తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

గేణమ్మ

తెల్సా కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ
© Telugu Society of America

వెదజల్లిన పెద్దగుడి అమ్మోరి కుంకంలాగా నేలంతా పరచుకుని ఎర్రగా మెరస్తండాయి రాలిన తురాయి పూలు. ఆటి మద్దెలో చెట్టు మొదులుని ఆనుకుని, యెలిసిపోయిన పసుపురంగు నేతచీరలో, పండగలకీ పబ్బాలకీ కలిసెం ముందర తమలపాకు మీద పెట్టే పసుపుముద్ద వినాయకుడి మాదిరిగా గుట్టుగా గొంతు గూసోనుండాది గేణమ్మ.

ఆగిఆగి యీస్తాండే గాలికి రాలుతున్న ఒకట్రెండు తురాయి పూలు ఆమె మీద గూడా పడతాండాయి.

కండ్లుతెరవని బిడ్డ మాదిర్తో నిప్పుల చెండు నీట్లో ఉండంగానే, ఎప్పుటిలాగానే ఆరోజు గూడా నిద్దర్లేసింది గేణమ్మ. బోరు కాడికి బొయ్యి రెండు బిందెల నీళ్లు తెచ్చుకోని తొట్టిలో పోసుకునింది. పసుపుకొమ్ము సాదుకోని, మొహానికి చేతులకి కాళ్లకి పూసుకునింది. మెళ్లో పుస్తెలతాడు నల్లగా కమురుపట్టి, వంటిరంగులో కలిసిపోయిఉంది. దానికి దట్టించి మరీ పూసింది పసుపు. స్నానం ముగించి, నొష్టన పావలా కాసంత కుంకం బొట్టు పెట్టుకుంది. గూట్లో నాలుగు మట్టిగాజులుంటే తీసి చెరోచేతికి రెండేసి వేసుకుంది.

ఈలోగా, కడుపు చించుకున్న బిడ్డ కాళ్లమీద పడినట్టుగా, నీళ్లను చీల్చుకుంటూ నింగిమీద పడింది నిప్పుల చెండు. సట్టిలోని సద్దికూట్లో ఉప్పుగల్లూ, రొవ్వన్ని మజ్జిగనీళ్లు పోసి పిసికి వేలితో ఓ చుక్క నాలికమీద యేస్కోని ఉప్పు జూసుకునింది. అంతేతప్ప తినాలనిపించలా. ఎరగడ్డ తపక వొలిచి సట్టి మూకుడు మీద బెట్టింది. గడపలోనించి చూపు పారించి, యింటికి కొంచెం ఎడంగా సీమసింతగుబ్బల చెట్టుకింద నులకమంచానికేసి చూసింది. నాలుగు క్షణాలు చూపులట్టే నిలబడిపొయినాయి. చిన్న దిగశోసతో చూపు నేలమీదికి దించింది. మజ్జిగంటిన చేతిమీద చారెడు నీళ్లు పోసుకుని కడుక్కున్నట్టుగా యిదిలించి తడిచేతిని కొంగుకు తుడుచుకుంది.

తెల్లతోలు చెర్నాకోల పట్టుకుని ఒంటిచక్రం బండి మీద ఊరేగేటోడు రెండు జానలెత్తు ఎగబాకకముందే ఇంట్లోంచి ఎలబారింది. కుడిఎడంగా పదిమైళ్లుంటాది. తిమ్మసముద్రం నుంచి కాళాస్తికి. కొండలూ అడవులూ లెక్కా జమా లేకుండా తొక్కుకుంటూ తిరిగే పాదాలకి ఆ దూరం ఒక లెక్కలోంది కాదు. అందుకే నడుచుకుంటా కాళాస్తికి చేరుకుంది. తురాయిపూల చెట్టుకింద గేణమ్మ కొలువుతీరే పాటికి ఆడంతా కాళీగా ఉండాది. దూరంగా గోడకి చేరబడి తుప్పుపట్టిపోతున్న ఒక సైకిలు పడుండాది. ముందర చక్రాన్ని యెవురో యిప్పుకొని యెత్తుకెళ్లినట్టుండాది. ఒంటిచక్రంతో నడ్డిరిగినట్టుగా పడుండాది ఆ సైకిలు. దానిచుట్టూ కంపలు, తుప్పలు మొలిచి ఉన్నాయి. “యిది మతిలేని ముండ”- ఆ సైకిలును వుద్దేశించి మనసులోనే మెటికలు యిరుచుకునింది గేణమ్మ.

ఇది కూడా చదవండి తెల్సా కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ జాలారి పూలు

యెదురూగా జమీందార్ల కాలంనాటిది, సున్నంతో కట్టిన పాత లంకంత మేడ. మేడ వాకిలి వసారా చేరాలంటేనే పది మెట్లెక్కాల. బడి మాదిరిగా రొమ్మిరిసుకోని, గుడి మాదిరిగా గంబీరంతోని వుండాది. ఆ రోజుల్లో జమీందారు కాడికి తగాదాలు తెస్తే, మంచీ చెబ్బరా, నాయం అన్నేయం ఆయన జెప్పేవోడంట, వసారాలో పెద్ద సిమ్మాసనం లాంటి కుర్చీ యేసుకోని. ఇప్పుడు కుర్సీలు లోపలికి మార్నాయంతే, యింకేం మారలా అనుకుంది. “యీ మేడ సాచ్చిగా యెన్ని కొంపలు కూలినాయో, యెన్ని తాళ్లు తెగినాయో?” అక్కసుగా అనుకుంది.అంతలోనే తల విదిల్చి “అట్టాగే జరగాలని యేముండాదిలే? యెన్ని బతుకుల్ని నిలబెట్టిందో? యెన్ని కొంపల్లో దీపం యెలిగించిందో యీ మేడ” అనుకుని, తన మాటల్ని తానే తప్పుబట్టుకుంది. పొద్దింకా ముదరలా. ఒకటీ అరా మనుసులు ఆ మూలకీ యీ మూలకీ జేరుకుంటా వుండారు.

మేడమిందనే చూపుల్ని నిలబెట్టి, ఓసారి మెళ్లోని పుస్తెలతాడుని తడుముకుంది. చేతికందిన ఒక చిన్న గులకరాయితో పిచ్చి గీతలు గీస్తూ చూపు నేలకేసి తిప్పింది. మట్టిగొట్టుకు పోయిన పాదాలు అగుపించాయి. వేళ్లకున్న వెండిమెట్టెలు తెల్లగీతల్లాగా మెరస్తండాయి. కొండలూ తుప్పలూ తిరిగే మొండిపాదాలు అవి. వేళ్ల తొలిగెణుపులు కాయగట్టి లావుగా మారి ఉన్నాయి. మెట్టెలు బాగా అరిగి వదులై, గాజుల్లాగా కదలతండాయి. గెణుపులు అంత లావుగా లేకుంటే ఊడి జారిపోయేవే. పిచ్చిగీతలు మానేసి, చూపుడువేలితో ఆ మెట్టెల్ని కదిలిస్తూ చూపుల్ని అక్కడే పాతేసింది గేణమ్మ.

యింకోచేత్తో మెళ్లో పుస్తెలతాడును మళ్లీ తడుముకుంది. ఆడ గూసున్నాక, అది ఇరవయ్యారో సారి.పసుపు బాగా పులిమిందేమో, తాడు ఇంకా తడిగానే తగల్తాంది. అది కాస్తా అలా కిందికి, రైక కిందికి జారి పైగుండెల మధ్య ఇరుక్కోనుండాది. తాడులో తడి బరువుగా యింకుతున్నట్టుగా లోగుండెల్లో తడి ఏదేదో సడి చేస్తండాది.

“యీపొద్దు దాటినాక యీటిని ఉంచాల్నా తీసేయాల్నా” తడుముకున్న ప్రతిసారీ ఆ మాట, ఆ సడిలో రేగతాంది. “ఆడితో పాటే నా వొంటి మీదికి వొచ్చినాయి యివ్వి. ఆడితో పాటే వొగ్గేయాల గదా” అని అనుకుంది. “వోడిని వొగ్గినట్టే వొగ్గాల గావాల”- అంత సేపు ముంగిమాదిరిగా వుండిన మూతి, కొంచెం విచ్చుకుంది. వక్క సున్నం కలిపి నమిలిన ఆకు పూసిన ఎరుపు, రెండు పెదవుల మద్దెన ఎర్ర గీతలాగా మెరిసింది.

“గంట పదిగొట్టకముందే వొచ్చెయ్యాల కోర్టు కాడికి” అన్నాడు వకీలు, వారం దినాల కింద. ఆయనిల్లు యీడకి అమ్మిడే ఉంటాది, నడుసుకుంటానే వొస్తాడు, యింకో గడియకో రెండుగడియలకో వొచ్చేస్తాడు అనుకునింది గేణమ్మ.కళ్లలోకి ఎండ పడకుండా చేతిని అడ్డు పెట్టుకుని, కోర్టులోకి వకీలు వొచ్చే దారికేసి పారించి చూసింది.


అయి శివరాత్రి దినాలు. అప్పుటికి నిండా పదైదేళ్లు ఉంటాయేమో గేణమ్మకి. ఇంకా గొడ్లని మేతకోసం అడవుల్లోకి తోలుకెళ్లేంత వయసు రాలేదు. రెడ్డేరి కొట్టాంలో పేడాచెత్తా ఎత్తడమూ, సుబ్బరంగా చిమ్మి పెట్టడం వరకే ఆ పిల్ల పని. నిజానికి పేడలో కసువూ కాసిని బొగ్గు ముక్కలూ యేసి గోడకి పిడకలు కొట్టడం అంటే ఆ పిల్లకు చానా కుశాల. కానీ రెడ్డేరమ్మ ఆ పని చేయనిచ్చేది గాదు. అసలే ఆ పిల్ల చిన్నది. చిట్టెడంత చేయి. ఆ చేత్తో కొడితే, పిడకలు మసాలా వడల మందాన వస్తాయే తప్ప, పొయ్యిలోకి పనికి రావని రెడ్డేరమ్మ నమ్మకం. ఇలా కుశా ల తీరకుండానే గొడ్ల పనితో యెళ్ల దీస్తున్న గేణమ్మతో ఒక సాయంత్రం రెడ్డేరమ్మ ఇలా చెప్పింది.

“మేయ్! రేపుట్నుంచి నువు పన్లోకి రాబళ్లే. పెళ్లంట గదా! యిదిగో! ఈ రెండ్రూపాయిలూ తీస్కోనిబొయ్యి గాజులు, బొట్టూ, కాటుకా కొనుక్కో” అంటూ చేతిలో డబ్బులు పెట్టింది.

పెళ్లి యెవురికో, గాజులు తానెందుకు పెట్టించుకోవాలో ఆ పిల్లకు గెమనానికి రాలా. కానీ ఆ మరురోజు శివుడి తిరనాళ్లలో దేవుడి పెళ్లి నాడు నాయినా అమ్మలతో కాళాస్తికి పొయినాక, సందేళ యేట్లో ముంచి, తనకు పసుపు చీర కట్టిన తర్వాత గానీ ఆ పసిపిల్లకి పెళ్లి యెవురిదో అర్థం కాలా! అట్టా గేణమ్మకు పెళ్లయింది.

మొగుడికి అప్పుటికి ముప్పయ్యేళ్లు వుంటాయేమో. పోట్ల గిత్తలాగుండేవోడు. గిత్తంటే మామూలు గిత్త గాదు. కపిలబాన తోలినాడంటే మద్దెలో ఎద్దుల జత మార్చాల. యేతమేసి తోడినాడంటే సందేళకల్లా ఎకరాలు తడిసిపోవాల. పిడికిట్లోకి కట్ట జవురుకోని నూర్పిళ్లకి దిగినాడంటే మూటలు నింపుకోని బండ్లకు బండ్లు పోతుండాల్సిందే. అంతటి పనోడు!

అట్టాంటి మొగుడికి పెళ్లాంగా కాపురానికి తిమ్మసముద్రం వొచ్చినాక గేణమ్మ “యింకా చిట్టెడు చేతుల పసిపిల్లే” అనే సంగతి ఆ ఊరు గుర్తించలేదు. ఆ పిల్లా మర్చిపోయింది.పొద్దు పొడవక ముందే నిద్దర్లేవడం, సద్ది తాగి పొలం పన్లకు పోవడం, కాళీ ఉండే రోజుల్లో అడవికి పొయి, కట్టెలు కొట్టుకొని మోపు కట్టుకుని రావడం, పక్కన పక్కన పల్లెల్లో తిరిగి ఆ మోపుల్ని పావలాకో అర్ధకో అమ్మడం. ఇదే ఆమె బతుకయిపోయింది. మొగుడేమీ ఒళ్లు దాచుకునే రకం కాదు. ఇంటా బయటా వాడి వంతు కష్టం వాడు చేస్తూనే వుండేవాడు. రెండేళ్లు గడిచేపాటికి గేణమ్మ కడుపున కాయ కాసింది. మగ బిడ్డ. ఆడి కోసం రొమ్ములెండిపోయేలోగా ఒక బర్రిగొడ్డును పట్టాలనుకున్న గేణమ్మ కోరిక తీరనేలేదు. అయినా గేణమ్మ మొండిది. పాడి గొడ్డు వుండే ప్రతి యింటికీ వెళ్లి గొడ్డు చాకిరీ చేసేది. దినామూ ఏదో వొక ఇంటినుంచి లోటాడు పాలు పుట్టించేది. వాటిని ఆ బిడ్డకు తాపించేది. ఇట్టా ముదిగారంగా సాకిన కొడుకు యెడవయసుకు వొచ్చేసాడు. శివరాత్రి తిరణాలలోనే దేవుడి పెళ్లితో పాటే వాణ్నీ ఒకింటివాణ్ని చేసింది. బండెడు కష్టానికి మూకుడు గింజలు కూడా పుట్టని పల్లెబతుకు వాడికి కష్టం అనిపించింది. కట్టుకున్న దాన్ని తొడుకోని, వొంటికి సుఖమైన పనులెతుక్కుంటా వోడు వలసబొయినాడు. “రెక్కలొచ్చిన బిడ్డలు గూడా గూడు వదలకుండా కూసోని, అయ్యా అమ్మల నోట్లోకూడూ జవురుకుని బొక్కే రోజులియ్యి. నా బిడ్డ బంగారం. వాడి బతుక్కి వోడే ఒక తోవ జూస్కున్నాడు” అని సరుదుకుని ఏడుపుని మింగింది గేణమ్మ.

గూట్లో జోడు పిట్టలే మిగిల్నాయి. బతుకు ఎగుడుదిగుడులుగా దొర్లిపోతానే వుంది. సొంతానికంటూ బూమి ఏర్పడలేదు. చెమట చిందకుండా చిల్లిగవ్వ రాకడ లేదు. రెక్కలొక్కటే దిక్కు. కడుపు నిండాలంటే ముక్కలు జేస్కోవడమే తెరువు.

తొలినాటినుంచీ వోళ్ల సంసారం బండి లాంటిది గాదు, మడక లాంటిది.జోడెడ్లు లేకపొయినా ఒంటెద్దుతో గూడా బండి వుంటాది. ఎద్దుల అవసరమే పడకుండా ఒంటి చక్రంతో గూడా తోపుడు బండి ఉంటాది. కానీ ఒంటెద్దుతో మడక యేడైనా వుంటాదా? వొల్లదు గదా! ఆళ్ల బతుకలాంటిది. గేణమ్మా దాని మొగుడే ఆ జోడెద్దులు. ఏ ఎద్దు బద్దకించినా మడక నడవదు.ఏ ఒక్కరు బిక్కరించినా కడుపు నిండదు.

ఇట్టాంటి కనాగష్టపు బతుకులోనూ గేణమ్మంటే పేణం దాని మొగుడికి. పెళ్లయిన కాణ్నించీ వోడికి ఆ పిల్లంటే వల్లమాలిన ఇష్టం. పువ్వుల్లో బెట్టి జూస్కునేటంత ముల్లె వాడి దగ్గర లేదుగానీ, పిల్లని మాత్రం పువ్వులాగానే జూసుకునే వోడు. బతకడానికి దుడ్లు గావాలి గనక యిద్దురూ పన్లోకి బోవాల్సిందే తప్ప. యింటిపనుల మాటకొస్తే, తనకు చేతనైనదంతా చేస్తూనే వుండేటోడు. పల్లెత్తు మాట అనడు. కసురుకోడు, యిసుక్కోడు. బయటున్నంత సేపూ వాడు పులిలాగా ఊరేగుతాడో, పనిమంతుడిలాగా బిగుమానం పోతాడో వాడిష్టం. కానీ, చూరుదాటి కొంపలో అడుగుపెట్టినాడంటే పంటి కిందకైనా వంటికిందకైనా, గేణమ్మ ఏం జేస్తే అది. గేణమ్మ ఏం జెప్తే అది, అంతే! అంత యిష్టంగా, పేణంగా జూసుకునే వోడు.

పెపంచికంలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తావుంటే యెవురి బతుకులు మాత్తరం ఒకే తీరుగా ఎందుకు సాగతాయి? మొగుడూ పెళ్లాలకి వయసు మీదికొస్తండాది. గేణమ్మ మొగుడి పనితనంతో, అనుబవంతో పనిలేని మోటార్లొచ్చినాయి. మరమిషన్లొచ్చినాయి. సేద్దెం అనేటిదే మట్టిపిసికేవోడి బండ చేతుల్లోంచి నిదానంగా జారుకోని, నట్టింటి నిండా ముల్లె ఉండేటోడికి మటుకే కుదిరే యవ్వారంగా మారిపోయింది. “చేతనైంది మటుకే చేయాలనుకుంటే ఎట్ట? చేస్తావుంటే చేతకాకుండా బొయ్యేది యేటుంటాది? కస్టాన్ని నమ్ముకున్నోడికి లొంగని విద్దె వుంటాదా?” అనుకుంటా దాని మొగుడు ఏ పని దొరికితే ఆ పనికి బొయ్యేటోడు.

ఎన్ని విద్దెలు నేర్చినా, ఎన్ని చిన్నెలు పోయినా మడిసనే వోడు ఎప్పుటికైనా అల్పుడే అని గేపకం చేసేదానికి కాలం అనే మాయొకటుంటాది. కష్టానికి గూడా కొరగాకుండా కొంచిం కొంచింగా అది కబళించేస్తా వొస్తాది. గేణమ్మ మొగుడికి వయసు మీద పడతా వుంది. కండల్లో సత్తువే దిగిపొయినాక సత్తుపైసా పాటి జెయ్యకుండా పొయినాడు పాపం.పన్లకి పిలిసేటోళ్లు లేరు. మడిసి ఖాళీ అయిపొయినాడు- బయటా, లోపలా కూడా!

తిరగ మరిగిన కాలూ, తిన మరిగిన నోరూ ఊరుకోవని పెద్దోళ్లంటారు. కానీ, పని మరిగిన మడిసిని ఊరికే కూసోబెట్టడమంత దరిద్రం యింకోటి లేదు. వోడికి ఏదో ఒకటి వ్యాపకం ఉండే తీరాల! అదికాస్తా సావాసాల్లోకి మారింది. ఖాళీ వున్నప్పుడెల్లా తాగుడు మొదులైంది. అదివరకు తాగడమే ఎరగనోడు అని కాదు గానీ, ఊపిరాడనియ్యని పనుల మద్దెలో ఎప్పుడో ఒకప్పుడు అదొక ముచ్చటగా ఉండేది. ఇప్పుడు అదే పనిగా అయిపోయింది.

ఒకటా రెండా గేణమ్మకీ వోడికీ పదైదేళ్ల వారా. వోడు ముందే ముసిలోడైపొయినాడని పొద్దు పొడవడం మానేస్తాదా? కడుపు అరవడం ఆపేస్తాదా? ఒంటికష్టం మీదనే యింటిని నెట్టుకురావాల. రెండో యెద్దు చూపుకి వుంటే సాలు, కాడిని బుజాన యేస్కుంటే సాలు. గేణమ్మ బతుకు మడకని లాగకుండా బోతాదా? యిట్టాంటి రోజొకటి రాకుండా వుంటాదని గేణమ్మ కలగనిందేమీ లేదు గదా! “వోడట్టా గుళ్లో లింగంలాగా, నొస్టన కుంకం లాగా యింటికాడ మెదలకుండా గూసోనుంటే సాల్లే” అనుకునింది.

యిప్పుడు సేద్దెంలో మడుసుల అవసరమే తగ్గిపోయింది. నాట్లు లాంటి పన్లకి తప్ప పిలవడమే లేదు. అయితే లోకం గొడ్డుబోలేదు. కూలిపన్లు తప్ప దిక్కే లేనోళ్లకి ఉపాది పన్లొచ్చినాయి. గేణమ్మ గూడా ఆ పనుల్లో జేరింది. కూటికీ గంజికీ యెతుక్కోకుండా ఇల్లు గడస్తాంది.

చానా చానా కొంపలకీ గేణమ్మ యింటికీ ఒక వారా వుండాది. దాని మొగుడు పనులుజేసే వొయసు దాటిపొయ్యుండొచ్చు గాక. కానీ, “ఒసేయ్ తాగడానికి డబ్బుంటే ఇయ్యి” అని ఏరోజూ దాన్ని దేబిరించిందిలే, బెదిరించిందీ లే! అందుకు ఓ కారణముండాది. వోడికి సర్కారోళ్ల పించనొస్తాది. రెండొందలో అయిదొందలో- ఆరోజుల్నించీ పుచ్చుకుంటానే వుండాడు. అది రొవంత రొవంతగా పెరిగి వెయ్యయి, రెండు వేలయి, రెండున్నరయ్యి వోడికి సుకంగా జరిగిపోతండాది. ఆ దుడ్లని నమ్ముకోని సారా కొట్లో ఖాతా పెట్టుకోని నెలపొడుక్కీ తాగతా వుంటాడు. పించను చేతిలో పడగానే ముందర ఆడ లెక్క కట్టేస్తాడు. రోగమూ రొష్టూ లేపోతే రెండు ముసిలిపేణాల జరుగుబాటుకు సరిపడా దుడ్లు ఉపాది పనుల్లో యెటూ గేణమ్మ తెస్తానే ఉండాది!

“వోడు ఆ మిగులూ తగులూ నా చేతిలో పెట్టకపోయినా పర్లే” దనుకునేది గేణమ్మ. “ఎంతమంది నా బట్టలు పెళ్లాల్ని జుట్టుబట్టి వంగదీసి దబీ దబీ మని యీపు మీద గుద్ది దాని కూలిడబ్బులూ లాక్కపొయి తాగడం లేదు. యీడు అట్టాంటోడు గాదు” అని తన మొగుడి గురించి మురిసిపోయేది!

నిరుడు, ఆ రోజున అట్టా జరగకపొయ్యుంటే. గేణమ్మ మురిసిపాటు మిడిసిపాటుగా మారేదే!


చెరువులో పూడిక పని. ఆని నెల. కాలం దాటిపొయ్యిందన్న మాటే గానీ. ఎండలు మిడిమేళంగా కాస్తండాయి. చెరువులో పనికొచ్చేవోళ్లు యిళ్లలోంచి కుండల్తో నీళ్లు తెచ్చుకుంటాండారు. ఆ పన్లకి పోయింది గేణమ్మ. పూడిక మట్టిని పారల్తో తవ్వి తట్టలకెత్తతా, తట్టల్ని నెత్తికెత్తుకోని ట్రాక్టర్లలో పోస్తా. అన్ని పనుల్నీ మార్చిమార్చి చేస్తానే వుండాది. రోజూ చేసే పనే గానీ, ఆరోజు ఎండకి శోషొచ్చి పడిపోయింది. నానా గోలా అయిపోయింది. ఎవురో కుండలో నీళ్లు తెచ్చి మొహాన జల్లి లేపినారు. చెరువు మద్దెలో చెట్టునీడ మటుకు ఏడుండబోతాది? గేణమ్మ చేతిని బుజాన యేస్కోని యింకో పిల్ల నెమ్మదిగా నడిపించుకుంటా కట్టమీదకు తీస్కబొయ్యి, యేపచెట్టు నీడలో పడుకోబెట్టింది. ఆమె మట్టితట్టలు మోసేప్పుడు తలకుదురు కోసం తెచ్చుకున్న తుండుగుడ్డను తలకింద దిండులాగ పెట్టింది. ఆడదాకా ఎట్టా నడిసొచ్చిందో గానీ. మడిసి సోదీనంలో లేదు. సల్లంగ యేపచెట్టు గాలి తోల్తాంటే. గుర్రుమని బుసకొడుతా నిద్దట్లోకి జారుకునింది.

గంట దాటుంటాదేమో. గేణమ్మ కొంచిం సోయిలోకొచ్చి చూసేయేళకి. అందురూ పన్లు దిగేసి మొరవ కాడున్న నీళ్లగుంటలో కాళ్లూ చేతులూ కడుక్కుంటాండారు. మేస్త్రీ గేణమ్మకాడికి వొచ్చాడు.

“యేందవ్వా! యీ వొయసులో నీకింకా పన్లు గావాల్నా?” అన్నాడు ఊరడింపుగా నవ్వతా.

“బువ్వ గావాల్సినంత కాలమూ తొవ్వ గావాల్సిందే గదా?” అంది గేణమ్మ.

“నీ తొవ్వని దొంగలెత్తుకెళ్లా. లేసి కూసున్నావు గాబట్టి యేదాంతం జెప్తండావు. ఆణ్నే గుటుక్కుమని వుంటే ఈ పాటికి అందురూగల్సి నా తాడు తెంచతా వుండేవోళ్లు. ముసిల్దాన్ని మింగేసినానని. సాల్సాల్లేగానీ రేపుట్నించి రాబాక. యింకేదైనా నీడపట్టున వుండే పన్లు జూసుకో” బండ యేసేసినాడు మేస్త్రి!

యేదో ఒక నాటికి యీ మాట రానే వొస్తాదని తెలుసు గేణమ్మకి. పనిలో దిగిందంటే, పడుచు పిలకాయిల మాదిరిగా వొళ్లు దాచుకునేది తెలవనే తెలవదు. అంతమాత్తరాన. సర్కారోళ్ల కాయితాల్లోకి యెక్కిన వొయసు దాచుకోవాలనుకుంటే, యెట్టా కుదర్తాది?

“అరవయి అయిదేళ్ల ముసిల్దాన్తో పన్జేయిస్తండానని తెలిస్తే. యెవురైనా నా మొహానే వూస్తారు.” మేస్త్రీ కాయితాల్లో జూస్కుంటా. గొనుక్కుంటా బోతండాడు.

గేణమ్మ కట్రాట అయిపోలేదు. కన్నీళ్లు పెట్టుకోలేదు.”అయ్యా దయపెట్టు” అని దేబిరించలేదు. “నా యిల్లు గడిసేదెట్ట నాయినా?” అని విలాపించలేదు. “నన్ను పన్లోంచి తీసేస్తావా. నీ సంగతి జూస్తా” అని ప్రలాపించలేదు. మౌనంగా లేచి, మడిచి తలకింద పెట్టిన తుండుగుడ్డ యిదిలించి, వొంటికీ చీరకీ అంటిన మట్టినీ చెత్తనీ దులుపుకుంది. కట్టదిగి యింటిదారి పట్టింది.

“యీ చెరువు పన్లు కూడుబెట్టబోతాయని నేను పుట్టింది లే! యివి లేకుండా బొయ్యినంత మాత్తరాన సావ బొయ్యేదీ లే! దేవుడిచ్చిన కాళ్లూ చేతులూ సక్కంగుండాయి. గుండెల్లో దైర్నం నిక్కంగుండాది. ఏ పని చెయ్యడానికైనా సిగ్గు పడబొయ్యేది లే. అట్టాగని దొంగపనీ, తోడుబోతు పనీ చెయ్యబొయ్యేదీ లే. కడుపుకట్టుకోడానికి కొంగు పరవబొయ్యేది లే. యింగ నాకేటికి బయ్యం.” అనుకుంటా యిల్లు జేరుకునింది గేణమ్మ. అప్పుటికే తాగేసొచ్చి వాకిట్లో యెడంగా ఉన్న సీమసింతగుబ్బల చెట్టుకింద, నులకమంచం మీద బడి నిద్రబోతండాడు మొగుడు. “వూరు మెరవణి ముగిసిందంటే సిమ్మాసనం దిగడు మడిసి.” చిరాగ్గా అనుకుంటూ యింట్లోకెళ్లింది.

ఆ పొద్దు కాణ్నించి గేణమ్మ పనుల వరసే మారిపోయింది. నిజానికి తొలినుంచి ఆమెది ఆ దారే. ఏ పొద్దున ఏ పని దొరికితే అది చేసుకుంటా బోవడం. ఏదొస్తే అదే పలితమనుకోని యెసుట్లో యేసుకోవడం. కానీ యిప్పుడు ఏ పని బడితే ఆ పని జేసే వొయసు కాదు. పనులకు పిల్చేటోళ్లే లేరు. “వూరు గొడ్డుబోయిందేమో గానీ, కొండా కోనా గొడ్డుపోలేదు గదా” అనుకుంది. చీకట్తోనే లేస్తాది. కొండలమీదికి, అడివిమీదికి బోతాది. కాపురానికొచ్చిన కొత్తల్లో మాదిరిగా పుల్లలు ఏరుకోని కట్టెలమోపుగట్టి అమ్మేంత లేదిప్పుడు. కొనేటోళ్లూ లేరు. పొదల్లో పొరకపుల్లలు యించి తీసుకొస్తాది. ఆటిని కట్టలు కట్టి కాళాస్తిదాకా బొయ్యి యింటింటికీ తిరిగి అమ్మతాది. కట్టకు అయిదో పదో వస్తాది. వొచ్చిందేదో యెసుట్లోకి. వుడికిందేదో కడుపులోకి. యిట్టా సాగతావుంది బతుకు.

కొండల్లో పొరకపుల్లలు యేరుకొచ్చి పొరక్కట్టలు అమ్ముకోడం అంటే యినడానికి శానా తేలిగ్గానే కనిపిస్తాది గానీ, దాని కష్టం దానికుండాది. తిరిగినచోట తిరక్కుండా కొండలన్నీ గాలించాల. ఆటిని మోపుగట్టుకుని రావాల. వాకిట్లో వారం దినాలైనా ఎండలో ఆరెయ్యాల. ఒళ్లంతా నూగుముళ్లే పొరకపుల్లకి! తాకగానే రాలిపోయే నూగుమొత్తం రాలగొట్టాల. పిడికిటికి నిండుగా కుదిమట్టంగా ఉండే కట్టలు గట్టాల. ఆనక అమ్మాల. ఈ పనుల్తో గేణమ్మ ఒళ్లంతా ఆ నూగుముళ్లే అంటుకునుండేటివి. పగులంతా యెండల్లో కొండల్లో తిరిగేసి సందేళకి వచ్చి అంత తిని నడుం వాలిస్తే. చీరకి అంటుకున్న నూగుముళ్లు సికాకు పెడతాంటాయి. యింతా పడినా గూడా వొచ్చే దుడ్లు సాలీసాలకుండా అవతండాయి ఒక్కోపాలి. కొండలన్నీ ఎగుడుదిగుడుగా తిరిగి దొరికినన్ని పుల్లల్తో యింటికొచ్చినాక. గడపమీద తలఆన్చి పడుకుంటే ఒంట్లో కండలూ నరాలూ జివ్వుజివ్వు మని లాగేస్తాంటాయి. పేణం ఉసూరుమంటాది. “థూ బతుకు! యీ కట్టె యిప్పటికిప్పుడు కాటికెళ్లిపోవాల” అనిపిస్తాది. “యీ ముసిలోడికి గంజికాసి పోసేదెవురు” అని యెంటనే యింకో రంధి కమ్మేసుకుంటాది.

అయినా దాని మొగుడికేం. మారాజు బతుకు. నెలబెట్టంగానే లెక్కగా యింటికొచ్చి పించను దుడ్లిచ్చేసి పోతారు. తాగినకాడికి తాగి కొంపకొస్తే వార్చిందేదో ఆర్చి కంచంలో యేస్తాది. “యేమిరా యీ నా ముసిల్ది కొంపనెట్టా నెడతాండాది” అని యోచించిన పాపాన పోడు. వొచ్చిందంతా వాడి ముడ్డిలోనే పెట్టుకోనుంటాడు. వోడి బుడ్డీలకే తగలబెడతా వుంటాడు. యేస్తే తింటాడు. యెయ్యకపోతే అడగడు. యెప్పుడేనా కడుపుమండి కేకలేస్తే “నువు నా పేణమే. యెన్నయినా అను” అంటాడు. “నంగి నా బట్ట. యీడి పేణాన్నీ పేమనీ తగలెట్టా” అనుకునేది గేణమ్మ తీరిక దొరికినప్పుడు.

గేణమ్మ బేజారెత్తి పోయింది. “కొండలూ కోనలూ తిరుక్కుంటూ యెన్నాళ్లని పాకులాడేది. యీ ముసిలోడికిచ్చినట్టే సర్కారోళ్లు నా మొహాన గూడా పించను దుడ్లు కొట్టొచ్చు గదా” అనిపించింది గేణమ్మకి ఓ సందేళ పూట. ఏ మూర్తాన అనిపించిందో గానీ ఆ మాట పురుగులాగా బుర్రలోకి దూరి తొలచడం మొదలెట్టింది. నిద్దర్రాలా. “అవును గదా! కష్టం జేసుకోలేరనే గదా ముసిలోళ్లకి పించనిస్తండారు. వోడికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యరు” అనుకుంది. మేస్త్రీ గొణుగుడులో తెలిసిన వొయసు గెమనానికొచ్చింది. “నేనంటే మొండిముండని గానీ. ఈ పాటి ముసిలోళ్లు చేతికర్రతో తిరగతాండారు. వోళ్లకంతా వొచ్చేది నాకెందుకు రాదు” అనుకుంది. రాతిరంతా అదే సుళ్లు బుర్రలో.

తెల్లారగానే సర్పంచి కాడికి బొయ్యింది గేణమ్మ. “అన్నా జరుగుబాటు సాగడం లే. నాగ్గూడా పించనిప్పించాల” అంది.

యేప్పుల్లతో పళ్లు తోముతున్న వాడెల్లా, ఓపాలి ఉమ్మి, మొహమంతా చేదుగా బెట్టుకోని “యింటికొక్కరికే గదా గేణక్కా. నీ మొగుడికి వస్తాండాది గదా అంతే” అన్నాడు.

“ఆయన సంగతి నీకు తెలుసుగదా” అంటే, “దానికి నన్నేం జెయ్యమంటా” వన్నాడు. “నువ్వు తలిస్తే అవతాది సామీ” అంటే, “మా జేజినాయిన తల్సుకున్నా కాదు. గావాల్నంటే ఎమ్మెల్యే కాడికి పో” అంటూ తోవ జూపించినాడు.

ఎమ్మెల్యే కాడికి పొయ్యింది గేణమ్మ-

“నీకు పున్నెముంటాది బిడ్డా. రెక్కాడినంత కాలమూ, పలానాది కావాలని యెవుర్నీ యాచించలా. యియ్యాల నీ వాకిటకొచ్చినా. ముసిలిముండని. నువ్వు దయపెడితే నాకు రెండు దుడ్లొస్తాయి” అడిగింది.

“పెద్దమ్మా! మేమొచ్చినాక రెండు గాదు, రెండున్నర! రోగాలూ రొష్టులూ వొస్తే బయపడబళ్లే. మందులకీ మాకులకీ యెతుక్కోబళ్లే. చిన్నా సన్నా అవసరాలుంటే పైసలకి తడుముకోబళ్లే. అవ్వలూ తాతలూ అందురూ పండగ జేస్కోవచ్చు” తియ్యగా జెప్పినాడు.

“మీరు పంపించిన లచ్చిందేవి మా యింటాయన దాకా వొస్తాది గానీ. యింటిదాకా రాదు నాయినా. నువ్వు కనికరించినావంటే.” అక్కడికే గేణమ్మకి మానం చచ్చిపోతావుంది.

వోడేమీ ఉన్నపళంగా తిరగ్గొట్టాలా. కుర్చీ మింద కూచోబెట్టినాడు. తాగమని సల్ల యిచ్చినాడు. వంద ఆరాలు తీసినాడు. మంచీ చెబ్బరా అడిగినాడు. యేందేందో యిచారించినాడు.

“ఒక రేషను కార్డు మీద రెండు పింఛన్లియ్యరు గదా పెద్దమ్మా” అన్నాడు కడాకి.

“నాయినా రోగాలు రొస్టులూ అంటివి. మందులూ మాకులూ అంటివి. రేపో మాపో రాలిపోయేటివి. కొంపలో రెండు ముసలి పేణాలుంటే అక్కర ఒక్కరికే రాబోతాదా? రెండో వాళ్లెట్ట సావాల?” కడుపులోంచి మంట రొవంత యిసురుగానే వొచ్చింది.

“సావనియ్యం” నవ్వినాడు ఎమ్మెల్యే. “సావనియ్యకుండా ఆరోగ్యశ్రీ గావాల్నంటే యిద్దరికీ యిస్తాం” నవ్వతానే అన్నాడు.

“సావు తరవాతికొస్తే యిద్దురుగా కనిపిస్తామా? బతుకు బరువైంది సామీ అంటే వొకరుగానే కనిపిస్తామా?” తగువాడినా పలం లేదని తేలిపోయింది. గొణుక్కుంటా లేచి నిలబడింది.

“రేయ్! యీ పెద్దమ్మ తిమ్మసముద్రం నించి వొచ్చుండాది రా, మంచి బిర్యానీ పెట్టించి పంపండి!” కేకేసినాడు. “చాల్లే, నడువు బయటకి” అన్నట్టుగా వినిపించింది గేణమ్మకి.

“యిదిగో, యీ పక్కన పెడతన్నారమ్మా బిర్యానీ. తినేసి పో! రొవంత దాహమైనా తాగేసి పో!” వసారాలో పనోడిమాటలు గేణమ్మ చెవుల్లో పడనేలేదు. “పెద్దమ్మా” అన్న పిలుపుకే ఆమె కడుపు నిండిపోయింది. ఆడి నవ్వులకి ఆమె దాహమూ ఎండిపోయింది. “ఎమ్మెల్యే అంటే శానా పెద్దోడు గదా, కనికరించకపోతాడా” అనుకున్న ఆశ అడుగంటిపోయింది.


గేణమ్మ యింటికెళ్లిందే గానీ, యెనక్కి మళ్లలేదు. ఇల్లెట్టా గడవాల? కడుపులెట్టా నిండాల? కాయకష్టం తెలిసిన బతుకు ముష్టెత్తనని అంటోంది, వొళ్లు, పనికి వల్ల కాదంటోంది. కడగండ్లు దాటుకుంటూ నిలిచిన బతుకు, బలవంతంగా కడతేరనని యెదురు తిరుగుతోంది, మరైతే తెరువేదని మనసు యెదురడుగుతోంది.

“పించను” గేణమ్మకి పెద్ద యాతనగా మారిపోయింది. “యిస్తే బాగుండును” అని తొలుత అనుకుంది. “నాకెందుకు యియ్యరు” అని మలిడతలో మధనపడిపోయింది. “యెట్టా యియ్యరో జూస్తా, తేలస్తా” అని కడాపటికి సవాలుగా తీసుకుంది. అలా అనుకుని బరిలోకి దిగబోయే ముందు కోడి జూలు రిక్కించినట్టుగా, లేచి, సిగను ముడేసి, కొంగు బొడ్లో దోపి “యెట్టా యియ్యరో జూస్తా, తేలస్తా” అని అనుకోడానికి గేణమ్మకి వారం దినాలు పట్టింది.

“అంత సులువు గాదమ్మా” అన్నాడు వకీలు, గేణమ్మ కతనీ, వెతనీ, ఆమె ఆలోచననీ, అందులోని లోతునీ విని.

“సులువని నేనంటినా నాయినా. నా పాట్లు కంటివే, నా ఏడుపు యింటివే. కష్టమైనా నువ్వు కనికరించాల, తెగించే వొచ్చినా, తెరువు చూపించాల.”

“రూలట్టా ఉండాది గదా”

“రూలు దీసి రోట్లోనో గూట్లోనో పెట్టుకోమను. మొగుడూ పెళ్లాల్లో ఒక్కరికి మటుకే అంటారా. రెండోవాళ్లు సావాలనుకుంటారా యెట్టా? ఓ పక్కన కోటీస్పరులు గూడా యీ పించను తీస్కంటానే వుంటారు. యియ్యాలో రేపో కాటికి బొయ్యే పేణాలకి “యింటికొక్కరికే” అనే మెలిక నాయమెట్టా అవతాది? బతుకు గోరేదా? సావు గోరేదా?”

“చూడ్డానికి చిన్న దావానే. గవుర్మెంటోళ్ల కూసాలు కదల్తాయి”

“కదలనీ. నాకింకో యిదాయకం కనబళ్లా. యీ దావా యేస్తే ఆళ్ల మానం బజార్లోకొస్తాది. ఆళ్ల కూసమైనా కదలనీ, ఆళ్లలో రోసమైనా పుట్టనీ”

వకీలు కాదనలేకపోయాడు. అవునని, అడిగిన పని అవుతుందనీ అనలేకపోయాడు.

“నాయినా నీ తల్లి వయసుదాన్ని. నువ్వయితే దరమాత్ముడివని విని వొచ్చినా. నీకేమైనా యియ్యాలన్నా నాలుగు కొండ పొరక్కట్టలు తప్ప యింకో గతి లేని దాన్ని.”

ఆ మాటలు వినే మాదిరి లేడు వకీలు. యోచనలో పడిపొయినాడు. రొవంత తాళినాక, “అట్నేలే యీసారి వొచ్చేప్పుడు నాలుగు పొరక్కట్టలు పట్రా. ఆళ్ల బుర్రల్లో బూజుల్ని గూడా దులిపేద్దాం” నవ్వుతూ అన్నాడు.

అలా పడింది కోర్టులో, గేణమ్మ దావా. యెన్ని మలుపులు తిప్పినాడో వకీలు, లెక్క లేదు. యెన్ని రోజులు గడిచినాయో, లెక్క కానే కాదు. ఆరోజు కడపటి రోజు. కిందటిసారి కలిసినప్పుడు “ఆరోజు నువ్వు రావాల్సిందే” అన్నాడు. “గంట పది కొట్టకముందే వొచ్చేయ్యాల” అని గూడా ఎచ్చరించాడు.

అందుకే కోర్టు కాడికొచ్చి తురాయి చెట్టుకింద కూసుంది గేణమ్మ. కోర్టు సందడి మొదలుగాక ముందునుంచీ కూసునే వుంది. సంగతేందో తేల్చేద్దామని.


దావా యివరం తెలిసినోళ్లు చెవులు కొరుక్కుంటా వుండారు. కొంగు బుజం సుట్టూ కప్పుకోని, రెండు జబ్బల్నీ రెండు చేతుల్తో పట్టుకోని, ఒదిగి ఒక పక్కగా నిల్చున్నాది గేణమ్మ. పళ్లు గట్టిగాకరుసుకోని, మూతి బిగబట్టి లోపల ఉండేదేదో మొకాన అగుపడకుండా జాగర్తగా నిల్చోనుండాది.

“ఏమ్మా నీ పేరు” అడిగాడు జడ్జి.

చెప్పింది.

“అదేం పేరు?” అనుమానంగా చూశాడు.

“జ్ఞానమ్మ సారూ. అమ్మవారి పేరు. మన పెద్దగుడి, అదే శివాలయంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి పేరు. ఊళ్లలో అలా వాడుకలో వుంటాది” వకీలు సర్ది చెప్పినాడు.

“నీ భర్తతో విడాకులు గావాల్నా?” వకీలు మాటలు ఆలకించాక, జడ్జి అడిగాడు గేణమ్మని.

మౌనం. తల ఊపింది నిలువుగా.

“సైగలు పనికిరావు. నోటితో చెప్పాల. మాటొస్తుంది గదా?” కొంచెం చిరాగ్గా అన్నాడు జడ్జి.

రెండు గడియలు పట్టినాయి గేణమ్మకి. కళ్లలో ఊరుతున్న తడిని గొంతులోకి దిగమింగడానికి.

“మాట గబగబా రావాల. రోజంతా నీకోసం గూసోలేం” యీసారి కసురుకున్నాడు.

“అవును సారూ”

“ఎందుకు?”

మౌనం.

“నీ భర్త నిన్ను విడిచి పారిపోయాడా? చెప్పాలి”

“లేదు సారూ”

“నిన్ను నిర్లక్ష్యం చేసి వ్యభిచారం చేస్తున్నాడా? రుజువులున్నాయా?”

“అట్టాంటోడు కాదు సారూ”

“తాగివచ్చి నిన్ను హింసిస్తున్నాడా?”

“నేనంటే ఆయనకి పేణం సారూ”

“పిచ్చి యెక్కిం.”

“చీచీ లేదు సారూ” మద్దెలోనే అడ్డం పడింది.

యింకేవేవో అడిగాడు లేదనే చెప్పింది.

“నీకు విడాకులు యియ్యడం కుదర్దమ్మా. చట్టం ఒప్పుకోదు” ఎక్కువ వ్యవధి తీసుకోలేదు, తేల్చేసినాడు జడ్జీ.

“అయితే నాకు పించనెట్టా వొస్తాది సారూ?” అమాయకంగా అడిగింది గేణమ్మ.

జడ్జీ బొమ్మయిపొయినాడు, గడియసేపే. కళ్లద్దాలు ముక్కుమీదికి యెగదోస్కోని, కళ్లు చికిలించాడు. వకీలు కేసి చూశాడు. ఆయన తల పట్టుకున్నాడు. పాపం అంతకుమించి యింకేం జెయ్యగల్డు. గేణమ్మ విడాకుల కోసం అప్పుటిదాకా దావాలో యేదేదో మడతపేచీలు పేర్చుకుంటా వొచ్చినాడు. జడ్జీకి అసలు సంగతి అర్దమైంది. కోపమూ వొచ్చింది.

“కుదర్దమ్మా. నీకు పించను కోసం విడాకులు గావాల్నంటే కుదర్దు” కోపంగా అన్నాడు.

గేణమ్మ దిమ్మెరపోయింది. కోర్టులో యేం జెప్పాల్నో, వకీలు యేదేదో నేర్పించినాడు గానీ. గేణమ్మ ఆడికి రాగానే అయ్యన్నీ మర్సిపోయింది. మొగుడి సంగతి రాగానే పొల్లు మాట చెప్పలేకపోయింది.

“యింక పోవచ్చు” అంటున్నాడు జడ్జీ.

అప్పుటిదాకా బిగపట్టుకున్న గేణమ్మ బింకం సడలిపోయింది. గుండె పగిలిపోయింది. కట్టలు తెగిపోయాయి. ఒక్కసారిగా తనకు తానే వయసు పైబడిన ముసల్దానిలాగా అనిపించింది. పసితనం నుంచి పండిపోయేదాకా చేసిన రెక్కల కష్టం మొత్తం ఒకేసారి కుంగదీసినట్టు కుప్పకూలిపోయింది. నిస్త్రాణగా అప్పుటిదాకా నిల్చుని ఉన్నదెల్లా. కుప్పగా గొంతు కూర్చుండిపోయింది, బోరున ఏడుస్తూ.

పెద్దగుడి అమ్మోరి కుంకం అలికినట్టుగా నేలంతా పరచుకుని, ఎర్రగా మెరస్తండాది కోర్టులో తివాచీ. ఆ మూలన, యెలిసిపోయిన పసుపురంగు నేతచీరలో, ఉద్వేగంతో ధారలు కట్టిన చెమటలో, ఉబికి ఉబికి వస్తున్న కన్నీళ్లలో తడిసిపోతూ. తమలపాకు మీద పెట్టే పసుపుముద్ద వినాయకుడు కరిగిపోతున్నట్టుగా. కూసోనుండాది గేణమ్మ.

“నేనొక మాట జెప్పుకోవచ్చునా సారూ?” యేడుపు బిగబట్టి జడ్జీకేసి అడిగింది, తలెత్తకుండానే. ఆయన నిలువుగా తలఊపాడు. అది గూడా జూసుకోకుండానే. గేణమ్మ మొదులెట్టింది.

“గన్నేరు పప్పు తెచ్చి నూరి, గోగాకు పచ్చళ్లో కలిపిపెట్టుకున్నాను సామీ వారం దినాల ముందర. నేను సావాలనుకున్నా. నా మొగుడికీ సంగటితో పాటు తినిపిద్దామనుకున్నా! ఒక రేషను కార్డు మీద ఒకరికే యిస్తారంట పింఛను. ఏమి సామీ, ఒక సూరు కింద రెండు ముసిలిపేణాలు బతకనేగూడదా? యిద్దరం సస్తే పోద్దిగదా.! గన్నేరు పప్పు నూరిపెట్టినా! ఆ పూట తాగి వచ్చినోడికి సంగటి పెట్టినాను గానీ. గోగాకు పచ్చడి పెట్టలా. మనసు రాలా. చేతులు రాలా! ఆ పచ్చడంతా యెత్తుకోని బొయ్యి బురదగుంటలో కలిపేసినా.

యేం జెయ్యమంటావు. వోడొక్కడికీ పించనొస్తాది, ఆ దుడ్డు కొంపలోకే రాదు. యెట్ట గడవాల? రెండు కడుపులు యెట్ట నిండాల? నిన్నటిదాకా, నాకు పించనొస్తే యేందీ, సస్తే యేందీ? అనుకుని, యేదో కూలీనాలికి పోతానే వుంటిని. నిన్నటిలాగా యియ్యాల లేకపాయె. కస్టానికి నేను పనికిరాని దాన్నయిపోతిని. యేం జెయ్యమంటావు?

యెన్నిసార్లు అనుకున్నానో తెలుసా సామీ, నేనే సావాలని! ముందర నేను జస్తే యెట్టా? వోడికి ముద్దబెట్టే దిక్కులేదే. సివరాకరికి వోడికి దక్కేదీ సావే. ఆ సావేదో నేనే యిచ్చేస్తే పోలా. వోణ్ని సంపి, వొచ్చే ఆ పించనేదో నా యెదాన కొట్టుకుని బతికిపోవచ్చు గదా?”

ఆయాసపడతా వుంది గేణమ్మ. బుజం చుట్టూ కప్పి ఉన్న కొంగు తీసి మొహం తుడుచుకుంది. ముక్కు చీదుకుంది. దాన్ని బిగదీసి బొడ్లో దోపుకుంది. కొంచిం తెప్పరిల్లి మళ్లీ అందుకుంది.

“యెన్నిసార్లు అనుకున్నానో తెలుసా సామీ? యీ నా మొగుణ్ని చంపెయ్యాలని? పీకల్దాకా తాగొచ్చి ఒళ్లు తెలియకుండా పడుండేవోడిని. ముక్కు మూస్తినంటే గడియ! పీక పడితినంటే రెండు గడియలు!

ఎనబయ్యేళ్ల ముసిలి నా బట్ట యెట్టా జచ్చినాడని నన్ను ఎవుడడగబోతాడు? ఎవుడొచ్చి ఆరాలు తియ్యబోతాడు? సద్దికూటేళకి సావైతే, పగుటికూటేళకి పాడెత్తెయ్యడమే. పాతిపెట్టెయ్యడమే గదా! సందేళకి గాకపోతే మరు దినానికైనా నాకు పించనొస్తాది గదా?”

సంతకం పెట్టెయ్యబోతూ ఆగినవాడల్లా, జడ్జి అలాగే ఉండిపోయాడు. వకీలు తన కుర్చీలో కూలబడ్డాడు. కోర్టులో ఫ్యాన్లు తిరుగుతున్న చప్పుడొక్కటే వుంది. గేణమ్మ గొంతు ఉరిమినట్టుగా యినిపిస్తా వుంది.

“యేం జెయ్యమంటావు సామీ? సంపెయ్యమంటావా? చేతులు రావట్లేదే? నన్ను పేణంలా జూసుకున్న మొగుడు. నన్ను పువ్వులా జూస్కున్నాడు సామీ. ముసిలోడైపొయినాడు గదా. వోడికొచ్చే దుడ్లు యెసుట్లోకి యియ్యడం లేదు గదా అని సంపెయ్యమంటావా? దుడ్లొక్కటేనా, ఆడికీ నాకూ? యింకేం లేదా? యెట్టా సంపేది? ఆడిని సంపకపోతే యెట్టా బతికేది? యిదొక్కటే దారి కనిపించింది సామీ. యిదొక్కటే దారి.” వెక్కిళ్లలో మాటలు మింగేసింది గేణమ్మ. కోర్టంతా గేణమ్మ ఏడుపూ, వెక్కిళ్లూ తప్ప యింకోటి లేదు. వెక్కి వెక్కి గమ్ముగా ఉండిపోయింది.

తేరుకున్నాడు జడ్జి. రెప్పలు ఆర్చాడు. కళ్లజోడు సర్దుకుంటున్నట్టుగా. బుగ్గలమీద చుక్కలు తుడుచుకున్నాడు. గాజులోటా అందుకుని రెండు గుక్కలు నీళ్లు తాగాడు. కుర్చీ దిగి లోపలి గదిలోకెళ్లి గడియలోనే తిరిగొచ్చినాడు. ఈ లోపల వకీలు, గేణమ్మ కాడికొచ్చి ఏదో చెప్పినాడు.

జడ్జి తిరిగి రాగానే గేణమ్మకేసి మళ్లీ అడిగాడు. “నీ భర్త తాగివచ్చి నిన్ను కొడుతున్నాడా?”

జవాబు- వకీలు నేర్పినదే. కానీ చెప్పడానికి రెండు క్షణాలు అవసరమయ్యాయి గేణమ్మకి.

“అవును సారూ” అంది ఈసారి. అది చాలు ఆయనకి! ఆమె యింకోమాట మాట్లాడడమే ఇష్టం లేనట్టుగా. ఆ వెంటనే జడ్జి తీర్పు చదవడం మొదలెట్టాడు.

గేణమ్మ వెక్కిళ్లూ, రోదనా నిస్సద్దుగా మారుతుండగా. ఆయన మాట, గుడిగంటలా మోగింది.


పెద్దగుడిలో జనం రచ్చరచ్చగా వుంటాది. గేణమ్మ చిన్నగుడికెళ్లింది. తిన్నెలమీదా, అరుగుల మీదా చిన్న చిన్న గుంపులుగా జేరి జనం ముచ్చట్లు చెప్పుకుంటండారు. ఖాళీగా వుండే గుళ్లోకెళ్లింది. వరదరాజులు చానా నిమ్మళంగా నిల్చోనుండాడు. చమురు దీపాల యెల్తురులో పూలు, తులసాకుల మాలల్తో గొప్పగా కనిపిస్తండాడు. దేవుణ్ని కన్నార్పకుండా జూస్తా. తనకు తెలీకుండానే కుడిచేత్తో మెళ్లో పసుపుతాడును తడిమింది గేణమ్మ. తడితడిగా తగిలింది. చెమటా, కారిన కన్నీళ్లూ కలిసి చేసిన తడి. తడి ఆరని ఒంటికి ఇంకా గట్టిగా అతుక్కోనుండాది. “ముడెయ్యించుకోడమే నీ చేతుల్లో ఉండేటిది, తుంచుకోడం, తప్పించుకోడం అంతా నా చేతుల్లో పని” అని శివయ్య చెబుతున్నట్టుగా ఉండాది వరదరాజు గుళ్లో నిల్చున్న గేణమ్మకి. “సామీ, నువ్వూ, ఆ పెద్దగుడి శివయ్యా, గేణమ్మా. మీరు ముగ్గురూ గలిసే నా నెత్తిన పాలు బోసినారు” అని ముసిముసిగా నవ్వుకుంటా దణ్నం పెట్టుకునింది గేణమ్మ.

ఈలోపల ఆరతి తట్టతో వొచ్చినాడు పూజారి. గునగున మంత్రాలు చదువుకుంటా! కొంగుముడిలో కట్టుకున్న వాటిలోంచి పదిరూపాయల నోటు తీసి, తట్టలో యేసింది. “పేరు చెప్పమ్మా” అన్నాడు.

“తిమ్మసముద్రం యీరాసామి”

యాభయ్యేళ్లు యెక్కదీసిన సంసారంలో, మొగుడిపేరు ఏనాడూ తన నోటితో చెప్పెరగకపొయినా, తడబడకుండా చెప్పింది గేణమ్మ. ఆ పేరు పలికేసి, గేణమ్మ గురించి అడగనైనా అడగకుండానే, “సహకుటుంబానాం” అంటూ సాగదీసి. ఆ ముసిలోళ్ల గురించి దేవుడికి ఏం కొత్తగా చెప్పాలనుకున్నాడో గానీ. గొణుక్కుంటా ఆరతి తట్టని లోనికి పట్టకపొయినాడు పూజారి.

గుడి యెనక జాగాలో, నిలబడిన దీపానికి కాసింత యెడంగా ఒంటిరెక్క నందివర్ధనాల చెట్టుంటే. యెళ్లి దాని దాపున కూసుంది. రాలిన పూలన్నీ తెల్లపూల తివాచీ మాదిరిగుండాయి. వకీలు ఇంటికి తొలిమారు పొయిన కాడినుంచీ ఒక్కొక్కటీ జరిగినటివి అన్నీ గెమనానికి తెచ్చుకుంది. అప్పుటికి పొద్దు వాలిపోయి, సీకటి ముసురుకుంటాండాది. పురుగుల రొద పెరిగింది. నెమ్మదిగా లేసి, రోడ్డుమీదికొచ్చింది. మిఠాయి అంగడికెళ్లి రెండు జాంగ్రీలు పొట్లం కట్టించుకుంది. బస్సెక్కి టిక్కెట్టు కొన్న తర్వాత, కళ్లుమూసుకుని, చిద్విలాసంగా, “నా ముసిలోడికి ఇయ్యంటే చానా యిష్టం” అనుకుంది గేణమ్మ.

రోడ్డుమీద పరుగెత్తతా వుంది బస్సు. చుట్టూతా చీకటి. గేణమ్మ కూచున్న కిటికీ పక్కన మిణుగురులు మినుకు మినుకు మని ఆరతా యెలగతా ఆమెతో పాటూ యెలబారతండాయి.

రచయిత పరిచయం

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె. ఎ. మునిసురేష్ పిళ్లె

కె.ఎ. మునిసురేష్ పిళ్లె: శ్రీకాళహస్తిలో పుట్టి హైదరాబాదులో స్థిరపడ్డారు. రాయడం ఆసక్తి, ఆదరవు. పాత్రికేయం ప్రధాన వ్యాసంగం. అందులో ఇమడలేకపోయిన సంగతులు మెలిపెట్టినప్పుడు రచనా వ్యాసంగానికి పూనుకుంటారు. కవిత, నవల, వ్యంగరచన, కార్టూన్లలో కూడా ప్రవేశం ఉంది. మధురాంతకం రాజారాం కథ “పొద్దుచాలని మనిషి” వీరికి స్ఫూర్తి నిస్తుంది. బహుమతి పొందిన వీరి కవిత షష్ఠముడు.

15 Responses to “గేణమ్మ”

  1. ఓట్ర ప్రకాష్ రావు

    ఒక మంచి కథను మాండలికంలో చక్కగా వ్రాసారు . రచయితకు అభినందనలు

    Reply
  2. Rohini Vanjari

    ఇంటాయిన దాక వచ్చిన లచ్చిందేవి ఇంటి దాకా ఇంటి ఆడమనిషి దాక రాక వయసుడిగిపోయి ఒంట్లో సత్తువ లేక కూటికి గుడ్డకు అలమటించే ఎందరో గేణమ్మల వ్యథ ఈ కథ. సురేష్ పిళ్ళై గారి శైలి గుండెను పిండేసి విషాదభరితం చేస్తుంది. అయితే గేణమ్మ కష్టానికి స్పందించి కోర్టు వారు ఇచ్చిన తీర్పు, ముసిలోడికి జిలేబీలు ఇష్టం అంటా ముసిరిపోతా గేణమ్మ జిలేజీలు కొని పొట్లం ఇంటికి ఎత్తకపోవటం కథని ఆశావాహ దృక్పథం తో ముగించటం చాలా గొప్ప విషయం. ఇటువంటి ఆశావహ కథలు రాయటం సురేష్ పిళ్ళై గారికే చెల్లు. ప్రథమ బహుమతి కి అర్హత కలిగిన కథ ఇది. సురేష్ పిళ్ళై గారికి హృదయపూర్వక అభినందనలు 🌹🌹

    Reply
    • P S V RAMACHANDRA MURTHY

      శ్రీ ముని సురేష్ పిళ్ళై గారి కలం బలం తెలిపిన కథ. రాయలసీమ మాండలికంలో రాశారు. వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు రెండు, మూడుసార్లు చదివాను. అర్ధమైన తర్వాత అంతులేని అనుభూతి పొందాను. గేనమ్మ పాత్ర చిత్రణ, పించన్ డబ్బులు కోసం భర్తను చంపాలని మనసులో సుడులు తిరిగిన ఆలోచనలు, కోర్టు నుంచి దేవుడు దగ్గరకెళ్ళి గుడిలో భర్త పేరు చెప్పడం, అతనికి ఇష్టమైన జాంగ్రీ తిసుల్లకెళ్ళడం ఆమె పాత్ర చిత్రణ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కోర్టు సీన్లో భర్త మంచితనం నిజాయితీగా చెప్పడంలో ఆమె అమాయకత్వం తో కూడిన అనురాగం కనపడింది.
      మంచి కథను అందించి, బహుమతి అందుకున్న శ్రీ ముని సురేష్ పిళ్ళై గారికి అభినందనలు.

      Reply
  3. usharani

    చాలా బాగుంది. ఊపిరి బిగబట్టి చదివాను.

    Reply
  4. K MURALI MOHAN

    మరో మారు మనసుల్ని కదిలించే, మెదడుకి పనిచెప్పే కథ అందించిన మా, మన, సురేష్ పిళ్లై గారికి అభినందనలు…బహుమతి కి అన్నివిధాలుగా అర్హమైన కథ, చిత్రణా, శైలీ, వర్ణనా…….మాండలిక.. మట్టి వాసనల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు…….మరిన్ని సజీవ చిత్రణలు..మీ నుంచి రావాలి..సురేష్ గారూ…మరింత తరచు గా……..

    Reply
  5. కిరణ్ విభావరి

    Excellent 👌👌 అన్నీ కథలూ చదివాను. అన్నిటిలోకి the best కథ ఇదే.. ప్రథమ బహుమతి కి అర్హమైన కథ అనడంలో అతిశయోక్తి లేదు.

    Reply
  6. మార్క్స్ బాబు

    కథ… అపూర్వం సార్… కడు సామాన్య మహిళ జీవితం.. సంసారం.. కష్టాలు.. ప్రేమలు.. బంధాలు. వాస్తవాలకి అలవాటు పడటం .. సామాన్య జీవితం లో గాఢత.. సంక్లిష్టత.. పోరాటం.. ప్రభుత్వ పథకాల లోని లోపాలని చక్కని మాండలికం లో రాశారు సార్ 💐💐

    Reply
  7. రాజేంద్ర

    పిళ్ళై అన్న కథ చదివినంత సేపు
    నాకు కేశవరెడ్డి గారి రచన చదివిన అనుభూతి కలిగింది. రచనల్లో మంచి చెడులు ఎంచేంత స్థాయి నాకు లేదు. ఎక్స్ప్రెషన్ లో
    కేశవరెడ్డి గారు స్ఫురణకు వచ్చారు. పిళ్ళై అన్న విభేదించడనే అనుకుంటున్నా…

    Reply
  8. Ramakrishna Reddy. Kottam

    మాండలికం అద్భుతం, కథనం అపూర్వం. కథ అమూల్యం. శైలి కేవలం ఈ రచయిత కే చెల్లు. Super.

    Reply
  9. Chaganti prasad

    గేణమ్మ కథ By సురేష్ పిళ్ళై
    (తెల్సా కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

    కథ చిత్తూరి జిల్లా మాండలికంలో చెప్పారు.
    కానీ చాలా బాగా అర్ధం అయ్యింది. ఎందుకంటే పాత్ర ఒక మహా శిల్పి చెక్కడం మొదలుపెట్టి చివరకు ప్రాణ ప్రతిష్ట చేసి మనముందు ఆవిష్కరింపచేసారు. అదిచూస్తూ అప్రతిభులై ఉండిపోతాము.
    గేణమ్మ జీవితాన్ని కాచివడబోసిన మహాజ్ఞాని.
    బంధం విలువ తెలిసిన ఇల్లాలు. కష్టపడి పొట్టపోసుకోవడం తప్ప
    అక్రమ మార్గం తెలియని తెలివి తక్కువ జీవి.(ఈరోజుల్లో జనాల్ని బట్టి) తన మనసులో మొలకెత్తిన అమాయకపు విత్తు మహావృక్షంగా ఎదిగి కోర్టులో ప్రశ్నించే ఉద్దండ పిండం
    చివరకు వ్యవస్థని ఎందరి జీవితాల తరఫున ప్రశ్నించే
    నాయకురాలై కూర్చుంది.
    ఇక ఆమె జీవన గతి చదువుతుంటే కంట కన్నీరు ఉబకపోతే మళ్ళీ చదవండి.
    మీరు కథని సరిగా మనసు పెట్టి చదవలేదేమో!
    ఇక రచయిత తన కలంతో
    కథన విహారం చేసారు.
    చిత్తూరు పడికట్జు పదాల పరదాలతో మనల్ని కప్పేసారు.
    “బండెడు కట్టానికి మూకుడు గింజలు.”
    “పువ్వుల్లో పెట్టి జూస్కునేటంత ముల్లె వాడి దగ్గర్లేదు గాని పిల్లని పువ్వులాగానే జూసుకునేవాడు”
    “బువ్వగావల్సినంత కాలం
    తొవ్వ గావల్సిందే గదా”.
    “ఊరు గొడ్డుబోయిందేమోగాని, కొండా కోనా గొడ్డుపోలేదుగదా”
    ” తమలపాకు మీద పెట్టే పసుపు ముద్ద వినాయకుడు కరిగిపోయినట్టు”
    గేణమ్మ కోర్టులో తన అంతర్మధనం చదివిన మనకి ఆమెకు ధర్మ కాటాకి మధ్య నిలబడినట్టనిపించింది.
    ఈ నాటి వ్యవస్థలో డబ్బుకోసం క్షణం కూడా ఆలోచించకుండా తనవాళ్ళ ప్రాణాలని తీసే నీచమైన కాలంలో గేణమ్మల వంటి విజ్ఞత ఉన్నవాళ్ళు ఉండి ఈ ఆకాశానికి గుంజలైనారు.
    చివర్లో ఆమె శివుడి దగ్గరకెడితే ముడెయించుకోవడమే నీ చేతుల్లో ఉండేటిది”
    అన్న వాక్యంలో శివన్యాయం కనిపించింది నాకు.
    ఇంత పెద్ద కథ ఎక్కడా నా దృష్టి పక్కకువెళ్ళనంతగా ఆకట్టుకుని నన్ను కట్టిపడేసింది. ముంచేసింది.
    గుండెతడిపిన కథ. ఆలోచనను రేకెత్తించిన కథ
    పెద్ద కథలకు ఊపిరులూదిన కథ.

    రచయిత సురేష్ పిళ్ళై గారికి అభినందనలతో
    తెల్సావారి తీర్పుకి జైజై లు పలుకుతూ

    చాగంటి ప్రసాద్

    Reply
  10. janakiram chikkala

    చాలా అద్బుతమైన కథ అండి. గొప్ప కథని అందించిన రచయిత మునిసురేష్ పిళ్లే గారికి ధన్యవాదములు..

    Reply

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.