తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

సింగిడి

వాగుమూడి లక్ష్మీరాఘవరావు
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ

© Telugu Society of America

గప్పుడెప్పుడో జరిగిన కత యాదికొచ్చినకాడకు చెబుతా.

పురాగ చెప్పాలంటే సమయం పడ్తాది.

అక్కడక్కడ చెప్తే అర్థం కాదు.

సమయం పట్తినా యాదికి తెచ్చుకొని కతంత చెబుతాలె.

సింగిడి! సింగిడి! సింగిడి!

సొక్కమయిన పేరు. అల్కగా పల్కడానికి అనువయిన పేరు.

పేరినగానే నాలుకనుంచిగాక కడుపునుంచి మహమంచిగ పల్కాలనిపించే పేరు.

అది కందెరుగని ఒకానొక సుందరి పేరు

నిజానికి అది ఆమె అసలు పేరుకాదు.

అది ఆమె కలం పేరు.

సింగిడి, సింగిడి, సింగిడి!

ఇక అసలు పేరు విషయానికొస్తే, కోటమ్మని కొందరు, కాటమ్మని కొందరు చెబుతారు.

మందెచ్చుల జానపదాల తేట తేట తెనుగు ఊట, సింగిడి నోట, శివజటాజూటంనుండి ప్రవహించే పవిత్రగంగలా ప్రవహిస్తుంది. సింగిడి చిన్నప్పుడే, సింగిడి బాపూ మన్నుపాలయ్యాడు. సింగిడి బాపూ చిన్నయ్య యలమంద బిడ్డ.

యలమంద పదిమెకాలకొకసారే సమాధానం చెప్పగల సత్తాగలవాడు. ఊరికి దగ్గరలో ఉన్న కులుకులకొండ మీద మందని మేపేవాడు. మందని ఒకటికి వందరెట్లు పెంచాడు. గొంగళ్ళ అంగడి నడిపాడు. అంగడిని అత్తకొడుకు కొమరయ్యకు అప్పగించాడు.

మందెచ్చులకు అనేక రఢవీరలను, ఒగ్గులను, తాళాలను, అనుసుల కఱ్ఱలను, ఏడు గవ్వల హారాలను,మల్లన్న దేవుని విగ్రహాలను ఉదారంగ యిచ్చాడు. ఒగ్గు కథలనల్లేవారికి గొంగళ్ళ సన్మానం చేసాడు. చేతిలో ఎముక లేదన్నట్లు ఉన్నంతలో పదుగురికి దానం చేసాడు.

కొమరయ్య శారదను ప్రేమించాడు. ఆమెకులస్థులు, కొమరయ్య మరొకరి చేతిక్రింద బ్రతికేవాడు కాబట్టి తన కూతుర్ని యివ్వనన్నారు. అప్పుడు యలమంద తన ఆస్తిలో సగభాగం కొమరయ్యకిచ్చి, అతని పెళ్ళి శారదతో జరిగేటట్లు చేసాడు. కొమరయ్య, పెళ్ళయ్యాక యలమంద ఆస్తితో, భార్యతో ఇల్లరికం వెళ్ళిపోయాడు.

యలమంద మిగతా ఆస్తిని చిన్నయ్యకప్పగించాడు. ఊర్లో పెద్దకులానికి చెందిన శ్రీధర ప్రసాద్ యలమందతో సావాసం చేసాడు. అప్పుడు శ్రీధరప్రసాద్ బ్రతుకుతెరువు నిమిత్తం గొంగొళ్ళ వ్యాపారం చేసేవాడు. యలమంద సావాసగాడు అడిగింది లేదనకుండా యిస్తూ అతని ఎదుగుదలకు ఊతమయ్యాడు.

అలాంటి యలమంద మరణమప్పుడు మందెచ్చులవారు వచ్చారు. కొమ్ముబూరలూదారు. డోలు వాయించారు. ‘యలమంద, యలమంద, యలమంద! మందెచ్చులవారి పాలిట బోళాశంకరయ్య యలమంద!’ అని మందెచ్చులవారు యలమంద మీద అనేక కథలు కట్టారు.

అలాంటి యలమంద బిడ్డ చిన్నయ్య మన్నుపాలు కావడానికి ప్రధానకారణం ఆవూరి దొరని అందరికి తెలుసు. దొర పేరు అనంతప్రసాద్. శ్రీధరప్రసాద్ కుమారుడతడు.

తన బాపూ మన్నుపాలయ్యేనాటికి సింగిడి వయసు అయిదు సంవత్సరాలు. అనంతప్రసాద్ కుమార్తె అస్మితప్రసాద్ చిన్నయ్య గొంతుమీద కాలు పెట్టి తొక్కిన సంఘటన సింగిడి కళ్ళల్లో అనునిత్యం కదలాడుతూనే ఉంటుంది.

ఉద్యోగరీత్య సింగిడి ఆవూర్లో కాలు పెట్టింది. నాటి సంఘటనలన్ని సింగిడికి యాదికొచ్చాయి.

దొర వారసుల మీద నిప్పులు చెరగాలనిపించింది.

ఉరుకున వెళ్ళి లగాంచి ఆ వారసుల కొడుకుల్ని , చావచితకబాదాలనిపించింది.

అయితే సింగిడి విద్వత్తేజం అందుకు సమ్మతించలేదు.

పగవారింట పెరిగి పగవారికోసం ప్రాణాలర్పించిన కర్ణుని కొడుకును, చేరదీసిన ధర్మరాజులు పుట్టిన పుణ్యభూమి మనది. తండ్రిచేసిన తప్పులకు తనయులని శిక్షించడం న్యాయంకాదు అనుకుంది సింగిడి

గప్పట్లో చిన్నయ్యకు కొంతకాలం కాలం ఎదురుతిరిగింది.

కొండమీద మంద మెకాలకు బలయ్యింది.

ఆస్తి హరతి కర్పూరంలా కరిగిపోయింది. కడకు చిన్నయ్య అనంతప్రసాద్ దగ్గరే పనికి కుదిరాడు. చిన్నయ్యకు, దొర నల్లికుల్లోడని తెలుసు.

తప్పనిసరి దుస్థితిలో చిన్నయ్య అనంతప్రసాద్ దగ్గరే పనికి కుదిరాడు.

అతని శ్రమఫలితమే అనంత గడీ

అనంత గడి నిర్మాణమంతా చిన్నయ్య చేతులమీదే జరిగింది.

అనంత గడి గోడలన్నీ డంగు సున్నంతో నిర్మించబడ్డాయి.

విశాలమయిన గదులతో నిర్మించబడిన అనంత గడి నాల్గో అంతస్తును ఎక్కి చూస్తే ఊరంత కనపడుతుంది. గడి నిర్మాణమంతా పూర్తయ్యాక అనంతప్రసాద్ చిన్నయ్యను మెచ్చుకుని పాతపంచెనొకదాన్ని అతనికి బహుమతిగ ఇచ్చాడు.

దొరలు ధరించే పంచెను చూసుకుని చిన్నయ్య పూరగ పులకరించిపోయాడు

అయితే ఆ పంచెను రాత్రే కట్టుకోవాలని అనంతప్రసాద్ చిన్నయ్యను ఆదేశించాడు.. చిన్నయ్య భార్య సత్తెమ్మ దొరగారి గడిలోనే ఒళ్ళుదాచుకోకుండ పనిచేస్తాది.

ఆమెనందరు మంచి అందగత్తె. అని అనేవారు. దొరకంట పడకుండా పనిచేసేది. సత్తెమ్మ సింగిడిని ప్రసవించిన పదవరోజున అనుకోకుండా దొరకంట పడింది.

దొర రకతం కామంతో ఉడికిపోయింది

అదిగమనించిన దొరభార్య ఉమాప్రసాద్ సత్తెమ్మ మీద మండిపడింది.

‘నీలాంటి చూపులగుర్రాలు చుక్క తెగిపడ్డట్లు దొరకంట పడితే ఇంకేముంది? వారి సరసకామరకతం సలసలకాగిపోదూ?’

అంటూ కూతురు అస్మితప్రసాద్ సహాయంతో సత్తెమ్మ తలగొరికించింది.

సలసలకాలే అట్లకాడతో రెండు చెంపల మీద రెండు వాతలు పెట్టింది. ఆ బాధను తట్టుకోలేక గిలగిలలాడుతున్న సత్తెమ్మ కడుపుమీద కాలేసి తొక్కింది అస్మితప్రసాద్

దిక్కులు పిక్కటిల్లేలా సత్తెమ్మ అరిచింది. ఆమె అరుపులు గాలిలో కలిసిపోయాయి.

భార్యకు జరిగిన అవమానాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకున్నాడు చిన్నయ్య.

సత్తెమ్మ పనిలోకి రాలేక పోయింది. ఆమెను చూసుకోవడానికి ఆమె చెల్లెలు సిరిమాలనుపట్టణం నుండి పిలిపించాడు చిన్నయ్య.

సిరిమాల సొక్కమయిన మాటకారి!

ప్రతిదానికి డూడూ బసవన్న అన్నట్లు ప్రవర్తించదు. కూసమిడిసినపాములా ఉంటుంది. చక్కగా జానపదపాటలను పాడుతుంది.పాటల వెనుకనున్న మర్మాలనుకూడ జరా హుషారుగా వివరించి చెబుతుంది.

సింగిడి, పిన్నిసిరిమాల చేతిలోనే పెరిగింది.

సిరిమాల మాటను, పాటను జరా జగ్రత్తగా గమనించేది బాలసింగిడి.

పిన్నితో కలిసి చిన్నప్పుడే గొంతుకలిపేది.

సిరిమాల మందెచ్చులవారు యలమంద మీద కట్టిన పాటను చక్కగ పాడేది. యలమందకు చింతతొక్కన్న, మామిడి తొక్కన్న మహాయిష్టమనీ, గొంగళంటే మక్కువెక్కువని ఆ పాటలో ఉండేది. ఆమె పాడుతుంటే బండమీది రాతలా పాట వినేవారి మనసెక్కికూర్చుంటుంది, ఆమె పాట. అలాగే కాటమరాజు కథను, కాటమరాజు తాత గంగురాజు కథను, కరియావు రాజు కథను, పోలురాజు కథను, బత్తిరన్న కథను కూడ పాటలుగ చేసుకుని పాడేది. అలాగే ఆమె ఎల్లమ్మ పాట పాడుతుంటే నిప్పులుకక్కుకునే యారాళ్ళుకూడ బోనాలతో చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చేవారు.

సిరిమాల పాటలను విని ఆవూరి పూజారి బసవయ్య పండుగలప్పుడు దేవళంలో సిరిమాలతో పాటలు పాడించేవాడు. అలాగే ఆమె ముగ్గులు పెడితే, వాటిని చూడటానికి వూరివారంతా ముగ్గులదగ్గరకు వచ్చేవారు. సిరిమాల మాటకు,పాటకు మహిమ ఉందని ఆవూరి ప్రజలంతా నమ్మసాగారు.

ఈ విషయం అస్మితప్రసాద్ కు తెలిసింది. ఆమె కడుపు కుటకుటలాడింది. అగ్గిబుక్కింది. సిరిమాలను పిలిపించింది.తలగొరికించింది. ఏడుగవ్వల హారాన్ని మెడలో వేసి, పళ్ళురాలగొట్టి ఊరినుండి తరిమింది. అస్మితప్రసాద్ దుర్మార్గం ఊరంత తెలియడంతో అనంతప్రసాద్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. చిన్నయ్యను గడీకి పిలిపించాడు. తన భార్య మీద కన్నేసావంటూ చావచితకబాదాడు కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేసాడు.

అస్మితప్రసాద్ ప్రాణస్నేహితురాలు అరుణకన్ను చిన్నయ్యమీద పడింది.

అరుణ దొరబిడ్డ కాకపోయిన అగ్రకులానికి చెందినది కావడంతో అస్మితప్రసాద్ అరుణతో స్నేహం చేసింది చిన్నయ్యను హింసించి తన కామదాహం తీర్చుకోవాలనుకుంది. అస్మితప్రసాద్ సహాయంతో అరుణ చిన్నయ్యను బంధించిన గదికి వెళ్ళింది. దొరసానులముందు గోచిగుడ్డతో నిలబడాల్సిందిపోయి పంచెకడతావా బాట్ కవ్ అంటూ చిన్నయ్య పంచెను లాగేసింది.

చిన్నయ్య మోకాళ్ళు మీద నిలబడి ముందుకు వంగిపోయాడు. ఇద్దరూ పకపకానవ్వుకున్నారు. నా భర్తని వదిలేయ్ దొర అని సత్తెమ్మ, అనంత ప్రసాద్ కాళ్ళమీద పడింది.

‘దొరల ముందు జాకెట్ తో వస్తారటే; మీకు పీనుగ సింగారాలేందుకే’ అని అనంతప్రసాద్ క్రింద ఉమ్మివేసాడు. ‘ఇగో ఈ ఉమ్మి అరేలోపు జాకెట్టు విప్పి, లోపలికి వెళ్ళి త్రాగడానికి ముంతతో నీళ్ళు పట్టుకురా. అప్పుడు, ఆ చిన్నిగాడి సంగతి ఆలోచిస్తా, సమజయ్యిందా?’ అంటూ రంకెలేసాడు.

జాకెట్టు విప్పి మంచినీటికోసం సత్తెమ్మ వంటగదికి పరుగులు తీసింది

ఆమె నిస్సహాయతను చూస్తూ అక్కడున్న తదితర దొరలు, దొరసానులు పగలబడి నవ్వుతున్నారు. దొరసానులు చిన్నయ్యను హాలులోకి లాక్కొచ్చారు.

అస్మితప్రసాద్ చిన్నయ్య గొంతుమీద కాలేసి తొక్కింది.

అప్పట్లో పండగపూట పాతమొగుళ్ళతో ఉండకూడనిది గరీబోళ్ళ ఆడవాళ్ళు. అప్పుడయినా ఇప్పుడయిన ‘న స్త్రీ స్వాతంత్య్ర్యమర్హతి’ అన్న సూక్తి గరీబోళ్ళ ఆడవాళ్ళకోసమే పెట్టారు. అన్నట్లు సత్తెమ్మను దొరలు దొరసానులు నానావిధాలుగ హింసించారు.

ఆవూరిని చూడగానే సింగిడికి గతమంతా ఒకసారి గుర్తుకు వచ్చింది.

చిన్నప్పుడు తను తిరిగిన ప్రదేశాలన్నీ యాదికొచ్చాయి.

గంజు పట్టుకుని పిన్నికి చిక్కకుండా ఆడిన ఆటలు యాదికొచ్చాయి.

మిద్దెమీది దొరసాని యాదికొచ్చింది.

జిమ్మలు పట్టి ఉరికిన ఉరుకులు యాదికొచ్చాయి.

బువ్వ బుక్కుతూ, దూప తీర్చుకుంటూ చెండులతో ఆడిన ఆటలు యాదికొచ్చాయి.

జిల్లావిద్యాశాఖాధికారిగ ఆవూరికి వచ్చిన సింగిడి, అక్కడి ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయులందరిని కలిసింది. వారి క్షేమసమాచారాలను అడిగింది. విద్యాసంబంధ సూచనలు యిచ్చింది. పగటి ముచ్చట పనికి చేటు – రాత్రి ముచ్చట నిద్రకు చేటు. కాబట్టి ప్రభుత్వ నియమాలకనుగుణంగా పనిచెయ్యండి. పని తప్పించుకోవడానికి వంగివంగి దండాలెట్టవద్దు- వంకాయకూరలొండి పెట్టొద్దు. నాకు తెలిసిన సూచనలనిచ్చాను. ఇవిగాక మరేమన్న మంచి సూచనలుంటే చెప్పమంది

అటు పిమ్మట ఉపాధ్యాయులను ఊరి విషయాలు అడిగింది. అప్పటికి – ఇప్పటికీ తేడాలేమిటంది?

మేడమ్ మీరు మంచి కవయిత్రని మీ పుస్తకాలు చదివితెలుసుకున్నాము. మీరు వ్రాయాలంటే ఈవూరి గురించి చాలావుంది.ఒకప్పుడు ఈ వూరిలో ఉన్న గడీయే ప్రభుత్వేతర పాఠశాలయ్యింది. ఆ ప్రభుత్వేతర పాఠశాలను దొరవారసులు, ఒకప్పుడు అరుణ అని ఒకతుండేది, దానివారసులు నడుపుతున్నారు. కాలం మారినప్పటికి వారి ఆలోచనాధోరణి మాత్రం మారలేదు. కొత్తసీసాలో పాతసార అన్నట్లు వారి పద్ధతులున్నాయి.

వారి పాఠశాలలోని తరగతిగదిలో ఉపాధ్యాయుడు నుంచొనే ఉండాలి. అసలు కూర్చోకూడదు. వారి వర్గాలకు సంబంధించిన వారు మాత్రం కూర్చుని పాఠాలు చెప్పవచ్చు. ఏదో ఒక వంకపెట్టి యిస్తామన్న జీతంలో పది శాతం యిస్తారు. మీటింగులు పెట్టి, అలాయివ్వడానికి, వారనేకకారణాలు చెబుతారు. మీటింగులప్పుడు అందరిని మెచ్చుకుంటున్నట్లు మాట్లాడుతూనే దొరలు, అగ్రకులస్తులే చదువులు చెప్పడానికి యోగ్యులని సలహాలిస్తుంటారు.

ఆడ ఉపాధ్యాయినులు కాళ్ళునొప్పులు అంటే బిగుతుగా ఉండే లంగాలు ధరించవద్దంటారు. అలాగే మగవారినికూడ హింసిస్తారు. పద్ధతులు మారినవికానీ ఆలనాటి హింసమారలేదు. హింస రంగులు మార్చుకుంది అంతే; నిరుద్యోగం. పేదరికం కారణంగా బడుగువర్గాలవారు వారినేం అనలేకపోతున్నారు. ఎవరన్నా ఆవేశంతో ముందుకొచ్చిన ప్రయోజనం ఉండటం లేదు.

అప్పుడెప్పుడో సత్తెమ్మ అనే మహాతల్లి దొరమెడకోసి, చెల్లెలికి తన బిడ్డనిచ్చి పంపేసిందట; మహాతల్లి; అలాంటివారు పదేపదే పుడుతుంటే ఈ దొరలదొరసానుల మదం మంటగలుస్తుంది.’ అని ఒక ఉపాధ్యాయుడన్నాడు. సింగిడికి నాడు ఏం జరిగిందో అంతా తెలుసు.

ఏదేమయినా తనతల్లి ప్రజల మనసుల్లో మహాతల్లిగ నిల్చినందుకు బండారి మిక్కిలి సంతోషించింది.

గప్పుడెప్పుడో జరిగిన కతంత చెప్పాననే అనుకుంటున్నాను.

యాదికున్నదంతా చెప్పేసాను.

ఆ సత్తెమ్మ దొరమెడను, దొరసానులు మెడలను, ఆ అరుణ మెడను కోసిన విధం చెప్పాలంటే, అబ్బో అదో పెద్దపొత్తం అవుతుంది

ఇంతకీ నేనెవరో చెప్పలేదుకదూ? నేను సిరిబాల బిడ్డను. సింగిడి ముద్దుల చెల్లెలను. ఈ కతంత మా అమ్మ నాకు చెప్పింది.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.