ఈ శిక్ష మాకొద్దు
పొద్దు ఎనిమిది గంటలు దాటింది.
“ఏమాయెరా ఇస్మాయిల్, ఇంకా లేవలేదు? బేటా, నువు జైలుకోయి రావాలె గదా! ఆఫీసర్లు ఎదిరి చూస్తరు” అంటూ జమాల్ మంచంపై ముడుచుకు పడుకొన్న కొడుకు, కప్పుకున్న దుప్పటిని లాగాడు. నిజానికి ఇస్మాయిల్‌కు రాత్రి నిద్రనే పట్టలేదు. తెల్లవారుతుండగా కన్ను అంటుకున్నా, బాయి గిరక చప్పుడుకు తెలివై మళ్ళీ పట్టలేదు.
తండ్రి దుప్పటి లాగడంతో ఇక తప్పదన్నట్లు లేచిన ఇస్మాయిల్ తల గోక్కుంటూ ఇంటెనుక వైపుకు నడిచాడు.
వాకిట్ల వేడి నీళ్ల కొప్పెర కింద మంట సర్ది కొర్రాయితో బీడీ ముట్టించుకొని వచ్చి కొడుకు లేసిన మంచంలో జమాల్ “యా అల్లా! ” అనుకుంటూ కూలబడ్డాడు.
“నువ్వు ముసలోనివైపోయినవ్, ఇప్పటి నుంచి మీ చిన్నోన్ని పంపు, ఒక్క రోజు అరటి పండ్లు అమ్మకుంటేంది, ఆ ఒక్క దినం పనికి పది వేలిస్తాం గదా, రెణ్నెల్లు నిరందిగా బతుకచ్చు” అని జైలు సూపర్నెంటు ఫోన్లో చెప్పిన నాటి నుంచి ఆ పెద్దాయన కొడుకును మానసికంగా సిద్ధం చేస్తునే ఉన్నాడు.
జమాల్‌కు డెబ్భై ఏండ్లు ఉంటాయి. ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. బిడ్డలకు పెళ్లి సంబంధాలను ఊర్లోనే వెతికి ఆ బరువు దించుకున్నాడు. అల్లుళ్ళు దుకాన్లల్లో గుమాస్తాలుగా పనిజేస్తారు. ఇద్దరు కొడుకులకు పెండ్లిళ్లు అయినాయి. పిల్లలతోటి ఆ ఇంట్లనే చెరో దిక్కు ఉంటారు. ఒకరిది చికెన్ సెంటర్, ఇంకోరిది చెప్పుల షాపు. ఏడాది కిందట జమాల్ భార్య చనిపోవడంతో తండ్రి, చిన్న కొడుకు కలిసి ఉంటున్నారు. పొయ్యిలు వేరయినా “అబ్బా,. చోటే, ” అంటూ కలిసే ఉంటారు. ఇస్మాయిల్‌కు ఇరువై ఐదు ఏళ్లు దాటినాయి. చేతులు కాల్చుకోలేక పిల్లను చూస్తున్నారు. ఊర్లోనేమో ఈడు కుదిరే పిల్ల లేదు. బయటివాళ్ళు ఆ ఇంటికి పిల్లనివ్వడానికి ముందుకొస్తలేరు.
ఇంతలో ఇస్మాయిల్ స్నానం, భోజనం కానిచ్చి జమాల్ ముందు నిలుచున్నాడు.
మంచంలో కూచొనే జమాల్ తల ఎత్తి కొడుకుకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన ముచ్చట మళ్ళీ మొదలు పెట్టాడు.
“బస్సు దిగంగనే సీదా జైల్ ఖానాకు పో, కమ్రా ఛాబీ ఇస్తరు. అన్ని అండ్లనే ఉంటయి. మూడు తాళ్లు తెప్పించి పెట్టిండ్రట. ముడి యేసే ఉంటయి. తాడు మెడకు తగిలే జాగల మైనం ముద్ద తోటి చుట్టూతా రుద్దు. లేకపోతె తాడు మెడకు గీరుకుపోతాది. మైనం లేకపోతె మెత్తటి అరటి పండ్లు రుద్దినా చల్తా. మనిషి బరువు వాళ్లే చెప్తరు. ఎనభై, తొంబై కిలోలుంటే ఆరు ఫీట్ల తాడు వదులాలే, నలుపై, యాభై కిలోలుంటే ఎనిమిది ఫీట్లు ఇడిసిపెట్టు. బరువు బాగున్న మనిషికి ఎక్కువ తాడు ఉంచుతే మెడ కోసుకుపోతది. ముడి కరెక్టుగా మెడ వెనుకనే ఉండాలె. పక్కకుంటే ప్రాణం పోవడానికి ఎక్కువ టైం పడ్తది. పలపలమని మెడ పూసలు ఇరిగిన సప్పుడైతది. అట్లా వినస్తే పని బారాబర్ చేసినట్లే. అర్ధ గంట తర్వాత డాక్టర్ చెక్ చేస్తాడు. ఊపిరి బిగపట్టుకున్నోళ్లది నాడి ఒక్కోసారి ఇంకా కొట్టుకుంటది. జవాన్ల తోటి కలిసి రెండు కాళ్ళు పట్టి గుంజాలే. మల్ల డాక్టర్ చూస్తాడు. ఓకే అంటే నీ పని అయిపోనట్లే” అని ఇంకేమన్నా మరిచిపోయిన్నా అని నెత్తి గోక్కుంటున్నాడు జమాల్ .
“నీ యవ్వ, ఇప్పటికే పచాస్ బార్ చెప్పినవ్, ఇంటుంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నయి. ఉచ్చ పడుతున్నది. నువ్వేమో మార్కెట్ల కూరగాయలు తెమ్మన్నట్లు అల్కగ చెప్తున్నవ్, ఈ ఒక్క సారికి నువ్వు ఎంబడి రా అబ్బా, నాకు భయం అయితాంది” అని కాళ్ళు కొట్టుకుంటూ అన్నాడు ఇస్మాయిల్.
“పదేండ్ల కిందట నాతో వచ్చినప్పుడు అన్ని పూస గుచ్చినట్లు చెప్పుకుంటా చూయించిన కదా బేటా! నాకు దమ్ము వస్తుందిరా, బస్సు వాసన పడ్తలేదు. ఇయ్యల్ల కాకపోతే రేపు ఇది నువ్వే నిభాయించాలె. వచ్చే నెల నుంచి నెలకు రెండు వేలు కూడా నీకే ఇయ్యమంట. నువు కొత్తోనివని జైలు సార్లకు తెల్వదా. వాళ్ళు అన్ని తీర్ల సాయం చేస్తారు. పెద్దసారు ఎత్తిన చేయి కిందికి దించుడు చూసి బస్సు డ్రైవరు గేరు మార్చినట్లు లివర్ బిసను కిందికనాలే, గంతే! మిగితాదంతా ఆల్లే చూసుకుంటరు” అని సముదాయించాడు కొడుకును.
ఇక లాభం లేదనుకొని బట్టలు సంచిలా పెట్టుకొని బస్టాండు దిక్కు నడిచాడు ఇస్మాయిల్.
బీడీ ముట్టియ్యబోయిన జమాల్‌కు చాయ్ తాగబుద్దయి బీడీ జేబుల్నేపెట్టి మల్లయ్య హోటల్ దిక్కు నడిచాడు. మల్లయ్య చాయ్ మరిగించుకుంటూ -” ఏందే జమాల్ బావా, ఎటు పోతున్నావురా అల్లుడా, అంటే ఇస్మాయిల్ మాట్లాడకుంటనే పోతున్నడు. కోపానికచ్చినవా, అలిగిండా ఏందీ, ” అన్నాడు.
జవాబు చెప్పలేని జమాల్‌కు అక్కడ ఉండబుద్ది కాలేదు. “మల్లత్తనోయ్” అనుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు .
పైకి చుట్టమోలే పిలిచినా చాటుకు మాత్రం అందరు తలారి జమాల్ అంటారని ఆయనకు తెల్సు. ఊరివాళ్లతో ఎంత మంచిగున్నా దూరం దూరమే ఉంటరు. చేతుల ఉరితాడు పట్టుకొని వస్తున్నట్లే భయపడతారు.
జమాల్‌కు కూచునే ఓపిక లేక మంచంలో ఒరిగాడు. రెండు వైపుల నుంచి కన్నీళ్లు జారుతూ చెంపలు, చెవులు తడుస్తున్నాయి. లోపటి బాధ కనబడితే కొడుకు ధైర్యం చెడుతదని ఇదెంత పని అన్న తీరు కొడుక్కు చెప్పాడు కాని ఆయనకు కడుపంత దేవుతూనే ఉంది. తన చేతుల మీద తీసిన ఎనిమిది ఉరులు ఎంత భయపెట్టినయో, కల్లోకొచ్చి చీకట్లో ఎలా పరుగు పెట్టించినయో పిల్లలకు చెప్పలేదు. ఉరి తీసిన తర్వాత నిద్రపట్టక రాత్రంతా మసీదులో కూచొని ఎన్ని రోజులు ఏడ్చిందీ ఎవరికీ తెలియదు.
ఆరు నెలల క్రితం ఎవరికో ఉరి శిక్ష పడిన వార్త పేపర్ లో వచ్చింది. మల్లయ్య హోటల్లో జమాల్ చాయ్ తాగుతుండగానే ఆ వార్తను ఒకాయన అందరికి వినబడేట్లు చదివాడు. “అయ్యో, మల్లా ఒకళ్లకు ఉరిశిక్ష పడ్డది గదా. పిల్ల ఇంటి పెద్దలు పెళ్ళికి ఒప్పుకోనందుకు ప్రేమికులు ఇద్దరు కలిసి ఆమె కుటుంబంల నలుగురిని గొంతు కోసి చంపిండ్రట. కోర్టు మరణశిక్ష వేసింది” అని పైకి అన్నాడు. బెంచి మీద కూచొని చాయ్ తాగుతున్న జమాల్ ఆ ముచ్చట వినలేక, అక్కడ ఉండలేక తాగుతున్న చాయ్ గ్లాసు కింద పెట్టి వెనుకకు చూడకుండా ఇంటివైపు నడిచాడు. హోటల్లో కూచున్నోళ్లు ఏం మాట్లాడుతున్నా వారి మాటలు ఉరి తీసి ప్రాణాలు తీసేవాడు వీడేరా అన్నట్లే ఆయనకు అనిపిస్తున్నాయి.
రాత్రి హోటల్ మూసే ముందు వెళ్లి పేపర్ మడిచి జేబులో పెట్టుకొని తెచ్చుకున్నాడు. అందరు పడుకున్నాక ఇంటి వెనుకకు పోయి చదివాడు. పదేండ్ల కిందటి కేసుకు ఇప్పుడు తీర్పు వచ్చింది. తాను ప్రేమించిన వాడు పేదవాడని పెళ్ళికి ఒప్పుకోనందుకు ప్రేమికులిద్దరు కలిసి ఓ నడి రాత్రి పడుకున్న ఆమె తల్లి, తండ్రి, అన్న, వదినల గొంతుల్ని పిసికి చంపారు. ఆమె తాను తప్పించుకునేందుకు ‘గాఢనిద్రలో ఉన్నాను, ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలియదు’ అంది. పోలీసుల విచారణలో ప్రియుడు దొరికిపోయాడు. జరిగింది చెప్పాడు. ఆమెను కూడా అరెస్టు చేశారు. ఆమె స్కూల్ టీచరు. అప్పటికే నాలుగు నెలల గర్భవతి. పెళ్లి కాకపోతే అందరి ముందు పరువుపోతుంది. పెద్దల అడ్డు తొలగిస్తే పెళ్లి చేసుకొని తల ఎత్తుకొని బతుకవచ్చు అనుకుంది. కానీ, దొరికి పోయారు. విచారణ కాలంలోనే జైల్లో మగ పిల్లాణ్ణి కన్నది. జైలు నిబంధనల ప్రకారం తల్లి వెంట పిల్లలు ఆరేళ్ళ వయసు దాక ఉండొచ్చు. విచారణలోనే ఆరేళ్ళు గడిచిపోయింది. పిల్లాడు శిశు సంక్షేమ శాఖ సంరక్షణలోకి వెళ్లాడు. తనకు ఉరిశిక్ష ఖాయమని, తిరిగి కొడుకుతో బతికే అవకాశం లేదని, చేసిన తొందరపాటు పనికి కుమిలి కుమిలి ఏడాదిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత రెండేళ్ళకి వారిద్దరికీ మరణశిక్ష పడడంతో మిగిలిన ఒక్కడికి ఉరి ఖాయం అయినట్లే అని ఉంది. వారి కథతో జమాల్ గుండె బరువెక్కింది. చప్పుడు కాకుండా వచ్చి పడుకున్నాడు.
జైలు నుంచి ఉత్తరం రాకతో ఆ నాడు పేపర్లో చదివింది గుర్తుకొచ్చింది. ఆ తర్వాత “ఎల్లుండే ఉరి, రేపు వచ్చి అంత సిద్ధం చేసుకోవాలె” అని ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ కొద్దిసేపయ్యాక వచ్చిన ఫోన్లో “నువ్వు ముసలోనివైపోయినవ్, ఇప్పటి నుంచి మీ చిన్నోన్ని పంపు” అని చెప్పి పెట్టేశారు.
పన్నెండేండ్ల అనంతరం ఆ కుటుంబానికి మళ్ళీ ఉరితాడు చేతిలోకి తీసుకునే పని పడింది. ఎంత మరిచిపోయినట్లు కాలం గడిచినా పిడుగులాంటి వార్త ఎప్పుడు మీద పడుతుందోనని ప్రాణం పీకుతూనే ఉంటుంది. ఒకరికి చెప్పుకునే బాధ కాదిది.
జమాల్ తనకు తాను ఈ పనిలోకి రాలేదు. తాను ఇస్మాయిల్ ను దించినట్లే జమాల్ తండ్రి ఆయన్ని ఇదే తప్పనిసరిలో దించాడు. తండ్రిని తాత వెంట తీసుకపోయిండట. ఎప్పుడో ఇంగ్లీషువాళ్ల జమానాలో ఒకరికి నడిబజార్లో ఉరిశిక్ష వేసి “దోషి మెడకు తాడు బిగించి కాళ్ళ కింది బల్ల తన్నేసే దమ్ము గలవాడెవడైన ఊర్లో ఉన్నాడా!” అని సవాలు విసిరారట. తెలిసో తెలియకో తొందరపాటో గాని జమాల్ తాత ముందుకొచ్చి ఆ పని కానిచ్చాడట. ఇంగ్లీషు దొర మెచ్చుకొని కొంత సొమ్ము కూడా బహుమతిగా ఇచ్చాడట. అప్పటినుంచి ఎవరికి ఉరిశిక్ష పడినా ఆయనను తీసుకెళ్లడం మొదలైంది. అలా మొదలై, ఇంగ్లీషు వాళ్ళు పోయినా ఉరిశిక్ష పోలేదు. ఉరితాడు బిగించే పని వారసత్వ బాధ్యతగా ఈ కుటుంబానికి తప్పలేదు.
జమాల్ ఊర్లోనే పిల్లల రెడీమేడ్ బట్టలు అమ్మేవాడు. అయితే పండుగలకు, శుభకార్యాలకు కొత్త బట్టలు తన దగ్గర కొనేవారు కాదు. అడిగితే ఏదో మాట చెప్పి తప్పించుకొనేవారు. “ప్రాణాలు తీసే చేతులనుంచి పండుక్కి బట్టలు తీసుకుంటారా” అని భార్య అనేదాకా ఆయనకు తట్టనే లేదు. అప్పటి నుండి సైకిలుకు దుప్పట్లు, బెడ్ షీట్లు కట్టుకొని అంగళ్ళు తిరిగేవాడు. ఇంతకాలం ఎట్లనో గడిచింది గాని ఆ నీడ ఇప్పుడు ఇస్మాయిల్ మీద పడింది. ఈ పీడ వాని మీద పడక ముందే పెళ్లి చేద్దామనుకుంటే జల్లాద్ జమాల్ ఇంటికి పిల్లనివ్వమని అందరు కూడగట్టుకొని అనుకున్నారేమో, ఒక్కరూ ముందుకు రాలేదు. ఇస్మాయిల్ జైలుకు పోయిన సంగతి తెలిస్తే ఇక వాని బతుకేమయితదో అని జమాల్‌కు బెంగ మరింత పెరిగింది. తడిసిన కళ్ళు అలసి నిద్రలోకి జారుకున్నాయి.
“అబ్బా, అబ్బా” అంటూ పెద్ద కొడుకు తట్టి లేపడంతో కళ్ళు నుములుకుంటూ లేచి కూచున్నాడు జమాల్.
” ఇస్మాయిల్ ఇంకా జైలుకు రాలేదని ఆఫీసర్ ఫోన్ చేసిండు.”
” అరె, అదేంది! పొల్లగాన్ని తొమ్మిదింటికే బతిలాడి పంపిస్తి, ఇప్పుడెంతయితంది?”
“నాలుగు దాటింది, “
“తమ్మునికి ఫోన్ జెయ్!”
“చేసిన, రింగైతంది, ఎత్తుతలేడు”
బస్సెక్కిన ఇస్మాయిల్‌కు ఒకరి మెడకు తాడు బిగించి ప్రాణం తీయడం తండ్రి చెప్పినంత తేలిక పని కాదు అనిపిస్తోంది. తండ్రి ఒత్తిడికి తప్పక బయలుదేరాడు గాని చేయబోయే పని గుర్తొస్తేనే ఆయన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నడుమనే బస్సు దిగి ఎక్కడికైనా వెళ్లి ఒక్కోన్ని బతుకుతా అనుకున్నాడు. తండ్రి యాదికచ్చి అట్లా కుదరదనుకున్నాడు.
“జ్వరమొచ్చిందా!” అని బస్సులో పక్కసీటులో ఉన్నాయని అడిగేసరికి లేదన్నట్లు తలూపాడు.
“మరి వణుకుతున్నావేమి? ఆ చెమటలేమిటి?” అన్నాడాయన.
ఆయన చేతిలో పేరు,అడ్వొకేట్ అని రాసున్న డైరీ కనబడింది.
“మీరు వకీలా సార్!” అన్నాడు ఇస్మాయిల్ ఆయన వంకే చూస్తూ.
ఔను, ఏంటి, అన్నట్లు చూశాడాయన.
ఇస్మాయిల్‌కు దుఃఖమాగలేదు.
“ఏమిటయ్యా బాబు నీ పరిస్థితి, చెప్పి ఏడువు!” అన్నాడాయన.
తాను బయలుదేరిన పని, దాన్ని చేయడం తనవల్ల కాదని, మీరే కాపాడాలని కన్నీళ్లు తుడుచుకుంటూ మొత్తం చెప్పాడు.
“ఆ పని చేస్తానని నీవేమైనా అగ్రిమెంట్ మీద సంతకం చేశావా?”
“మా అబ్బా చేసిండేమో , నేనైతే ఎక్కడా సంతకం పెట్టలేదు”
“ఉరితీయడం నీకు ఇష్టం లేకపోతే నీవు జైలుకు వెళ్లే అవసరం లేదు. నా వెంట రా!” అని కోర్టు హాలులో కూచోబెట్టాడు. కోర్టు ముగిసాక ఇస్మాయిల్ ను జిల్లా మేజిస్ట్రేటు ఇంటికి తీసికెళ్ళాడు.
“సారీ సార్! మీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చినాము. ఈయన పేరు ఇస్మాయిల్” అని సంఘటనంతా ఆయనకు అడ్వొకేట్ వివరించాడు. చెప్పిందంతా విన్న మేజిస్ట్రేటు, జైలరును రమ్మని ఫోన్ చేయించాడు .
ఆయన ఎదురుగా కొద్ది దూరంలో వేసున్న సోఫాలో అడ్వొకేట్, బయట బెంచిపై ఇస్మాయిల్ కూచున్నారు. అడ్వొకేట్ ధైర్యమియ్యగానే ఫోనును సైలెంట్ లో పెట్టాడు ఇస్మాయిల్.
కొద్దిసేపటికి వచ్చిన జైలర్ మేజిస్ట్రేటు ముందు నిలబడి సెల్యూట్ కొట్టాడు. ఆయన్ని కూచోమన్నట్లు చేయి ఊపి అసలు విషయాన్ని చెప్పాడు. జైలర్ బోనులో నిలబడ్డట్లు బిగుసుకు పోయాడు.
“ఆ పిల్లాడి నుంచి మీరు అగ్రిమెంట్ తీసుకున్నారా?” అన్నాడు జైలర్‌తో మేజిస్ట్రేటు.
“లేదు. ఇవ్వాళ్ళే తీసుకోని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇద్దామనుకున్నాము, ఇంతకు ముందు” అని జమాల్ విషయం చెప్పబోతే నాకంత తెలుసన్నట్లు మేజిస్ట్రేటు చేయి ఊపడంతో జైలర్ మాట ఆపాడు.
“జైలు మ్యానువల్ లో హ్యాంగ్ మాన్ గురించి ఏముంది?” అని జైలర్ ను అడిగాడు.
” సార్! అనుభవజ్ఞుడితో చేయించాలని ఉంది కాని, ఇన్సైడర్, అవుట్‌సైడర్ అనేమీ లేదు. మన దేశంలో ఎప్పటి నుంచో తలారి కుటుంబాలు ఉన్నందువల్ల అలా ఇచ్చారేమో” అని మీకు తెలియని విషయమా అన్నట్లు ముఖం పెట్టాడు జైలర్.
“జైల్లో ఎందరో స్టాఫ్, వార్డర్లు ఉంటారు కదా! బయటి వారెందుకు? అదీ ఓ లివర్ ఆపరేట్ చేసేందుకు” ఇరకాటం ప్రశ్న వేశాడు మేజిస్ట్రేటు.
“సార్” అని జైలర్ ఏమి చెప్పలేక పోతున్నాడు.
“నో ప్రాబ్లమ్, అందరం కలిసి ఇన్ని హ్యాంగింగ్స్ ఎక్జిక్యూట్ చేశాము కాని, ఈ పిల్లాడి కోణంలో ఎవరమూ ఆలోచించలేదు, ఓపెన్‌గా మాట్లాడుకుందాం” అని టీ తెప్పించాడు.
రెండు గుటకల్లో తాగి కప్పు కింద పెట్టిన జైలర్ తన మనసులోనిదంతా బయట పెట్టాడు.
“మీకు తెలియని కొత్త విషయమేముంది సార్! మాలో ఉన్న సెంటిమెంట్ మొదటిది, ప్రాణం తీయడం మహా పాపమని, కుటుంబానికేమైనా అవుతుందేమోననే భయం. సినిమాల్లో చూపించినట్లు ఎవరు మామూలుగా నడుచుకుంటూ పీఠం మీదికి రారు. గింజుకుంటారు. నోటికొచ్చినట్లు తిడతారు. శాపనార్థాలు పెడతారు. అన్ని భరించాల్సిందే! తర్వాత ఇంట్లో ఏమైనా జరగరానిది జరిగితే ఇదే గుర్తుకొస్తుంది, శాంతి చేయించుకునేవాళ్లు ఉన్నారు. రెండోది, ఎగ్జిక్యూషన్ తీరు, రక్తం చిందకుండా, వీలైనంత తక్కువ బాధతో, తక్కువ సమయంలో ప్రాణం పోవాలని నియమముంది. దీనికెన్నో కొలతలు, లెక్కలున్నాయి. తాడుకు సరిగ్గా వాక్స్ రాయకున్నా అది గొంతుకు ఒరుసుకుపోయి రక్తమొస్తుంది. డాక్టర్ దాన్ని నోట్ చేస్తే సర్వీస్ రిమార్క్ అవుతుంది. ఇక మూడోది. వార్డర్లు గాని, మేం గాని వాళ్ళను రోజు చూస్తుంటాం! వారిలో మంచివాళ్ళు, మారినవాళ్లు కూడా ఉంటారు. మమ్మల్ని కావిలించుకొని ఏడ్చినవారు ఉన్నారు. మీకో నా అనుభవం చెప్తాను సార్! భార్యపై అనుమానంతో ఆమెను చంపిన ఓ లెక్చరర్‌కు డెత్ పనిస్మెంట్ పడింది. ఆయనకు మంచి ఇంగ్లిష్ వచ్చేది. ఆఫీసులో వచ్చి కూచొని అఫీషియల్ కరెస్పాండెన్స్కు రిప్లైస్ రాసిచ్చేవాడు. ఉరికి ముందు నాతో మనం కలిసి కాఫీ తాగుదామన్నాడు. ఆయన తాగాడు కాని గొంతు పూడుకుపోయి నాకు చుక్క లోనికి పోలేదు. అసలు ఈ ఉరిశిక్షలు ఎందుకున్నాయి. మాకే ఈ శిక్షలెందుకు అనిపిస్తుంది సార్!”
జైలర్ కళ్ళు తుడుచుకున్నాడు.
“ఒక జైలు స్టాఫ్‌ను మరో జైలుకు రెండు రోజులు డిప్యూట్ చేసి ఈ పని కావించవచ్చు కదా! ఎవరికెవరో తెలియదు.” ఓ దారి చూపించినట్లు అన్నాడు మేజిస్ట్రేట్.
” అదీ చేశాం సార్! వస్తామన్నవారు సమయానికి హెల్త్ బాగాలేదని అని తప్పించుకుంటున్నారు. స్టాఫ్ భయపడకున్నా ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు, పోనియ్యరు”
“మరెలాగయ్యా! మీరు చెయ్యరు, బయటివాళ్లను ఇన్వాల్వ్ చేసి కార్యం గట్టెక్కిస్తున్నారు. డబ్బుల ఆశకు చేసినా సొసైటీలో వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. మరి డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళంతా రొటేషన్ పద్ధతిలోనైనా ఈ పని చేయాల్సిందేనని రూలింగ్ తెస్తారా లేక ఎవరివల్ల కావడం లేదని ఉరిశిక్ష విధానం రద్దు చేస్తారా!” అన్నాడు కొంత అసహనంగా.
నా చేతిలో ఏముందన్నట్లు ముఖం పెట్టాడు జైలర్.
“సార్! బాధిత కుటుంబాలు క్షమాబిక్ష పెట్టినా లేదా వారికి సరిపడే నష్టపరిహారం చెల్లించినా ఉరి శిక్ష రద్దయ్యే విధానం కొన్ని అరబ్ దేశాల్లో ఉంది” అన్నాడు అడ్వొకేట్ మెల్లగా.
నాకు తెలుసన్నట్లు మేజిస్ట్రేట్ తల ఊపి, జైలర్ వైపు చూస్తూ “ఆ పిల్లాణ్ణి మాత్రం బలవంతం చేయకండి! ఉరి తీయడం అటుంచి తానే సూసైడ్ చేసుకునేలా ఉన్నాడు” అన్నాడు.
“లేదు, లేద్సార్! అలా అస్సలు చేయం” అని అదేమాట మరోసారి అన్నాడు జైలర్.
‘ద కోర్ట్ ఈజ్ అడ్జర్నెడ్’ అన్న రీతిలో మేజిస్ట్రేటు తల ఊపాడు.
ముందున్న కార్యాన్ని తలుచుకుంటూ జైలర్ పరుగు పెట్టినట్లు వెళ్ళిపోయాడు.
అడ్వొకేట్ బయటికి వచ్చాడు.
అంతా విన్న ఇస్మాయిల్ లోపలి వెళ్లే సాహసం చేయక తల గడపకు ఆనించి రెండు చేతులెత్తి మేజిస్ట్రేటుకు దండం పెట్టాడు.
భుజం మీద చేయి వేసి ఆయన్ని లేపిన అడ్వొకేట్ “ముందు మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పు!” అన్నాడు.
అప్పటికే ఇస్మాయిల్ ఫోన్లో ఇంటి నుంచి ముప్పై మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
“అబ్బా!” అంటున్నాడు కాని ఇస్మాయిల్‌కు మాట పెగలడం లేదు.
అడ్వొకేట్ ఆ ఫోన్ తానే తీసుకొని వారికి జరిగిందంతా చెబుతూ ఇస్మాయిల్ తో కలిసి బయటికి నడిచాడు.
“సార్! మా ఇంటికి మీరు రావాలె సార్! మీ ఫోటో పెట్టుకొని మొక్కుతాం!” అని అడ్వొకేట్ దగ్గర సెలవు తీసుకొని తమ ఊరికెళ్లే బస్సెక్కాడు ఇస్మాయిల్.
“నీ పెళ్ళికి వస్తాను!” అని నవ్వుతూ అడ్వొకేట్ సాగనంపాడు.
21 Responses to “ఈ శిక్ష మాకొద్దు”
కొత్త అంశంపై హృద్యంగా రాసిన కథ. రచయితకు అభినందనలు.
తలారుకు కూడా మనసు మానవత ఉంటుందని , తన సామాజిక జీవనం పట్ల ఆందోళన ఉంటుందని మంచిగా తెలిపారు. ఉరిశిక్షలు రద్దు చేసి పరివర్తన గురించి జీవిత ఖైదు వేసి ఆలోచించాలి.
నర్సన్ గారు ఒక సామాజిక శాస్త్రవేత్త. సమాజ పరిశీలకులు. వీరి కథలు, వ్యాసాలు చదివితే అదొక విజ్ఞాన భాండాగారం అని తెలుస్తుంది.
ఈ కథ ముస్లీం సోదరుల జీవన వైవిధ్యాన్ని కళ్ళకు కట్టిస్తుంది.
రచయితకు శుభాకాంక్షలు.
రచనా శైలి చాలా బాగుంది.. ఎంచుకున్న కథాంశం లో నవ్యత, తండ్రి కొడుకుల అంతర్మధనం చక్కగా వివరించారు అభినందనలు
ఉరి శిక్ష మీద ఇంతకు ముందు కథలు వచ్చినా ముఖ్యంగా తలారుల మీద ఇది భిన్నంగా ఉంది… సమాచారం సేకరించి రాశారు… కొత్త చర్చ కు అవకాశం ఉంది… అభినందనలు.
(ప్రముఖ రచయిత పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి వాట్సాప్ స్పందన)
కథ చాలా చాలా బావుpది. గుoడె బరువెక్కిoది. కళ్ళు నిoడిపోయాయి.
మంచి కథ రాసినందుకు అభినందనలు.🌹🌹🌹
(వాట్సాప్ స్పందన)
కథ చాలా బాగుంది. తలారి జీవితాల్లోని విషాదాన్ని కళ్లకు కట్టేలా వ్రాశారు. తండ్రి కొడుకుల వేదన మనసును మెలిపెడుతుంది.
కథ చాలా చాలా బావుpది. గుoడె బరువెక్కిoది. కళ్ళు నిoడిపోయాయి.
మంచి కథ రాసినందుకు అభినందనలు.🌹🌹🌹
ఈ శిక్ష మాకొద్దు… కథ బాగుంది. సబ్జెక్ట్ ,కొత్త కోణాలు…హైలెట్. కథ కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కథలో కనబడింది. క్లైమాక్స్ లో ఇస్మాయిల్ అడ్వకేట్ కి మొక్కినప్పుడు మాత్రం గుండె చివుక్కుమంది. ప్రతి లైన్ intresting గా చదివాను.
కథ చాలా బాగుంది. నర్సన్ గారు గతంలో రాసిన కథలు కూడా, సబ్జెక్టు కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి లోతైన విశ్లేషణ చేసినవే. అరుదైన వస్తువును అద్భుతంగా మలచిన కథ..
తప్పు చేసినవాడికి శిక్ష పడితే సంబంధిత బాధితులు సంతోషపడడం జరుగుతుంది. కాని ఏ తప్పు చేయకుండా ఆ శిక్షను అమలు చేసే క్రమంలో కార్యాన్ని స్వహస్తాలతో నిర్వహించే తలారీ ఎలాంటి మానసిక క్షోభను అనుభవిస్తాడు. ఈ ఇతివృత్తంపై సాగిన కథనమిది. దీంట్లో వంశపారంపర్యంగా నిర్వహిస్తున్న పనినిని వయసుపైబడిన తండ్రి ఆ పనిని జైలరుగారి సూచన ప్రకారం తన కొడుక్కు అప్పజెప్పి దానిని చేపట్టడానికి వెళ్ళిన సందర్భంలో అటు తండ్రిలో మరియు మొదటిసారిగా ఉరిశిక్ష పనిని నిర్వతించడానికి వెళ్తున్న కోడుకులో మానసికంగా జరిగిన సంక్షోభాన్ని సహజమైనరీతిలో వెళ్ళడించిన తీరు కథకు గట్టి పట్టునందిచ్చింది. రచయిత నర్సన్ తలారీ మనసులో పరకాయ ప్రవేశం చేసి కథను నడిపించిన తీరు అద్భుతం, తలారీగా తను తన విధ్యుక్త ధర్మాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా నిర్వహించే తలారీపై సంఘ పరంగా ఎలాంటి హీనమైన భావన మరియు వెలివేత ఉంటుంటుందన్న దాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు. తలారీలంటేనే కఠిన మనస్కులని అనుకోవడం సరికాదు, వాళ్ళు కూడా సంఘంలో నివసించే సాటి మనుషుల్లాంటివారేనని గుర్తెరగాలి. ఏదేమైనా విపరీతమైన మానసిక క్షోభకు గురిచేసే ఈ ఉరి శిక్ష కార్యక్రమ నిర్వహణకు మానవపరంగా కాకుండా సాంకేతికమైన ఒక విధాన్ని తీసుకువస్తే మంచిది. అడ్వకేటు పాత్ర మరియు మెజిస్ట్రేటు పాత్రల ద్వారా ఇస్మాయిల్ కు ఉపశమనం కలుగజేసిన తీరు పాఠకుల్లో ఆలోచనలను రేకెత్తిస్తుంది. మంచి విషయానికి రూపమిచ్చిన కథనం. బాగుంది. రచయితకు అభినందనలు .
🌿🌿🌿య
విభిన్నమైన కథాంశం మే అయినప్పటికినీ కథ ఉత్కంఠ గా సాగి ఆసాంతం చదివించింది. తండ్రి తండ్లాట, పెళ్లి కాక పోతున్న అంశం ముందుగానే తెలిపి ఇస్మాయిల్ పైన పాఠకుల్లో సానుభూతి పునాది వేశారు. తలారి భావ సంఘర్షణలను చక్కగా చెప్పారు. పగ, ప్రతీకారం లేకుండా , యాంత్రికంగా ఒక మనిషిని చంపడాన్ని నాగరిక సమాజం ఆమోదించక పోవడాన్ని కూడా ఎత్తి చూపారు.
ప్రస్తుత సమాజం లో 50,60 వేల సుపారికే హత్యలు జరుగుతున్నాయి. పరువు , ప్రతిష్టలు అంటూ కన్న పిల్లలనీ, లేదా అవతలి దళిత బహుజన పిల్లలను చంపుతున్న ఒక దయలేని కఠిన బండబారి పోయిన గుండేకాయలున్న కాలం లో మనసున్న హృదయం ద్రవించి తలారులు సైతం ఉంటారని ఈ కథ ద్వారా గుర్తు చేశారు.
ఉరిశిక్షలు రద్దు చేయాలి అనే ఒక మానవీయ చర్చ ఈ కథ ద్వారా చోటు కల్పించారు.
మంచి కథ చదివించారు narsan గారు. అభినందనలు.
కథ బాగుంది. కొత్త అంశాన్ని స్పృశించారు. తలారి జీవితంలోకి వ్యధని కళ్లకు కట్టారు. ఇప్పటికైనా మరణశిక్ష ను రద్దు చేయాలి లేదా శిక్ష అమలును యాంత్రీకరించాలి.
” ఈ శిక్ష మాకొద్దు ” నిజానికి తలారికి శిక్షే..సినిమాలలో తలారి ముఖం చూసిన అనుభవంతో తలారీలు సాధారణ పనిలాగే అనుకునేవాన్ని..
రాజ్యాంగం నిర్ణయించిన హత్య అది..ఏదైనా హత్యే..మానవత్వానికి అదొక సంకట స్థితి..నిజమే ఉద్యోగులు పాప భీతితో బాధ్యతని తప్పించుకుంయున్నది నిజం..ప్రయివేటు వ్యక్తులు చేయనంటే పోయేదెమున్నది..ఆ పాత్రకి తప్పని స్థితి కూడా కథలో సృష్టించబడలేదు..మొహమాటానికి ఒప్పుకున్నట్టే అనిపిస్తున్నది..గతములో తాత ఒప్పుకొని చేసినట్టే ఉంది..
తలారి బాధ..ఉద్యోగుల బాధ..ఉరికి సిద్ధపడుతున్న వ్యక్తి మానసిక స్థితి..ఉరి వేస్తే మనిషి చనిపోతాడు..డా. పరీక్షించడం..ఉద్యోగులు కాళ్ళు పట్టిలాగడం.. మెడ ఎముకలు విరిగిన శబ్ధం గమనించడం..బరువును పట్టి తాడు పొడుగు నిర్ణయించడం..ఇదంతా చట్టం చేసే పైశాచికం..ఈ కథా రచన మరో పార్శ్వం దర్శనమిచ్చింది..ఏదీ ఏమైనా..చాలా మీ పరిశోధన ఉంది ఈ రచన వెనుక..పాఠకుడు తెరుకోవడానికి సమయం పడుతుంది..ఉరి కంటే చనిపోయేవరకు మనిషిని జైలులో ఉంచడం కూడా శిక్ష సరిపోతుందేమో అనిపించింది ..ఈ కథ చదివిన తర్వాత..ఉరి తీస్తే పాపం తగులుతుందనే భావన కంటే..మానవత్వమే ముఖ్యమనే భావనే ముందు..వస్తువు కొత్తది..ఆరంభం బాగుంది ..ముగింపు కొత్త పరిష్కారం చూపింది..తలారికి ఆధునిక సమాజలో ఉన్న వ్యతిరేకత భయంకంటే..మనిషితనమే అగుపిస్తోంది..బూటకపు ఎన్కౌంటర్ ల పేరుతో జరిపే వారు మనుషులేనా..వారిలో ఈ సంఘర్షణ ఉండదా..ఎన్నో ఆలోచనల్ని లెవనెత్తుతోంది కథ.అభినందనలు..
కథ చాలా నచ్చింది. మానవీయ అంశం.
‘ఊరివాళ్లతో ఎంత మంచిగున్నా దూరం దూరమే ఉంటరు. చేతుల ఉరితాడు పట్టుకొని వస్తున్నట్లే భయపడతారు.’ తలారి మనోవేదనను ఎత్తి చూపిన వాఖ్యం.. ఎంతో పరిశీలన శక్తి, ఎదుటి వారి దుఃఖాన్ని అర్థం చేసుకునే తత్వం ఉంటేనే కానీ సాధ్యం కానీ రచన. అభినందనలు.
తలారి జీవితాల గురించి సినిమాల్లో ఇంత విపులంగా చర్చించిన సందర్భాలు లేవు.
ఇది ఏ ఒక్క వర్గానిదో కాదు.
అటువంటి జీవితాలను వదిలించుకోలేక, నెట్టుకొస్తున్న ఎందరో జీవుల వ్యథ.
సంవత్సరానికి ఒకటో, రెండో ఉరిశిక్షలు ఉండొచ్చు. (పరిధిని బట్టి)
ఆ ఒక్క ఉరిశిక్షకు వెళ్ళిన తలారిది మాత్రం సంవత్సరమంతా నరకప్రాయమే.
రచయిత చెప్పినట్లు అతను యముడిలా కనిపిస్తాడేమో…
తెలిసో, తెలియకో ఒక చిన్న తప్పు చేస్తేనే తర్వాత కుమిలికుమిలి బాధపడుతూ ఉంటాం.
మరి పాప పుణ్యాలతో పనిలేకుండా, తప్పొప్పులతో పనిలేకుండా వృత్తిధర్మం అంటూ ఒక వ్యక్తిని చంపడం అనేది అతన్ని ఎంతగా వేధిస్తుందో ఊహకే అందడం లేదు.
రచయిత శ్రీ బి నర్సన్ గారికి, కథకు పట్టాభిషేకం చేసిన తెల్సా వారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ కథ స్థాయి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అనిపించింది.
ధన్యవాదములు.
తలారి జీవితాల గురించి సినిమాల్లో ఇంత విపులంగా చర్చించిన సందర్భాలు లేవు.
ఇది ఏ ఒక్క వర్గానిదో కాదు.
అటువంటి జీవితాలను వదిలించుకోలేక, నెట్టుకొస్తున్న ఎందరో జీవుల వ్యథ.
సంవత్సరానికి ఒకటో, రెండో ఉరిశిక్షలు ఉండొచ్చు. (పరిధిని బట్టి)
ఆ ఒక్క ఉరిశిక్షకు వెళ్ళిన తలారిది మాత్రం సంవత్సరమంతా నరకప్రాయమే.
రచయిత చెప్పినట్లు అతను యముడిలా కనిపిస్తాడేమో…
తెలిసో, తెలియకో ఒక చిన్న తప్పు చేస్తేనే తర్వాత కుమిలికుమిలి బాధపడుతూ ఉంటాం.
మరి పాప పుణ్యాలతో పనిలేకుండా, తప్పొప్పులతో పనిలేకుండా వృత్తిధర్మం అంటూ ఒక వ్యక్తిని చంపడం అనేది అతన్ని ఎంతగా వేధిస్తుందో ఊహకే అందడం లేదు.
రచయిత శ్రీ బి నర్సన్ గారికి, కథకు పట్టాభిషేకం చేసిన తెల్సా వారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ కథ స్థాయి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అనిపించింది.
ధన్యవాదములు.
కథ కన్నీళ్లు పెట్టిచ్చింది.
మనకు తెలియని తలారి మనస్సు.
కుటుంబ పేదరికం, అవసరాలు.
సమాజం వారిని చూసే పద్ధతి.
మనసున్న జైలర్ పడే బాధ.
జడ్జ్ కు సమాజంలోని ఒక అణగారిన వర్గానికి చెందిన, ఎవరికీ పట్టని ఒక తలారి పట్ల ఔదార్యం.
వకీల్ తీసుకున్న చొరవ.
కథ కాన్వాస్ పెద్దది.
ఉరి చుట్టూ తిరిగే కథలు చాలా అరుదు. అందులో ఇంత విస్తృతి ఉన్న కథలు మరీ అరుదు.
కంగ్రాట్స్.
💐💐
ఈ కథా రచనకు అవసరమైన సమాచారం సేకరించడమే పెద్ద పని. తలారి జీవితంపై కథా రాయాలనుకున్నప్పుడు సాధారణంగా మనకు తెలియని విషయాలే ఎక్కువగా ఉంటాయి. రచయిత శ్రమకు తగ్గ ఫలితం కథలో ప్రతిఫలించింది. నర్సన్ గారికి అభినందనలు.
కథ బాగుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన కథను సుఖాంతంగా ముగించినందుకు రచయితకు అభినందనలు .