తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

ఆత్మసాక్షిగా

సుంకోజి దేవేంద్రాచారి
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ

© Telugu Society of America

ఒక్కోసారి కలలు నిజాలుగా, నిజాలు కలలుగా మారిపోతుంటాయి. కలలు నిజాలైతే అనుభవమైనా మిగులుతుంది. నిజాలు కలలైతే విషాదంగా మారిపోతుంది. నా పరిస్థితి అలానే ఉంది. స్వప్నానికి సత్యానికి మధ్య సన్నని సరిహద్దు గీతను చెరిపేసి బతకడం మొదలై ఎన్నాళ్లయిందో సరిగా గుర్తు లేదు. నేనొక్కడినే ఇలా ఉన్నానో నా చుట్టూ ఉన్నవారూ ఇలానే ఉన్నారో కూడా తెలీదు. అయితే విచిత్రంగా నాకో జబ్బు అంటుకుంది. సమాధి మీద నా చేయి పడగానే అందులోని ఆత్మ నాతో మాట్లాడ్డం మొదలు పెడుతోంది. మొదటిసారి నేను ఆత్మతో జరిపిన సంభాషణ ఇంకా బాగా గుర్తుంది.

ఓ ప్రముఖ టీవీ చానెల్లో పనిచేస్తున్నా. సంచలన కథనాలు ఇవ్వడంలో స్పెషలిస్టును. మా చానెల్ సీఈవో కొడుకు పంచెకట్టు ఉత్సవానికి వెళ్లాను. అది మారుమూల పల్లె. జనాలు తక్కువ, పొలాలు ఎక్కువ. యాభై ఇళ్లు కూడా ఉండవు. మా సీఈవోకు మంచి పలుకుబడి ఉండడంతో చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. ఆయనకు కావల్సింది కూడా ఇదే. తన గొప్పతనం సొంతూర్లో, ఆ చుట్టుపక్కల చూపించేందుకే ఈ ఫంక్షన్ అక్కడ పెట్టాడు. కార్యక్రమం హంగామాగా సాగుతోంది. నేనా సందడిలోంచి బయటపడి అలా నడచుకుంటూ వెళ్లాను. ఎండ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిగా ఉంది. ఓ పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు నీడలో గుడిలాంటి నిర్మాణం. దగ్గరకు వెళితే అది సమాధి అని అర్థమయింది. నీడలో ఆ సమాధి గచ్చుమీద కూర్చున్నాను. చల్లగా ఉంది. హాయిగా ఉంది.

“సచ్చిపోయినా వదలరా సార్?”

ఉలికిపడ్డాను. చుట్టూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు.

“సచ్చిపోయినా వదలరా సార్? ఎన్నాళ్లు ఎంటబడతారు సార్?”

టకామని లేచి నిలబడ్డాను. ఎక్కడా ఏ అలికిడీ లేదు. పిట్టలు కూడా ఎండకు చప్పుడు చేయకుండా ఉన్నాయి. స్పష్టంగా వినిపించిన ఆ మాటలు ఎవరివి? కాసేపు ఆలోచించినా అర్థం కాలేదు. నా భ్రమేమో అనిపించి తిరిగి సమాధిపై కూర్చున్నా.

“రైతులంతా సచ్చిపోతే మీ కండ్లు చల్లబడతాయా సార్?”

అప్రయత్నంగా నా నోటి నుంచి “ఎవరు నువ్వు?” అనే మాట వచ్చింది.

“సచ్చిపోయిన రైతును సార్”

“దెయ్యానివా?” వ్యంగ్యంగా అడిగాను. నాకు దెయ్యాలమీద, ఆత్మల మీదా నమ్మకం లేదు. ఎవరో కనిపించకుండా దాక్కుని మాట్లాడుతున్నారనిపించింది.

“దెయ్యాన్ని నేనెందుకయితాను? దెయ్యాలంతా మీరే. మీ టీవీల రేటింగుల కోసమో, అధికారంలో ఉండేందుకు ఓట్ల కోసమో బతికుండంగానే మమ్మల్ను బొట్టుబొట్టు రక్తం పీల్చి చంపేసే మీరు దెయ్యాలు” ఆ గొంతులో ఆవేదన. కోపం.

అతను చెప్పిందాంట్లో వాస్తవం ఉంది. రేటింగుల కోసం బతికున్న వాళ్లను చంపేస్తుంటాం. చనిపోయినవాళ్లను బతికిస్తుంటాం. లేని విషాదాన్ని, ఆగ్రహాన్ని, ఆవేదనను టన్నుల కొద్దీ గుప్పిస్తుంటాం. ఇందులో నిజానిజాలు మాకే ఎరుక. ఇది తెలీక జనంలో ఆందోళన. ఆవేశం. ఇవన్నీ క్షణంలో నా మనసులో మెదిలి ముఖమంతా చెమట పట్టింది.

“నా ఎదురుగా రా. మాట్లాడుకుందాం. దాక్కుని మాట్లాడ్డం కాదు” అన్నాను చెమట తుడుచుకుంటూ.

“సచ్చిపోయినోన్ని ఎదురుగా ఎట్లిస్తా. నువ్వు కుచ్చోనుండేది నా మీదనే. నా సమాధి మీద. బతికున్నెప్పుడు ఎంటపడి ఏడ్పించినారు. సచ్చిపోయినాంక కూడా నాతో మాట్లాడించేదానికి వచ్చి నా సమాధిమీద కుచ్చొన్నేవా?” వెక్కిళ్లు పెడుతూ ఏడుపు వినిపించింది.

దిగ్గున లేచి నిల్చున్నాను. ఇప్పుడెలాంటి ఏడుపూ వినిపించడం లేదు. మాటలూ వినపడలేదు. అనుమానంతో మెల్లగా వంగి చేతితో సమాధి తాకాను. వెక్కిళ్ల ఏడుపు స్పష్టంగా నా చెవుల్లో మోగుతోంది. టకామని చేతిని తీసేశాను.

ఇది కలో నిజమో అర్థం కాలేదు. వరమో శాపమో తెలీలేదు. సమాధి తాకితే అందులోని మనిషి ఆత్మ నాతో మాట్లాడ్డం ఏమిటి? ఆత్మలు దెయ్యాలు లేవని ఎన్నోసార్లు ఎందరితోనో వాదించాను. ఆత్మలపై, పూర్వజన్మలపై టీవీల్లో వచ్చే మిస్టరీ కథనాలు చూస్తే నాకు నవ్వు వచ్చేది. కానీ, ఇప్పుడు ఈ సమాధిని చూస్తుంటే భయమేస్తోంది.

ఇటుఅటు చూశాను. పక్కనే మరో సమాధి ఉంది. దాన్ని చేత్తో తాకాను. సన్నటి పీల గొంతుతో వెక్కిళ్లు పెడుతూ ఏడుపు వినిపించింది. ఏడుస్తూనే ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. చేతిని తీసేశాను. నాలోనూ ఏదో దుఃఖం. ఆందోళన. ఆవేదన. ఏం జరుగుతోంది? నాకేమయింది? దెయ్యం పట్టిందా? నిజంగా దెయ్యంపడితే నా భార్యాబిడ్డల పరిస్థితి ఏమిటి? నేను ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే నా ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగం లేకపోతే జీవితం ఎలా?

ఒంట్లో సన్నటి వణుకు. ఒళ్లంతా స్నానం చేసినట్టు చెమట. కాళ్లు లాగుతున్నాయి. కూర్చోవాలనిపిస్తోంది. ఆ చెట్టు నీడలో కూర్చోడానికి సమాధులు తప్ప వేరే ఏవీ సౌకర్యంగా లేవు. ఏదైతే అదయిందని మొదటి సమాధిపైన కూర్చున్నాను.

“సచ్చిపోయేదాకా వదల్లేదు కదా సార్ మీ టీవీలోళ్లు. కాలవల్లేవు. నదుల్లేవు. బావుల్లో నీళ్లు లేవు. వానల్లేవు. బతికేదెట్ల? అని మీరే టీవీల్లో ఏస్తిరి. నన్నూ నా కుటుంబాన్ని చూపిస్తిరి. బతుకుపైన రోషం పెరిగి అప్పులు చేసి వరసగా పదిబోర్లేస్తి. ఏడు బోర్లల్లో నీటి చుక్కేలే. మూడు బోర్లల్లో ఇంచీ ఇంచిన్నర నీళ్లు పడె. వాటిన్నమ్ముకోని పంటలు పెడ్తా. ఆ బోర్లు ఎండిపాయ. పంటలూ పాయ. ఎట్ల బతికేది? మీరు మళ్లా టీవీల్లో ఏస్తిరి. బోర్లేయడంవలన నీళ్లు అడుక్కుపోతాయంటిరి. మీరు టీవీల్లో ఏసేది చూసి ఎమ్మార్వో వచ్చి మా పొలంలో పదకొండో బోరు ఎయ్యనీలా. డబ్బులు మాయ్యి. పొలం మాది. కష్టం మాది. ఆయనెవరు వద్దనేదానికి? రూలంతే అనె. ఏం చేయాల మేము. నీళ్లు లే. పంటల్లే. పనిలే. అప్పటికే మా అమ్మానాయన ఈ బాధలు చూళ్లేక కాలం చేసిరి. నేను మాత్రం ఎట్ల బతకాల? నేను సచ్చిపోతే నా భార్యాబిడ్డలకు మేలు జరుగుతుందేమో అని, ఈ చెట్టుకే, కొమ్మకు ఉరేసుకుంటి. ఏమాయ? మళ్లా మీరు టీవీల్లో ఏస్తిరి. మళ్లా మళ్లా ఏస్తిరి. గవర్నమెంటుది సాయం మాటలు ఎక్కువ. సాయం చేతలు తక్కువ. ఎట్ల బతికేది? నా భార్య, కొడుకు, కూతురు పొట్ట చేతపట్టుకోని టౌనుకు చేరిపాయిరి. అయినా మీరు వదల్లేదంటనే. ఆడగూడా కరువుకతలంటా మా వోళ్లను టీవీల్లో చూపించినారంటనే. అయినా తృప్తి తీరలేదా సార్ మీకు?”

నీటి వసతి లేని కరువు ప్రాంతాల్లో ప్రతి రైతుదీ దాదాపు ఇలాంటి పరిస్థితే. ఈ రైతు కాకపోతే ఇంకో రైతుది. ఇలాంటి కథనం తప్పకుండా మా చానెల్లో ప్రసారం చేసే ఉంటాం.

“ఏ రాజకీయ నాయకుడు మాకు న్యాయం చేసినాడు సార్? ఎవరైనా సచ్చిపోతే వచ్చి ఇంట్లో వాళ్ల చేతిలో ఐదువేలో పదివేలో పెట్టేసి పేపర్లలో ఫొటోలు ఏపించుకుంటారే గానీ బతికేదానికి దోవ చూపతాండారా ఆఫీసర్లు? వాళ్లేమన్నా తక్కువా? గవర్నమెంటు ఇచ్చే సబ్సిడీల్లో ఈళ్లకు వాటా ఇవ్వాల్సిందే. జలగలే మేలు సార్. అయ్యి బతికేదానికి మాత్రమే రక్తం తాగతాయి. ఈళ్ళో!”

ఇక ఆ ఆత్మ మాటలు వినే ధైర్యం నాకు లేకపోయింది. సమాధి పైన్నుంచి లేచి కింద కూర్చున్నా. ఏదో తెలీని గుబులు. అలా ఎంతసేపున్నానో తెలీదు. మా సీఈవో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.

“ఇక్కడున్నావా? నీకోసం పల్లెలో అంతా వెతికా,” అన్నాడు.

మనిషిని చూడ్డంతో నాలో కొంచెం ధైర్యం పెరిగింది. మెల్లగా లేచి నిల్చున్నాను.

ఆయన నా భుజంపైన చేయి వేసి “వాట్ హేపెన్డ్ మై డియర్ యంగ్ బోయ్, వాట్ హేపెన్డ్?” అన్నాడు కంగారుగా నా ముఖంలోకి చూస్తూ.

ఆయనకు చెప్పాలో వద్దో అర్థం కాలేదు. నా ఉద్యోగంతో ముడిపడి ఉన్న వ్యక్తి అతను. చెప్పకుండా ఉండలేని స్థితి నాది. ఏదయితే అది అయిందని మెల్లగా నాతో ఆత్మలు మాట్లాడిన సంగతి చెప్పాను. మొదట అతను నమ్మలేదు. కాసేపు ఆలోచించాడు. ఆయన ముఖంలో ఏదో కొత్త విషయం కనుక్కోబోతున్న ఫీలింగ్.

“సరే. నాతో రా. ఇప్పుడే టెస్ట్ చేద్దాం” అంటూ నా చేతిని పట్టుకుని అక్కడి నుంచి ఉత్తరంగా అరకిలోమీటరు దూరం తీసుకెళ్లాడు. అక్కడొక సమాధి ఉంది. దానిపైన వేసిన సిమెంటు గచ్చు పెళ్లలు పెళ్లలు లేచిపోయింది.

“ఇక్కడ కూర్చో. నీతో ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం,” అన్నాడు సీఈవో. చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు.

సమాధిని తాకాలంటేనే నాలో భయం. పక్కన మనిషుండాడనే ధైర్యంతో మెల్లగా ఆ సమాధిపైన కూర్చున్నా.

“నిజంగా నేనే తప్పూ చేయలేదన్నా. బావను ప్రేమించినా. బావతోనే నా బతుకనుకున్నా. బావక్కూడా నేనంటే చానా ప్రేమ. చెప్పుడు మాటలిని నాపైన అనుమానం పెంచుకున్నేడు. నేను తప్పుడుదాన్నని అన్నేడు. ఏలుకోవాల్సిన బావే నేను తప్పుడు దాన్నన్నేక ఇంక నేను బతకడం ఎందుకన్నా?”

సమాధి మీద నుంచి టక్కున లేచాను ఆందోళనగా.

సీఈవో నా ముఖంలోకే చూస్తున్నాడు. “ఏమైంది? ఆత్మ నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది?” అంటూ నా రెండు భుజాలు పట్టుకుని ఊపేశాడు.

నాతో ఆత్మ మాట్లాడిన మాటలు చెప్పాను. వెంటనే ఆయన రోదిస్తూ కింద చతికిలపడ్డాడు. “నిజమే. నేనే తప్పు చేశాను. నేనే తప్పు చేశాను” అంటూ చాలాసేపు గొణుగుతూ ఏడుస్తూనే ఉన్నాడు.

ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తున్నాను. కాసేపటి తర్వాత తేరుకున్నాడు.

“ఓకే యంగ్ మాన్. నా ప్రేమ విషయం మన స్టాఫ్లో ఎవ్వరితో అనొద్దు” అన్నాడు జేబులోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటూ.

సరే అన్నట్టు తలూపి “నా ఉద్యోగం సార్” అన్నాను అనుమానంగా.

“ఇప్పుడే నాకో సూపర్ ఐడియా వచ్చింది. నీకు ఈ అపూర్వ శక్తి రావడం మన చానెల్‌‌‌కు గొప్ప వరం. ఆత్మలతో మాట్లాడే ప్రోగ్రాం డిజైన్ చేద్దాం. ప్రముఖులుగా ఉండి చనిపోయిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు, హత్యకు గురైన వారు. ఎవరి మరణమైతే సంచలనం అయి ఉంటుందో. ఏ వ్యక్తి జీవితం అయితే సంచలనం అయి ఉంటుందో. అలాంటి వారి ఆత్మలతో నువ్వు మాట్లాడు. దానిని యాక్టర్లను పెట్టి స్కిట్లాగా వేద్దాం. మన చానెల్ రేటింగ్ పెరిగిపోతుంది” అన్నాడు ఎగ్జైటింగ్‌గా. మా సీఈవో బుర్ర చాలా షార్ప్. నిర్ణయాలు చాలా వేగంగా తీసేసుకుంటాడు.

ఎవరెవరి ఆత్మలతో మాట్లాడాలో అక్కడే కూర్చుని చర్చించుకున్నాం. మేము మాటల్లో ఉండగానే చీకటి కమ్ముకుంది. ఊర్లో నుంచి మమ్మల్ను వెతుక్కుంటూ మనుషులు వచ్చేదాకా మా మాటలు సాగాయి.

ఆ మరుసటి రోజే సిటీకి వచ్చేశాం. మా పనులు మొదలు పెట్టేశాం. మొదట ఓ రాజకీయ ప్రముఖుడిని ఎంచుకున్నాం. ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు దాటింది. ఇప్పటికీ ఆయన మనుషుల్లో జీవించే ఉన్నాడు. ఆయన సమాధి వద్దకు వెళ్లా. తాకగానే గంభీర స్వరంలోంచి మాటలు రావడం మొదలు పెట్టాయి.

వినిపించే మాటలనే కాదు, మనసు ఘోషను కూడా రికార్డు చేసే పరికరం ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఆయన మాటలన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఇంటికొచ్చి కూర్చుని రాశాను. పొద్దున్నే వెళ్లి మా సీఈవోకు ఇచ్చాను.

“ఏంటి బ్రదర్! ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా?”

“మిమ్మలను మరచిపోయిందెప్పుడు సార్?”

“యస్! మా పౌరుషం అలాంటిది. మీకేం కావాలి”

“మీరు రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమం అంతా అందరికీ తెలుసు. మీరు చేసిన పనులూ తెలుసు. మీరు చేయాలనుకుని చేయలేకపోయినవి.చేయకూడదనుకున్నా చేయాల్సి వచ్చినవి ఏవైనా ఉంటే చెప్పండి”.

“బ్రదర్! రాజకీయం అనే పదమే పెద్ద బూతు. నీతీ, నిజాయితీ, నిస్వార్థం, నిష్కపటం, ప్రేమ, కరుణ, ఇలాంటివాటినంతా మింగేసే అతి పెద్ద భూతం రాజకీయం. ప్రపంచంలోనే మమ్మల్ను మించిన నటులు మరొకరు లేరు. కానీ రాజకీయ నటుడిగా మేము మెప్పించలేకపోయాం. ఓడిపోయాం. ఏ రంగమైనా మొదట మనం గెలుపొందాలి, పక్కన వాడు ఓడిపోవాలి అనుకుంటారు. ఇక్కడ మాత్రం మేము గెలవకున్నా బాధలేదు పక్కన వాడు ఓడిపోవాలి అనుకుంటారు. అందరూ ఓటమినే కోరుకునే నేతలు ఈ సమాజాన్ని ఎలా గెలుపుదారిలో నడుపుతారు”

“సార్. మీరు ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు”

“మాది ఫిలాసఫీ కాదు బ్రదర్. జీవిత సత్యం చెబుతున్నాం. ప్రజలకు మంచి చేసి వారి అభిమానంతో అందలం ఎక్కాలనుకున్న వాళ్లకు విలువలేదు. ప్రజలను మోసం చేసి, సహచరులను మోసం చేసి, ఆఖరుకు తనను తానే మోసం చేసుకుని విజయం సాధించామని విర్రవీగేవారిదే ఇప్పుడు లోకం. మనుషుల్లో స్వార్థం పెరిగి చూపులన్నీ పైపైకే ఉంటే. మేము ఎంత చేసినా ప్రయోజనం ఏముంది.”

“సార్. మీరు చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉందా?”

“నో. మేము అనుకున్న ప్రతిదీ చేశాం. ఆచరణలో కిందిస్థాయిలో కొందరి మితిమీరిన స్వార్థం కారణంగా మా ఆశయాలు అందరికీ అందుబాటులోకి రాకపోయుండచ్చు. అది మా వైఫల్యం కాదు. ఈ వ్యవస్థ వైఫల్యం. ఈ మనుషుల వైఫల్యం.”

“ఓకే సార్. మీరు చేయకూడదనుకుని చేయాల్సి వచ్చింది ఏదైనా ఉందా?”

“బ్రదర్. మేము వద్దనుకున్నాక, మా దగ్గర ఆ పనిని ఎవ్వరూ చేయించలేరు. ఆఖరుకు మరణమైనా సరే. మేము ఆహ్వానిస్తేనే వచ్చింది. అదీ మా ఆత్మస్థైర్యం. మాలోని అణువణువూ మేము చెప్పినట్టే వింటుంది”.

“అయితే మీ ద్వితీయ వివాహం సబబేనా?”

“న్యాయాన్యాయాలు నిర్ణయించాలంటే కూడా ఓ అర్హతుండాలి. మా నిర్ణయం సబబు కాదనేదానికి మమ్మల్ను మించిన ఆలోచనాపరుడు, ఆచరణశీలి ఎవ్వరు? మా స్థాయి లేని వ్యక్తులు మా గురించి ఎలా అనుకుంటే మాకేమి? భర్తగా మా మొదటి భార్యకు ఏ ద్రోహమూ చేయలేదు. ఆమె సుమంగళిగా వైకుంఠం చేరారు. తండ్రిగా ప్రతి బిడ్డ బాధ్యతలూ నిర్వర్తించాం. మా స్వశక్తితో మా నటనతో ఆస్తులను అభిమానులను సంపాదించాం. మా పిల్లలందరికీ పంచాం. ఊహ వచ్చింది మొదలు అమ్మానాన్నకోసమో, భార్యా పిల్లలకోసమో జీవించాం. చరమాంకంలో ఒంటరిగా మిగిలాం. మాకు నచ్చినట్టు మేము జీవించాలనుకున్నాం. మేము ఎవ్వరి ఆస్తులూ కొల్లగొట్టలేదు. ఎవ్వరి పదవులూ లాక్కోలేదు. ఎవ్వరి అధికారాలూ ఊడగొట్టలేదు. మరి మా నిర్ణయం సబబు కాక అబబా?”

“వృద్ధాప్యంలో మీకు తోడు అవసరమా?”

“యస్ బ్రదర్! యస్. తోడంటే మీకు తెలిసిన అర్థమొక్కటే. నగ్నదేహాలు ఆలింగనం మాత్రమే తోడు కాదు. గుడిలో దేవుడికి తోడెవరు? అర్చకుడా? కాదు. పరమభక్తుడు మాత్రమే. అలానే ఇదీనూ. మాది భగవంతుడికి భక్తునికీ ఉన్న సంబంధం. వారు మాకు భక్తితో దగ్గరయ్యారు. మేము కటాక్షించాం. భగవంతునికి నైవేద్యాలు సమర్పించని వారికి మమ్మల్ను వేలెత్తి చూపించే అర్హత లేదు.”

“సరే. రాజకీయ జీవితం మీకు ఎలాంటి పాఠాలు నేర్పింది?”

“రాజకీయ జీవులకు మేమే పాఠాలు నేర్పాం.. అధికారంపై ఆశ విషనాగులాంటిదని, బంధాలు బాంధవ్యాలు విషతుల్యమౌతాయని సజీవంగా చూపాం. అధికారమనే విషనాగు దేశాన్ని ఎలా కబళించబోతోందో గ్రహించాం. ప్రజలకు ఊరూరూ తిరిగి చెప్పాం.”

“మీరు మళ్లీ పుడితే ఏం చేస్తారు?”

“మేము మళ్లీ పుడితే మా కార్యస్థానం శ్వేతసౌధమే”

దీనిని చదవగానే మా సీఈవో చాలా ఇంప్రెస్ అయిపోయాడు.

‘ఆత్మసాక్షి’గా ప్రోగ్రాం డిజైన్ చేసి ప్రసారం చేశాడు. ఈ ప్రోగ్రాం పెద్ద సంచలనం రేపింది.

ఆత్మలతో నా సంభాషణ. వాటి ప్రసారాలు వరుసగా మొదలయ్యాయి.

“లాల్ సలాం!”

“ఎదుటిమనుషులను చంపడమే లాల్ సలామా?”

“మేం వీరులం. పోరాడాం.”

“పోరాడింది తక్కువ. ప్రజలను పొడిచింది ఎక్కువ. కాదా?”

“తప్పు నాదా? నింద నాపైన వేస్తారా? తప్పంతా మీదే. మీ ఉనికి కోసం నాచేత హత్యలు చేయించలేదా? అజ్ఞాతంలో ఉన్నప్పుడు మేము ప్రజల బాగుకోరి చంపితే హత్య చేశాడన్నారు. మమ్మల్ను పట్టుకుంటే రివార్డులు ఇస్తామని ప్రకటించారు. లొంగిపోయాక మీకోసం మా చేత హత్యలు చేయించి మమ్మల్ను అజ్ఞాతలోకం పంపి అల్లుడి మర్యాదలు చేశారు. పెద్దపెద్దోళ్లే నాకు భయపడతాంటే నేను ఇంకెవరికి భయపడాల? ఎందుకు మంచిగా ఉండాల? నేనే కాదన్నా. నాకులాగా నీకూ తప్పు చేసేదానికి అవకాశాలు వస్తే, నువ్వూ నాలాగానే తయారవుతావు.”

“నీలాగా అవకాశాలు ఇంకెవరికీ రాలేదంటావా?”

“వచ్చినా ఉపయోగించుకునే ధైర్య ఉండాల కదా! ఆ ధైర్యం నాకుంది”.

“ఏంతప్పు చేసిందని పాటలు పాడే లలితమైన మనిషిని ముక్కలు ముక్కలుగా నరికేశావు?”

“నన్ను ఒక్కడినే నిలదీస్తున్నావెందుకన్నా? మీకు తెలిసి నేను అలాంటి కోకిల గొంతు ఒక్కదానినే కోశా. మీకు తెలీదా? ఎంతమంది గాయకులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారో! ఎందరు విప్లవవీరులు దిక్కులేని చావు చచ్చిపోయారో? వాళ్లందరి చావుకు నేనా కారణం? అసలు కోకిల గొంతు కోసేదానికి నాచేతికి కత్తి ఇచ్చిందెవరు? నాకు సాయం చేసిందెవరు?”

“నీ చేతికి కత్తి ఇచ్చి నీకుతోడు వస్తే నీ తల్లి గొంతు కూడా కోసేస్తావా?”

“మాట్లాడవేం…”

“అదొక ఉన్మాదమన్నా. ఉన్మాదం! ఇన్ని హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, భూ కబ్జాలు, అత్యాచారాలు ఇవన్నీ ఎవరికోసం చేశాను? ఎవరు నాతో చేయించారు? ఇందులో నా పాత్ర ఎంత? నీవన్నట్టు నేను తల్లి గొంతు కోయకపోతే నా గొంతు అప్పుడే తెగిపోయేది”

“పీడా పోయేది! ఇన్ని అకృత్యాలు ఉండేవి కావు.’

“ఈ అకృత్యాలు ఆగేవి కాదన్నా. నేను కాదంటే ఇంకొకడు. నా మరణం తర్వాతేమన్నా ఇలాంటివి ఆగినాయా? మనచుట్టూనే ఎందరో ద్రోహులున్నారు. అలాంటి ద్రోహులు వందమందికి నేను సమానం కావచ్చు. కానీ లోకంలో కోట్లమంది అలాంటి ద్రోహులే ఉన్నారే. రాజకీయనాయకులు, పోలీసులు, లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు. ఒక్కరని కాదు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వాళ్లు ఏ డిపార్ట్మెంట్లో లేరు? అలాంటి వాళ్ల సాయం లేకుంటే నేనీ పనులు చేసుంటానా? చేసినా ఇంతకాలం బతికుంటానా? అసలు ద్రోహులు ఎవరన్నా?”

“ఏమన్నా మాటరాలేదు. నేను చేసినవన్నీ తప్పులే. ఈ తప్పుడు పనులు చేసేదానికి సాయం చేసేది ఎవరని అడుగుతున్నా? చట్టం కొందరికి చుట్టంగా మారే నాలాంటి వారు తయారవుతా ఉండారు. రక్తంలో పుట్టి రక్తంలో పెరిగి రక్తపిశాచిగా నా జీవితం అంతమై పోయింది. ఇంకన్నా చట్టాలను బాగుచేసుకోండన్నా. ముందు మీరు మారండన్నా. చట్టం పని చట్టం చేసుకునేటిగా సహకారం అందించండి”

“ప్లీజ్. నేను మాట్లాడను. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి”

“నువ్వేమీ చదువుకోవద్దు.”

“చదువంటే నాకిష్టం. చదవకుండా ఉండలేను”.

“అయితే ఎందుకు చనిపోయావు?”

“లడ్డూ ఇష్టమని, ఒకేసారి పదికిలోలు తినగలమా?”

“తినలేము”

“క్రికెట్ ఇష్టమని రోజంతా గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తూనో, బౌలింగ్ చేస్తూనే ఉండగలమా?”

“ఉండలేము”

“హిస్టరీ ఇష్టమైతే రెండేళ్లు బయాలజీ చదువగలమా?”

“చదవలేము”

“ఇష్టంలేని తిండి తింటా, ఇష్టంలేని చదువు చదువుతా, ఇష్టంలేని చోట ఉంటా, మనసుకు కష్టం కలిగించే మాటలు వింటా బతగ్గలమా?”

“బతకాలి. ఇష్టం లేనిదాన్ని ఇష్టంలేదని చెప్పాలి. మనిషి ప్రాణంతో ఉండడం ముఖ్యం కదా?”

“ఎవరికి చెప్పాలి?”

“అమ్మకి, నాన్నకి”

“ఏమని చెప్పమంటావు? నాకీ చదువు ఇష్టం లేదంటే ‘నువ్వు అదే చదవాలి’ అన్నారు. నాకీ ఊరు వద్దంటే ‘నువ్వు అక్కడే ఉండాలి’ అన్నారు. నేనీ మాటలు పడలేను అంటే ‘నువ్వు పడాలి’ అన్నారు. కన్న అమ్మానాన్నే నన్ను చదువు పేరుతో నరకకూపంలాంటి జైలులోతోసేస్తే ఇక నేనెవరితో చెప్పుకోవాలి సార్?”

“నీ మేలు కోరే కదా చేశారు. వాళ్లను నువ్వు అర్థం చేసుకోలేదేమో”

“నా మేలు కోరారా? వాళ్లు అనుకున్నది నేను చేయాలనుకున్నారా? వాళ్లను నేను అర్థం చేసుకోవాల్నా! నన్ను వాళ్లు అర్థం చేసుకోవాల్నా? నేను మనిషినా,యంత్రాన్నా? తెల్లవారుఝామున మూడు గంటలకు నిద్రలేస్తే రాత్రి పడుకునేది పదకొండుకే. అప్పటి దాకా ఉరుకులు పరుగులు. చదువు చదువు చదువు! ఇదే లోకం. రోజూ టెస్ట్. అరమార్కు తగ్గితే అవమానం. పనిష్మెంట్. అమ్మానాన్నలకే కాదు, ఇక్కడ వీళ్లకూ మాలో కొందరిపైన ర్యాంకులు వస్తాయనే నమ్మకం ఉంటుంది. ఆ స్థాయిలో రోజూ జరిగే టెస్టుల్లో మార్కులు రావాల్సిందే. లేదంటే తిట్లు. ఒక్కోసారి దెబ్బలు కూడా. మాపైన అలాంటి హెూప్స్ పెట్టుకోమని మేము చెప్పామా? నేర్చుకోవడం అనేది చాలా సహజంగా విత్తనం నుంచి మొలక బయటకొచ్చినట్టు, మొలక మొక్కగా ఎదిగనట్టు ఉండాలే కానీ, బూరకు గాలి కొట్టినట్టు ఉండకూడదు. ఆ గాలి కూడా బూర కెపాసిటీకి సరిపోయేంత అయితే బాధలేదు. భరించొచ్చు. దాని కెపాసిటీ మించితే బూర ఏమవుతుంది? మా బతుకులూ అంతే”

“చనిపోయేముందు అమ్మానాన్న గుర్తు రాలేదా?”

“ఎందుకు రాలేదు. వచ్చారు. వచ్చే జన్మంటూ ఉంటే వీళ్లకు మాత్రం బిడ్డగా పుట్టకూడదని కోరుకున్నా”

“మీ అమ్మానాన్న కష్టపడి సంపాదించి నీ బాగు కోసం ఖర్చు చేయడం తప్పంటావా?”

“వాళ్ల డబ్బు జబ్బును నాపైన రుద్దడం ఎందుకు? వాళ్ల స్నేహితుల పిల్లలో వాళ్ల కొలీగ్స్ పిల్లలో వాళ్ల బంధువుల పిల్లలో ఎవరో ఏదో అయ్యారని నేనూ వారిలాగ కావాలని అనుకుంటే ఎలా? నన్నూ అలాగే అనుకోమంటే ఎలా?”

“వారి అనుభవం ముందు నీ అనుభవం తక్కువ. నీకు మంచి చేయాలనే కదా.”

“మమ్మలను దూరంగా కార్పొరేట్ హాస్టళ్లలో చదివించినట్టే, అమ్మలను ఒక ఊరిలో, నాన్నలను ఒక ఊరిలో హాస్టల్లో ఉంచి ఒక్క నెలరోజులు చదివించాలనేది నా కోరిక. అలా చేస్తే కానీ మా బాధ ఏంటో అర్థం కాదు”

“ఇంతకూ నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా, హత్య చేశారా”

“చనిపోవాలని కోరుకున్నాక ఆత్మహత్యకు హత్యకు తేడా లేదనుకుంటా. నాలాంటి వారు ఎంతమంది చనిపోయారో లెక్కేస్తే నాది ఆత్మహత్యో హత్యో మీకే తెలుస్తుంది”

“ఎందుకొచ్చావు?”

“నీ చావు. నిర్దోషులను దోషులను చేసింది. దోషులను నిర్దోషులను చేసింది. తెలుసా?”

“తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు”

“తెలుసు కోవాలి. దీనికి కారణం నీ చావే. ఇందులో న్యాయాన్యాయాల గురించి నువ్వు ఆలోచించాలి కదా?”

“బతికున్నప్పుడే న్యాయం అందని మనిషిని. చనిపోయాక నిందలు భరించిన మనిషిని. ఇప్పుడిక ఏది న్యాయం ఏదన్యాయం అని ఎందుకాలోచించాలి?”

“ఆనాటి ఫొటోలు పేపర్లలో చూశాను. ఆ గదంతా రక్తం మరకలు. నీ తెల్లటి నగ్న దేహం. కళ్లలో భయం బాధ. నాకింకా గుర్తున్నాయి. నిన్నెంతగా హింసించి ఆ స్థితికి చేర్చారో! తలచుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.”

“ఏడ్చు. బాగా ఏడ్చు. మనిషిగా పుట్టినందుకు. న్యాయం గురించి ఆలోచించే మనసు ఉన్నందుకు ఏడ్పు తప్ప ఇంకేమీ మిగలదు. మన సమాజమే రెండుగా చీలిపోయింది. ఒకటి ఏడ్పించే వర్గము. ఇంకోటి ఏడ్చే వర్గము. కన్నీళ్లకు అన్యాయం కరగదు. కన్నీళ్లకు న్యాయమూ దరిచేరదు.”

“పదేళ్లు దాటినా నీ మరణం ఇప్పటికీ మాకు పెద్ద మిస్టరీ. ఇంకా దోషులెవరో గుర్తించలేకుండా ఉన్నారు. నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతకూ నిన్ను చంపిందెవరు?”

“చూశావా సార్. మీ మగబుద్ధి పోనిచ్చుకోలేదు. నా తెల్లటి నగ్నదేహం ఫొటో పేపర్లో చూశానన్నావు. నన్ను చంపిన వారి పేర్లు అడుగుతున్నావే కానీ, ఆ నాటి నా వేదన గురించి పట్టించుకున్నావా? రక్షగా ఉండాల్సిన వారే నా పాలిట భక్షకులుగా మారి నన్ను కొట్టి మనసును శరీరాన్ని గాయపరిచి వివస్త్రను చేసి, నన్నో ఆటబొమ్మను చేసి వారి ఇష్టానుసారం నాతో ఆడుకుని, బతికుండగానే నా ప్రాణం తీశారే! భౌతిక మరణానికి ముందే నేను వారి చర్యలతో మానసికంగా మరణించానే!”

“ప్లీజ్ వద్దమ్మా. ఆ వేదనంతా వినలేను. వినకూడదని కాదు. విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఆ రోజు నిన్నెవరు చంపారో తెలిస్తే వారికి శిక్షపడేలా చేస్తా. అదే నాక్కావలసింది.”

“ఎంత అమాయకుడివి సార్? దోషులెవరో తెలిసినంత మాత్రాన శిక్ష పడుతుందా? హత్యాచారానికి గురైన చివరి వ్యక్తిని నేనేనా? నా తర్వాత ఏ మహిళా అత్యాచారాలకు హత్యలకు గురి కాలేదా? పాలుగారే చిన్నారులనూ చిదిమేస్తున్నారు. ఎంతటి నరకం వారికి? ఈ నేలపైన ఆడపిల్లగా పుట్టడమే మా తప్పా? మగవాళ్లకు జన్మనివ్వడమే మేము చేస్తున్న ఘోర తప్పిదమా? నా ప్రాణం పోయేటిగా కొట్టిన వాడో, నా ఇష్టానికి వ్యతిరేకంగా నాపైన లైంగిక దాడి చేసినవాడో మాత్రమే నా చావుకు కారణం కాదు. ఈ చర్యలను అడ్డుకోని వారు, ఈ పనులకు ప్రోత్సహించిన వారు, ఆ తర్వాత వీళ్లను కాపాడుతున్న వారూ, వీరందరూ నా చావుకు కారకులే! తప్పు చేసినవాడికి శిక్ష పడుతుందనే భయం లేనంత వరకూ నాలాంటి చావులు ఎన్నో మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఎందరో హంతకులు దర్జాగా మీ మధ్యేతిరుగుతూ ఉంటారు.”

“అదికాదమ్మా! నీ మరణానికి సంబంధించి”,

“సార్! మన చట్టం చాలా గుడ్డిది. దానికి చెవులు మాత్రమే ఉన్నాయి. నా చావుకు కారణం ఎవరో నేను చెప్పినా సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు. జరిగేది జరగనీ! విచారణ సాగనీ! విచారణ సాగినంత కాలం నన్ను చంపిన వాళ్ల మనసును భయం తొలుస్తూనే ఉంటుంది. అదే వారికి పడే పెద్ద శిక్ష. నా సంగతి ఒదిలేయండి.. నా లాంటి కేసుల్లో సాక్ష్యాలతో సహా పట్టుబడిన నిందితులకు తొందరగా శిక్ష పడేలా చేయండి, చాలు!”

“ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?”

“మనుషులు మారాలి. స్త్రీని ఆస్తిగానో విలాస వస్తువుగానో ఆటబొమ్మగానో చూసే దృష్టి పోవాలి. స్త్రీ పురుషుల మధ్య లింగభేదం తప్ప ఇద్దరూ ఒక్కటే అనే భావన అందరిలో రావాలి. అప్పుడే ఈ హత్యాచారాలు ఆగుతాయి”

వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఎక్కడ చూసినా మా ‘ఆత్మసాక్షి’ ప్రోగ్రాం గురించిన మాటలే. చర్చాగోష్ఠులే! ఇద్దరు కలిసినా దీనిగురించి మాట్లాడుకునేవారు. కొందరికి సమాధులుండేవి కాదు. సమాధి లేకపోయినా వారిని దహనం చేసిన చోటు తెలిస్తే చాలు. వెళ్లి ఆత్మలతో మాట్లాడేవాడిని. మా ఆఫీసుకు ఎందరెందరో వస్తున్నారు. వాళ్ల బంధువులు ఆత్మలతో మాట్లాడాలని కోరుతున్నారు.

చనిపోయిన రాజకీయనాయకులైతే ‘తమ పెద్ద’ బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరి పేరుమీద ఉన్నాయో తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు వారి ప్రత్యర్థుల వ్యాపార లావాదేవీలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కోరినంత డబ్బు ఇస్తామంటున్నారు.

చనిపోయిన గొప్ప వ్యక్తుల కృషి తెలుసుకోవాలని ఒక్కరూ కోరుకోకపోవడం నాకు బాధనిపించింది.

ఇప్పుడు నేను ముందులాగా రెగ్యులర్గా ఆఫీసుకు పోవడం లేదు. ఎంపిక చేసిన సమాధుల వద్దకు పోయి ఆత్మలతో మాట్లాడి మా ఇంటికొచ్చి దానిని మొత్తం రాస్తున్నాను. సిస్టంలో కంపోజ్ చేయడం లేదు. మెయిల్ కూడా చేయడం లేదు. ఎవరైనా మెయిల్ను హ్యాక్ చేసే అవకాశం ఉందని మా సీఈవోనే ఇంటికొచ్చి తీసుకెళ్తున్నాడు. ఆ రోజు సాయంకాలం ఇంట్లో మా చానెల్ పెట్టుకుని అందులో వస్తున్న ఆత్మసాక్షి ప్రోగ్రాం చూస్తున్నాను. ఇంతలో మా చానెల్ ఆగిపోయింది. సిగ్నల్ ప్రాబ్లమేమో అని వేరే చానెల్ పెట్టాను.

బ్రేకింగ్ న్యూస్ అంటూ, ఆత్మసాక్షి అనే పిచ్చి ప్రోగ్రాం ప్రసారం చేస్తున్న మానసిక రోగుల చానెల్‌పై తిరగబడ్డ ప్రజలు! చానెల్ కార్యాలయంపై దాడి! వస్తువులన్నీ ధ్వంసం. అందులో పనిచేసేవారు పరుగులు! వారిని తరిమితరిమి కొట్టిన జనం! ఇన్నాళ్లకు న్యాయం జరిగిందంటూ ఇతర చానెళ్ల హర్షం.

ఏ చానెల్ పెట్టినా ఇదే సారాంశం. నాలో వణుకు. సమయానికి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. పిల్లలను పిల్చుకుని పుట్టింటికి పోయింది. సీఈవోకు ఫోన్ చేశాను. స్విచ్చాఫ్. అసలు ఆయన బతికున్నాడో లేదో. ఆ పిచ్చిపట్టిన ఉన్మాద జనం ఎక్కడ మా ఇంటిపైకి వస్తారో అని భయమేసింది. నా చెవుల్లో జనం అరుపులు వినిపిస్తున్నాయి. బహుశా మా ఇంటికే వస్తున్నారేమో! ఆత్మలతో మాట్లాడేది నేనేనని మా సీఈవో చెప్పేశాడేమో. బస్టాండు వైపు పరుగులు తీశాను. నేను మొట్టమొదట రైతు ఆత్మతో జరిపిన సంభాషణ నా మనసులో మెదిలింది. అక్కడికి పోవాలనుకున్నాను. రెండు బస్సులు మారి ఆ ఊరికి వెళ్లేప్పటికి మరుసటి రోజు మధ్యాహ్నమయింది. ఎండ ఎక్కువగా ఉంది.

నేరుగా ఆ మర్రిచెట్టు దగ్గరకు పోయాను. అక్కడ సమాధులు లేవు. ఓ పదిమంది చెట్టునీడలో కూర్చుని పేకాట ఆడుతున్నారు. “ఇక్కడ సమాధులేమయ్యాయి” అడిగాను వాళ్లను.

“సమాధులా?” అంటూ నా వేపు ఆశ్చర్యంగా చూశారు.

“అవును. మాట్లాడే ఆత్మలుండే సమాధులు” అన్నాను.

“ఎవడో మెంటలోడొచ్చినాడురా. సరైన ముక్క పడలేదని ఎట్లరా జీవుడా అని కొట్టకలాడతాంటే, ఈడికి మాట్లాడే ఆత్మలుండే సమాధులు కావాలంట. మనుషులు మనుషులతో మాట్లాడేదే తక్కువైపోయింటే, ఆత్మలతో ఎవరు మాట్లాడతారు?” అన్నాడు ఒకడు.

“నిజం. ఇక్కడే రెండు సమాధులుండేవి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను ఆత్మలతో మాట్లాడాను. మా చానెల్లో ‘ఆత్మసాక్షి’ అనే ప్రోగ్రాం మీరు చూసే ఉంటారు. చాలా పాపులర్. ఆ ఆత్మలతో మాట్లాడే వ్యక్తిని నేనే.”

“రేయ్, ఆత్మసాక్షి లేదూ! దెయ్యం సాక్షి లేదూ! నువ్వీట్నుంచి పోలేదంటే నీ గూబలు పగులుతాయనేదానికి ఈ ముక్కలే సాక్షి!” అంటూ ఒకడు కొట్టేవాడిలా పైకి లేచాడు.

మనుషులకు ఆత్మ అనేదే లేదా? లేదూ ఆత్మలతో మాట్లాడి మాట్లాడి నేను బతికుండగానే ఆత్మలా మారిపోయానా? ఇందులో ఏది నిజమో మీ ఆత్మసాక్షిగా చెప్పండి.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.