తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

ధరిత్రి

సలీం
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ

© Telugu Society of America

ఏదో కల. రద్దీగా ఉన్న వీధిలో వెతుక్కుంటూ నడుస్తున్నాను. ఎక్కడా పబ్లిక్ Fటాయిలెట్స్ కన్పించడం లేదు. లఘుశంక తీర్చుకోవాల్సిన అవసరం క్షణక్షణానికీ పెరిగిపోతోంది. ఇబ్బందిగా ఉంది. ఏం చేయా లో తెలియటం లేదు. ఆరాటం. పరుగు. వొళ్ళంతా చెమటతో తడిచిపోయి…

చప్పున మెలకువొచ్చింది. బాత్రూం కెళ్ళాల్సిన అవసరం. మంచానికి పక్కనే ఉన్న స్విచ్ నొక్కి లైట్ వేసి లేచికూచున్నాను. పక్కమీద జయంతి లేదు. గోడగడియారం కేసి చూశాను. రెండూ నలభై. బాత్రూం లో లైట్ వెలగడం లేదు. అంటే తను బాత్రూంలో లేనట్టే. మరి యింత అర్ధరాత్రి ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా అని ఆలోచించాను. కిచెన్లోకెళ్ళిందేమో. ఒక్కోసారి ఫ్రిజ్లో పెట్టాల్సిన కూరలు మర్చిపోయి బైటే పెట్టేస్తో ఉంటుంది ఏ అర్ధరాత్రో గుర్తొచ్చి, కిచెన్లోకి వెళ్ళి వాటిని ఫ్రిజ్ లో సర్దుతూ ఉంటుంది. నేను బాత్రూంకి వెళ్ళొ చ్చాను. అప్పటికీ జయంతి తిరిగిరాలేదు. మంచం మీద తను కప్పుకున్న దుప్పటికానీ, దిండుకానీ లేవన్న విషయం గమనించాను. కిచెన్లోకెళ్ళినా వాటిని తీసుకుని ఎందుకెళ్తుంది అన్న ఆలోచన రాగానే తనని వెతు క్కుంటూ తలుపు తీసుకుని హాల్లోకొచ్చి, లైట్ వేశాను. తను సోఫాలో ప్రశాంతంగా నిద్రపోతోంది. గాఢ నిద్రలో ఉన్నదానికి గుర్తుగా సన్నటి గురక విన్సిస్తోంది.

నాకేం చేయాలో అర్థం కాలేదు. పక్కన తను లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఆ విషయం తనకూ తెలుసు. మరి ఎందుకిలా చేసింది? లేపుదామనుకున్నా. మనసొప్పలేదు. నా బలహీనత కోసం తన నిద్రనెందుకు పాడుచేయాలన్పించి, మళ్ళా బెడ్రూంలోకెళ్ళి, లైట్ ఆర్పకుండానే పడుకోడానికి ప్రయత్నించాను. నిద్ర రావడం లేదు. రాదని నాకు తెలుసు. నాకు చీకటంటే భయం. లైటుంటే నిద్ర పట్టదు. అందుకే పక్కన ఎవరైనా ఉంటే లైటార్పేసి పడుకోగలను.

పెళ్ళయిన కొత్తలో ఉదయం ఐదింటికి జయంతి లేచి యింటి పనులు చేసుకోబోతుంటే “ప్లీజ్ ఆరు వరకు పడుకోవా? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు” అనేవాడిని. మొదట్లో అదంతా తనమీద ప్రేమ అనుకునేది. హైద్రాబాద్లో కాపురం. పెద్దవాళ్ళ అజమాయిషీ లేకుండా యింట్లో మేమిద్దరమే ఉండట౦తో జయంతికి తనకిష్టమైన సమయంలో లేచే స్వేచ్ఛ ఉండేది. నా కోసమని ఆరువరకు పక్కనే పడుకునేది. ఆరు తర్వాత వెల్తురొస్తుంది కాబట్టి పక్కన జయంతి లేకున్నా మరో గంట నిద్ర లాగించేవాడిని.

ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దోడికి పదేళ్ళు వచ్చినా “ఆరువరకూ నా పక్కనే పడుకోవా” అని జయంతిని బతిమాలుకుంటుంటే ముద్దుగా విసుక్కునేది. “ఏంటండీ చిన్న పిల్లాడిలా. పిల్లల్ని స్కూళ్ళకు పంపాలి. వాళ్ళ కోసం, మీ కోసం టిఫినేమైనా చేయాలి. లంచ్ బాక్సులు రెడీ చేయాలి. ఆరువరకు పడుకుంటే పనులెలా అవుతాయి? మీరు కూడా ఐదింటికి లేవడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యానికి కూడా మంచిది” అంటూ క్లాస్ పీకి, లేచి వెళ్ళిపోయేది. ఆ తర్వాత నాకు నిద్ర పట్టేది కాదు. నాకేమో ఉదయం లేటుగా లేవడం అల వాటు. నిద్ర చాలక అవస్థ పడేవాడిని.

మెల్లగా జయంతికి నిజం తెలిసింది. ఇన్నాళ్ళూ తనని ఆరు వరకు నాపక్కన పడుకోమని బతిమాలుకుంది చీకటంటే భయం వల్ల తప్ప అది తన మీద ప్రేమకాదని తెలిసి, “ఈ వయసులో చీకటంటే భయ మేమిటండీ. ఎవరైనా వింటే నవ్విపోతారు. మన పిల్లలు కూడా ఒంటరిగా పడుకోడానికి భయపడరు కదండీ” అంటూ బాగా కోప్పడింది. ఎంత కోప్పడినా నా భయమైతే ఎక్కడికీ పారిపోదుగా. అది నాతోనే నాలోనే తిష్ఠ వేసుకుని కూచుని ఉందిగామరి.

ఒకసారి తను వాళ్ళ పిన్ని కూతురి పెళ్ళికి వెళ్ళాల్సివచ్చింది. పెళ్ళి విజయవాడలో. స్వంత పిన్ని కాదు. దూరపు చుట్టరికం కాబట్టి నేను రానని చెప్పాను. దానికి తోడు ఆఫీస్ లో పని ఎక్కువగా ఉండటం వల్ల శెలవ దొరకడం కూడా కష్టమేనని చెప్పాను. అప్పుడు అబ్బాయి సుధీర్ పదో తరగతిలో, అమ్మాయి స్నేహిత ఎనిమిదో తరగతిలో ఉన్నారు. పిల్లలకు పాఠాలు పోతాయని వాళ్ళని యింట్లోనే ఉంచి తను విజయవాడ వెళ్ళింది.

తను లేకుండా గదిలో ఒంటరిగా ఎలా నిద్రపోవాలో అర్థం కాలేదు. రాత్రి భోజనాల తర్వాత నా గదిలోకెళ్ళి లైటేస్కుని కొద్దిసేపు చదువుకున్నాను. నిద్ర వస్తోంది. లైట్ ఆర్పితేగానీ నిద్ర పట్టదు. లైట్ తీస్తే భయమేస్తోంది. అప్పటివరకు పిల్లలకు నా బలహీనత తెలియదు. నాకు నిద్ర అవరం కాబట్టి పిల్లలకు తెలిసి, వాళ్ళు అపహాస్యం చేసినా తప్పదనుకున్నాను. ఒక రాత్రయితే ఎలాగోలా నిద్ర లేకున్నా సర్దుకుపోవచ్చు. జయంతి మూడు రాత్రుళ్ళు ఉండదు. అన్ని రోజులు నిద్ర లేకుండా ఉంటే నా ఆరోగ్యం ఏమైపోతుంది? నా ఆఫీస్ పని ఏమైపోతుంది?

పిల్లలిద్దరూ హాల్లో చదువుకుంటున్నారు. నేను బైటికి రావడం చూసి “ఏంటి నాన్నా, నిద్ర పట్టడం లేదా” అని అడిగింది స్నేహిత.

“ఔనమ్మా” అన్నాను.

పుస్తకంలోంచి తలయెత్తి నా వైపు ప్రశ్నార్థకంలా మొహం పెట్టి చూస్తున్న సుధీర్తో “నువ్వు చదువు కోవడం అయ్యాక వచ్చి నాగదిలో పడుకోరా” అన్నాను.

వాడు నిర్లక్ష్యపు చూపొకటి విసిరి “నేను నా గదిలోనే పడుకుంటాను. వేరేవాళ్ళ గదిలో నాకు నిద్ర రాదు. నాకు ఒంటరిగా పడుకోవడమే ఇష్టం. వేరే ఎవరైనా పక్కన ఉంటే చిరాకు. నచ్చదు” అన్నాడు.

నాకు అవమానంగా అన్పించింది. స్నేహితనడిగినా అటువంటి పెడసరపు సమాధానం వినవలసి వస్తుందేమోనని వెనక్కి తిరిగి వెళ్ళబోతున్నప్పుడు “నేను పడుకుంటాలే నాన్నా” అంది స్నేహిత.

“పక్కన ఎవరో ఒకరు లేకపోతే నిద్రపట్టదా నాన్నా? భయమా? నేను చూడు నా గదిలో ఒంటరిగానే పడుకుంటాను. చెల్లి కూడా ఒక్కతే పడుకుంటుందిగా. మాకు లేని భయం నీకెందుకు?” అదోలా నవ్వుతూ అడిగాడు సుధీర్.

ఏం సమాధానం చెప్పాలో తెలీక అవస్థపడ్తుంటే నా కూతురు స్నేహితే నన్నాదుకుంది. “మనుషుల్లో రకరకాల భయాలు ఉంటాయని నీకు తెలియదా? మరి నువ్వెందుకు గోడ మీద బల్లిని చూస్తే భయపడి కెవ్వుకెవ్వున కేకలు పెడ్తావు? అదేమైనా డైనోసారా?” అంది వాడితో.

“నువ్వు బొద్దింకని చూసి భయపడ్తావుగా. అదేమైనా అల్లిగేటరా?” అన్నాడు వాడు.

“నేనూ అదే చెప్తున్నా, నాకు బొద్దింకలంటే భయం, నీకు బల్లులంటే భయం. నాన్నకు ఒంటరిగా పడుకోవటమంటే భయం. తప్పేముంది” అంది.

ఆ మూడు రాత్రుళ్ళు నా కూతురి దయ వల్ల హాయిగా నిద్రపోగలిగాను.

ఈ విషయాలన్నీ తెలిసిన జయంతి ఈ రోజు నన్ను ఒంటరిగా వదిలేసి హాల్లోకెళ్లి పడుకోవటంలో అర్థం ఏమిటి? నాకు నిద్ర పట్టదని తెలిసికూడా అలా వెళ్ళిపోవడం దుర్మార్గం కాదా? ఒకప్పుడు నవనీతం లాంటి ఆమె మెత్తటి మనసు ఇప్పుడు శిలాసదృశ్యంగా మారిపోయిందా? మాకు పెళ్ళయి ఇప్పటికి నలభై ఐదేళ్ళు. నాకు పాతికేళ్ళ వయసున్నప్పుడు జయంతితో పెళ్ళయింది. నాకంటే తను నాలుగేళ్ళు చిన్నది. ఈ వయసులో నన్నిలా హింస పెట్టడం న్యాయమా? ఎందుకిలా శిక్షిస్తోంది?

నా ఆలోచనలు మళ్ళా ఎక్కడెక్కడో తిరగనారంభించాయి. పాతవిషయాలు ఏమైనా గుర్తుపెట్టుకుని నాపైన కక్ష తీర్చుకుంటోందా? నా బలహీతన తనకు తెలుసుకాబట్టి దానిమీదే దెబ్బ కొడ్తోందా? మా మధ్య చోటుచేసుకున్న చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద పెద్ద తగాదాల దాకా గుర్తుకు రాసాగాయి. మొగుడూ పెళ్ళాల మధ్య గొడవలు లేకుండా ఏ సంసారమైనా ఉంటుందా? మేమైనా ఒకట్రెండు రోజులు పోట్లాడుకుని మూడో రోజు కలిసిపోయేవాళ్ళంగా.

బహుశా జయంతి కలిసిపోయినట్టు నటించిందేమో, జరిగిన విష యాలన్నీ మనసులో ఏ మూలో దాచిపెట్టుకుని, ఇప్పుడు తనకవకాశం వచ్చింది కాబట్టి బదులు తీర్చుకుంటుందేమో! ఏ గొడవ వల్ల తను తీవ్రంగా గాయపడి ఉంటుందా అని ఆలోచించాను.

ఐనా ఈ వయసులో నాపైన పగా ప్రతీకారాలేమిటో నాకర్థం కావడం లేదు. నాకిప్పుడు డెబ్బయ్ యేళ్ళు. పిల్లలిద్దరికీ ఎప్పుడో పెళ్ళిళ్ళయిపోయాయి. అబ్బాయి అమెరికాలో స్థిరపడ్డాడు. వాడికి గ్రీన్ కార్డ్ కూడా వచ్చింది. స్నేహిత భర్తతో కలిసి బెంగుళూర్లో సాఫ్ట్వేర్లో పని చేస్తోంది. మాకు ముగ్గురు మనవళ్ళు, ఒక మనవరాలు. వాళ్ళూ పెద్దవాళ్ళయిపోయారు. పెద్ద మనవడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మూడు బెడ్రూంల మా ఫ్లాట్లో ఉండేది నేనూ, మా ఆవిడే. ఈ వయసులో పాత విషయాలన్నీ మర్చిపోయి ఒకరికొకరు తోడుగా హాయిగా బతకాల్సింది పోయి ఇలా వేర్వేరుగదుల్లో పడుకోవటం ఏమిటి? నాకు బాగా కోపం వచ్చింది. ఉదయం జయంతి లేచాక తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాను.

నిద్ర ఎలాగూ లేదు కాబట్టి మళ్ళా ఆలోచనల్లో మునిగిపోయాను. ఉదయం అయిదయింది. మరో పది నిమిషాల్లో జయంతి లేచి పనులు చేసుకుంటున్న శబ్దం వినపడింది. తను అంత ఉదయాన్నే లేచి చేయాల్సిన పనులేమీ లేకున్నా అలవాటుకొద్దీ లేచి, ఆరులోపలే టిఫినూ కాఫీ తయారుచేసి పెట్టేస్తుంది.

నేను హాల్లోకొచ్చి సోఫాలో కూచోవటం చూసి “అప్పుడే నిద్ర లేచారా? కాఫీ చేసుకురానా?” అంది జయంతి.

“అసలు నిద్ర పోతేనేగా!” అన్నాను కోపంగా.

“ఏమైంది? రాత్రి రెండింటికి నేను బైటికొచ్చేసమయానికి గురకపెట్టి నిద్రపోతున్నారుగా,” అంది.

“అదే. ఎందుకు నన్ను ఒంటరిగా వదిలొచ్చావు? నీకు తెలియదా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని. రెండున్నరకు బాత్రూంకని లేచి చూసుకుంటే నువ్వు మంచం మీద లేవు. అప్పటినుంచి జాగారమే”

“నాకు లోపల నిద్ర పట్టడం లేదు. కంటినిండా నిద్రపోయి ఎన్నిరోజులైందో. అందుకే మధ్యరాత్రి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నా”

“లోపల ఎందుకు నిద్రపట్టడం లేదు?”

“ఈ మధ్య ఎందుకో మనిషి పక్కనుంటే నిద్రపట్టడం లేదు. ఒంటరిగా పడుకోవాలనిపిస్తోంది.”

“అదేమిటి? ఇన్నేళ్ళూ నా పక్కన పడుకునేగా నిద్రపోయావు. ఇదేం కొత్త అలవాటు?”

“ఏమోనండీ. బహుశా నాకున్న థైరాయిడ్ సమస్య వల్లనుకుంటాను. పక్కనెవరైనా ఉంటే చిరాగ్గా ఉంటోంది. ఉత్తుత్తినే కోపం వస్తోంది. నిద్ర పట్టిచావడం లేదు. ఈ రోజునుంచి నేను వేరే గదిలో పడుకుంటా. మీ కోసమని నా నిద్రను త్యాగం చేయలేను. ఇప్పటివరకు చేసింది చాలు”

నా గుండెల్లో రాయి పడింది. “అమ్మో! అలా అనకు. నాకు ఒంటరిగా నిద్రపట్టదు.” అన్నాను.

“అది మీ సమస్య. మీరే దాన్నుంచి బైట పడాలి. నేనేం చేయలేను” అంటూ మరోమాటకు తావివ్వ కుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది.

రాత్రి రెండు తర్వాత నన్నొదిలొచ్చి సోఫాలో పడుకున్నందుకు పోట్లాడుదామనుకుంటే ఇప్పుడు మొ దటికే మోసమొచ్చేలా అన్పించి ఆమె వెనకే నేనూ కిచెన్లోకి వెళ్ళాను.

“మనసులో నామీద ఏదో కక్ష పెట్టుకుని ఇలా సాధిద్దామనుకుంటున్నావు కదూ?” అన్నాను.

“మీ ఇష్టం. మీరేమైనా అనుకోండి. ఈ విషయంలో నాకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు” అంది.

నా చెవుల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్ళ కాపురంలో జయంతి ఎప్పుడూ ఇంత నిర్దయగా మాట్లాడి ఎరుగదు.

“ప్లీజ్ జయా. అలా మాట్లాడకు నేను హర్ట్ అవుతాను. నాకు నిద్ర లేకుండా చేయకు. గతంలో ఎప్పుడైనా నిన్ను బాధించి ఉంటే, అనకూడని మాటేదైనా అని నీ మనసుని గాయపర్చిఉంటే నన్ను క్షమించు” అన్నాను.

“మీరు ఎన్ని సారీలు చెప్పినా, నాకాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా నా నిర్ణయం మారదు. నేను ఈ రోజు నుంచి మీతో కలిసి పడుకోను. వేరేగదిలో పడుకుంటా, ఒంటరిగా. ఇందులో మార్పుండదు” అంది.

చప్పున నాకు పౌరుషం వచ్చింది. ఎంత మాటంది! కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా వినదా? ఆమె కాళ్ళు పట్టుకోవాల్సిన ఖర్మ నాకేమీ పట్టలేదు. పక్కన ఎవ్వరూ లేకుండా నిద్ర పోలేనా. పోగలను. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. కొన్ని రోజులు ఒంటరిగా పడుకుంటే చివరికదే అలవాటవుతుంది. దానికోసం ఈవిడ్ని దేబిరించాల్సిన అవసరం లేదు.

మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకోడానికి ప్రయత్నించాను. నాకు పగటిపూట నిద్ర అలవాటు లేదు. ముప్పయ్ ఐదేళ్ళు కేంద్రప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయడం వల్ల పగటినిద్ర అలవాటు కాలేదు. కానీ ఇప్పుడు అలవాటు చేసుకోవడం మంచిదనిపిస్తోంది. పగలు రెండు మూడు గంటలు నిద్రపోతే రాత్రి నిద్ర తక్కవైనా సరిపోతుంది అనుకుని చాలాసేపు ప్రయత్నించాను. నిద్ర రాలేదు.

రాత్రి తొమ్మిదింటికే జయంతి పక్కగదిలోకెళ్ళి పడుకుంది. నేను నా గదిలో.పది దాటింది.పదకకొండయింది. బెడ్లైట్ వెలుగులో పడుకోడానికి ప్రయత్నించా. కళ్ళు మూస్తేచాలు ఏవేవో నీడలు కదలాడి భయపెడ్తున్నాయి. దాన్ని ఆర్పేసి, బాత్రూంలో లైట్ వేసి, గదిలోకి పదిశాతం వెల్తురు పడేలా తలుపుని కొద్దిగా తెరిచిఉంచి, నిద్ర కోసం తన్నుకులాడాను. నిద్ర కరుణించలేదు. రాత్రంతా జాగారమే!

మరుసటి రోజంతా కళ్ళు నిప్పు కణికల్లా మండుతూనే ఉన్నాయి. తల భారంగా ఉంది. రాత్రి మూడు తర్వాతకొంత సేపు నిద్ర పట్టింది. అది కూడా గాఢనిద్ర కాదు. మగత నిద్ర. ఐదున్నరకే మెలకువొచ్చింది. మళ్ళా నిద్ర పడితే ఒట్టు.

రోజూ ఇదొక ప్రహసనంలా మారింది. నిద్ర కోసం చేసే పోరాటం. ప్రతిసారీ ఓడిపోవడమే. కొద్ది సేపు నిద్ర పోవడం. మళ్ళా భయంతో ఉలిక్కి పడిలేవడం. అలా రోజుకు మూడు నాలుగు గంటలకు మించి నిద్ర పోవడం లేదు.

సిగ్గూ అభిమానం వదిలేసి మరోసారి జయంతిని బతిమాలుకున్నాను. ససేమిరా అంది. నా జయంతి ఇంత కఠినాత్మురాలిగా మారడమే నాకు మింగుడు పడటం లేదు. బెంగుళూర్లో ఉన్న స్నేహితతో ఫోన్లో మాట్లాడి వాళ్ళమ్మ చేస్తున్న నిర్వాకం గురించి ఏకరువు పెట్టాను. మరునాడు ఉదయం ఫ్లయిట్‌‌‌కి నా కూతురు వచ్చేసింది.

“నామీద మీ కూతురికి ఫిర్యాదు చేశారన్మాట. చేసుకోండి. మీ ఇష్టం వచ్చినవాళ్ళకి ఫిర్యాదు చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం ఎవ్వరు చెప్పినా వినను. ఆ దేవుడు దిగొచ్చినా వినే ప్రసక్తే లేదు” అంది జయంతి.

స్నేహిత చిన్నప్పటినుంచీ నా పార్టీనే. దానికి నేనంటే ప్రాణం. అది వాళ్ళమ్మతో పోట్లాడింది. “అమ్మా! నాన్న మొహం చూశావా నిద్రలేక ఎలా వాడిపోయిందో. కళ్ళ కింద ఏర్పడ్డ నల్లటి చారలు చూశావా? అంతా నీ వల్లనే. ఈ వయసులో సరైన నిద్ర లేకపోతే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా” అంది.

“ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. నాకూ నిద్ర కావాలి కదా. నిద్ర తక్కువైతే నా ఆరోగ్యం కూడా పాడవుతుందిగా. అందుకే నాకు బాగా నిద్ర ఎక్కడ పడ్తుందో అక్కడ పడుకుంటున్నా” అంది జయ.

“పోనీ అమ్మా. నాన్నను కూడా నీ గదిలోనే పడుకోనీ. ఆయనకు ఒంటరిగా ఉంటే నిద్ర పట్టదని తెలుసుగా?” అంది స్నేహిత.

“నాకు ఒంటరిగా పడుకుంటేనే నిద్ర పడ్తోందీ మధ్య. ఆయన కోసం ఇప్పటివరకూ చేసిన త్యాగాలు చాలు. నా నిద్రను త్యాగం చేయలేను” అంది.

స్నేహిత ఉన్న నాలుగు రోజులు వాళ్ళమ్మను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించింది. బతిమా లినా వినకపోతే అమ్మ అని కూడా చూడకుండా తిట్టింది. కోప్పడింది. ఏంచేసినా జయంతి తన మొండి పట్టుదలని మాత్రం వదలకపోవడంతో, “నీతో యింకెప్పుడూ మాట్లాడను చూడు” అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది.

జయంతి ప్రవర్తన పదునైన కత్తిలా నా గుండెని ఛిద్రం చేస్తోంది. తను మనసులో ఏదో పెట్టుకుని సాధిస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. సుధీరికి ఐదేళ్ళ వయసున్నప్పుడు మా మధ్య జరిగిన పోట్లాట గుర్తొచ్చింది. రెండ్రోజుల తర్వాత సుధీర్ పుట్టినరోజుంది. దాన్ని ఎలా జరపాలనే విషయంలోనే గొడవ మొదలైంది. అప్పుడు మా అత్తామామలు కూడా మా యింట్లోనే ఉన్నారు. నేను పెద్దపెద్దగా అరుస్తుంటే జయంతి ఎలా తల్లడిల్లిపోయిందో! “ప్లీజ్ అలా అరవకండి. మా అమ్మానాన్న వింటే బావుండదు. వాళ్ళు బాధపడ్తారు,” అంటూ ఎలా బతిమాలుకుందో. ఐనా మూర్ఖంగా “వింటే విననీ. నాకేంటి!” అన్నాను. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నందువల్ల తను నోరెత్తకుండా మౌనంగా రోదిస్తూ ఉండటంతో మరింత రెచ్చిపోయి రాత్రి చాలా సేపటివరకు అరుస్తూనే ఉన్నాను. ఆ కోపంలో నోటికొచ్చినట్లు తిట్టాను కూడా.

ఇంతకు ముందు ఎన్ని గొడవలు జరిగినా మా అత్తామామల సమక్షంలో కాదు కాబట్టి తను మర్చి పోయి ఉంటుంది లేదా క్షమించి ఉంటుంది. కానీ ఇది తన తల్లిదండ్రులకు తెలిసి, వాళ్ళ మానసిక క్షోభకు కారణమైంది కాబట్టి అది మనసులో పెట్టుకుని ఇప్పుడు నా మీద కక్ష తీర్చుకుంటున్నట్టుంది.

నాకూ పట్టుదల పెరిగింది. రెణ్ణెల్ల ప్రయత్నం తర్వాత మెల్లమెల్లగా నా బలహీనత మీద విజయం సాధించాను. ఇప్పుడు ఒంటరిగా పడుకున్నా నిద్రాదేవి కరుణిస్తోంది. లైట్ ఉన్నా నిద్ర పడ్తోంది. చీకట్లో భ యం వేయడం లేదు. “నువ్వేమిటి నన్ను సాధించేది? నీకా అవకాశం ఇవ్వను. చూశావా ఇప్పుడెలా నిద్రపడ్తోందో” సోఫాలో నా పక్కన కూచుని కాఫీ తాగుతున్న జయంతితో అన్నాను. తను బదులేమీ ఇవ్వకుండా విసురుగా లేచి వెళ్ళిపోయింది. నేను విజయగర్వంతో నవ్వుకున్నాను.

మరో ఆర్నెల్లు గడిచాయి. ఓ రోజు ఉదయం లేచి, ఎప్పటికి మల్లె సోఫాలోకొచ్చి కూచున్నా. వంట గదిలోంచి శబ్దాలేవీ విన్పించకపోతే అనుమానమొచ్చి తన గదిలోకెళ్ళి చూశాను. యింకా నిద్రపోతూనే ఉంది. జ్వరమేమైనా వచ్చిందేమోనని వొళ్ళు తాకి చూశాను. చల్లగా మంచు గడ్డలా తగిలింది. తను శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయిందని అర్థమై భోరున ఏడ్చాను.

పిల్లలిద్దరూ వాళ్ళ కుటుంబాలతో సహా దిగిపోయారు. కర్మకాండలన్నీ పూర్తయ్యాక, సుధీర్ అమెరికా వెళ్ళిపోయాడు. స్నేహిత కూడా తిరిగి వెళ్ళబోయే ముందు నా దగ్గరకొచ్చి కూచుంది. “నాన్నా! నీకో విషయం చెప్పాలి. నేను అమ్మతో పోట్లాడి, యింకెప్పుడూ మాట్లాడనని వెళ్ళిపోయాక అమ్మ నాకో ఉత్తరం రాసింది. నీకు చెప్పొద్దని అమ్మ నాదగ్గర మాట తీసుకున్నందువల్ల యిన్నాళ్ళూ ఈ విషయం దాచిపెట్టాను. ఆ ఉత్తరం నీకిద్దామని తెచ్చాను” అంటూ నా చేతిలో ఉత్తరం పెట్టి వెళ్ళిపోయింది.

నేను ఆతురతగా ఉత్తరం తెరిచి చదవసాగాను. “స్నేహితా, నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయావు కదూ. మీ నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో ఆయన మీద నాకంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది తల్లీ. నేను పక్కన లేకపోతే ఆయన పడుకోలేడని తెలుసు. ఐనా కావాలనే నేను వేరే గదిలో పడుకోవటం మొదలెట్టాను. మీ నాన్నకు ఒంటరిగా పడుకోవడం అలవాటు కావాలనే అలా చేశాను తప్ప ఆయన మీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతో కాదు. ఆయనతో జరిగిన గొడవలు, తగాదాలు, ఆయన తిట్టిన తిట్లు, ఎప్పుడో మర్చి పోయాను. నేను ఏదో విషయంలో గాయపడి ఆయన్ని క్షమించకుండా సాధిస్తున్నానని మీ నాన్న అనుకుంటున్నారు. క్షమించడంలో ఆడవాళ్ళని ధరిత్రితో సమానంగా పోలుస్తారు కదా. నిజమే. లేకపోతే ఎనభై శాతం మగవాళ్ళ జీవితాలు దుర్భరమైపోయేవి కదూ. వాళ్ళ కోపాల్ని, తగాదాల్ని, తిట్లనీ, సహించి, సర్దుకుపోయి, క్షమించబట్టే సంసారాలు సజావుగా సాగుతున్న విషయం ఈ మగవాళ్ళకు ఎప్పుడర్థమౌతుందో!

మీ నాన్న కంటే నేను ముందు పోతే ఒంటరిగా నిద్ర పట్టని అలవాటు ఓ వైపు, నేను దూరమైన దుఃఖం మరో వైపు. ఈ రెండింటినీ తట్టుకోలేడని భయమేసి, ఇలాచేశాను తల్లీ. మరణాన్ని ఎవరూ ఆపలేరుగా. ఆ సమయం వచ్చినపుడు వెళ్ళక తప్పదు. ఒకరు ముందూ ఒకరు తర్వాత. అంతే. అందుకే ఆయన్లో పట్టుదలనీ, పౌరుషాన్ని రెచ్చగొట్టి, ఒంటరిగా నిద్రపోయేలా బలవంతంగా అలవాటు చేస్తున్నాను. అవసరం మనిషి చేత అద్భుతాలు చేయిస్తుంది. అటువంటి అవసరాన్ని కల్పించాను. అంతే. నన్ను ఆయనెలాగూ అర్థం చేసుకోలేడు. నువ్వయినా అర్థం చేసుకుంటావు కదూ. ఇట్లు, మీ అమ్మ!”

ఉత్తరం చదవడం పూర్తి కాగానే నాకళ్ళు ఉప్పు కయ్యలుగా మారిపోయాయి.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.