెండి మేఘం
అందంగా మురిపిస్తే అదాటున కురిసే గాలివాన
పోనీలే..
అటువైపూ వద్దు, ఇటు వైపూ వద్దు
పైకీ వద్దు, కిందకి అసలే వద్దు
ఓసారి తలొంచుకుని నీలోకి చూడు
లోపలేముంటుంది?
పిడికెడు మట్టో, గుప్పెడు గాలో.
అదిచాలు..
నీ శరీరపు పూలతోట వసివాడినా
హృదయపు పరిమళం సజీవం కావడానికి.
Leave a Reply