శిక్ష
మేము విడిది చేసిన హోటల్నుంచి ఉదయం ఏడింటికే బయల్దేరాం. దాదాపు ముప్పయ్ కిలోమీటర్ల దూరం ప్రయాణం. దారిలో కన్పించే చిన్నచిన్న గ్రామాలు. పదహారేళ్ళ పడుచుపిల్లల్లా తుళ్ళిపడుతున్న పచ్చటి పంటపొలాలు. దర్పంతో తలయెత్తుకు నిలబడిన కోనసీమ కొబ్బరి చెట్లు.
పాపికొండల అందాల్ని, స్నిగ్ధ సౌందర్యంతో హొయలు పోయే గోదావరి నది సోయగాల్ని లాంచిలో డెక్ మీద కూచుని తిలకించాలన్న కోరిక ఎన్నేళ్ళదో. ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోడానికి తీరిక దొరకని జీవితాలు. అందని వాటినన్నిటినీ అందుకోవాలన్న ఆరాటం. సంసార సాగరంలో మునిగి పోకుండా ఉండటం కోసం చేసే అలుపెరుగని పోరాటంలో అద్భుతమైన సూర్యోదయాల్ని, పడమటిగాలి పైర్ల మీదుగా మోసుకొచ్చే పచ్చివాసనల్ని, ఆత్మీయంగా అల్లుకునే వెన్నెల్ని, చినుకుల స్పర్శతో పులకించే మట్టి సువాసనల్ని, వన్నెవన్నెల సూర్యాస్తమయాల్ని, వీటన్నింటిని ఆస్వాదించకుండా ఎలా బతుకీడుస్తున్నామో!
లాంచీ బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. నేనూ, కళ్యాణి డెక్ మీదకెళ్ళి కూచున్నాం. అప్పటికే దాదాపు అరవైమందికి పైగా ఉన్నారక్కడ. గొడవగొడవగా మాటలు. పిల్లల కేరింతలు. లాంచి బయల్దేరింది. మైకు పట్టుకుని ఈ విహారయాత్రలో చూడబోయే విశేషాల గురించి చెప్తున్నాడు గైడ్. అందర్నీ అలరించే ప్రయత్నంలో గైడ్ కుళ్ళు జోకులేవో వేస్తున్నాడు. మిమిక్రీ లాంటిదేదో చేశాడు. ఏదో పాటకు వళ్ళంతా వూపుతూ డ్యాన్సులాంటిది కూడా చేశాడు.
ఇంజన్ చేస్తున్న శబ్దం. లాంచీకి దారినివ్వడం కోసం కోతకు గురవుతున్న నీళ్ళలోని అలజడి. ఓదారుస్తూ విచ్చుకుంటున్న. అలలతాంగులు. దూరంగా పచ్చనికొండలు. గట్టుమీద మేటవేసిన ఇసుకలో కూరుకుపోయిన విరిగిపోయిన ఓ పడవ. ఎంత అద్భుతంగా ఉందో దృశ్యం! నేనూ కళ్యాణీ తప్ప మిగతా అందరూ గైడ్ మాటల్ని మైమరచి వినటంలో మునిగిపోయి ఉన్నారు.
అతను ప్రయాణీకుల్లోంచి ఓ జంటని పిల్చి వాళ్ళకు పెళ్ళి తంతు జరిపిస్తున్నాడు. ఆమెకు నలభైకి పైగా వయసుంటుంది. ఆమె భర్తకి బట్టనెత్తితో పాటు బానలా పొడుచుకొచ్చిన పొట్ట కూడా ఉంది. కానీ ఇద్దరూ నవదంపతుల్లా సిగ్గుపడిపోతూ అతను చెప్పిందల్లా చేస్తున్నారు. చూసేవాళ్ళు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు.
“వీళ్ళొచ్చింది గోదావరి అందాల్ని చూడటానికా లేకపోతే ఆ గైడ్ చెప్పే సొల్లుకబుర్లు వినడానికా?” అన్నాను చిరాగ్గా.
“కిందికెళ్ళి కూచుందామా?” అంది కళ్యాణి.
డెక్ మీద కూచుంటే కన్పించే అందాలు కిందికెళ్ళి కూచుంటే కన్పించవు. నేను సమాధానమివ్వకుండా నీళ్ళమీద తేలియాడుతున్న నీడల్ని గమనించడంలో మునిగిపోయాను.
లాంచీ ఓ చోట ఆగింది. గండిపోచమ్మ ఆలయం చూడాలనేవాళ్ళకోసం ఆపారట. అందరూ దిగుతున్నారు. ఇరవై నిమిషాల తర్వాత మళ్ళా లాంచి కదిలింది. ఈసారి గైడ్ పిల్లలచేత సినిమా పాటలకు డ్యా న్సులేయిస్తున్నాడు. పెద్దవాళ్ళు సెల్ఫోన్లలో ఆ అద్భుత నృత్యాల్ని బంధించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.
“మన పిల్లలు కూడా వచ్చి ఉంటే బావుండేదండీ” అంది కళ్యాణి.
“‘రాజమండ్రి టూర్ ఏమిటి నాన్నా! మా ఫ్రెండ్స్ దగ్గర అవమానంగా ఉండదా? వాళ్ళందరూ హాలిడేస్ లో గోవా, వూటీ, కొడైకెనాల్లాంటి ప్రదేశాలకెళ్తున్నారు. మేం రాము’ అన్నారుగా మన వంశోద్ధారకులిద్దరూ” అంటూ నవ్వాను.
పోనీ వాళ్ళడిగినట్టు స్నేహితుల్తో గోవా ట్రిప్కన్నా పంపించాల్సింది”
“ఏముంది గోవాలో? సముద్రమేగా. సముద్రమే చూడాలనుకుంటే మనకు దగ్గర్లో ఉన్న చీరాలకో బాపట్లకో వెళ్ళొచ్చుగా. ఏం తేడా ఉండదు. గోవా బీచ్లో కన్పించే తెల్లతోళ్ళు తప్ప!”
“మీరు మరీనూ! గోవా బీచ్ తో చీరాల బీచికి పోలికా? ఫైవ్ స్టార్ హోటల్లో షడ్రసోపేతమైన భోజనం చేయడానికీ, రోడ్డు పక్కనున్న పాకహోటల్లో రెండు ఇడ్లీలు తినడానికి ఉన్నంత తేడా ఉంది”
“స్టార్ హోటళ్ళలో ఆర్భాటాలు తప్ప, మనుషులు చూపించుకునే ధన దర్పాలు తప్ప ఆప్యాయతలు ఎక్కడుంటాయి? పాక హోటల్లో ప్రేమలుంటాయి. పరిచయాలుంటాయి. జీవితం ఉంటుంది. అవన్నీ తెలియాలనేగా ఇద్దర్నీ మా పల్లెటూరికి వాళ్ళ తాతగారి దగ్గరకు పంపించాను”
“మీరు మరీ మొండి” అంది ముద్దుగా కసురుకుంటూ.
“ఆ మొండితనం వల్లనే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్నది సాధించాను. ఎంతమంది వెన్నుపోట్లు పొడిచినా నిభాయించుకుని నా లక్ష్యాన్ని చేరుకున్నాను.”
“పోన్లెండి. మీరు సంతోషంగా ఉన్నారుగా. మాక్కావల్సింది కూడా అదే. పెళ్ళయినప్పటినుంచి అనే వాళ్ళుగా. గోదావరి నదిలో లాంచిలో ప్రయాణం చేయాలని. ఇన్నాల్టికి మీ కోరిక తీరినందుకు ఆనందంగా లేదూ?”
లాంచి ముందుకెళ్తుంటే నీళ్ళలో అందమైన రంగవల్లులు రచిస్తున్న అలల్ని చూస్తూ “అవును. చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న కోరిక తీర్చుకోడానికి పదిహేనేళ్ళు పట్టింది” అన్నాను.
“అదిగో, అక్కడ కన్పించే చోటే పోలవరం ప్రాజెక్ట్ కట్టబోతున్నారు” అంటున్నాడు గైడ్. అందరూ తలలు తిప్పి అటు వైపు చూస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ పేరు వినగానే నాకు వసంత్ గుర్తొచ్చాడు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల కొన్నివేల హెక్టార్ల పంట పొలాలకు నీరందుతుంది కాబట్టి దాని నిర్మాణాన్ని అడ్డుకోవటం మంచిదికాదని ఓ సారి వసంత్ నాతో వాదించాడు. ముంపుకు గురయ్యే పల్లెలనుంచి నిర్వాసితులయ్యే అభాగ్యుల గురించి నేను వాదించాను.
వసంత్ గుర్తుకు రాగానే రక్తంలో చేదు విషమేదో ప్రవహిస్తున్నట్టు వేదనకు లోనయ్యాను. వాడు నాకు చేసిన ద్రోహం తల్చుకోగానే వళ్ళంతా చలిజ్వరం వచ్చినట్టు కోపంతో వణికిపోయింది.
“ఏమిటీ సడన్గా అలా అయిపోతున్నారు? ఏమైంది?” కంగారు పడ్తూ అడిగింది.
“వసంత్ గుర్తొచ్చాడు” పళ్ళు కొరుకుతూ అన్నాను.
“ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ నీచుడ్ని గుర్తుచేసుకుని ఎందుకు మనసు పాడుచేసుకుంటారు? చుట్టూ చూడండి. ఎంత బావుందో కదా”
“మనసు వికలమైపోయింది కళ్యాణీ. పాలలో పడిన విషపుచుక్కలా వాడి జ్ఞాపకం నా మూడ్ని పాడుచేసింది”
“ఇక్కడొద్దు. కిందికెళ్ళి కూచుందాం పదండి” అంది కళ్యాణి.
ఇద్దరం కిందికెళ్ళి కూచున్నాం. కింద ఓ ముసలి జంట మౌనంగా నీళ్ళ వైపు చూస్తూ కూచుని ఉ న్నారు. మేము వాళ్ళకు ఎడంగా వెళ్ళి కూచున్నాం.
“మీరు అనుకున్నవన్నీ సాధించారు. ఇంకేం కావాలి చెప్పండి?” అంది కళ్యాణి.
“ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. అది తీరితేగాని మనశ్శాంతి ఉండదు”
“ఇంకా ఏం కోరిక మిగిలుందండీ?”
“వసంత్ మీద పగ తీర్చుకోవడం”
వాడి వల్ల కుటుంబం మొత్తం అనుభవించిన కష్టాలు గుర్తొచ్చాయేమో కళ్యాణి మొహం కూడా ఉదాసీనంగా మారిపోయింది.
నీళ్ళ మీద కదుల్తున్న అలల్ని చూస్తుంటే వసంత్ నా జీవితంలోకి తోకచుక్కలా జారిపడ్డ ఆ రోజు గుర్తుకొస్తోంది. ఆదివారం సాయంత్రం. ట్యాంక్ బండ్ మీద సందర్శకుల కోసం వేసిఉన్న సగం విరిగిన ఓ బెంచీలో కూచుని హుస్సేన్ సాగర్ నీళ్ళలో చేపల్లా కదుల్తున్న అలల అందాల్ని ఆస్వాదిస్తున్నా. అప్పటికింకా పెళ్ళి కాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో పడకుండా జీడిమెట్లలో యంత్రాల కవసరమయ్యే విడిభాగాలు తయారుచేసే పరిశ్రమ నెలకొల్పాను. రెండేళ్ళలో ఖర్చులుపోను నెలకెంతో కొం త మిగుల్చుకునే స్థాయికి చేరుకున్నాను. వ్యాపారాన్ని ఇంకా ఎలా పెంచాలా అనే ఆలోచనే నిరంతరం!
అప్పడే కొద్దిదూరంలో రెయిలింగ్ని పట్టుకుని పరధ్యానంగా నిలబడిఉన్న వసంత్ కన్పించాడు. మొదట గుర్తుపట్టలేదు. గడ్డం మాసిపోయిఉంది. బట్టలు నలిగిపోయిఉన్నాయి. భుజాన ఖాదీ సంచి ఒకటి తగిలించుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పిచ్చోడిలా కన్పిస్తున్నాడు. వసంతేనా కాదా అనే అనుమాన౦తో పరిశీలనగా చూశాను. కుడి చెంపమీద బొట్టు పెట్టినట్టు నల్లటి మచ్చ. చిన్నప్పుడు జామకాయలు కోయడానికి చెట్టెక్కి జారి కిందపడినప్పుడు చెంపలోకి గుచ్చుకుపోయిన మేకువల్ల ఏర్పడిన గాయం మచ్చ. వసంతే.
పెద్దగా “వసంత్” అని పిలిచాను. వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. వెంటనే అతని మొహంలో వింత కాంతి. “నువ్వా రామూ? ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి? ఎలా ఉన్నావు?” అంటూ దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని సంతోషంతో పొంగిపోయాడు.
వసంత్ నాకు ఇంటర్మీడియెట్లో క్లాస్మేట్. ఇద్దరం ఒకే బెంచి మీద కూచునేవాళ్ళం. తరచూ అతను మా యింటికి రావడం, నేను వాళ్ళింటికి వెళ్ళడం జరిగేది. చదువులో అంత చురుకైన వాడు కాదు. అతను ఇంటర్ ఫెయిల్ కావడంతో మా మధ్య దూరం ఏర్పడింది. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వూరికెళ్ళినపుడల్లా వచ్చి కలిసి వెళ్ళేవాడు. కొన్నాళ్ళు ఏదో రిక్రియేషన్ క్లబ్లో పని చేస్తున్నానని చెప్పేవాడు. ఆ తర్వాత రావడం తగ్గింది. నేనూ చదువు ధ్యాసలోపడి అతని గురించి పట్టించుకోవడం మానేశాను. ఎన్నో యేళ్ళ తర్వాత ఇప్పుడే చూడటం.
“ఏం పనిమీద వచ్చావు?”” నా పక్కనే కూచోబెట్టుకుని అడిగాను.
“పని కోసం వచ్చాను” అన్నాడు.
“పేరంటాల పల్లి వచ్చిందండీ. ఇక్కడ బ్యాంబూ చికెన్ చాలా రుచిగా ఉంటుందట. తిందామా” అంది కళ్యాణి.
ఆలోచనల్లోంచి బైటపడి చూశాను. లాంచి ఆగిఉంది. నల్లగా కాలిపోయిఉన్న వెదురు బొంగుల్ని పట్టుకుని ఒక పల్లెవాడు లాంచీలోకి ఎక్కాడు. కళ్యాణి ఒకటి కొనుక్కుని వాడిచ్చిన ఆకులోకి వెదురుబొంగు లోని చికెన్ వొంపి ఓ ముక్కనోట్లో పెట్టుకుని “చాలా బావుందండి. తింటారా?” అంది. వద్దని చెప్పాను. లాంచీ బయల్దేరింది. నేను మళ్ళా వసంత్ జ్ఞాపకాల్లోకి జారుకున్నాను.
రిక్రియేషన్ క్లబ్ మూతబడిందట. వూళ్లో కూలిపనులు, కోత పనులు తప్ప తను చేసే పనులేమీ దొరక్క వారం క్రితం హైద్రాబాద్ వచ్చి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడట.
“తిరిగి తిరిగి అలసిపోయాను రామూ. ఇంత పెద్ద పట్నంలో ఎక్కడా పని దొరకలేదు. వూళ్లో కూలి పని చేయడానికి నామోషీ పడ్డాను కానీ ఇక్కడ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను” అన్నాడు దీనంగా మొహం పెట్టి.
“ఎక్కడో ఎందుకు? నా దగ్గరే పని చేద్దువు గాని” అంటూ నేను పెట్టిన ఫ్యాక్టరీ గురించి చెప్పాను.
“బాగా ఆకలేస్తోంది. తిని రెండు రోజులైంది” అంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అతన్ని బండి మీద కూచోబెట్టుకుని హోటల్కి పిల్చుకెళ్ళాను. అప్పుడు నాకు తెలియదు. నాతో పాటు అరిష్టాన్ని వెంటపెట్టుకుని వెళ్తున్నానని.
ఫ్యాక్టరీలో పన్లో చేరాడు. నేను అద్దెకున్న ఫ్లాట్లో నాతోపాటు ఉండేవాడు. “హోటల్ భోజనం ఎందుకు రామూ. నేను బాగా వండి పెడ్తాను” అంటూ వంట చేయడం మొదలెట్టాడు. నా పనులన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. వసంత్ నా దగ్గరకొచ్చాక నాకు శ్రమ తగ్గింది. పనిమనిషి బట్టలుతికి పోయాక వాటిని ఇ స్త్రీ చేసి పెట్టేవాడు. స్నానానికి ముందు గీజర్ వేసి నీళ్ళు తోడిపెట్టడం కాణ్ణించి నాబూట్లు పాలిష్ చేయడ౦ వరకు సమస్తం చేసేవాడు. వద్దంటే వినేవాడు కాదు.
“నీవల్లనేగా రామూ మూడు పూటలా తింటున్నాను. మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాను. ఎంత సేవ చేసినా నీ రుణం తీర్చుకోలేను” అనేవాడు.
అతను నమ్మకంగా పని చేయడం చూసి సరుకు సప్లయ్ చేయడం, డబ్బులు వసూలు చేయడం లాంటి పనులు అప్పగించాను. నా కస్టమర్లందరితో తల్లో నాలుకలా మెలిగేవాడు. వ్యాపారం బాగా పుంజుకుంది. పెళ్ళి చేసుకున్నాను. వసంత్ ఫ్యాక్టరీకి దగ్గర్లో రూం తీసుకున్నాడు.
ఓ రోజు ఫ్యాక్టరీలో పన్చేసే సందీప్‌కి, వసంత్‌కి మధ్య ఏదో గొడవైంది. ఆ రోజు సందీప్ నా దగ్గర కొచ్చి “సార్, వసంత్‌ని నమ్మితే మీరు చాలా నష్టపోతారు. అతనీ మధ్య బాగా తాగుతున్నాడు. క్లబ్బులకెళ్ళి పేకాటకూడా ఆడుతున్నాడు. అతన్ని పన్లోంచి ఎంత త్వరగా తీసేస్తే అంతమంచిది” అన్నాడు. నేను నమ్మ లేదు. గొడవ జరిగిన కారణంగా వసంత్ మీద లేనిపోనివి కల్పించి చెప్తున్నాడనుకున్నా.
మరో ఆర్నెల్లు జరిగిపోయాయి. ఓ రోజు హఠాత్తుగా వసంత్ మాయమయ్యాడు. అర్జెంట్ పనిమీద వూరెళ్ళి ఉంటాడని అనుకున్నా. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వస్తోంది. మూడు రోజులైనా అతని సమాచారం తెలియకపోతే కంగారు పడి మా వూర్లోని మిత్రులకు ఫోన్ చేశాను. అతను వూరికి రాలేదని చెప్పారు.
సందీప్ మీద అనుమానం కూడా వచ్చింది. పిలిచి తీవ్రమైన స్వరంతో విచారించాను. “సార్, డబ్బులన్నీ తీసుకుని ఉడాయించి ఉంటాడు” అన్నాడు.
“అతనలాంటివాడు కాదు. నువ్వే ఏదో చేసి ఉంటావు. పోలీసుల్ని పిలవమంటావా” అన్నాను. తనకే మీ తెలియదని నెత్తీ నోరు బాదుకున్నాడు. అదే సమయంలో బ్యాంక్నుంచి ఫోనొచ్చింది. నెల మొదటివార ౦లో కట్టాల్సిన కిస్తీ ఎప్పుడు కడ్తారు? అని అడిగారు. కట్టమని పది రోజుల క్రితమే వసంత్‌కి డబ్బులిచ్చిన విషయం గుర్తొచింది. అప్పుడు మొదటిసారి వసంత్ మీద అనుమానమొచ్చింది.
కస్టమర్లనుంచి వత్తిడిరావటం మొదలైంది. “సరుకు పంపిస్తానని అడ్వాన్స్ తీసుకెళ్ళారుగా. ఎప్పుడు పంపుతారు?” అని అడుగుతున్నారు. ఆ డబ్బుల్తోపాటు నా పేరు చెప్పి తెల్సినవాళ్ళ దగ్గర అప్పులు కూడా తీసుకుని ఉడాయించాడు. మొత్తం ఇరవై లక్షలు. నేను మోసపోయాను. జాలిపడి ఆదరిస్తే చావుదెబ్బ కొట్టి పోయాడు.
వ్యాపారంలో మెల్లగా పుంజుకుంటున్న నా నెత్తిమీద పిడుగు పడినట్లయింది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను. ఎన్నిరోజులైనా అతని ఆచూకీ తెలియలేదు. సరుకు పంపలేకపోతే డబ్బులు తిరిగివ్వమని వత్తిడిచేయసాగారు. ఫోను రింగయితే చాలు ఏ అప్పులోడు చేస్తున్నాడోనని భయంతో బిగుసుకుపోయేవాణ్ణి. రో జూ ప్యాక్టరీ దగ్గరో ఇంటి దగ్గరో ఎవరో ఒకరు వచ్చి గొడవపడేవాళ్ళు. బెదిరింపులు కూడా మొదలైనాయి.
నా భార్య నగల్ని అమ్మి కొంత అప్పు తీర్చాను. మిగతా అప్పు తీర్చడానికి సమయం కావాలని కాళ్ళావేళ్ళా పడి వేడుకున్నాను. వడ్డీ చెల్లించే ఒప్పందం మీద నా చేత ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఎన్ని అవమానాలు సహించానో. ఎంతటి మానసిక వేదనకు లోనయ్యానో. కంటి మీద నిద్ర ఉండేది కాదు. అశాంతిగా అలజడిగా బతికాను. ఆ అప్పు తీర్చడానికి, పోగొట్టుకున్న గుడ్ విల్ని మళ్ళా తిరిగి సంపాయించుకోడానికి దాదాపు ఆరేళ్ళు పట్టింది.
అప్పులు తీరిపోయాక గత పదేళ్ళనుంచి వ్యాపారంలో లాభాలు కళ్ళచూడసాగాను. స్వంత ఇల్లు కట్టుకున్నాను. కారు కొన్నాను. పిల్లలిద్దర్నీ మంచి స్కూల్లో కాలేజీల్లో చేర్పించాను. పెద్దవాడు ఇంటర్, రెండో వాడు పదో తరగతి పరీక్షలు రాశారు. జీవితం ప్రశాంతంగా సాగే నదిలా ఉందిప్పుడు.
లాంచీలో తిరుగు ప్రయాణం మొదలైంది. “ఇంత అందమైన ప్రకృతిని ఆస్వాదించకుండా ఆ దుష్టుడి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారెండుకు? ” అంటూ కళ్యాణి మందలించడంతో మళ్ళా కనులకింపుగా కన్పిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ, వీనుల విందుగా విన్పిస్తున్న జలగీతాన్ని వింటూ మైమరచిపోయాను. కళ్యాణి రెయిలింగ్ పట్టుకుని కింద కూచుని కాళ్ళని నీళ్ళల్లో వేలాడేసి చిన్నపిల్లలా ఆడుకుంటోంది. సూర్యుడు అలసిపోయి విశ్రమించడానికి సమాయత్తమౌతూ రంగురంగుల తెరలచాటుకి తప్పుకుంటున్నాడు. మెల్లగా చీకట్లు అలల్లా కదులుతూ అల్లుకోసాగాయి. లాంచీ తీరాన్ని చేరుకుంది. హోటల్కి తిరిగెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది.
“భోజనం తెప్పించుకుందామా లేక రెస్టారెంట్కెళ్ళి తిందామా?” అని అడిగాను.
“ఇక్కడి భోజనం నచ్చటం లేదండి. ఆంధ్రాలో హోటళ్ళు పెట్టుకుని చక్కటి ఆంధ్రా భోజనం వడ్డించకుండా వీళ్ళకిదేం రోగమండీ. పప్పూ కూర సాంబారు పచ్చడి పెరుగు. ఇలా అన్నీ ఉండే థాలీదొరక దు. వైట్ రైస్ అట, దాల్ తడకా అట, కూరలు వేరుగా కొనాలట. నాకొద్దు. బైటికెళ్లాం పదండి. ఏదైనా మంచి హోటల్ వెతుక్కుని తినొద్దాం,” అంది కళ్యాణి.
గూగుల్లో వెతికాను. ఓ హోటల్ పేరు నన్నాకర్షించింది. “అరిటాకు”.
“దానికే వెళ్తామండి. తప్పకుండా అరిటాకుల్లో భోజనం వడ్డిస్తారనుకుంటా. చాలా రోజులైంది అరిటాకులో భోజనంచేసి,” కళ్యాణి ఉత్సాహపడింది.
హోటల్ బయట బోర్డు మీద “అరిటాకు భోజన హోటల్” అని రాసి ఉంది. దానికిరువైపులా పచ్చటి అరిటాకులు చిత్రించబడి ఉన్నాయి. లోపలికెళ్ళాం. సమయం తొమ్మిది కావడంతో చాలా టేబుళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఓ టేబుల్ దగ్గర కూచున్నాం.
ఒక సర్వర్ వచ్చి మా ముందు అరిటాకులు పరిచాడు. ఇంకొకతను రెండు రకాల కూరలు, ఒక వేపుడు కూర, రెండు రకాల పచ్చళ్ళు, టమేటా పప్పు వడ్డించాడు. చిన్నగిన్నెలో నెయ్యి కూడా పెట్టాడు. మొదట రెండు పూరీలు వేశారు. వేడివేడిగా పూరేకుల్లా మృదువుగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా.
మరో రెండు పూరీలు వడ్డించబోతే “చాలు. అన్నం కావాలి” అంది కళ్యాణి. పక్క వరుసలో అన్నం గిన్నెని చేతిలో పట్టుకుని వడ్డిస్తున్నతన్ని కేకేసి “ఇక్కడ అన్నం” అంటూ అరిచాడతను. “వస్తున్నా” అంటూ మా దగ్గరకొచ్చిన సర్వర్ అన్నం వడ్డించబోయి మా ఇద్దరి మొహాల వైపు మార్చిమార్చి చూసి రాతిబొమ్మలా నిలబడిపోయాడు.
“వసంత్” అంటూ గొణిగింది కళ్యాణి.
ఔను వసంతే. నేను ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న వసంత్ నాకళ్ళముందు. వీడి వల్ల ఎన్ని క ష్టాలు పడ్డానో. ఎన్ని అవమానాల్ని సహించానో. ఒకానొక సమయంలో వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. భార్యాపిల్లల్ని అనాథలు చేయలేక లేని ఓపిక తెచ్చుకుని పరిస్థితులతో పోరాడాను.
“ఇంకా చూస్తారేమిటండీ? పోలీసులకు ఫోన్ చేయండి!” క్రోధంతో ఎర్రబడిన కళ్ళతో అంది కళ్యాణి.
మమ్మల్ని చూసిన షాక్ నుంచి తేరుకున్న వసంత్ చేతిలోని అన్నం గిన్నెని టేబుల్ మీద పెట్టి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. “నేను తప్పు చేశాను. క్షమించరాని తప్పే. మీరు నాకు అన్నం పెట్టి ఆదరించారు. నేను నమ్మక ద్రోహం చేశాను. దానివల్ల నేను బాగుపడిందేమీ లేదు. డబ్బులన్నీ నా వ్యసనాలకే తగలేశాను. నా తప్పు తెల్సుకుని పశ్చాత్తాపపడ్డాను. ఈ వూరొచ్చి హోటల్లో పనికి కుదురుకున్నాను. పెళ్ళి చేసుకున్నాను. మాకో ఆడపిల్ల. ప్రశాంతంగా బతుకుతున్నా. ఇక్కడ గొడవ చేసి మా బతుకుల్లో నిప్పులు పోయకండి. మా నోటికాడి కూడు తీయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను” అన్నాడు.
కౌంటర్లో కూచున్న వ్యక్తి “అన్నం వడ్డించకుండా ఏమిట్రా కస్టమర్తో మాటలు? తెల్సినవాళ్ళా?” అని పెద్దగా అరుస్తున్నట్టే అడిగాడు.
“ఔను సామీ. ఈ వూరికి రాకముందు సార్ దగ్గరే పని చేసేవాడ్ని. నన్ను చాలా దయగా చూసుకున్న మహానుభావులు,” అతని కళ్ళు కన్నీళ్ళతో తడుస్తున్నాయి.
నేను ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలీక అతని వైపు దిగ్భ్రమగా చూస్తూ ఉండిపోయాను. వసంత్ మా ఇద్దరి అరిటాకుల్లో అన్నం వడ్డించాడు. అన్నం పొగలు కక్కుతోంది. నాలో ఇన్నాళ్ళుగా దాచుకు న్న కోపం కూడా లావాలా పొంగుతోంది. “మీ కోపం చల్లారకపోతే మీతో పాటు నేను కూడా బైటికొస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి,” అనేసి వేగంగా మరో టేబుల్ దగ్గరకెళ్ళి అన్నం వడ్డించడంలో నిమగ్నమైపోయాడు.
“వాడి చొక్కా పట్టుకుని నాలుగు తగిలిస్తేగానీ వాడికి బుద్ధి రాదు. ఇన్నాళ్ళ మీకసి తీర్చకునే అవకాశం దొరికింది. వాణ్ణి వదలకండి” అంది కళ్యాణి.
అన్నంలో కూర కలుపుకుని మెల్లగా తినసాగాను. నా మొహంలోకి ఆశ్చర్యంగా చూసి కళ్యాణి కూడా తినసాగింది. ఇద్దరికీ తినాలనే ఇచ్ఛ ఎప్పుడో చచ్చిపోయింది. వడ్డించిన అన్నంలో సగానికి పైగా అలానే ఉంది. లేచి సింక్ దగ్గరకెళ్ళి చేతులు కడుక్కున్నాం.
బిల్ రాగానే టిప్తో కలిపి డబ్బులు ఇచ్చేసి బైటికి నడిచాం. హోటల్కి దూరంగా రోడ్డుపక్కన క్రీనీడలో నిలబడి కన్పించాడు వసంత్. అతని మొహం చూడగానే అసహ్యంతో తల పక్కకు తిప్పుకుంది కళ్యాణి. వసంత్ ఏమీ మాట్లాడలేదు. రెండు చేతులు జోడించి “మీరే శిక్ష వేసినా అనుభవించడానికి తయారుగా ఉన్నాను” అనేలా తల తెగ్గొట్టబోతున్న తలారి ముందు నిలబడినట్టు తల దించుకుని నిలబడ్డాడు.
నేను చిన్నగా నవ్వాను. అతని భుజాన్ని ప్రేమగా తట్టాను. తలయెత్తి నా మొహంలోకి చూశాడు. జేబులోంచి రెండువేల నోటు తీసి అతని చేతిలో పెట్టి “మీ అమ్మాయికి మంచి డ్రెస్ కొనివ్వు” అన్నాను. అ తను నానుంచి అటువంటి ప్రవర్తనని వూహించలేదేమో కొయ్యబారిపోయినట్టు నిలబడిపోయాడు.
మేము హోటల్ చేరుకునేవరకు ఏమీ మాట్లాడుకోలేదు. రూంలోకి వెళ్ళడం ఆలస్యం “మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదు” అంది కళ్యాణి. ఆమె కోపం చల్లారలేదని తెలుస్తూనే ఉంది. వసంత్‌ని చూడగానే తన నగలన్నీ అమ్ముకోవాల్సిన దుస్థితి పట్టడం, అప్పులవాళ్ళు చేసిన అవమానాలూ, పిల్లలకేదో పెట్టి ఇద్దర౦ పస్తులు పడుకోవడం, అన్నీ గుర్తొచ్చి ఉంటాయి.
“వాణ్ణి శిక్షించకుండా అలా వదిలేశారేమిటండీ. నాలుగు తన్ని పోలీసులకి పట్టిస్తే జైల్లో పెట్టేవారుగా” అంది.
“శిక్షంచలేదని ఎవరన్నారు?” అన్నాను శాంతంగా.
ఆమె కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఉండిపోయింది.
Leave a Reply