ఒకానొక సార్థక సవారీ
నాన్నా!
రాత్రిళ్ళు చీకటి బావిలోకి పడిపోయాక
అమ్మ చెప్పే నీ వెలుగు కధ
మన రిక్షా టాపు కింద వెన్నెళ్లను పరిచేది!
మనకు బువ్వెట్టే అమ్మంటూ
నువ్వు పరిచయం చేసిన
రిక్షా
తెలియని తనంలో
చిన్నతనంగా తోచినా
తనతో
పయనించగా, పయనించగా
మన చింతల్ని మోసింది తనేనని తెలిసివచ్చింది!
నువ్వేమో
మూడంకె వేసుకొని మూలిగే ముళ్ల డొక్కలకి
ఊపిరిచైను బిగించి
కుటుంబ బండిని లాగే
వాహనమయ్యావు!
నీ పిక్కల్ని మూడు చక్రాలు చేసి తొక్కి
మా నోట్లో మూడుపూటలా అన్నమయ్యావు!
తెగుతున్న బతుకుదారాల్ని
నీ నరాలతో పేని
మా భవితకో ఆధారమయ్యావు!
నీ గుండెను సీటుగ మార్చి
మా బరువుల్ని మోసావు!
నీ ఖాళీ కడుపు కేకల్ని వినిపించనీయక
రోడ్డుపై శ్రమల బెల్లు మోగిస్తూ
జీవపు పాటొకటి ఆలపిస్తూ
గాలి భోంచేసే వాడివి!
చూరుకి వేలాడుతున్న బీదరికాన్ని కండువాలో చుట్టి వెతల్ని వేటాడేందుకు
రిక్షా రథాన్ని తోలుకు పోయేవాడివి!
నీ శ్వాసల్ని టైర్లలో నింపి
మా ఆశల్ని ముందుకు నడిపావు!
నువ్వూ,రిక్షా
రాతిరిని కొలుస్తూ పోయి
మాకు చదువుల సూరీడ్ని జత చేసారు!
అమ్మ విసిరే చేటలో
గింజలయ్యే నీ చెమట చుక్కలు
గోతుల్లో నడుం విరగ్గొట్టుకున్నా పెదవి దాటని రిక్షా మూలుగులూ
మా గుండెలను తడుముతూనే ఉండేవి!
పగలు సూరీడు,రాత్రి చంద్రుడూ తొంగి చూసే
మన పూరిల్లు
నీ గూడు రిక్షా రాగానే
తన గాయాల్ని కప్పే తోడు దొరికిందని నక్షత్రాలతో ఊసులాడేది!
దినమంతా నువ్వు కట్టిన సవారీ
మిఠాయి పొట్లమై
మా పొట్టల్ని నింపుతుంటే
అలసిన నీ భుజాలను ఓదార్చే
అమ్మ కన్నీళ్లు
మా కళ్ళను దాటి పోలేదు అయ్యా!
అరిగిన నీ పాదాలను ఒత్తేందుకు
మా చిట్టి చేతులు నిన్ను స్పృశించినపుడు
మా హస్తాలు పుస్తకాలవడం
నీ కలని
నీ కాళ్ళని నువ్వే పట్టుకుంటున్నపుడు
మేము చదువుల సీటుపై కూర్చోక ఎక్కడికి పోగలం నాన్నా!
ఎండల్లో కరిగిన నీ కండలు
మేమెక్కే
ఎదుగుదల కొండలయ్యాక
నీ కూడు,గూడు నేస్తానికి
సెలవిచ్చి
నిన్ను ఒంటరిని చేశామని మమ్మల్ని మందలించే
నీ ప్రేమ వెనుక
తడి కథ అంతా మాకు అనుభవమే!
ఇప్పుడు నువ్వు తొక్కిన రిక్షాకు కాలం చెల్లొచ్చు కానీ,
తను తోడై నడిపిన క్షణాలకు కాదు!
నువ్వు ఆవిరి చేసుకున్న నెత్తుటి బొట్లకు కాదు!
నువ్వు కట్టిన సవారీ ఒకానొక ఆకుపచ్చటి
సార్థక సవారీ నాన్నా!
3 Responses to “ఒకానొక సార్థక సవారీ”
నా కవితకు బహుమతిని అందించి,ప్రచురించిన తెల్సా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు
—-డి.నాగజ్యోతిశేఖర్
It’s very heart touching poetry.
Tq