తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

దాహం

తెల్సా కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ
దాహం
© Telugu Society of America

“దేవుడెక్కడ వుండె – జీవుడి దిక్కె రాడె
యాడేడో కూకుండె – మా మొరలె ఇనకుండె”

మునివేళ్లతో తంబుర మీటుకుంటూ ఊరిలోకి అడుగుపెట్టాడు సిద్ధయ్య. అతని గొంతులోని పాట గాలితో కలిసి దిక్కుల్లో మార్మోగుతోంది. పిల్లాజెల్లా సిద్ధయ్యను చూసి చప్పట్లు కొట్టసాగారు. చుట్టలు తాగుతున్న ముసలీ ముతకా అందరూ సిద్ధయ్య పాటకు బుర్రలూపసాగారు. వాళ్ల ఉత్సాహం చూసి మళ్లీ గొంతు సవరించుకున్నాడు సిద్ధయ్య.

“గుక్కెడు నీల్ల కోసం – గొంతు ఎండిపాయె
ఏడ్సీ ఏడ్సీ గుండె – బండబారిపాయె
దినదినము గండంగా – ఆయువు నూరేల్లాయె
దిగుడు బావుల్లోన – బతుకు కరుసై పాయె”

కళ్లు మూసుకుని తన్మయత్వంతో పాడుతున్న సిద్ధయ్య ఆ ఊరికి ఎవరూ పిలవని అతిథి. కడుపునిండా అన్నం పెట్టకపోయినా, వరసలతో అందర్నీ పిలుస్తూ ఆనందించే సిద్ధయ్య ఆ ఊరిలో అందరికీ కావలసినవాడే. తోచిన పాటేదో పాడతాడు. ఎవరైనా ఏమైనా పెడితే తింటాడు. చెట్టుకిందున్న బండరాళ్లమీదో, వీథి అరుగుల మీదో కూర్చుని ముసలి వాళ్లతో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడతాడు. బంధువులెవరూ లేకపోయినా ఏదో తెలియని చుట్టరికం అతన్ని ఆ ఊరిదాకా నడిపిస్తుంది.

“యేం శిద్దయ్యా, పాడిందే పాటరా పాసి పల్ల దాసుడా అన్నట్టు యెప్పుడూ పాడిన పాటేనా? పాట మార్సరాదూ” అన్న మాటతో కళ్లు తెరిచి మాటలు వినిపించిన వైపు చూశాడు సిద్ధయ్య.

ముగ్గుబుట్టలా ఉన్న తలమీద చిరుగుల కండువాను చుట్టుకుని, నోట్లో చుట్టపీక బయటికి తీసి తుపుక్కున ఉమ్మేస్తూ కనిపించాడు లింగయ్య. ఏడుపదుల జీవితం అతని ముఖంలో ఏరింకిన తర్వాత ఏర్పడే పగుళ్లలా కనిపిస్తోంది. పొమ్మంటున్న ఊరి ఙ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ వల్లకాటి పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది లింగయ్య వాలకం. అతన్ని చూసి నవ్వుతూ “కళ్లల్లో కాదు, వూల్లల్లో నీల్లు పొంగితే నా పాట మారుతుందిలే మామా!” అంటూ ముందుకు సాగాడు.

సిద్ధయ్య చేతితో తంబుర మీటుతూనే ఉన్నాడు.

“దేవుడెక్కడ వుండె జీవుడి దిక్కె రాడు” అంటూ అతని గొంతు మార్మోగుతూనే ఉంది.

“అద్దరాతిరి నడమంతరపు శిరొచ్చిట్టుగా వొత్తే తప్ప ఈ వూల్లోకి నీల్లు రావు. అయ్యొచ్చేసరికి బతికేదెవుడో, సచ్చేదెవుడో” సిద్ధయ్యను చూస్తూ తనలో తనే గొణుక్కున్నాడు లింగయ్య.


దూరంగా విసిరేసినట్లుగా ఉన్న ఆ ఊరినిండా నడుస్తున్న శవాల్లా ఊపిరి బిగబట్టుకుని తిరుగుతున్నారు జనాలు. ఎవరి కళ్లల్లోనూ జీవం లేదు. ఎవరి దేహంలోనూ సత్తువ లేదు.

దాదాపు యాభై గడపలుగా విస్తరించిన ఆ ఊరిలోని ఇళ్లు కాని ఇళ్లు అంతులేని దారిద్ర్యానికి ఆనవాళ్ళుగా నిలుస్తున్నాయి.

చాలీచాలని బట్టల్ని పైకీ కిందకీ లాక్కుంటూ పిల్లలంతా అటూ ఇటూ పరిగెడుతున్నారు. పూర్తిగా ఎండని మురుగ్గుంటల్ని కర్రల్తో కదిలిస్తూ, వాటిమీద ముసురుకున్న ఈగలు పైకి లేస్తుంటే వాటివంక విచిత్రంగా చూస్తూ ఆడుకుంటున్నారు.

తాటాకు ఇంటిని తగలబెడుతున్నట్లుగా మండిపోతున్నాయి ఎండలు.

చూరుమీద కూర్చుని అదేపనిగా అరుస్తున్న కాకుల వంక దిగులుగా చూడసాగింది పంగిడమ్మ. ఆమెకు గుండె దడగా ఉంది. కాకులరిస్తే చుట్టాలొస్తారని అందరూ అంటుంటే చాలాసార్లు వింది. అలవాటులో పొరబాటుగా, నవ్వులాటగా పంగిడమ్మ కూడా చాలాసార్లు ఆ మాటలు అంది.

అయినా ఇప్పుడు మాత్రం ఆ మాటలు నిజం కాకూడదని మనసులో ప్రార్థించుకుంది.

మాటిమాటికీ పెదాల్ని నాలుకతో చప్పరిస్తూ వీథివైపు చూస్తున్న పంగిడమ్మకు దేవతలా కనిపించింది అనంతమ్మ. “ఇదిగో అత్తా, నాక్కూడా ఒక బింది నీల్లు తెచ్చిపెట్టవూ” అంది ఆమెవంక చూస్తూ.

“ఆ, బాగుందే నీ వరస! అందరిలాగా రెండుమూడు బిందెలు నెత్తిన పెట్టుకుని మోసుకురావడానికి నేనేమన్నా నీలాగా పడుసుదాన్నా? కూసుంటే లేవలేను, లేత్తే కూసోలేను. ఈ బిందినీల్లు మోసుకొచ్చేసరికి వుంటానో పోతానో నాకే తెలవదు” తనలో తనే గొణుక్కుంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది అనంతమ్మ.

ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ కర్రెద్దు

పంగిడమ్మలో ఎక్కడలేని నీరసం ఆవరించింది. నడుమంతా ఒకటే నొప్పి, దానికితోడు పొత్తికడుపులోని నరాల్ని ఎవరో మెలితిప్పుతున్నట్లుగా, పొయ్యిమీద ఎసరు మరుగుతున్నట్లుగా తెరలు తెరలుగా భరించలేని బాధ! తలనొప్పి, వికారం, ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోనివ్వని నొప్పి శరీరమంతా ప్రవహించసాగింది. మనసంతా చికాకుగా ఉంది. ఏ పనిమీదా దృష్టిని నిలపలేకపోతోంది. కాసేపు పడుకుంటే బాగుండనిపించింది. గొంతెండి పోయి పెదాలు పిడచకట్టుకుపోతున్నాయి.

దిగులుగా బిందెవైపు చూసిన పంగిడమ్మకు ఖాళీబిందె వెక్కిరించినట్లుగా కనబడింది. కళ్లు రెండూ కన్నీటి చెలమల్లా మారిపోయాయి. ఎవరైనా ఒక్క బిందెనీళ్ళు తీసుకొస్తే బాగుండని ఆశగా వీథివైపు ఎదురుచూడసాగింది.

కాసేపటి నిరీక్షణ తర్వాత లచ్చుమమ్మ కనిపించింది. ఆమె వైపు చూస్తూ “పిన్నే, నాక్కూడా ఒక బిందె నీళ్ళు తెచ్చి పెట్టవూ” అంటూ ఆశగా అడిగింది. పంగిడమ్మ వంక విచిత్రంగా చూస్తూ “నా నెత్తిమీద కొండల్ని సూత్తా కూడా ఎట్టా అడుగుతున్నావే ఆ మాట” అంది నవ్వుతూ. తలెత్తి లచ్చుమమ్మ వైపు చూసింది పంగిడమ్మ.

తప్పించుకోలేని పాపాలేవో మోసుకుని తిరుగుతున్నట్లుగా ఒకదానిమీద మరొకటిగా పేర్చి వున్న బిందెలు కనిపించాయి. ఆమెవంక జాలిగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది పంగిడమ్మ.

కాసేపయ్యాక “అయినా, నీల్లకి రాడానికి అంత బద్దకం యాందంటా నీకు” అంది లచ్చుమమ్మ.

“బద్దకం కాదే మయిలొచ్చింది!” అంటూ మూడు వేళ్ళు చూపిస్తూ “బాగా నడుం నొప్పిగా వుంది. కాళ్లు తేలిపోతున్నట్టుగా వున్నాయి” అంది నీరసంగా. నెత్తిమీద కుండ నేలమీద పడి భళ్ళున బద్దలైనట్లుగా పగలబడి నవ్వింది లచ్చుమమ్మ. ఆమె ఎందుకలా నవ్వుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న పంగిడమ్మను చూస్తూ “ఆడదై పుట్టాక అదీ తప్పదు, ఇదీ తప్పదు. మయిలొచ్చిందని ముడుసుకుని పడుకోడానికి మనమేమైనా కలిగినోల్లమా? కూటికి లేనోల్లం, నీటికి లేనోల్లం” అంది తలమీది బిందెల్ని చూపిస్తూ.

ఉన్న ఒక్క ఆశ కూడా నీరుగారిపోవడంతో తప్పదన్నట్లు పైకి లేచిన పంగిడమ్మకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మినట్లుగా అనిపించింది. వసారా గుంజను పట్టుకుని ఒక్కనిమిషం అలాగే నిలబడింది. తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి బిందెను తీసుకుని లచ్చుమమ్మను అనుసరించింది.


నడినెత్తిమీద సూర్యుడు తాచుపాములాగా వెంబడిస్తున్నాడు.

లచ్చుమమ్మతో నడుస్తుందన్న మాటేగానీ పంగిడమ్మ మనసంతా దిగులుగా ఉంది. సముద్ర తరంగాల్లా ఆలోచనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ ఆలోచనల నిండా ఖాళీబిందెలు కదలాడుతున్నాయి. గొంతు తడారిపోయి నీటిచుక్కల కోసం అల్లాడుతున్న మనుషులు కనిపిస్తున్నారు.

నీళ్ళు కావాలంటే యాభైకి పైగా వున్న గూడెం గుడిసెల్ని దాటి రెండు కిలోమీటర్లు నడవాలి. రాళ్లను, తుప్పల్ని, ముళ్ల కంచెల్ని దాటి నడక సాగించాలి. అంత కష్టపడి వెళ్ళినా సరిపడినన్ని నీళ్ళు దొరకవు. అడుగునెక్కడో కనిపించే నీటిఊటల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగుడుబావుల్లోకి దిగాలి.

ఖాళీ బిందెలతో దిగుతున్నప్పుడు బాగానే ఉంటుంది గానీ నీళ్ళు నిండిన బిందెలతో పైకి ఎక్కిరావాలంటే ప్రాణం పోయి మళ్లీ వచ్చినట్లుగా ఉంటుంది. ఎత్తుపల్లాల్ని దాటుకుంటూ, నేల పగుళ్లలో కాళ్లు పడకుండా నడవాలి. అసలే బరువు, దానికి తోడు నడిచే దారిలో రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళు కాలికి తగిలి గీరుకుపోతూ ఉంటాయి. ప్రాణం ఎగశ్వాస, దిగశ్వాసగా ఉంటుంది. బిందె ఇంట్లో దించేదాకా బొందిలో ప్రాణం ఉంటుందో లేదో తెలియదు!

ఒక్కరోజయితే పంటిబిగువున భరించొచ్చు! రెండుమూడు రోజులైతే తప్పనిసరి తద్దినమని సరిపెట్టుకోవచ్చు! జీవితమంతా అదే బరువు, అదే నడక, అదే దాహం! తరాలు మారుతున్నా తలరాతలు మారని దౌర్భాగ్యానికి ఎవర్ని తిట్టుకోవాలో అర్థం కాదు. దూరమని, భారమని తప్పించుకుని పారిపోవడానికీ కుదరదు! చావుకీ బతుక్కీ మధ్య నిలబెట్టిన బలహీనమైన మట్టికుండలాగా దేహం క్షణక్షణమూ ఊగులాడుతూనే ఉంటుంది.

“యాంటే ఏమీ మాట్టాడవు? దూరం తెలవకుండా ఉంటది. ఏదో ఒకటి మాట్టాడు” అంది లచ్చుమమ్మ. “దూరం తెలవకుండా వుంటానికి మనమెల్లి అక్కడే వుండంగా. బతుకంతా తిరుగుతానే వుండాలిగా” అంది నవ్వుతూ పంగిడమ్మ. “నువ్వేమో పెల్లి నడక నడుత్తున్నావు. నీతో వొత్తే నీల్లు తెచ్చినట్టే, అన్నం వొండినట్టే! మగోడిదేముంది. బుజానున్న తుండుగుడ్డ దులిపి అరుగుమీదో, అంగడికాడో కూసుని కాలచ్చేపం చేత్తాడు. నాలుగు దమ్ములు లాగి గమ్మున కూసుంటాడు. మనం నీల్లెత్తుకొత్తే గానీ ముద్ద దిగని ఈ మొగోల్లంతా ఆలెస్సమయితే మాత్రం కొట్టడానికి కర్రెత్తుకొత్తారు. నీవల్ల ఇయ్యాల మా ఆయన శేతిలో బడితె పూజ తప్పేటట్టుగా లేదు” అంది లచ్చుమమ్మ.

ఆమె వంక చూస్తూ “ఏం చేయను పిన్నీ. నీళ్ల బొరువు ఒక రకం నరకమైతే, నెత్తుటి నడక మరీ నరకంగా వుంది” అంటూ పంటి బిగువున బాధ భరిస్తూ నెమ్మదిగా నడవసాగింది.

పంగిడమ్మలో మళ్లీ ఆలోచనల తేనెతుట్టు కదిలింది.

అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉన్న ఇళ్ల మధ్య అతుకుల బొంతగా కనిపించే పుట్టిల్లు గుర్తొచ్చింది. నాలుగు పక్కలా పాతిన కర్రలు, దానికి చుట్టూ కట్టిన చిరుగుల చీరలు, అవి గాలికి ఎగరకుండా మూలమీద పెద్ద రాళ్లకు కట్టిన తాడు, చెదలు సగం కొరికేసిన తాటాకుల కప్పులు ఆమె మనసులో వెంటాడే ఙ్ఞాపకాలుగా కదలాడసాగాయి.

‘నీళ్ళు గొప్పవా? ఇల్లు గొప్పదా?’ అనే ప్రశ్న అప్పుడప్పుడూ పంగిడమ్మ మనసులో మెదులుతూ ఉండేది. ఉండడానికి పనికొచ్చే ఇంటికంటే బతికుండడానికి పనికొచ్చే నీరే గొప్పదని సమాధానపడిపోయేది.

పొద్దున లేచింది మొదలు పడుకునేదాకా నీళ్లకోసం తపనపడే ఆడవాళ్ళు కళ్లముందు కదలాడారు. కర్రల వంతెనలు దాటుకుని నీళ్లబిందెల బరువులు కిలోమీటర్ల కొద్దీ మోసీ మోసీ అలసి సొలసిపోయిన ఆడవాళ్ళు, నడిచీ నడిచీ ప్రాణాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు, అనారోగ్యంతో మంచానపడిన ఆడవాళ్లు గుర్తొచ్చారు. బతికున్నవాళ్ల పెళ్ళి చేయడానికి బిందెల బిందెల నీళ్ళు మోసి చచ్చిపోయిన వాళ్లు, మనిషి చచ్చిపోతే అంతిమ సంస్కారాలకు నీళ్లు దొరకని సందర్భాలు! ఒకటా రెండా బతుకుంతా ఖాళీ కుండలు బద్దలవుతున్న చప్పుడే! ఇప్పుడు ఇల్లు మారింది! పెళ్ళి పేరుతో ఊరు మారింది. అయినా అవే కష్టాలు. అవే కాష్టాలు! పాదంలో రేగు ముల్లు గుచ్చుకుని ఒక్కసారిగా ముందుకు తూలింది పంగిడమ్మ. ఒక్కసారిగా ఎక్కడలేని బాధ వెల్లువలా తన్నుకొచ్చింది. ఎడం కాలు పైకెత్తి కుడి మోకాలి మీద పెట్టుకుని పాదంలోని ముల్లును బయటికి లాగింది.

దారిలో ఎదురవుతున్న ఆడవాళ్లంతా నెత్తిమీద దిగులుబరువును మోస్తూ కనిపించారు. కొంతమంది ఖాళీ బిందెల తోనూ, మరికొంతమంది నీళ్లబిందెలతోనూ ఎదురవుతున్నారు. అమాయకంగా కనిపిస్తున్న చిన్నపిల్లలంతా తోచిన చెంబో, గిన్నో పట్టుకుని పెద్దవాళ్లతో నడుస్తున్నారు.

“మన వోట్లకోసం ఎగబడినోల్లు మన పాట్లు సూట్టానికి ఎందుకు రారో. అవసరం వుంటేనేమో బెల్లం సుట్టూ ఈగలు. అవసరం తీరాక ఎంటబడి తరిమే పాములు” అంది కాసేపు నడిచాక పంగిడమ్మ.

ఆ మాటలకు పెద్దగా నవ్వుతూ “యాందే పిల్లా! ఇయ్యాలంతా యేదేదో మాట్టాడుతున్నావు. నువ్వోటేశి గెలిపించినోల్లంతా నీ యింటిసుట్టూ పెదచ్చినాలు శేసి పొరులు దండాలు పెడతారనుకుంటన్నావా” అంది లచ్చుమమ్మ. “గుక్కెడు నీల్లు లేక పల్లెలన్నీ వొల్లకాడయ్యాక ఆల్లొచ్చి సేసేది మాత్రం ఏముందంటా?” అంది పంగిడమ్మ. లచ్చుమమ్మ ఏమీ మాట్లాడలేదు. “ఏమో పిన్నీ, నీల్ల కోసం రోజూ ఇంతదూరం రావడం శానా కట్టంగా వుంది. ఆడదానికి అంతులేని కన్నీల్లెట్టిన ఆ బగమంతుడు అయ్యి తాగి బతికే వొరమిచ్చినా బాగుండు. సచ్చేలోపు కడుపునిండా నీల్లు తాగి పేనాలు వొదలాలని వుంది. ఆ కోరికన్నా తీరుద్దో లేదో” అంది పంగిడమ్మ.

లచ్చుమమ్మ పెద్దగా నవ్వింది. అయినా ఆ నవ్వులో జీవం లేదు. నవ్వుతున్నప్పుడు ఆమె కళ్లనిండా నీళ్లు చిప్పిల్లాయి. అవి కళ్లను దాటుకుని చెంపలపై ధారలు కట్టాయి. ‘గొంతెండిపోయి రోజూ చచ్చే మనకు అంతకన్నా మంచి కోరికలు ఎలా కలుగుతాయిలే’ అంటూ తనలో తాను గొణుక్కుంది.


ఇద్దరూ దిగుడుబావి దగ్గరికి చేరుకున్నారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలతో ఆ ప్రాంతమంతా శరణార్థుల శిబిరంలా ఉంది. ఒంటిమీద సరిగా బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా యుద్ధానికి భయపడి తలదాచుకోవడానికొచ్చిన గుంపులా ఉంది.

బావి గట్టునుంచి కిందకి చూస్తే పాతాళంలోకి చూస్తున్నట్లుగా అనిపించింది. ఆడవాళ్లంతా ఒక్కో మెట్టుమీదా నిలబడి ఉన్నారు. ఒకరు బిందె ముంచి అందిస్తుంటే మిగతావాళ్ళు దాన్ని అందుకుని పైకి చేర్చుతున్నారు. ఒక్కొరొక్కరుగా ముందొచ్చిన వాళ్లంతా నీళ్ళబిందెల్ని తీసుకుని వెళ్ళిపోసాగారు. ‘నేను దిగనా లోపలికి’ అన్నట్లు పంగిడమ్మ వైపు చూసింది లచ్చుమమ్మ. ‘వద్ద’న్నట్లు కళ్లతోనే సైగచేసి ఒక్కో మెట్టూ దిగసాగింది పంగిడమ్మ.

నీళ్లకు దగ్గరగా వున్న ఆఖరి మెట్టుమీద నిలబడి ముందుకు వంగి బిందెను నీళ్లలోకి ముంచి లచ్చుమమ్మకు అందించింది. తర్వాత మరో బిందెను తీసుకుని నీళ్లలోకి ముంచడానికి ముందుకు వంగింది. అంతే! పట్టుతప్పి ఒక్కసారిగా కళ్లు తిరిగి నీళ్లలోకి పడిపోయింది పంగిడమ్మ. నీళ్లలో తేలుతూ మునుగుతూ రెండు చేతుల్నీ పైకిలేపి కాపాడమన్నట్లుగా చేతులను ఆడించసాగింది.ఏం చేయాలో అర్థం కాలేదు లచ్చుమమ్మకు. ఒకరిద్దరు తప్ప బావి దగ్గర ఎవరూ కనిపించలేదు. వాళ్లను దగ్గరకు రమ్మన్నట్లుగా పిలుస్తూ ఏదో ఆలోచన స్ఫురించి తన ఒంటిమీద చీరను విప్పేసి దాని చివర చిన్న రాయి ముడేసి పంగిడమ్మను పట్టుకోమన్నట్లుగా నీటిలోకి విసిరేసింది.

అప్పటికి పూర్తిగా మునిగిపోతున్న పంగిడమ్మకు ఒక ఆసరా దొరికినట్లయింది. ఆఖరిమెట్టు మీద కూర్చుని తన బలమంతా ఉపయోగించి పంగిడమ్మను ఒడ్డుకు లాగడానికి ప్రయత్నం చేయసాగింది లచ్చుమమ్మ. కొద్దిసేపు బాగానే సహకరించిన పంగిడమ్మలో హఠాత్తుగా చలనం ఆగిపోయింది. రాయిని పట్టుకున్న చేయి కట్టెలా బిగుసుకుపోయింది.

లచ్చుమమ్మ గుండె దడదడలాడింది. సగం శరీరం నీళ్లలోనూ, మిగతా సగం దేహం మెట్టుమీదా పడి అచేతనంగా మారిన పంగిడమ్మను చూసింది. నడవలేక నడుస్తూ పంగిడమ్మ మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి. ‘కడుపునిండా నీళ్ళు తాగేసి నిద్రపోతున్నావా’ అనుకుంది.

నీళ్లబిందె తీసుకుని హడావిడిగా ఒకో మెట్టూ దిగి కిందకు వచ్చిన అనంతమ్మ “ముదనస్టపుది! సావడానికి ఇంతకన్నా సోటు దొరకలేదా? రేపట్నుంచి నీల్ల సుక్కల కోసం కుక్కలా ఎక్కడెక్కడ తిరగాలో. ఇట్టా వుత్తి కుండలతో ఎల్తే కోడలు సేతిలో పస్తులే.” తనలో తనే గొణుక్కుంటూ వెనక్కి తిరిగింది అనంతమ్మ.

“యెవరెవరో వొత్తారు – యేమేమో చెపుతారు
యేల్లు గడిసిపోయె – ఎతలు దీరకపోయె
నీటి సుక్కల కోసం – కోటి మొక్కులు మొక్కి
సొమ్మసిల్లిన బతుకు – వొల్లకాటికి పాయె
దేవుడెక్కడ వుండె – జీవుడి దిక్కె రాడె
యాడెడో కూకుండె – మా మొరలె ఇనకుండె”

గాలిలో తేలి వస్తున్న సిద్ధయ్య గొంతు పంగిడమ్మ నిర్జీవ దేహాన్ని చూసి పొగిలి పొగిలి దుఃఖిస్తోంది.

చితిని వెలిగించడానికి నిప్పుకర్రలు తెచ్చినట్లుగా మండిపోతున్నాడు సూర్యుడు.

రచయిత పరిచయం

డా. జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు గారు నూజివీడులోని ఐ.ఐ.ఐ.టీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. 2012 నుండి ఇప్పటివరకూ డెబ్భై ఐదుకు పైగా కథలు, డెబ్భైకి పైగా కవితలు, పాతికపైగా పాటలు రాశారు. ఎన్నో కథలకు, కవితలకు బహుమతులు అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సుమారు డెబ్భై వ్యాసాలు సమర్పించారు. “తలరాతలు”, “ఆకుపచ్చని కన్నీళ్లు” అనే కథాసంపుటాలను, “గడియారం బతుకులు” అనే కవితాసంపుటం, “వ్యాసలోహిత” అనే వ్యాససంపుటి, “విజయవిలాసం” అనే చిన్న సమీక్షా గ్రంథం వెలువరించారు. ప్రస్తుతం “మంచుకింద ఉక్కపోత” అనే పేరుతో మూడవ కథాసంపుటి వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు.

13 Responses to “దాహం”

  1. వారణాసి భానుమూర్తి రావు

    హృదయాన్ని కదిలించిన కథ. రాయల సీమ లోనే గాదు.. ఏ ప్రాంతము లోని పల్లెల పరిస్థితి ఇలాగే ఉంది.‌ నీటి కోసం ప్రాణాలు విడచిన పంగిడమ్మ పడిన పాట్లు హృదయ విదారకంగా ఉంది. నేను వ్రాసిన కథ ‘ వాన దేముడా! ‘ గూడా రాయల సీమ పల్లె ప్రజల నీటి వెతలే! ప్రతి పల్లె సౌభాగ్యంగా వుండ గలదా! గ్రామ స్వరాజ్యం నిజంగా తిరిగి వస్తుందా?

    Reply
  2. కొక్కెరగడ్డ వెంకట లక్ష్మణరావు

    నీటి విలువ …దాహార్తి తీరని వెతలు వెరసి దాహం కథ… పదానికి పదానికి మధ్య చదువుతున్న పాఠకుడు కన్నీటిని కార్చకుండా ఉండలేడు.. కథలోరచయిత జాడా సుబ్బారావు
    గారు చెప్పినట్టు “కన్నీటిని ఇచ్చిన దేవుడు వాటిని తాగే అవకాశం ఇవ్వలేదు.దాహం ఒక అవసరం.అవసరం తీరక పోతే ఉండలేం.అవసరం తీరితే దేవుణ్ణి తలుచుకోము. పెద్దవాళ్లకు అరగక జబ్బులొస్తాయి.పేద వాళ్లకు దొరకక జబ్బులొస్తాయి.ఇద్దరి మధ్యనా వింత నాటకం ఆడుతూ అద్దరిని కూర్చొంటాడు. కొందరి బతుకులు కరువు తో ,మరి కొందరి బతుకులు బరువుతో తెల్లరతాయి.కానీ చాలామంది బతుకులు దాహం తీరకుండానే తెల్లారతాయి. అయితే ఉన్న ఒక్క దిగుడు బావిలో పంగిడమ్మ బతుకు తెల్లారింది.తోటి జీవుల బాధ..సాటి జీవి “దాహం”తీరక పోయిందని కాదు. ఇకపై వారి దాహం తీరే దారి ఏదని?…వారి నీటి దాహం తీరదు.వారి బతుకు మాత్రం “చితి”కి పోతుంది…ఇది కథ కాదు.నీటి వ్యధ.కన్నీటి బాధ.గొంతు తడపని “దాహం గాధ.ప్రథమ బహుమతికి అన్ని విధాలా అర్హమైన కథ. మంచి కథ చదివించి న తెల్సా వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. రాసిన డాక్టర్ జడా సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు….. కె.వి.లక్ష్మణరావు

    Reply
  3. శింగరాజు

    చాలా బాగుంది సర్..వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపారు రచయిత. అభినందనలు

    Reply
  4. బొడ్డేడ బలరామస్వామి

    పంగిడమ్మ విషాదభరిత జీవిత చిత్రణ చాలా బావుంది. జడా సుబ్బారావు గారికి అభినందనలు💐💐

    Reply
  5. బొడ్డేడ బలరామస్వామి

    పంగిడమ్మ విషాదభరిత జీవిత చిత్రణ చాలా బావుంది. జడా సుబ్బారావు గారికి అభినందనలు

    Reply
  6. ఓట్ర ప్రకాష్ రావు

    ” నీటికి లేనోల్లం” అనుకొంటూ నీటికోసం కష్టాలతో జీవిస్తున్న వారి కథను రచయిత చాలా చక్కగా వ్రాసారు.అభినందనలు

    Reply
  7. ఎమ్వీ రామిరెడ్డి

    దాహం కథ చదువుతుంటే గొంతు పిడచ కట్టుకుపోయింది. నా చిన్నప్పుడు చెరువు నుంచి కావిళ్లతో మంచినీళ్లు మోసుకొచ్చిన రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటికీ అనేక పల్లెలు దాహంతో అల్లాడిపోతున్న దుర్భర వాస్తవాన్ని జడా సుబ్బారావు మంచి కథగా మలిచారు. ముఖ్యంగా ఆడవారి వెతలను కళ్లకు కట్టేలా రాశారు.
    ‘బిందె ఇంట్లో దించేదాకా బొందిలో ప్రాణం ఉంటుందో లేదో తెలియదు’, ‘నడినెత్తిమీద సూర్యుడు తాచుపాములాగా వెంబడిస్తున్నాడు’, ‘తాటాకు ఇంటిని తగలబెడుతున్నట్లుగా మండిపోతున్నాయి ఎండలు’ వంటి వాక్యాలు కథనాన్ని చిక్కబరిచాయి. ముగింపు చాలా బాగుంది.
    మంచి కథకు బహుమతినిచ్చిన ‘తెల్సా’ వారికి, రచయిత సుబ్బారావు గారికి అభినందనలు.

    Reply
  8. Dondapati Krishna

    ‘మంచి కథ ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్న చాలామందిలో, చాలాసార్లు ఉదయించే ఉంటుంది.

    ముద్దపప్పులోకి ఆవకాయ, నెయ్యి కలుపుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఒక కథ చదివాక కూడా అదే అనుభూతి కలిగితే అదే మంచి కథ అంటాను.
    ఈ దాహం కథ కూడా అలాంటిదే.

    కథావస్తువుగా చూస్తే ‘నీళ్ళ కరువు’. కథనంగా చూస్తే గుండె బరువు. దృశ్యమానంలో కన్నీటి గాథలు.

    వస్తువు సార్వజనీనమైనది. శైలీ శిల్పాలు వ్యక్తిగతమైనవి. ఈ శైలీ శిల్పాల వలనే రచయిత పాఠకుల హృదయాల్ని కదిలించగలుగుతాడు. ఆలోచనల్ని రేకెత్తించగలుగుతాడు. జ్ఞాపకాలను తడిమి చూసుకునేలా చేస్తాడు. కర్తవ్యాన్ని వివరిస్తాడు. అది మంచి కథలో ఉన్న ప్రధాన లక్షణం.

    ఆ గ్రామంలో నీటి కొరత గాలిలాగా సంచరిస్తూ ఉంటుంది. నెత్తిమీద బిందెపైన బిందె పెట్టుకుని కిలోమీటర్ల దూరం ప్రయాణించి దిగుడు బావుల్లో తెచ్చుకోవాల్సిన దుస్థితి. దాదాపు ముప్పై గడపలే ఉన్న ఆ ఊరికి పాలకులు పిలిచినా పలకని అతిథులు.

    పంగిడమ్మకు మైలొచ్చింది. ఇంట్లోచూస్తే చుక్క నీరు కూడా లేదు. ఖాళీ బిందెలు వెక్కిరిస్తున్నాయి. ఎవరన్నా తెచ్చి పెడతారేమో అని చూస్తోంది కానీ అది అడియాసే. అరుగుమీదో, అంగడికాడో కాలక్షేపం చేస్తూ నాలుగు దమ్ములు లాగుతూ కూర్చునే మగవాడు (మొగుడు), నీళ్ళు తీసుకొచ్చి ఆలస్యంగా అన్నం కూర వండిపెడితే మాత్రం కొట్టడానికి కర్రెత్తుకొస్తారు. అటువంటి పరిస్థితుల్లో నీరసంతోనే ఖాళీ బిందెను పట్టుకుని రాళ్ళను, తుప్పల్ని, ముళ్ళ కంచెల్ని దాటి లచ్చుమమ్మతో నడక సాగించింది పంగిడమ్మ.

    ఇద్దరూ దిగుడు బావి దగ్గరికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా శరణార్థుల శిబిరంలా ఉంది. అక్కడికొచ్చిన వారు నీళ్ళ కోసం ఎగబడుతున్నారు. వాళ్ళందరినీ దాటుకుని పంగిడమ్మ నీళ్ళు తెచ్చిందా? దిగుడుబావిలో నీళ్ళకు దగ్గరగా ఉన్న ఆఖరి మెట్టుమీద నిలబడిన పంగిడమ్మ పైకి వచ్చిందా?

    ఆడవాళ్ళకు అంతులేని కన్నీళ్లునిచ్చిన ఆ భగవంతుడు వాటిని తాగి బతికే వరమిచ్చినా బాగుణ్ణు అనుకునే పంగిడమ్మకు చచ్చేలోపు కడుపునిండా నీళ్ళు తాగి చావాలని కోరిక. ఆ కోరిక తీరిందా? ఇవన్నీ తెలియాలంటే కథను ఆసాంతం చదవాల్సిందే.

    ఈ దాహం కథలో మూడు పాత్రలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కథను ముందుకు తీసుకెళ్ళడంలో తోడ్పడతాయి. ఒకటి నీళ్ళ కరువును, గ్రామ పరిస్థితిని పాటల రూపంలో తంబుర మీటుతూ చెప్పే సిద్ధయ్య. రెండు లింగయ్య పాత్ర. అమృతోత్సవాలు జరుపుకుంటున్న మన దేశంలో ఇప్పటికీ మా అవస్థలు ఇలాగే ఉన్నాయి అని చెప్పడానికి సాక్ష్యంగా మిగిలినవాడు. మూడు అనంతమ్మ. చివర్లో పంగిడమ్మ పట్ల ఆమె ప్రవర్తనకు మనలో కోపం రాకుండా ఉండదు.

    భాషమీద ప్రేమ, మమకారం ఉన్నవాళ్ళ అంతరంగం వాళ్ళ కథల్లో కనిపిస్తూ ఉంటుంది. డా. జడా సుబ్బారావు గారికి భాషమీదున్న పట్టు తెలియాలంటే మచ్చుకు కొన్ని వాక్యాలు:
    1.ముగ్గుబుట్టలా ఉన్న తలమీద చిరుగుల కండువా చుట్టుకున్నాడు (ముసలివాని దీనస్థితిని తెలియజేయడానికి వాడిన వాక్యం)
    2.నడుస్తున్న శవాల్లా ఊపిరి బిగబట్టుకుని తిరుగుతున్నారు జనాలు (నీళ్ళ కొరత చెప్పే సందర్భం)
    3.తాటాకు ఇంటిని తగలబెడుతున్నట్లుగా మండిపోతున్నాయి ఎండలు (ఎండ తీవ్రత గురించి)
    4.చితిని వెలిగించడానికి నిప్పుకర్రలు తెచ్చినట్లుగా మండిపోతున్నాడు సూర్యుడు (ఇది ఎందుకో మీరే తెలుసుకుంటే బాగుంటుంది).

    రచనలో పాటించవలసిన మూడు నియమాలకే కాకుండా సందర్భానికి తగ్గట్లు రెండు చిన్న పాటలు రాయడం కథకు మరింత వన్నె తెచ్చింది. కథ చదివేటప్పుడు సిద్ధయ్యలాగా మనమూ ఆ పాటను పాడతాము.

    ఈ కథ గ్రామీణ స్త్రీల దుస్థితిని అక్షరీకరించిందా? నీళ్ళ విలువను తెలియజేసిందా? పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిందా? వాస్తవాన్ని కళ్ళకు కట్టిందా? అనేది పాఠకులే నిర్ణయించాలి.

    ఈ కథలో లోపాలు లేవా? అంటే నాకు కనపడలేదనే చెప్తాను. కథ దృశ్యమానంగా నా మనోనేత్రంపై కదలాడుతున్నప్పుడు, చిన్నప్పుడు కావిడ పట్టుకుని నీళ్ళు తెచ్చిన రోజులు గుర్తుకొస్తున్నప్పుడు అవేం కనపడలేదు. ఎప్పుడూ ఏ కథకీ ఇంత సమీక్ష రాయని నేను ఈ కథకే ఎందుకు రాశాను అంటే చెప్పలేను.

    యాభై వెల రూపాయలిచ్చి ప్రథమ బహుమతిగా ప్రకటించిన తెల్సా బృందానికి, రచయితకు హార్దిక అభినందనలు.

    Reply
  9. మీనాక్షి శ్రీనివాస్

    నీటి వెతలు, అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. అసలు ఏ వెత అయినా అంతే.
    కానీ జడా వారు తన కథనంతో ఆఁ కష్టాలను పాఠకులందరికి దృశ్య మానం చేశారు.
    ‘కన్నీళ్లిచ్చిన దేవుడు, అవి తాగి బ్రతికే వరం ఇస్తే ‘ అన్న వాక్యం ఈ కథకు మకుటాయమానం అని నాకనిపించింది.
    జడా వారికి హార్దిక అభినందనలు. 🙏🙏

    Reply
  10. డా మక్కెన శ్రీను విజయవాడ

    యేం శిద్దయ్యా, పాడిందే పాటరా పాసి పల్ల దాసుడా అన్నట్టు యెప్పుడూ పాడిన పాటేనా? పాట మార్సరాదూ”
    “అద్దరాతిరి నడమంతరపు శిరొచ్చిట్టుగా వొత్తే తప్ప ఈ వూల్లోకి నీల్లు రావు. అయ్యొచ్చేసరికి బతికేదెవుడో, సచ్చేదెవుడో”
    ఎన్నో ఏళ్ళు గతించిన నీళ్లు దొరకని ప్రదేశాలు కనపడని వినపడని సందర్భాలు గ్రామీణంలో నిత్యాలే .. పట్టణాలలో సత్యాలే .. ఎన్నటికీ తరగని .. వ్యధ ఇది . ఇలాంటి అంశాన్ని రచయిత కధ గా మలచిన తీరు ఆర్ద్రంగా వుంది .. “యెవరెవరో వొత్తారు – యేమేమో చెపుతారు.. యేల్లు గడిసిపోయె – ఎతలు దీరకపోయె … అనే సిద్దయ్య పాట నీళ్లు దొరకని ఊళ్ళ దుస్థితిని .. నీటికై మహిళల కడగండ్లు . పాడిందే పాటగా అనిపించినా, అయ్యొచ్చేసరికి బతికేదెవుడో, సచ్చేదెవుడో” అనే పరిస్థితి కళ్ళకు కట్టినట్లు దాహం కధలో ఆవిష్కృతమయ్యింది కధను అందించిన జడ సుబ్బారావు గారికి … బహుమతి ప్రకటించిన తెల్సా వారికి అభినందనలు

    Reply
  11. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

    ప్రియమిత్రులు డా. జడా సుబ్బారావు గారికి.
    దాహం కథ చదివాను. చాలా బాగా చదివించింది. రాయలసీమ జీవితానికి దగ్గరగా ఉంది. బహుశా మీఊరు ఒకప్పుడు రాయలసీమలో భాగమేనేమో!. కరువు మహిళా జీవితాన్నెలా బలితీసుకుంటుందో వాస్తవికంగా చెప్పారు. ప్రతి మహిళా ఒక వంటలక్క అయినట్లే ప్రతి మహిళా ఒక నీళ్ళ బిందె మోసే మనిషే అవుతున్నవాస్తవాన్ని బాగా చెప్పారు. ఎన్ని మానవగంటలు నీళ్ళకోసం వృథా అవుతున్నాయో! మీ కథలో పైకి ఏ రాజకీయ స్పర్శ లేకుండా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దశాబ్దాల స్వాతంత్ర్యం మీద ఒక ప్రశ్నగా కథ అనిపిస్తుంది. జిడిపి లను గురించి బాజాలు వాయించేవారు ఏడు దశాబ్దాల స్వతంత్రం దాటినా అందరికీ మంచినీళ్ళు కల్పించలేని వైఫల్యానికి ఈ కథ అక్షరరూపం. కథలో కరుణ, విషాదం పాఠకుని కలవరపరుస్తాయి. నీళ్ళ కోసం ప్రాణాలు కోల్పోవలసివచ్చే అన్యాయం మీద పాఠకులకు ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి. అయితే విషాదాంతంగా కథను ముగించడం మనకు బాగా అలవాటైన పద్ధతి. అంతేనా మనం చేయవలసింది?సమస్యను ఆవిష్కరించి వదిలేసే పద్ధతి ఇంకా కొనసాగాల్నా? ఈ సమస్యలపట్ల గ్రామం ఏమనుకుంటుంది?ఏమి చేస్తుంది?ఏమిచేయాలి?అనే తీరులో కథను మలిస్తే బాగుంటుంది. మంచి కథ రాసినందుకు శుభాకాంక్షలు.
    రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.