ఏదో ఒకటి మాట్లాడు
మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు
మట్టి గురించి మాట్లాడు
విత్తు గురించి మాట్లాడు
విత్తు లోంచి మొలకెత్తే
చెట్టు గురించి మాట్లాడు
మట్టికి చెట్టుకీ ఉన్న
బంధం గురించి మాట్లాడు
మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు
మనిషి గురించి మాట్లాడు
మనసు గురించి మాట్లాడు
మనిషిలో చిగురించే
ప్రేమ గురించి మాట్లాడు
మనిషికి మనసుకీ మధ్యనున్న
అనుబంధం గురించి మాట్లాడు
మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు
అమ్మ గురించి మాట్లాడు
ఆత్మ గురించి మాట్లాడు
పేగు కదిలినప్పుడల్లా
అమ్మ ప్రేమ గురించి మాట్లాడు
అమ్మేకద సర్వస్వం
అమ్మే మన ప్రపంచం
మాట్లాడు
ఏదో ఒకటి మాట్లాడు
మంచి గురించి మాట్లాడు
మానవత్వం గురించి మాట్లాడు
మంచికి మానవత్వానికీ మధ్యనున్న
మనిషితనం గురించి మాట్లాడు
ఎండిన పెదాలపై
ఎడారి దారులు వేసుకుని
ఎండమావి కోసం
ఎంతకాలం ఎదురుచూస్తావు
మాటలే కద మనుషుల్ని కలిపేది
కలిసిన ప్రతిసారి కాకపోయినా
మనసులు కలిసినప్పుడైనా
ఆత్మీయంగా మాట్లాడు
మాటలు కరువైనప్పుడు
మౌనాన్ని ఆశ్రయించు
మౌనమే కద
మనిషిని మనసునీ కలిపేది
మాట్లాడుకోవడమంటే
రెండు మనసుల కలయికే కాదు
రెండు హృదయాల స్పందన
4 Responses to “ఏదో ఒకటి మాట్లాడు”
నా కవితకు బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన తెల్సా నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.
– చొక్కరతాతారావు
కవి, కథారచయిత
విశాఖపట్నం
చాలా బాగుందండి కవిత
ధన.యవాదాలండి
కవిత చాలా అర్థవంతం గా వుంది
బహుమతి కి అర్హమైన రచన
అభినందనలు తాతారావు గారు