తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

కొలిమి

ఎస్. నాగేందర్
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ
© Telugu Society of America

కొలిమి భగభగ మండుతున్నది. బొగ్గులు ఎర్రగా కాలుతున్నాయి. గాలి కొట్టే తిత్తుల దగ్గర కూర్చుని అదేపనిగా గాలి గొడుతున్నాడు ఓదేలు. నిప్పులలో నుండి ఎర్రగా కాలిన కర్రు తీసి పట్టకారుతో పట్టుకున్నాడు భద్రాచారి “ఓదేలు బావా, బాదు” అన్నాడు.

తీరిగ్గా కూర్చుని పొగాకు నములుతున్న ఓదేలు తుపుక్కున దూరంగా ఉమ్మేసి సమ్మెట అందుకున్నాడు. బరువైన సమ్మెటతో బలంగా దెబ్బలు వేస్తున్నాడు ఓదేలు. కర్రును అటు ఇటు తిప్పి పట్టుకుంటూ, తనకు అవసరమైన విధంగా కాలుస్తున్నాడు భద్రాచారి.

భూమిని పెకిలించి దున్న గల బలమైన ఆ ఇనుప కర్రు, ఆయన చేతిలో మైనం ముద్దలాగా వంగి పోతున్నది. భద్రాచారి ఇంటి ముందు కొట్టంలో అతని కొలిమి ఉన్నది. ఆ వూరి రైతుల వ్యవసాయపు పనిముట్లు అక్కడే తయారవుతాయి. నాగలి,దంతె, గొర్రు,గుంటక, మొదలైనవి అన్నీ ఆయనే తయారు చేసి అమర్చుతాడు.

పంటలు పండిన తర్వాత, రైతులు చారికి గింజలు కొలుస్తారు. మారుతున్న కాలంతో పాటు, వ్యవసాయ పద్ధతిలో కూడా మార్పులు వస్తున్నాయి. మల్లయ్య గౌడు చేతిలో ఇనుప ముక్క పట్టుకొని అక్కడికి వచ్చాడు.

“భద్రయ్య మావా, నీతో చిన్న పని పడిందే” చారి తన చేతిలో ఉన్న ఎర్రటి కర్రును, పక్కనే ఉన్న నీటి గుంటలో ఉంచాడు. చుర్రుమని శబ్దం వచ్చింది. దాన్ని పక్కన పడేస్తూ అన్నాడు చారి.

“రా మల్లయ్యా, బాగున్నవా? ఏందీ మద్దెన అసలే కనిపిస్తలేవు. ప్రాణం బాగుంటాందా?” అంటూ పరామర్శించాడు.

“మైసమ్మ తల్లి సల్లంగనే సూస్తాంది. తాళ్ళెక్కే పనిమీద పడి వస్తాలేను. కానీ, ఏంది మావా, పొద్దు గూకేలన్నా తాల్లల్లకు రావొచ్చు కదనే, కల్లు తాగి పోదువు”

“ఎక్కడ తీరతాందిరా, ఈ పనులే సరిపోతానయ్”

“పనులు ఎప్పుడూ ఉండేయే గని, ఈయాలరా. మాంచి పోతు తాడి కల్లు తీసి పెడత. మాంచి గుమ్ముగుంటది” అన్నాడు మల్లయ్య గౌడు.

సమ్మెట చేతిలో పట్టుకున్న ఓదేలు, అరిచేతులు చూసుకుంటూ, “అవున్రా మల్లయ్యా, ఈ మధ్యన మంచి కల్లు తాగక చాలా రోజులు అయిందిరా” అన్నాడు.

“ఇంకేంది బాబాయ్, భద్రయ్య మామను తీసుకరా! గుమ్మయిన కల్లు తాగుదురుగని”

చారి కొలిమి లోని నిప్పులను ఎగదోస్తూ అన్నాడు.”గట్లనే వస్తం వస్తంగని, నువ్వెందుకొచ్చినవు?”

“పనేమున్నది మామా, చిన్నదే. పోయిన సారి, కత్తులు సరిపిచ్చినప్పుడు పెద్ద కత్తి అరిగిపోయిందంటివి కద. మా ఇంట్ల పట్టాముక్క ఉంటె పట్టుకచ్చిన. కత్తికి పనికొస్తదో లేదో చూడు” అంటూ, తన చేతిలోని ఇనుప ముక్క చారి చేతికి ఇచ్చాడు మల్లయ్య.

చారి ఆ ఇనుప ముక్కను అటు ఇటు చూసి, సుత్తితో కొట్టి పరీక్ష చేశాడు. “ముక్క చాలా బాగుందిరా మల్లయ్య, కానీ ఇప్పుడు జర్రంత పనున్నది. మద్దేన్నం రా” అని అన్నాడు.

“సరే గట్లనే” అంటూ వెళ్లిపోయాడు మల్లయ్య.

పల్లెల్లో కులాలు,మతాలు, వేరైనా, మనుషుల మధ్య ఆప్యాయతలు ఉంటాయి. ఒకరింట్లో కష్టమనా, కార్యమైనా వస్తే, అందరూ పోగవుతారు, ఆపేక్షలు పంచుకుంటారు.

కష్టం వచ్చిన ఇంట్లో నలుగురు పోగయి ఏడిస్తే గుండెలోని బాధ తగ్గిపోతుంది. త్వరలోనే మామూలు మనిషి అవుతారు. అదే బాధ గుండెలో గూడు కట్టుకొని ఉంటే డిప్రెషన్కు గురయ్యే ప్రమాదం ఉన్నది. ఈ సైకాలజీని పల్లె ప్రజలకు ఎవరూ చెప్పలేదు. జీవితమే నేర్పింది. ఆ మాటకొస్తే మనిషి జీవితంలో ప్రతి ఎదుగుదలకు కారణం అనుభవమే.

భద్రాచారి చల్లారిన కర్రు మళ్ళీ కొలిమిలో పెట్టాడు. ఎర్రగా కాలిన తర్వాత, సుత్తితో కొట్టి సరిచేస్తాడు.

తిత్తితో గాలి కొడుతున్న ఒదేలుకు 70 ఏళ్ళుంటాయి. వయసులో ఉన్నప్పుడు బరువైన, బలమైన పనులు చేసేవాడు.

పల్లెల్లో ప్రతి వాళ్లు చేతనైనంత వరకూ, చనిపోయే వరకూ, ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. అతని భార్య ముసలిదైపోయినా, నెమ్మదిగా నడుస్తూ ఊరి బయట కొండ వైపు వెళ్ళి, కాసిని ఎండుపుల్లలు పోగేసి తీసుకువస్తుంది.

చారి కర్రును కొలిమిలో పక్కకు తిప్పాడు. కొలిమి మండుతున్నది.

చారి భార్య, కమలమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడింది. “ఏమయ్యా,ఇంటున్నవా?” చారికి వినిపించలేదు. కొలిమిలో బొగ్గులు వేశాడు. భార్య అతని దగ్గరికి వచ్చింది. తలెత్తి ఆమె వైపు చూసాడు చారి ఏమిటన్నట్లుగా.

ఏదో అత్యవసరమైతేనే ఆమె కొట్టంలోకి వస్తుంది.

“బడిపంతులు మన పట్టే గాడిని కొట్టిండట”

“చదవకుంటే కొట్టిండేమోనే?”

వాళ్లనే చూస్తున్న ఒదేలు, పొగాకు ముక్క తెంపి దవడకు పెట్టాడు.

గంయ్యిమన్నది కమలమ్మ. “నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. గందుకే రాత్రి బడికి పోయి చదువుకో అన్నా. ఇంటె గదా?”

ఆమె కాస్త చదువుకున్నది. చదువుకున్న భార్య అని కమలమ్మను బాగా గారాబం చేస్తాడు చారి. వాళ్లకు ఒక్కడే కొడుకు. పేరు పట్టాభిరామ్. వాడి చదువు సంధ్యలు, సంరక్షణ విషయాలు భార్యకే వదిలేశాడు చారి.

“ఇప్పుడేమైందే” అడిగాడు చారి.

“ఏం గావాలె, పిల్లగాన్ని పంతులు కొట్టిండంటే నిమ్మకున్నవేంది?”

ఏం చేయమన్నవే?”

“అడగవా? ఇయాల కొడతడు, రేపు చంపుతడు. గట్లనే ఊకుంటావా?”

భద్రాచారి ఏమీ మాట్లాడలేదు. సుత్తి తీసి ప్రక్కకు పెట్టాడు. సాగదీసింది కమలమ్మ. “టీవీలల్ల చూస్త లేవా, పంతుల్లు పిల్లలను ఎంత గోరంగ కొడుతున్నారో. అసలు ఆయన చదువు చెప్పనీకి ఉన్నడా లేక పోలీసుల లెక్క, కొట్టనీకి ఉన్నాడా?”

చారికి నిజమే అనిపించింది.

“ఇద్యా అక్కు సట్టమొచ్చింది, తెల్వదా? పిల్లల్ని కొడితే, పంతుల్ని జేల్ల పెడతరు. పట్టాభిని కన్నది మనం. నేనే ఇంతవరకు చెయ్యి చేసుకోలేదు, గాయన కొట్టుడేంది?”

తల్లి ప్రేమ అర్థమైంది చారికి. “పంతులుకు ఏం పన్లేదా? ఎందుకు కొట్టిండట?” అడిగాడు.

“ఎందుకయితేఏంది? అసలు కొట్టుడెందుకు, చదువు చెప్పాలెగని. పొయ్యి అడుగుతావా లేదా?” ఆ తల్లికి కొడుకంటె అమితమైన ప్రేమ.

ఆమె గొడవకు చారి తట్టుకోలేక పోయాడు. లేచి నిలబడ్డాడు.

ఒదేలుతో “రా బావా! బడిదంక పోయొద్దం” అంటూ వెంటబెట్టుకొని ముందుకు కదిలాడు.

ఆ వీధి గుండా వూరి చివరకు వెళితే బడి వస్తుంది. దారిలో, గుడి ముందర కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు.

“బావా, మన పట్టాభి ఈడ్నే ఉన్నడు. వాన్నికూడ తీస్కపోదం” అన్నాడు ఒదేలు.

“రారా పట్టాభి, బడికి పోదాం రా” పిలిచాడు చారి.

“నేను రానుపో. సారు నన్ను కొట్టిండు” మొండిగా అన్నాడు పట్టాభి.

“ఎందుగ్గొట్టిండ్రా?”

“ఏమో”

పంతులు మీద బాగా కోపం వచ్చింది చారికి. వెళ్లి బాగా దులిపాడు పంతులును.

“నువ్వు ఎవరు, అసలు నా కొడుకును కొట్టడానికి?” అంటూ చడామడా అరిచాడు.

పంతులు నిశ్శబ్దంగా విన్నాడు. చారి అరవడం అయిపోయాక నెమ్మదిగా చెప్పాడు. “మీ వాడు వారంరోజుల నుండి బడికి రావడం లేదు. గుడి దగ్గర, చెరువు గట్టు మీద ఆడుతున్నాడని పిల్లలు చెబుతున్నారు. ఈరోజు పట్టాభి వస్తే చెవి మెలేసి గట్టిగా చెప్పాను, మీ నాన్నను తీసుకురా అని. కావాలంటే పిల్లలను అడుగు” అన్నాడు పంతులు.

“అవును నిజమే” అన్నారు పిల్లలు.

పంతులు కొట్టలేదని అర్థమైంది చారికి. ఐనా బింకంగా, “రాకుంటే రాకపోయిండు, మా పట్టాభిని ఏమీ అనొద్దు” అన్నాడు.

చిరునవ్వు నవ్వాడు పంతులు. “సరే మీ ఇష్టం” అంటూ దండం పెట్టాడు చారికి.

ఇంటికి రాగానే కమలమ్మ అడిగింది, ఏం జరిగిందని. పంతులు మీద గట్టిగా అరిచానని, ఇక మీద పట్టాభిని ఏమీ అననని, దండం పెట్టాడని చెప్పాడు చారి. కమలమ్మకు బాగా సంతోషమైంది.


నోట్లో పొగాకు తుపుక్కున ఉమ్మేసాడు ఒదేలు. చారి కొలిమి దగ్గర కూర్చున్నాడు. మల్లయ్య తెచ్చిన ఇనుప ముక్కను, సాన మీద పెట్టి, “దీన్ని కత్తిగా మలువు చారి బావా” అన్నాడు ఒదేలు.

“కొలిమిలో పెట్టి కాలువు బావా” అన్నాడు చారి నవ్వుతూ.

“ఇంత మంచి పట్టాముక్కను ఎర్రటి నిప్పుల్లల్ల ఏసి కాల్చబుద్ధి అయితలేదు బావా” అన్నాడు ఒదేలు.

చారి పకపకా నవ్వాడు. “అరె నీ దిమాగ్గిట్ల కరాబైందా, దాన్ని కాల్వకుండ, సుత్తె తోటి కొట్టకుండ, సాగదీయకుండ కత్తి ఎట్లైతది?” అన్నాడు చారి నవ్వుతూ.

సరదాగా పకపక నవ్వుతూ, “బావా, దానికింత పసుపు, కుంకుమ జల్లి, దండం పెట్టు బావ, మంచి కత్తి అయితది, హ హ హ” అన్నాడు నవ్వుతూ చారి.

ఒదేలు సూటిగా చారి ముఖం లోకి చూసి, “నీ కొడుకు బడికి పోకుండా, వాడు మాట వినకుండా ఉంటే, పంతులు చదువు ఎట్ల చెబుతడు, వీడు ఉద్యోగం ఎట్ల చేస్తడు, ఎట్ల బాగుపడతడు” అన్నాడు ఒదేలు తాపీగా, పొగాకు ముక్క తుంపి,దవడకు పెడుతూ.

నవ్వడం ఆపాడు చారి.

అతని మెదడులో ఎక్కడో కదిలినట్లుగా అనిపించింది. మండుతున్న కొలిమి వైపు అలాగే చూడసాగాడు. ఇనుప ముక్కను నిప్పులలో ఎర్రగా కాల్చితేనే, దాన్ని సుత్తితో కొట్టి, పదునైన కత్తి లాగా తయారు చేయగలుగుతాడు తను. అలాగే బడికి పోతేనే, చదువుకుని ప్రయోజకుడు అవుతాడు పట్టాభి. అతనిలో ఆలోచన ఆరంభమైంది. తన భార్య మితిమీరిన గారాబంతో, మిడిమిడి జ్ఞానంతో కొడుకును పాడు చేస్తున్నది. హక్కుల గురించి మాట్లాడుతున్నది. కానీ, బాధ్యతలను మరిచి పోయింది. గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు చారి.

కొలిమిలో నుండి మిణుగురులు పైకి లేస్తున్నాయి.

ఆ ఇనుప ముక్కను ఎర్రగా కాల్చి, సుత్తితో కొట్టి, సాగదీసి, పదునైన కత్తి గా తయారు చేశాడు చారి. వెంట్రుకను కూడా రెండుగా చీల్చగల ఆ కత్తి ని చూసి మల్లయ్య గౌడు కళ్ళలో మెరుపులు మెరిసాయి.

“భద్రయ్య మామా ! ఇయ్యాల పండుతాడు కల్లంత నీకే తీసి పెడతనే. పనిలపడి మరిచిపోకు. పొద్దుగూకాల రాండి” అని చెప్పి, వెళ్ళిపోయాడు.

చారి మనసు మనసులో లేదు. ఏవేవో ఆలోచనలు. పట్టాభి కూడా ఆ పదునైన కత్తి లాగా తయారు కావాలి, ఎలా? ఏదో తప్పు జరుగుతున్నదని అనిపించింది అతనికి. సాయంకాలం చీకటి పడిన తరువాత ఇంటికి వచ్చాడు పట్టాభిరామ్.

గుమ్మం లోనుండే అరిచాడు, “అమ్మా, ఆకలైతాంది, అన్నం పెట్టే”

లోపలకి పోతున్న పట్టాభిని చారి ఆపాడు.

“అవురా పట్టాభి, నిన్న బడికి పోయినవా?”

“ఆ, పోయిన” అన్నాడు నిర్లక్ష్యంగా పట్టాభి.

“మొన్న?”

“పోయిన” నిర్లక్ష్యపు జవాబు.

“ఆ మొన్న?”

కమలమ్మ గలగలమంటూ అక్కడికి వచ్చింది. “వాడు ఆకలితో ఉంటే, లోపలికి రానియ్యకుండ, గట్ల నిలేస్తవేందయ్యా?” అని అడ్డుకున్నది.

“చెప్పు. ఆ మొన్న బడికి పోయినవా లేదా?” కొడుకును సూటిగా ప్రశ్నించాడు చారి.

“పోయిన లే” నిర్లక్ష్యంగా జవాబిస్తూ లోపలికి వెళ్ళపోయాడు పట్టాభి. చెంప ఛెళ్ళు మంది.

పట్టాభి జీవితంలో అది మొదటి దెబ్బ. “అమ్మా!” అని అరిచాడు.

కమలమ్మ అడ్డం వచ్చింది.

“ఏందయ్యా, పోకుంటె ఏమైంది?”

తల్లి వత్తాసు రావడంతో పట్టాభికి బలం చిక్కింది.

కానీ, ఈ సారి తల్లి చెంప చెళ్ళుమన్నది. నివ్వెరపోయారు తల్లీ కొడుకులు ఇద్దరూ.

“నీకు గార్వం అయితే అన్నం పెట్టు, ఐస్ క్రీమ్ గొనియ్యి. తోటోల్లంతా బడికి పోయి చదువుకుంటాంటే, వీడేమో గయిరి పోరగాల్లతోటి సోపతిబట్టి, గుడి కాడ, చెరువు కాడ ఆటలకు మరిగిండు. రేపటి నుంచి వాడు రోజూ బడికి పోవాలె. లేకపోతే మీ ఇద్దరినీ కొలిమిలో పెట్టి కాలుస్త, జాగర్త!” హెచ్చరించాడు చారి.

“వాడి తప్పేమున్నది, ఆ పంతులు…” సర్ది చెప్పబోయింది కమలమ్మ.

చూపుడు వేలు ఊపుతూ అన్నాడు చారి. “వీడి క్లాసుల వీడొక్కడే కాదు, ఇంకా పాతిక మంది పిల్లలున్నరు. వీన్ని బడికి పంపించి చదివించే బాధ్యత మనదే. ఇంకోసారి పంతుల్ని ఏమన్నా అన్నవంటే పగల్జీరుత” నిర్దయగా ఉరిమాడు చారి.

కొలిమి మండుతూ ఉన్నది. ఎర్రగా కాల్చిన ఇనుప ముక్కను, ఒదేలు సమ్మెటతో కొడుతూ ఉన్నాడు. ఒక పదునైన కత్తి తయారవుతూ ఉన్నది.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.