జాలారి పూలు
“కాల్లు పొద్దుకూ నిగడసాపి ఒల్లుమింద సోరకం లేకుండా నిద్రపోతావు మేఎల్లమ్మా లెయ్! మావిటాల కొండమీద ఎంకటరమణ సామి తిర్నాలు. జాలారి పూలకు పోదాము. తిర్నాల్లో అమ్మితే రూకార్డుగా చెయి దొరుకుతుంది” అని నన్ను ఊపి ఊపి లేపతా ఉంది మా యమ్మ.
“ఆడది పొద్దు ఎక్కిందాక పనుకుంటే ఇంటికి అరిష్టం రేపు నిన్ను ఇచ్చిన తావున ఇట్ల పొనుకుంటే నిన్ను అనరు నన్ను అంటారు మీ అమ్మ ఏమి నేర్పించిందే అని”. మా అమ్మ నోటి మీద కాయ వాలకుండా అరస్తానే వుంది. “మోవ్! ఏంది నీ రోకట? నువ్వు దినాము మస్కిలితోనే లేస్తావే మనఇంటికి లచ్చిందేవి రాలేదే? మనూరు మునసామిరెడ్డి కూతురు దినాము అన్నం పొద్దుకు లేస్తుందంట. నిన్నవాల్లకు పెసల కాయి కోయను కూలికి పోయి మేమందరం పొలంలో పనిచేస్తా ఉంటే రెడ్డిసాని గెనాల మింద నిలబడి రెడ్డితో నీ కూతుర్ని నువు ముదుగారం చేసి అన్నం పొద్దుదంకా నిద్దర లెయకుంటా ఉంది అంటే నా బిడ్డ పనుకోనీలే నువ్వు లేపొద్దు అనే రెడ్డి. వాల్ల దగ్గర వుండే లచ్చిందేవి ఎల్లిపోలేదే? మనం దినామూ మబ్బుతో లేస్తాము, లచ్చిందేవి మన కాడికి రాలేదే?” అంటి.
“వాళ్లు పుట్టుకతో ఉన్నోల్లు. మనం ఎద్దును కుమ్మల్ల, ముద్ద తినల్ల. అయినా ఈ కాలం బిడ్డలు కడుపులోనే అన్ని నేర్సుకొని వస్తారు. ముసిలి మాటలు ఇడిసి లేసి పనిచూడు. జాలారి పూలు పొద్దెక్కితే ఎండకు కానరావు. సల్లని పొద్దులో పీకితే పూలు కళావశం బాగుంటాయి. కొనేవాల్లకు చూస్తానే కంటికి ఇంపు ఉండాలి. మీ నాయన కయ్య దున్నను పోయినాడు. సద్ది కడితే వస్తానే ఎలబారి పోవచ్చు” అనే.
నేను అన్ని పనులు చేసేసి అద్దం కాడ నిలబడి కళ్లు, మూతి, ముక్కు చూసుకొని మూతిలోనే మురిసిపోతాండా. “ఎంత పొద్దు ఉంటావు అద్దం కాన్నే?” అనే మా యమ్మ. అట్నే అంటాది గాని పాయానికి వచ్చిన ఆడపిల్లల్లో మంచి కండ, రంగు, జంపు జాగిలి అరువుగ ఉండేది తొలిత నేనైతే నా యనక మల్లి అనుకోని పొంగి పోతా ఉన్నట్లే మా నాయనొచ్చే. ఎద్దులు గాటికి కట్టేసి వాటికి కుడితి నీళ్లు పెట్టి ఉలవ పొట్టు దిగేసి వాటికేసె. అవి దున్ని ఆకలి మీద ఉన్నాయి. మేత యాస్తానే లడ్డు తిన్నట్టు తింటా ఉండాయి. మేమూ మా కడుపకంత బుక్కి గంపలు, పెద్ద దోటి ఎత్తుకొని జాలారి పూలకోసం వొడ్నికొండ దావకు ఎల బారితిమి.
ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ గేణమ్మ
ఈ వొడ్నికొండపైన వెంకటరమణ స్వామి పాదం ఒగటుంది. ఆ వొగ పాదం ఎట్లొచ్చిందంటే ఒగ కత చెబుతారు. దేవుడు ఆయన సత్యాన్ని చాటుకునే దాని కోసం బయలు దేరినాడంట. అప్పుడు వాల్లమ్మ నాలుగు దిక్కులు జూసి నువ్వు తూర్పుగుండా పో నీ సత్యం నలుదిశలా నిలుస్తుంది అని చెప్పిందంట. అప్పుడు ఆయన పెద్ద పెద్ద కొండల మీద ఒక్కో అడుగు పెట్టుకుంటా వస్తా ఉంటే ఆ కొండలన్నీ నీ ఖ్యాతిని మేము తాలలేము సామీ అని బోరున విలపించినాయంట. అప్పుడు మదనపల్లి బసినికొండమీద కుడిపాదం, ఈ వొడ్నికొండమీద ఎడమ పాదం పెట్టినాడంట. మల్ల ఏకంగా ఏడుకొండల మీద పెడితే అప్పుడు ఆ కొండలు నిల్వరించుకున్నాయంట. శనివారాల పండగలు ఉండేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి తాలాలు మేలాలతో ఈ కొండలు ఎక్కుతారు. వొడ్ని కొండ మీద కోనేరు కూడా ఉంది ఆ కోనేటి లోతు ఇంత వరకు కనిపెట్టినోల్లేరు అంటుంటారు
మా చుట్టు పక్కల ఇరవై ఊర్లకు గాను జాలరి మానులు ఉండేది వొడ్నికొండపేటు కిందనే. ఈ చెట్లు ఆడ తప్ప చుట్టుపక్కల యాడే గాని లేవు. అవి కొండ నడాన పన్నాయి. నూరేండ్ల కాన్నుండి వున్నాయంటారు. రెండు మూడు మైళ్లు అడవిగుండా పోవాల్సిందే మాకు పూల సంబరాన దూరంబారం తెలిసేది కాదు. దావ పొడాకూ పెద్ద పెద్ద గుండ్లు గుడ్లు మీరుకొని చూస్తా ఉంటాయి. పులింజి కాయలు,రేక్కాయలు, బొలుసు కాయలు దావ పొడగాకు మేత మాకు. జాలరి పూలు శివునికి ఇష్టమైన పూలంట. అందుకే ప్రతి సంవత్సరం శివరాత్రికి కాస్తాయి. ఒకప్పుడు ఈ చెట్లన్నీ చెరువులు నదుల ఒడ్డునే ఉండేవంట. వాలు కొమ్మలు అన్నినీటిలోకి ఒంగి ఉండడంతో శివుని భక్తుడు ఒకసారి జాలారి పూల కోసం పొయ్యి నీళ్ళల్లో పడి మునిగి పోతాడు. అబుడు ఆయన భార్య ఈ చెట్లు అన్నీ అడివిలో మొలసల్ల అని శివున్ని వేడుకుందంట. అప్పటినుండి అడవుల్లో కొండల్లో ఉన్నాయంట. అదీకాక ఈ చెట్లను ఎవరూ నరకరు. అట్లా నరికితే వాళ్లకు కళ్ళు చెవులు పోతాయని నమ్ముతారు
రెండు పర్లాంగుల దూరం ఉన్నట్లే మాకు ఆ పూల వాసన గుమ్ము మా ముక్కులు పసిగట్టే. జాలరిమాన్లు కాడికి పోతిమి. ఒక్కొక్క మానుని నిలబడి సూడల్ల పర్వతాలు ఉన్నట్లు ఉండాయి.ఆ జాలారి పూలవాసన చెప్పనలికాదు. పలవరిస్తుంది. మా అవ్వ “జరిగేటిగా ఉంటే జాలారి పూలతో చీర నేసి కట్టుకోవాల! వాటి ముందర నీ నగలు, నాణ్యాలు యాడ పోవాలా?” అనేది. మా అవ్వ జక్కికి ఏసేటప్పుడు జాలారి పూల పైన ఎన్నో పాటలు పాడేది. అందులో ఒక పాట:
పొద్దట్లగూకే మొబ్బట్ల రేగే ఈ పర్ణశాలిలో నేనొక్కదాన్నే
నెలబాలుడేలరాడమ్మా నానిజమాయేకొమ్మా నెలబాలుడేలరాడమ్మా !
అటు చూస్తే జాలారి ఇటు చూస్తే జాలారి
కొమ్మకొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మెక్కి చూస్తుంటే రాడేమి నా సామి
నెలబాలుడేల రాడమ్మా నా నిజమాయే కొమ్మా నెల బాలుడేల రాడమ్మా !
అటు జాము ఇటు జాము సరి జాము లాయ
ఏరిన పూలన్ని ఎక్కి రిస్తుంటే పిలిసినా రాడేమీ తలిసినా రాడేమీ నాసామి
నెలబాలుడేలరాడమ్మా నానిజమాయేకొమ్మా నెలబాలుడేలరాడమ్మా !
మా కంటే ముందే పిల్లలు, పెద్దలు జాలారి పూల మాండ్లకు ముసురుకున్నారు. వాళ్లందరూ వాలుకొమ్మల్లో ఉండే పూలన్నీ గంపలకు నింపుతున్నారు. మా అమ్మకి వాళ్ళ గంపల్లో పూలు చూసి కుళ్ళు అయిపోయింది. నన్ను మానాయన్ను తిడతా ఉంది. “అడక్కతిన్ను పోయినా ఆరుబాటం ఉండల్లంటారు. మన పయనం గొల్లబానకాడ తెల్లారింది. ఇప్పుడు వాలు కొమ్మల్లో పూలన్నీ పీకేసినారు. కొట్టకొన కొమ్మల్లో ఉండాయి పూలు!” అని మాయమ్మ నసకత ఉన్నట్లే మానాయన కొనకొమ్మన ఉండాడు. మానులు ఎక్కడంలో మా నాయిన్ని మించినోల్లు లేరు. ఎంత పెద్ద మానైయినా కోతి ఎక్కినట్లు ఎక్కేస్తాడు.అది కాక ఆ జాలారి మానులు బలే పెలుసు. కొంచెం యామారినా పలక్కమని ఇరిగి పోతాయి. అట్ల కొమ్మలు ఇరిగి ఎంతోమంది పానాలు పోగొట్టుకున్నారు. కాళ్లు చేతులు ఇంచుకున్నారు. పెద్దోల్లు అనే ఉండారు “మునగ మాను ఎక్కితే ముంచేస్తుంది. చింతమాను ఎక్కితే చింత లేదు” అని. ఎందుకంటే చింతకొమ్మ సన్న పుల్ల కూడా గెట్టిగా ఉంటుంది. అదే మునగ మాను తొడలావు కట్టి అయినా ఇరిగి పోతుంది. అట్లా మాండ్లల్లో గెట్టి రకాలు, పెలుసు రకాలు చాలానే ఉంటాయి. కానీ, మా నాయనకు ఏమాను ఎట్లాదో తెలుసు. అయినా మా భయం మాది. మేము కింద నుంచి బద్రం బద్రం అని చెప్తానే ఉన్నాము.
మానాయన దోటితో మానులోనే పూలన్నీ వొంచికి పెరుక్కొని దిగొచ్చే. అప్పుడు మా యమ్మకు తెంపొచ్చే. పూలన్నీ తెంపుకొని ముగ్గరం గంపలకు పోసుకొని ఇంటికొచ్చినాము. ఇరుగుపొరుగు వాల్లు పూల కోసం మా ఇంటి చుట్టు వుడ్డ చేరినారు. జాలారి పూలు అంటే అందరికీ ఇష్టమే సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. అవి తేవాలంటే కష్టపడాల. మా యమ్మ కుళ్ళుకుంటా తలా పిడికెడు పూలిచ్చి “రెండుమైల్లు పోయి తెచ్చింది మీ కోసమేనా? మేము అమ్ముకోవల్ల ఇంక పొండి!” అనె. పూలకి తడి గుడ్డ చుట్టి గంపల్లో బెట్టి మాయమ్మా నాయన ఆ గంపలు ఎత్తుకోని దేవరకొండకు తిర్నాలకు పాయిరి.
నాకు కూడా వాళ్ళతో పదాము అనుంది. కానీ మాయమ్మ నాయనా ఇంటికాడ పనులకు, ఇంటికి కావలి పెట్టినారు. దేవరకొండ తిరణాలంటే చిన్న పెద్దలకు బలే సంబరం. ఏరువాక పున్నానికి ఒక రెయ్యి ఒక పగలు ఈ తిరణాలు జరుగుతాయి. దేవరకొండ ఏడు ఎకరాల గుండు. కింద నుండి పై వరకూ ఒకటే బండ. ఒకప్పుడు సినిమా షూటింగులు కూడా జరిగినాయని పెద్దోల్లు అంటుంటారు. పైన ఎంకటరమణ సామి గుడి కూడా పెద్దది. ఏడు వాకిళ్లు ఉంటాయి.బండమీదనే కోనేరు కూడా పుట్టింది. ఆ కోనేట్లో ఎంత కరువు రానీ నీళ్ళుంటాయి. తిర్నాలపుడు దిక్కులేని అంగల్లు కొలువు తీరుతాయి. ఆటలు పాటలు భజనలు జక్కీకులు ఆ రెయ్యంతా జరుగుతాయి. ఇరవై ఊర్లకు సంబంచిదిన తిరణాలు అది. ఏడేడ జనం వస్తారు. అయిదు ఏళ్లకు ముందు ఒగ ఇబ్బంది జరిగింది. మేము చిన్నబిడ్డపుటి నుండి మా చుట్టుపక్కల పల్లెలన్నిటికీ అబ్బిఅనే ఒక తిక్కలోడు ఉండేవాడు. చామనచాయతో ఐదు అడుగుల మనిషి. బాగానే పుట్టుకున్నాడు. వానికి మాటలు వచ్చేవి కాదు. ఎవరు మాట్లాడినా నవ్వేవాడు యా యా అనేవాడు. ఎవరు పెట్టినా తినేసి పోతాడు. ఎవరిని ఏమీ అనేవాడు కాదు. చిన్నబిడ్డలు చెప్పిన మాట వినకుంటే నిన్ను అబ్బికి పట్టిస్తా అనే వాల్లు , ఈడు మీరిన ఆడబిడ్డలకు పెళ్లిల్లు కాకపోతే నిన్ను ఇంగ అబ్బిగాడే చేసుకునేది అని ఆటపట్టించేది. అట్లా అబ్బిగోడు వస్తా ఉండాడంటే పిల్లలకు పెద్దలకు బలే ఆనందం ఏసేది. అట్లాంటి వాడు ఒక రోజు కొండమీద తిరణాలకు పొయ్యి ఆడ పెట్టింది తిని గుళ్లో ఎవరి కంట పడకుండ ఒక మూలపోయి పనుకోని నిద్ర పోయినాడు. ఆరోజు సాయంత్రం పూజారి పూజ అయిపోనంక బీగాలు ఏసుకొని వచ్చేశాడు. మల్ల పూజారి పోయేది వచ్చేశనివారమే. వారం రోజులు అక్కడ ఎవరే గాని తిరిగి మళ్ళీ చూడరు. అబ్బికి అరవడానికి కూడా నోరు లేదు. గుళ్లో దేవునికి పెట్టిన ప్రసాదాలు కొబ్బరిచిప్పలు అన్ని పూజారి చెడిపోతాయి అని ఎత్తుకొచ్చేసినాడు. పూజారి మళ్ళీ వారానికి పూజకు పోతే గుడి చుట్టుపక్కల చెడువాసన వస్తా ఉంది. గుడి తలుపులు తీసి చూస్తే అబ్బి చచ్చిపోయిండాడు. ఆ సంగతి తెలిసిన ప్రతి ఒక్కరూ ఎంత బాధ పడ్డారో! పాపం అబ్బి తిక్కలోడు ఎంత ఏడ్చినాడో ఎంత అరిచినాడో ఆదేవుడన్నకాపాడకూడదా అని. ఇబుడు కూడా ఆ కొండకి పోతే మాకు అదే గుర్తుకొస్తుంది.
నేను రెండు దోసెల జాలారి పూలు నా జతగత్తె మల్లి కోసం అని ఎత్తి పెడితి. ఈ పూలు అంటే దానికి పానం నేను ఇంట్లో పని, ఆవుల పని చేసే సరికి మల్లి కూడా మాఇంటికి వచ్చె. మల్లికి నేను ఎత్తి పెట్టిన పూలు ఇస్తి. ఆ పూలు చూసి అది మురిసిపాయ. అది నేను కొంచెంచేడి పిచ్చాపాటి మాట్లాడు కుంటిమి. ఆయాలకు పొద్దు గూట్లో పడే. పూలు అమ్ముకొని అమ్మ నాయన నాకు మిఠాయి బొరుగులు తీసుకొని నగతా వచ్చిరి. “ఏమ్మా, అప్పుడే అన్ని పూలు అమ్మేసిరా?” అంటే, “అవును నాయనా! సంవత్సరానికి ఒకసారి కాసే పూలు ఇవి. మనట్ల వాళ్లు ధైర్యం చేసి పెరక్కొని పోతే పిరింగ ఎత్తుకుంటారు. ఇంగా నాలుగు తట్లు అయినా అమ్ముడుపోయేవి” అనే. అమ్మిన డబ్బులతో పండక్కి నా బిడ్డకి కొత్త గుడ్లు తీసివ్వల్ల అనే మాయమ్మ, వేరే తావ పండక్కు సరుకులకోసం చెయిబదులు తీసుకున్న వాల్లకు ఇవ్వాలనే మా నాయన. సరే అప్పు కడితే ఇంకోసారి మాట మిగులుతుంది అని ఇద్దరూ ఓ మాటకొచ్చిరి. ఆ పొద్దున్నే మళ్ళీ అన్ని పనులు చేసుకొని అమ్మ కూలికి, నాయన ఎద్దులు పట్టుకుని పాయ.
నేను ఇంటికాడ బిడువు ఎత్తుకొని బిడువు లేని పనులు చేస్తా ఉండి పోతి!
One Response to “జాలారి పూలు”
వినాయక చవితి వచ్చిందంటే జిల్లేడు పూలు,గరిక ,తీసుకొనివచ్చి అమ్మడం చాలావరకు చూస్తుంటాము.కొంతమందికే తెలిసిన జాలారి పూల పై కథను మాండలికంలో చక్కగా వ్రాసిన రచయితకు అభినందనలు