తెల్సా కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక

చారు-అన్నం

కడయింటి కృష్ణమూర్తి
2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన కథ

© Telugu Society of America

ఉ. కూరలు మూడు నిక్కముగ గూర్చును భోజన శాల నిత్యమున్
చారును రెండు పచ్చడులు చక్కగ వండిన తెల్లయన్నమున్
పేరుకు మజ్జిగన్నమెర పెర్గును మీగడ సాటిరావు సాం
బారును యందునన్ మునగ బద్దలు యెంతని జెప్పనారుచుల్.


నాలుగు పాదాల పద్యం వ్రాయడం అభ్యాసం చేయాలే గానీ పదాలు మజ్జిగన్నంలా జాలువారుతాయి. పెరుగన్నమంత రుచులు దేరుతాయి. రసం సరే సరి అందులోనూ ఇందులోనూ సమానమే. కోమలంగానూ విలాసంగానూ ఉంటుంది.

అయితే, “ఉద్యోగం వచ్చింది గదా ఇక పెళ్ళి చేసుకోరా! ఎంతకాలం హోటలు తిండి తింటావు. అలా అయితే ఆరోగ్యం ఏమి కాను?” ఇలాంటి ప్రశ్నలు ఎందుకొస్తున్నాయి. చూద్దాం.

మనం ‘నిజం’ గా ఓ కథ చెప్పుకుందాం.

ఎవరో తప్ప రోజూ మూడు కూరలు, రెండు పచ్చళ్లు, మీగడ పెరుగు, సాంబారు, రసం, పప్పు, ఏదో ఒక పిండి వంట, అప్పడాలు, వడియాలు, చివరగా పండ్లు – అలా భోజనం చేసి చివరాఖరుగా తాంబూలం సేవించేవారు తగ్గిపోయారు.

పప్పు, కూర, పులుసు, పచ్చడి, మజ్జిగ – ఇంతటితో భోజనం ముగించే వారే ఎక్కువయ్యారు. పప్పు, కూరలలో ఒకదానికి సెలవిచ్చిన వారు మరీ ఎక్కువయ్యారు. ఇక భోజనం తర్వాత పండ్లూ, ఫలాలు చాలా మంది మరిచే పోయారు. చివరగా విడియము. దాని కేనాడో విడాకులిచ్చేశారు.

కంది పచ్చడి, పెరుగు పచ్చడి, మజ్జిగ పులుసు, మెంతి మజ్జిగ ఇవి ఎవరికయినా గుర్తున్నాయా? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాం? అయినా సరే ఇంటి భోజనమే సౌఖ్యం. ఈ వాక్యానికి తిరుగు లేదు. ఇక కథలో కెళితే–

సుందరయ్య మంచి పాకశాస్త్ర ప్రవీణుడు. పేద్ద భోజనశాలలో పెద్ద వంటగాడు. అతని చేతి క్రింద మరో నలుగురు చిన్న వంటవాళ్లు. ఆ భోజన శాలలో రెండు పూటలా అధమం వంద మంది సుష్టుగా భోజనం చేస్తారు. సెలవు రోజులలో మరో పది శాతం ఎక్కువ.

ఆ పెద్ద వంటగాడు రోజూ పైన చెప్పిన అన్ని ఆధరువులూ దగ్గరుండి చేయిస్తాడు. పండుగలకూ పబ్బాలకీ విశేష పిండి వంటలూ పాయసమూ తప్పనిసరి. ఉప్పు సరిపోయిందా అని నోట్లో వేసుకుని రుచి చూసే పద్ధతికి సుందరయ్య వ్యతిరేకం.

అయితే, రుచులు అమోఘం. ఆ పెద్దమనిషి మాత్రం వంట అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి భార్య చేతి అన్నం లొట్టలేసుకుంటూ తింటాడు. అలాగే అతని చేతిక్రింది వాళ్లు కూడా.

అక్కడ వడ్డనకు కూడా సమర్థులైన వాళ్లు ఓ ఇరవై మంది వరకూ ఉంటారు. వారిలో కూడా ఏ ఇద్దరు ముగ్గురో తప్ప మిగిలినవాళ్లు ఇంటికే వెళ్ళి తింటారు.

కిం కారణం?

వారి భార్యలు తిడతారట. “మేముండగా మీకు బయట తిండి తినే ఖర్మ ఏమిటి?” అని. ఈ వాక్యం విచిత్రం.

ఈ ‘మేముండగా’ పదం ఇంకా విచిత్రం. ఈ పదం గొప్ప భరోసా. ధైర్యం. అభిమానం. అన్నింటికీ మించి ఓ ఆసరా. ఇది స్త్రీలు మాత్రమే ఇవ్వగలరు.


ఓ యాభై ఏళ్లు వెనక్కు వెళదాం. ఒకరోజు అరుణోదయ రేఖలు అప్పుడే విడివడితున్నాయి. రకరకాల పక్షుల రకరకాల కిలకిలారావాలు వీనుల విందు చేస్తున్నాయి.

ఓ ఇల్లాలు పెరట్లో బావి దగ్గర చన్నీళ్ల స్నానం చేసి, ఉదయిస్తున్న బాలభానునికి రెండు చేతులూ జోడీంచి “శ్రీ సూర్య నారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ” అంటూ ఆధిత్య హృదయం పూర్తి చేసి, అదయిన వెంటనే సుప్రభాతం, బాలరామాయణం, తర్వాత మరోటి, తర్వాత లలితా సహస్రనామస్తోత్రం, లింగాష్టకం ఇలా విసుగూ విరామం లేకుండా ఏ దేవతనూ దైవాన్నీ వదిలి పెట్టకుండా పాడేస్తోంది.

విన సొంపుగా ఉంది సుమా!

నిద్ర లేచిన వారికి లేచినట్లు పిల్లలకు త్రాగడానికి పాలూ పెద్దలకేవో పానీయాలూ ఇలా ఎవరికి కావలసినవి వారికి సమకూరుస్తూనే వంట కూడా మొదలెట్టింది. ఏపని చేస్తున్నా సూర్యుని కిరణాలలో వేడిమీ, వెలుతురూ కలిసినట్లు భక్తి భావమూ, కర్తవ్యమూ కలగలిసి వరదలై పారుతున్నాయి. చెప్పాలంటే కర్తవ్యము కూడా భక్తే గదా!

అందుకే ఆ దేవుళ్లు కూడా తర్వాత నేను తర్వాత నేను అంటూ వరుసలో నిలబడుతున్నారు. తమ వంతు కోసం చేచి యున్నారు. ఈ లోగా వంట పూర్తి అయిపోయింది. దేవతల వరుస కూడా చివర కొచ్చింది.

మధ్య మధ్యలో , “ఆయనకు ఉప్పు లేకుండా కొంచెం తీసి పెట్టాలి. చిన్న వెధవకు పప్పు కాస్త విడిగా తీసి పెట్టాలి. కోడలికి చారులో ఇంగువ కాస్త ఎక్కువ ఉండాలి. ఈ కాకర కాయ చిన్నపిల్లలు తినరు కాబట్టి వారికీ అరటి కాయ వేపుడు. మనవరాలు పాయసం అడిగింది” ఇలా అంటూ అనుకుంటూ, తనపని కొనసాగించేస్తోంది. ఆ ఇల్లాలు ఇలా మధ్యలో విరామం ఇచ్చినప్పుడల్లా ఆయా దేవతలు ఆమెకు వంటలో సాయం చేస్తున్నారు. లేకపోతే స్తోత్రం ఆపేస్తుందేమోనన్న భయం. అశ్వినీ దేవతలు వారి వంతు వచ్చినప్పుడు ఆ ఆహారం రుచిగా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటున్నారు. అగ్ని దేవుడు ఆధరువులు మరీ మాడి పోకుండా తగినంతగానే ప్రజ్వలించి పక్వం జేస్తున్నాడు. సూర్యభగవానుడు ఆ పదార్థాలమీద సూక్ష్మ జీవులు చేరకుండా కొంత వేడిని అట్టి పెడుతున్నాడు. బియ్యంతో చేసిన పాల పాయసం వైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాడు. ఆ పాయసం త్రాగినవారికి దంత పుష్టి అనుగ్రహిస్తున్నాడు. అలా అందరు దేవతలూ వారి వంతు వచ్చినప్పుడల్లా ఆ ఆహారం శుచిగానూ రుచిగానూ ఆరోగ్య వంతంగానూ ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఆ ఇల్లాలు తన పని తాను చేసుకుంటూ ఉంటూ తమను కీర్తిస్తూ ఉంటే వారు కూడా తమ వంతుగా ఆమెకు సాయం చేశారు. దేవతలొస్తే ఊరికే వెళ్ళరు, అడిగినా అడక్కున్నా.అది వారి నియమం. ఈ ఇల్లాలి విషయంలో అడక్కపోయినా ఏకంగా వంటే చేశారు. నిజం చెప్పాలంటే ఆమెకు మాత్రం తన వాళ్ల ఆరోగ్యమే వాళ్ల తృప్తే ముఖ్యం. దేవుళ్లయినా తర్వాతనే.

అయినా పరవాలేదు. దేవుళ్లు ఏమాత్రం కొరత పడడం లేదు. వారి కొరత వేరేది. అదేందో ముందు ముందు చూస్తాం.

వంట పూర్తవగానే అగ్నికి కాస్త విరామమిచ్చి ఆమె అలా కాస్త నడుం వాల్చగానే దేవతలంతా తమ తమ దేవాలయాలకు నిత్య పూజలందుకోవడానికి బయలు దేరారు. ప్రతిరోజూ వారికి ఇలా ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రతి ఇల్లాలి ప్రార్థనలూ స్తోత్రాలూ విని తరించడం, వారికి వంటలో సాయం చేయడం ఆ ఆహారాన్ని రుచిగానూ ఆరోగ్యవంతం గానూ ఉండేలా అనుగ్రహించి ఆ తర్వాతనే ఆలయాలకు వెళ్లడం ఆనవాయితీగా మారి పోయింది. ఈ ఆనవాయితీతో వారికొక వెసులు బాటుకూడా లభించింది. ఉదయాన్నే తమ ఆరోగ్యాల కోసమూ చదువుల కోసమూ సౌభాగ్యాల కోసమూ వేడుకునే వారి సంఖ్య బాగా తగ్గి పోయింది.

ఎందుకంటే ఆ ఇల్లాండ్ర స్తోత్రాలు వినే నెపంతో వారంతట వారే వెళ్ళి ప్రతి ఇంటిలోనూ చదువులు సక్రమంగా సాగేటట్లూ అందరికీ ఆయురారోగ్యాలు కలిగేటట్లూ, వారి సౌభాగ్యాలకు తమంత తాముగా భరోసా ఇచ్చే వస్తున్నారుగా మరి. అందుకని.

అయినా మనకోసం వచ్చి వరుసలో గంటలపాటు వేచి యుండి ఆపదమొక్కులవాడా ఆపద్బాంధవా అని అంగలారుస్తూ తలలు వంచి వేడుకుంటూ కానుకలు సమర్పించుకుంటూ వుంటే ఉండే హోదా తమంతట తామే వెళ్ళి వాళ్లడక్కపోయినా అనుగ్రహిస్తే ఉంటుందా. కానీ ఈ గృహిణుల ప్రవర్తనే వారిని కట్టి పడేస్తూ ఉంది. వారికి మరో దారి లేకుండా పోతోంది.

ఈ కొరత మాత్రం ఆ దేవుళ్లను పట్టి పీడిస్తోంది. ఏం చేయగలరు. కాల మహిమ. అలాగని ఆ పతివ్రతలను ఆ ఇల్లాండ్రను ప్రశ్నించగలరా? అమ్మో! ఇంకేమయినా ఉందా. అనసూయమ్మ గుర్తొచ్చింది వారికి. మనసులోనే లెంపలు వేసుకున్నారు.

మళ్ళీ మనం సుందరయ్య దగ్గరకు వెళదాం.

ఆ రోజు సుందరయ్య భార్యకు కాస్త జ్వరంగా ఉండి ఉదయాన్నే లేవలేక పోయింది. సుందరయ్య తానే కాఫీ పెట్టుకుని త్రాగి భార్యకు బార్లీ గంజి కాచి యిచ్చి కాస్త ఆలస్యంగా వెళ్ళాడు తన పనికి. అక్కడ పెద్దాయన అసహనంగా ఎదురు చూస్తున్నాడు. ఆరోజు ఆ భోజనశాల వార్షికోత్సవం. మామూలు వంటల తోబాటు రెండు మూడు పిండి వంటలు కూడా చెయ్యించాలని ముందు రోజే సంకల్పించారు. కానీ ప్రధాన వంటగాడే ఆలస్యంగా వచ్చాడు. ఆయన ఆలస్యానికి కారణం తెలుసుకుని “అరె, నాకు చెప్పక పోయావటయ్యా కారు పంపి ఉండేవాడిని. ఇప్పుడెలా ఉంది, అని, నీవు పని చూడు నేను కారులో మన పద్మను మీ యింటికి పంపుతాను. ఆమెకు సాయంగా ఉంటుంది. అవసరం అయితే డాక్టరు వద్దకు కూడా తీసుకుని వెళ్తుంది. ఈ రోజు విశేషం నీకు తెలుసు గదా!” అని పద్మను కారులో సుందరయ్య ఇంటికి పంపాడు. సుందరయ్య వచ్చే వరకు ఆమె సుందరయ్య భార్యకు తోడుగా ఉంది. ఆ లోగా ప్రక్కనే ఉన్న ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. అంతా బాగానే ఉంది.

భోజనశాల వారి అభిరుచుల మేరకు ఆ రోజు వంటకాలు అద్భుతంగా కుదిరాయి.

కానీ భోజనం చేసిన వారిలో ఏదో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. భోజనం చేసే వారిని పలకరించి భోజనం ఎలా ఉంది అని వాకబు చేయడం ఆ పెద్దాయనకొక అలవాటు. అలాగే ఈ రోజు కూడా పలకరిస్తున్నాడు. భోజనం రుచి గానే ఉందంటున్నారు గానీ ఏదో అసంతృప్తి కనిపిస్తూ ఉంది వారి ముఖాల్లో. తృప్తిగా త్రేన్చిన వారు కనిపించలేదాయనకు. అనుమానం వచ్చి గల్లా పెట్టె వద్ద మరొకరిని కూర్చో బెట్టి వెనుక వైపు నుంచి వంటశాలలోకి వెళ్ళి అన్ని పదార్థాలూ రుచి చూశాడు. అమోఘంగా ఉన్నాయి. మైసూరుపాకులు ఇట్టే కరిగి పోతున్నాయి. జిలేబీలయితే అడిగి మరీ తింటున్నారట. అప్పడాలు పక్వంగా వేగి కరకరలు బయటకు వినిపిస్తున్నాయి. మరి ఈ అసంతృప్తులకు కారణం ఏమయి ఉంటుంది?

సుందరయ్యను తప్పు పట్టడానికి కారణం కనిపించడం లేదు. వడ్డన వాళ్ళు కూడా హుషారుగా ఉన్నారు. వారికి ఈ రోజు అదనంగా జీతం గాక ఐదేసి వందలు బహుమానం గా ఇస్తున్నారు. పైగా ఈ నెలలోనే సంవత్సరపు పెరుగుదల రెండు వందలు కూడా ఉంది. ఆ పెరుగుదలలూ ఈ బహుమానాలూ మరింత ఉత్సాహం ఇచ్చాయి వాళ్లకు. సుందరయ్య ఇలాంటి బహుమతుల గురించి ఆలోచించడంలేదు. మనసులో భార్య ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నా తన పని తాను నిష్టగా పూర్తి చేశాడు.

తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేసి, చారు పెట్టి, వేడి వేడిగా అన్నం వండి, భార్యకు పథ్యం పెట్టాడు. పద్మకు కూడా ఆ పూట అక్కడే ఆ చారు అన్నమే పెట్టాడు. తానూ తిన్నాడు.

నాలుగు గంటలకు సుందరయ్య భార్య లేచి ముఖం కడుక్కుని పద్మకూ భర్తకూ టీ పెట్టి ఇచ్చింది. పద్మ తర్వాత ఇంటికి హుషారుగా వెళ్లి పోయింది. చారూ అన్నమే అయినా ఎంత బాగుంది అని తృప్తి గా మనసులోనే సుందరయ్య వంటను మెచ్చుకుంది పద్మ.

అక్కడి మృష్టాన్న భోజనానికీ ఇక్కడి చారూ అన్నానికీ ఇంత తేడానా? ఏమయి ఉంటుంది.


“వచ్చేటప్పుడు కొంచెం బజ్జీలకి పనికి వచ్చే మిరపకాయలూ సెనగ పిండీ తీసుకు రండి. సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేసుకుందాం” అని భర్తకు గోముగా కొంచెం ప్రేమగా చెప్పింది రమణి. భర్త తలూపి అలాగే అని వెళ్లాడు. ఆఫీసునుంచి బయలుదేరిన వాడల్లా వీధి చివరన “వేడి వేడి బజ్జీలు మిరపకాయ బజ్జీలు” అని నాలుగు చక్రాల బండి వాడు చేసే ప్రచారం విని అటు ఆకర్షితుడై “చుయ్ఁ” మనే శబ్దం చెవుల కత్యంత ప్రీతికరంగా తోచగా అటు వైపు అడుగులు వేశాడు. ‘రమణి మిరపకాయలూ సెనగపిండీ వగైరాలు తెమ్మని చెప్పింది. బజ్జీలు చేస్తానంది. మనం ఓ అడుగు ముందుకేసి ఏకంగా మిరపకాయ బజ్జీలే తీసుకుని వెళితే ఎంత సంతోషిస్తుంది. ఆమెకూ పని తప్పుతుంది. ఇంటికి పోగానే లాగించొచ్చు’ అనుకుని ఓ పది బజ్జీలు పొట్లం కట్టించుకుని ఓ వందో వందా యాభయ్యో వాడికిచ్చి మహా సంబరంగా ఇల్లు చేరాడు. “రోజూ ఇలాగే తీసుకెళ్లండయ్యా అమ్మగారు సంతోషిస్తారు” అన్నాడు బండి వాడు పొట్లం చేతికిస్తూ. వాడి సొమ్మేం పోయింది వాడి వ్యాపారం వాడిది.

రమణితో కలిసి అవి తింటూ పొందబోయే ఆనందాన్ని ఊహించుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. ఆమె వంటింట్లో ఉన్నట్లుంది. వెనగ్గా వెళ్లి “టట్ట..డాఁయ్ ఇదిగొ ఏం తెచ్చానో చూడు” అంటూ వేడి వేడి బజ్జీల పొట్లం ఆమె చేతిలో పెట్టాడు. తాను స్వయంగా చేద్దామనుకున్నవి భర్త కొని తెచ్చేసరికి కొంచెం నిరుత్సాహ పడినా పొట్లం అందుకుని విప్పి పళ్లెంలో సర్ది మంచి నీళ్లు తీసుకుని ఆయన దుస్తులు మార్చుకుని వచ్చేలోగా ముందుగదిలోకి వచ్చింది. ఇద్దరూ కలిసి బజ్జీలు లాగించేశారు. చాలా రుచిగా ఉన్నాయి అని కితాబిచ్చింది రమణి. ప్రక్కరోజూ ఇదే ఆనందం. ఒకరోజు పానీ పూరీ, మరో రోజు ఉర్లగడ్డ బజ్జీలు మరో రోజు ఉల్లి పాయల పకోడీలు ప్రక్కరోజు మరోటి ఇలా ఆనందాన్ని అనుభవించేస్తున్నారు. వారంలో ఓ వెయ్యి కాగితానికి రెక్కలొచ్చాయి. ఎగిరి పోయింది. ఆనందానికి రెక్కలొచ్చాయంటే ఇదేనేమో. కానీ ఈ ఆనందం ముందు అదెంత అనుకున్నాడు భర్త.

కానీ రమణికి బామ్మ చెప్పిన జాగ్రత్తలు గుర్తు వస్తున్నాయి. భర్తలకు స్వయంగా వండి పెట్టిన ఫలహారాలు వారికి ఆనందం కలిగిస్తాయనీ వారు అనురాగంతో ఆరోగ్యంగా ఉంటారనీ ఖర్చు కూడా అదుపులో ఉంటుందనీ, బామ్మ ఇంకా చెబుతూ “బయట పదార్థాలు రుచిగానే ఉంటాయి. కానీ, వాడికి వ్యాపారం ముఖ్యం. మనకు మన పిల్లలూ భర్తా తిని ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. వంట చేసేవాడిలో ఏ భావాలుంటాయో అవే ఆ పదార్థాలమీద కూడా పడుతుంది. వాడు ఏదో కారణంతో దుఃఖంతో ఉండి వంట జేస్తే అది తిన్నవాడు కూడా ముఖం మాడ్చుకుంటాడు” అవన్నీ గుర్తుకొస్తున్నాయి రమణికి.

కానీ, ఈయన అవీ ఇవీ తెచ్చి నన్ను ఆనంద పరుస్తున్నాననుకుంటున్నాడు. వ్యవహారం ఉల్టా పల్టా అయినట్లుగాఉంది.

ఓ వారం గడిచింది. “రమణీ, రెండు రోజుల నుండి కడుపులో ఏదో వికారంగా ఉంటోందోయ్. ఏమీ తిన బుద్ది కావడం లేదు. అలా వెళ్ళి కరకరా ఏమన్నా తెమ్మంటావా” అనడిగాడు. వంటింట్లో పనిలో ఉన్న రమణి ‘ఏమీ తిన బుద్ది కావడం లేదా మళ్లీ కరకరాల బండి తిండి బాగా ఒంట బట్టినట్లుందే‘ అనుకుని. “ఎందుకు లెండి మిరియాలు, శొంఠి వేసి కషాయం పెట్టి ఇస్తాను త్రాగి పడుకోండి” అని ఆ పనిలో నిమగ్నమయ్యింది. పాపం కరకరా అంటున్నాడు అని ఓ అరటి కాయ తీసుకుని సన్నగా చక్రాల్లా తరిగి నేతిలో వేగించి ఉప్పూ కాస్త మిరియాలపొడీ చల్లి ఆయన ముందు పెట్టింది. అవి కరకర మనిపిస్తూ శొంఠి కషాయం త్రాగేశాడు. కారం కారంగా నేతి ఘుమఘుమలతో అతని ముఖం విప్పారింది. కళ్లు నాలుగు సార్లు ఆర్పి నోరు తెరచి “అఁహాఁ..అఁహాఁ ” అనుకుంటూ దుప్పటి ముసుగేశాడు. రమణి వచ్చి అతని ముసుగు తీసి కాస్త బెల్లం ముక్క అతని నోటికందించింది. అది చప్పరిస్తూ మళ్ళీ ముసుగు తన్నాడు భర్త. ప్రాణం హాయిగా ఉంది. కడుపులో వికారం ‘కరకర’ అయిపోయింది.

బండి తిండి గాదు భార్య వండిన తిండి తినండి. తిందాం.

ఉ. ఇంటను నింత ప్రేమలును యెంతయొ ప్రీతిగ జేయువంటలున్
కంటికి నింపుగా మరియు గానము జేయుచు దైవకీర్తనల్
పంటవలంతిదానుగను పార్వతి రూపున నింటనున్ననున్
భోజన శాలలే మిటికి? పోదము యింటికె భోజనానికిన్.

Leave a Reply

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.